Thursday, March 2, 2017

గగనమధ్యమమూర్తి గనుఁగొనఁ గప్పుచే


గగనమధ్యమమూర్తి గనుఁగొనఁ గప్పుచే




సాహితీమిత్రులారా!


త్యాగరాజ మొదలి కూర్చిన
సుబ్రహ్మణ్యవిజయములోని
ఈ అనేకార్థక చిత్రం చూడండి-
కవివాడిన శ్లేష పదాల వలన అనేకార్థాలు
ద్యోకతమౌతాయి అనేకార్థక చిత్రంలో


గగనమధ్యమమూర్తి గనుఁగొనఁగప్పుచే
        నొప్పారె బృథులపయోధరములు
వరకంకణోర్మికావళులు జాఱఁగఁ జారు
        వేణి విశదగర్భవృద్ధి నెరసె
గుఱుమీఱి చెలువాఱు కువలయావళి హల
        హలిక సంపూర్ణమై నలుపుకెక్కె
భ్రమరకాకీర్ణమై సుముఖనీరజపాళి
        వెలవెలనై రూపకలనఁదఱిగె
వర్షఋతుశంకఁ గల్పించు వనరుహాక్షి
గర్భగౌరవ మీలాగు గరిమఁ గాంచ
నించెఁ దొమ్మిది నెలలును నిఖిలభువన
గర్భగౌరవవత్కీర్తి కాంతఁబోల
                                                            (సుబ్రహ్మణ్య విజయము -1 ఆ.)


ఇందులో కవి గర్భవతిని
వర్షఋతువును పోలుస్తూ వర్ణించాడు

వర్షఋతుపరంగా అర్థం-
ఆకాశం(గగన) మధ్యభాగంలో చూస్తే
మబ్బులు నల్లదనంతో అందగించాయి.
శ్రేష్ఠమయిన నీటిబిందువులూ కెరటాలూ
కదులుతూంటే అందమైన నదీప్రవాహాలు
విశాలమైన మధ్యభాగాల వృద్ధితో(గర్భవృద్ధిన్)
ప్రకాశించాయి. వర్షాకాలంలో నదులు నిండి మధ్యభాగాలలో
నీరు ఎక్కువలోతుగా ఉంటుంది. అందమైన భూభాగాలు
అంటే పొలాలు అత్యధిక ప్రయత్నంతో హలాలు ధరించిన
కర్షకులతో క్రిక్కిరిసి నల్లబారాయి. తడిమట్టి పైకివచ్చి దున్నిననేల
నల్లబడిందనివికసించిన పద్మాల సమూహం నీటి
సుడులతో చెల్లాచెదురై కాంతి తప్పి రూపురేఖల్ని కోల్పోతోంది.
పద్మాల ఆనందమంతా శరత్కాలంలోనే. వర్షాకాలంలో
వానీటి దెబ్బల చేత వాటి అందం చెడిపోతుంది.


గర్భవతి పరంగా అర్థం -

ఆకాశం వంటి అంటే మరీ సన్నని నడుము యొక్క
రూపం కన్పడేసరికి పెద్దవైన వక్షోజాలు(పయోధరాలు)
నలుపెక్కి ప్రకాశించాయి. ఎప్పుడూ కనించనంతగా
సన్నని నడుము గర్భం ధరించేసరికి కన్పడుతోంది.
క్రమక్రమంగా పెద్దదవుతోంది. వక్షోజాలు తమకంటే
పెద్దదవుతున్న నడుమును చూసి అసూయచేత
నల్లబడ్డాయా అన్నట్లు అగ్రభాగాలు నలుపెక్కాయి.
గర్భవతికి వక్షోజాల మొనలు నలుపెక్కుతాయి.
అది గర్భచిహ్నం.

అందమైన జడకల ఆ యువతి శ్రేష్ఠమైన గాజులు(కంకణ)
ఉంగరాలు పొట్టపై ఉండే ముడతలు(వళులు) జారే అంతగా
స్పష్టమైన గర్భంయొక్క ఆధిక్యత అందగించింది.
గర్భవతుల చేతులూ వేళ్ళూ సన్నబడటం కూడ ఉంటుంది.
ఆ సందర్భంలో గాజులు, ఉంగరాలు(ఊర్మికా) జారిపోతుంటాయి.
నడుము పెరగడంచేత పొట్టపై ముడతలు పోతున్నాయి.
చెలికత్తెలమీద కోపమూ చిరాకూ పెచ్చుపెరిగి ఆమె కాటుక
కనుచూపులు ఏదో తెలియని సంభ్రమంతో(హలహలిక)
సంపూర్ణమై అలసట పొందాయి. (హలా హలా అని పిలుచుకునే
నేస్తురాండ్రు చేసే అల్లరీ హడావిడీ)

ముంగురులు ముసిరి అందంగా ఉండే
ఆ ముఖపద్మం తీరు - పొందిక పాండిమను
పొంది(వెలవెలనై) రూపకలనను కోల్పోయింది

వర్షఋతువా అనిపించే విధంగా
తామరపూలవంటి కన్నులుకల
ఆ యువతికి ఏర్పడిన గర్భం యొక్క ఆదిక్యం
ఈ విధంగా సమస్తభువనాల మధ్యలో(గర్భం)
ఆదరింపబడే కీర్తి కాంతవలె గొప్పతనం పొంది
ఆమెకు తొమ్మిది నెలలు  నిండాయి.



No comments: