Thursday, August 4, 2016

ధన్యా కేయం స్థితా తే శిరసి?


ధన్యా కేయం స్థితా తే శిరసి?


సాహితీమిత్రులారా!

విశాఖదత్తుని ముద్రారాక్షసనాటకంలోని
(నాటకాలు మొదలైన రూపకాలకు మొదట చేసే ప్రార్థనను
నాంది అంటారు)నాందీ శ్లోకం
పార్వతీపరమేశ్వర సంవాదరూపం(సంభాషణచిత్రం)
చూడండి

ధన్యా కేయం స్థితా తే శిరసి? శశికలా, కిం సునా మైత దస్యా:
నామై వాస్యాస్తదేతత్, పరిచిత మపి తే విస్మితం కస్య హేతో:?
నారీం పృచ్చామి నెన్దుం? కథయ తు విజయా, న ప్రమాణం యదీన్దు:
దేవ్యా: నిహ్నోతు మిచ్ఛో: - ఇతి సురసరితం శౌర్య మవ్యా ద్విభో ర్వ:

శివుని జటాజూటంలో
విలీనమై ఉన్న గంగనుచూచి,
ఈర్ష్యపడిన పార్వతి శివునితో
ఈ విధంగా సంభాషణ ప్రారంభించింది.

పార్వతి - (పరమ ప్రేయసినైన నేను నీ(శంభుని) వామభాగంలో అర్థాంగిగా ఉండగా)
              ప్రభూ! నాభర్తవైన మీ(శివుని) ఉత్తమాంగమును 
              (శిరసును)అధిష్టించిన ధన్యురాలు ఎవరు
              (అసూయతో ఎత్తిపొడుస్తూ ప్రశ్నించింది)
శివుడు - (తన నెత్తినున్న గంగను కప్పిపుచ్చాలనుకొని)  శశికలా (చంద్రలేఖ)
               (అని) శశి(స్త్రీలింగంతో, వ్యాజోక్తి ధ్వనింప చేస్తూ సమాధానమిచ్చాడు)
పా. - అయితే ఈవిడ పేరేమిటి?
శివుడు - దానిపేరూ అదే. నీకు తెలుసుకదా! 
               ఎందుకు మరిచిపోయావు?
               (శివుని మోసాన్ని గుర్తించిన పార్వతి)
పా. - నాథా! నేనడిగేది ఆ చంద్రరేఖను గురించికాదు. 
         మీ జటాజూటంలో ఉన్న ఆ అపరిచిత యువతిని గురించండీ!
శివుడు - (నన్నడిగిన విజాతీయ "ఇన్దు" ప్రధానకర్మకమైన ప్రత్యుత్తరం)
              నీకు ప్రమాణంకాకపోతే                       
              సజాతీయతననుసరించి, 
              నీకు విశ్వాసపాత్రురాలైన 
              నీ సఖి ఆ విజయనే అడుగు.

              ఈ విధంగా వాక్చాలంతో తన తలపై ఉన్న
               గంగాదేవిని కప్పిపుచ్చటానికి
              ప్రయత్నించిన ఆ పరమేశ్వరుని
              ఛలోక్తి మనలను రక్షించుగాక! -  అని కవిభావన.

No comments: