విభక్తి గూఢము
సాహితీమిత్రులారా!
ఒక పద్యం లేక శ్లోకంలో విభక్తిని మరుగు
పరచిన దాన్ని విభక్తిగూఢము అంటారు.
దీని ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-
పాయా న్మా మురసావితః శ్రియమునా రాధ్యాం ప్రపద్యేత మాం
కోవా న స్థిర మశ్నుతే శమధనో2 ప్యాలోకితో జాతుచిత్
వేదాంతై ర్వినుతాంఘ్రయే న కి ముతశ్శ్రేయోనతిం తన్వ తాం
సేవా మో రచయామి మానస సదా భక్త్యా పహా వాదరమ్
దీనిలో సప్త విభక్తులు- ప్రథమావిభక్తి నుండి సప్తమీవిభక్తి వరకు
ఉన్న 7 విభక్తులు గూఢం చేయబడినవి. అవి తెలియాలంటే
ముందుగా శ్లోకాన్ని పదవిభాగాలుగా చేసుకోవాలి-
పదవిభాగం-
పాయాత్, మాం, ఉరి, అసే, ఇతః, శ్రియం, ఉనా,
ఆరాధ్యాం, ప్రపద్యేతమాం, కరి, వా, న, స్థిరం, అశ్నుతే,
శం, అధనః, అపి, ఆలోకితః, జాతుచిత్, వే, దాంతైః,
వినుతాంఘ్రయే, న, కిమ్, ఉతః, శ్రేయః, నతిం,
తన్వతాం, సేవాం, ఓః, రచయామి, మానస, సదా,
భక్త్యా, ఆవహ, ఔ, ఆదరమ్.
దీనిలో లక్ష్మీ వాచకమైన ఉ - శబ్దం యొక్క ఏడు విభక్తులు
సంధిమూలంగా దాగిఉన్నాయి.
ఓ మనసా, లక్ష్మి యందు ఎల్లపుడు ఆదరాన్ని కలిగి ఉండమని
కోరే శ్లోకం ఇది.
ఉరసాపాయాత్, వేదాంతైః, సేవామో, భక్త్యావహౌ
మొదలైన చోట్ల అపార్థ భ్రమ కలిగించే విధంగా
శ్లోకం కూర్చబడింది.
ఉ - శబ్దానికి క్రమంగా 7 విభక్తులలో రూపాలు-
ఉః, ఉం, ఉనా, వే, ఓః, ఓః, ఔ - అని ఉంటాయి.
శ్లోకంలో ఉరసా అనే చోట ఉః - అనే ప్రధమ(కర్త) గుప్తము.
శమధనః - లో శం అనే ద్వితీయ(కర్మ) గుప్తమైంది.
యమునా రాధ్యాం - లో ఉనా - తృతీయవిభక్తి(కరణం) గుప్తం.
శ్రియముతః - లో ఉతః - అనే చోట పంచమీ(అపాదానం) గుప్తం
పంచమ్యర్థంలో తసిల్ ప్రత్యయం - సేవామోరచయామి - అనే చోట
ఓః - అని షష్ఠి గుప్తము, భక్త్యావహౌ - అనే చోట ఔ - అనే సప్తమీ గూఢంగా ఉంది.
ఈ లక్ష్మి నన్ను కాపాడుగాక,
శివునిచే పూజింప దగిన లక్ష్మిని
నేను ఆశ్రయిస్తున్నాను.
ఆమె కటాక్షానికి పాత్రుడైన
ఏ దరిద్రుడు సంపదను పొందడు
దాంతులైన మునులచే నమస్కరించబడు
లక్ష్మి వలన వారికి శ్రేయస్సుకలుగుటలేదా
ఓ మనసా........ లక్ష్మి యందు ఆదరము
కలిగి ఉండుము. ఆమెకు సేవ చేస్తాను-
శ్లోక భావం.
No comments:
Post a Comment