Tuesday, November 7, 2017

క్షురికా బంధము


క్షురికా బంధము




సాహితీమిత్రులారా!

ఖడ్గ బంధాలలో ఇది ఒక రకము
క్షురిక అనే పదానికి శబ్దరత్నాకరంలో
మంగలికత్తి అనే అర్ఖం చెప్పబడింది.

బోడివాసుదేవరావు కృత చిత్రమంజరిలోని
క్షురికా బంధము ఇది.

సరోజ వృత్తం-
సారవీరకరప్రియా
మారమాదర మారసా
సారధీర సభారసా
సారభా సరధీరసా

సారవారకరప్రియా -
బలముగల వీరుల యొక్క కప్పమందు ప్రీతిగలవాడా
మారమాదర(మార-మా-ఆదర) -
మన్మథుని యొక్కయు లక్ష్మీదేవి యొక్కయు గౌరవముగలవాడా
మారసా(మార-సా)-
మన్మథుని వంటి దేహకాంతి గలవాడా
సారధీర - అనుత్తమమైన ధీరుడా
సభారసా(స-భా-సరా)-
కాంతితోడను భూదేవితోడను కూడినవాడా
సారభా(సార-భా)శ్రేష్ఠమైన స్వభావం కలవాడా
సరధీరసా(స-ర-ధీ-రసా)-
సమర్థమైన బుధ్యనురాగములతో కూడినవాడా



ఈ బంధము ఎడమ నుండి కుడికి పద్యములోని పూర్వార్థము సరిపోవును
కుడి నుండి ఎడమకు మిగిలిన ఉత్తరార్థము సరిపోవును గమనించగలరు.

Monday, November 6, 2017

మయూర బంధం


మయూర బంధం




సాహితీమిత్రులారా!


మయూర బంధాలు అనేక విధాలుగా ఉన్నాయి
కపిలవాయి లింగమూర్తిగారి
శ్రీమత్ప్రతాపగిరిఖండములోనిది
ఇక్కడ మనం చూడబోతున్న బంధం
ఇది ప్రమాణీ వృత్తంలో కూర్చబడినది.

పరాపరా పరంపరా!
సురాసురా సుఖాసుఖా!
చరాచరా చణంచణా!
జరాజరా జరంజనా!
(శ్రీమత్ప్రతాపగిరిఖండము -4-69)

ఈ బంధాన్ని పద్యం చూస్తూ(గమనిస్తూ)
చదివిన సులువుగా చదవగలరు
ప్రయత్నించండి-


Sunday, November 5, 2017

శంఖబంధం


శంఖబంధం




సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి
శ్రీమత్ప్రతాపగిరిఖండము లోని
ఈ శంఖబంధం చూడండి-
ఈ పద్యం ఆటవెలదిలో కూర్చబడినది.

శ్రీరమాధినాథ! పావన భావన!
భక్తలోకవరద! పరమపురుష!
విమలకమలనాభ! విభవామరస్తుత్య!
సరసిజాక్ష దేవ! సకలభావ!
                                               (శ్రీమత్ప్రతాపగిరిఖండము - 2- 90)

ఇందులో శ్రీతో ప్రారంభమై భావ తో అంతమవుతుంది
బంధం పద్యం గమనిస్తూ చదివితే సులువుగా చదవగలరు
చదవడం ప్రారంభించండి-


Saturday, November 4, 2017

ద్విచతుష్కచక్రబంధం


ద్విచతుష్కచక్రబంధం




సాహితీమిత్రులారా!

ద్విచతుష్కచక్రబంధం అంటే ఇందులో
రెండు చతురస్రాలు, ఒక వృత్తము ఉన్నాయి
వీనిలో పద్యం కూర్చబడింది. దీనిలో కూర్చిన
పద్యం సరోజవృత్తం. బోడివాసుదేవరావు కృత
చిత్రమంజరిలోనిది ఈ బంధం-

సరోజ వృత్తము-
శ్రీకరా! వరభూవరా!
భీకరారికులాపహా!
శ్రీక! రామరమావరా
భీక! రాజకుభృత్ పవీ!

బంధాన్ని మొదట వృత్తంలోని అక్షరాలను చదవాలి
అవి అన్నీ కలిసి రెండు పాదములకు సరిపోవును
ఇందులో. మిగిలిన పాదాలు చతరురస్రముల కలయికతో
ఏర్పడిన త్రిభుజములోని ఒక అక్షరము దానిక్రిందే ఉన్న
చతురస్రములోని అక్షరమును తీసుకుంటూ వృత్తాకారంలో వెళితే
మిగిలిన రెండు పాదాలు పూర్తవుతాయి.
ఇక చదవండి-


Friday, November 3, 2017

జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం


జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం




సాహితీమిత్రులారా!

శబ్దచిత్ర పద్యాలను శ్రీరామలింగశతకం నుండి
జొన్నవిత్తులవారి స్వరంలో వినండి-



Thursday, November 2, 2017

పద్యభ్రమకము(అనులోమ విలోమము)


పద్యభ్రమకము(అనులోమ విలోమము)




సాహితీమిత్రులారా!


పద్యభ్రమకమంటే పద్యం పైనుండి క్రిందికి
క్రిందినుండి పైకి ఎలా చదివినా పద్యం ఒకలాగే
మారకుండా ఉండడటం. దీన్నే అనులోమ పద్యం
(పైనుండి క్రిందికి చదివే పద్యం), విలోమ పద్యం
(క్రిందినుండి పైకి చదివే పద్యం)
రెండు ఒకలాగే ఉంటే దాన్ని
అనులోమ విలోమ పద్యం అంటారు.
ఇక్కడ బోడి వాసుదేవరావుగారి చిత్రమంజరి
నుండి ఈ రకపు పద్యం చూద్దాం-

సరోజ వృత్తం -
మార! ధీర! రధీరమా!
సారధీరసభారసా!
సారభాసరధీరసా!
మా! రధీర! రధీరమా!

మార(మా - ర) - లక్ష్మీదేవియు, మన్మథుడును గలవాడా
ధీర - స్వతంత్రుడా
రధీరమా - (ర-ధీ-రమా) - చురుకైన బుద్ధికలవాడా
సారధీరసభారసా - శ్రేష్ఠులైన రసజ్ఞులుగల సభాస్థలి గలవాడా
సారభాసరధీరసా - సార-భాస-ర-ధీర-సా)న్యాయముతో ప్రకాశించుచున్న
                 నిపుణులైన విద్వాంసుల యొక్క ధ్యానముగలవాడా
మా - (మ-అ) - బ్రహ్మకు హేతువైనవాడా
రధీర (ర-ధి-ఇర) - త్యాగమునకు స్థానమైన వాక్కులు గలవాడా
రధీరమా(ర-ధీర-మా)- మనోహరుడు, సాహసికుడుఅయిన చంద్రుడు కలవాడా

Wednesday, November 1, 2017

అంతస్థోష్మకందము


అంతస్థోష్మకందము




సాహితీమిత్రులారా!

చిత్రమంజరి పేరుతో శ్రీబోడి వాసుదేవరావుగారు
ఒక పుస్తకాన్ని కూర్చారు. ఇందులో
బంధ - గర్భ - చిత్ర కవిత్వాలున్నాయని
చెప్పుకున్నాడు ఇందులోని చిత్రకవిత్వ విభాగంలోనిదే
ఈ అంతస్థోష్మకందపద్యం
మనకు హల్లులలో
స్పర్శముల(క నుండి మ వరకు ఉన్న హల్లులు)ని,
అంతస్థముల(య,ర,ల,వ - అనే నాలుగక్షరాలు)ని,
ఊష్మముల(శ,ష,స,హ - అనే నాలుగక్షరాలు)ని
విభాగాలున్నాయి
ఇపుడు య,ర,ల,వ అనే అంతస్థములు
       శ,ష,స,హ అనే ఊష్మములు
       (జిహ్వామూలీయము(కకార ఖకారములకు
         ముందున్న విసర్గ),
        అనుస్వారములు కూడ ఊష్మములే)
ఈ అక్షరముల తోటే కందపద్యం కూర్చబడినది కావున దీనికి
అంతస్థోష్మకందమని పేరు

వరహారవార! సువిహయ!
సరసరసా! శ్రీవిహార! సాహాయ! రరా!
సురహరి! సారసశరసా!
హరశర! సారవర! సారహరి! హరిశాయీ!

వరహారవార - శ్రేష్ఠమైన హార సమూహములు  గలవాడా
సువిహయ - (సు-వి-హయ) - చక్కని పక్షివాహనము
           (గరుడవాహనము) గలవాడా
సరసరసా - (స-రస-రసా) - అనురాగముతో కూడిన
                          భూదేవి గలవాడా
శ్రీవిహార - లక్ష్మీదేవియొక్క విహారము గలవాడా
సాహాయ (సా - హా - య) కాంతికిని, ఈవికిని నిలయమైనవాడా
ర రా - (ర - ర - అ) - మనోహరుడైన మన్మథునికి హేతువైనవాడా
సురహరి - అమరులునింద్రుడు గలవాడా
సారసశరసా(సారసశర - సా) మన్మథుని వంటి దేహకాంతి కలవాడా
హరశర - హరునికి బాణమైనవాడా
సారవర - (సార-వర) న్యాైయముచేత శ్రేష్ఠమైనవాడా
సారహరి - స్థిరాంశము గలిగిన విష్ణువా
హరిశాయీ - శేషుని(సర్పము)పై శయనించువాడా