Wednesday, February 1, 2023

ముక్కుమీద పద్యం

 ముక్కుమీద పద్యం 





సాహితీమిత్రులారా!


పారిజాతాపహరణం అనే కావ్యాన్నినందితిమ్మనరచించిశ్రీకృష్ణదేవరాయల

వారికి అంకిత మిచ్చినాడు. నందితిమ్మన ముక్కును గురించి ఒక

పద్యాన్ని   రచించినందుకు  ఆయనకు ముక్కుతిమ్మనఅనే వ్యవహారం కలిగిందని

 అంటారు.ముక్కును గురించిన ఆ పద్యాన్నితిమ్మనదగ్గర రామరాజభూషణుడు   కొంత 

 ద్రవ్యంఇచ్చి కొని తన వసుచరిత్రయందుఉపయోగించుకున్నా డంటారు.ఆ పద్యం---

నానాసూనవితానవాసనల నా-నందించు సారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బ-ల్కాకం దపంబంది యో

షా నాసాకృతి దాల్చి సర్వసుమన-స్సౌరభ్య సంవాసియై

పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ - పుంజంబులిర్వంకలన్.

 పద్యం రామరాజభూషణకృతమే,ఐతే

కొన్ని అపప్రచారాలు ఇలా ప్రచారమౌ తుంటాయి.

అయితే----

ఈ పద్యానికిమూలమనదగినశ్లోకం పద్నాలుగవశతాబ్దంలోని 

అగస్త్యుని 'నలకీర్తికౌముది' అనే కావ్యంలో ఉంది.

ఆ శ్లోకం-----

      "భృంగా నవాప్తి ప్రతిపన్న భేదా

      కృత్వా వనే గంధఫలీ తపోలం,

      తన్నాసికాభః దనుభూత గంధా

     స్వపార్శ్వ నేత్రీ కృత భృంగ సేవ్యా"

             

వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో

Monday, January 30, 2023

ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు

 ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు




సాహితీమిత్రులారా!


తెలుగువెలుగులో రామన మాస్టర్, బెంగుళూరు వారు కూర్చిన

గీతకందగర్భ ఉత్పలమాల గమనించండి-

ఉ. మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే

ఈ ఉత్పలమాలనుండి ఒక తేటగీతిని విడదీస్తే.

మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే



తే. వరము మాకిల తీయని భాష యన్న

పలుకు మాటలు తేనెల పాలవెల్లి

ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ

తెలుగు నేలల మానుడి తేజరిల్లు

ఆ ఉత్పలమాలలో ఒక కందము కూడా దాగుంది 

మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే.

కం. తెలుగే కదా వరము మా

కిల తీయని భాషయన్న యీ మా తెలుగే

తెలుగందు మా ఘనత కై

తల కన్నియ కాంతులెన్నొ తానె తలపై


Friday, January 27, 2023

షడర చక్రబంధం

 షడర చక్రబంధం





సాహితీమిత్రులారా!

గణపవరపు వేంకటకవి కృత 

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము

లోని షడర చక్రబంధం ఇది -

శార్దూలవిక్రీడితవృత్తం

సత్యాకల్పక ప్రస్ఫుటా శరభిదాచారా విశంక క్రమా

మత్యావిష్కృత బంధురాదరణ భూమాజన్తు కూటాశ్రితా

దిత్యావేంధన ధర్మసారతరమూర్తీముత్కరాద్రిక్షమా

మాత్యుల్లాసపదా మహావిదితధామా సాధుతారక్షమా-861

అర్థం:-

సత్యాకల్పక=సత్యభామపాలిటి కల్పవృక్షమా!(సత్యకు పారిజాతకల్పవృక్షాన్ని తెచ్చిఇచ్చిన కల్పవృక్షం), శరభిదాచార=బాణాలతో భేదిల్లజేయడం అనే విద్యలో, విశంకక్రమా=నిశ్శంకం,నిరాటంకంఅయిన పరాక్రమం/విజృంభణం కలిగినవాడా!,మతి+ఆవిష్కృత=అంతరంగం(మది)లోఆవిష్కృతం అయినవాడా!, బంధురాదరణభూమా=అపారంగా ఆదరించేబుద్ధి కలవాడా!, జంతుకూట+ఆశ్రిత=ప్రాణి(పశు)సమూహంచేత ఆశ్రయించబడినవాడా!, దిత్యావేంధన=దితి కుమారులయిన రాక్షసదుర్మార్గులను  అగ్నిలా దహించేవాడా!, ధర్మ సార రత మూర్తీ=వేదధర్మంపట్లగాఢాభినివేశంకలవాడా (ధర్మస్వరూపా!), ముత్+కర=ఆనందదాయకమూ,అద్రి=పర్వతంలా నిశ్చలమూఐన,క్షమా=తాలిమికలవాడా!,మా=లక్ష్మీదేవికి, అత్యుల్లాస=బాగా ఉల్లాసం కలిగించేవాడా, మహావిదిత=బాగ గొప్పగా ప్రసిద్ధికెక్కినవాడా!, ధామా=నివాసం/కాంతికలవాడా!(శ్రీహరిధామంగాతిరుమల సుప్రసిద్ధం), సాధుతారక్షమా=సజ్జనులను తరింపచేయడంలో సమర్థుడా!

భావం:- 

సత్యభామపాలిటికల్పవృక్షమా!బాణవిద్యలో ఆరితేరినవాడా! తలచేవారి మదిలో మెదిలేవాడా!అపారదయామయా!ప్రాణులచేత ఆశ్రయించబడినవాడా!దుష్టంలయిన రాక్షసులను దహించేవాడా!ధర్మస్వరూపా!ఆనంద దాయకా! కొండన్నా! సిరికి ఉల్లాసం కలిగించేవాడా!సంప్రసిద్ధమైన తిరుమలవాసా! సజ్జన సంరక్షకా!

*విశేషాలు:-* నరశార్దూలస్మరణశార్దూలవృత్తంలోచేయడం సముచితం.చక్రధారిస్తుతి షడరచక్రబంధంలోచేయడం బాగు.

ఈ బంధచిత్రంలో వెలుపలనుంచి మూడవవలయంలో- *కవి వేంకటాద్రి అనీ,  ఆరవవలయంలో ప్రబంధరాజము*

అనీ  కవిపేరూ కావ్యంపేరూ ఉంది.

ఈ పద్యానికి ఇదివరలో అర్థతాత్పర్యాలు లేవు. వేదంవారి సంపాదకత్వ1977ప్రతిలో పద్యం మొదటిపాదంలో ప్రస్ఫుట బదులు 'పస్పుట' అని అచ్చుతప్పు.బంధచిత్రంలో

ఆరవ వలయంలో కావ్యంపేరులోని మొదటి అక్షరం *ప* అని ముద్రితం కావడం సంపాదకుల నిర్లక్ష్యానికి పతాక. మిగతా చోట్ల అచ్చుతప్పులు కొల్లలు.కనీసం కావ్యంపేరైనా

సరిగా పరిశీలించని సంపాదకత్వం.   పద్యంలోని మూడవపాదం ప్రారంభంలో  *దిత్యావేంధన*

అనే పాఠాన్ని *దిత్యౌఘేంధక* వ్యాకరణ పండితులు సవ రించినారు. అలా సవరించడంవల్ల బంధచిత్రం మూడవ వలయంలో  *కవిఘేంకటాద్రి* అని ఏర్పడి కవిపేరుకు

భంగం వాటిల్లుతుంది. అది పరిశీలించక వ్యాకరణపండితులు రసజ్ఞతను వదలి వస్త్రమూల్య విచారణ చేసినారని తెలుపడా నికి బాధగా ఉంది.      పద్యంలోని మూడవపాదంలో *జంతు* అనే పదం ఉంది.ఆ పదంలోని *జ* అక్షరంబంధ చిత్రంలో కావ్య నామాన్నిసూచించే ఆరవవలయంలోని  *ప్రబంధరాజము* లో *జ* . కనుక జంతు పదాన్ని జన్తు అని రాయడం జరిగింది.

           వేంకటాద్రీశా!గోవిందా!గోవింద!              

        వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంత

Wednesday, January 25, 2023

విష్వక్సేనుడు ఎవరు?

  విష్వక్సేనుడు ఎవరు?




సాహితీమిత్రులారా!



శ్రీమన్నారాయణుడి సర్వసైన్యాధిపతి విష్వక్సేనులవారు.  విష్ణువు ద్వారపాలకులు లో ఒకరైన చండుడు అనే అతడు విష్ణు నియమనాన్ననుసరించి రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించాడు. అందుకు మెచ్చిన విష్ణువు అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని అనుగ్రహించారు. ఆయనకు నాలుగు చేతుల్లో శంఖం,చక్రం,వేత్రము(బెత్తము) తర్జని ముద్రతో(చూపుడువేలితో బెదిరిస్తూ) వుంటారు. ఆయన భార్యలు సూత్రవతి, జయా, పద్మధరా అని ముగ్గురు చెప్పబడతారు. ఆయన - విష్ణు అవతారాలను సైతం ఎప్పుడు ఎక్కడ ఏకాలానికి జరగాలో నిర్ణయిస్తారని అంటారు. వీరు మహాలక్ష్మి కి ప్రధాన శిష్యులు, నమ్మాழ்వార్ కి ఆచార్యులు. కనుక మనం ఆచార్య పరంపరలో మనకు ఆచార్యులుగా పూజింపబడతారు.  వీరికి విష్ణు ఆలయాల్లో జయవిజయులు దాటాక ఉత్తరానికీ ఈశాన్యానికీ మధ్యలో దక్షిణాభిముఖంగా ఒక సన్నిధి ప్రత్యేకంగా వుంటుంది. వీరికి విష్ణు నివేదితమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి.   వేరేదీ వీరు స్వీకరించరు.

*శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః*

అని వీరికి ఒక నామమున్నది. విష్ణు నివేదిత పదార్థంలో నాలుగో వంతు వీరికి నివేదించాలి.  వీరి సన్నిధి తిరుమల ఆలయం లో హుండీ పక్కన ఉత్తరద్వారం ప్రాకారం లో చిన్నగా బయటకు కనిపించకుండా వుంటుంది. తిరుచానూరులో లో స్పష్టంగా కనబడుతుంది. 

విష్వక్సేనులు నిత్యసూరి. అయినప్పటికీ వారు భూమిపై అవతరించినప్పుడు సువర్చలా వరుణుల సంతానంగా తులామాసం, శుక్లపక్షంలో పూర్వాషాఢానక్షత్రంలో అవతరించారు.

2. *కుంతల*  అనే అప్సరస,  దూర్వాసుడి శాపం వలన కిరాత జన్మ పొందింది. ఆమెను వీరబాహువనేవాడు వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె *సువర్చల* అనే కన్య.

ఆమెను *వరుణుడు* వివాహమాడాడు. వారి సంతానమే 

*విష్వక్సేనుడు* --  

ఆవిధంగా భూమిపై అవతరించారు విష్వక్సేనుడు. ఆయన తిరుమల పై విష్వక్సేన తీర్థం వద్ద తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహం తో వారికి సైన్యాధిపతి అయినారు.

*సువర్చలాసుతన్యస్త సేనాపత్య ప్రదాయనమః*

అని శ్రీనివాసునికి అష్టోత్తరశత నామస్తోత్రంలో ఒక పేరున్నది. అలాగే వేంకటేశ సహస్రనామం లో

*సౌవర్చలేయవిన్యస్త రాజ్యకః*

అని ఇంకొక నామం వున్నది.  ఇది అవతారం విశేషం.  

3. *కుముదాక్షుడు* అనేవాడు  విష్ణుగణాధ్యక్షులలో ఒకడు. అతనికి సింహాద సంహారం సమయంలో సైన్యాధిపత్యాన్నిచ్చి అతని ద్వారా సింహాదుని సంహరించారు శ్రీనివాసుడు. అందుచేత *కుముదాక్షగణశ్రేష్ట సేనాపత్య ప్రదాత* అనే నామం శ్రీనివాసునికి కలిగింది.: 

*🌟తిరునక్షత్ర తనియన్:*

*తులాయాం గతే దినకరే పూర్వాషాఢా సముద్భవమ్ |*

*పద్మా పదాంబుజాసక్త చిత్తం విష్వక్సేనం తమాశ్రయే||*

 *🌅నిత్యం తనియన్ 😘

 *శ్రీరంగచంద్రమస మిందిరయా విహర్తుం విన్యస్యవిశ్వచిదచిన్నయనాధికారమ్ |*

 *యోనిర్వహత్య మనిశ మంగుళిముద్రయైవ*

*సేనాన్యమన్య విముఖః తమిహాశ్రయామహ||*

 శ్రీరంగనాథుని శ్రీరంగనాయకితోపాటుగా దేవనందనోద్యానమునందు యువరాజువలే విహరించుటకు వీలు కల్పించి లోకముల ఆలనాపాలనలు అత్యంత అద్భుతముగా శ్రీరంగనాథుని ముఖోల్లాసార్థమై నిర్వహించు విష్వక్సేనుడను విష్ణుసైన్యాధిపతిని అన్యులనాశ్రయింపనివాడనై సేవింతును.

(R P ఆచార్యుల వారు అనుగ్రహించిన  విషయం)

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో

Monday, January 23, 2023

శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

 శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

     




సాహితీమిత్రులారా!


 రుక్మిణీ మనోగత వితర్కం రమణీయం. ఒక ముగ్ధ నాయిక సందిగ్ధావస్థ  కామెప్రతీక.

సందేహాలెన్నో(10.1723)   ఆమె మనసును తుమ్మెదల గుంపులాముసురుకున్నాయి.

ఆమెకు దైవచింతనకూడా మొదలయింది(10.1724).ఆ తర్వాత

 పద్యపంచకం(10.1726నుండి1729,1731)లో వితర్క విషాదౌత్సుక్య దైన్య త్రాసాది భావాలు 

అయోగ విప్రలంబ శృంగార రస పుష్టికి దోహదించాయి.ఆమె మనస్సా గరం

 అల్లకల్లోలమయింది.ఆ విషాదంలో జాగరం అరతి అన్నీ

శ్రీకృష్ణ నిరీక్షణానికే  లక్షింపబడినాయి.కందర్ప పరీకల్పితో

ద్వేగ జన్యమైన చింతా విశ్వాస దైన్య స్తంభాది భావాలతో

రుక్మిణి విరహతప్త(10.1727)అయింది.ఈ మనః కంపం

వల్లనే ఆమెకు అశ్రుపాతం కృశతాదులు కలిగాయి.

అందు వల్లనే పరితప్త హృదయంతో ఆమె సర్వశృంగార కళల్నీ

పరిత్యజించింది. ఎడబాటును సహించలేక ఆమె చలించి

పోయింది.సుకుమారంగా ,మెల్లగా వీస్తున్న చల్లగాలికి ఆమె

దూరంగా తొలగిపోయింది.మత్తెక్కిన తుమ్మెదలు ఝంకా

రాలతో తిరుగుతూ  ఉంటే,పక్కకు వెళ్లిపోయింది.కోయిల

కూతకు కోపగించుకుంటుంది.రామచిలుకలనుంచి ముద్దు

మాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికి పడింది. వెన్నెల వేడికి

 అలసిపోతుంది.చిరుమామిడికొమ్మల లేత నీడలకు దూరంగా పోతుంది.  

       ఇలా సర్వజన సంతోష సంధాయకాలైన ప్రకృతి ప్రణయగీతాలూ ప్రకృతిగత రసరమ్య దృశ్యాలూ అన్నీ

రసానంద దాయకాలయినాయి.అయోగ శృంగార పుష్టికి

పోతన చేసిన రసవత్కల్పనం రుక్మిణీ విరహవర్ణనం.

      రుక్మిణీ ప్రథమ వీక్షణంలోని శ్రీకృష్ణ సౌందర్య వర్ణనంవల్ల

అయోగశృంగారం సంభోగశృంగారంగా ధ్వన్యమాన మయింది

మూలంలో  *దదృశేచ్యుతం* (10.53-55)అనే వాక్య లేశం పోతన అనువాదంలో పూర్తిగా  

ఈ కింది రసరమ్య పద్యంగా వృద్ధిచెంది విభావముఖంగా శృంగార రస సూచితం

కావటం పరమౌచిత్యం-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీరవేంద్రావ ల

గ్ను నవాంభోజ దళాక్షు జారుతర వక్షున్ మేఘ సంకాశ దే

హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహున్ జక్రి బీతాంబరున్

ఘన భూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

       రుక్మణీ సౌందర్యం విభావంకాగా వీరులైన రాజులు ఏక

పక్షంగా వేగంగా విభ్రాంతులుకావడం అనుభావం.

అది రసాభాసం.వారి విభ్రాంతి మూలంగా 

వారు దర్శించిన రుక్మీణీ స్వరూపం స్మరణీయం.

ఆమె వీరమోహిని.వారు విభ్రాంతాత్ములు. 

రస నిర్వహణలోని రహస్యాలు ఇలాంటివి

పోతనలో ప్రత్యేకించించి గుర్తించవలసి ఉంటుంది.

    ఇలా శృంగార రసోజ్జీవంలో తాండవమాడుతూ  రుక్మిణీ

కల్యాణ కథ పోతన్న శృంగార రసనిర్వహణ చాతురికి నికషో

పలమై నిలిచింది.

    కల్యాణ హృద్యపద్యం-

ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతో హారిణిన్ మాన వై

భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం

ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్

సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్

                                                                                  -భాగవ 10.1784

           

        కమ్మని పద్యాలందించిన బమ్మెరవారి పాదారవిందాలకు వందనాలతో

సమర్పణ-వైద్యంవేంకటేశ్వరాచార్యులు 

Saturday, January 21, 2023

పంచపాషాణ పద్యాలలో మరొకటి

 పంచపాషాణ పద్యాలలో మరొకటి




సాహితీమిత్రులారా!



పంచ పాషాణా లలో ఇది మరొక పద్యం 

భండనభీమ నిన్నెదిరి పారక నిల్చిన శాత్రవుల్ బృహ 

న్మండలపుండరీక హరి,నాకనివాసులు పారియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చచ్చియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చిత్ర మెన్నగన్

అర్థము:--భండనభీమ =యుద్ధమునందు శత్రువులకు భయము గలిగించు వాడా!, 

నిన్ను,ఎదిరి =ఎదిరించి 

పారక=వెన్నిచ్చి పరుగెత్తక, నిల్చిన శాత్రవుల్ =పగవారు 

బృహ=గొప్పవైన, మండల =గుండ్రములైన,

పుండరీక=వెల్లగొడుగుల తోడ, హరి=గుఱ్ఱము మీద, 

నాక=సుఖముగా, ని-మిగుల వా=తిరుగుటకు 

ఆస=స్థానమైన,పారియున్ =పారిపోయియు, 

బృహత్ = గొప్ప, మండల=ఒక రకమైన పాములకు,

పుండరీక=పులులకు, నాక =అడవి నేలలందు, 

ని=పోయిన, వాసులు =కట్టుబట్టలు గలవారై యుందురు.

చచ్చియున్=చనిపోతే,బృహ=విశాలమైన, మండల=ఎర్రనైన, 

పుండరీక=కమలముల వంటి. హరి=సూర్యుని యందు 

నాక=వైకుంఠ మందును నివాసులు=ఉండువారు.

ఓ! భండనభీమా!యుద్ధములో నిన్నెదిరించి పరిగెత్తి పోక నిలిచి పోరాడి తాళలేక గుర్రాలమీద పరిగెత్తి పోయి  పుట్టగొడుగులు, పాములు,పులులు గల అడవిలో కట్టు బట్టలతో తిరుగుచుందురు.యుద్ధములో చనిపోయిన వారు సూర్యమండలము లేక వైకుంఠమునందు చేరుదురు.ఎలా చనిపోయినా వీరమరణం పొంది స్వర్గలోకాన్ని చేరుతారు.అని భావము    

( బృహన్మండల పుండరీక-దగ్గరే నానార్ధకమైన శ్లేష!1అడవులపాలవుతారు 2 పారిపోక యెదిరిస్తే వీరమరణంపొంది సూర్యమండలాన్ని అధిగమించి నాకలోక సుఖాలననుభవిస్తారని భావం! ఇదోగమ్మత్తు!)  

Thursday, January 19, 2023

క- గుణితక్రమ పద్యం

 క- గుణితక్రమ పద్యం



సాహితీమిత్రులారా!



క- గుణితక్రమ పద్యం పద్యంలోని పదాలు/సమాసాలు

వరుసగా   తలకట్టు,  దీర్ఘం,  గుడుసు, గుడు సుదీర్ఘం   ఇలా  

గుణితక్రమంలో  రచించడం ఒక చిత్రరచన.

గద్వాల విద్వత్కవి కాణాదం పెద్దన

సోమయాజి అధ్యాత్మరామాయణంలో

చంద్రోదయవర్ణనం " -క- గుణితంలో "

రచించినాడు. 

ఆ పద్యం-----

చ.'క'మలవిరోధి,  'కా'మజయ- కారి, 'కి'రద్యుతి, 'కీ'ర్తనీయుడున్

    'కు'ముదహితుండు, 'కూ'టమృగ- గోప్త, 'కృ'తాంతుడు, 'క్లు'ప్తసత్కళా

    క్రముడును, 'కే'శవేక్షణము-  'కై'రవణీశుడు,'కో'కభేదనా

     గమనుడు,'కౌ'ముదీకరుడు,- 'కం'ధిభవుండుదయించెతూర్పునన్

                                                                                 ---సుందరకాండ,31పద్యం

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో