Friday, March 31, 2017

నెఱిగొప్పు మేఘసందేశంబు


నెఱిగొప్పు మేఘసందేశంబు




సాహితీమిత్రులారా!



హంసవిశతిలోని ఈ పద్యం చూడండి ఇందులో
కవి సంస్కృతకావ్యనామములతో స్త్రీని వర్ణించాడు-

నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
            యందమౌొకువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
            బధరంబు మణిసార మౌర చూడఁ
జెలుపంపు జిఱునవ్వు సిద్ధాంతకౌముది
            స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక
            ఘననితంబము రసాయనము తలపఁ
దను వలంకార మతనుశాస్త్రములు చూపు
లహహ మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీవెలఁది యనఁగ
విద్యలు పఠింపఁగా నేల వేఱె బుధులు
             (హంసవింశతి - 2-142)

ఈ నాయిక కొప్పు మేఘసందేశము అనే కావ్యంవలె ఉన్నది.
(కొప్పు నల్లగా మేఘం వలె ఉన్నదట)
కనుదోయి కువలయానందమనే అలంకార గ్రంధము.
(కన్నులు కలువలె వోలె ఉన్నవట.)
మోము ప్రబోధచంద్రోదయమనే నాటకము.
(ముఖము నిండు  చంద్రుని వలె ఉన్నదట.)
అధరము(పెదవి) మణిసారమనే గ్రంథమువలె ఉన్నది.
(పెదవి పద్మరాగమణివలె ఎర్రగా ఉన్నదట.)
చిఱునవ్వు సిద్ధాంతకౌముది అనే వ్యాకరణశాస్త్రగ్రంథము.
(చిరునవ్వు చొక్కమైన వెన్నెలవలె ప్రకాశించుచున్నదట.)
స్తనయుగము రసమంజరి అనే పుస్తకం.
(స్తనద్వయం పుష్పగుచ్ఛములవలె ఉన్నవట.)
గోళ్ళకాంతి కావ్యప్రకాశిక అనే అలంకార గ్రంథము.
(గోళ్ళు నక్షత్రాలవలె మినమినలాడుచున్నవట.)
కటితలము రసాయనమనే గ్రంథము
(కటితలము శృంగారమునకు ఉనికిపట్టైఉన్నదట,
గుండ్రని దిన్నెలవలె ఉన్నదని అనుట కూడ)
తనువు అలంకారశాస్త్రము
(శరీరము సౌందర్యముగా ఉన్నదనుట.)
చూపులు అతను శాస్త్రములు
(చూపులు కామశాస్త్రములని మన్మథుని శాస్త్రములని)
నడుము నాటకము (నటించును అని)
ఈమె అవయవములే సమస్తసారస్వతమైనప్పుడు
ఈమెచే పడినప్పుడు సమస్తవిద్యలు చేపడినట్లే అగును కాన
వేఱే విద్యలు నేర్చుకోవడమెందుకు అని కవి చమత్కరిస్తున్నాడు.

నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
            యందమౌొకువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
            బధరంబు మణిసార మౌర చూడఁ
జెలుపంపు జిఱునవ్వు సిద్ధాంతకౌముది
            స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక
            ఘననితంబము రసాయనము తలపఁ
దను వలంకార మతనుశాస్త్రములు చూపు
లహహ మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీవెలఁది యనఁగ
విద్యలు పఠింపఁగా నేల వేఱె బుధులు

ఇందులో కావ్యనామములు గోపనము
చేసినందున దీన్ని  కావ్యనామ గోపనము అంటారు.


No comments: