Monday, January 31, 2022

మనసిజుమామ మామ........

 మనసిజుమామ మామ........




సాహితీమిత్రులారా!



ఈ ఆశీర్వాద పద్యం గమనించండి-

మనసిజుమామ మామ యభిమానమడంచినవాని మామ నం

దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం

పిన జగజెట్టిఁ పట్టిఁ బొడిజేసిన శూరునితండ్రిఁ గన్నుగన్

గొనిన సురాధినాథుని తనూభవువాయువు మీకు నయ్యెడున్

మనసిజుడు - మన్మథుడు, మన్మథుని మామ - చందమామ, అతని మామ - దక్షుడు, అతని అభిమానం అడచినవాడు- ఈశ్వరుడు, ఈశ్వరుని మామ - హిమవంతుడు, అతని నందనుడు - మైనాకుడు, అతని విరోధి - ఇంద్రుడు, ఇంద్రుని నందనుడు - అర్జునుడు, అతని నందనుడు - అభిమన్యుడు, అతని భార్య - ఉత్తర, ఆమె మేనమామ - కీచకుడు, అతని చంపినవాడు - భీముడు, భీముని కుమారుడు - ఘటోత్కచుడు, అతని చంపినవాడు - కర్ణుడు, అతని తండ్రి - సూర్యుడు, సూర్యుని కన్నుగా కలవాడు - విష్ణువు, అతని తనూభవుడు - బ్రహ్మ, ఆ బ్రహ్మాయువు మీకు అగుగాక - అని సారాంశం.

Saturday, January 29, 2022

నల్లనిదేంది బేరి?

 నల్లనిదేంది బేరి?




సాహితీమిత్రులారా!


రాచనగరులో ఒకచోట ఒక వ్యాపారి కస్తూరి రాసులు పోసి అమ్ముతున్నాడు

అతని దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెలకాపరి మాట్లాడాడు అది ఈ పద్యంలో


నల్లనిదేంది బేరి - మృగనాభి గొల్లడ దాన్ని తిందురా

అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు, పూసినంతనే

జల్లున చేపువచ్చి తెగజారున కాదు సుగంధ మబ్బు, మా

పిల్లకుకాస్తపెట్టు - మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్


గొర్రెల కాపరి -  నల్లనిదేంది బేరి? 

వ్యాపారి -- మృగనాభి గొల్లడ 

గొర్రెల కాపరి - దాన్ని తిందురా?

వ్యాపారి - అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు, 

గొర్రెల కాపరి - పూసినంతనే జల్లున చేపువచ్చి తెగజారున 

వ్యాపారి - కాదు సుగంధ మబ్బు, 

గొర్రెల కాపరి - మా పిల్లకుకాస్తపెట్టు - 

మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్


Thursday, January 27, 2022

పద్యాలతో సంభాషణ

 పద్యాలతో సంభాషణ




సాహితీమిత్రులారా!



ఒక వ్యక్తి వక్కలు ఆకులు వేసుకుంటూ

సున్నం తెమ్మని ఒకావిడను అడిగాడు-


పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి

లన్న పెండ్లము అత్తను గన్న తల్లి

పేర్మిమీఱిన ముద్దుల పెద్దబిడ్డ

సున్న మించుక తేఁగదే సుందరాంగి!

(పర్వతశ్రేష్ఠుడు - హిమవంతుడు, అతని పుత్రిక - పార్వతి, ఆమెపతి - ఈశ్వరుడు, అతని విరోధి - మన్మథుడు, వాని అన్న - బ్రహ్మ, అతని పెండ్లాము - సరస్వతి, ఆమె అత్త - లక్ష్మిదేవి, ఆమె తల్లి - గంగ, గంగపెద్దబిడ్డ - పెద్దమ్మ)

ఓసి పెద్దమ్మా సున్నం తేవే అని పద్య సారాంశం


దానికి ఆ జాణ సున్నం తెచ్చి ఇదిగో తీసుకో అంటూ

ఈ పద్యం చెప్పింది-

శతపత్రంబుల మిత్రుని

సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్

సతతముఁ దాల్చెడు నాతని

సుతువాహన వైరివైరి సున్నం బిదిగో!

( శతపత్రముల మిత్రుడు - సూర్యుడు, అతని సుతుడు - కర్ణుడు, వానిని చంపినవాడు - అర్జునుడు, అతని బావ - కృష్ణుడు, అతనిసూనుడు - మన్మథుడు, వానిమామ - చంద్రుడు, అతనిని తాల్చిన వాడు - శివుడు, అతని కొడుకు - వినాయకుడు, అతని వాహనం - ఎలుక, దానివైరి - కుక్క)

ఓరి కుక్కా ఇదిగో సున్నం - అని సారాంశం


ఈ సంభాషణ ఎంత చతురంగా గూఢంగా ఉందికదా!


Tuesday, January 25, 2022

దీని భావం చెప్పండి

 దీని భావం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ మణిప్రవాళ పద్య భావం చెప్పండి-

ఓసి ఓసి వినవే మమజాతం

కాశి దేశ జలగాహనపూతమ్

నీకు పుణ్యముగదే మృగనేత్రి

కోక నుత్సృజ మదీయ సుఖార్థమ్

Sunday, January 23, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం ఆరవీటి వంశానికి చెందిన పెవేంకట రాయలవారిని 

పొగడినది - దీనికి అర్థం చెప్పండి


హరిరాజ హరిరాజ హరిరాజులకు సాటి

                 పటు బలా జ్ఞానూన భాషణముల

హరిహయ హరిహయ హరిహయులకు సాటి

                 వితత కృపా రూప విభవములను

హరిసుత హరిసుత హరిసుతులకు నెన

                 వినుత జ నౌదార్య విక్రమముల

హరిపౌత్ర హరిపౌత్ర హరిపౌత్రులకుఁ బ్రతి

                 సద్ధర్మ విజ్ఞాన సాహసముల,

ననుచు నెవ్వని వినుతింతు రఖిలవిబుధు

లరిమహీధరశతకోటి ఆరెవీటి

వంశ కలశాబ్దరాకామృతాంసుఁడతఁడు

పరంగు పెదవేంకట క్షమాపాల మౌళి!

Wednesday, January 19, 2022

శ్రీనాథుని ప్రేమలేఖ

 శ్రీనాథుని ప్రేమలేఖ




సాహితీమిత్రులారా!



శ్రీనాథుని వీథిలోని పద్యమిది ఆస్వాదించండి-

శ్రీమ దసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహబాంధవీ!


శ్రీమ దసత్య మధ్యకు(నడుము)ను, 

చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజ(ఏనుగు నడక) యానకున్, 

మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, 

మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు 

స్నేహబాంధవీ!

ఇది నేటి మాటలకంటే ముద్దుగా చక్కగా ఉన్నాయికదా


Monday, January 17, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

శరశరకాండకాండహరిచందనచందనచందననాగనాగసుం

దరదరచంద్రచంద్రశ్రితనారదనారదతారతారభూ

ధరధరరాజరాజహయదానవదానవకాశకాశస

త్పురపురమారమారహరభూధరభూధరకాలకాలహా


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో పెట్టగలరు