Saturday, September 30, 2017

రైలుబండిలో వైతాళికులు - 5


రైలుబండిలో వైతాళికులు - 5




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


"పతితులార 

భ్రష్టులార

దగాపడిన తమ్ములార

ఏడవకండేడవకండి

వచ్చేశాయ్, విచ్చేశాయ్

జగన్నాథ

జగన్నాథ

జగన్నాథ రథచక్రాల్

వచ్చేశాయ్, విచ్చేశాయ్......"

                        అని శ్రీశ్రీ కంఠం రైలు పెట్టి మార్మోగింది.

    అంతా బిక్కు బిక్కుమంటూ నిశ్శబ్దంగా చూస్తున్నారు.

    "ఏమిటయ్యా - మా టికెట్లుగాని నీ జేబులో వున్నాయా? 
      అంతలా భరోసా యిస్తున్నావ్ " 
      అని సూటిగా అడిగారు విశ్వనాథ.

    "ఇతరేతర కారణాల వల్ల నేనేమీ చెప్పదల్చుకోలేదు"
      ముక్తసిరిగా అన్నారు శ్రీశ్రీ-

    టి.టి.ఇ. మాత్రం గేటు వైపు జారుకున్న గణపతిశాస్త్రిగారిని నిలదీశాడు.

    టికెట్ కోసం చెయ్యి జాపగానే - టికెట్లవాడి అరచెయ్యి సాగదీసి నవ్వబోతూ 
"అరెరె... వండర్ ఫుల్...ఇది చెయ్యి కాదు...అయ్యా తమరు నమ్మాలి - నేను తిరిగొచ్చేప్పటికి మీరిక్కడ వుండరు.. ఆ రేఖ మహత్యం అలాంటిది"- గణపతిశాస్త్రి గారు లౌక్యానికి టి.టి.ఇ.పడిపోయాడు. కొంచెం సిగ్గుపడి చెయయి వినయంగా అందించాడు. శాస్త్రిగారు ఏకధాటిగా వున్నవీ లేనివీ చెప్పి టికెట్ గండం తప్పుకున్నారు.

    శ్రీశ్రీ వంతు వచ్చింది. టికెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి -

    "ఎవరు మీరు?" అన్నాడు టి.టి.ఇ.వాడు.

    "భూతాన్ని

    యజ్ఞోపవీతాన్ని

    వైప్లవ గీతాన్ని నేను -"

    "కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా? అన్నారెవరో.

    "నేను శ్రీశ్రీని. ఈశతాబ్దం నాది"

     "కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారువారిది" -  అన్నాడు టి.టి.ఇ.

     "మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను......"

     "అవచ్చు. కాని ఈ రైళ్లని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు"

    ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం

        అనేసి సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్లీ హరీస్ఛట్టో లోకి వెళ్ళిపోయారు.

    తనంతట తానే ఎదురుపడి "నేనేమోనూ...సారీ. ఐ యామ్ మిస్టర్ నరసింహశాస్త్రి మొక్కపాటి ఆఫ మొగల్తూర్ - ఆథర్ ఆఫ్ బారిష్టర్ పార్వతీశం దిగ్రేట్.... "అని టి.టి.ఇ.కి ఘ్టిగా షేక్ హ్యాండిచ్చి పరిచయం చేసుకున్నారు.
    
     "తర్వాణి అన్నం, ఆవకాయ, మంచినీళ్ళు, మరచెంబు పంటి కిందికి వుంటాయని మామిడి తాండ్ర, జంతికలూ తెచ్చుకున్నాను. బట్ టికెట్ ఫర్గాటెన్..."

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

Friday, September 29, 2017

రైలుబండిలో వైతాళికులు - 4


రైలుబండిలో వైతాళికులు - 4




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



విశ్వనాథకి చెయ్యి జాపి-

      "టికెట్ సార్...."

       "లేదు"

         "లేదా... ఇందాక ఎక్కడో వుందన్నారు?"

           "ఔను. అంటాను.

              అల నన్నయకు లేదు తిక్కనకు లేదు"

   "వాళ్ల సంగతి సర్లెండి. మీ సంగతి చెప్పండి.. పైగా మీరెవరో పెద్దమనిషిలా వున్నారు...."

వి.స.గారు వాని వంక విసవిసా చూసి

"నన్ను నెఱుగరో తెలుగునాట మీరు
విశ్వనాథ కులాంబోధి విధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహువిచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రణేత సత్యనారాయణ కవి-"

అని కంఠమెత్తి పాడారు.

      "పదగుంఫన మమోఘము....." అని వాఖ్యానించారెవరో - బహుశా కాటూరి వారే కావచ్చు.

   టి.టి.ఇ. అందుకేమీ రియాక్ట్ కాలేదు.

   పక్కన నిలబడండి అన్నట్టు సైగచేసి కాటూరి వారిని సమీపించాడు

   కాటూరి వారు మౌనంగా పింగళి వారిని చూపించారు

   "ఇదేం పద్ధతిగా లేదు. ఎంత జంటకవులమైనా, జవాబు కలుసే చెప్పాలా ఏమిటి?  ఈ క్లిష్టసమయంలో నా మీద భారం మోపకండి... మీరే చెప్పండి ఆ సంజాయిషీ ఏదో....."
చుట్ట తియ్యకుండా "ఉహు....ఉహు. ..."అనడం తప్ప కాటూరి వారి జవాబు లేదు.

    టి.టి.ఇ.కి ఇదేదో ఓ ముఠా అనీ, టికెట్ లేని ట్రావెలర్స్ అని అర్థమైపోయింది-

     అసలే లాలిత్యం - ఆపైన భయం - బాపిబావ మెలికలు తిరిగి పోతున్నారు - పక్కన నిలబడి.

    "టికెట్ ప్లీజ్...." అనగానే బాపిరాజు నీటి చిమ్మెన ఒక్కతూరి పైకెగసినట్టు ఇట్లు ఆరంభించిరి-

    "బెజవాడ నుండి కాకినాడ పోర్టు స్టేషనుకు టికెట్టు కొని యుంటిని..
నేను రూపాయి నాణెము ఇవ్వగా టిక్కెట్టుయున్నూ మూడణాలన్నర తిరిగి ఇచ్చినాడు. అతడిచ్చిన టిక్కెట్టు రెండంగుళముల మువ్వీసము పొడవు, అంగుళము బైన ఆరువీసముల వెడల్పూ, రెండు నూళ్ల మందమునూ, అరతులము బరువున్నూ కలిగి యుండెను. దానిపై ఏడు అంకెయు, దానికి ముందు రెండు సున్న వున్నవి. మొదటి అంకె అయిదు తదుపరి నాలుగు వున్నది. తెలుపు పసుపు కలివేత వర్ణములో కుడి అంచు పై భాగమున నల్లని చార కలిగియుండెను. చీనా దేశములో జలవర్ణ చిత్రములను ఇదే కొలతలు గల ఫలకములపై చిత్రించు నాచారము కలదు. ఇట్టి వానిని మినియేచరు చిత్రకళ అని వ్యవహరింతురు...."

   "మహాప్రభో! నన్ను వదిలెయ్యండి" అని గావుకేక పెట్టి టి.టి.ఇ. అవతలి వైపుకి నిష్క్రమించినాడు.

   "నీ శైలికి గొంత శక్తియున్నది"- అని విశ్వనాథ బాపిబావని అభినందించిరి.

   "రేపు సాహితీ సమితి సమావేశంలో - మన సభ్యులకు రైళ్లలో, బస్సులో, లాంచీలో, రేవు పడవలో టికెట్ కొనే అగత్యం వుండరాదని ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపజేసి. వాటి నకళ్లు తీసి సర్కారు వారికి సమర్పిస్తాను...." సభాపతి హోదాలో హుకుం జారీ చేశారు శివశంకరస్వామి.

   "రేపటి సంగతి సరే... ఇప్పటి మాటేమిటి?"

   "అసలింతకీ మన రుక్మీనాథం ఏమైపోయినట్టు..."

   టి.టి.ఇ. వచ్చే స్టేషన్ లో దిగిపోవాలని నిష్కర్షగా చెప్పేశాడు.

   అంతా గందర గోళంగా వుంది - కవులలో కలకలం.

   "కర్మఫలము అట్లున్నపుడు ఒక యూరి కరణము మరియొక ఊరి కాపు కాక తప్పదు. మనము రుక్మిణీనాథమును నమ్మితిమి. మనిషి మనిషిని నమ్మును. లేనిచో మానుని నమ్మునా? నమ్మడు. నమ్మక మనగానేమి? అది యొక మానసిక ప్రవృత్తి నమ్మకము 
వేరు. విశ్వాసము వేరు. సమాజము - అనగా మనుషుల గుంపు. ఇందు కొందరు అంజనీ బుత్రులు కొందరు ఆషాడభూతులు. అతడు నమ్మిన బంటు. ఈతడు కాదు. అది మనకు తొలుతగా తెలియునా తెలియును. తెలియదు. ఇదియొక చమత్కారము........."

    "చస్తుంటే సంధ్యమంత్రమని - నడుమ మీ మధ్యాక్కరలా..."
అని పింగళివారు వారించారు.

(శ్రీరమణ పేరడీలు నుండి .............)

Thursday, September 28, 2017

రైలుబండిలో వైతాళికులు - 3


రైలుబండిలో వైతాళికులు - 3




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........

        ఉన్నట్టుండి కమ్మని అత్తరు వాసన గుప్పున తగిలింది. అందరూ
ముక్కుపుటాలెగరేసి పైకి చూశారు

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారు అత్తరులో దూది తడిపి వైనంగా టిక్కెట్లకి రాస్తున్నారు - ఎంకిపాట హమ్ చేస్తూ.

అది గమనించిన విశ్వనాథ నవ్వు ఆపుకుని - "అన్నట్టు మన టిక్కెట్లెక్కడ" - అన్నారు.

    "రుక్మిణీనాథం దగ్గర వుంటాయ్"- అన్నారు కాటూరి వారు చాలా నిర్లక్ష్యంగా చుట్టనోటితో -

    "ఉంటాయ్ - అని వూహించడం కాదు - వున్నవా? - అది ముఖ్యం - అడుగో రంకు మొగుడల్లే టిక్కెట్లవాడు రానే వస్తున్నాడు".

    ఇంతలో టి.టి.ఇ. "టికెట్ సార్ టికెట్" అంటూ వచ్చాడు.

     "మాటలోనే వచ్చారు....వెయ్యేళ్లు..మా రుక్మీణినాథం దగ్గర వున్నాయి."

     "ఆయనెక్కడ.."

     "ఇప్పటిదాకా ఇక్కడే వున్నారండీ..ఇప్పుడే వస్తాడు.".శి.శి.స్వామి వారికి కోపం ఇంకా తగ్గలేదు.

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారిని "సార్ మీరు దిగిరండి. 
టికెట్ ప్లీజ్.. "అన్నాడు.

దిగిరాను దిగి రాను

దివి నుంచి భువికి

దింపి వేతురు గాక

నాకేటి వెరపు -

ఆన్నారు కృష్ణశాస్త్రి గంభీరంగా -

   ఏమీ అర్థంగాని టిక్కెట్లవాడు "తమరెవరు? ఎక్కడికి వెళ్ళాలి?" అన్నాడు
టిక్కెట్ల కోసం చెయ్యి జాపి.

   నా నివాసమ్ము తొలుత గంధర్వలోక

   మధుర సుషమా సుధాగాన మంజువాటి

   ఏ నొక వియోగ గీతిక.

   అనగా విని, కాలము వ్యర్థపుచ్చ నిచ్చగించక. టిక్కెట్లందుకొనుచు
ఆ కవికి టి.టి.ఇ. నిట్లనియె
-
   "టికెట్ ప్లీజ్"
   
   కృష్ణశాస్త్రి గారు చహల్ తో లాల్చీ జేబులో చెయ్యిపెట్టి ఘుమ ఘుమ
లాడుతున్న రెండు టికెట్లని అందించారు. టి.టి.ఇ. ముక్కులెగరేసి అదోలా ఆయన వంక ఓసారి చూసి-
    "ఈ రెండో టికెట్ ఎవరిది" అన్నాడు

   " నా ఊర్వశికి..."

    "వేరీజ్ షీ...."

    "ఎదలోపలి యెదలో, నెమ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో"
    .........

    కింద నున్న కురుమెళ్ల వెంకట్రావు గారు గురువుగారి హటం చూసి
కంగారు పడ్తున్నారు. దిగిరండి అంటే దిగిరాను అంటున్నారు. ఆయనకి అంతా అయోమయంగా ఉంది.

    సంధ్యవసాన
    సమయమున నీప సాదప శాఖికాగ్ర
    పత్ర కుటిలముల లోపల వసించు
    ఇరుల గుసగుసల్ వానిలో నిపుడునపుడు..

     టి.టి.ఇ. అయోమయంలో పడి "అయ్యా ఏమిటి వారనేది" అని కురుమెళ్ల వారిని అడిగారు.
    "...ఏదియొ అపూర్వ మధుర
     రక్తి స్ఫురియించుగాని అర్థమ్ము కాని
     భావగీతమ్ములవి....-"

     అని కురుమెళ్లవారు సమర్థించి చెప్పారు. ఆ రెండో టికెట్టు నా కోసం తీసుకున్నారని కూడా నచ్చ చెప్పారు. పొయిట్రీ వదిలేసి లెఖ్ఖ సరిపెట్టుకున్నాడు టి.టి.ఇ.
    
      "...కాదు..కాదు. ఇతనికి కాదు... ఇది నా ఊర్వశికే

            నిదురలో స్వప్నాల కదలికే బరువైన

            కలలెల్ల కనులిచ్చి కాల్చు నా గతియేమి!"
   
     అని దేవులపల్లి వాదిస్తే-

     "అయ్యా... మధ్యలో దింపేస్తే నా గతి ఏమిటో ఆలోచించండి" ప్రాధేయ పూర్వకంగా వారించారు వెంకట్రావుగారు.

     టిక్కెట్లవాడు ఇదంతా గమనించి దేవులపల్లి వంక జాలిగా చూసి వూరుకున్నాడు.   


(శ్రీరమణ పేరడీలు నుండి........)

Wednesday, September 27, 2017

రైలుబండిలో వైతాళికులు - 2


రైలుబండిలో వైతాళికులు - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


   గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........
    
   "ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.


    అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-

"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.

    తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...

    జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా  వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.

    "ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.

    శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.

    అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది. 

     ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని 
కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.

     ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి - 
అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-

"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి.

"తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.

    "జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"
ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-

    "మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి

    విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు. 
పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి
ప్రతీక... " అన్నారు.

    "అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.

   మరోసారి హూంకరించి ఛట్టోలోకి వెళ్లిపోయారు శ్రీశ్రీ.  

(శ్రీరమణ పేరడీలు నుండి ...........)

Tuesday, September 26, 2017

రైలుబండిలో వైతాళికులు - 1


రైలుబండిలో వైతాళికులు - 1




సాహితీమిత్రులారా!

నవయుగ వైతాళికులు అందరూ ఒకేచోట తారసపడడం చాలా అరుదైన సంఘటన. అందరూ కలసి రైలు ప్రయాణం చేయడం మరీ అపూర్వం. అట్లాంటి సంఘటనని వూహించి రాయటానికి ప్రయత్నించాను. వారిపట్ల నాకు గల గౌరవాభిమానాలే 

దీనికి ప్రేరణ. పాఠకులు సహృదయంతో స్వీకరించ ప్రార్థన.



రైలు బయలు దేరింది.
రైలు పెట్టి నవయుగ వైతాళికులతో కిటకిటలాడుతూంది.
విశ్వనాథ, కాటూరి, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ, పిలకా, మొక్కపాటి, శివశంకరశాస్త్రి, జలసూత్రం........ వీరందరితో బోగి కళకళలాడుతోంది.
రైలు మెల్లమెల్లగా వేగం అందుకుంటోంది.
ఆంధ్రసరస్వతి పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.
రైలు ఊగుతూ సాగుతోంది.
తెలుగు పలుకులు ఊయలలూగుతున్నట్టుంది.
రైలు వేగం అందుకుంది.
విజ్ఞాన సర్వస్వం పుటలు రెపరెపలాడినట్లయింది.


                             *  * * 
     కిటికీ పక్కసీటులో దుడుకు మీసాలు, ఎర్రటి రూపం దిట్టమైన అంచున్న ఖద్దరు పంచె సిల్కు లాల్చీతో కాటూరివారు కూర్చున్నారు. పక్కన వెడ్లపు మూతి వున్న సీసాలో చుట్టబెట్టిన పొగాకు కాడలు - సరిజోడుగా అగ్గిపెట్టి- సన్నగా, పొడుగ్గా సనాతన తాళపత్ర గ్రంథంలా వున్న విశ్వనాథవారు ఎదురు సీటులో కూర్చుని కాటూరి వారిని శ్రద్ధగా గమనిస్తున్నారు.
    ఆయన పొగాకు కాడ తీసి, వైనంగా పాయి చీల్చి, చుట్ట చుట్టే పనిలో త్రికరణ శుద్ధిగా లీనమైపోయారు.
    "మీకు పాయలు తీయడమే వచ్చు... మా బాపి బావకి జడవేయడం కూడా వచ్చు.. "
కొంటెగా అని-

రావోయి! సిన్నవాడ
మావాడ
ఆడివోరి సిన్నవాడ
రావోయి సిన్నవాడ-

అంటూ పాడడం ఆరంభించారు విశ్వనాథ.
పిలుపుపాట వింటూనే బాపిరాజుగారు అవతల వింగ్ లోంచి వచ్చారు.
కళహంస కదలి వచ్చినట్టు......

"ఇంతకీ నిర్వాహకులు సరసులేనా..... ఓ శాలువా ముక్కయినా 
   కప్పుతారంటారా....".-జనాంతికంగా అన్నారు విశ్వనాథ.

"ఏమో?దండల వరకూ శ్రీపాద హామీ పడ్డాడు కదా... వెళ్తోంది కాకినాడ
కనుక లంకపొగాకు పుష్కలం... ఇక మిగతావంటారా.... మన ప్రాప్తం
- వారి దయ...."

                     చుట్టపొగలోంచి కాటూరి వారు వదలిన మాటలివి
    నొసలు కదిలించారు పింగళి లక్ష్మీకాంతం గారు. త్రాసుముల్లులా
నొసటనున్న గీరునామం కదిలించి కొంచెం ఆవేశధోరణిలో "అయినా మనం వెళ్తోంది మంగపతి గారింట్లో పెళ్ళికి. వీరమ్మపెళ్ళిలోనే నారిగాడికి వొడక సోగని - ఈ పెళ్ళివంకన వారి నెత్తిన సాహితీసమితి యావత్తూ దిగిపోయి సర్వసభ్య సమావేశం పూర్తి చేసుకోవాలని గదా బయలుదేరాం - ఊరికేపెట్టే అమ్మ నీ మొగుడు బంతిన పెట్టమన్నట్టు.... ఇంకా శాలువాలూ, సన్మానాలూ కూడానా... "అన్నారు పింగళి.

        "నిర్వాహకులు సరసులేనా.... అన్నాను. దానికింత కంఠశోష ఏల?"
అన్నాడు విశ్వనాథ. పింగళి వారిచ్చిన జవాబు తనకేనని గ్రహించి.

  "కాకినాడ పౌరుల ఔదార్యాన్ని శంకించనక్కరలేదు. ప్రతిభకి వారెప్పుడూ పట్టం కడ్తారు....నేనెన్నడూ అక్కడ నుంచి శాలువా లేకుండా రాలేదు మరి..."  అప్పర్ బెర్త్ మీంచి దేవులపల్లివారి గళం పలికింది - కిందనే ఉన్న కాటూరివారి వైపు చుట్టకోసం చెయ్యి చాపుతూ అన్నారాయన.
   "ప్రతిభ మాట ఎలా వున్నా - ప్రాంతీయాభిమానం కొంత అఘోరిస్తుంది కదా..." - విశ్వనాథ వారి విసురు.

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

Monday, September 25, 2017

విశ్వం గీస్తున్న గీతలు


విశ్వం గీస్తున్న గీతలు




సాహితీమిత్రులారా!


అనుభవాన్ని అనుభూతిలోకి, 
అనుభూతిని అక్షరంలోకి
అందంగా అనువదించగల అనుభవశాలి
అరిపిరాల విశ్వం గారు. భాషలో ప్రాచీనత
తొంగి చూచినా భావనలో నవ్యత పొంగులు 
వారుతుంది. వీరి వచనకవితలలో రవీంద్రుని 
గీతాంజలి ఛాయా మాత్రంగా కనిపిస్తుంది-

గులాబి వర్ణన-



ఏ అచ్చర కన్నె మధురాధరాల నుండి

తొణికిన హసిత తరంగానివి?

ఏ సంకల్ప సిద్ధుని ఫలించిన

కోరికవో నువ్వు?



నా గుండె అంచున కరుడుగట్టిన

వాంఛలు చెమ్మగిలినై, నీ రాకతో

నా యౌవనపు మైకపు జీరల్ని

సిరలుగా, అనురాగ ప్రస్తారం చేసే
                        నువ్వు

చీలిన పారిజాతపు గుండెవా?
                గులాబివా?

ముగ్ధమైన స్నిగ్ధమైన

జాలినీ కాంక్షనూ

ఎదలోపలి పొరల్లో రేపే

నులివెచ్చని వసంత జాగృతిలా

అపూర్వ మధుజ్వాలా కీలికలా

విరిసిన తరుణారుణ లతాంతమా!

ఏ ప్రకృతి శిల్పి కుంచెకొసవో చెప్పు
.........................
.........................

       సంజె మబ్బు నీడలో
    
      గులాబి విచ్చుకున్నప్పుడు

      అసంఖ్యాక రక్తాశ్రులు

      ఘనీభవించిన చప్పుడు.

Sunday, September 24, 2017

కృష్ణశాస్త్రీయం


కృష్ణశాస్త్రీయం




సాహితీమిత్రులారా!


నెమలి జాతీయ విహంగంగా నిర్ణయించిన సందర్భాన కవి సమ్మేళనం 
జరిగితే వారి వారి కవితలు ఎలా ఉంటాయి అనే ఊహకు రూపకల్పనే
ఈ పేరడీ


గంధర్వ లోకంలో కవితా విపంచిపై వియోగగీతాలు ఆలపించే కవి 
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారు. అయిదు దశాబ్దాల క్రితం భావ
కవికి నిర్వచనంగా నిలిచారు. ఆంగ్లేయుల కాల్పనికవాదం. తెలుగు
వారి మెళుకువలు, లలిత లలితమైన పదజాలము శాస్త్రి గారి స్వార్జితాలు.
వారి గీతిక ఇలా విన్పిస్తుంది.



శిశిర శిశిర బందు

మధుర వేదన రగిలి

సోలియున్నది మనసు

చూపకే నీ వింత సొగసు

ఏలనే నీ కంత అలుసు

కరిమబ్బు మేనితో
        స్వామి వచ్చే వేళ

చివురాకు జొంపాల
        పురివిప్పి యాడేవు

భ్రమసి పోతివో యేమొ
        అలసి పోదువొ యేమొ

బృందావనమ్మెల్ల
        నీ మాటె, నీ ఆటె

ఏ నాటి పుణ్యమో
        ఏ నోముల ఫలమొ


(శ్రీరమణ పేరడీలు నుండి .....)