మనసిజుమామ మామ........
సాహితీమిత్రులారా!
ఈ ఆశీర్వాద పద్యం గమనించండి-
మనసిజుమామ మామ యభిమానమడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టిఁ పట్టిఁ బొడిజేసిన శూరునితండ్రిఁ గన్నుగన్
గొనిన సురాధినాథుని తనూభవువాయువు మీకు నయ్యెడున్
మనసిజుడు - మన్మథుడు, మన్మథుని మామ - చందమామ, అతని మామ - దక్షుడు, అతని అభిమానం అడచినవాడు- ఈశ్వరుడు, ఈశ్వరుని మామ - హిమవంతుడు, అతని నందనుడు - మైనాకుడు, అతని విరోధి - ఇంద్రుడు, ఇంద్రుని నందనుడు - అర్జునుడు, అతని నందనుడు - అభిమన్యుడు, అతని భార్య - ఉత్తర, ఆమె మేనమామ - కీచకుడు, అతని చంపినవాడు - భీముడు, భీముని కుమారుడు - ఘటోత్కచుడు, అతని చంపినవాడు - కర్ణుడు, అతని తండ్రి - సూర్యుడు, సూర్యుని కన్నుగా కలవాడు - విష్ణువు, అతని తనూభవుడు - బ్రహ్మ, ఆ బ్రహ్మాయువు మీకు అగుగాక - అని సారాంశం.
No comments:
Post a Comment