Saturday, September 4, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3

భోజమహారాజు - సమస్యాపూరణలు - 3




సాహితీమిత్రులారా!



 ఒకమారు ముగ్గురు వ్యక్తులు భోజరాజు దర్శనానికి

వెళ్ళగా వారికి ఉచితరీతిని సత్కరించి మీరేమైనా
శ్లోకాలు రాశారా?  అని ప్రశ్నించాడు. దానికి వారు
ఇప్పటికి ఏమీ రాసుకొని రాలేదు నెలవైతే రాసుకొని
వస్తామని చెప్పి సెలవుతీసుకున్నారు.
కానీ కవిత్వమంటే ఏంటో వారికి తెలియదు
వారు రాయాలని ఆలోచన ప్రారంభించారు.
ఆశ చెడ్డదికదా! ఏలాగైనా నాలుగు పాదాలు కూర్చుకొని
ఒక శ్లోకమైనా పూర్తి చేయాలని ముగ్గురు కూడబలుక్కొని
ఒక్కొక్కపాదం ఒకరు పూర్తి చేసేవిధంగా మాట్లాడుకున్నారు.
ఎంత ప్రయత్నించినా ఎవరికీ ఏమీ తెలియడంలేదు.
వారిలో ఒకడు సాధారణంగా అనుకొనే ఒకపాదాన్ని
గుర్తుకురాగా అది చెప్పి గండం గడిచిందనుకున్నాడు.
ఆ పాదం-
అనిత్యాని శరీరాణి

రెండవవాడు ఎప్పుడో విన్న పాదం చెప్పి
తనగండం గడిచిందనుకున్నాడు.
రెండవ పాదం -
శాకాయ లవణాయ చ

మూడవవాడు చిన్నప్పుడు చదివిన
బాలరామాయణశ్లోకంలోని పాదం చెప్పి
ఊరకున్నాడు.
ఆ పాదం -
కూజన్తం రామ రామేతి

మూడు పాదాలు పూర్తయినాయి కాని నాలుగవపాదం
ఎంతప్రయత్నించినా వారి వల్లకాలేదు. మాటిమాటికి ఆ పాదాలనే
వల్లెవేస్తూ దారిలో వెళుతున్నవారిని కాళిదాసు వారి అవస్థనుచూచి
నాలుగవపాదం పూర్తిచేసి ఇక మీకు సన్మానం జరుగుతుంది రాజుదగ్గరకు
రండి అని చెప్పి లోనికి వెళ్ళాడు. కాళిదాసు పూర్తిచేసి ఇచ్చిన తర్వాత
కడతేరాం దేవుడా!  అనుకొని రాజుగారి ముందుకు వెళ్ళారు.
దాని్ని చూచిన రాజుగారు నాల్గవపాదం చెప్పినవారికి
అక్షరలక్షలు ఇచ్చితిని అనగా వారు రాజుగారికి
జరిగినదంతా చెప్పారు.
దానితో కాళిదాసును రాజుగారు సత్కరించాడు.
ఆ (పూర్తి)శ్లోకం -

అనిత్యాని శరీరాణి
శాకాయ లవణాయ చ
కూజన్తం రామ రామేతి
మత్వా మాగా గళం వహ

వీటి అర్థం-
అనిత్యాని శరీరాణి (శరీరము అనిత్యము)
శాకాయ లవణాయ చ (శాకమునకును, లవణమునకును)
కూజన్తం రామ రామేతి (రామ రామ అని కూయుచున్నది)
ఈ మూడు పాదములకు అతుకు పెట్టి క్రమాలంకారంలో చెప్పాడు కాళిదాసు.
మత్వా మాగా గళం వహ

అనిత్యాని శరీరాణి మత్వా 
(శరీరము అనిత్యమని తలచి)
శాకాయ లవణాయ చ మాగా: 
(శాకమునకును, లమణమునకును పోకుము)
కూజన్తం రామ రామేతి గళం వహ
(రామరామ అని కంఠమున వహింపుము)

దీని భావం -
ఓ నరుడా! శరీరము అనిత్యమని తలచి,
కూరగాయలు కావాలని ఉప్పు కావాలని వెంపర్లాడకు.
ఎల్లపుడు రామరామ అని కీర్తనను కంఠంనందు
వహించు అనగా ఎల్లపుడు రామనామాన్ని
సంకీర్తన చేస్తూ ఉండు - అని భావం.

No comments: