Sunday, January 15, 2023

ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం: ముద్రాలంకారాలు

 ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం:  ముద్రాలంకారాలు

          



సాహితీమిత్రులారా!



ప్రబంధరాజంలో ముద్రాలంకార చమత్కారవిశేషాలు వివిధ పద్యాలలో

దర్శనమిస్తాయి. ప్రస్తుతార్థాన్ని  ఇచ్చే  పదంచేత సూచ్యార్థ సూచనం  ఉంటే  ముద్రాలం కారం.

సూచ్యార్థం అంటే సూచింప దలచిన అర్థం.

1.అర్ణవ దండకం: ప్ర.రా.వేం.వి.విలాసంలో 148వ పద్యం

అర్ణవదండకం.ఈదండకంలో శ్రీవేంకటే శ్వర స్వామివారు 

"సంసార ఘోరార్ణవో త్తారణా" అని స్తుతించబడినాడు.  

ఈ దండకం పేరు _అర్ణవ_దండకం.దండక భేదం పేరును సూచ్యార్థంగా ప్రయోగిం

చినాడుకవిగారు,కనుక ఇది ముద్రాలంకారం.

2.మత్తేభవిక్రీడిత:  జలక్రీడాభివర్ణన సందర్భంగ కవిగారు--

మ.వనజాతాక్షియురోజకుంభములతో వర్తించురోమావళీ

   ఘన హస్తస్థితిలో గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోcగ జా

   ఱిన గస్తూరిమదంబుతోcదళుకుమీ ఱెన్ హార పద్మాభతో

   మనముప్పొంగcగడిగ్గెcదత్సరసికిన్ మత్తేభవిక్రీడితన్

మత్తేభవిక్రీడిత పద్యంలో హృద్యంగాసూచ్యార్థం చేయడం ముద్రాలంకారం.

3.వనమయూర:

అబలలకు తలవెంట్రుకలు జారి కటిసీమను కప్పివేసినవి జలకేళిలో

వనమయూరాల వలె తాండవం చేస్తున్నారని ముద్రాలంకారంగా 'వనమయూర'  వృత్తంలో వర్ణించినారు కవిగారు, కవిగారు----

వనమయూర వృత్తం:

చండగతి పెన్నెఱులు- జారి కటిసీమన్

మెండుకొని గప్ప కడు- మీఱి జలకేళిన్

దాండవము సల్పెడు వి-ధంబునను నీటై

యుండి రబలల్  వనమయూరముల  రీతిన్

4.ఉత్పలమాల:

  ఉ.ఏమని యెంచవచ్చుc బ్రస- వేషు శరాసన తాపవేదనన్

     వేమఱుcగుందుచో సఖులు-వేగ బ్రఫుల్ల సరోజమాలికా

    స్తోమము మేనcదాల్ప నవి- తోడనె కంది విచిత్ర భంగియై

    భామ యురోజసీమc గను- పట్టెను నుత్పలమాలికా కృతిన్

             భామలపై మన్మథుడు పూల బాణాలు వేసినాడు. అవి సరోజమాలి కలవలె ఆమె మేన ఉన్నాయి. అయితే అవి  కందిపోయి  "ఉత్పలమాల" ఆకృ కృతిలో కనిపించినవి. ఉత్పలమాలిక

పద్యంలో ఉత్పలమాలాకృతి చెప్పడం సూచ్యార్థం,కనుక ఇదిముద్రాలంకారం.

5.మానినీ

    నిబ్బరమైనది నెక్కొను వేదన- నిల్పదలంపుచు నేర్పులచే

    నబ్బురమంద రయానకొనర్చిన- వన్నియు నిష్ఫల మౌచును బో

    నుబ్బిన కాcకకు నోర్వక ఱెప్పల- బొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్

    గబ్బి సఖుల్ తటకాపడి మానిని గన్గొని పల్కిరి కర్జముగాన్

ఒక మానిని వేదనను నిల్పుచేయాలని ఆమె సఖులు  ప్రయత్నించినారు. ఈ

విషయాన్ని   _మానిని_   వృత్తంలో చెప్పడం ముద్రాలంకారం.

6.మత్తకోకిల:

 కాంతలు శోభనగాథలను మత్తకోకిల రీతులుగా అందరూ జతగూడి పాడి నారని మత్తకోకిల పద్యంలో చెప్పట

ముద్రాలంకారం.ఆ పద్యం -----

మత్తకోకిల

గానవైఖరినందు కొందరు- కాంత లయ్యెడc జేరి సో

బానయంచొక పాటcబాడగ- బాడినంతనె వింతయై

గానుపింపcగc బూర్వశోభన  గాథలెల్లను మీఱcగా

మానినుల్ కవగూడి పాడిరి- మత్తకోకిల రీతులన్

7.ఆటవెలది  

వింగళించి"యాటవెలcది" చందంబున

కోపులందుమీఱి యేపుతోన

మిత్రగణములతి విచిత్రతంబై కొన

దైవగణము లెదురcదారసించె.

ఆటవెలది అని పద్యం పేరునుపేర్కొన డమే కాక మిత్రగణాలు,దైవగణాలూ

పేర్కోవడం చిత్రం. 

8.భాస్కరవిలసిత :

పంకజదళనిభలోచన- శంకాభావమునిహృదయ- సతతవిహారా

కుంకుమ మృగమద సాంకవ- పంకోరస్థలకృతపద- వననిధి కన్యా

లంకృత మణిగణభూషణ- యం కీకృతమృదుగతిమరు- దసితశరీరా

వేంకటగిరివర రుచ్య క- లంకా భాస్కరవిలసితలగదరి హస్తా

పై పద్యంలోరెండు కందపద్యాలుకూడ గర్భితం.పద్యనామం నాలుగవపాదం

చివరన ఉంది,ముద్రాలంకారం. చమత్కారంగ పద్యనామం  కూడ   వర్ణిత  భావంలో   పొదగడం 

ముద్రాలంకారం.ఇదొక చిత్రకవితా  విశేషంగ కూడ పండితవర్య కథనం.

ప్ర.రా.వేం.వి.విలాసంలో ఎనిమిది ముద్రాలంకారాలు ఉన్నాయి.

                      

వైద్యంవేంకటేశ్వరాచార్యులు సౌజన్యంతో

Friday, January 13, 2023

బమ్మెరపోతన భాగవతం- అలంకార సౌందర్యం శ్లేషాలంకారం

  బమ్మెరపోతన భాగవతం-

అలంకార సౌందర్యం శ్లేషాలంకారం





సాహిమిత్రులారా!



కేవలం ప్రకృతాలకుకానీ,కేవలం అప్రకృతాలకుకానీ

శబ్దమాత్ర సామ్యం ఉంటే శ్లేష అంటారు.

పోతన భాగవతంలో  శ్లేష  అద్భుతమైన రూపాలలో దర్శన మిస్తోంది.

సంస్కృతంలోని కాదంబరీ గద్యలోని శ్లేషను పోలిన

గద్యను   బమ్మెరవారు  నైమిశారణ్య   వర్ణనసందర్భాన హృద్యంగా రచించినారు.

                       నైమిశారణ్యవర్ణనము

వ.మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ మహితంబై.

అర్థం:

      1.మధువనే రాక్షసుడిని చంపిన విష్ణువు యొక్క మందిరంలా మాధవి(లక్ష్మితో)మన్మథునితో ఉంది నైమిశం.

      2.మాధవి అంటే గురివిందచెట్టు,మన్మథ అంటే వెలగ

చెట్టు-ఈ చెట్లుకలిగి ఉంది నైమిశం.

వ.బ్రహ్మగేహంబునుంబోలె శారదాన్వితంబై

అర్థ:

      1.బ్రహ్మదేవుని సత్యలోకంలా సరస్వతిదేవితో కూడు కున్న దై.

      2.శారదాన్వితంబై, శారదా=ఏడాకుల అరటిచెట్టు,పచ్చపెసర.

వ.నీలగళసభా నికేతనంబునుంబోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై

అర్థం:

     1.నల్లని కంఠంగల మహేశ్వరుని సభామండపంవలె

వహ్ని=అగ్ని,వరుణ=వరుణుడు,సమీర=వాయువు,చంద్ర=

చంద్రుడు,రుద్ర=ఏకాదశరుద్రులు,హైమవతీ=పార్వతి,కుబేర=కుబేరుడు,వృషభ=నంది,గాలవ=గాలవుడు,శాండిల్య=శాండిల్యుడు,పాశుపత=పాశుపతదీక్షపొందినవారు,జడ=జడలు  పెంచినవారి,  పటల=గుంపులతో, మండితంబై=ప్రకా శించినదై. 2.వహ్ని=చిత్రమూలం,వరుణ=ఉలిమిరిచెట్టు,సమీరణ=మరువం,చంద్ర=పెద్ద ఏలకి,రుద్ర=రుద్రాక్ష,హైమవతి=తెల్లవస(కరకచెట్టు),కుబేర=నందివృక్ష,వృషభ=అడ్డసర,గాలవ=లొద్దుగచెట్టు,శాండిల్య=మారేడుచెట్టు,పాశుపత=శ్రీవల్లి,జటి=జడలతీగెల,పటల=సమూహంతో,మండితంబు ప్రకాశిస్తోంది.

వ.బలభేది భవనంబునుంబోలె నైరావతామృత రంభాగణికాభి రామంబై

అర్థం: బలభేదివనంబునుంబోలె- దేవేంద్రుని సౌధంవలె                

 1.ఐరావత=ఐరావతమనే ఏనుగుతో, అమృత=సుధతో, రంభా=రంభ మొదలయిన,గణిక=(దేవ) వేశ్యలతో, అభిరా మంబై=మనోహరమై.                                       2.ఐరావత=నారింజ,అమృత=ఉసిరిక,రంభ=అరటి,గణిక=అడవిమొల్ల,మొదలైనవాటితో మనోహరమై.  

వ. మురాసుర నిలయంబునుంబోలె నున్మత్త రాక్షసవంశ సంకులంబై

అర్థం:                                                  

 1.మురాసురు డనే రాక్షసంని నివాసంవలె--  ఉన్మత్త=బాగామదించిన,రాక్షస=రక్కసుల,వంశ=కులంతో,సంకులంబై=కూడినదై.                            2.ఉన్మత్త=ఉమ్మెత్త,రాక్షస=నల్లకచోర,వంశ=వెదురు మొదలైనవాటితో కూడినదై.  

వ.ధనదాగారంబునుంబోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై

అర్థం:

1.ధనదాగారంబునుంబోలె=కుబేరుని నిలయంలా--

   శంఖ,పద్మ,కుంద,ముకుందమొదలయిన నవనిధులతో మనోహరమై,                                     2.శంఖ=బోరపుష్పి,పద్మ=తామర,కుంద=మొల్ల,ముకుంద=కుందురుష్కమనే గంధపుచెట్లతో సుందరంగా ఉన్నదై.

వ.రఘురామ యుద్ధంబునుంబోలె నిరంతర శరానల శిఖా బహుళంబై

అర్థం:                                              

1.రామచంద్రుని యుద్ధంలా-- 

శర=బాణాలయొక్క,అనలశిఖా=అగ్నిజ్వాలలతో,బహుళంబై

2.శర=రెల్లు,అనలశిఖా=శక్రపుష్పిఅనేవాటితోనిండినదై.

వ.పరశురాము భండనంబునుంబోలె నర్జనోద్భేదంబై

అర్థం:భార్గవరాముని యుద్ధభూమిలా-

 1.అర్జునోద్భేదనంబై=కార్తవీర్యార్జునుని చీల్చినదై,          

 2.కార్తవీర్యార్జునోద్భేదనంబై=భూమిని చీల్చుకుంటూవచ్చే పొదలు కలదై.   

వ.దానవ సంగ్రామంబునుంబోలె నరిష్ట జంబ నికుంభ శక్తి యక్తంబై.

అర్థం:  రాక్షసయుద్ధంలా-                                     

 1.అరిష్ట=అరిష్టుని,జంభ=జంభుని,నికుంభ=నికుంభుని,  శక్తియుక్తంబై=శక్తులతో కూడుకున్నదై.            2.అరిష్ట=వేము,కుంకుడు,జంభ=నిమ్మ,నికుంభ=దంతిట్టు     శక్తులతో. 

వ.కౌరవ సంగరంబునుంబోలె ద్రో ణార్జునకాంచనస్యందన కదంబ సమేతంబై

అర్థం: కౌరవ(కురుక్షేత్ర) యుద్ధంలా-

1ద్రోణ,అర్జున,కాంచనరథాల సమూహంతో కూడినదై.

2.ద్రోణ=తుమ్మిచెట్టు,అర్జున=ఏఱుమద్దిచెట్టు,కాంచన=సంపెంగ,స్యందన=తినాసవృక్ష,కదంబ=కడిమిచెట్టు మొదలైన

వాటితో కూడుకున్నదై.

వ.కర్ణు కలహంబునుంబోలె మహోన్నత శల్య సహకా రంబై

అర్థం: కర్ణుని కయ్యంలా-

 1.గొప్పవాడైన శల్యుని సహకారం కలిగినదై.

 2.మహోన్నతశల్య=పెద్దమంగచెట్లూ,సహకారంబై=తియ్య

   మామిడిచెట్లూ కలదై.

వ.సముద్ర సేతుబంధనంబునుంబోలె నల నీల పన సా ద్యద్రి ప్రదీపోతంబై

అర్థం:రామసేతువులా-

1.నలుడు,నీలుడు,పనసుడు మొదలైనవారుతెచ్చిన  కొండ లచే ప్రకాశించేది.

2.నల=వట్టివేరు,నీల=నీలిచెట్టు,పనస=పనసచెట్టు,కొండలు

    మొదలైనవి ప్రకాశిస్తున్నదై.

వ.భర్గు భజనంబునుంబోలె నానాశోక లేఖా ఫలితంబై

అర్థం:                                           

1.ఈశ్వరునిగురించి చేసే భజనలా-                     

అశోక=నాశన(దుఃఖ)రహితమైన,నానా= అనేక,లేఖాఫలితంబై=అక్షర ఫలాలు కలదై.

2.నానా అశోక.... =అనేక ఫలాలుగల అశోక వృక్షాల వరుసలు కలదై.

వ.మరుని కోదండంబునుంబోలె బున్నాగ శిలీముఖ భూషితంబై

అర్థం:                                                                       

1.మన్మథుని విల్లువలె పున్నాగ పుష్పబాణాలు కలదై

2.చెఱకు,తుమ్మెదలతో ఉన్నదై.

       భాగవతంలో శ్లేషాలంకారయుక్తమైన పద్యాలుకూడా

పోతనగారు అక్కడక్కడా మెరుపులా హృద్యంగా దర్శింప

జేసినారు.మచ్చునకు-

        సీ. పున్నాగ!కానవే- పున్నాగ వందితు,

              తిలకంబ!కానవే- తిలక నిటలు,

            ఘనసార!కానవే-ఘనసార శోభితు,

               బంధూక!కానవే-బంధు మిత్రు,

             మన్మథ!కానవే-మన్మథాకారుని,

               వంశంబ!కానవే-వంశధరుని,

              చందన!కానవే-చందన శీతలు,

                కుందంబ!కానవే-కుంద రదను,

          తే. ఇంద్రభూజమ!కానవే-ఇంద్ర విభవు,

              కువలవృక్షమ!కానవే-కువల యేశు,

              ప్రియక పాదప!కానవే-ప్రియ విహారు,

              అనుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.

                                                -౧౦పూ,౧౦౦౯

గోపకాంతలు వనంలో శ్రీకృష్ణుని  వెదకుతూ   ఆయా  వృక్షా

లను కృష్ణసంబంధితమైన పదాలతో సంబోధిస్తారు. ఇదీ ఈ

పద్యంలోని హృద్యమైన చమత్కార శ్లేష.

  పున్నాగశబ్దానికి పున్నాగవృక్షమనీ,పురుష పుంగవుడనీ

వేరు వేరు అర్థాలు ఉన్నాయి.అలాగే తిలక , ఘనసార , బం

ధూక , మన్మథ , వంశ , చందన , కుంద , ఇంద్ర , కువల ,

ప్రియక  అనే పదాలు ఆయా వృక్షాలకుగల పేర్లు. వరుసగా

ఫాలతిలకం,పరాక్రమం,సద్బంధుడు,మన్మథాకారత్వం,వేణువు,గంధం, మొగ్గలవంటి దంతసౌందర్యం,ఇంద్రవైభవం,ధరాధి

నాథత్వం, ప్రియవిహారం-అనే విశేషణాలు వాటికిగల రెండవ

అర్థాలు.

       ఈ శ్లేష చేత శ్రీకృష్ణుని రూపగుణ లావణ్య విశేషాలను

వర్ణిస్తూ  ఆయా  వృక్షాలను కృష్ణునికోసం ఆరా తీశారు గోప

కాంతలు.ఇది గోపికలకు వృక్షాలతోగల సాహచర్యంతోపాటు,

వారికి శ్రీకృష్ణునిపైగల ప్రేమనూ సువ్యక్తం చేస్తోంది. ఇదొక

మధురానుభూతిని కలిగించే అందమైన శ్లేష. ఈ శ్లేషలో

పోతన్నగారి ఈ పద్యకృతిలో హృద్యచమత్కృతి కన్పిస్తాయి.

వైద్యంవారి సౌజన్యంతో....

Wednesday, January 11, 2023

ద్విపద కందగుప్తం

    ద్విపద కందగుప్తం

         



సాహితీమిత్రాలారా!



కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను  

ద్విపదకందగుప్తం అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది. 

          ఈ  కింది కంద ద్విపద గణాది లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే 

ద్విపద కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది.


క.కలువలదొర మానికముల

   దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్

   గల తరగల పాలకడలి

   చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్.

పై కందంలో గుప్తమైన

ద్విపద:

కలువలదొరమాని-కములదళంపు

తళుకులనెపుడును-దగ లో గొనగను

గల తరగల పాల-కడలి చెలంగు

చెలువుని నిను గొలి-చెదలోకమునన

     పై పద్యం గణపవరం వేంకటకవి రచించిన 

"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది.

                         

వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో

Monday, January 9, 2023

చమత్కార పద్యం

 చమత్కార పద్యం





సాహితీమిత్రులారా!



దురాశా దుర్దశా చేతి ద్వే భార్యే మే పతివ్రతే

దురాశా పురతోయాతి, దుర్దశా మాం న ముంచతి.

ఒక వ్యక్తి తన మిత్రుడితో దిగులుగా  యిలా అంటున్నాడు. 

మిత్రమా! నాకు యిద్దరు భార్యలోయ్ అని.

అయితే ఇంకేమి యిద్దరి పెళ్లాలతో హాయిగా వుండవచ్చు గదా! అన్నాడు ఆ మిత్రుడు.

వారిద్దరూ పతివ్రతలే.నోయీ. అన్నాడు మొదటివాడు. ఇంకా మంచిది. నిన్నుతప్ప 

మరెవ్వరి గురించీ ఆలోచించరు కదా! అదృష్ట వంతుడివి. మిత్రుడి కితాబు.

ఒకరు ముందు నడుస్తున్నారు. అన్నాడు మొదటివాడు.అంటే 

నీకు కష్టం కలుగకుండా దారిలో ముళ్ళూ అవీ లేకుండా దారి  శుభ్రం చేస్తుందన్నమాట. 

మిత్రుని స్వా౦ తనం.

రెండోభార్య నన్ను వదిలి పెట్టదు. అంటే నీవెంటే ఉంటుందన్నమాట మరీ మంచిదికదా

ఇంతకీ నీ బాధేమిటి?వాళ్లెవరు?వారి పేర్లేమిటి? మిత్రుడడిగాడు.

ఒకామె దురాశ,రెండో భార్య దుర్దశ. దురాశ ఎప్పుడూ నాకన్నా ముందు వెళుతూ వుంటుంది. 

దుర్దశ నన్ను వెన్నంటే 

వుంటూంది. అదీ అతగాడి బాధ. దురాశ ఉన్నవాడిని దుర్దశ వదలదు. అనేదే ఇందులో చమత్కారం. ఆశ మనిషికి 

అవసరమే కానీ దురాశ పనికి రాదు. లభించిన దానితో తృప్తి పడాలి. అంతే కానీ  

యింకా ఎక్కువ కావాలనుకుంటే మిగిలేది దుర్దశే అని చమత్కారంగా చెప్తున్నాడు కవి 

ముఖపుస్తకం నుండి.....

Friday, January 6, 2023

సెల్లుతల్లి

 సెల్లుతల్లి




సాహితీమిత్రులారా!



ఈనాడు మన సెల్లు ఉపయోగం

గురించి ఒక కవి కూర్చిన గేయం గమనించండి-


            అక్షర సరస్వతీ!

                శబ్దభారతీ!!

                     వాగ్దేవీ!

       ఒకప్పుడు నీనిలయం మస్తకం

        ఒకప్పుడు నీనిలయం పుస్తకం,

         తల్లే!ఇపుడు నీ నిలయం సెల్లే,

                అక్షరనిలయం సెల్లే,

                  శబ్దనిలయం సెల్లే!

                         అందుకే

          _తల్లీ!నిన్నుదలంచి పుస్తకము_

                    _చేతంబూనితిన్_

                   అనేవాళ్లం ఇప్పుడు,

      సెల్లూ! నిన్నుదలంచి ఎల్లపుడు నా

             చేతం దాల్చితిన్ నీవు నా       

    యుల్లంబందున నిల్చి జృంభణముగా

            ఉక్తుల్ సుశబ్దాలు శో

    భిల్లంబల్కుము సెల్లుతల్లి! నినునే

               ప్రీతిన్ కరంబందున్ 

   ఫుల్లాబ్జాక్షి! ధరించి మ్రొక్కెదను సం

            ప్రీతిన్, జగన్మోహినీ!!

                   అంటున్నాం

                   జై సెల్లు తల్లీ!

                   జైజై సెల్లుతల్లీ!!

సాహిత్యసంస్థానాలు ముఖపుస్తకం నుండి-

Wednesday, January 4, 2023

మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే

 మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే




సాహితీమిత్రులారా!

మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే

అనే వ్యాసాన్ని శ్రీమాన్ వైద్యం వేంకటెశ్వరాచార్యులు

కూర్చారు దాన్ని ఇక్కడ ఆస్వాదించండి-



Monday, January 2, 2023

చతురంగ బంధం (తమిళ్)

 చతురంగ బంధం (తమిళ్)




సాహితీమిత్రులారా!

తమిళంలోని చతురంగ బంధం

ఆస్వాదించండి-