Saturday, April 15, 2017

మీసములేని వారలెసుమీ


మీసములేని వారలెసుమీ




సాహితీమిత్రులారా!


సమస్య - 
మీసములేని వారలెసుమీ కవి ధీరులు ధాత్రిలోపలన్

మీసములేనివారే కవులని సమస్యార్థము.

పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి పూరణ -

ధీ, సముద్రులైన గురుదేవులు తిర్పతి వేంకటేశ్వరుల్
భాసిత సంస్కృతాంధ్ర ప్రతిభా కవితా మహితాశుధోరణుల్
ఏ సభనైన జయించుట సాధ్యమె? పోటి నిల్వరే
మీ? సములేని, వారలెసుమీ కవిధీరులు ధాత్రిలోపలన్

ఇందులో మీసం అనే పదాన్ని విడదీసి వాడటం జరిగింది.
నిల్వరేమీ - సములేని - అని వాడటం జరిగింది.
మీతో సమానులైతే నిల్వరేమి అనే అర్థంతో భాసిల్లుతున్నది.

మీరునూ మరోవిధమైన పూరణచేసి పంపగలరు

ముప్పదియారులో అరువదిమూడు


ముప్పదియారులో అరువదిమూడు




సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూడండి-

అరయ ముప్పదియారు వయస్సు నందు
ఒనరనరువది మూడుగా నుండవలయు
అరయనరువది మూడు వయస్సు నందు
ఒనరముప్పదియారుగా నుండవలయు

ఈ పద్యంలో అరువదిమూడు ముప్పదియారు
తప్పమరొకటి కనిపించదు ముప్పది యారువయసులో
అరువదిమూడుగా ఉండాలట. అరువదిమూడువయసులో
ముప్పదియారుగా ఉండవలెనట ఎలా అంటే
36 సంఖ్య ఎడపెడ ముఖంగా ఉంటుంది.
అలాగే 63 సంఖ్య పరస్పరాభిముఖంగా ఉంటుంది.
అంటే  36 వయసులో ఉన్నవారు తమ దాంపత్య
జీవితంలో 3, 6 లాకాకుండా 6,3లా పరస్పరాభిముఖంగా
ఉండాలని. అలాగే 63 వయసులో పరస్పర అభిముఖులు
కాకుండా 3 - 6 లా పరస్పరానభిముఖులుగా ఉండాలని
కవి సంఖ్యా వైచిత్రితో చెబుతున్నాడు.

Wednesday, April 12, 2017

నోరులేదు పెక్కు నీరుద్రావు


నోరులేదు పెక్కు నీరుద్రావు




సాహితీమిత్రులారా!




ఈ పొడుపు పద్యం విప్పండి-

కాళ్లుగలిగియుండుకదలదట్టిట్టు
నోరులేదు పెక్కునీరుద్రావు
తనకుప్రాణిలేదుతరువులభక్షించు
దీని భావమేమి? తిరుమలేశ!

కాళ్లు ఉన్నాయి కాని అటుఇటు కదలదు
నోరులేదు కాని చాలనీరు త్రాగుతుంది.
తనకు ప్రాణం లేదు కాని చెట్లను తింటుంది
ఇంతకు ఇదేమిటో చెప్పమంటున్నాడు కవి-

సమాధానము - గంధపుసాన

యోని సోకినఁ జేయి కాలేను స్వామి


యోని సోకినఁ జేయి కాలేను స్వామి




సాహితీమిత్రులారా!


సమస్య -
యోని సోకినఁ జేయి కాలేను స్వామి
(ఇది పైకి అశ్లీలతను కనిపించేవిధంగా ఉన్న సమస్య)

 పాలపర్తి శ్యామలానంద ప్రసాదుగారి పూరణ-

హవ్యవాహన! అఘనాశ! ఆర్తిపోష!
యనుచుఁగనుమూసి, ధ్యానించునట్టి వేళ
అతివ యజమాని కనియె - "నాథా కృపీట
యోని సోకినఁ జేయి కాలేను స్వామి"

ఈ సమస్యను కవి ఎంతో చమత్కారంగా పూరించాడు
యోని - అంటే స్త్రీ మర్మావయవము
కృపీటయైని - అంటే జలమునుండి పుట్టే అగ్ని

ఒక యజమాని యజ్ఞం చేస్తున్నాడు
అతడు కళ్లుమూసుకొని
హవ్యవాహన!
అఘనాశ!
ఆర్తపోష!
అంటూ హోమద్రవ్యాలు యజ్ఞంలో వేస్తున్నాడు
మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.
అది చూచిన అతని భార్య ఈ విధంగా అన్నదట-
స్వామి అగ్ని నాలుకలు సాచుతున్నాడు.
మీరేమో కన్నలు మూసుకొని నిష్ఠతో
హోమద్రవ్యాలు వేస్తున్నావు
ఆ అగ్ని తాకితే చేతులు కాలుతాయిసుమా-
అన్నదట.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

Tuesday, April 11, 2017

దీని భావమేమి తెలుపగలరు


దీని భావమేమి తెలుపగలరు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం విప్పండి

ఆకసముననుండు నది పక్షియునుగాదు
తోకగలిగియుండు మేకగాదు
త్రాడుగలిగియుండు తలపయెద్దునుగాదు
దీని భావమేమి? తిరుమలేశ!

ఆకాశంలో ఉంటుందట
కాని పక్షికాదట.
తోక ఉంటుందట
కాని మేకకాదట
త్రాడు ఉంటుందట
కాని ఎద్దుకాదట
ఇంకు ఇదేమిటో చెప్పమంటున్నాడు కవి.

సమాధానము - గాలిపటము

తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె


తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె




సాహితీమిత్రులారా!


సమస్య-
తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె
తల్లి పుత్రసాంగత్యమున పుత్రునిగనెని సమస్య

సి.వి.సుబ్బన్నగారి పూరణ-

శంబరాసురుండు డంబునఁ గొనిపోయి
జలధివైచె శిశువు ఝషము మ్రింగె
దయిత బాలుఁబెంచె దనుజునింట రతి, ఆ
తల్లి కొమరుఁబొంది తనయుఁగనియె

ఇది భాగవతంలోని కథ
మన్మథుడు ప్రద్యుమ్నుడై పుట్టగా
ఆ శిశువును శంబరుడనే రాక్షసుడు
సముద్రంలో పడవేస్తే చేప మ్రింగింది.
దైవవశమున బాలుని మ్రింగిన చేపను
శంబరుని వంటఇంటికే తెచ్చారు.
నారదుని ఉపదేశం మేరకు అక్కడరతీదేవి
కాచుకొని చేపను కోసి పిల్లవాణ్ని తీసి రహస్యంగా
పెంచి పెద్దచేయగా పెద్దైన ఆ శిశువు శంబరుని
వధించెను. తల్లివలె పెంచిన ఆ తరుణిని
భార్యగా స్వీకరించాడు. ఆ తల్లి కొమరునిబొంది
తనయు గనెనని చెప్పబడెను. - ఊ పూరణలో
ఇంత కథ ఉంది.
ఇక్కడ తల్లిగాదు ఆ తల్లి అంటే పెంచిన తల్లి
అని రావడంతో సమస్య సమసింది.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.

Monday, April 10, 2017

తెరపై ముద్దులు భారతావనిని కదే తప్పు


తెరపై ముద్దులు భారతావనిని కదే తప్పు




సాహితీమిత్రులారా!



సమస్య-
తెరపై ముద్దులు భారతావనిని కదే తప్పు శాస్త్రోక్తమే


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ -

పరమౌ యుక్తవయస్సురాగ ప్రజకున్ వాత్సల్యమేపార- సం
బరతన్ పెద్దలు పెండ్లిసేయ - ముదమొప్పారన్ సరాగాల తో
మరుకేళిన్ తనివారఁగోరు తనయుల్ మర్యాదగా భార్య - వా
తెరపై ముద్దులు భారతావనిని కదే తప్పు శాస్త్రోక్తమే


ఇందులో సినిమాలలో తెరపై ముద్దులు పెట్టుకోవడం
తప్పుకాదని చెప్పడం సమస్య దాన్ని తెరగాక
వాతెరగా మార్చడం వల్ల సమస్సను పరిహరించడం జరిగింది
(వాతెర - పెదవి)


మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు