Monday, October 8, 2018

గద్యములో పద్యములు


గద్యములో పద్యములు
సాహితీమిత్రులారా!

పరిచయము
ఇటీవల భారతదేశానికి వెళ్లినప్పుడు అందరి ఇళ్లల్లో విధిగా పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానమువారి భక్తి చానల్ కార్యక్రమాలను చూడడము జరిగినది. అప్పుడు రెండు మూడు మారులు శ్రీనివాస గద్యమును నేను విన్నాను. ఎన్నోమారులు ఆ స్తోత్రమును వినియున్నను, ఈ మారు అందులో వినబడిన కొన్ని లయాన్విత వాక్యములు నన్ను ఆకర్షించినాయి. అవి పద్యములు కాకున్నా, అందులో పద్యాల నిర్మాణసూత్రాలు దాగి ఉన్నట్లు నాకు తోచినది. తరువాత ఆ గద్యమును నిశితముగా పరిశీలించిన పిదప అందులో కొన్ని తాళవృత్తములకు సరిపోయే అమరికలను కనుగొన్నాను. వాటితో నిర్మించిన కొన్ని వృత్తములను మీకు ఈ వ్యాసములో పరిచయము చేయబోతున్నాను.

గద్యము, వచనము
కావ్యములలో మనము చదివే భాగములను రెండు విధములుగా విభజించవచ్చును: గద్యము లేక వచనము, పద్యము. తెలుగులో పూర్తిగా పద్య కావ్యములు అరుదు. అలా వ్రాసినప్పుడు అందులో వచనము లేదని కవులు గర్వముగా చెప్పుకొన్నారు, ఉదా: తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణము. వచనములు, పద్యములు రెండు ఉండే కావ్యములను చంపూకావ్యములు అంటారు. ఆశ్వాసాంతములో వచ్చే వచనములను గద్యములని, మిగిలిన వాటిని వచనములని పిలుచుట వాడుక. ఇట్టి కావ్యములలో మనము చదివే వచనములు ప్రాసానుప్రాసలతో, అలంకారాలతో ఒక లయతో, ఒక తూగుతో ఉంటాయి.

యాదృచ్ఛికముగా భాగవతమునుండి ఒక వచనమును గ్రహించినాను. అది బలరాముని తీర్థయాత్రలను గుఱించి వ్రాసేటప్పుడు పోతన తన భాగవతములో ఒక వచనములో (దశమస్కంధము, ఉత్తరభాగము – 953) ఇలా వర్ణించినాడు:

అచ్చోటు వాసి వృషభాద్రినెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడి మొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలం బెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణ సముద్రంబు దర్శించి, కన్యాఖ్య దుర్గాదేవి నుపాసించి, పంచాప్పరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతియైన కామదేవిని వీక్షించి, తాపిం బయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం ప్రభాతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణజనంబులవలన బాండవధార్తరాష్ట్రుల భండనంబునందు సకలరాజలోకంబు పరలోకగతులగుటయు, వాయునందనసుయోధనులు గదాయుద్ధసన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని –

ఈ వచనము, ‘నేను అంగడికి వెళ్లి పుస్తకము కొన్నాను’ లాటి వచనము కాదు. ఇట్టి వచనములను చదువుతుంటే మనము ఒక పారవశ్యమునకు లోనవుతాము. సంస్కృతములో కూడ ఏవో కాదంబరి వంటి పుస్తకములు తప్ప పూర్తిగా వచన కావ్యములు ఎక్కువగా లేవు. భగవంతుని ధ్యానించు స్తోత్రములను గద్యములుగా శ్రీరామానుజాచార్యులు వ్రాసినారు; శ్రీరంగనాథ గద్యము, శ్రీశరణాగతి గద్యము, శ్రీవైకుంఠ గద్యము. శ్రీశైల శ్రీరంగాచార్యులు పందొమ్మిదవ శతాబ్దములో శ్రీనివాసగద్యమనే ఒక స్తోత్రమును తిరుమలాధీశుడైన శ్రీవేంకటేశ్వరస్వామి పైన వ్రాసినారు. ఆ గద్యమునే నేడు కూడ స్వామివారి ఆలయమునందు తిరుప్పావడసేవ సమయములో రాగయుక్తముగా పాడుతారు.

గద్యవచనములలోని తెఱగులు
లాక్షణికుడైన వామనుడు గద్యమును మూడు విధములుగా విభజించాడు – అవి వృత్తగంధి, చూర్ణము, ఉత్కళిక. పేరుకు తగ్గట్లు వృత్తగంధి అంటే పద్యముల నడకను కలిగి వ్రాయబడినది. అదే విధముగా పొడి పొడి మాటలతో వ్రాయబడినది చూర్ణము. పెద్ద పెద్ద సమాసాలతో ఆడంబరమైన పదాలతో వ్రాయబడినది ఉత్కళిక. వీటికి తోడుగా సమాసరహితముగా ఉండే వచనమును ముక్తకము అని విశ్వనాథకవి పేర్కొన్నాడు. పైన ఉదహరించిన పోతనకవి వచనము చూర్ణము అని చెప్పవచ్చును. చూర్ణికలలో ప్రసిద్ధమైనది యొకటి మొల్లరామాయణములో వంది చేసిన రావణస్తుతి (యుద్ధకాండ, 3.29) ‘జయజయ కైకసీగర్భసముద్ర సంపూర్ణసుధాకరా’ అనే పదములతో ఆరంభమై ‘జయీభవ దిగ్విజయీభవ’తో ముగుస్తుంది.

వృత్తగంధి వచనములను గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో చదువ వీలగును. అందులోని వచనములో ఒక భాగము –

కొంత తడవుండి యంతట

కం.  కలరవశుకీ శిఖాశ్వళ
      కలహంసరథాంగ భృంగ – కహ్వ బలాకా
      కలకంఠి శారికాముఖ
      కలకల కలరవ నితాంత – కమనీయంబై

వి.   మధూకమాలూర మహీరణాసహా
      మండూకపర్ణి మధుశిగ్రు మాలతీ
      మధూళికా మన్మథ మాతులుంగ
      మాకంద సమ్మార్జున మాధవీలతా

తే.   కీరసహకార సహకార – నారికేళ
      పూగ ఘనసార ఘనసార – భూజమధ్య
      కుముదవనజాత వనజాత – కుందబృంద
      గళిత సుమధూళి సుమధూళి – కలితమైన … (512)

ఇందులో మొదటిది కందము, రెండవది వంశస్థ, లలిత, ఉపేంద్రవజ్ర, ఇందువంశ పాదాలతో నొక విషమవృత్తము, మూడవది తేటగీతి.

అనంతుని ఛందములో ఛందఃప్రస్తావన చేయుటకు ముందే వచనములను గుఱించిన పద్యము (ఛందోదర్పణము, 2.2) ఇలాగున్నది –

కం.  కనుగొన పాదరహితమై
      పనుపడి హరిగద్దెవోలె – బహుముఖరచనం-
      బున మెఱయు గద్య మది దాఁ
      దెనుఁగు కృతుల వచనమనఁగ – దీపించుఁ గడున్

అట్టి వచనమునకు ఒక ఉదాహరణమును కూడ తఱువాత యిచ్చాడు.

అప్పకవి గద్యపద్యములను ఇలా వివరించాడు (అప్పకవీయము, 4.23) –

మ.  ధర సాహిత్యము గద్యపద్యములనం – దా రెండు భేదంబులై
      పరఁగున్ గద్యమునందుఁ బాదనియతుల్ – భావింపఁగా లేవు వా-
      క్స్ఫురణంబై విలసిల్లఁగా నుడువ నొ-ప్పున్ గావ్య మెంతేనియున్
      మరుతండ్రీ మఱి దీనికే వచననా-మంబయ్యె నాంధ్రంబునన్

తఱువాత ఒక ఉదాహరణమును కూడ ఇచ్చాడు.

పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో గద్యలక్షణములను వివరించిన విధము –

మఱియు నందు గద్యయు నైదు భేదమ్ముల విహరించునవి యెయ్యని యంటేని – గద్యయు, బిరుదగద్యయు, చూర్ణికయు, వచనంబును, విన్నపంబు నన గద్యభేదమ్ము లైదును ప్రమోదమ్మున వివిధ విధమ్ముల నొందించునందు గద్యక్రమం బెటువలెగద్యయు నంటేని – కరణశబ్దయుక్తంబై యొప్పు, నందు బిరుదగద్య సంబోధనాంత పదబంధురంబై వర్తిల్లు, నందు చూర్ణిక లేకవచన ద్వివచన బహువచన సందర్భంబులుగ విభక్త్యానుశాసనిక సమాసాదిత కల్పనానల్పజల్పితంబై వెలయు, నందు వచనంబులు బహుప్రకార రచనానిచయ ప్రాచుర్యమ్ములై సంచరించు, నందు విన్నపంబులెన్నఁ దిన్ననై ఋజుమార్గంబుల ననుగమించు, నీ పంచవిధమ్ములు మితరహితమ్ములై స్వేచ్ఛాకల్పనా గౌరవమ్ముల కొలందుల విలసిల్లు. (3.421)

ప్రసిద్ధి కెక్కిన తెలుగు వచనములు సింహగిరి వచనములు, తాళ్లపాక పెదతిరుమలాచార్యుల వేంకటేశ్వర వచనములు, సభాపతి వచనములు, శఠగోపయతి విన్నపములు.
శ్రీనివాస గద్యము
శ్రీరంగాచార్యులు వ్రాసిన గద్యమును తిరుమల తిరుపతి దేవస్థానమువారు 1943లో శ్రీవేంకటేశ కావ్యకలాప మనే పుస్తకములో 324-326 పుటలలో ప్రచురించారు. తరువాత శ్రీ అనంతశయనం అయ్యంగారులు రాగములు మున్నగువాటిని ఈ గద్యములో చేర్చినారు. అంటే యిప్పుడు మనము వినే గద్యములో ప్రథమ భాగమును మాత్రమే శ్రీరంగాచార్యులు వ్రాసినారు. ఈ గద్యము పూర్తి పాఠమునకు తెలుగు తాత్పర్యము ఇంటర్నెట్‌లో నాకు దొరకలేదు. కాని గద్యమును వింటూ ఆంగ్లములోని అనువాదము నిక్కడ చదువ వీలగును. దేవస్థానమువారి శ్రవణసుభగమైన స్తోత్రము నిక్కడ విన వీలగును. నా ఆశయము ఇందులోని తాళానుకూల భాగములను ఎత్తి చూపి, అట్టి అమరికతోగల వృత్తములను మీకు ఈ వ్యాసములో పరిచయము చేయడము మాత్రమే.

తాళవృత్తముల మూసలు
1. శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య …

(శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలము మున్నగు కొండల దండచే నొప్పునట్టి …)

ఇందులో శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల పదాలకు ఆఱు మాత్రల లయ గలదు. వీటిని తీసికొని ఒక వృత్తమును నిర్మించినాను. దానిని క్రింద చదువ వచ్చును. ఇది రూపక తాళమునకు సరిపోవును. ఇట్టి తాళవృత్తములకు అక్షరసామ్య యతికన్న ప్రాసయతి కర్ణానందముగా నుండును, అందువలన ప్రాసయతిని ఉంచినాను.

సప్తగిరి – త న భ త న భ త న గ UUII IIUII UUII IIUII UUII IIU, ప్రాసయతి (1, 10, 19)
25 అభికృతి 15956413

వేసమ్ముల నెఱుగంగద – వాసమ్ముల నరయంగద – దోసమ్ముల మునుగన్
మీసమ్ముల తిరిగించుము – హాసమ్ముల వెలిగించుము – నా సంతస మనగన్
రాసమ్ముల నటియించుము – ప్రాసమ్ముల బలికించుము – నా సంబరములకై
త్రాసమ్ముల దొలగించుము – దాసున్ నగి కరుణించుము – నీ సమ్మతికొఱకై

గతిగర్భకవిత్వము – ఈ ఆఱు మాత్రల వృత్తమును నాలుగేసి మాత్రలుగా విడదీసి కూడ వ్రాయవచ్చును. అలా వ్రాస్తే చతురస్రగతిలో పాడుకొనవచ్చును. ఈ లయ స్తోత్రములో లేకున్నను, దానికి కూడ ఉదాహరణమును క్రింద ఇచ్చియున్నాను. ఒక వృత్తములో మఱొక వృత్తము లేక జాత్యుపజాతుల పద్యములను ఇమిడించు ప్రక్రియను గర్భకవిత్వము అంటాము. ఇది చిత్రకవిత్వములో నొక భాగము. ఒక గతిలో మఱొక గతిని కల్పించుట కూడ గర్భకవిత్వమే. ఇది ఒక క్రొత్త విధమైన గర్భకవిత్వము. ఇది గతికి తాళమునకు సంబంధించినది, గణములకు కాదు. మిగిలిన చోటులలో కూడ ఇట్టి గతిగర్భకవిత్వమును అవసరమయినప్పుడు తెలుపుతాను.

సప్తగిరి – త న భ త న భ త న గ, UU IIII – UII UU – IIII UII – UU IIII U, యతి (1, 7, 12, 19)
25 అభికృతి 15956413

జీవమ్మున గల – చిందులు నీకే – చిదమల రూపపు – శ్రీలన్ గురియుచు రా
భావమ్మున గల – బంధము నీదే – భవహర వేగము – బాధల జెఱుపగ రా
సేవల్ బలు బలు – చేతును నీకై – శివమయ సుందర – చెల్వ మ్మలరగ రా
త్రోవల్ గనులకు – తోయజనేత్రా – తురితము జూపగ – ద్యోతిర్మయముగ రా

2. నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుష కృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య

(నాథముని ద్వార తెలుపబడిన గొప్ప సత్వనిధి తత్వనిధియై భక్తిగుణముతో నిండిన శ్రీశైలములో అన్ని సుగుణములకు వశమై పరమాత్ముని దయయో అను విధముగా ఎత్తైన పర్వతమునుండి జారే ఆకాశగంగా ప్రవాహముచే కౌగిలించుకొనబడినట్టి)

నవ్యదల భవ్యమల పీతమల శోణిమల సన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బలశోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మాసనః

(అప్పుడే వికసించిన మెత్తని ఎఱ్ఱదామరలవంటి పాదములకు శరచ్చంద్రుని వన్నెగల తెల్లని గోరులుగల వ్రేళ్లతో పద్మాసనముతో నున్నట్టి)

వరుసగా ఒక గురువు, మూడు లఘువులతో సాగుతుంది ఈ భాగము. ఇలాటి తాళవృత్తము ఒకటి తెలుగు ఛందస్సులో ఉన్నది, దాని పేరు లయగ్రాహి. లయగ్రాహికి కూడ ప్రాసయతియే. నన్నయ నుండి నేటి వఱకు ఈ 26 అక్షరాల కన్న ఎక్కువగా ఉండే ఉద్ధురమాలావృత్తమును అందఱు కవులు వాడియున్నారు. క్రింద నా ఉదాహరణ మొకటి చదవండి. అశోకవనములో సీతాదేవి శ్రీరాముని స్మరించుచు చెప్పిన ఘట్టమిది. ఈ పద్యములో ఒక చిత్రకవిత్వము కూడ ఉన్నది. ఈ పద్యమును ఒక సోపానముగా అమర్చవచ్చును. అనగా, మొదట ఒక అక్షరము, తఱువాత రెండక్షరములు, తఱువాత మూడు, ఇలా చివరి మెట్టులో పదిహేను అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క మెట్టులోని పదము(లు) అక్కడే అంతము కావాలి, మఱొక మెట్టుకు వెళ్లరాదు. దీనిని శైలబంధము అని కూడ అంటారు. లయగ్రాహికి పాదానికి 30 అక్షరాలు (ఏడు భలములు, రెండు గురువులు). 1 నుండి 15 వఱకు గల సంఖ్యల మొత్తము 120 పద్యములోని అన్ని అక్షరాలతో సరిపోతుంది. ఒక వందకు తక్కువగా ఉండే అంకెలలో పాదమునకు 7, 9, తఱువాత 30, 54, 99 అక్షరాలు ఉండే పద్యములకు మాత్రమే యిది సాధ్యము. ఎందుకనగా, పాదముల సంఖ్యను నాలుగుతో గుణించినప్పుడు వచ్చిన సంఖ్య ఈ సోపానముల లోని అక్షరసంఖ్యల మొత్తముతో సరిపోవాలి.

లయగ్రాహి – భ జ స న భ జ స న భ య, ప్రాసయతి (1, 9, 17, 25),
UIII UIII – UIII UIII – UIII UIII – UIII UU
30 మహశ్ఛందము 451866351

ఈ మహి వెలుంగు నొక – ప్రేమ మణి దీపము క-ళామయముగా హృదయ – ధామమున నీకై,
యామనుల పూయు సుమ – దామముల యందము స-దా మధుర మూర్తి నిను – నా మదిని నింపెన్,
నా మమత నీవె ప్రియ – నామము జపింతు రఘు-రామ వని నొంటరిగ – నే మనుచు నుంటిన్,
నీ మృదులమైన నగు – మోము నిట చూపర సు-ధామయము జీవనము-లౌ మఱల భూమిన్

సోపాన లయగ్రాహి –

1 ఈ
2 మహి
3 వెలుంగు
4 నొక ప్రేమ
5 మణి దీపము
6 కళామయముగా
7 హృదయ ధామమున
8 నీకై, యామనుల పూయు
9 సుమ దామముల యందము
10 సదా మధుర మూర్తి నిను నా
11 మదిని నింపెన్, నా మమత నీవె
12 ప్రియ నామము జపింతు రఘు రామ
13 వని నొంటరిగ నే మనుచు నుంటిన్, నీ
14 మృదులమైన నగు మోము నిట చూపర
15 సుధామయము జీవనములౌ మఱల భూమిన్

ఏడు అక్షరాల పద్యమునకు ఒక ఉదాహరణము –

శిప్రా – మ మ గ UUUUUUU
7 ఉష్ణిక్ 1

ఓ దేవీ నీవేగా నా
కాధార మ్మేనాడున్ ని-
న్నే దైవమ్మంచున్ దల్తున్
ఖేదమ్మందున్ సంతుష్టిన్

1 ఓ
2 దేవీ
3 నీవేగా
4 నా కాధార
5 మ్మేనాడున్ నిన్నే
6 దైవమ్మంచున్ దల్తున్
7 ఖేదమ్మందున్ సంతుష్టిన్

తొమ్మిది అక్షరాల పద్యమునకు ఒక ఉదాహరణము –

దధి – భ భ భ UIIUIIUII
9 బృహతి 439

నే నిను నాహృది లోతుల-
లో నిబిడమ్మగు భావపు
కానల శోధన జేసితి-
గా దరహాసమహోదధి

1 నే
2 నిను
3 నాహృది
4 లోతులలో
5 నిబిడమ్మగు
6 భావపు కానల
7 శోధన జేసితిగా
8 దరహాసమహోదధి

3. సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఝరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమదసలిలభరభరిత మహాతటాక మండితస్య

(అనంతగుణపరిపూర్ణుడైన రామానుజాచార్యుల నామముతో గొప్ప నందనవనములవలె ఉండే వనసీమలతో నొప్పునట్టి, భక్తిరసముతో ఉఱకలెత్తే జలపాతమువలె శోభించే తటాకములతో నొప్పునట్టి)

ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ

(మేరుపర్వత శిఖరమువలె నతి గొప్పదై ఆదిశేషునిచే కాపాడబడు కొండగా నుండునట్టి)

వైమానికగురు భూమాధిక గుణా రామనుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ

(అత్యున్నత స్థానమునందిన రామానుజగురువుచే రచించబడిన పుష్పమాలలతో నలంకరించబడినట్టి)

రామానుజముని – త న త న త న త న గగ, ప్రాసయతి (1, 7, 13, 19)
UUIIII – UUIIII – UUIIII – UUIIII UU
26 ఉత్కృతి 15978301

భావమ్ముల కొక – జీవ మ్మయితివి – జీవమ్మున కొక – భావ మ్మయితివి గాదా
గ్రీవమ్ముల కొక – రావ మ్మయితివి – రావమ్ముల కొక – జీవ మ్మయితివి గాదా
ప్రావృడృతువున – బూవై విరిసిన – నా వాంఛల గల – యా వాసన లవి నీవే
నా విశ్వపు నవ – దేవాలయమున – దేవుం డయినను – జీవుం డయినను నీవే

రామానుజముని – త న త న త న త న గగ, యతి (1, 9, 19) UUII IIUU – IIIIU UIIII – UUII IIUU
26 ఉత్కృతి 15978301

నీవేగద నిఖిలమ్ముల్ – నిను గనగా పూర్ణమగును – నిక్కమ్ముగ బ్రదుకెల్లన్
నీవేగద హృదిలోనన్ – నిరతముగా నుందువు హరి – నీరాజనమును బొందన్
నీవేగద యమృతమ్మై – నెఱయగు నానందములను – నింపేవిట మది నిండన్
రావా యెద నిను గోరెన్ – రయముగ సామీప్యమునకు – రక్షించగ విడకుండన్

4. కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య

(కలికాలపు పాపములను దీర్చి నిర్మలము జేసి యమనియమములచే విరాజిల్లు మునులు స్నానము చేయు పాపనాశనతీర్థముచేత పవిత్రమైనట్టి)

బహుసంకట నరకావట పతదుష్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమజ్జన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్త నిరర్గళపేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య

(పాపములచే నరకకూపములో పడినవారిని బంగారు కలశములతో నింపిన అమృతమువంటి జలములలో స్నానమాడి ఆ నీటిని సేవించగా పాపములను పరిమార్చి ఉద్ధరించుటకై ఏర్పడిన కటాహతీర్థముతో విరాజిల్లునట్టి)

సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదళీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః

(కనకాంబరములవలె నలరారు వికసించిన కమలములలోగల పుప్పొడిని తలపించు ఉదరజఘనములు కలిగి మణిస్థంభములవంటి తొడలతో పరాక్రమముతో వేగముగా నడువ వీలగునట్టి పదయుగ్మములతో శోభిల్లునట్టి)

నవకేసర – స న జ న భ స న య, ప్రాసయతి (1, 11) IIUII IIUII – IIUII IIUII IIUU
24 సంకృతి 4059004

మనసేలకొ విహరించెను – నిను జూడగ గగనమ్మున నొక పుల్గై
మనసేలకొ జ్వలియించెను – నిను దల్చుచు నిముసమ్మున నొక వెల్గై
మనసేలకొ తపియించెను – నిను దాకగ ననిశ మ్మిట నొక మూల్గై
మనసేలకొ తను పాడెను – నిను మెచ్చుచు హరుసమ్మున నొక యెల్గై

నవకేసర – స న జ న భ స న య, యతి (1, 8, 14, 21) IIU IIII – UII IIU – IIII UII – IIU U
24 సంకృతి 4059004

IIU IIII – UII IIU – IIII UII – IIU U

భువనమ్మున నొక – మోహన ముఖమున్ – ముదమున గంటిని – బులకించన్
రవిగా వెలుగుల – రాజుగ కళలన్ – రసమయ రా దరి – తిలకించన్
నవమౌ పదముల – నందము నిడుచున్ – నవముగ బాడగ – నగుచున్ రా
భవ మా పదముల – పాపము దొలగన్ – భవహర యుంచెద – వరదా రా

5. మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ తనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారా ధారాభిధాన తీర్థాధిష్ఠితస్య

(విష్ణుమూర్తిని సేవించే ముదుసలి దారి మఱచిపోవగా దారిచూపి సురాంగనలు వరించే విధముగా కుమారాకృతి నొసగినట్టి కుమారధార తీర్థమున కొడయడైనట్టి)

ఈ మూసలోని ప్రత్యేకత ఏమనగా, ఎదురునడక గల జ-గణము తఱువాత ఒక భ-గణము, పదే పదే వస్తుంది యిందులో. ఇలాటి లయతోటి పాటను నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు నేర్పారు. అది యిలా సాగుతుంది –

సరస్వతీ నిను – స్మరించెదను కని-కరించుమా కల-భాషిణీ,
విరాట్స్వరూపిణి – విపంచిధారిణి – విరించిహృత్సం-చారిణీ
ధరాస్థలిని భ-క్తహృదయవాసిని – దయాస్వరూపిణి – మేమిటుల్
కరాంజలుల నీ – కజస్ర మిత్తుము – వరమ్ము లీయగ – రమ్మిటుల్

అందువలన ఈ వృత్తమునకు నేను విపంచిధారిణి అని పేరుంచినాను.

విపంచిధారిణి – జ భ జ భ జ భ య, ప్రాసయతి (1, 7, 13) IUIUII – IUIUII – IUIUII – UIU
21 ప్రకృతి 744822

అనంతదీప్తికి – ననింద్యకీర్తికి – ననంజనాఽభకు దండముల్
సునాదగాత్రికి – మనోజ్ఞమూర్తికి – సునూత్నవాణికి నంజలుల్
సనత్కళత్రకు – సనాతనాత్మకు – వినోదచిత్తకు సన్నుతుల్
గుణాగ్రగణ్యకు – ఘృణాత్మరూపకు – ప్రణామకోటులు ప్రాంజలుల్

6. ధరణితల గతసకల హతకలిల శుభసలిల గత బహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధమహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య

(భూమి పైనగల సకలపాపములను కలిమలమును దర్శనమాత్రమున హరించు పావనజలములతో నిండిన స్వామిపుష్కరిణితో నున్నట్టి)

బహుసంకట నరకావట పతదుష్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమజ్జన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్త నిరర్గళపేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య (భరభరిత మున్నగు పదములు)

నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః

(అప్పుడే విరిసిన తామరపూల రేకులతో అందమైన బంగారు సరములతో రాజిల్లు కమనీయ కంఠమును కలిగినట్టి)

ఈ వృత్తమునకు ధవళము అని పేరు, నేను ఇందులోని ఒక పదమైన సరసతర పేరును ఉంచినాను.

ధవళ లేక సరసతర – న న న న న న గ, యతి (1, 11) IIIII IIIII IIIII IIIU
19 అతిధృతి 262144

మది దలచె నిను గనగ – మఱిమఱియు శరదలో
వదలకుము వదలకుము – వలపునది వఱదలో
నిదుర నను విడిచెగద – నిసి గడియ బరువులో
హృదయ మిట మునిగెగద – యిడుములను చెరువులో

ధవళ లేక సరసతర – న న న న న న గ, యతి (1, 9) IIII IIII IIII IIII IIU
19 అతిధృతి 262144

మన సిది యొక కపి – మడియనివలె దను నడచున్
మన సిది యొక కవి – మధురపు కవితల నుడువున్
మన సిది యొక నది – మరలుచు పొరలుచు పరుగున్
మన సిది యొక గుది – మరు జనకుని పదములకున్

7. ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య

(ఇటువంటి ఎన్నో పాపహరణములైన గొప్ప పుణ్యతీర్థములతో విరాజిల్లునట్టి)

మడ్డుడిండిమ ఢమరుజర్ఝర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముక హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర విసృమర సరస గానరస రుచిర సంతత సంతవ్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః

(డిండిమ, డమరుకము, బాకాలు, ఢక్కలు, మృదంగములాటి విశేష వాద్యములతో మధురమంగళ నాదములతో నెడతెగని గానములను ప్రతి నిత్యము, ప్రతి పక్షము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము చేయగా కలిగిన ఆనందముతో నున్నట్టి)

మత్తకోకిల – ర స జ జ భ ర, యతి (1, 11) UIUII UIUII – UIUII
లేక యతి (1, 9), ప్రాసయతి (1, 13) UIU UIUIIUIU – II – UIUIIUIU
18 ధృతి 93019

వేంకటేశ్వర పిల్వగా – విని – బింక మిట్టుల నేలరా
పంకజాసన జన్మదా – వడి – పంకచక్రము నాపరా
జంకుగొంకులు లేవురా – జన – సంకటమ్ముల బాపరా
ఇంక నీవె చిగుర్చరా – యిట – నింకి పోయిన యాశలన్

8. వాణీపతి శర్వాణీదయితేంద్రాణీశ్వర ముఖ నాణీయోరసవేణీనిభ శుభవాణీ నుతమహిమాణీయస్తనకోణీ భవదఖిల భువనభవనోదరః

(భక్తితో బ్రహ్మ రుద్ర మహేంద్రాదులు నిన్ను పొగడి సకల భువనములతో నొక స్థానమును సంపాదించిన యుదరము కలిగినట్టి)

ఆనందమతీ – త య భ మ స, ప్రాసయతి (1, 6, 11) UU IIU – UU IIU – UU IIU
15 అతిశక్వరి 12685

ఆమోదముతో – నా మానసమిం – దేమో యనెగా
ధామమ్మున నీ – నామమ్మును నే – బ్రేమించితిగా
శ్యామా యననా – రామా యననా – నామ మ్మెదియో
నా మానసమే – ప్రేమాలయమై – స్వామీ యనెరా

ఆనందమతీ – త య భ మ స, యతి (1, 8) UUII UUU – IIUU UIIU
15 అతిశక్వరి 12685

నీవే రవి నా నింగిన్ – నెలఱేడా నాదరి రా
నీవే స్వర మీ గీతిన్ – నిసి వేళన్ నా జెవిలో
నీవే చిఱు దీప మ్మీ – నిఱు ప్రేమన్ వెలిగించన్
నీవే గద శ్వాస మ్మీ – నిఱుపేదన్ బ్రదికించన్

9. కాలాంబుదమాలానిభ నీలాలకజాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ

(నీలమేఘమాలికలవలె ప్రకాశించి రెండు అమృతధారలవలె చీలిన కురులతో నుండు ముఖకమలమును కలిగినట్టి)

గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః

(పొంగుచుండే గంగానది తరంగాలవలె ఆ దేహమునుండి ఉద్భవించిన ఒక మోహనమైన నల్లని కాంతి కలిగినట్టి)

పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః

(బంగారువన్నెల దీప్తితో నిర్మలమై పాపవిదూరము గావించు కాంతితో స్వర్ణమాలికలతో విరాజిల్లు సర్వాంగములు కలిగినట్టి)

మడ్డుడిండిమ ఢమరుజర్ఝర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముక హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర విసృమర సరస గానరస రుచిర సంతత సంతవ్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః (నిత్యోత్సవ మున్నగు పదములు)

నీలాలక – త య స భ త య స గ, ప్రాస యతి (1, 9, 17) UUII UUII UUII UUII UUII UU
22 ఆకృతి 838861

నీవేగద నా డెందము – నీవేగద నా స్పందన – నీవేగద దేవా
నీవేగద నా భాగ్యము – నీవేగద నా మార్గ్యము – నీవేగద దేవా
నీవేగద నా స్వర్గము – నీవేగద సంసర్గము – నీవేగద దేవా
నీవేగద నా పర్వము – నీవేగద నా సర్వము – నీవేగద దేవా

నీలాలక – త య స భ త య స గ, యతి (1, 11), ప్రాస యతి (1, 13)
UUII UUII UU – II – UUII UUII UU
22 ఆకృతి 838861

ఛందమ్ముల గీర్వాణికి జేజే – స్వర –
గంధమ్ముల చిద్వాణికి జేజే
అందమ్మగు చిద్రూపికి జేజే – అర –
విందమ్మగు సద్రూపికి జేజే
నందమ్ముల బ్రహ్మాణికి జేజే – నవ –
ఛందమ్ముల రారాణికి జేజే
మందస్మిత వాగ్దేవికి జేజే – మన –
మందుండెడు భాషాబ్ధికి జేజే

10. జానుతలావధి లంబ విడంబిత వారణ శుండా దండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లికైకతర బాహుదండయుగళః

(నీలమణులతో నిగనిగలాడే యెత్తైన కల్పవృక్షమువలె భ్రాంతి నిచ్చు ఏనుగు తొండముల దండవలె మృదు మృణాళములవంటి బాహుయుగ్మము కలిగినట్టి)

మానిని – భ భ భ భ భ భ భ గురు, యతి (1, 7, 13, 19) UII UII UII UII UII UII UII U
22 ఆకృతి 1797559

కానగ నెల్లెడ – కమ్మని వాసన – కానన మింపిడె – గన్నులకున్
మానస మందున – మంగళ గీతము – మంచిగ మ్రోగెను – మంద్రముగా
నానన మయ్యది – యప్పుడె విచ్చెను – యామిని రాణికి – నందముగా
మానిని యాడెను – మానిని పాడెను – మానిని వేడెను – మాధవ రా

మానిని – భ భ భ భ భ భ భ గురు, యతి (1, 11), ప్రాస యతి (1, 13)
UII UII UII U – II – UII UII UII U
22 ఆకృతి 1797559

తెల్లని తామర పువ్వులలో
తెల
తెల్లని ముత్తెపు నవ్వులలో
తెల్లని శారద కౌముదిలో
తెల
తెల్లని నీరద కాంతులలో
తెల్లని క్షీరపు ఫేనములో
తెల
తెల్లని చీరల కుచ్చులలో
తెల్లని జ్ఞానపు సూర్యునిలో
త్విష
జల్లెడు తల్లికి వందనముల్

11. రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవాటీ రసధాటీ ధరమణీగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః

(కోటిసూర్యుల ప్రకాశమును దాల్చి, కోటి రవములను గుర్తుకు తెచ్చి రసధాటిని కలుగజేసి అజ్ఞానాంధకారమనే గర్భములో పుట్టుక లేనట్టి)

ఈ వృత్తమునకు అనిలోహ అని పేరు గలదు, ఇందులోని ఒక పదమైన రసధాటీ అనే పేరును నేను ఉంచినాను.

అనిలోహ లేక రసధాటీ – స భ త య స గ, ప్రాస యతి (1, 9) IIUU IIUU – IIUU IIUU
16 అష్టి 13108

వనమాలీ నిను బిల్వన్ – వినలేవా ద్వర రావా
దినమెల్లన్ నిను దల్వన్ – మనసాయెన్ వరరావా
వనజమ్మా నిను గాంచన్ – దనువెల్లన్ బులకించెన్
వనదమ్ముల్ గనిపించన్ – వనజాక్షుం డగుపించెన్

అనిలోహ లేక రసధాటీ – స భ త య స గ, యతి (1, 9) IIU UII UU – IIU UII UU
16 అష్టి 13108

మనసా యెందుకు నీకీ – మమతావేశము వద్దే
కనులా యెందుకు నీకీ – కవితావేశము వద్దే
తనువా యెందుకు నీకీ – తపనాక్రోశము వద్దే
వినవే మాటలు నీకీ – వేదన తప్పునుగాదే

ముగింపు
నేను ముందే చెప్పినట్లు ఈ స్తోత్రములో తరువాతి కాలములో రాగముల పేరులు, ఫల పుష్పముల పేరులు, నదుల పేరులు మున్నగునవి చేర్చబడ్డాయి. ఛందస్సులో ఆసక్తి ఉన్నవాడినిగా ఇందులో ఛందముల నామములు, వృత్తముల పేరులు ఎందుకు చేర్చలేదనే అనుమానము వచ్చినది. అవి చేర్చితే ఏలాగుంటుందో అనే ఆశతో క్రింది భాగమును వ్రాసినాను.

ఉ క్తా త్యుక్తా మధ్యా ప్రతిష్ఠా సుప్రతిష్ఠా గాయ త్ర్యుష్ణి గనుష్టుబ్ బృహతీ పంక్తి త్రిష్టు బ్జగతీ అతిజగతీ శక్వరీ అతిశక్వ ర్య ష్ట్యత్యష్టి ధృ త్యతిధృతి కృతి ప్రకృ త్యాకృతి వికృతి సంకృ త్యభికృ త్యుత్కృత్యాదిచ్ఛందోఽతర్గత వాణినీ మాలినీ శాలినీ మానినీ స్రగ్ధరా స్రగ్విణీ హారిణీ సారిణీ భ్రమరవిలసితా మదనవిలసితా గజవిలసితా మయూరసారిణీ మత్తమయూరా వనమయూరా వసంతహాసా వసంతతిలకా విపినతిలకా వసుమతీ మధుమతీ చారుమతీ మత్తకోకిలా కాకలీ కలకోకిలా కాసరక్రాంతా మందాక్రాంతా భారాక్రాంతా మానాక్రాంతా వీరవిక్రాంతా వంశస్థా ఇంద్రవంశా ఇంద్రవజ్రోపేంద్రవజ్రా గజగ త్యమృతగతి గగనగతి చారుగ త్యశ్వగ త్యశ్వలలి తాశ్వధాటీ శార్దూలవిక్రీడితా మత్తేభవిక్రీడితా సింహవిక్రీడితా చిత్రపదా క్రౌంచపదా సాంద్రపదా ధృష్టపదా కోకపదా హంసపదా ద్విపదీ త్రిపదీ చతుష్పదీ షట్పదీ సప్తప ద్యష్టపదీ చంపకమా లోత్పలమాలా నీలోత్పలమాలా పద్మమాలా మల్లికామాలా హంసమాలా విద్యున్మాలా సురసా సువదనా సుందరీ సుగంధీ సుఖేలా సుధాధారా మంజ ర్యశోకమంజరీ మల్లికా మాలతీ లతా కనకలతా సురలతా కుసుమా కుసుమస్తబకా కుసుమలతావేల్లితా కుసుమవిచిత్రా అంబు జాంబురుహా సరసిజా సరోజా జలజా నలినీ కమలవిలసితా పద్మా పద్మకా పంచకమలా వనరుహా త్రిభంగీ శంభునటనా లయగ్రాహీ లయవిభాతి లయహా ర్యార్యాగీతీ శీర్షకాద్యక్షరవృత్త మాత్రావృత్త తాళవృత్త విశేషవృత్తాంతర్గత భవన్మహిమానువర్ణన భక్తికవితాసుధామాధుర్యాస్వాదనానిరత కవిభృంగః పుణ్య తిరుమల క్షేత్రవాసః శ్రీ శ్రీనివాసః …
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: