Wednesday, January 25, 2023

విష్వక్సేనుడు ఎవరు?

  విష్వక్సేనుడు ఎవరు?




సాహితీమిత్రులారా!



శ్రీమన్నారాయణుడి సర్వసైన్యాధిపతి విష్వక్సేనులవారు.  విష్ణువు ద్వారపాలకులు లో ఒకరైన చండుడు అనే అతడు విష్ణు నియమనాన్ననుసరించి రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించాడు. అందుకు మెచ్చిన విష్ణువు అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని అనుగ్రహించారు. ఆయనకు నాలుగు చేతుల్లో శంఖం,చక్రం,వేత్రము(బెత్తము) తర్జని ముద్రతో(చూపుడువేలితో బెదిరిస్తూ) వుంటారు. ఆయన భార్యలు సూత్రవతి, జయా, పద్మధరా అని ముగ్గురు చెప్పబడతారు. ఆయన - విష్ణు అవతారాలను సైతం ఎప్పుడు ఎక్కడ ఏకాలానికి జరగాలో నిర్ణయిస్తారని అంటారు. వీరు మహాలక్ష్మి కి ప్రధాన శిష్యులు, నమ్మాழ்వార్ కి ఆచార్యులు. కనుక మనం ఆచార్య పరంపరలో మనకు ఆచార్యులుగా పూజింపబడతారు.  వీరికి విష్ణు ఆలయాల్లో జయవిజయులు దాటాక ఉత్తరానికీ ఈశాన్యానికీ మధ్యలో దక్షిణాభిముఖంగా ఒక సన్నిధి ప్రత్యేకంగా వుంటుంది. వీరికి విష్ణు నివేదితమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి.   వేరేదీ వీరు స్వీకరించరు.

*శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః*

అని వీరికి ఒక నామమున్నది. విష్ణు నివేదిత పదార్థంలో నాలుగో వంతు వీరికి నివేదించాలి.  వీరి సన్నిధి తిరుమల ఆలయం లో హుండీ పక్కన ఉత్తరద్వారం ప్రాకారం లో చిన్నగా బయటకు కనిపించకుండా వుంటుంది. తిరుచానూరులో లో స్పష్టంగా కనబడుతుంది. 

విష్వక్సేనులు నిత్యసూరి. అయినప్పటికీ వారు భూమిపై అవతరించినప్పుడు సువర్చలా వరుణుల సంతానంగా తులామాసం, శుక్లపక్షంలో పూర్వాషాఢానక్షత్రంలో అవతరించారు.

2. *కుంతల*  అనే అప్సరస,  దూర్వాసుడి శాపం వలన కిరాత జన్మ పొందింది. ఆమెను వీరబాహువనేవాడు వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె *సువర్చల* అనే కన్య.

ఆమెను *వరుణుడు* వివాహమాడాడు. వారి సంతానమే 

*విష్వక్సేనుడు* --  

ఆవిధంగా భూమిపై అవతరించారు విష్వక్సేనుడు. ఆయన తిరుమల పై విష్వక్సేన తీర్థం వద్ద తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహం తో వారికి సైన్యాధిపతి అయినారు.

*సువర్చలాసుతన్యస్త సేనాపత్య ప్రదాయనమః*

అని శ్రీనివాసునికి అష్టోత్తరశత నామస్తోత్రంలో ఒక పేరున్నది. అలాగే వేంకటేశ సహస్రనామం లో

*సౌవర్చలేయవిన్యస్త రాజ్యకః*

అని ఇంకొక నామం వున్నది.  ఇది అవతారం విశేషం.  

3. *కుముదాక్షుడు* అనేవాడు  విష్ణుగణాధ్యక్షులలో ఒకడు. అతనికి సింహాద సంహారం సమయంలో సైన్యాధిపత్యాన్నిచ్చి అతని ద్వారా సింహాదుని సంహరించారు శ్రీనివాసుడు. అందుచేత *కుముదాక్షగణశ్రేష్ట సేనాపత్య ప్రదాత* అనే నామం శ్రీనివాసునికి కలిగింది.: 

*🌟తిరునక్షత్ర తనియన్:*

*తులాయాం గతే దినకరే పూర్వాషాఢా సముద్భవమ్ |*

*పద్మా పదాంబుజాసక్త చిత్తం విష్వక్సేనం తమాశ్రయే||*

 *🌅నిత్యం తనియన్ 😘

 *శ్రీరంగచంద్రమస మిందిరయా విహర్తుం విన్యస్యవిశ్వచిదచిన్నయనాధికారమ్ |*

 *యోనిర్వహత్య మనిశ మంగుళిముద్రయైవ*

*సేనాన్యమన్య విముఖః తమిహాశ్రయామహ||*

 శ్రీరంగనాథుని శ్రీరంగనాయకితోపాటుగా దేవనందనోద్యానమునందు యువరాజువలే విహరించుటకు వీలు కల్పించి లోకముల ఆలనాపాలనలు అత్యంత అద్భుతముగా శ్రీరంగనాథుని ముఖోల్లాసార్థమై నిర్వహించు విష్వక్సేనుడను విష్ణుసైన్యాధిపతిని అన్యులనాశ్రయింపనివాడనై సేవింతును.

(R P ఆచార్యుల వారు అనుగ్రహించిన  విషయం)

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో

No comments: