Tuesday, September 22, 2026

టంకేశ్వరి స్తుతి

 

టంకేశ్వరి స్తుతి


సాహితీమిత్రులారా!

శ్రీ మోహన్‌లాల్ శర్మ పాండే గారి నతితతి అనే గ్రంథం నుండి

టంకేశ్వరి స్తుతి ఆదివర్ణావృత్తి చిత్రంగా కూర్చబడినది.




                    టంకేశ్వరీ టంకకటంకటంకా

                    టంకారిటంకాటలటీక్యమానా |

                    టాంకారకృత్ టుంటుకటుంటుకాశా

                    టనాటనం టంకయతాట్టలేశాన్ || 9 ||

అన్వయము:

టంకకటంకటంకా టాంకారకృత్ టంకారిటంకాటలటీక్యమానా టుంటుకటుంటుకాశా టంకేశ్వరీ టలేశాన్ టనాటనం టంకయతాత్.

ప్రతిపదార్థము:

·         టంకకటంకటంకా = వెండి నాణేల టంకశాల (Mint) యొక్క గర్వము కలది.

·         టాంకారకృత్ = ఝంకారం (శబ్దం) చేయునది.

·         టంకారిటంకాటలటీక్యమానా = టంకారముతో కూడిన రాళ్లను పగులగొట్టే స్థిర పురుషుల (శ్రామికుల) చేత పొందబడేది.

·         టుంటుకటుంటుకాశా = దుష్ట పురుషుల పట్ల స్వల్పమైన ఆశ కలది (దుర్జనులకు నిరాశ కలిగించేది).

·         టంకేశ్వరీ = కోశానికి అధిష్ఠాత్రి అయిన లక్ష్మి.

·         టలేశాన్ = అస్థిరమైన యజమానులను.

·         టనాటనమ్ = 'టనాటన్' అనే శబ్దము కలిగేటట్లుగా.

·         టంకయతాత్ = బంధించుగాక (అనగా స్థిరపరచుగాక).

వ్యుత్పత్తి:

·         'టంకౌ దర్పాశ్మదారణౌ' - అమరకోశం (గర్వము మరియు రాళ్లను పగులగొట్టే ఉలి).

·         'టుంటుకః శోణకాల్పయోః' - మేదినీ కోశం (అల్పమైనది).


వెండి నాణేలు ముద్రించే టంకశాల (Mint) వల్ల గర్వము కలది, టన్-టన్ అనే ధ్వనితో నిండినది, టంకారముతో కూడిన రాళ్లను పగులగొట్టే ఆయుధాన్ని ధరించే స్థిర పురుషుని వద్ద నివసించేది, అనగా శ్రమజీవుల ద్వారా లభించేది, దుర్జన మానవుల హృదయాలలో హతాశను (నిరాశను) నింపేది అయిన టంకేశ్వరీ లక్ష్మి (కోశానికి అధిష్ఠాత్రి), అస్థిర ధనికులను టనాటన్ అనే ధ్వనితో స్థిరపరచుగాక. అనగా అటువంటి వ్యక్తులకు స్థిరలక్ష్మి ప్రాప్తించుగాక.

No comments: