Sunday, October 9, 2016

చవితిన్ షష్ఠజుడేగి పంచమపతిస్థానంబు....


చవితిన్ షష్ఠజుడేగి పంచమపతిస్థానంబు....


సాహితీమిత్రులారా!



గూఢచిత్రం అనేకానేకాలుగా ఉంటుంది.
ఇందులోని భావం అంతసులువుగా అవగాహనకురాదు
ఎందుకంటే అక్కడున్న పదానికి మామూలుగా
మనం తీసుకునే అర్థంకాక సంకేతాలుగా ప్రతీకలుగా ఇలా
రకరకాలుగా ఉండటం వలన సులభగ్రాహ్యముగా ఉండదు.
ఇక్కడ ఒక పద్యం చూడండి-


చవితిన్ షష్ఠజుడేగి పంచమపతిస్థానంబు లంఘించి, యే
డవ వాడేలిన వీడుజేరి పదిలుండై యష్టమస్యందనో
ద్భవ వీక్షించి, తృతీయు చెంతకు చతుర్థ శ్రేణి నంపించి యా
దివిరోధిన్ బెదిరించి యప్పురి ద్వితీయన్నిల్పి వచ్చె న్వెసన్

ఇందులో ద్వితీయ,తృతీయ,చతుర్థ,
చవితి, పంచమపతి, ఏడవవాడేలిన,
అష్టమస్యందనేద్భవ ఇలాంటి పదాలకు
అర్థం అంతసులువుగా కనిపించవు.
దీనిలే ఉన్న సంఖ్యలకు అష్టదిక్పాలకుల
సంఖ్యలను జోడిస్తే అర్థం దొరుకుతుంది.

ఆది - తూర్పు
దిక్పాలకుడు(ఇంద్రుడు)
ద్వితీయము - ఆగ్నేయము -
ఆగ్నేయదిక్పాలకుడు (అగ్ని)
తృతీయము - దక్షిణము -
దక్షిణదిక్పాలకుడు (యముడు)
చతుర్థము - నైరుతు -
నైరుతి దిక్పాకుడు (నిఋతి) రాక్షసుడు
పంచమము - పడమర -
పశ్చిమదిక్పాలకుడు (వరుణుడు)
షష్ఠమము - వాయవ్యము -
వాయవ్యాధిపతి (వాయువు)
సప్తమము - ఉత్తరము -
ఏడవదిక్కు పాలకుడు (కుబేరుడు)
అష్టమము - ఈశాన్యము -
ఈశాన్యాధిపతి (ఈశ్వరుడు)
ఇప్పుడు అర్థం చూద్దాం-

చవితిన్ - నైరుతిదిక్కున,
షష్ఠజుడు - ఆరవదిక్కాలకుని కుమారుడు-
వాయునందనుడు - హనుమంతుడు,
ఏగి - వెళ్ళి,
పంచమపతిస్థానంబు - ఐదవదిక్కు(పడమర)అధిపతి
వరుణునిస్థానం - సముద్రం
లంఘించి - దాటి,
ఏడవవాడేలిన వీడుజేరి - కుబేరుడుపాలించిన లంకకు చేరి
అష్టమస్యందనోద్భవి - 8వ దిక్పాలకుడైన శివుని
రథానికి(భూమికి)పుట్టునది - సీత చూచి,
చతుర్థశ్రేణినిన్ - రాక్షససమూహాన్ని,
తృతీయుని చెంతకు- యముని వద్దకు పంపి,
ఆదివిరోధిన్ - తూర్పుదిక్పాలకుడైన
ఇంద్రుని విరోధి- రావణాసురుని,
బెదిరించి, అప్పురి ద్వితీయన్నిల్పి - ఆ లంకా పట్టణంలో అగ్నిని పెట్టి,
వెసన్ - శీఘ్రంగా, వచ్చె - వచ్చినాడు - అని భావం

నా కీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!


నా కీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా!



సాహితీమిత్రులారా!


కృష్ణదేవరాయల వాకిటిని కాపలాకాయు
 తిమ్మనికి రాజుగారు ఎప్పుడో మంచి
సేవలకుగాను ఒక సేలువా ఇచ్చాడట.
దాన్ని కప్పుకొని తిరుతున్న సమయంలో
దాన్ని తెనాలి కామకృష్ణుడు చూచాడట.
ఎలాగైనా దాన్ని కాజేయాలని ఎదురు చూస్తున్నాడు.
ఒకరోజు అతనికి ఒక పద్యమైనా కృతి తీసుకోమని సలహా ఇచ్చాడు.
అది ఊరకే ఇవ్వరుకదా అని అనగా
పద్యంలో నాలుగు పాదాలు నలుగురిని అడుగు
అప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వకుండా
సరిపోతుందని ఉపాయం చెప్పాడు.
అది సరైనదేనని మరునాడు సభలోకి
వెళ్ళే కవులను తనకోరిక చెప్పి
పెద్దనను మొదట అడిగాడు దానికి
ఆయన ఒక చరణం చెప్పాడు
తరువాత భట్టుమూర్తి రెండవ చరణం చెప్పాడు,
మూడవ చరణం తిమ్మన చెప్పాడు
నాలుగవచరణం తెనాలిరామకృష్ణుడు చెప్పాడు
ఆచరణంతో చివరకు ఆ శాలువా మారుపలక్కుండా ఇచ్చాడట.
ఆ పద్యం-


పెద్దన -               వాకిటికావలితిమ్మా!
భట్టుమూర్తి-        ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!
తిమ్మన -             నీకిదె పద్యము కొమ్మా!
రామకృష్ణుడు -    నా కీ పచ్చడమె చాలు నయమున నిమ్మా!

ఈ పద్యం నలుగురు చెప్పినా
అంత్యనుప్రాసలో చెప్పడం గమనార్హం.

Saturday, October 8, 2016

కచకుచాననగళనేత్రకరయుగముల....


కచకుచాననగళనేత్రకరయుగముల....


సాహితీమిత్రులారా!


ఈ పద్యంలో ఒక స్త్రీ అవయవములకు
ఏవేవి ఓడి ఎలా పోయినవో చెబుతున్నాడు కవి.
చూడండి-

కచకుచాననగళనేత్రకరయుగముల
కళికుభృచ్చంద్రతరవారిజలతలోడి 
పారెధరజొచ్చెగసియించెనీటమునిగె
(పోయిధరజొచ్చెగసియించెనీటమునిగె)
బంకబునజిక్కెనిడుదలైబయలుకురికె
(నానార్థగాంభీర్యచమత్కారిక - పుట.30)

ఆ స్త్రీ కొప్పునకు కుచమునకు, కంఠమునకు,
నేత్రములకు, చేతులకు, తుమ్మెదలు, పర్వతములు,
చంద్రుడు, శంఖము, పద్మము, లతలు ఓడిపోయి
తుమ్మెదలు పారిపోయినవట,
పర్వతములు భూమిలోకి వెళ్ళినవట,
చంద్రుడు క్షీణించుచున్నాడట,
శంఖము నీళ్ళలోకి పోయినదట,
పద్మములు బురదలోకి చేరినదట,
లతలు పొడుగులై పైకి పడిపోయినవట - పాపం.
అంత అందమైనదేమొ ఆ స్త్రీ.

కొప్పునకు -తుమ్మెదలు
కుచములకు - పర్వతములు
ముఖమునకు - చంద్రుడు
కంఠమునకు - శంఖము
నేత్రములకు - పద్మము
చేతులకు - లతలు
ఓడిపోయినవి-
ఓడిపోయి
తుమ్మెదలు - పారిపోయినవి
పర్వతములు - భూమిలోకి పోయినవి
చంద్రుడు క్షీణించి పోతున్నాడు
శంఖము నీటమునిగిపోయినది
పద్మములు బురదలో చిక్కుకుపోయినవి
లతలు పెరిగి పయికి పడిపోయినవి



ఘనాఘనా భస్య మహీమహీయస:


ఘనాఘనా భస్య మహీమహీయస:


సాహితీమిత్రులారా!

నాలుగు పాదములందు మొదటిలోను,
మధ్యలోను, చివరలోను వర్ణసముదాయము
ఆవృత్తమైన యమకాలంకార ఉదాహరణలు చూచి ఉన్నాము.
ఇపుడు ఆది, మధ్య యమకమునకు ఉదాహరణ చూద్దాము.
అంటే మొదటిలోను మధ్యలోను వర్ణసముదాయము ఆవృత్తవుతుంది.

ఘనాఘనాభస్య మహీమహీయస:
సురాసురాణాం దయితస్య తస్య సా
ధరాధరాకారగృహా గృహార్థి నో
బభూవ భూమేర్నగరీ గరీయసీ
(సరస్వతీకంఠాభరణమ్ -4-95)

మేఘము యొక్క కాంతి గలిగి,
లోకమునందు మహత్తరుడై, దేవతలకు రాక్షసులకు
విష్టుడైన ఆ గృహార్థియొక్క పర్వతాకార గృహములు గల
నగరము భూమికి గొప్పదిగా అయినది - అని భావం.

దీనిలో వ్యవభానములేకుండా అవ్యపేతముగా యమకము ఉంది
కావున ఇది అవ్యపేతయమకము అగుచున్నది.
 ప్రతి పాదమునందు రెండు చోట్ల ఆదిలోను మధ్యలోను
యమకము ఉండుటవల్ల
ఇది ఆదిమధ్యయమకము అగుచున్నది.

ఘనాఘనాభస్య మహీమహీయస:
సురాసురాణాం దయితస్య తస్య సా
ధరాధరాకారగృహా గృహార్థి నో
బభూవ భూమేర్నగరీ గరీయసీ

ఇందులో చివరి పాదము మొదటిలో బభూవభూ అని ఉన్నందున
వర్ణము వేరుగా కనిపించుచున్నది
 కాని ఇక్కడ "వబయో రభేద" - అనే సూత్రాన్నను
సరించి అది సరైనదే'వ'కును 'బ'కును భేదములేదు.

Friday, October 7, 2016

కానక గన్న సంతానంబు


కానక గన్న సంతానంబు 


సాహితీమిత్రులారా!

అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయములోని ఈ పద్యం చూడండి-
ఇది రాముడు అరణ్యమునకు పోవు సందర్భములో
దశరథడు బాధతో పలికిన పలుకులు ఎంత చమత్కారంగా
శ్లేషతో చెప్పబడినవో గమనింపుడు.

కానక గన్న సంతానంబు గావున
        గానక గన్న సంతానమాయె
నరయ గోత్ర నిధానమై తోచుగావున
        నరయ గోత్ర నిధానమయ్యె నేడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున
        ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండు గావిన 
        వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటగటా దాశరథి సముత్కట కరీంద్ర
కట కలిత దాన ధారార్ధ్ర కటక మార్గ
గామి, యెటు సంచరించు, నుత్కట కరీంద్ర
కటకలిత దాన ధారార్ధ్ర కటకతటుల
                            (రామాభ్యుదయము -5-12)

ఈ పద్యంలో ముందు భాగం తరువాతి భాగం
ఒకలానే కనిపిస్తూ అర్థభేదంకలిగి ఉన్నాయి.
1. కానక గన్న సంతానంబు - కలుగక కలిగిన సంతానము,
                                           అడవికొరకే కన్నసంతానము.
2. గోత్రనిధానము - వంశమునకు మూలమైనది,
                             కొండలు నివాసముగా గలది
3. ద్విజకులాదరణ వర్ధిష్ణుడు - బ్రాహ్మణ కుమును పోషించువాడు,
                                              పక్షిసముదాయమును పోషించువాడు.
4. వివిధాగ మాంత సంవేద్యుఁడు - బహువిధ వేదాంతములవలన తెలిసుకొనదగినవాడు,
                                                 బహువిధ వృక్షములనడుమ తెలిసుకొన దగినవాడు

5. సముత్కట కరీంద్ర .... కటక మార్గ
                     ఏనుగుల మదజలముచే తడిసిన పురములకేగువాడు,
                     ఏనుగుల మదజలముచే తడిసిన కొండవాలులుగల త్రోవలందు సంచరించువాడు
ఈ విధంగా రెండర్థములను ఆలోచిస్తూ దు:ఖిస్తున్నాడు దశరథుడు.

రమ్యలతా వకులై: కులై:


రమ్యలతా వకులై: కులై:


సాహితీమిత్రులారా!



యమకాలంకారంలో
అంత్యయమకమును
గురించి ఇక్కడ చూద్దాం.

వ్యవథిత సింధుమనీరశనై: శనై:
రమరలోకవధూజఘనై ర్ఘనై:
ఫణవతా మభితో వితతం తతం
దయిత రమ్యలతా వకులై: కులై:
                          (కిరార్జునీయమ్ - 5-11)

అనీ రశనై: -మొలత్రాళ్లతో, ఘనై: - దట్టమైన,
అమరలోక వధూజఘనై: - స్వర్గంలోని స్త్రీల పిరుదులతో,
శనై: - మెల్లగా, వ్యథితసింధుం - అడ్డుకోబడిననదులుగలది,
దయిత రమ్యలతా వకులై: - ప్రియము- అందము గల తీగలు పొగడలు గల్గి,
ఫణభృతాం - సర్పాల, కులై: - సమూహాలతో, అభిత: - అంతట,
తతం - మిక్కిలి, వితతం - విస్తరించినది.


ఆహిమాలయం అందమైన మొలత్రాళ్లతో కూడిన
చేవాంగనల పిరుదులతో అడ్డుకోబడిన మందగతిని
పొందిన నదులతోను, మనోహరాలైన తీగలు పొగడలు
ఆకర్షించగా చేరిన సర్పాలు అంతటా వ్యాపించి అందంగా ఉంది
మరో స్వర్గంగా భాసించిందని భావం.


వ్యవథిత సింధుమనీరశనై: శనై:
రమరలోకవధూజఘనై ర్ఘనై:
ఫణవతా మభితో వితతం తతం
దయిత రమ్యలతా వకులై: కులై:

ఇందులోనూ నాలుగుపాదాలలో యమకం ఉంది
మరియు అవ్యపేతమును. ప్రతిపాదం అంత్యంలో
అక్షరసముదాయం ఆవృతమైనందున
ఇది అంత్యయమకంగా చెప్పబడుచున్నది.
మొదటి పాదంనందు శనై:, రెండవపాదంనందు ఘనై:,
మూడవపాదంనందు తతం, నాలుగవపాదంనందు కులై :
పాదాంతములందు ఆవృత్తి పొందినవి.

Thursday, October 6, 2016

శిలార్పిత పదద్వంద్వా


శిలార్పిత పదద్వంద్వా  


సాహితీమిత్రులారా!





ఈ ప్రహేలిక చూడండి-

శిలార్పిత పదద్వంద్వా నాసార్పిత కరద్వయా
అభూత్ వ్యక్త స్తనీ నారీ కథమేతత్ భవిష్యతి?

రెండు కాళ్ళు శిలయందుమోపి
రెండుచేతులు ముక్కుపై పెట్టుకొని
స్త్రీ స్తనములను వ్యక్తపరిచెను అని
- దీని సారాంశము.
ఇదెలా
ఇక్కడ శిల అంటే కడప(గడప),
నాసా అంటే ద్వారరము పై దారువు.
దీని ప్రకారం
ఆ స్త్రీ గడపమీద రెండు కాళ్ళు పెట్టి రెండుచేతులతో
ద్వారబంధము పై పట్టీని రెండు చేతులతో పట్టుకొన్నది
కావున ఆమె స్తనములు చూపుతున్నట్లున్నది.