Monday, January 8, 2018

అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం


అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం




సాహితీమిత్రులారా!



ప్రశ్నోత్తర చిత్రంలో
అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం
అనే దానికి ఇక్కడ ఉదాహరణగా
అడుసుమిల్లి నారాయణరావుగారి
నారాయణీం నుండి చూద్గాం-

సూర్యభగవాను పట్టపు భార్య యెవతె?
నీతిలేని యుద్యోగి చింతించు నెద్ది?
బాటనెదిగోరి వృక్షముల్ నాటుచుంద్రు?
దాని చాయ యటన్న ఉత్తరము గాదె

దీనిలోని ప్రశ్నలన్నిటికి సమాధానం ఒకటే
అది కూడ నాలుగవపాదంలో ఇచ్చాడు
అందువల్ల దీన్ని అంతర్లాపిక పద్ధతి అని
చెప్పవచ్చి.

సమాధానం - చాయ

సూర్యని భార్య యెవతె - చాయ
నీతిలేని ఉద్యోగి చింతించు నెద్ది - చాయ
బాటనెదిగోరి వృక్షముల్ నాటుచుంద్రు - చాయ

Sunday, January 7, 2018

షోడశముఖీ కందము


షోడశముఖీ కందము




సాహితీమిత్రులారా!

ఒక పద్యంలో ఉన్న ఛందస్సులో
మరోరకం ఛందస్సును లేదా అదే రకానికి
చెందిన అనే పద్యాలు రావటాని వీలుగా
కూర్చబడిన ఛందోచిత్రాలు
వీటినే గర్భకవిత్వమని
గూఢకవిత్వమని అంటాము.
ఇక్కడ ఒక కందపద్యం ఛందస్సులోనే
16 కందపద్యాలు వచ్చేలా కూర్చిన
దాన్ని "షోడశముఖీ కందం" పేరున
తెలుసుకుంటున్నాము.
నాదెళ్ళ పురుషోత్తమకవి రచించిన
అద్భుతోత్తర రామాయణంలోనిది
సప్తమాశ్వాసంలోని 149వ పద్యం-

ధరజవు తరుచవు తఱుటను
దఱుగను దఱిగొన దఱికను తఱుగను దరుగన్
ధరజను దరిగొన దరమును
దరమును దఱుమను దఱియను దఱలును ద్వరగన్

దీనిలో ప్రతిగణం ఒక పద్య మొదలౌతుంది.
ఇందులో 16 గణాలున్నాయి. 16 కందపద్యాలు
అవుతున్నాయి.  గమనించండి.

1ధరజవు 2తరుచవు 3తఱుటను
4దఱుగను 5దఱిగొన 6దఱికను 7తఱుగను 8దరుగన్
9ధరజను 10దరిగొన 11దరమును
12దరమును 13దఱుమను 14దఱియను 15దఱలును 16ద్వరగన్

ప్రతి గణం రెండవ
అక్షరం ప్రాస అవుతూ ఉంటుంది. కాబట్టి
ర - అనే అక్షరం ప్రాస అవుతున్నది.

Friday, January 5, 2018

దాగుడు పదాలేవి?


దాగుడు పదాలేవి?




సాహితీమిత్రులారా!

ఈ పద్యంలో దాగిఉన్న పదాలేవో
చెప్పండి-
ఈ పొడుపు పద్యం
శ్రీవేంకటేశ సారస్వత వినోదిని నుండి-

రామాయణమునుండి ప్రభవించు స్త్రీ యేది?
          భారతమున నుండు బరువదేది?
భాగవతములోని పాలెది యగుచుండు?
          పారిజాతములోని ఫణి యదేది?
మనుచరిత్రములోని తెనుఁగు శబ్దమ్మేది?
          వసుచిత్ర నెది సువర్తనంబు?
శృంగార నైషధ స్ధిత దేశమదియేది?
          ఆముక్తమాల్యద హారమేది?
అమరమున దాఁగు పట్టణ ప్రముఖమేది?
శబ్దరత్నాకరములోని జలధి యేది?
దాగుఁడు పదాలు తెలుపుచో బాగు బాగు!
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!

దాగిన పదాలు-

1.రామాయణములోని స్త్రీ - రామ

2. భారతములోని బరువు - భారము

3. భాగవతములోని పాలు - భాగము

4. పారిజాతాపహరణములోేని ఫణి - పాము

5. మనుచరిత్రలోని తెలుగు శబ్దము - మను(నేల)

6. వసుచరిత్రలోని సువర్తనము - సుచరిత్ర

7. నైషధములోని దేశము - నిషధ

8. ఆముక్తమాల్యదలోని హారము - మాల్యము

9. అమరములోని పట్టణము - అమర(అమరావతి)

10. శబ్దరత్నాకరములోని జలధి - రత్నాకరము(సముద్రము)

Thursday, January 4, 2018

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి


సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి




సాహితీమిత్రులారా!


ధారానగరంలో భోజుడు అంతఃపురంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో ఒక పండితచోరుడు రాజుగారి కోశాగారంలో
ప్రవేశించాడు. అక్కడ వజ్రవైఢూర్యాలను, మరకతగోమేధికాలను,
మాణిక్యాలను ఎన్నిటినో మూటగట్టుకొని పోబోతుండగా
ఇంతలో వానిమనసులో ఒక భావం తళుక్కున మెరిసింది.
అయ్యో పూర్వజన్మలో ఎన్నో తప్పుడు పనులు చేయబట్టి
కదా ఈ జన్మలో చాలమంది వికలాంగులై, కుష్ఠురోగులై,
గ్రుడ్డి, కుంటి, వారుగాను, దరిద్రులుగాను బాధపడుచున్నారు.
నేనుకూడ పూర్వజన్మలో చేసినపాపం వల్లే నేడు దరిద్రుడనైనాను.
ఇంకా ఈ జన్మలో తప్పులు చేసి పాపం మూటకట్టుకో వలసిందేనా
-అని అనుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇంతలో భోజుడు మేల్కొని
తన సుఖసంపదలను, అష్టైశ్వర్యాలను తలంపునకు తెచ్చుకొని
ఈ శ్లోకాన్ని చెప్పాడు-

చేతో మహా యువతయః సుహృదో2నుకూలాః
సద్భాంధవాః ప్రణయగర్భగిరి శ్చ భృత్యాః
గర్భన్తి దంతి నివహా స్తరలా స్తురంగాః
(మనస్సునెంతగానో ఆకర్షించే మత్తకాశినులున్నారు.
అనుకూలురగు మిత్రులు, మంచి బంధువులు,
చెప్పినంతనే పనులు చేస్తూ , చాటూక్తులు పలికే
సేవకులున్నారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఒకపక్క
గర్జిస్తున్నాయి. ఇలా అష్టైశ్వర్యాలతో అన్నిసుఖాలు
అనుభవిస్తున్నా ---)
అని చదివి మిగిలిన నాలుగవపాదం కోసం
చడబడుతున్న సమయంలో
ఆ పండిత చోరుడు ఈ విధంగా పూరించాడు-

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి
(అవి కట్టెదుట కనబడుతున్నా, కన్నులు మూయగానే
ఇవేవీ కంటికి కన్పడవు సుమా)
(అంటే భౌతికములైన సుఖాలు అన్నీ క్షణభంగురాలేకాని
శాశ్వతాలు కావని భావం.)

దీనికి రాజు సంతసించి అతని పూర్వాపరాలు విచారించి
ఆ చోరపండితునికి తగినంత బంగారమిచ్చి సన్మానించి
పంపించాడట.


Wednesday, January 3, 2018

హారామహాదేవరతాతమాతః


హారామహాదేవరతాతమాతః




సాహితీమిత్రులారా!


ఈ ప్రశ్నోత్తరచిత్రశ్లోకం చూడండి-

కే భూషయన్తిస్తనమండలాని?
కీ దృశ్యుమా? చంద్రమసః కుతః శ్రీః?
కి మాహ సీతా దశకంఠ నీతా?
హారామహాదేవరతాతమాతః

ఈ శ్లోకంలోని ప్రశ్నలకు సమాధానం
చివరిపాదం అయిన -
హారామహాదేవరతాతమాతః

1. హారాః, 2. మహాదేవరతా, 3. తమాతః
4. హారామ హాదేవర (హే)తాత (హే)మాతః

1. కే భూషయన్తిస్తనమండలాని?
   చన్నుగవలను అలంకరించునవి ఏవి?
   - హారాః(ముత్యాలహారాలు మొదలైనవి)

2.  కీ దృశ్యుమా?
    ఉమ(పార్వతి)ఎట్టిది?
   - మహాదేవరతా(ఈశ్వరుని యందు ఆసక్తికలది)

3. చంద్రమసః కుతః శ్రీః?
   చంద్రుని కాంతి ఎప్పటి నుండి ఉంటుంది?
   - తమాతః(రాత్రినుండి)

4. కి మాహ సీతా దశకంఠ నీతా?
   రావణుడు, తనను ఎత్తుకొని పోవునపుడు 
   సీత ఏమని ఆక్రోశించెను?
    - హారామ (ఓరామా), హాదేవర(ఓ మరిదీ లక్ష్మణా)
      తాత(తండ్రీ)మాతః(అమ్మా) - అని రోదించింది సీత

Tuesday, January 2, 2018

వీటికి అర్థభేధములు ఏవి?


వీటికి అర్థభేధములు ఏవి?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి-
ఇది శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోనిది.

అగ్నిసఖుఁడెవండు? అగ్నిముఖుఁడెవండు?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అనుమతి యననేమి? అనుమితియననేమి?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అనలుఁడెవ్వండౌను? అనిలుఁడెవ్వండౌ?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అన్యతరమదేది? అన్యతమమదేది?
            వేఱర్థములవేవి వేంకటేశ?
నుతగుణాకరా మహిననుశ్రుతమదేది?
పతితపావనా భువి ననుశ్రుతిమదేది?
మెప్పుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!


        పదాలు                 -   అర్థాలు
1. అగ్నిసఖుడు           -   వాయుదేవుడు
2. అగ్నిముఖుడు         -   విప్రుడు(బ్రాహ్మణుడు)
3. అనుమతి                 -   అంగీకారము
4. అనుమితి                 -   పరామర్శజ్ఞానము
5. అనలుడు                 -   అగ్నిదేవుడు
6. అనిలుడు                 -   వాయుదేవుడు
7. అన్యతరము             -   రెండింటిలో ఒకటి
8. అన్యతమము            -  పెక్కింటిలో ఒకటి
9. అనుశ్రుతము            -  పరంపర వేదజ్ఞానము
10. అనుశ్రుతి                -  కర్ణాకర్ణికగా విన్నది

Monday, January 1, 2018

వీటికి అర్థాలేమిటి?


వీటికి అర్థాలేమిటి?




సాహితీమిత్రులారా!

శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోనిది
ఈ పొడుపు పద్యం సమాధానాలు
చెప్పగలరేమో చూడండి-

కడులోఁతుగల్గు నగస్త్య మూత్రములోన
          నంబుగజములీఁదులాడుచుండె
ధార్తరాష్ట్రశతము దపిదాఁపురాఁగానె
          కృష్ణశకునిలేచి యేఁగెనెటకొ
పూర్వాహ్నవేళ నభోగజమ్ములు దోఁప
          నీలకంఠములెల్ల నృత్యమాడెఁ
జెడువార్తలెల్ల ద్విజిహ్వుఁడొక్కఁడు దెల్ప
          లోలకర్ణుండొక్కఁడాలకించెఁ
బుణ్యజనులైన వారిని బూర్వమందు
మించి పురుషోత్తముండు వధించివైచె
మెప్పుగా నర్థములివేవి చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!

           పదాలు                        -          సమాధానాలు
1. అగస్త్యమూత్రము              -           సముద్రము
2. అంబుగజములు                -          మొసళ్ళు
3. ధార్తరాష్టశతము                 -           కొంగలగుంపు
4. కృష్టశకుని                          -           నల్లకాకి
5. నభోగజములు                   -            మేఘాలు
6. నీలకంఠములు                 -            నెమళ్ళు
7. ద్విజిహ్వుడు                     -            కొండెగాడు
8. లోలకర్ణుడు                        -             కొండెములు వినువాడు
9. పుణ్యజనులు                      -            రాక్షసులు
10. పురుషోత్తముడు               -            విష్ణుదేవుడు