Friday, January 31, 2020

అపభ్రంశం(భాష)లోని పద్యాలు


అపభ్రంశం(భాష)లోని పద్యాలు




సాహితీమిత్రులారా!

సంస్కృతం నుంచి వికృతం, భ్రష్టం అయిన శబ్దాలే అపభ్రంశాలు.
అపభ్రంశం విక్రమశకం 6వ శతాబ్దినుంచి 10వ శతాబ్దివరకు 
వికసించిందని భావిస్తున్నారు. ఇది బీహారు, గుజరాత్, వంగ ప్రాంతాల్లో
బాగా పెంపొందింది. 

ఇక్కడ రెండు పద్యాలను గమనిద్దాం.

1. శరహస్తపాదుడు(సరహపా) వ్రాసిన పద్యం(చర్య)

పండిఅ సఅల సత్థ బక్ఖాణ ఇ
దేహహి బుద్ధ బసంత ణ జాణ ఇ
గమణా గమణ ణ తేణ బిఖండిఅ
తోచి ణిలజ్జ భణఇ హ ఉరి, పండి అ

దీని భావం -
పండితుడు సకల శాస్త్రాలను వ్యాఖ్యానిస్తాడు
కాని తన శరీరంలో ఉండే ఆత్మను ఎరుగలేడు.
జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పించుకోలేడు.
అయినప్పటికి సిగ్గు లేకుండా నేను పండితుణ్ణని ఘోషిస్తాడు

2. మంజుని రచనగా చెప్పబడే ప్రబంధచింతామణిలోని దోహా ఉదాహరణకు-

మంజ భణఇ మణాలవఇ జువ్వణ గయుం ణ ఝూరి
జయి సక్కరఖండ మియతో ఇ సమీదీ చూరి

మంజుడు అంటున్నాడు - హే! మృణాలవతి! చేజారిన యౌవనం
గురించి చింతించకు. చక్కెర మరింత పొడిపొడి అయినా
తియ్యదనం ఎక్కడికి పోతుంది?

మంజుని ఈ భావంతో ఏకీభవించని రసికుడు ఉండడు కదా!

ఇదీ మిత్రులారా అప్రభ్రంశం గురించిన కొంత విషయం.

Wednesday, January 29, 2020

తెలుగులో ఏకాక్షరి


తెలుగులో ఏకాక్షరి




సాహితీమిత్రులారా!

ఏకాక్షరి అంటే ఒకే హల్లుతో కూర్చిన పద్యం.
ఇందులో ఏ అచ్చైనా వాడవచ్చు ఎన్ని అచ్చులైనా వాడవచ్చు
కానీ హల్లుమాత్రం ఒకటే వాడాలి.
విక్రాల శేషాచార్యులవారి
శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
ఈ ఉదాహరణ చూడండి-

నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!


దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-

నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా

అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని

Monday, January 27, 2020

ఓష్ఠ్య మరియు అచల జిహ్వ (శబ్దచిత్రం)


ఓష్ఠ్య మరియు అచల జిహ్వ (శబ్దచిత్రం)




సాహితీమిత్రులారా!

పెదిమలు మాత్రమే తగులుతూ నాలుక కదలని పద్యం అంటే
కేవలం ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులను ఉపయోగించి కూర్చినవి. ఈ హల్లులను ఓష్ఠ్యములు అంటాం.  వీటినిమాత్రమే ఉపయోగించి
పద్యం కూర్చారు

భావభవోపమవామా
భావిభవాబభవభావపాపావిపవీ
భూవిభుబోమావాపా
భావామవిభోపభవప భభవప్రభువా
                                              (మహాసేనోదయము - 2-252)

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
                                                        (శ్రీనివాస చిత్రకావ్యం)

వీటిని ఒకసారి పలికి చూడండి
నాలుక కదులుతుందేమో
కదలుదుకదా!
అలాగే పెదిమలు తగలకుండా
పలుకగలమేమో చూడండి
పలుకలేము కదా!

Saturday, January 25, 2020

పాదభ్రమకం(గతిచిత్రం)


పాదభ్రమకం(గతిచిత్రం)




సాహితీమిత్రులారా!

గతి అంటే నడక.
గతిచిత్రమంటే నడకలో ప్రత్యేకత కలిగినది.
అంటే ముందు నుండి వెనుకకు చదివినా ఒకలాగే
ఉండటం  ప్రత్యేకం కాదా
అట్లా ప్రత్యేక నడకలు కలిగిన కవిత్వం
చిత్రకవిత్వంలో ఒక భాగం
దాన్నే గతిచిత్రమంటాం
వీటిలో కొన్ని పద్యాలలో ప్రతిపాదం ముందుకు
వెనుకకు ఎలాచదివినా ఒకలాగే ఉంటాయి
అలాంటిదాన్ని పాదభ్రమకం అంటాం.
ఇక్కడ అలాంటి పద్యం ఒకదాన్ని చూద్దాం -

వందే2మందదమం దేవం
దంభితామమతాభిదం
సదాభీమమభీదాస
మంగలంబి బిలంగమమ్
                                               (కవికల్పతరు)
ఇది శివ ప్రార్థన శ్లోకం-
కఠోరమైన దండనము గలవాడును, గర్వమును అహంకారమును జయించినవాడును, ఎల్లపుడు భయంకరుడును, భయములేని నౌకరులతో కూడినవాడును, చేతులకును కాళ్లకును వ్రేలాడుచున్న సర్పములుకలవాడును అగు ఈశ్వరునకు నమస్కరించుచున్నాను - అని భావం.

ఈ పద్యంలో ప్రతిపాదం ముందు(మొదట) నుండి చివరకు
చివరనుండి మొదటికి చదివినా ఒకలాగే వుంది గమనించండి-

వందే2మందదమం దేవం
దంభితామమతాభిదం
సదాభీమమభీదాస
మంగలంబి బిలంగమమ్

Thursday, January 23, 2020

తెలుగులో త్య్రక్షరి


తెలుగులో త్య్రక్షరి




సాహితీమిత్రులారా!

మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర,  త్య్రక్షర - పద్యాలున్నాయి
వాటిలో త్య్రక్షర కందం చూడండి-
ద,న,వ- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దానవవనదవవనదా
నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా
నానుదు నెద నీదువాదు నాదవినోదా (2-14)

Tuesday, January 21, 2020

తెలుగులో పంచాక్షరి


తెలుగులో పంచాక్షరి




సాహితీమిత్రులారా!

మనం
ఒకే హల్లుతో కూర్చిన పద్యం ఏకాక్షరి,
రెండు హల్లులతో కూర్చబడిన పద్యం ద్వ్యక్షరి,
మూడు హల్లులతో కూర్చబడినది త్య్రక్షరి,
నాలుగు హల్లులతో కూర్చబడినది చతురక్షరి,
ఐదు హల్లులతో కూర్చినది పంచాక్షరి
ఇలా వింటుంటాం కాని వాటిని చూచి ఉండం కదా!

ఇక్కడ మనం కేవలం 5 హల్లులతో కూర్చబడిన పద్యం
మన తెలుగు కవులు నంది మల్లయ- ఘంట సింగయ.
వీరే మన తెలుగులో మొదటి జంటకవులు వీరు వ్రాసిన
వరాహపురాణంలో కూర్చిన పద్యం చూడండి-

పంచాక్షరి-
నమశ్శివాయ పంచాక్షరీ సీసము
ఇందులో న-మ-శ-వ-య - అనే
హల్లులను ఉపయోగించి కూర్చబడినది.

యమ నియమాయామ శమనివేశన మనో
                    మౌనివశ్యాయ నమశ్శివాయ
యానాయమాన నానా యన నవనవా
                    మ్నాయమ యామ నమశ్శివాయ
వనయోని యామినీ వమేశ శశ్యంశు
                   మన్నయనాయ నమశ్శివాయ
వ్యోమానుయాయి మా యామానవాశన
                   మాననాశాయ నమశ్శివాయ
యని వినయమున ముని యనయమును విశ్వ
మను వనమ్మున నెమ్మినై నున్న నన్ను
నెమ్మనమ్మున నమ్మిన నెమ్మినేను
నోము నీశాన యిమ్మన్నదేమి యనిన
                                                           (వరాహపురాణము - 10 - 56)

దీనిలో గీతపద్యం చివరిపాదంలో (దే) అన్నది తప్ప
మిగిలిన పద్యమంతా పంచాక్షరాలతోటే సాగింది.
మీరును గమనించండి.

Sunday, January 19, 2020

కందగర్భితగీతము

కందగర్భితగీతము




సాహితీమిత్రులారా!

కందపద్యం వ్రాస్తే కందం,
తేటగీతి వ్రాస్తే తేటగీతి ఉంటాయి.
కానీ రెంటిని ఒక దానిలో ఇమిడ్చితే
దాన్ని గర్భకవిత్వమంటారు.
అంటే రెండు పద్యాల లక్షణాలతో
ఒకపద్యంలోనే రెండు పద్యాలుంటాయి.
అలాంటిది ఇక్కడ ఒకటి గమనిద్దాం.
మఱింగంటి జగన్నాథాచార్యులువారు కూర్చిన
శ్రీరంగనాథవిలాసములోనిది ఈ పద్యం-

తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

ఇది తేటగీతి పద్యం ఇందులో కందపద్యం ఇమిడి వుంది.
తేటగీతిలో ప్రతిపాదానికి -
ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉండాలి
పై పద్యంలో అలాగే ఉన్నాయి.
మరి కందపద్యానికి  మొదటి రెండుపాదాలు మొత్తం 8 గణాలు
చివరి రెండుపాదాలు మొత్తం 8 గణాలు. వీటిలో గగ, భ,జ,స,నల - అనే గణాలనే వాడాలి. అయితే 1,3,5,7 గణాలలో జ- గణం వాడరాదు. 6వ గణంలో జ గాని, నల గాని వాడాలి. 8వ గణంలో
గగ/స - గణాలు వాడాలి. ఈ గణాలన్నీ తేటగీతిలో కూడా ఉండేలా
కూర్చిన పద్యం పై పద్యం.
ఇక్కడ పై పద్యంలోని కందపద్యం -


తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

తరళ నయనాంబురుహ దిన
కరనుత హరి శంఖచక్రకర జగదీశా! 
నిరుపమ కనకమయవసన 
ధరణి దనుజహరణ పరమధామవిహారా!

ఇంతవరకే కందపద్యం సరిపోయింది.
కృపాసముద్ర - అనే పదం కందపద్యానికి అవసరంలేదు.
ఇప్పుడు గమనిస్తే తేటగీతిలో కందపద్యం ఇమిడి ఉన్నదికదా
దీన్నే గర్భచిత్రం అంటాము.