Wednesday, September 27, 2017

రైలుబండిలో వైతాళికులు - 2


రైలుబండిలో వైతాళికులు - 2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


   గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........
    
   "ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.


    అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-

"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.

    తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...

    జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా  వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.

    "ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.

    శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.

    అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది. 

     ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని 
కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.

     ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి - 
అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-

"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి.

"తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.

    "జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"
ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-

    "మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి

    విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు. 
పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి
ప్రతీక... " అన్నారు.

    "అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.

   మరోసారి హూంకరించి ఛట్టోలోకి వెళ్లిపోయారు శ్రీశ్రీ.  

(శ్రీరమణ పేరడీలు నుండి ...........)

No comments: