పద్యాలతో సంభాషణ
సాహితీమిత్రులారా!
ఒక వ్యక్తి వక్కలు ఆకులు వేసుకుంటూ
సున్నం తెమ్మని ఒకావిడను అడిగాడు-
పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి
లన్న పెండ్లము అత్తను గన్న తల్లి
పేర్మిమీఱిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేఁగదే సుందరాంగి!
(పర్వతశ్రేష్ఠుడు - హిమవంతుడు, అతని పుత్రిక - పార్వతి, ఆమెపతి - ఈశ్వరుడు, అతని విరోధి - మన్మథుడు, వాని అన్న - బ్రహ్మ, అతని పెండ్లాము - సరస్వతి, ఆమె అత్త - లక్ష్మిదేవి, ఆమె తల్లి - గంగ, గంగపెద్దబిడ్డ - పెద్దమ్మ)
ఓసి పెద్దమ్మా సున్నం తేవే అని పద్య సారాంశం
దానికి ఆ జాణ సున్నం తెచ్చి ఇదిగో తీసుకో అంటూ
ఈ పద్యం చెప్పింది-
శతపత్రంబుల మిత్రుని
సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్
సతతముఁ దాల్చెడు నాతని
సుతువాహన వైరివైరి సున్నం బిదిగో!
( శతపత్రముల మిత్రుడు - సూర్యుడు, అతని సుతుడు - కర్ణుడు, వానిని చంపినవాడు - అర్జునుడు, అతని బావ - కృష్ణుడు, అతనిసూనుడు - మన్మథుడు, వానిమామ - చంద్రుడు, అతనిని తాల్చిన వాడు - శివుడు, అతని కొడుకు - వినాయకుడు, అతని వాహనం - ఎలుక, దానివైరి - కుక్క)
ఓరి కుక్కా ఇదిగో సున్నం - అని సారాంశం
ఈ సంభాషణ ఎంత చతురంగా గూఢంగా ఉందికదా!
No comments:
Post a Comment