Thursday, August 25, 2016

యదువంశ నాయకుండు


యదువంశ నాయకుండు


సాహితీమిత్రులారా!

ఓగిరాల జగన్నాథకవి రచిత
సుమనోమనోభిరంజనములో
శ్రీకృష్ణుని గురించి చెప్పిన  పద్యం చూడండి.

శ్రీరుక్మిణీ మనస్సారసమిత్రుండు
      మిత్రుండు మన్మథశాత్రవునకు
నసమాన సౌందర్య హసితేక్షుధర్ముండు
       ధర్ముండు ఖలకంసధరణిపతికిఁ
జరణకంజాతదాససనత్కుమారుండు
       మారుండు దానవవారమునకుఁ
బరిధానభా పరిభావిత చంద్రుండు
       చంద్రుండువృజినాంబుజాతములకు
నిజపదసరోజభజమాన రజత ధరణి
ధరశరణ, పద్మభవ, పురందర ముఖాభి
లామరవ్రాత మానస కామిత ఫల
దాయకుండొప్పు యదువంశ నాయకుండు
                                    (సుమనోమనోభిరంజనము 1-73)


యదువంశ నాయకుడైన శ్రీకృష్ణుడు ఎలా ప్రకాశిస్తున్నాడంటే ఈ విధంగా-
రుక్మిణీదేవి మనస్సనే పద్మానికి సూర్యు(మిత్రు)నిలా
మన్మథుని శత్రువైన ఈశ్వరునికి చెలికాడు(మిత్రుని)గా
అసమాన సౌందర్యంచే మన్మథు(ఇక్షుధర్ము)నిలా
దుష్టుడైన కంసభూపాలునికి యము(ధర్ము)నిలా
పాదపద్మా(చరణ కంజాతము)లకు సనత్కుమారుడు దాసుడుగా
రాక్షససమూహా(వారమునకు)నికి  సంహారు(మారుండు)నిగా
పట్టు వస్త్రముయొక్క కాంతి(భా)చేత తిరస్కరింపబడిన(పరిభావిత)
చంద్రుడుగలవాడుగా
(చంద్రుని కాంతిని మించిన పట్టువస్త్రము కలవాడని)
పాపాలనే పద్మాలకు(అంబుజాతముకు) చంద్రునిగా
(పద్మాలకు చంద్రడు విరోధి కావున పాపాలనే పద్మాలకు విరోధి)
తన పాదపద్మాలను సేవించే శివుడు(రజత ధరణి శరణుడు),
 బ్రహ్మ(పద్మభవుడు), ఇంద్రుడు(పురందరుడు) మొదలుగాగల
దేవతాసమూహములకు మనస్సులోని కోరికలను(కామితఫల)
ఇచ్చువాడుగా ఒప్పుచున్నాడు.


ఇందులో విడిసినపదం మరలా గ్రహించడం వల్ల ముక్తపదగ్రస్త అలంకారము గాను
విభిన్న అర్థముకలిగి, ఒకే విధమైన రూపముగల వర్ణసమూహము ఆవృత్తికావడం వల్ల యమకాలంకారము అగుచున్నది.

(మిత్రుడు - సూర్యుడు, చెలికాడు,
 ధర్మము - విల్లును ధరించినవాడు - ధర్ముడు
 ధర్ముడు - (చెరకు విల్లు ధరించినవాడు) మన్మథుడు, యముడు
 సనత్కుమారుడు, మారుడు - సంహారుడు)

No comments: