Monday, June 13, 2016

అక్షరద్వయమున నొక్కయుత్తరంబె యొసగవలయు



అక్షరద్వయమున నొక్కయుత్తరంబె యొసగవలయు


సాహితీమిత్రులారా!


పొడుపు పద్యాలలో మరో రకం చూడండి.


ఏకచక్రము బండి నెక్కు రేడెవ్వడు?
ఒడలెల్ల గనులైన యొడయ డెవడు?
మఱ్ఱియాకున బండు కుఱ్ఱవా డెవ్వడు?
శివుని యౌదల జేర్చి చెలగు నెవడు?
సమతమై సర్వభూతముల నేలునెవడు?
వాయుభక్షణచేసి బ్రతుకు నేది?
అఖిల జీవంబుల కాధారమగు నేది?
కొమరారు మారుని గుఱ్ఱమేది?
కంధి దాటి లంకగాల్చిన మృగమేది?
క్షితిని జల్లబడగ జేయునేది?
అరయ నన్నిటికిని నక్షర ద్వయమున
నొక్కయుత్తరంబె నొసగ వలయు

ఈ సీసపద్యంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికి రెండక్షరాల సమాధానం ఒక పదమే చెప్పాలి ఆలోచించండి.

1. ఒకే చక్రంగల రథంపై ఏక్కి తిరుగువాడు - సూర్యుడు
2. దేహంనిండా కన్నులు కలవాడు - ఇంద్రుడు
3. మఱ్ఱిఆకుపై పరుండు బాలుడు - విష్ణువు
4. శివుని శిరస్సుపై వెలుగువాడు - చంద్రుడు
5. అన్ని ప్రాణులను సమానంగా పాలించువాడు - యముడు
6. గాలిమేసి బ్రతికేది - పాము
7. అన్ని జీవులకు ఆధారమైనది - వాయువు
8. మన్మథుని గుఱ్ఱం - చిలుక
9. సముద్రందాటి లంకను కాల్చినది - కోతి(హనుమంతుడు)
10. భూమిని చల్లబడునట్లు చేయునది - వాన

వీటి అన్నిటికి రెండక్షరాల పదం కావాలి.
అది :- హరి
హరి పర్యాయపదాలు-
1. సూర్యుడు,2. ఇంద్రుడు, 3. విష్ణువు, 4. చంద్రుడు,
5. యముడు, 6. పాము, 7. వాయువు, 8. చిలుక,
9. కోతి, 10. వాన, 11. సింహం, 12. కిరణము,
13. గుఱ్ఱము, 14. కప్ప 15. కపిలము(బంగారుఛాయ గలది)
ఇలా చాలా అర్థాలున్నాయి నిఘంటువుల్లో.
కావున సరైన సమాధానం - హరి.

No comments: