Friday, March 10, 2017

చిత్రకవిత్వంలో - గతిచిత్రం -2


 చిత్రకవిత్వంలో - గతిచిత్రం -2



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.............




పద్యభ్రమకము-

మొదటినుండి చివరకుచదివినా
చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉండే  పద్యాన్నిగాని శ్లోకాన్నిగాని
పద్యభ్రమకమని, లేదా
అనులోమ విలోమ శ్లోకం(పద్యం) ఉంటాము


కాళిదాసళిదాయోమా, చంద్రంతే రిపురంజకమ్
కంజరం పురితేం ద్రంచ, మాయోదాళి పదాళికా

దాసళి - దాసులను పుత్రులుగా చూచేదానా
దాయో - వేరుగా ఉండని శివుడుకలదానా
మాయో - మాయారూపిణివైన దేవతా
దాళి - దాంతి గుణముకలదానా
సదాళి - దేవతా స్త్రీలే చెలికత్తెలుగా కలదానా
కాళి - ఓ కాళికాదేవీ
పురి - దరిచేర్చుకునే విషయంలో
తే - నీ యొక్క
తా - దయ
చంద్రం - చంద్రుణ్ణి
కంజరం - సూర్యుణ్ణి
ఇంద్రం చ - దేవేంద్రుణ్ణి కూడ
రిపురంజకం - అరిషడ్వర్గము కలవాణ్ణిగా
మా - నన్నుగూర్చి
కా - సుఖానికి స్థానంగా
భవ - అగుదువుగాక

ఇలాంటిదానికి ఉదాహరణ ఇక్కడ చూద్దాం-
నంది మల్లయ్య - ఘంట సింగన్న లు
వ్రాసిన వరాహపురాణములోనిది -

సారసనయనాఘనజఘ
నారచితరతారకలికహరసారసా
సారరసారహకలికర
తారతచిరనాఘజనఘనాయనసరసా
                                                 (వరాహపురాణము - 9- 155)

సారసనయనాఘనజఘ
నారచితరతారకలికహరసారసా
సారరసారహకలికర
తారతచిరనాఘజనఘనాయనసరసా

సారసనయనాఘనజఘ - నారచితరతారకలికహరసారసా
సారరసారహకలికర-తారతచిరనాఘజనఘనాయనసరసా

ఈ రెండు పాదాలను సరిగా గమనించండి.
ఇందులో మొదటి వరుసలో ఉన్న అక్షరక్రమమే
విలోమంగా రెండవ వరుసలో ఉన్నాయి.
ఈ విధంగా రావడం వలన ఎటుచదివినా
ఒకలాగే వస్తుంది. అందువల్ల దీన్ని
ప్రతిలోమానులోమ కందం అంటున్నాము.

దీనిలో మరో గమ్మత్తుకూడ ఉంచారు ఈ జంటకవులు
అదేమిటంటే ఈ పద్యం పెదిమలు తగలకుండా చదువవచ్చు
అంటే ఇది నిరోష్ఠ్యం కూడా




అనులోమ ప్రతిలోమ శ్లోకం-

ఒకశ్లోకం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ శ్లోకాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో శ్లోకం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ శ్లోకం అంటారు.

నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
                                          (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా

భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
                                   

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)


మొదట నుండి వచ్చిన పద్యం ఒకలాగను,
చివరనుండి వచ్చిన పద్యం మరోలాగను ఉండి
అర్థం వేరుగా ఉన్నదాన్ని చూద్దాం.
ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
గతిచిత్ర పద్యాన్ని ఇక్కడ చూద్దాం.

అనులోమ పద్యం -
(మొదట నుండి చివరకు చదివేది)

సారాకారా సమరస
సారసగ సరాస యనఘ జయయవ్యసనా
మారాకారా కలియమ
భారవ జసరా సమహిమ భాధవ భసరా

సారాకారా -
సార - ఉత్తమమైన, అకారా - అ అను వర్ణము(పేరు)గలవాడా,
సమ-రస - లక్ష్మితో కూడిన ప్రేమరసము కలవాడా,
సారసగ - శంఖమును పొందినవాడా,
సరాస - రాసక్రీడతో కూడినవాడా,
అనఘ - నిర్మలమైనవాడా,
అవ్యసనా, మారాకారా,
కలియమ - యుద్ధములలో యముని వంటివాడా,
భా-రవ-జ-సరా - శాంతితోను ధ్వనితోను జయముతోను
కూడిన బాణములుగలవాడా,
సమహిమ - భా-ధవ - భూదేవియొక్క వల్లభా,
భ-సరా - నక్షత్రములయందును గతిగలవాడా !
అనగా వాటియందును ఉండువాడా!

విలోమపద్యం -
(పై పద్యన్ని క్రింది నుండి చదువగా వచ్చే పద్యం)-

రాసభవధ భామహిమస
రాసజవరభామ యలికరాకారామా
నా సవ్యయ యజ ఘన యస
రాసగ సరసా సరమ సరాకారాసా

(రాసభ - గార్ధభాసురుని యొక్క, వధ - సంహారమునందలి
భా - దీప్తికిని, మహీమ - గొప్పదనమునకు,
స - స్యందన పథమువంటివాడా
అనగా స్యందనము దాని పథమునందు ఎట్లునడచునో
అట్లే గర్ధభాసురవధ జనిత తేజోమహిమలు వీరియందు నడచినవి అని,
రాస - జ వరరామ - రాసక్రీడయందు త్వరతో కూడిన ఉత్తమస్త్రీలుగలవాడా,
అలిక-రాకారామా - ముఖమునందునిండుపున్నమ
భార్యగా గలవాడైన చంద్రుడవే అయినవాడా,
నా సవ్యయ - అధికమైన శుభావహవిధులతో కూడినవాడవు కానివాడా)

No comments: