Sunday, June 12, 2016

ఐదు వక్త్రము లొప్పిన యనఘు డెవడు?


ఐదు వక్త్రము లొప్పిన యనఘు డెవడు?


సాహితీమిత్రులారా!

గతంలో కొన్ని పొడుపు పద్యాలను చూశాము.
పొడుపు పద్యాలు ఎన్ని చూచినా -
వింత వింతగా ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి.
అందులోను అనేక రకాలున్నాయి.
ఇప్పుడో రకం చూద్దామా

రెండు ముఖములు గలుగు ఘనుండెవండు?
మూడు మోములుగల జగత్పూజ్యు డెవడు?
నాల్గు మోములుగల లోకనాథుడెవడు?
ఐదు వక్త్రము లొప్పిన యనఘుడెవడు?
ఆరు నిటలంబు లలరు సుధీరుడెవడు?
పది లలాటంబుల చెలగు ప్రభుడెవండు?
నూరు ఫాలంబులను గ్రాలు వీరుడెవడు?
వేయి వదనంబుల వెలుగు విబుధుడెవడు?

ఇందులో అన్నీ ప్రశ్నలే తప్ప ఎలాంటి షరతులు లేవు కావున ఆలోచించగా ఆన్సరు వచ్చు.

సమాధానాలు-
1. 2 నోళ్ళుగల గొప్పవాడు ఎవరు? - అగ్ని
2. 3 ముఖాలున్న లోకపూజ్యుడు ఎవరు? - దత్తాత్రేయుడు
3. 4 నోళ్ళున్న జగన్నాథుడు ఎవరు? - బ్రహ్మ(చతుర్ముఖుడు)
4. 5 మోములున్న పుణ్యమూర్తి ఎవరు? - శివుడు (పంచముఖుడు)
5. ఆరు నోరులుగల వీరుడు ఎవరు? - కుమారస్వామి(షణ్ముఖుడు)
6. పది ఫాలములున్న ప్రభువు ఎవరు? - రావణుడు(దశముఖుడు)
7. నూరు నుదురులున్న వీరుడు ఎవరు? - శతముఖ రావణుడు
8. వేయి నోళ్ళతో వెలుగొందువాడు ఎవరు? - ఆదిశేషుడు

3 comments:

గోలి హనుమచ్చాస్త్రి said...బాగుందండీ...పొడుపు పద్యం...

గోలి హనుమచ్చాస్త్రి said...

ఆర్యా! టైపు పొరబాటు ... వక్త్రము ...సరిజేయగలరు.

ఏ.వి.రమణరాజు said...

పొరపాటును సూచించినందుకు కృతజ్ఞతలు, ఇప్పుడే సరిచేశాను.