Monday, October 3, 2016

తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు (పేరడీ)


తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు (పేరడీ)


సాహితీమిత్రులారా!


వేణుగోపాల శతకంలోని ఈ పద్యం చూడండి

తండ్రి మధ్వాచారి తనయుడారాధ్యుండు
            తల్లిరామాన్జ మతస్థురాలు
తనదికూచి మతంబు తమ్ముడు బౌద్ధుడు
            సర్వేశ్వర మతంబు సడ్డకునిది
ఆలుకోమటిజాతి దక్క జంగమరాలు 
            బావగారిది లింగబలిజ కులము
ఆడుబిడ్డసుతారి అల్లుఁడు పింజారి
             మఱఁదలు కోడలు మారువాడి
కలియుగంబున వర్ణసంకరులు ప్రబలి
యుత్తమకులంబు లొకమూల కొత్తిగిల్లె
మదరిపువిపాల మునిజన హృదయలోల
వేణుగోపాల! భక్త సంత్రాణశీల!
                            (వేణుగోపాల శతకము - 38)

దీనికి దాశరథిగారి పేరడీ పద్యం చూడండి-

తండ్రి కాంగ్రెసువాది, తల్లి దేశమువాది
                     తనయుడు మార్క్సుస్టు తత్వవేత్త
కూతురు బీజేపి కోసము పోరాడు 
                     అల్లుడు జనతాను అనుసరించు
నిన్నటి జాతీయనేత నేడు విజాతి
                     సిద్ధాంతములు ప్రవచించసాగు
మొన్నటి ప్రాంతీయ మూర్తి ఈ రోజున
                      అఖిలభారతమని అలమటించు
ఓట్లకొరకయి యెన్నయోపాట్లుపడిరి
నోట్ల కట్టలు చూపి సంతోష పెట్టి
యెన్ని చేసినగాని ఓట్లిచ్చువారు 
తమకు తోచిన దారినే కదలినారు
(దాశరథిగారి పొలిటిగేషన్ ఒకే సీసపద్యం
హాస్యప్రియ మాసపత్రిక డిసెంబరు1984)

కాంతాధర: కేవలమ్


కాంతాధర: కేవలమ్


సాహితీమిత్రులారా!


సంభాషణ చిత్రాలు అనేకం చూశాం
ఇదొక ప్రేయసి - ప్రియుల సంభాషణ చూడండి

ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా:  పిత్తజ్వరవ్యాకులా:
నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్
తత్తై: కిం క్రితాం చిక్సకపతే! ముగ్దే సుఖం సేవ్యతాం
సద్యస్తాపహరస్సుధాధికతర:  కాంతాధర: కేవలమ్
                                                          (లోలంబరాజీయమ్)

ప్రియుడు-  ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా:  పిత్తజ్వరవ్యాకులా:
                 నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్
                 తత్తై: 
                (ఓ ప్రియురాలా పురుషులకు పైత్యజ్వరం వచ్చి బాధపడుతున్నపుడు
                  అనేకరకాల మూలికలతో తయారుచేసినది, ఆలస్యంగా ఫలితాన్నిచ్చేది,
                  త్రాగేప్పుడు వగరుగా ఉండి చికాకు కలిగించేది. అయిన కషాయాన్ని తాగవద్దు)

ప్రేయసి -   కిం క్రితాం చిక్సకపతే! 
                (అయితే వారేం చేయాలి?)
ప్రియుడు -                                               ముగ్దే సుఖం సేవ్యతాం
                    సద్యస్తాపహరస్సుధాధికతర:  కాంతాధర: కేవలమ్ 
                   (ఏమీలేదు. వెంటనే తాపాన్ని హరించేదీ, అమృతంకంటే ఎక్కువ రుచిగా
                     ఉండేదీ అయిన తన ప్రియురాలి అధరామృతం ఆస్వాదిస్తే చాలు.
                     వెంటనే అతని పైత్య జ్వరం నిమ్మళిస్తుంది)

Sunday, October 2, 2016

రాజీవ రాజీవశలోల భృంగం


రాజీవ రాజీవశలోల భృంగం


సాహితీమిత్రులారా!


యమకాలంకారము అంటే విభిన్నమైన
అర్థం కలిగి ఒకేవిధమైన రూపంగల వర్ణసమూహం.
వర్ణసమూహం యొక్క ఆవృత్తి అవ్యపేత(వ్యవధానంలేకుండా),
వ్యపేతము(వ్యవధానముతోటి) అయిన యమకము అని పిలువబడును.

ఇది అనేకరకములు అందులో
అవ్యపేత యమకమునకు ఉదాహరణ-

రాజీవ రాజీవశలోల భృంగం
ముష్ణంత ముష్ణం తతిభి స్తరూణామ్
కాంతాలకాంతా లలనా: సురాణాం
రక్షోభి రక్షోభిత ముద్వహన్తమ్
                               (మాఘ శిశుపాలవధ)

శిశుపాలవధలో రైవతకాద్రి వర్ణన సందర్భంలోనిది ఈ శ్లోకం
(రాజీవముల సమూహమునకు వశమై చలించుచున్న
తుమ్మెదలను గలది వృక్షముల సమూహములచేత
ఎండవేడిమిని హరించుచున్నది అందమైన
ముంగురులుగల దేవతాస్త్రీలను రాక్షసులచేత
క్షోభనొందకుండా భరించుచున్నది.)


అవ్యపేత అంటే వ్యవధానంలేకుండా వర్ణసమూహము
ఆవృత్తమైన అది అవ్యపేత యమకము అంటాము.
ఈ యమకము నాలుగు పాదాలలో ఉంటే
చతుష్పాదయమకము అని,
ప్రతిపాదము మొదటిలో ఉన్న
ఆదియమకము అని చెప్పబడుతుంది.

1. మొదటి పాదంలో రాజీవ - (పద్మము), రాజీ - (సమూహము).
2. రెండవపాదంలో ముష్ణంత, ముష్ణం
3. మూడవపాదంలో కాంతాలకాంతాల - కాంత+ అలక + అంతా(:) + ల అనునవి
4. నాలుగవ పాదంలో రక్షోభి: +  అక్షోభి(త) అనునవి అవ్యవహితంగా ఆవృత్తి చెందాయి.

జన్మదినశుభాకాంక్షలు


జాతిపిత మహాత్మాగాంధీ 
మాజీప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి
జన్మదినశుభాకాంక్షలు


జ్యేష్ఠుఁడుగాని జ్యేష్ఠుఁడెవరు?


జ్యేష్ఠుఁడుగాని జ్యేష్ఠుఁడెవరు?


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానాలు చెప్పగలరేమో ఆలోచించండి

రసముగానటువంటి రసమేదియగుచుండు?
కంఠమ్ముగానట్టి కంఠమేది?
మణిగానియటువంటి మణియెవ్వఁడగుచుండు?
చంద్రుండుగానట్టి చంద్రుఁడెవఁడు?
గజముగానటువంటి గజమేది యగుచుండు?
రత్నమ్ముగానట్టి రత్నమెవఁడు?
రథముగానటువంటి రథమేదియగుచుండు?
దేశమ్ముగానట్టి దేశమేది?
వాడగానటువంటి యావాడయేది?
జ్యేష్ఠుఁడేగాని యటువంటిజ్యేష్ఠుఁడెవఁడు?
మెప్పుగానుత్తరమ్ములు చెప్పవలయు
దేవ! శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

మరి ఆలోచించారా సమాధానాలు చెప్పడానికి

1. రసముకాని రసము - ఘనరసము(నీరు)
2. కంఠము కాని కంఠము - క్షీరకంఠము (బిడ్డ)
3. మణికాని మణి - రాత్రిమణి (చంద్రుడు)
4. చంద్రుడు కాని చంద్రుడు - హరిశ్చంద్రుడు(ఒక చక్రవర్తి)
5. గజము కాని గజము - అంబుగజము (మొసలి)
6. రత్నము కాని రత్నము - దినరత్నము (సూర్యుడు)
7. రథము కాని రథము - బ్రహ్మరథము (హంస)
8. దేశము కాని దేశము - అతిదేశము (బదులు)
9. వాడ కాని వాడ - గుడివాడ(బెజవాడ)(ఒక ఊరు)
10. జ్యేష్ఠుడు కాని జ్యేష్ఠుడు - సురజ్యేష్ఠుడు (బ్రహ్మ)

Saturday, October 1, 2016

అహిభుగ్వాహగ భవ్యా


అహిభుగ్వాహగ భవ్యా


సాహితీమిత్రులారా!


నాలుక కదలకుండా మాట్లాడగలమా?
ఆలోచించండి అది కష్టమైనదేనా?
మరి మన కవులు అచలజిహ్వ పేరున పద్యాలే వ్రాశారు.
మనం కొన్ని ఇలాంటివి చూసి ఉన్నాము
మరల ఇక్కడ ఒక పద్యం చూద్దాం.
దీన్ని చదివే సమయంలో గమనించండి
నాలుక కదులుతుందేమో!

అహిభుగ్వాహగ భవ్యా
వహ హేమామహిప అంబువాహవిభాకా
బహుమోహ వ్యూహాపహ
మహామహాభూమవిభవ మముఁగావువిభూ!
        (శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరము -2- 5)

(అహిభుక్ - పాములను తినే గరుత్మంతుడు,
వాహగ - వాహనముగా పొందినవాడా,
హేమా - మహి - ప - శ్రీ భూముల యొక్క నాథుడా,
బహు - మోహ వ్యూహ - అపహ - గొప్పదైన అజ్ఞానరాశిని కొట్టివేయువాడా,
భూమవిభవా - గొప్పధనము గలవాడా)

కావ్యకరణే సేనాగణే భాషణే......


కావ్యకరణే సేనాగణే భాషణే......

సాహితీమిత్రులారా!

చర్లవెంకటశాస్త్రి 
విచిత్రరామాయణంలోని శ్లోకం ఇది.
విశ్వామిత్రమహర్షి దశరథమహారాజుని
స్తుతిస్తున్న సందర్భంలోనిది.

త్వాముర్వీవరవర్య కావ్యకరణే సేనాగణే భాషణే
త్రాణే వ్యారకణే రణే వితరణే విశ్వంభరాధారణే
సత్యం సత్యవతీభయే శరభయే వాణీశయే విష్ణయే
దాక్షీకుక్షిభయే పృథోదరభయే కల్పద్రయే మేరయే

ఓ రాజా! నీవిషయంలో కావ్యరచనలో, సేనాసమూహ
విషయంలో, భాషణంలో, రక్షించటంలో, వ్యాకరణంలో,
యుద్ధంలో, దానగుణంలో, భూమిని భరించటంలో,
నేను క్రమంగా వ్యాసునివలె, కుమారస్యామివలె, బ్రహ్మవలె,
విష్ణువువలె, పాణినివలె, అర్జునివలె, కల్పవృక్షంవలె,
మేరుపర్వతంవలె, భావిస్తున్నాను- అని భావం

ఇందులో మొదట 8విషయాలను చెప్పి
తరువాత వాటిని అన్వయించాడు.
ఈ విధంగా తీసుకోవాలి-

ఓ దశరథమహారాజా!
కావ్యకరణం(కావ్యరచన)లో - వ్యాసునివలె,
సేనాసమూహ విషయంలో - కుమారస్వామివలె,
భాషణం(మాట్లాడటం)లో - బ్రహ్మ(వాణీశుని)వలె,
రక్షించటంలో - విష్ణువువలె,
వ్యాకరణంలో - పాణినివలె,
యుద్ధంలో - అర్జునునివలె,
దానగుణంలో - కల్పవృక్షంవలె,
భూమిని భరించటంలో - మేరుపర్వతంవలె
నేను నిన్ను భావిస్తున్నాను.

సత్యవత్యాం భవతీతి సత్యవతీభూ: వ్యాస:,
సత్యవతీ భూరి ఇవ అచరామి సత్యవతీభయే.
ఆచారార్థంలో 'ణిచ్' ప్రత్యయం వచ్చిన
నామధాతురూపము ఇది.
ఇదే విధంగా
శరభూ: - కుమారస్వామి, శరభూరి వ అచరామి - శరభయే,
వాణీశ: ఇవా చరామి వాణిశయే,
మేరు రివాచ రామి మేరయే -
ఈ విధంగా గ్రహించాలి.

దీనిలోని విష్ణయే, మేరయే, కల్పద్రయే - అనేవి
అపశబ్దాలుగా భ్రాంతిని కలిగిస్తాయి -
కాని వ్యాకరణం తెలిసినవారు
దీనిలోని చమత్కారం సులభంగా తెలుసుకోగలరు.