Sunday, January 19, 2020

కందగర్భితగీతము

కందగర్భితగీతము




సాహితీమిత్రులారా!

కందపద్యం వ్రాస్తే కందం,
తేటగీతి వ్రాస్తే తేటగీతి ఉంటాయి.
కానీ రెంటిని ఒక దానిలో ఇమిడ్చితే
దాన్ని గర్భకవిత్వమంటారు.
అంటే రెండు పద్యాల లక్షణాలతో
ఒకపద్యంలోనే రెండు పద్యాలుంటాయి.
అలాంటిది ఇక్కడ ఒకటి గమనిద్దాం.
మఱింగంటి జగన్నాథాచార్యులువారు కూర్చిన
శ్రీరంగనాథవిలాసములోనిది ఈ పద్యం-

తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

ఇది తేటగీతి పద్యం ఇందులో కందపద్యం ఇమిడి వుంది.
తేటగీతిలో ప్రతిపాదానికి -
ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉండాలి
పై పద్యంలో అలాగే ఉన్నాయి.
మరి కందపద్యానికి  మొదటి రెండుపాదాలు మొత్తం 8 గణాలు
చివరి రెండుపాదాలు మొత్తం 8 గణాలు. వీటిలో గగ, ,జ,,నల - అనే గణాలనే వాడాలి. అయితే 1,3,5,7 గణాలలో జ- గణం వాడరాదు. 6వ గణంలో జ గాని, నల గాని వాడాలి. 8వ గణంలో
గగ/స - గణాలు వాడాలి. ఈ గణాలన్నీ తేటగీతిలో కూడా ఉండేలా
కూర్చిన పద్యం పై పద్యం.
ఇక్కడ పై పద్యంలోని కందపద్యం -


తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

తరళ నయనాంబురుహ దిన
కరనుత హరి శంఖచక్రకర జగదీశా! 
నిరుపమ కనకమయవసన 
ధరణి దనుజహరణ పరమధామవిహారా!

ఇంతవరకే కందపద్యం సరిపోయింది.
కృపాసముద్ర - అనే పదం కందపద్యానికి అవసరంలేదు.
ఇప్పుడు గమనిస్తే తేటగీతిలో కందపద్యం ఇమిడి ఉన్నదికదా
దీన్నే గర్భచిత్రం అంటాము.


No comments: