Monday, August 22, 2016

మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ


మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యాన్ని పొడచండి.

రక్త పుష్పమ్ముపై వ్రాలు కోకిల జాతి
           మేఘ పుష్పమురాలు మింటనుండి
చామర పుష్పమ్ము తేమనేలలఁదోఁచు
          గూఢ పుష్పముదాఁచుఁగుసుమములను
జలపుష్పమండజ జాతిలోఁ జేరును
          గుడ పుష్పమిడు మధు కుసుమములను
గగన పుష్పంబగు మృగతృష్ణలో నీరు
         మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ
గుహ్యపుష్పము పూఁతలేకుండఁ గాచు
సూచి పుష్పమ్ములో ఫణి గోచరించుఁ
బుష్పముల కర్థములు చెప్పబూనవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!
                                (శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని - పు.193)

ఈ పద్యంలోని పుష్పాలకు అర్థాలు చెప్పడమే విడుపు.
ఆలోచించండి.

1. రక్తపుష్పము - ఎఱ్ఱని చిగుళ్ళ మామిడి చెట్టు
2. మేఘపుష్పము - మేఘమునుండి రాలు తుంపర
3. చామర పుష్పము - వింజామర వంటి ఱెల్లు
4. గూఢ పుష్పము - ఆకుల మరుగున పూలుండు పొగడచెట్టు
5. జలపుష్పము - నీటిలో పుష్పమువలె తోచు మత్స్యము(చేప)
6. గుడ పుష్పము - తీయని పూలుబూయు ఇప్పచెట్టు
7. గగన పుష్పము - హుళక్కి (ఏమీ లేదని అర్థము)
8. మృదుపుష్పము - మెత్తని పూలు బూయు దిరిసెన చెట్టు(శిరీష చెట్టు)
9. గుహ్యపుష్పము - పూలుకనబడక కాయు పనసచెట్టు
10. సూచీ పుష్పము - సూదులవంటి కొనలుగల మొగలి చెట్టు.

No comments: