Sunday, April 30, 2017

నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము


నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము




సాహితీమిత్రులారా!



నిరోష్ఠ్యము అంటే ఓష్ట్యముతో
పలుకబడని అక్షరములతో పద్యం కూర్చుట.
ఇది శబ్దచిత్రము
కందపద్యములో గీత ఉత్పలమాల పద్యముల
పాదములను కూర్చుట గర్భచిత్రము ఈ రెండింటిని
ఒకదానిలో కూర్చుట వలన ఇది మిశ్రమ చిత్రము
అనబడును. పద్యం చూడండి-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

ఇది పెదిమలు తగలకుండా చదువవచ్చు
అందుకే దీనికి నిరోష్ఠ్యము అని పేరు.

ఇందులోని గీత పద్య పాదము-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్ష!


ఉత్పలమాల పద్య పాదము -
కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! 
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!


జ్జన రంజనా!సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్షకా!

నవరస శబ్ద చిత్రము


నవరస శబ్ద చిత్రము




సాహితీమిత్రులారా!



శ్రీరామకర్ణామృతములోని
ఈ శ్లోకంలో నవరసములు
చూప బడ్డాయి చూడండి-


శృంగారం క్షితినందనీవిహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనే ద్భుతరసం సింధౌగిరిస్థాపనే
హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్సమన్యాముఖే
రౌద్రం రావణవర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః

సీతతో విహరించునపుడు శృంగారరసమును,
శివునిధనుర్భంగమునందు వీరరసమును,
కాకాసురుని యందు దయను,
సముద్రమున పర్వతములుంచునపుడు ఆశ్చర్యమును,
శూర్పనఖ మోమునందు హాస్యమును,
ఇతర స్త్రీలమోమున భీభత్సమును(అసహ్యమును),
రావణసంహారమందు రౌద్రమును,
మునీశ్వరులయందు శాంతరసమును,
అయి సర్వము మమ్ము రక్షించుగాక- అని భావం.

శృంగారం క్షితినందనీవిహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనే ద్భుతరసం సింధౌగిరిస్థాపనే
హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్సమన్యాముఖే
రౌద్రం రావణవర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః


ఇందులో అన్ని రసముల పేర్లు రావడం వలన 
ఇది నవరస శబ్ద చిత్రం అనబడుచున్నది

Saturday, April 29, 2017

నామగోపన సీసము


నామగోపన సీసము




సాహితీమిత్రులారా!


రసశ్రువులో భీమశంకరంగారి
నామగోపన గూఢచిత్రం చూడండి-

వేదముల్ వేదాంగ వేదాంతముల నేర్చి
                       ముక్తికాంతను చేరు శక్తిలేక
భీషణ తపములు విరివిగా వ్రతములు
                      మహిమలు మంత్రముల్ అహితమగుట
శంస చేయగ నాకు శాస్త్రమురాక
                      కట్టడ నిను గొల్చు పట్టులేక
రక్తితో మిమ్ముల రంజిల్ల చేయంగ
                      ముచ్చట్లు నాకేమి వచ్చు గనుక
వ్రాయ నేర్చితి శంకరా పద్యకవిత
సిద్ధ కన్యను దీనిని స్వీకరించి
నగ కుమారికి, గంగకు నచ్చ చెప్పి
దిటవుగ దీపింప నేలుమో నటవరేణ్య!
                                                                         (రసశ్రువు పుట- 194)

దీనిలోని పాదముల మొదటి అక్షరములను కలిపిన
వేము భీమ శంకరము వ్రాసినది - అను గూఢనామము
బహిర్గతమౌతుంది.

వేదముల్ వేదాంగ వేదాంతముల నేర్చి
ముక్తికాంతను చేరు శక్తిలేక
భీషణ తపములు విరివిగా వ్రతములు
హిమలు మంత్రముల్ అహితమగుట
శంస చేయగ నాకు శాస్త్రమురాక
ట్టడ నిను గొల్చు పట్టులేక
క్తితో మిమ్ముల రంజిల్ల చేయంగ
ముచ్చట్లు నాకేమి వచ్చు గనుక
వ్రాయ నేర్చితి శంకరా పద్యకవిత
సిద్ధ కన్యను దీనిని స్వీకరించి
గ కుమారికి, గంగకు నచ్చ చెప్పి
దిటవుగ దీపింప నేలుమో నటవరేణ్య



రెండు కందాలతో 8 రేకుల పద్మం


రెండు కందాలతో 8 రేకుల పద్మం




సాహితీమిత్రులారా!


రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంలోని
ఈ అష్టదళ పద్మబంధ కందద్వయం చూడండి-
రెండు కందపద్యాలతో అష్టదళ పద్మబంధం-

రాధానాథా నీతి వి
వాదా సప్తాశ్వ తేజ వరుసగ నిపుడో
శ్రీదాయని పల్మారున్
మోదంబిడ గావ్యరీతి బూజల్ జేతున్

రెట్టించి రాఘవేంద్రా
దిట్టంబొడ్డిట్లు గొల్తు ధీకల్యాఢ్యా
వట్టిక నీవై మనుటే
గట్టిపదవి గాదె యనిశ కారుణ్యాత్మా

ఒకటవ దళములో
                రాధానాథా నీతి వివాదా స
రెండవ దళములో
                                ప్తాశ్వ తేజ వరుసగ నిపు
మూడవ దళములో
                                డో శ్రీదాయని ల్మారున్మోదం
నాలుగవ దళములో
                                  బి డ గావ్యరీతి బూజల్ జేతున్   
ఐదవ దళములో
                                రెట్టించి రాఘవేంద్రా దిట్టంబొడ్డి 
ఆరవ దళములో
                                డ్డిట్లు గొల్తు ధీల్యాఢ్యా వట్టి 

ఏడవ దళములో
                                  క నీవై మనుటే గట్టిపద  

ఎనిమిదవ దళములో
                                  వి గాదె యని కారుణ్యాత్మా
                               
వ్రాయబడినవి-



ఈ బంధాన్ని గమనిస్తే
కేసరాగ్రములో
రాప్తాడోబి రెడ్డి కవి - అని,
తిరుపతి వేంకటేశ - అని కృతిపతిపేరు
పత్రాగ్రంలోనూ కూర్చబడినది.

Friday, April 28, 2017

కరిముఖు డశ్వినుల్ శ్రుతులు


కరిముఖు డశ్వినుల్ శ్రుతులు




సాహితీమిత్రులారా!


మంచన  కేయూరబాహు చరిత్రలోని
సంఖ్యా(శబ్ద)చిత్రము చూడండి-


కరిముఖు డశ్వినుల్ శ్రుతులు కంజసముద్భవు మోము నంబికే
శ్వరు మొగముల్ తదాత్మజుని వృక్షము లాది మునీంద్ర మండలం
బురగపతుల్ గ్రహంబులు పయోరుహనాభుడు తారకంబు లున్
బొరిబొరి నెల్ల సంపదలు పోలమ గుండని కిచ్చుగావుతన్


ఇందులో
కరిముఖుడు - వినాయకుడు (ఒకడు)
అశ్వనుల్ - అశ్వనీదేవతలు (ఇద్దరు)
శ్రుతులు - వేదములు (మూడు)
కంజసముద్భవు మోము- చతుర్ముఖుడు(నాలుగు)
అంబికేశ్వరు మొగముల్ - పంచాస్యుడు(శివుడు)(ఐదు)
తదాత్మజుని వక్రములాది -
శివుని కుమారుడైన షణ్ముఖుని ముఖములు(ఆరు)
మునీంద్ర మండలంబు - సప్తఋషులు (ఏడు)
ఉరగపతుల్ - అష్టనాగులు (ఎనిమిది)
గ్రహంబులు - నవగ్రహాలు (తొమ్మిది)
పయోరుహనాభుడు - దశావతారములెత్తిన విష్ణువు(పది)
తారకంబులున్ - అనంతములైన తారకలు(అనంతము)
పోలమ గుండనికి  అనంత సంపదలు ఇచ్చుగాక
అని మంచన తన కృతిపతిని దీవిస్తున్నాడు.

ఇందులో ఒకటి నుండి పది మరియు
అనంతము అనే సంఖ్యలు
కనిపిస్తున్నాయి కావున ఇది
సంఖ్య(శబ్ద) చిత్రముగా చెప్పబడుతున్నది.

సర్వతోభద్ర బంధం


సర్వతోభద్ర బంధం




సాహితీమిత్రులారా!




అర్థభ్రమకం అంటే
శ్లోకంలోని అర్థపాదం భ్రమణం చెందడం
సర్వతోభద్రం అంటే
శ్లోకంలోని పాదాలు అంతటా
ఒకేవిధంగా భ్రమణం చెుదడం.

వేదాంత దేశికులవారి పాదుకాసహస్రం
లోని ఈ శ్లోకం చూడండి-

జయామపాపామయా జయామహేదుదుహేమయా
మహేశకాకాశ హేమపాదుకా మమకాదుపా

ఉత్కర్షం పరిణితిని పొందని ముముక్షువులను కాపాడునట్టి,
వ్యాధులను పోగొట్టునట్టి, తనదికాని వస్తువు నందు తనది అనే బుద్ధి
లేని బ్రహ్మ శిరస్సును ఛేదించి గురుపాతకానికి గురియైన
రుద్రుణ్ని రక్షించినట్టి, ఇంద్రాది దిక్పాల కష్టాలను తొలగించే
విష్ణువుయొక్క స్వర్ణమయ పాదుకను శ్రీరంగనాథుని
 బ్రహ్మోత్సవమందు అభీష్టసిద్ధికోసం ప్రార్ధిస్తాను - అని భావం


8 x 8 = 64 గడులు ఉండేలా చతురస్రాన్ని గీసుకోవాలి
ఒక్కొక గడిలో ఒక అక్షరం వచ్చేలా
మొదట శ్లోకం నాలుపాదాలు వరుసగా ఒకదాని
క్రింద ఒకటి వ్రాయాలి వ్రాయాలి
తరువాత 4,3,2,1 పాదాలను వరుగా ఒకదాని
క్రింద ఒకటి వ్రాయగా సర్వతోభద్ర బంధం ఏర్పడుతుంది

శ్లోకం యొక్క ప్రతిపాదంలోని నాలుగు అక్షరాలు
అనులోమంలోనూ, ప్రతిలోమంలోనూ ఉండటం వల్ల
ఏ ప్రక్కనుండి ఒక్కొక్క పాదం చదివినా, శ్లోకం ఎనిమిది సార్లు
ఆవృత్తమౌతుంది.


సర్వతోభద్ర బంధం-

జ    యా  మ  పా  పా  మ  యా   జ
యా మ   హే  దు  దు హే  మ   యా
మ   హే    శ     కా   కా    శ   హే   
పా    దు    కా   మ  మ   కా   దు   పా
పా    దు    కా   మ   మ  కా   దు   పా
మ    హే   శ      కా    కా   శ   హే   
యా  మ  హే   దు   దు  హే  మ  యా
జ     యా  మ   పా   పా   మ  యా జ

Thursday, April 27, 2017

ఒక సీస పద్యంలో మూడు వృత్తాలు


ఒక సీస పద్యంలో మూడు వృత్తాలు




సాహితీమిత్రులారా!


సీసపద్యంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి
ఇందులో స్రగ్విణి, భుజంగ ప్రయాత, ద్రుతవిలంబిత
వృత్తాలను ఇమిడ్చి చెప్పిన పద్యం ఇది-
రసికజన మనోభిరామము లోని 2వ ఆశ్వాసం 56వ పద్యం.


నిగమాశ్వభూసురానీక సంపూజ్య శుం
                  భత్ప్రభావా వృషపతి తురంగ
సురుచిరద్యోసరిజ్జూట ఖద్యోత సా
                 హస్రభాషా సమస్తాఘహరణ
జగతీశ మాసరస్వత్యుమామాన్య చం
                చత్కృపాబ్దీనతజన శరణ్య
మానితహాసరమ్యా నవాబ్జాలస
                న్మంగళాత్మానిశానాథ మకుట
హార సరీసృపహార భయాపహార
పురనిషూదన భూరి విభూతిదాన
హరి హయప్రణతాచ్ఛపదాంబుజాత
శరణుశంకర శాశ్వతసాధుపాల

ఇందులోని

నిగమాశ్వభూసురానీక సంపూజ్య శుంభత్ప్రభావా వృషపతి తురంగ
సురుచిరద్యోసరిజ్జూట ఖద్యోత సాహస్రభాషా సమస్తాఘహరణ
జగతీశ మాసరస్వత్యుమామాన్య చంచత్కృపాబ్దీనతజన శరణ్య
మానితహాసరమ్యా నవాబ్జాలసన్మంగళాత్మానిశానాథ మకుట
హార సరీసృపహార భయాపహా
పురనిషూదన భూరి విభూతిదా
హరి హయప్రణతాచ్ఛపదాంబుజా
శరణుశంకర శాశ్వతసాధుపా

స్రగ్విణి -

దీనిలో ప్రతి పాదమునకు 4 ర-గణాలుంటాయి.

భూసురానీక సంపూజ్య శుంభత్ప్రభా
ద్యోసరిజ్జూట ఖద్యోత సాహస్రభా
మాసరస్వత్యుమామాన్య చంచత్కృపా
హాసరమ్యా నవాబ్జాలసన్మంగళా

భుజంగప్రయాతము-

ఇందులో ప్రతి పాదమునకు 4 య-గణాలుంటాయి

నిగమాశ్వభూసురానీక సంపూజ్య శుంభత్ప్రభావా వృషపతి తురంగ
సురుచిరద్యోసరిజ్జూట ఖద్యోత సాస్రభాషా సమస్తాఘహరణ
జగతీశ మాసరస్వత్యుమామాన్య చంచత్కృపాబ్దీనతజన శరణ్య
మానితహాసరమ్యా నవాబ్జాలసన్మంగళాత్మానిశానాథ మకుట



సురానీక సంపూజ్య శుంభత్ప్రభావా 
చిరద్యోసరిజ్జూట ఖద్యోత సా
సరస్వత్యుమామాన్య చంచత్కృపాబ్దీ
సరమ్యా నవాబ్జాలసన్మంగళాత్మా


దృతవిలంబితము -
ఇందులో ప్రతి పాదానికి న,భ,భ,ర గణాలుంటాయి

హార సరీసృపహార భయాపహా
పురనిషూదన భూరి విభూతిదా
హరి హయప్రణతాచ్ఛపదాంబుజా
శరణుశంకర శాశ్వతసాధుపా

అర్ధభ్రమకము


అర్ధభ్రమకము




సాహితీమిత్రులారా!



శ్లోకం యొక్క ప్రతిపాదంలోని సగంపాదం
మాత్రమే తిరిగే విధంగా కూర్చబడిన బంధచిత్రం

వేదాంత దేశికులు కూర్చిన పాదుకా సహస్రములోని
ఈ శ్లోకం చూడండి -

లోక తారా కామ చారా 
కవిరాజదురావచా
తారాగతే పాదరామ
రాజతే రామపాదుకా
                                               (931)

ఆశ్రితజనులను తరింప చేయునదియు,
కోరదగినయు అయిన గమనముగలదియు,
కవిరాజులయిన వ్యాసవాల్మీకాదులచే కూడ
వర్ణించుటకు శక్యముకానిదియు, గమనము
నందు ఆధికధ్వనిగలదియు, కిరణములను
ప్రసరింపచేయునదియు, అగు రామచంద్రుని
పాదుక ఇలాగా ప్రకాశించుచున్నది- అని భావం.

శ్లోకాన్ని మొదటినుంటి నాలుగువరుసలు
ఈ విధంగా వ్రాసిన తరువాత గమనించగా
దీనిలో ప్రతి పాదంలోని అర్ధభాగం
త్రిప్పి వ్రయబడినట్లు కనిపిస్తుంది గమనించండి.
మొదటి పాదంలోని నాలుగు అక్షరాలుక్రిందికి
మామూలుగా మొదటి వరుస క్రిందికి కనబడతాయి
ఆలాగే చివరి నిలువు వరుస తీసుకుంటే
మొదటి పాదంలోని చివరి నాలుగు అక్షరాలు
క్రిందినుండి పైకి చదువవలసిందిగా మారింది.
ఈ విధంగానే అన్నిపాదాలు గమనించగలరు
అక్షరం ప్రక్కన ఇచ్చిన అంకెల ప్రకారం చదివితే
అది పూర్తిగా గమనించగలరు.  శ్లోకాన్ని గమనిస్తూ
బంధం చదవండి-


1లో   క9     తా17   రా25   కా32    మ24   చా16   రా8 
2క     వి10   రా18  26     దు31   రా23    వ15    చా7
3తా  రా 11  గ 19   తే27    పా 30   ద22    రా14   మ6
4రా   జ 12  తే20   రా28    మ29    పా21  దు13   కా5


Wednesday, April 26, 2017

సర్వలఘు చిత్రం


సర్వలఘు చిత్రం




సాహితీమిత్రులారా!

అష్టకాల నృసింహరామశర్మగారి
పురుషోత్తముడు కృతినుండి-
సర్వ (అన్ని) లఘువులతో కూర్చిన
పద్యం సర్వలఘు చిత్రం

కరకమల కమలధర! కటిఘటిత మణినికర
         ఉదరతటిజలజధర! ఉరగశయన
అసురహర! అఘహరణ! అఘహరణ నదిచరణ!
         కృతశరధి దమనపథ! కితవ వినుత!
గజవదన! నుతచరిత! గజవరద! బల సమిత!
          సుజనహృదివసితముద! సుమహితయశ
నళినభవ గిరిశనుత! నతజనత సుఖద! హరి!
          దశవదనకుహరణ! దశరథ సుత!
కనక కుధరవసిత! కనకవసనధర!
గరుడ గమన! నిగమ గణిత చరిత!
సకల భువన భరణ! సన కవినుత చరణ!
కుమతి వినుత! సుమతి కులవితరణ
                                                                         (పురుషోత్తముడు - 3 - 385)

ఈ సీసములోని ప్రత్యేకతలు గమనించండి-
ఇందులో ప్రతి ఇంద్రగణము 5 లఘువులతో
కూర్చబడినది

దీని భావమేమి తెలియ


దీని భావమేమి తెలియ




సాహితీమిత్రులారా!



 పొడుపు పద్యం
విప్పగలరేమో చూడండి-

ఒంటసారములేదు యొడలెల్లనిండెను
పండ్లువేలెడేసివాయిలేదు
తనకు ప్రాణములేదు తగిలిజీవులజంపు
దీని భావమేమి? తిరుమలేశ!

శరీరంలో సారంలేదట
ఒడలెల్ల నిండి ఉన్నాయి
వేలెడేసి పండ్లున్నాయట
తనకు ప్రాణంలేదు
తగిలిన జీవులను
చంపుతుందట
దీని భావమేమిటో?
చెప్పమంటున్నాడు కవి-

సమాధానం - దువ్వెన

Tuesday, April 25, 2017

కందద్వయ గర్భ చంపకమాల


కందద్వయ గర్భ చంపకమాల




సాహితీమిత్రులారా!



చంపకమాలలో రెండు
కందపద్యలను ఇమిడ్చి
చెప్పిన పద్యం ఇది.
ఇది రాప్తాటి ఓబిరెడ్డిగారి కృతము

హరి! వరదాత! భద్రకర! యాశరవంశ హరా! సునీతి సా
గర! శరణాగతాప్త! దరకందర! సంతత సజ్జనస్తుతా
నరవర! దారుణారి హరణా! స్థిర కార్య! సదా భవంతు శ్రీ
కర! కరణాధినేత! నను గావర! భూవర! శ్రీ రమాధిపా!


ఇందలి మొదటి కందము-
హరి వరదాత భద్రకర యాశరవంశ హరా సునీతి సా
గర శరణాగతాప్త దరకందర సంతత సజ్జనస్తుతా
నరవర దారుణారి హరణా స్థిర కార్య సదా భవంతు శ్రీ
కర కరణాధినేత నను గావర భూవర శ్రీ రమాధిపా

మొదటి కందం రెండవ పాదం చివరి పదం శరణా
అనే పదం  మళ్ళీ మూడవపాదం మొదటిలో వస్తుంది

వరదాత భద్రకర యా
శరవంశ హరా సునీతి సా గర శరణా
శరణాగతాప్త దరకం
దర సంతత సజ్జనస్తుతా నరవర దా

రెండవ కందము -
హరి వరదాత భద్రకర యాశరవంశ హరా సునీతి సా
గర శరణాగతాప్త దరకందర సంతత సజ్జనస్తుతా
నరవర దారుణారి హరణా స్థిర కార్య సదా భవంతు శ్రీ
కర కరణాధినేత నను గావర భూవర శ్రీ రమాధిపా

అలాగే రెండవ పద్యం రెండవ పాదం చివర కరణా 

అనే పదం మూడవ పాదం మొదటిలో వస్తుంది. 

వర దారుణారి హరణా 
స్థిర కార్య సదా భవంతు శ్రీకర కరణా
కరణాధినేత నను గా
వర భూవర శ్రీ రమాధిపా హరి వరదా


ఛత్ర బంధము


ఛత్ర బంధము




సాహితీమిత్రులారా!


ఛత్రబంధాలలో అనేకరకాలున్నాయి
ఇక్కడ రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంనుండి
ఒక విధమైన ఛత్రబంధం చూడండి-

కందపద్యం -
మారా మాధామ! శరక
రా! రామ! సుమహిమనోమ! రారా హరి! నా
నారి హరా! ధీరా ధా
ధారా! ధీరాకర శమధామా! రామా

ఈ పద్యంలోని మొదటిపాదం ఛత్రం
కర్ర క్రిందినుండి పైకి ప్రారంభమగును
పైకి వెళ్ళగా పైన ఈ విధంగా ఉన్నది
హి
సుమనో
రా
క్రిందినుండి
రామ, సుమ, హిమ, నోమ, రా
ఈ విధంగా తీసుకోవాలి
ఇది రెండవ పాదంలో రెండవ
అక్షరంతో ప్రాంభమగును.
తరువాత
రా
నారిహరాధీరా ధా
                             →               ←
అని ఉన్నది
దీన్ని పైనున్న రా రా అని క్రిందికి చదివి
హరినా అని చదివిన తరువాత
నారిహ ధీరా ధా - అని చదివి
మళ్ళీ ధారా ధీరాకర అని పద్యం
చూస్తూ చదివితే
విషయం అర్థమవుతుందిచివరికి
ఎక్కడ ప్రారంభించామో అక్కడే
అంతమవుతుంది ఇక బంధం చూడండి-



Monday, April 24, 2017

లంగా లేచిన తన్వి ఱిచ్చపడియెన్


లంగా లేచిన తన్వి ఱిచ్చపడియెన్




సాహితీమిత్రులారా!



సమస్య - 
లంగా లేచిన తన్వి ఱిచ్చపడియెన్ లాంగూలదర్శంబునన్
(ఇది పైకి అశ్లీల ద్యోకతముగా ఉన్నది)


సి.వి.సుబ్బన్నగారి పూరణ -

అంగస్పందము దోఁప వామదిశ దీర్ఘాలోకమాలా సము
త్తుంగక్షేపముతోడ నాలుగు హరిత్తుల్ సూచి యుద్దాము రా
ముం గల్యాణగుణాభిరాముఁగను నౌన్ముఖ్యమ్ముతోఁబైట వ్రా
లంగా, లేచిన తన్వి ఱిచ్చపడియెన్  లాంగూలదర్శంబు నన్

ఇందులో
లంగా అనేదాన్ని వ్రాలంగా మార్చడం వలన
అశ్లీల అదృశ్యమైనది


మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు

కృష్ణ సర్ప బంధము


కృష్ణ సర్ప బంధము




సాహితీమిత్రులారా!


రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యం నుండి
కృష్ణ సర్ప బంధం-

గురువక్ష దీనవత్సల
వరదా సురపక్ష తపన భా ధ్రువ రక్షః
పర మన్పు రాజసన్నుత
సరసాకర భవ్య నీ భజన నే మరువన్

దీనిలో 12 స్థానాల్లోని అక్షరాలు
రు, వ, న, వ, ర, ప, ర, మ,
జ, స, ర, భ -  ఒక్కొక్కటి
రెండు పర్యాయాలు ఉపయోగించబడతాయి.

గురుక్ష దీత్సల
దా సుక్ష తపన భా ధ్రు క్షః
ర మన్పు రాజసన్నుత
సరసా వ్య నీ భజన నే రువన్


బంధం చూడండి-
తలనుండి తోక వరకు అక్షరాలను
క్రమంగా చదవండి పద్యం చూస్తూ
ఇందులోని విశేషాలను గమనించండి-



Sunday, April 23, 2017

తగిలి తగలని పద్యాలు


తగిలి తగలని పద్యాలు




సాహితీమిత్రులారా!



ఇదేమి పద్యాలను కుంటున్నారా?
చదివే సమయంలో
పెదవి తగిలేవి తగలనివి
నాలుక తగలనివి
చూడండి-

ఇవి శ్రీనివాస చిత్రకావ్యంలోని-

చదివే సమయంలో
పెదవి మాత్రమే తగిలే పద్యం-

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా


చదివే సమయంలో 
పెదవులు తగలిది-

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవితగలినిది తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది తగలేది ఈ పద్యం -

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది-
సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా

నాలుక కదలని(తగలని) పద్యాలు-

కాయముగేహము  వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం-

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా

చూడండి మీరు పలికి 
చెప్పిన విధంగా ఉన్నాయో లేదో


కంద గీత గర్భ శైల బంధోత్పలమాల


కంద గీత గర్భ శైల బంధోత్పలమాల





సాహితీమిత్రులారా!



ఉత్పలమాలలో కందపద్యాన్ని, తేటగీతి పద్యాన్ని
ఇమిడ్చి ఆ పద్యాన్ని శైలబంధంగా కూర్చాడు
రాప్తాటి ఓబిరెడ్డిగారు తన శ్రీనివాస చిత్రకావ్యంలో
చూడండి-


శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా

గర్భిత కందము-

శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా

సుకవిస్తుతా మరపుజెం
దక లాలన మన్పు శ్రీశ నా నా సుకృతా
సుకశాన్వితా తరణిభా 
సకలార్థయుతా హరాప్త శౌరీ సుకరా

గర్భిత గీతము-

శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా

మరపుజెందక లాలన మన్పు శ్రీశ
మహిత న్యాయ విచారణ మౌనివంద్య
తరణిభా సకలార్థయుతా హరాప్త
జయధురీణ చరిత్ర ప్రశాంత భాష

శైలబంధము-

ఇందులో శైలమధ్యమున పైనుండి క్రిందికి

"శ్రీకమలానాయకహరి" - 
అని వచ్చును గమనించండి


శ్రీ
సువి
స్తుతా రపు
జెందక లాలన మ
న్పు శ్రీశ నా  నా సుకృతాద్య
శోమహిత న్యా విచారణ మౌ
నివంద్యదేవాసుశాన్వితా తరణి
భా సకలార్థయుతా రాప్త శౌరీ సుకరా 
హరీ జయధురీణ చరిత్రప్రశాంతభాషణా

Saturday, April 22, 2017

ఆద్యక్షర చిత్రం


ఆద్యక్షర చిత్రం




సాహితీమిత్రులారా!



చిత్రకవిత్వంలో శబ్దచిత్రము ఒక విభాగము
అందులోనూ అనేక విభాగాలు ఉన్నాయి
వాటిలో ఆద్యక్షర చిత్రం
ఇది అక్షర చిత్రంలోకి చేరుతుంది.
దీనిలో పద్యంలోని ప్రతిపదం
పద్యం మొదటి పదం ఏ వర్ణంతో ప్రారంభమైన
ఆ వర్ణంతోనే పద్యంలోని పదాలన్నీ ఉండేలా కూర్చటం.
రాప్తటి ఓబిరెడ్డిగారి 
శ్రీనివాస చిత్రకావ్యం నుండి చూడండి.


రద నజాక్ష వాసవవంద్య విష్ణు
వాసుదేవ విష్వక్సేన వైరిహరణ
వేదవేద్య విధిస్తుత్య వేడ్కబ్రోవు
విజయసారథి విశ్వేశ వేంకటేశ

దీనిలో ప్రతి పదం వ - కారంతో ప్రారంభమైనది
కావున దీనిని వ - కారాద్యక్షర గీతం
అంటున్నాడు.

కంద గర్భిత శార్దూల విక్రీడితము


కంద గర్భిత  శార్దూల విక్రీడితము




సాహితీమిత్రులారా!


ఒక పద్యంలోనే అనేక పద్యాలను ఇమిడ్చడాన్ని
గర్భచిత్రమంటారు ఇప్పుడు పుష్పగిరి తిమ్మనగారి
సమీరకుమార విజయమనే కావ్యంనుండి
ఈ పద్యం చూడండి ఇందులో శార్దూల పద్యంలో
కందపద్యం ఇమిడ్చబడినది.

నీకే మ్రొక్కెదఁ బ్రోవు మున్నత కృపానిర్మాణదివ్యత్కటా
క్షా! కాకుత్థ్స కులాగ్రగణ్యకరుణాకల్పా! యనల్పవ్రతా!
పాకారి ప్రముఖస్తుత ప్రతిభ! దుర్భావాక్ష శిక్షైక ద
క్షా!  కోకాప్తరుచిప్రకార! గుణనిస్తారా!  సమీరాత్మజా!
                                                        (సమీరకుమార విజయము 3-210)

ఇందులో గర్భిత కందపద్యం-

నీకే మ్రొక్కెదఁ బ్రోవు మున్నత కృపానిర్మాణదివ్యత్కటా
క్షా! కాకుత్థ్స కులాగ్రగణ్యకరుణాకల్పా! యనల్పవ్రతా!
పాకారి ప్రముఖస్తుత ప్రతిభ! దుర్భావాక్ష శిక్షైక ద
క్షా!  కోకాప్తరుచిప్రకార! గుణనిస్తారా!  సమీరాత్మజా!



నీకే మ్రొక్కెదఁ బ్రోవు ము
కాకుత్థ్స కులాగ్రగణ్యకరుణాకల్పా!
పాకారి ప్రముఖస్తుత
కోకాప్తరుచిప్రకార! గుణనిస్తారా!


Friday, April 21, 2017

గీత రథబంధము


గీత రథబంధము




సాహితీమిత్రులారా!

శబ్దచిత్రం, బంధచిత్రం కలిసిన వాటిని
మిశ్రమ చిత్రంగా చెప్పవచ్చు
ఇక్కడ నిరోష్ఠ్య రథబంధగీతము ఇది
చూడండి-
ఇది రాప్తాటి ోబిరెడ్డిగారి శ్రీనివాస చిత్రకావ్యంలోనిది
నిరోష్ఠ్యము అంటే పెదవులు తగలకుండా పలికే
పద్యం మరియు రథబంధము ఇది

శ్రీధరా సజ్జనాధార శేషశాయి
సరసిజాతాక్ష శ్రీ సతీశా జయాఢ్య
రాక్షసారి నారాయణ రాధికేశ
యనఘ యకలంక నయగేహ హరి గిరిధర

దీన్ని రథబంధంగా వ్రాసిన
మధ్యలో  పైనుండి క్రిందికి
శ్రీ రాధా సతీ నాయక హరి - అని ఉంటుంది

శ్రీ
ధ  రా
జ్జ నా ధా ర శే
షశా  యి  ర  సిజా
    తా  క్ష  శ్రీ  స   తీ  శా జ యా ఢ్య
రా  క్ష   సా రి   నా రా య ణ రా
  ధి  కే   శ     న  ఘ య
క  లం    న య
గే  

రి  గి  రి  ధ  ర
ఇందులోని పద్యం పెదవులతో పలుకబడదు
మరియు పద్యమును రథబంధముగా వ్రాయవచ్చును 
కావున ఇది మిశ్రమచిత్రము

దీనిలో పాలెన్నియో చెపుమా


దీనిలో పాలెన్నియో చెపుమా




సాహితీమిత్రులారా!


రాప్తాటి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంలోని
పొడుపు పద్యం విప్పండి-

పాలపాత్రను పాలు ముప్పావు కాలు
పావి పావరపావు రూపాయకనగ
నందులో నెన్ని పాలుండుననగ నష్ట
సంఖ్యలో చెప్పగా వచ్చు సమ్ముదమున

పాలపాత్రలో ముప్పావుకాలుపావు
పావరపావు రూపాయకు అంటే
అందులో పాలెన్ని ఉన్నాయో
చెప్పమంటున్నాడు కవి.

సమాధానం - నిజానికి ఇందులో పాలపాత్రలోని
                         పాలనుకాదు అడిగింది. ఈ మొత్తం
                          వాక్యంలో అనగా రెండుపాదాలలో
                         ప అక్షరాలెన్ని ఉన్నాయని
                             8 - ప - అనే అక్షరాలున్నాయి.

Wednesday, April 19, 2017

దీని భావమేదయా


దీని భావమేదయా




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం 
విప్పగలరేమో చూడండి-

జన్మకాలమందు జన్మంచు పర్ణముల్
దలప పువ్వు పిందె ఫలము లేదు
మారుపర్ణమిడనిమరివృక్ష మేదయా
దీని భావమేమి? తిరుమలేశ!

జన్మకాలంలో పుట్టే ఆకులట
కాని పువ్వుగాని పిందెగాని ఫలముగాని లేనిదట
మారు ఆకువేయని మర్రివృక్షమట
ఏమిటదని కవి అడుగుతున్నాడు
విప్పండి-

సమాధానము - తాటిఆకుగొడుగు

శ్రీరామేరానురాగ(పుష్పమాలికా బంధము)


శ్రీరామేరానురాగ(పుష్పమాలికా బంధము)




సాహితీమిత్రులారా!


గణపవరపు వేంకటకవి విరచిత
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని
పుష్పమాలాబంధయుక్త
కందమదన విలసిత శ్లోక
గర్భిత స్రగ్ధరావృత్తమును వీక్షించండి-


శ్రీరామేరానురాగ స్థిరతరమరళీస్మేరసారస్వరశ్రీ
తారాధారాధరాస్యాదర భరహరణాదానితానిత్యనిష్టా
తారాపారాబ్జరా వాదరభరణరతాద్రౌుదీపస్వపక్షా
సారాచారాభిరామాశరవరశరణా చారుకారుణ్యరుచ్యా


గర్భిత కందము
శ్రీరామేరానురాగ స్థిరతరమరళీస్మేరసారస్వరశ్రీ
తారాధారాధరాస్యాదర భరహరణాదానితానిత్యనిష్టా
తారాపారాబ్జరా వాదరభరణరతాద్రౌుదీపస్వపక్షా
సారాచారాభిరామాశరవరశరణా చారుకారుణ్యరుచ్యా

శ్రీరామేరానురాగ
తారాధారాధరాస్యాదర భరహరణా
తారాపారారావా
సారాచారాభిరామాశరవరశరణా

గర్భిత మదనవిలసిత వృత్తము

శ్రీరామేరానురాగ స్థిరతరమరళీస్మేరసారస్వరశ్రీ
తారాధారాధరాస్యాదర భరహరణాదానితానిత్యనిష్టా
తారాపారాబ్జరా వాదరభరణరతాద్రౌుదీపస్వపక్షా
సారాచారాభిరామాశరవరశరణా చారుకారుణ్యరుచ్యా

స్థిరతరమరళీ
దర భరహరణా
దరభరణరతా
శరవరశరణా

గర్భిత శ్లోకము

శ్రీరామేరానురాగ స్థిరతరమరళీస్మేరసారస్వరశ్రీ
తారాధారాధరాస్యాదర భరహరణాదానితానిత్యనిష్టా
తారాపారాబ్జరా వారభరణరతాద్రౌుదీపస్వపక్షా
సారాచారాభిరామాశరవరశరణా చారుకారుణ్యరుచ్యా

స్థిరతరమరళీస్మేరసారస్వరశ్రీ
దర భరహరణాదానితానిత్యనిష్టా
వారభరణరతాద్రౌుదీపస్వపక్షా
శరవరశరణా చారుకారుణ్యరుచ్యా

దీని పుష్పమాలికా బంధచిత్రము





Tuesday, April 18, 2017

దీని భావమేమి తెలియగా


దీని భావమేమి తెలియగా




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం
విప్పగలరేమో చూడండి-

దాటుకోటగట్లు దాట్ల గుర్రముగాదు
మెడను నలుపుగలదు మృడుడుగాడు
యిల్లుగట్టనిలుచు నిల్లాలుగాదయా
దీని భావమేమి? తిరుమలేశ!

కోటగట్లు దాటుతుంది కాని
దాట్లు గుర్రముకాదు
మెడ నల్లగా ఉంటుంది కాని
శివుడుకాదు
ఇల్లుకట్టిన నిలుచు కాని ఇల్లాలు గాదు
దీని భావమేమో చెప్పమంటున్నాడు కవి-


సమాధానము - ఊరపిచ్చుక

దండక గర్భ సీసము


దండక గర్భ సీసము




సాహితీమిత్రులారా!


రాప్తాడి ఓబిరెడ్డిగారి 
శ్రీనివాస చిత్రకావ్యంలోని
గర్భచిత్రం చూడండి-

సీసపద్యంలో దండకము ఇమిడ్చినది ఈ చిత్రము.

శ్రీశ! పరేశా! సురేశా! ధరాధీశ!
       దాసోపకారీ! రథాంగధారి!
మాధారి! శౌరీ! హరీ! దానవారీ! ము
       రారీ!  గుణస్తోమ! హంసతేజ!
రామా! శుభాధిక్యనామా! పరంధామ!
       కారుణ్యధామా! విదారితాఘ
రాజద్బలోద్దామ! రామామనఃకామ
       ప్రేమాభిరామా! ప్రభూ! ముకుంద!
సుప్రకాశాంగ! సత్సంగ! సుప్రసంగ
జ్ఞానదాతా! విధాతార్చితా! నయాత్మ
శ్రీవరా! భూరా! కావ వరాఖ్య
మౌనివంద్యా! నమస్తే నమస్తే నమః ప్రశస్త!

దీనిలోని దండకము -

శ్రీశ! పరేశా! సురేశా! ధరాధీశ!  దాసోపకారీ! 
మాధారి! శౌరీ! హరీ! దానవారీ! మురారీ!  
గుణస్తోమ!  రామా! శుభాధిక్యనామా! పరంధామ!
కారుణ్యధామా! విరాజద్బలోద్దామ! రామామనఃకామ ప్రేమాభిరామా! ప్రభూ! 
ముకుంద! సుప్రకాశాంగ! సత్సంగ! సుజ్ఞానదాతా! విధాతార్చితా! శ్రీవరా! భూరా! కావరా
మౌనివంద్యా! నమస్తే నమస్తే నమః 


Monday, April 17, 2017

రామారక్షోదలప్రాగ్య్రద(అష్టదళపద్మబంధము)


రామారక్షోదలప్రాగ్య్రద(అష్టదళపద్మబంధము)




సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వంలో అత్యద్భుత గ్రంథం
గణపవరపు వేంకటకవి కృత
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
ఇది 886 పద్యాల ఏకాశ్వాశగ్రంథము
దీనిలోని 870వ పద్యం
గర్భకవిత, బంధకవిత రెండింటి మిశ్రమము ఇది.


 విద్యున్మాలావృత్తగర్భిత స్రగ్ధరాష్టదళపద్మబంధము

రామారక్షోదలప్రాగ్య్రదరకదననత్రాసపధ్యారమారా
రామారథ్యాపసత్రా ప్రకటగుణ సముద్రాపవిత్రాసమారా
రామా సత్రావిపద్రారవినిభకర చక్రాశరణ్యాగమారా
రామాగణ్యారశక్రారథితఖగవరా ప్రాలదక్షోరమారా

ఈ స్రగ్ధర వృత్తంలోని
పాదముల మొదటి నాలుగు అక్షరాలు తీసుకోగా
విద్యున్మాలలోని రెండు పాదాలగును.
అలాగే ప్రతిపాదం చివరిలోని నాలుగు
అక్షరములు క్రిందినుండి తీసుకొంటూ
విలోమంగా వ్రాయగా చివరి రెండు పాదములు ఏర్పడును

రామారక్షోదలప్రాగ్య్రదరకదననత్రాసపథ్యారమారా
రామారథ్యాపసత్రా ప్రకటగుణ సముద్రాపవిత్రాసమారా
రామా సత్రావిపద్రారవినిభకర చక్రాశరణ్యాగమారా
రామాగణ్యారశక్రారథితఖగవరా ప్రాలదక్షోరమారా

దీనిలోని విద్యున్మాలావృత్తము-

రామారక్షో రామారథ్యా
రామా సత్రా రామాగణ్యా
రామారక్షో రామాగణ్యా
రామా సత్రా రామారథ్యా

దీనిలోని అష్టదళ పద్మబంధము 

ఈ క్రింద గమనింపుడు -




దీని భావమేమి చెప్పరె


దీని భావమేమి చెప్పరె




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం 
చూడండి
విప్పగలరేమొ

సున్నంబడిగిన నొకసతి
కన్నుల నెర్రంగ జేసి కడుకోపముతో
సున్నంబిదుగో కొమ్మని
చన్నులపై పైటదీసి చయ్యన జూపెన్

సున్నం అడిగితే ఒకావిడ
కోపంతో కన్నులెర్రజేసి
పైటతీసి తున్నమిదిగో అన్నదట
దీని భావమేమో తెలిమంటున్నాడు కవి-

సమాధానం - ముత్యాలహారం(సున్నమని అర్థం)
పైటదీసి చూపగా మెడలోని ముత్యాహారం కనిపించునుగా
అది సున్నంతో సమానమే అందుకే ఆవిడ అలాచేసింది.

Sunday, April 16, 2017

శుకవాణీ! మాట లింకేటికిన్


శుకవాణీ! మాట లింకేటికిన్


సాహితీమిత్రులారా!



 శ్రీనాథుని సంవాద చాటువు -
"అరవిందానన! యెందు బోయెదవు? " 
"మత్ప్రాణేశు ప్రాసాద మం
దిర దేశంబున కో లతాంగి! " "బహుళాంధీభూత మార్గంబునన్
దిరుగ న్నీకిటు లొంటి గాదె? " 

"శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 

మా వెంటరా నొంటియే? "

ఒక పడుచుపిల్ల మరో పడుచుపిల్లకు 
మధ్యజరిగిన సంవాదపద్యమిది-


 ఒక పడుచు మరొక పడుచు పిల్లను- 
అరవిందానన! యెందు బోయెదవు?
ఎక్కడికి పోతున్నావు ? 

మరో పడుచుపిల్ల 
మత్ప్రాణేశు ప్రాసాద మం
దిర దేశంబున కో లతాంగి!
నా ప్రియతముని సౌధ ప్రాంతాలకు పోతున్నాను 


పడుచుపిల్ల -
బహుళాంధీభూత మార్గంబునన్
దిరుగ న్నీకిటు లొంటి గాదె?
 ఇంత చీకటిలో ఒంటరిగా పోతున్నావు, నీకు భయంలేదా?
 . 
మరో పడుచుపిల్ల-
శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 
మా వెంటరా నొంటియే? 
 ఒంటరిగానా? ఏంమాటలవి? ఆకర్ణాంతం సంధించిన 
వింటితో మన్మథుడు నా వెన్వెంటే నడచివస్తుండగా 
నేను ఒంటరి నెలా అవుతాను ?. 

అంటే మన్మథ తాపానికి తాళలేకనే నా ప్రియుని 
కలియడానికి వెళ్తున్పాను అని నర్మ గర్భంగా 
చెబుతున్నదీ పడుచుపిల్ల