Thursday, June 9, 2016

అత్తవారి ఇల్లు ఎలాంటిది?


అత్తవారి ఇల్లు ఎలాంటిది?


సాహితీమిత్రులారా!

అత్తవారి ఇల్లు ఎలాంటిది? -  అనేది ఒక ఊహాజనిత ప్రశ్న
దానికి సమాధానంగా
ఈ శ్లోకం
దాని కథ తెలుసుకుందాం.

శ్వశుర గృహనివాస: స్వర్గతుల్యో నరాణాం
యది భవతి దరిద్రో పంచ వా షడ్దినాని
దధి మధు ఘృత లోభాత్ మాసమేకం వసేత్ చేత్
తదుపరి దిన మేకం పాదరక్షా ప్రయోగ:

ఒక మామగారి ఇంటికి ఒకేసారి మనుగడుపు
(వివాహానంతరం అత్తవారింట్లో చేసే విందు,
దీన్నే కొన్ని ప్రాంతాల్లో అల్లెం తినటానికి అంటారు)ల
కోసం విచ్చేశారట. ఎంత ధనం, ఓపిక, ప్రేమగలవారైనా,
ఎంత బాగా పెట్టాలనుకున్నా, ఎంతకాలమని,
అల్లుళ్ళకు తినుబండారాలు, సేవలు చేయగలరు
వారికే మాత్రం విసుగు పుట్టకుండా ఉంటుందా!
ఇలా ప్రతి దినం, పీకలదాకా మెక్కి పరిహాసాలాడుకుంటున్న
అల్లుళ్ళలో ఒకరి బుద్ధివచ్చి అత్తవారిల్లు అన్ని విధాలా స్వర్గసుఖాలలో
ఓలలాడిస్తంది అనే అర్థం వచ్చే పైశ్లోకంలోని
మొదటిపాదం
(శ్వశుర గృహనివాస: స్వర్గతుల్యో నరాణాం),
అత్తవారింటి గోడపై రాసి వెళ్ళిపోయాడు.
మరి కొన్ని రోజులకు రెండవవాని బుద్ధివచ్చి,
అత్తవారిల్లు ఎంత స్వర్గసీమ అయినా, 5,6 రోజులకంటే మించి ఉండటం
మంచిదికాదు(యది భవతి దరిద్రో పంచ వా షడ్దినాని) అని
రెండవ పాదం గోడమీద రాసి ఉడాయించాడు.
మరికొన్ని రోజులకు మూడవ అల్లుడు అజీర్ణవ్యాధి తెచ్చుకొని
ఎవో అత్త వారింట అనాయాసంగా గడ్డ పెరుగు, పాలు, పిండి వంటలు
వడ్డిస్సున్నారుకదా! అనే అర్థం వచ్చే
(దధి మధు ఘృత లోభాత్ మాసమేకం వసేత్ చేత్)
మూడవ పాదాన్ని అసంపూర్ణంగానే రాసి ఫలాయనం మంత్ర పఠించాడు.
ఇక నాలుగవ వాడు మాత్రం తిని త్రేపి వారిమీద పెత్తనం కూడా చేస్తూ,
ఇవికావాలి, అవికావాలి అని అధికారం చెలాయించడంతో,
పాపం బావమరుదులైనా ఏంచేస్తారు? ఎంత కాలం అని భరిస్తారు?
 ఏమి చేసేదిలేక ఆగ్రహోదగ్రులై చెప్పుతో నెత్తిని బొచ్చు ఊడేదాకా
నాలుగు దెబ్బలు కొట్టారు. దానితో ఆ నాలుగవ వాడుపారిపోతూ,
ఆదరాబాదరగా
తిండి మీద ఆశతో నెలల కొద్ది తిష్ఠవేస్తే, ఆ తర్వాత చెప్పుదెబ్బలు తప్పవు
(తదుపరి దిన మేకం పాదరక్షా ప్రయోగ:) అనే అర్థం
వచ్చే నాల్గవ పాదాన్ని రాసి పారిపోయాడు.

అసలు విషం ఏంటంటే ఏంత ఆశపోతులైనా,
అత్తవారింట్లో ఎక్కవ రోజులు ఉండరాదు
- అనేది భావం.

3 comments:

కంది శంకరయ్య said...

శ్లోకమూ, దానికి మీ వ్యాఖ్యానమూ బాగున్నవి. ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి said...

చక్కని బ్లాగును పరిచయం చేసిన శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదములు....బ్లాగును నడుపుచున్న రమణ రాజుగారికి అభినందనలు.

ఏ.వి.రమణరాజు said...

గోలి హనుమచ్చాస్త్రిగారికి నమస్కారం,
మీరు మాబ్లాగును సందర్శించి వ్యాఖ్య వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.
మీ వ్యాఖ్వలు మాకు సదా అవసరం కావున మీరు మాకు సరైన వ్యాఖ్యలతోటి సూచనలు సలహాలు మాబ్లాగుకు అందించి శోభ కూర్చండి.