Tuesday, January 31, 2017

నీ విభుని చక్కని పేరు వచింపుమన్న


నీ విభుని చక్కని పేరు వచింపుమన్న




సాహితీమిత్రులారా!




ఒక లజ్జావతి తన భర్త పేరును
ఎంత తెలివిగా చెప్పిందో చూడండి-

సరసిజనేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న ఆ
పరమ పతివ్రతామణియు భావమునం ఘనమై సిగ్గునన్
కరియును రక్కసుండు హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
బరయగ వీనిలోని నడిమక్కరముల్ గణుతింప పేరగున్

ఆ లజ్జావతి చెప్పిన పదములలోని
మధ్యనున్న అక్షరాలను తీసుకొని
కలిపిన తన భర్తపేరు వస్తుందట-

అవి అలాగే తీసుకుంటే అందులో చిత్రమేమి ఉంటుంది-
వాటిని ఈవిధంగా మూడు అక్షరాల పదాలుగా మార్చాలి

కరి                                       - ద్వి
రక్కసుడు                          - అఘుడు
హరుకార్ముకము                 - పినాకం
శరము                              - సాకం
అద్దము                             - మకురం
శుకం                                  - చిలు

ద్విదం, అఘుడు, పినాకం, సాకం, ముకురం, చిలు
వీటిలోని మధ్య అక్షరాలు తీసుకొంటే
రఘునాయకులు అని వస్తుంది.
అది ఆవిడ భర్తపేరు.
ఇందులో ఆవిడ భర్తపేరు
గోపనం చేసినందువల్ల
ఇది గూఢచిత్రం అవుతుంది.

ఏకాక్షర నిఘంటువు - 58


ఏకాక్షర నిఘంటువు - 58




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


పక్ష్ -  స్వీకరించుట

పచ్ - వండుట

పండ్ - పోవుట, ప్రోగగుట

పద్ - పోవు, పోవుట, పొందు, కదలు, చేరు, పొందు,
               సంపాదించు, పరిశీలించు, అభ్యసించు

పీ - త్రాగుట

పీడ్ - బాధించు, గాయపరచు, పీడించు,
               వ్యతిరేకించు, పిండు, నాశనంచేయు

పమ్ - వ్రతము, కూడు

పః - కొండ, ప్రకాశము, కౌస్తుభరత్నము,
           క్షణకాలము, శుభలగ్నము

పాట్ - సంబోధనార్థకము

పూః (పుర్) - వాయువు, పట్టణం, నిండించుట,
                                 శరీరము, బుద్ధి

పుష్ - పోషించుట, పెంచుట

పుష్ప్ - వికసించు, తెఱచుకొను

పూ - పవిత్రము చేయు, శుభ్రముచేయు

పూజ్ - గౌరవించు, ఆదరించు


Monday, January 30, 2017

దొన పులి మొన యమ్ము శాఖి తుద లని పలికెన్


దొన పులి మొన యమ్ము శాఖి తుద లని పలికెన్



సాహితీమిత్రులారా!

సమస్యపూరణలు అనేక విధాలు
అందులో ప్రహేలికా పద్ధతి ఒకటి
గోపన పద్ధతి మరొకటి
ఆ రెండింటిని కలిపిన పద్ధతిలో
కూర్చబడిన సమస్యపూరణ ఇక్కడ చూడండి-

కవిజనోజ్జీవని - సమస్యలు- లోనిది ఈ ఉదాహరణ-

సమస్య -
దొన పులి మొన యమ్ము శాఖి తుద లని పలికెన్

కోటి శ్రీరాయరఘునాథ తొండమాన్ మహీపాలుడు పూరణ-

వనజాంబకుండు ననుఁగని
కిమకం గనలుచును గనులఁ గెంపు జనింపన్
ననతూపు లేసి రమ్మను
దొన పులి మొన యమ్ము శాఖి తుద లని పలికెన్

ఇది అంతర్లాపి సమస్య
సమాధానం సమస్యలోనే ఉంటే అది అంతర్లాపి
అలాగే ఇందులో
దొ, పులి, మొ, యమ్ము, శాఖి, ఈ పదాల తుదిని
ఉన్న అక్షరాలను కలిపిన
దొ, పులి, మొ, యమ్ము, శాఖి
నలినమ్ముఖి - అంటే నలినముఖి
అనే సంబోధన గూఢపరచబడింది కావున ఇది గూఢచిత్రంగాను
చెప్పవచ్చు.
ఒక స్త్రీ తన చెలికత్తెను చూచి దానితో
ఓ నలినముఖి!
నన్ను (వనజాంబకుడు - పూవును బాణంగా గలవాడు)
మన్మథుడు కినుకతో కనులు ఎర్రబడగా పూలబాణాలేసి
రమ్మని అంటున్నాడు - అని భావం


ఏకాక్షర నిఘంటువు - 57


ఏకాక్షర నిఘంటువు - 57




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ని - నిశ్చయము, నిషేధము, సంశయము, సామీప్యము

నిట్ - రాత్రి

నింద్ - నిందించు, తిట్టు, తప్పులు వెదకు

నీ - తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట

ను - ప్రశ్న, వికల్పము, ఈవిధంగా ఆవిధంగా అని ఊహించడం
            (ఈ రెండింటిలో ఒకవిధము), ప్రతిమాయ తెలుసుకొనగోరుట,
            పాదపూర్తి, దుఃఖము, కొంచెము

నుః - బాణము, ఓడ, కాలము, స్తుతి

నుద్ - ప్రేరణచేయు, ప్రోత్సహించు, తొలగించు

నృ - మనుష్యుడు

నృత్ - నాట్యము చేయుట, ఆడుట

నో - లేదు, కాదు

న్యంచ్ - క్రిందికి వంగిన, కుఱుచని



Sunday, January 29, 2017

పూలదండ రేకొత్తకుండ


పూలదండ రేకొత్తకుండ




సాహితీమిత్రులారా!



సమస్య పూరణవలెనే
దత్తపది-
ఇచ్చిన పదాలనుపయోగించి
అడిగిన ఛందస్సులో లేదా
అడిగిన వర్ణనతో లేదా అడిగిన
విధంగా పూరించడం-
ఒక మహాకవికి దత్తపదిగా
గోలకొండ
పూలదండ
కొత్తకుండ - అనే పదాలను
భారతార్థ వచ్చే విధంగా పూరించమన్నారట
ఆ కవి పూరణ-

ఓయి కురురాజ! నీ కొడు కుత్త గోల
కొండవలెనుండు క్షణ మాల ముండదికను
భండనంబున గెల్తురు పాండుసుతులు
ఉదరమున పూలదండ రేకొత్తకుండ!

(ఓ కురురాజ నీ కొడుకు తెలియనివాడు
కొండవలె పడబోవు యుద్ధము ఆగదు
పాండవులు పూరేకొత్తుపాటి శ్రమకూడలేకుండా
(అతి సులభంగా) గెలుస్తారు)

ఓయి కురురాజ! నీ కొడు కుత్త గోల
కొండవలెనుండు క్షణ మాల ముండదికను
భండనంబున గెల్తురు పాండుసుతులు
ఉదరమున పూలదండ రేకొత్తకుండ!

ఇందులో వారు అడిగిన పదాలను ఉపయోగించి
తేటగీతి పద్యంలో భారతార్థ వచ్చే విధంగా కవి పూరించాడు.

ఏకాక్షర నిఘంటువు - 56


ఏకాక్షర నిఘంటువు - 56




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



 - లేదు, కాదు, ఒద్దు

నమ్ - పారమార్థికగా ముక్తిని, లౌకికంగా భుక్తిని 
                 ప్రసాదించే శక్తిగల బీజాక్షరం, వంగు, నమస్కరించు

నద్ - ధ్వనించు, ప్రతిధ్వనించు, మాటలాడు, 
               అఱచు, గర్జించు

నంద్ - సంతోషించు, ఆనందించు, తృప్తిపడు

నయ్ - పోవు, కాపాడు

నర్ద్ - ఱంకెవేయు, అఱచు, గర్జించు, కదలు

నశ్ - నశించు, అగపడకుండు, చచ్చు

నహ్ - కట్టు, బంధించు, చుట్టు, ధరించు

నాథ్ - అడుగు, కోరు, అధిపతియగు, కష్టపెట్టు, ఆశీర్వదించు

న్యఙ్ - పొట్టివాడు

నఞ్ - లేదు కాదు అని అర్థాన్నిచ్చేది.

నా - లేదు,కాదు, మగవాడు, గండ్రగొడ్డలి, శంకరుడు

Saturday, January 28, 2017

ఒక్కడె నొక్కడే మరియు నొక్కడు నొక్కడె


ఒక్కడె నొక్కడే మరియు నొక్కడు నొక్కడె




సాహితీమిత్రులారా!



సమస్య-
ఒక్కడె నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్క డొక్కడే



 సింహాద్రి శ్రీరంగముగారి పూరణ-

ఒక్కడే భీమసేనునని నోర్వగలాడు విరోధి కోటులన్
నిక్కము ఫల్గుణుండు హరునిం గణియింపడు యుద్ధభూమి, పెం
పెక్కిన మాద్రి పుత్రకురీంద్ర మృగేంద్రులు పాండవేయు లం
డొక్కడు నొక్కడే మరియు నొక్కడు డొక్కడె యొక్క డొక్కడే

ఈ సర్వనామ సమస్యను
భారత కథతో చక్కగా పూరించాడు కదా

మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు

ఏకాక్షర నిఘంటువు - 55


ఏకాక్షర నిఘంటువు - 55




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ధు/ధూ  - కదల్చుట, దించుట, తొలగించుట, విసరివేయుట,
                         ఊదుట, నాశనముచేయుట, ప్రజ్వలింపచేయుట,
                         గాయపరచుట

ధుక్ష్ - ప్రజ్వలింపచేయుట, బ్రతుకుట, కష్టములనుభవించుట

ధుర్ - కాడి, బరువు, ఉచ్చస్థానము, అగ్రము

ధూః - వణకుట, కదలుట, కలతచెందుట

ధృ - అగుట, సంకల్పించుట, ఉండుట, జీవించుట,
              పట్టుకొను, సహించు, మోయు, ఆధారపడు,
               స్వాధీనుడై ఉండు, స్వీకరించు, ధరించు,
                నిలుపు, నిరోధించు, అప్పగించు, అప్పుపడు

ధృష్ - ఏకీభవించు, కలియు, గాయపరచు, కోపింపచేయుట,
                   అవమానించుట, తక్కువచేయుట, అతిశయించుట,
                   జయించుట, చెఱచుట, ధైర్యముగానుండుట,
                   విశ్వాసముతో నుండుట, గర్వించుట,
                  సహనముకోల్పోవుట, సాహసించుట, ముట్టడించుట

ధే - త్రాగుట, పీల్చుట, వెలికి తెచ్చుట, తీసుకొని పోవుట

ధోర్ - వేగముగాపోవు, నేర్పరియై ఉండు

ధ్మా - ఊదుట, నిశ్వాసించుట,
               నిప్పును మండునట్లుచేయుట,
                ధ్వనితో ఊదుట

ద్యై - ఆలోచించు, ఊహించు

ధ్వస్ - పతనమగు, వ్రయ్యలగు, ఇంకిపోవు, నశించు

ధ్వన్ - మ్రోయు, శబ్దముచేయు

Friday, January 27, 2017

సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ!


సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ!



సాహితీమిత్రులారా!



పూర్వము రాయని భాస్కరుడనే మంత్రి దానములో
గొప్పపేరున్న దాత ఆయన గురించి అనేక పద్యాలు
చాటువులు ఉన్నాయి. వాటిలోని ఒక చాటువు
సంవాదచిత్రంలో చూడండి-

బ్రహ్మ - నారదుల సంవాద చిత్రం -


సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ!, పుత్రా! వసుం
ధరపై నొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయామాత్య భా
స్కరుడో ఔను అయితే సహస్రకరశాఖల్లేవు అదె యున్నవే
తిరమై దానము చేయుచో - రిపు హేతిన్ వ్రేయుచో - వ్రాయుచో



    
నారదుడు -  సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ! 
                      (తండ్రీ!  ద్వాదశాదిత్యులు ఇపుడు బేసి(11) గా    ఎందుకున్నారు?)

బ్రహ్మ -  పుత్రా! వసుంధరపై నొక్కడు మంత్రియయ్యె వినుకొండన్
               (అందులోని సూర్యుడే కుమారా భూమిపై వినుకొండలో
                  మంత్రి రాయని భాస్కరునిగా పుట్టాడు)

నారదుడు -  రామయామాత్య భాస్కరుడో
                      (రామయామాత్య భాస్కరుడేనా)

బ్రహ్మ - ఔను

నారదుడు - అయితే సహస్రకరశాఖల్లేవు
                      (అయితే సహస్ర కరాలు(కిరణాలు) లేవేమి?)

బ్రహ్మ -  అదె యున్నవే తిరమై దానము చేయుచో - 
                రిపు హేతిన్ వ్రేయుచో - వ్రాయుచో
               (అదుగో ఉన్నవి దానముచేయువేళ,
                యుద్ధము చేయువేళ, వ్రాయువేళ
                  అతనికి వేయి చేతులుంటాయి)


(సూర్యులు 12 మంది. కశ్యపునకు దితికి కలిగినవారు. 
వీరిని తుషితులనే దేవతలుగా పిలుస్తారు. 
వారి పేర్లు - 1. ఇంద్రుడు, 2. ధాత, 3. పర్జన్యుడు, 
4. త్వష్ట, 5. పూష, 6. అర్యముడు, 7. భగుడు, 
8. వివస్వంతుడు, 9, విష్ణువు, 10. అంశుమంతుడు, 
11. వరుణుడు, 12 మిత్రుడు)

ఏకాక్షర నిఘంటువు - 54



ఏకాక్షర నిఘంటువు - 54




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



ద్యు - దినము, ఆకాశము, ప్రకాశము, స్వరము, అగ్ని

ద్యుత్ - ప్రకాశించు, వెలుగు

ద్యో - ఆకాశము, స్వర్గము

ద్వార్ - ద్వారము, వాకిలి, ఉపాయము

ద్విష్ - విరుద్ధమైన, ఇష్టపడని, శత్రుత్వముకల, శత్రువు
                    ఇష్టపడకుండుట, అసహ్యపడు

ద్విస్ -  రెండు సార్లు

ద్రుహ్ - కీడుచేయు

ద్రా - నిద్రించు, పరుగెత్తు, త్వరపడు

ద్రాక్ - శీఘ్రముగా, వెంటనే

ద్రుహ్ - కీడుచేయు

ధా - పెట్టుట, ఉంచుట, నింపుట, వేయుట, నిలుపుట,
            ప్రసరింపజేయుట, నిర్దేశించుట, ఇచ్చుట, పట్టుకొనుట,
             కట్టుకొనుట, పొందుట, తీసికొనుట, ప్రదర్శించుట,
            ఆధారమగుట, పుట్టించుట, కలుగజేయుట

ధావ్ - పరుగెత్తుట, ముందుకు సాగుట, ప్రవహించుట,
                 ఎగురుట, కడుగుట, శుభ్రముచేయుట,
                 మెఱయునట్లు చేయుట

ధి - సంతోష పెట్టుట, ఆనందింపచేయుట

ధీ - బుద్ధి, ఊహ, ఆశయము, ప్రయోజనము,
          సహజప్రవృత్తి, భక్తి, ప్రార్థన, యజ్ఞము

Thursday, January 26, 2017

ఏకాక్షర నిఘంటువు - 53


ఏకాక్షర నిఘంటువు - 53




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


దో - కోయు, నరకు, చీల్చు

దోస్ - ముంజేయి, భుజము

ధిక్ - అదరించుట, నింద

పౄ - పోషించుట, నింపుట

బ్రూ - మాట్లాడుట

భృ - పోషించుట

మా - కొలుచుట, ధ్వనించుట, 
             చంద్రుడు, శోభ, మేథ

ముహ్ - మోహముచెందుట

మిద్ - కరుగుట

వేం - పాపాలు

వ్య - ఇంద్రియాలు

మై - శరీరము

స్మృ - స్మరించుట

హృ   - తీసికొనిపోవుట, దొంగిలించుట,
                  నాశముచేయుట

రోటికి కట్టె రాఘవుని ద్రౌపది


రోటికి కట్టె రాఘవుని ద్రౌపది




సాహితీమిత్రులారా!


పద్యంలోని ప్రశ్నలన్నిటికి
సమాధానం అందులోనే ఉంటే దాన్ని
అంతర్లాపిక ప్రహేలిక అంటారు.
ఈ క్రింది సమస్యను ప్రహేలికా
పద్ధతిలో పూరించడం జరిగింది
చూడండి-

సమస్య-
రోటికి కట్టె రాఘవుని ద్రౌపది కుండిన పట్టణంబునన్

ఇందులో రోటికి కట్టడం అది రాముని,
కట్టింది ద్రౌపది, ప్రదేశం కుండిన పట్టణం
ఏమిటీ ఇంత అస్తవ్యస్తమైన సమస్య అందుకే
కవి ఇలా పూరించారు -

బోటి యశోద కృష్ణునకు బుద్దులుసెప్పగనేమిచేసె నా
తాటకి తాకెనెవ్వని నుకవ్రత ఏవుర పెండ్లియాడెనె
ప్పాటలగంధి రుక్మికెట భంగమువాటిలె వారిజాక్షుచే
రోటికి కట్టె, రాఘవుని, ద్రౌపది, కుండిన పట్టణంబునన్

ఇందులోని ప్రశ్నలు-

1. యశోద కృష్ణునికి బుద్ధి చెప్పటానికి ఏమి చేసింది?

2. తాటకి ఎవరిని తాకింది యుద్ధంలో ?

3. పొగడదగిన వ్రతం కలిగిన ఏ స్త్రీ ఏవురిని పెండ్లాడింది?

4. రుక్మి(రుక్మిణీదేవి అన్న) ఏ పట్టణంలో భంగపడ్డాడు?


ప్రశ్న - సమాధానాలు

1. యశోద కృష్ణునికి బుద్ధి చెప్పటానికి ఏమి చేసింది?

  - రోటికి కట్టింది

2. తాటకి ఎవరిని తాకింది యుద్ధంలో ?

   - రాఘవుని(రాముని)

3. పొగడదగిన వ్రతం కలిగిన ఏ స్త్రీ ఏవురిని పెండ్లాడింది?

   - ద్రౌపది

4. రుక్మి(రుక్మిణీదేవి అన్న) ఏ పట్టణంలో భంగపడ్డాడు?

   - కుండిన పట్టణంలో

ఈ విధంగా ప్రశ్నలు సృష్టించి సమస్యపూరించాడు కవిగారు.
పూరించినది - సింహాద్రి శ్రీరంగముగారు.


భారతగణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు


భారతగణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు, దేశప్రజలకు

గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

Wednesday, January 25, 2017

ఏకాక్షర నిఘంటువు - 52


ఏకాక్షర నిఘంటువు - 52




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



దభ్ / దంభ్ - గాయపరచుట, దెబ్బతీయుట, మోసగించుట 

దయ్ - దయచూపుట, ప్రేమించుట, రక్షించుట

దా - ఇచ్చుట, కోయు, నఱకు, సమర్పించు, విడిచిపెట్టు, 
            ఉంచు, నాటు, పెండ్లిచేయు

దివ్ - స్వర్గము, ఆకాశము, దినము, వెలుగు, ప్రకాశించుట, 
               విసరుట, జూదమాడుట, పాచికలు వేయుట, 
               పరిహాసమాడుట, పందెమువేయుట, అమ్ముట, పొగడుట, 
              సంతోషించుట, ఉన్మత్తుడగుట

దిశ్ - దిక్కు, పది, చూపుట, నిర్దేశించుట, ప్రదర్శించుట,  
              అప్పగించుట, ఇచ్చుట, అంగీకరించుట, ఆజ్ఞాపించుట, 
              అనుమతించుట

దిహ్ - పూయుట, రుద్దుట, వ్యాపించుట,
                అపవిత్రముచేయుట


దీక్ష్ - ఆచార నియమముకై పూనుకొనుట


దీప్ - ప్రకాశించుట, వెలుగుట, మండుట, కోపముచే 
                మండిపడుట, ప్రసిద్ధుడగుట

దుః - కాల్చుట, దహించుట, బాధించుట, పీడితుడగుట


దూ - బాధపడుట

దృ - ఆదరించుట, సమ్మానించుట, పూజించుట

దృప్ - ప్రకాశింపచేయు, వెలిగించు, ప్రజ్వలింపచేయు, 
                    గర్వించు, క్రూరుడగు

దే - రక్షించు, పెంచు

దేవ్ - ఆడు, జూదమాడు, దుఃఖించు, ప్రకాశించు

ఖరపదముల్ భజింతురు జగంబున భక్తులు


ఖరపదముల్ భజింతురు జగంబున భక్తులు 




సాహితీమిత్రులారా!



సమస్య -
ఖరపదముల్ భజింతురు జగంబున భక్తులు మోక్షసిద్ధికై


సింహాద్రి శ్రీరంగముగారి పూరణ -

నిరతము సత్యవాక్యముల నేవచియించుచు, ధర్మమార్గమున్
మరువక, జీవహింస యణు మాత్రమొనర్పక, జీవనంబు భం
గురమనియెంచి స్వార్థమును గోరక, అర్మిలి కల్గి, చంద్రశే
ఖరపదముల్ భజింతురు జగంబున భక్తులు  మోక్షసిద్ధికై


ఇందులో ఖరపదముల్(గాడిద పాదాలను)
అది మోక్షసిద్ధికి పట్టు కోవడం అనేది
సరైనదికాదుకదా కవి దాన్ని
చంద్రశేఖరపాదాలుగా
మార్చటంతో అర్థం సిద్ధించింది.

మీరునూ మరో రమ్యమైన భావనతో పూరించి పంపగలరు


Tuesday, January 24, 2017

రణమే శాంతికి సాధనంబనుచు


రణమే శాంతికి సాధనంబనుచు




సాహితీమిత్రులారా!


సమస్య -
రణమే శాంతికి సాధనంబనుచు నారాధింతు మెవ్వేళలన్

బాపట్ల వేంకట పార్థసారథి గారి పూరణ -

మణిభూషాంబర వస్తుసంపదలు నీమాయా ప్రపంచంబు నం
దణుమాత్రంబును దృప్తినీయకయె - దుర్వ్యామోహమున్ బెంచు, ర
క్షణ భారంబు వహించు నీశ్వరుఁడు నిష్టార్థంబులన్ గూర్చు కా
రణమే శాంతికి సాధనంబనుచు నారాధింతు మెవ్వేళలన్

దీనిలో కవిగారు రణమే - అనే దాన్ని కారణమే
అని మార్చడం వలన అర్థవంతమైనదిగా మారినది.



మీరును మరోరమ్యమైన భావనతో పూరించి పంపగలరు

ఏకాక్షర నిఘంటువు - 51


ఏకాక్షర నిఘంటువు - 51




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


 - పోవుట, లేపుట, కదలుట, పొందుట, చేరుట,
              కలియుట, గాయపరచు, కొట్టి, ముట్టడించు,
     
ఋచ్ - పొగడుట, కప్పు, ప్రకాశించు, వేదమంత్రము,
                    ఋక్కు, ఋగ్వేదము, ప్రకాశము, స్తుతి, పూజ

ఋచ్ఛ్ - కఠినమగు, పోవు

ఋజ్ - పోవు, పొందుట, నిలచుట, దృఢముగానుండు,
                     సంపాదించు

ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట

కా - మహి, దుర్గ, మాయ

దా - ఓరుపు, ఈవి

ద్రుః - చెట్టు

ద్యుః - ఆకాశము

థమ్ - శిరస్సు, పుణ్యప్రదమూ, నిర్మలమూ అయిన ఒక బీజాక్షరం,
                బ్రహ్మ సాక్షాత్కారం, మోక్షం, గాయత్రీ మంత్రాన్ని జపం
                 చేయడం

ఝీం/ఝీమ్ - బందీదేవి బీజాక్షరం

ధః - దైవతస్వరస్థానము, ఇంద్రుడు, ధ్వని,
            ధ్యానము, కుబేరుడు, ధన్వంతరి, కడవ

ధా / ధీ - బుద్ధి

ధాః - బ్రహ్మ, బృహస్పతి


Monday, January 23, 2017

కుమార సంభవములోని చతుర్విధ కందము


కుమార సంభవములోని చతుర్విధ కందము




సాహితీమిత్రులారా!



నన్నెచోడుని కుమారసంభవములో
12 ఆశ్వాసంలో శివుడు కుమారస్వామికి
జ్ఞానోపదేశం చేసే సందర్భంలో
తెలుగులో మొదటి చతుర్విధకందం
కూర్చబడింది చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్
                                                                   (కుమారసంభవము - 12- 217)

సుజ్ఞానము, యోగము, తత్త్వము అనువాని విధులు తెలిసిన
ప్రాజ్ఞులు సంసారబంధములను త్రెంచుచూ, భువిలో అజ్ఞాన
పదమును పొందక స్థిరబుద్ధితో శివుని కొలిచెదరు - అని భావం

ఈ కందపద్యంలో నాలుగు కందపద్యములను
ఇమిడ్చి కూర్చబడింది.
ఈ విధంగా ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను ఇమిడ్చి వ్రాయటాన్ని గర్భకవిత్వము(పద్యగూఢము) అంటారు.
ఇందులో మొదటి కందము మనం ముందుగా వ్రాసినదే

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్


మరి రెండవ కందము-
రెండవ పాదంలోని మొదటి రెండు
అక్షరాలను విడచి ప్రారంభించిన
రెండవ కందము వస్తుంది
అది ఇక్కడ చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్

రెండవ కందము-
భవబంధనముల ద్రెంచుచు 
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్ 
శివుఁ గొల్తు రచలభావన 
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవిధిజ్ఞుల్

మూడవ కందము మూడవ పాదం
మొదటినుండి ప్రారంభమవుతుంది.
అది ఇక్కడ చూడవచ్చు-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్

మూడవ కందము-
కొలుతురచలభావమునఁబ్రా
జ్ఞులుశివునిన్ యోగతత్త్వసుజ్ఞాననిధి
జ్ఞులుత్రెంచుచు భవబంధన
ములఁ దవులజ్ఞానపదముఁ బొందక భువిలోన్


నాలుగవ కందము నాలుగవ పాదము రెండు
అక్షరాలను విడచి ప్రారంభించ సరిపోవును.
అది ఇక్కడ చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్


నాలుగవ కందము -

శివుఁ గొల్తు రచలభావన 
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవి  ధిజ్ఞుల్ 
భవబంధనముల ద్రెంచుచు 
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్

వీటన్నిలో 1,3 పద్యములకు జ్ఞ - ప్రాస, 2,4 పద్యములకు
వ - ప్రాసగా గూఢపరచబడినది.


ఏకాక్షర నిఘంటువు - 50



ఏకాక్షర నిఘంటువు - 50




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


తు - కాని, అయితేమాత్రము

తుద్ - బాధపెట్టు, గాయపరచు, బాదు, పీడించు

తుల్ - తూచు, ధరించు, ఆలోచించు, ఆధారపడు, పోల్చు,
                   జతచేయు, తక్కువచేయు, పరీక్షించు

తుష్ - సంతుష్టుడగు

తృప్ - తృప్తిపడు, సంతోషించు, సంతోష పెట్టు

తృష్ - దప్పికగొను, దప్పిక, అధికముగా కోరు, పేరాసపడు

త్యజ్ - విడిచి పెట్టు, వదిలించుకొను

త్రప్ - అగుపడు, అవమానపడు

త్రస్ - భయపడు, వణకు

త్రిన్ - ముమ్మారు

త్రుట్ - తెగుట, చిఱుగుట

త్రై - కాపాడు, రక్షించు

త్విష్ - కాంతి, సౌందర్యము

Sunday, January 22, 2017

కంద పద్యంలో పుష్పమాలికా బంధము


కంద పద్యంలో పుష్పమాలికా బంధము




సాహితీమిత్రులారా!

మనం క్రితం స్రగ్ధరలో
పుష్పమాలికా బంధం చూశాము-
ఇక్కడ తెనాలిరామభద్రకవి విరచిత
ఇందుమతీపరిణయము నుండి
కందపద్యంలో పుష్పమాలికాబంధం గమనిద్దాం-

హరధరవరఫణిమణిఘృణి
వరతరధరభావభవయువతిభనిభతి భ
స్థిరతరశరమురహరశర
హరికవిహరిధరవరసురహారజ సుశయా
(ఇందుమతీపరిణయము - 4-255)

ఇందులో పుష్పమాల పైవైపున ముడినుండు
పద్యం ప్రారంభమవుతుందు గమనిచి చూడండి-
హ - అనే వర్ణము ముడులో ఉంది అక్కడినుండి
ఎడమవైపునుండి ప్రారంభమౌతుంది.
ఫణిమణిఘృణి అనేది

      ఫ
ణిఘృ -

ఇలా ఇవ్వడం జరిగింది దీన్ని
ఫణి పైనుండి, మణి - ఎడమనుండి,
ఘృణి - కుడినుండు తీసుకొని చదవాలి
అన్ని గుత్తులవద్ద ఇలాగే తీసుకోవాలి.
పద్యాన్ని గమనిస్తూ బంధంలో చదివితే
సులువుగా తెలుసుకోవచ్చు.


ఏకాక్షర నిఘంటువు - 49


ఏకాక్షర నిఘంటువు - 49




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........




తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగా కొట్టుట,
            మ్రోగించుట, వీణ మొదలైన వాద్యముల
             తీగల మీటుట

తద్ - అది, వాడు, ఆమె, ప్రసిద్ధమైన, అదియే

తన్ - చాచు, విస్తరించు, పొడిగించు, వ్యాపించు,
               మూయు, నింపు, ఉత్పత్తిచేయు, మూలమగు,
               చేయు, నిర్వహించు.

తంత్ర్ - పాలించు, అదుపులో పెట్టు, ఆధారమగు, నిర్వహించు

తత్ - మరియొకటి, హేతువు

తప్ - ప్రకాశించు, వెచ్చగానుండు, బాధను సహించు,
                శరీరమును కృశింపచేయు, తగులబడు

తమ్ - అలయు, బాధనొందు

తర్జ్ - భయపెట్టు, నిందించు

త్వక్ - లవంగచెక్క, జ్ఞానేంద్రియములలో ఒకటి

త్వః - మఱియొకటి

త్విట్ - కాంతి, అగ్ని, జ్వాల

తు - పాదపూరణము, అయ్యేవే, విశేషము, నిశ్చయము,
            మర్యాదచేయుట, కారణము, అభిప్రాయము, నిద్దుర,
            దూరమునుంచి పిలుచుట, వికారము, శుభము, పొర్లాడు

తే - నీచేతను అన్నమాట

తిఙ్ - సహించు, ధైర్యము వహించు



Saturday, January 21, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3




సాహితీమిత్రులారా!

మహాసేనోదయములోని రెండవ ఆశ్వాసములోని
చిత్రకవిత్వము మరికొన్ని అంశాలు -


శబ్దచిత్రము-
అచల జిహ్వ శుద్ధౌష్ఠ్యము - (2- 252)
ఇది పెదిమలు మాత్రమే తగులుతూ నాలుక కదలని పద్యం
ప,ఫ,బ,భ,మ,వ - అనేవి ఓష్ఠ్యములు వీటినిమాత్రమే ఉపయోగించి
పద్యం కూర్చారు

భావభవోపమవామా
భావిభవాబభవభావపాపావిపవీ
భూవిభుబోమావాపా
భావామవిభోపభవప భభవప్రభువా

దీన్ని ఒకసారి పలికి చూడండి
నాలుక కదులుతుందేమో
కదలుదుకదా
అలాగే పెదిమలు తగలకుండా
పలుకగలమేమో చూడండి
పలుకలేము కదా!

ఆకార చిత్రం(బంధకవిత్వం) -

గోమూత్రికాబంధం (2- 253)


సురనరవరపరిపాలా
శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా
హర విధిశర్వాణివినుత యార్యనిధానా

దీనిలో పూర్వర్థము పొడవుగా వ్రాసి
దానిక్రింద ఉత్తరార్థం వ్రాయగా
ఈ విధంగా వస్తుంది-

సురనరవరపరిపాలా శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా

మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా


ఇపుడు ప్రతి పాదములో 2,4,6,8,10,12,14 అక్షరాలను
అంటే సరిసంఖ్యలోని అక్షరాలను గమనిస్తే
రెండింటిలోనూ ఒకే వర్ణం ఉన్నట్లు గమనించగలం.

సురిపాలా   నిధిర్వావిజి శౌర్యవిధానా

రితైలా విధిర్వాణివిను యార్యనిధానా



దీన్ని ఈ క్రిందివిధంగా వ్రాయడం వలన 
గోమూత్రికా బంధమవుతుంది -






ఏకాక్షర నిఘంటువు - 48


ఏకాక్షర నిఘంటువు - 48




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


టంక్ - కట్టు, ముడివేయు, కప్పు, కుట్టు

టీక్ - పోవు వెడలు, టీకా, వివరణ

ఠమ్ - పిల్లనగ్రోవినాదము

డమ్ - యుద్ధము, పోగూడనితావు, పల్లకి, డమరుకమను వాద్యము,
                  వాద్యముఖము, జ్ఞానము

డంబ్ - విసరు, పంపు, ఆజ్ఞాపించు, చూచు

డా - వాక్కు, లజ్జ

డీ - ఎగురు, ఆకాశమున పోవు

ఢౌక్ - పోవు

తక్ష్ - చెక్కు, నఱకు, చీల్చు, ముక్కలు చేయు,
              నిర్మించు,  గాయపఱచు

తంక్ - సహించు, నిరాశతో బ్రతుకు

తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగ కొట్టుట,
               మ్రోగించుట,  వీణాదివాద్యముల తీగెలను మీటుట.

తౄ - ఈదుట, ఎగురుట

త్రప్ - సిగ్గుపడుట

తంక్ - సహించు, నవ్వు, నిరాశతో బ్రతుకు



Friday, January 20, 2017

ముక్తాముక్త ఘనానురాగ (చక్రబంధం)


ముక్తాముక్త ఘనానురాగ (చక్రబంధం)




సాహితీమిత్రులారా!

మన తెలుగులో మొదట చిత్రకవితారచన
చేసిన కవి నన్నెచోడుడు. ఆయన కుమారసంభవం
నుండి చక్రబంధం ఇక్కడ చూడండి-
ఇది మొదటిగా తెలుగులో కూర్చబడిన చక్రబంధం-

కుమారస్వామిని  రాక్షసుల నోడించి లోకమును రక్షించుటకు యువరాజుగా చేసిన సందర్భములో ఈ చక్రబంధం కూరాచడు కవిగారు.

ముక్తా ముక్త ఘనానురాగ, మద సమ్మోదైక సంసేవ్య, సం
త్యక్తా కర్మపద ప్రభేదమతి విద్యా, దేహశోషైకహా,
భక్తాలంబక, మంత్ర తంత్రమయ, సద్భావ స్థితైక స్పృశా,
శాక్తేయా, ముని చింత్యమాన, భరతా సంతాపహా సద్యశా
                      (కుమారసంభవము - 12 - 201)

(ముక్తుల ఎడను అముక్తుల ఎడను గొప్ప అనురాగం గలవాడా,
పరమానందంతో సంసేవింపదగినవాడా, నిష్కర్ములను విడచి
వారి స్థానంలో మిక్కిలి భేదముగల బుద్ధి జ్ఞానములు గలవాడా,
దేహశోషమును, మృత్యువును బోగొట్టువాడా, భక్తులకు
ఆధారభూతుడైన వాడా,  మంత్ర తంత్రములతో నిండినవాడా,
సద్భవములో నుండు వారి  స్పర్శము గలవాడా, కుమారస్వామీ
మునులచే చింతింపదగినవాడా, అతిశయత్వముతోడి సంతాప
మును నశింపచేయువాడా, సత్కీర్తి గలవాడా - అని భావం.)

షడర చక్రబంధము -

ఇది శార్దూల విక్రీడిత వృత్తము.
దిలోని గణాలు - మ-స-జ-స-త-త-గ
ప్రతిపాదంలో 19 అక్షరాలుంటాయి.
చక్రబంధాలు కూర్చే వాటిలో ఇదొక ఛందము.
ఈ చక్రబంధానికి షడర చక్రబంధము అని పేరు.
అంటే చక్రంలో ఆరు ఆకులుంటాయి.
మొత్తం 10 వలయాలుంటాయి.
మూడు. ఆరు వలయాలలో కవిపేరు,
కృతిపేరులు గుప్తపరచబడి ఉంటాయి.
కాని నన్నెచోడుడు కవిపేరు కృతిపేరు గుప్తపరచలేదు.
మొదటి మూడు పాదాలలోను 10వ అక్షరం ఒకటిగానే ఉంటుంది.
దీనిలో - అనే అక్షరం ఉంది. మొదటి మూడు పాదాలు
నిలువు గీతలలోనూ, నాలుగవపాదం ఆవృత్త అక్షరాలుగాను ఉంటాయి.





ఏకాక్షర నిఘంటువు - 47


ఏకాక్షర నిఘంటువు - 47




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



జౄ - వృద్ధుడగుట, శిధిలమగుట, శుష్కించుట,
                నశించుట, జీర్ణమగుట

జ్వర్ - జ్వరము, ఆవేశములచే వేడెక్కుట,
                  జ్వరితుడగుట, రోగియగుట

జ్వల్ - ప్రకాశముతో మండుట, ప్రకాశించుట, తగులబడుట,
                     తగులబెట్టుట, ప్రజ్వలింపచేయుట, వెలిగించుట

జమ్ - పెండ్లాము(ఆలు), మొలనూలు మొదలైన అలంకారము,
                 తేజస్సు, నీరు, పుట్టువు

జః - పరుల సంపదకు ఓర్వలేనివాడు, జయించు
            స్వభావముగల పురుషుడు
జ్ఞ - తెలిసినవాడు, బుద్ధిమంతుడు

జ్ఞః - బ్రహ్మ, పండితుడు, బుధగ్రహము


జ్ఞా - తెలిసికొను, పరిచయము, పొందు, పరిశీలించు, గుర్తించు,
            పరీక్షించు, గౌరవించు, ప్రేరణార్థమున(తెలుపుట, కోరుట,
            వెల్లడించుట, అడుగుట, తెలిసికొనగోరుట)

రుక్ - కాంతి, కిరణము, కోరిక

త్వక్ - చర్మము, నారపట్ట, లవంగపుచెట్టు

న్యఙ్ - నీచమైనది, పల్లమైనది, గుబిలి

ఝః - మదము, బృహస్పతి

ఞః - ఊర్థ్వముఖమైనది, మూఢస్వరూపమయినది,
                భయము, కీర్తి


Thursday, January 19, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3



సాహితీమిత్రులారా!


గర్భకవిత్వము (పద్యగూఢము) -
దేవతలు కైలాసమునకు పోయి శివుని పొగడు
సందర్భములోనిది ఈ గర్భకవిత



ద్విపదమత్తకోకిల దుష్కరప్రసపదనియమ కంద
గర్భితసీసము(2-79)


దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి
రతివిధుత నుతిలోల నరరుదితఘన
చండపవన రాజత్కీర్తి శైలజేశ
శంబరారాతిదోర్గర్వ సాగరౌర్వ 
భువనరక్షణసర్వేశ భూతనాధ

ఈ సీసపద్యంలో
ద్విపద, మత్తకోకిల,
దుష్కరప్రాస పదనియమ కందము అనే మూడు
వేరువేరు ఛందస్సులు
ఈ సీసములో ఇమిడ్చడం జరిగింది
చూడండి-

పై పద్యంలోని గర్భిత పద్యాలు-
ద్విపద-

సీసపద్యానికి 6 సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు
ప్రతిపాదానికి ఉంటాయి
అదే ద్విపదకు ప్రతిపాదానికి
3 సూర్యగణాలు 1 ఇంద్రగణం ఉంటాయి
అంటే సీసపద్యపాదంలో సగం -
3 సూర్యగణాలు 1 ఇంద్రగణం
పై పద్యాన్ని అలా చేస్తే ద్విపదగా
మారుతుంది చూడండి -

గర్భిత ద్విపద-
దాసకామితదాయి దానవదండి 
వాసుకిభూషణా వరశుభ్రదేహ

వాసరాధిపతేజ వాక్పతిసంధ్య 
వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప

కాసరాశ్వ మదోరగద్విజకాంత 
భాసురవైభవా పరసూదనోగ్ర

దోససంఘవిదూర తోయధితూణ 
కేసరివిక్రమా గిరిచాపభృత వి


ఇక  మత్తకోకిల -
సీసపద్యంలోని మొదటి మూడు పాదాలలో
చివరి 6 అక్షరాలను తొలగించాలి
చివరి పాదంలో 7 అక్షరాలను  తొలగించాలి
అపుడు.మత్తకోకిల అవుతుంది- చూడండి -
-

దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి

గర్భిత మత్తకోకిల-

దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా 
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలా
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా 
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా 


కందపద్యం -
సీసపద్యంలో మొదటి మూడు పాదాలలోని
ఆరు ఆరు అక్షరాలు, చివరిపాదంలోని 7 అక్షరాలు,
ఎత్తుగీతి(తేటగీతి)లోనిరెండవ పాదంలోని చివరి
4 అక్షరాలు మినహాయించి తీసుకుంటే సరిపోతుంది.
చూడండి-
మరొకవిషయం అవసరమైన చోట
లఘువులు గురువులుగాను

గురువులు లఘువులుగాను
పరిగణించటం చిత్రకవిత్వంలోని
సంప్రదాయం కావున కందపద్యం
చివర లఘువుగాక గురువుగా తీసుకోవాలి.


దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి
రతివిధుత నుతిలోల నరరుదితఘన
చండపవన రాజత్కీర్తి శైలజేశ
శంబరారాతిదోర్గర్వ సాగరౌర్వ 
భువనరక్షణసర్వేశ భూతనాధ

 గర్భిత కందపద్యం -

వరశుభ్రదేహ భవ శా
ర్ఙ్గిరోప పరసూదనోగ్ర గిరిచాపభృతా 
వి రతివిధుత నుతిలోల న
రరుదితఘన చండపవన రాజత్కీర్తీ




ఏకాక్షర నిఘంటువు - 46


ఏకాక్షర నిఘంటువు - 46




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



ఛద్ - మూయుట, కప్పుట

ఛంద్ - సంతోషపెట్టుట, ఒప్పించు, కప్పివేయు

ఛర్ - క్రక్కు

ఛిద్ - నఱకు, ముక్కలుచేయు, నాశముచేయు, పోగొట్టుట,
               నఱకునది, వేఱుచేయునది, తొలగించునది,
               నశింపచేయునది

జః - జనించుట, పుట్టినది, శంకరుడు, విష్ణువు

జక్ష్ - తినుట, అనుభవించుట, నాశముచేయుట

జన్ - పుట్టుట

జప్ - మంద్రస్వరముతో ఉచ్ఛరించుట, మనసులోనే మాటిమాటికి
               ఉచ్ఛరించుట మంత్రోచ్ఛారణ చేయుట

జి - జయించుట, ఓడించుట

జీవ్ - జీవించుట, పునర్జీవించుట, ఉండుట, వృత్తి నిర్వహించుట

జుష్ - సంతుష్టుడగుట, అనుకూలుడగుట, మిక్కిలి ఇష్టపడుట,
                  అనుభవించుట, పోవుట, నివసించుట,
                 ప్రవేశించుట, ఎన్నుకొనుట, తర్కించు, ఆలోచించు,
                  పరీక్షించు, గాయపరచు, సంతోషించు

జూః -  ఆకాశము, సరస్వతి, పిశాచస్త్రీ, వేగము

జృ - వంచుట, వినీతునిచేయుట, అతిక్రమించుట

జృభ్ - ఆవలించు, తెఱచు, పెంచు, వ్యాపింపచేయు


Wednesday, January 18, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 2


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 2




సాహితీమిత్రులారా!

మహాసేనోదయములోని
రెండవ ఆశ్వాసములోని చిత్రకవిత్వం
ఇక్కడ చూద్దాం -

ఇందులో ఆశ్వాసాంతమున
గర్భకవిత్వం -
ఒకవృత్తములో మరొకవృత్తమును
లేక జాత్యుపజాతుల పద్యములను
ఇమిడించు ప్రక్రియను గర్భకవిత్వము అంటారు.
ఇక్కడ ఒక కందపద్యంనుండి
నాలుగు కందపద్యాలు పొందవచ్చు
అంటే
మొదటి కందపద్యంనుండి
మూడు కందపద్యాలను
మొత్తం నాలుగు కందపద్యాలను
ఒకే కందంలో ఇమిడ్చి వ్రాసినట్లు.
ఇది మన తెలుగులో నన్నెచోడుని
కుమారసంభవము నుండి ప్రారంభమైంది.

చతుర్విధ కందముము- (2-251)

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలో ఇమిడిన కందపద్యాలు
మొదటిది-

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలోని రంగుల ఆధారంగా 
మొదటి గర్భిత కందం గమనించవచ్చు
ఈ విధంగా అమర్చిన పూర్తి కందమవుతుంది


భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా

ఇది పూర్తి కందము

భవహరణ మధురభాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా

రెండవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ మొదటి కందంలో పూర్వార్థము,  ఉత్తరార్థముములలో 
ఉత్తరార్థము పూర్వార్థంగా పూర్వార్థము ఉత్తార్థంగా మార్చిన 
రెండవ గర్భిత కందమగును.

శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా
నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణమధురభాషణనివహా

మూడవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యాన్ని ఈ విధంగా రంగులలో చూపినట్లు 
తీసుకుంటే మూడవ పద్యం వస్తుంది

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా

ఇది మూడవ గర్భితకందము -

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా