Sunday, October 14, 2018

ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)


ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)
సాహితీమిత్రులారా!

ఇప్పటి వరకు మనం దత్తపది, సమస్య ఈ రెండు అంశాల్ని సాధించటానికి వాడే పద్ధతుల గురించి కొంత విపులంగా చర్చించాం. ఈ పద్ధతుల్ని గట్టిగా ఒంటపట్టించుకుని శ్రద్ధతో సాధన చేస్తే, పద్యాలు అల్లగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ రెండు అంశాలలోను నిష్ణాతులు కాగలరని నా విశ్వాసం.

అష్టావధానంలో పద్యాలు చెప్పటంతో సంబంధం వున్న మిగిలిన అంశాలు నిషేధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, వర్ణన. వీటిలో వర్ణన, ఆశువు గురించి ప్రత్యేకంగా మాట్టాడవలసిన విషయాలేం లేవు యిచ్చిన “వస్తువు” ( topic ) గురించి అడిగిన ఛందంలో ఓ పద్యం చెప్పటమే రెంటిలోనూ జరిగే పని.అవధాని మంచి మూడ్‌లో వుంటే ఆ పద్యాల్లో ఏవైనా మంచి పదాలు, భావాలు, చమత్కారాలు చొప్పించటానికి ప్రయత్నిస్తాడు. లేకుంటే ఏదో పని జరిగిందనిపిస్తాడు.అలాగే న్యస్తాక్షరి కూడ నూటికి తొంభై పాళ్ళు పెద్ద కష్టం కాదు పృఛ్ఛకుడు సామాన్యంగా నాలుగు అక్షరాలు ఇచ్చి, ఏ అక్షరం ఏ స్థానంలో ఉండాలో అడుగుతాడు (నాలుగే అక్షరాలని నియమం లేదు, ఏడెనిమిది దాకా కూడా ఇవ్వొచ్చు). ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అక్షరాల్ని ఎన్నుకోవటంలో పూర్తి స్వతంత్రం ఉన్నా ఎందుకనో చాలా మంది పృఛ్ఛకులు ఏమాత్రం కష్టం లేని వాటిని ఇస్తారు.

నిజంగా అవధానికి కొంత చెమట పట్టించాలంటే చెయ్యాల్సిన పనులు దుష్కర ప్రాస ఇవ్వటం, యతి ముందు వెనక స్థానాల్లో కష్టమైన అక్షరాలు వచ్చేట్టు చూడటం, ఇంకొంచెం లోతుగా వెళ్ళి లఘువు తర్వాత రావలసిన స్థానాల్లో సంయుక్తాక్షరాల్నిఇవ్వటం. ( ఇలా చెయ్యాలంటే పృఛ్ఛకుడికి ముందు కనీసం యతి ప్రాసలు, తను అడగబోయే పద్యంలో గణాలు,యతి స్థానం తెలియాలి.) ఇలాటి కఠినమైన న్యస్తాక్షరికి ఒక ఉదాహరణ ఇది
ఛందం ఉత్పలమాల; మొదటి పాదం పదో అక్షరం ష్వ; పదకొండో అక్షరం  క్ష; రెండో పాదంలో రెండో అక్షరం గ్ర; పన్నెండో అక్షరం క్లే; మూడో పాదం మొదటి అక్షరం భీ; ఎనిమిదో అక్షరం శ్ల; నాలుగో పాదం పదో అక్షరం ధా; ఇరవైయో అక్షరం గో. మురార్జీ దేశాయ్‌ ప్రధాని కావటం గురించి చెప్పమన్నారు. దీన్లో చాలా విషయాలు గమనించొచ్చు.

ప్రాస గ్ర (రెండో పాదం రెండో అక్షరం గ్ర అడిగారు కదా!);
పదో అక్షరం గురువు, యతి స్థానం కూడా;
పదో అక్షరం ష్వ ఉండాలి; కాని ఉత్పలమాలలో తొమ్మిదో అక్షరం లఘువు గనక ష్వ అనే అక్షరంతో కొత్త పదం మొదలు పెట్టాలి. ఐతే, ష్వ తో మొదలయ్యే పదాలెన్నున్నాయి?
అంతటితో ఆక్కుండా పుండు మీద కారం చల్లినట్టు పదకొండో అక్షరం క్ష కావాలన్నాడు పృఛ్ఛకుడు.అంటే అది ష్వ తోనే కాదు, ‘ష్వక్ష ‘ తో మొదలయ్యే పదం కావాలి.
ష్వ యతిస్థానంలో ఉంది గనక దానికి మైత్రి ఉన్న అక్షరంతో పద్యం మొదలు కావాలి!
ఇదీ నిజంగా పృఛ్ఛకుడు home work  చేసుకు రావటమంటే!

ఇలాటి న్యస్తాక్షర ప్రయోగాలు అవధానుల శక్తిని పరీక్షిస్తాయి. కాని యీ విషయాలు తెలిసే పృఛ్ఛకులు కొద్ది మందే; వాళ్ళ లోనూ ఎక్కువ మంది ఏవేవో కారణాల వల్ల వాళ్ళు శ్రమ పడరు, అవధానికీ కష్టం కలిగించరు.

ఈ న్యస్తాక్షరి పూరణ కూడ చూద్దాం.

వ్యగ్రమతుల్‌ జగజ్జనులు ష్వక్షతబోధ సముత్థితుల్‌ ప్రచం
డాగ్రహ రంజితాస్యులొక అగ్నివిధమ్మున రేగి, క్లేశమున్‌
భీగ్రథితమ్ము నోర్చి శ్లథవృత్తులు పైకొని గెల్పుకూర్ప ప్ర
త్యగ్ర మురారి భాసిలె ప్రధాని పదమ్మున నేడు వీడుగో!

(షుః అంటే విద్వాంసుడు; షు అక్షతబోధ అంటే విద్వాంసుల మంచి సలహా)

ఇలాటి క్లిష్టమైన న్యస్తాక్షరాలు తగిలే సందర్భంలో ఎక్కువ మంది అవధాన్లు చేసే పని ఎలాగోలా పృఛ్ఛకుణ్ణి పెడదారి పట్టించటం. ఉదాహరణకి, “ప్రాస స్థానంలో గ్ర ఇస్తున్నారా?” అనో, లేకపోతే “ఉత్పలమాల తొమ్మిదో అక్షరం లఘువౌతుందని తెలిసే పదో అక్షరం ష్వ ఉండాలంటున్నారా?” అనో అవధాని గద్దించాడనుకోండి, చాలా మంది పృఛ్ఛకులు జారి పోయి, “అబ్బెబ్బే, అది కాదు నా ఉద్దేశ్యం, మీకు ఏం కావాలో అది వేసుకోండి” అన్నట్టు మాట్టాడతారు. లేకపోతే సభాధ్యక్షుడే కలగజేసుకుని మరీ అలాటి దుష్కరమైన ప్రశ్నలడక్కూడదని పృఛ్ఛకుణ్ణి మందలిస్తాడు. దాంతో గడుసు అవధాని చటుక్కున తనకి అనుకూలమైన అక్షరాన్ని ఎంచుకుని దాన్ని వాడతానని ఉదారంగా హామీ ఇచ్చి గట్టెక్కుతాడు. ఇది చాలా సార్లు పనిచేసే టెక్నిక్‌ ఐనా పృఛ్ఛకుడు పట్టు బట్టి కూర్చుని నాకిలాగే కావాలంటే ఏ అవధానీ చెయ్యగలిగింది ఏమీ లేదు (ప్రేక్షకులు ఆ పృఛ్ఛకుణ్ణి పురుక్కింద చూడొచ్చు, అది వేరే విషయం).అప్పుడు అవధాని చచ్చినట్టు ఏదో పద్యం చెప్పటం తప్పదు.

కాబోయే అవధానులకి న్యస్తాక్షరి విషయంలో నా సలహా ఏమిటంటే అవసరాన్ని బట్టి గద్దించో, మోసగించో, బుజ్జగించో ప్రశ్న తేలిగ్గా ఉండేట్టు చేసుకోండి; అప్పటికీ కష్టమైన న్యస్తాక్షరి తగిల్తే ఆ ఇచ్చిన అక్షరాలు వచ్చే పదాల విషయంలో అర్థం ఉందా లేదా అనేది అంతగా పట్టించుకోకుండా మిగిలిన పద్యభాగాల్లో మాత్రం అడిగిన వస్తువుకి ఎంతో కొంత సంబంధం వుండేట్టు చూస్తూ పద్యం తయారు చెయ్యండి.

ఇక నిషేధాక్షరికి వద్దాం. స్థూలంగా రెండు రకాలుగా ఉంటుంది ఈ అంశం వర్గాక్షర నిషేధం, ప్రత్యక్షర నిషేధం. వర్గాక్షర నిషేధంలో పృఛ్ఛకుడు పద్యంలో ఏయే అక్షరాలు రాకూడదో ముందుగానే అవధానికి చెప్పేసి చేతులు దులుపుకుంటాడు. ఆ అక్షరాలు ఏవైనా కావొచ్చు. సామాన్యంగా ఐదారు అక్షరాలిచ్చి అవి పద్యంలో ఎక్కడా రాకూడదంటారు. ఇంకొంచెం కష్టం చెయ్యాలనుకుంటే ఒకో పాదంలో కొన్ని అక్షరాల్ని నిషేధించొచ్చు. వీటిలో పృఛ్ఛకుడు ఏ పద్ధతి పాటించినా అవధాని దృష్టిలో ఈ నిషేధాక్షరికీ న్యస్తాక్షరికీ పెద్ద తేడా ఉండదు ఏం ఉండాలో న్యస్తాక్షరిలో చెప్తే, ఏం ఉండకూడదో నిషేధాక్షరిలో చెప్పినట్టు, అంతే. టెక్నిక్‌ దృష్య్టా రెండూ ఒకటే.

అలా కాకుండా ప్రత్యక్షర నిషేధం సరిగా చేస్తే మంచి రుచిగా ఉండే అంశం. ఇది నిజానికి పృఛ్ఛకుడికీ అవధానికీ మధ్య ఓ పోటీ ఆట లాటిది. అవధాని ఓ అక్షరంతో పద్యం ప్రారంభిస్తాడు. రెండో అక్షరం ఏం రాకూడదో పృఛ్ఛకుడు చెప్తాడు. అది కాకుండా (దాని గుడింతాలు కూడ రాకూడదు) మరో అక్షరం వేస్తాడు అవధాని. మూడో అక్షరం ఏం రాకూడదో చెప్తాడు పృఛ్ఛకుడు. అవధాని మరోటి వేస్తాడు. ఐతే యీ ఆట నిబంధనలు చాలావరకు అవధానికి అనుకూలమైనవి పృఛ్ఛకుడు ఒక సారి ఒక అక్షరాన్ని మాత్రమే నిషేధించగలడు; అవధాని అది తప్ప ఏ అక్షరాన్నైనా వాడొచ్చు! పదాలు ఎక్కడ మొదలు కావొచ్చో ఏ పదంలో ఎన్ని అక్షరాలు వుండొచ్చో అంతా అవధాని ఇష్టమే, పృఛ్ఛకుడికి ఏమీ పాత్ర లేదందులో! అవధాని బాల్‌ను తంతూ వెళ్తుంటే అతనికి అడ్డం వచ్చే స్తంభం లాటి వాడు పృఛ్ఛకుడు. అవధాని మరీ ఇరుకు సందులోకి వెళ్తే తప్ప పృఛ్ఛకుడు అతన్ని ఆపలేడు!

ప్రత్యక్షర నిషేధంలో వట్టి పాండిత్యమే కాదు, మానసిక శాస్త్రం ( psychology ) పాత్ర కూడా చాలా ఉంది. అవధాని పృఛ్ఛకుడి ఆత్మవిశ్వాసాన్ని పడగొట్టటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఒత్తిడికి లొంగకుండా అవధానికే భయం కలిగించటానికి పృఛ్ఛకుడు ప్రయత్నిస్తాడు (గట్టివాడైతే).అసలు ఆట కన్నా ఈ psychological warfare  ముఖ్యమైంది, ఇద్దరి మధ్య ఆట ఎలా సాగుతుందో నిర్ణయించేది.

నేను ఇంతగా అవధాని పృఛ్ఛకుల మధ్య జరిగే తంతుని వర్ణించటానికి కారణం, ప్రత్యక్షర నిషేధానికీ మిగిలిన అన్ని అంశాలకీ ఉన్న బోలెడంత తేడా. ఈ dynamic  ఎంత స్పష్టంగా పృఛ్ఛకుడికీ ప్రేక్షకులకీ తెలిస్తే అంత రసకందాయంలో పడుతుందీ అంశం. చివరికి విజయం అవధానిదే ఐనా ఓ పట్టు పట్టానన్న తృప్తి పృఛ్ఛకుడికీ, మంచి పోటీని చూశామన్నతృప్తి ప్రేక్షకులకీ మిగిలే అవకాశం ఉంది.

ఇక నిషేధాక్షరిలో అవధానుల టెక్నిక్‌లు చూద్దాం. దీన్లో అవధాని ప్రయత్నం ముఖ్యంగా పృఛ్ఛకుడికి తన ఆలోచన తెలియకుండా చూసుకోవటం. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి భయంకరమైన సంస్కృత పదాల్తో పృఛ్ఛకుడి బుర్ర తిరిగేట్టు చెయ్యటం, రెండోది చిన్న చిన్న (రెండు అక్షరాలు మించని) పదాల్నే వాడుతూ చిక్కకుండా ఒడుపుగా తప్పించుకోవటం. ఈ రెంటిలో మొదటి మార్గం గమ్యం అవధాని ఎటు వెళ్తున్నదీ పృఛ్ఛకుడికి అగమ్యంగా ఉండేట్టు చేసి కొద్ది అక్షరాలు పూర్తయే సరికి పృఛ్ఛకుడి ఆత్మవిశ్వాసం నీరుగారేట్టు చెయ్యటం. ఒక సారి అతను నీరుగారిపోతే ఇక అవధాని పని నల్లేరు మీద బండే. రెండో మార్గం లక్ష్యం తరవాత రాబోయే అక్షరానికి ఎన్నో అవకాశాలుండేట్టు చూసుకుని వాటిలో దేన్ని పృఛ్ఛకుడు నిషేధించినా ఇంకోటి వాడుకునే పరిస్థితి కల్పించుకోవటం. ఇవి రెండూ ఒక దాని కొకటి వ్యతిరేకమైనవి కావు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి గాని, రెండూ గాని ఒకే పద్యంలో వాడొచ్చు.

నిషేధాక్షరి గురించిన మరో విషయం ఛందం సాధారణంగా కందం కావటం.దీని వల్ల అవధానికి అనుకూలత ఏమిటంటే, వీలైనన్ని గురువులు వేసి పద్యంలో అక్షరాల సంఖ్య తగ్గించటం, అలా పృఛ్ఛకుడి నుంచి వచ్చేతలనొప్పి తగ్గించుకోవటం. ముఖ్యంగా సంస్కృత పదాలు వాడే పక్షంలో ఇది బాగా పనికొస్తుంది.

ఇప్పుడు ఓ రెండు ఉదాహరణలు చూద్దాం. మొదటిది సూర్యగ్రహణం వర్ణన. చూట్టం తోటే చెప్పొచ్చు ఇది నిషేధాక్షరి పద్యం అని!

ఘ్లాఢృ సువిద్గాఢాంత
ర్వోఢృ కథాకృత్సదృగ్వపుర్భూతి పునా
రోఢృ గభస్తి రవి యెసగె
గాఢధ్వజ ఘస్తి చేసి క్షణికక్లాంతిన్‌

చివరి రెండు పాదాలూ ఏదో అర్థమౌతున్నట్టున్నాయే అనిపిస్తే అది నిజమే; మొదటి రెండు పాదాల్లో నిషేధించేసరికి నీరసం వచ్చి మానేశాడు పృఛ్ఛకుడు! ఈ పద్యానికి ఏదో అర్థాన్ని లాగొచ్చు గాని అనవసరం. సంస్కృతపదాల వర్షంలో పృఛ్ఛకుణ్ణి ఎలా ముంచెయ్యొచ్చో చూపిస్తుందీ పద్యం. (తెలుగు చదవటం అలవాటు తప్పిన వాళ్ళు ఈ పద్యాన్ని నాలుగైదు సార్లు పైకి చదివితే బాగా నోరు తిరుగుతుంది కూడా!)

మరో పద్యం. దేవతాస్తుతి. రెండో పద్ధతికి ఉదాహరణ.

సిరితో భూమీసతితో
సిరికొండన్‌ నిల్చు సామి శేషగ్రావ
స్థిరుడై వరదున్‌ నిన్‌ నేన్‌
తిరునాథున్‌ కొల్తు భక్తి తేనెలు పొంగన్‌ (మూడు, నాలుగు పాదాలకి నిషేధం జరగలేదు)

ఇప్పటి దాకా చదివిన వాళ్ళు నిషేధాక్షరిలో పృఛ్ఛకుడి పని punching bag  కావటమేనా? అనడగొచ్చు. అది చాలా వరకు నిజమే కాని పృఛ్ఛకుడు కూడ అవధాని కున్న స్వేఛ్ఛని తగ్గించటానికి కొన్ని ప్రయత్నాలు చెయ్యొచ్చు.వీటిలో మొదటిది కొత్త రకం వస్తువు ఇవ్వటం. దీని వల్ల అవధాని భారీపదాల్ని గుప్పించటం కొంత తగ్గొచ్చు.(ఐతే కొందరు అవధానులు అడిగిన వస్తువు ఏదైనా తమ పద్ధతిలో తాము చెప్పుకుపోతారు. ఉదాహరణకి, సారాయి దుకాణాన్ని వర్ణించే పద్యం ఒక అవధాని ఇలా తయారుచేశాడు నిషేధాక్షరిలో

ఔగా శీధుసుధారా
రాగానీతాశ పూయ రమ్యత నిండన్‌
భోగాభిరస్య భంగిన్‌
భాగవత మనోజ్ఞ గీత బారుల వెలుగున్‌ (నాలుగో పాదంలో నిషేధం జరగలేదు)

అలాటప్పుడు పృఛ్ఛకుడు చెయ్యగలిగింది ఏమీ లేదు.)

రెండోది పద్యాన్ని సర్వలఘు కందం చెయ్యమనటం. దీని వల్ల సంస్కృత పదాల్ని విశృంఖలంగా వాడటానికి వీలులేకుండా పోతుంది. ఇక ముచ్చటగా మూడోది పద్యమంతా అచ్చతెలుగులో చెప్పమనటం.ఐతే ఈ చివరి రెంటిలో దేనికీ అవధాని ఒప్పుకోవాలని లేదు. సామాన్యంగా అలా ఒప్పుకోకపోవటం తమ సమర్థత మీద సందేహం కలిగిస్తుందని చాలా మంది అవధాన్లు నిక్కుతూ నీలుగుతూ సరే కానియ్యండంటారు.  ఈ రెంటిలో ఒక దానికి ఒప్పించినా సరే, భీకర సంస్కృత పదాల ఫణాల్నెత్తి ఆడలేడు అవధాని! అప్పుడిక పృఛ్ఛకుడిదే పైచెయ్యి! (కాబోయే అవధానులకి సలహా కనీసం బాగా అనుభవం వచ్చేదాకా ఇలాటి restrictions  కి ఒప్పుకోకండి కష్టాల్లో పడతారు!)

ప్రత్యక్షర నిషేధ పృఛ్ఛకుడు తన పరిస్థితిని మరీ దారుణంగా ఉండకుండా చేసుకోవటానికి ఒక మార్గం ప్రత్యక్షర నిషేధం చెయ్యకపోవటం. ఈ పద్ధతిలో పృఛ్ఛకుడు అవధానిని, “మీరు చెప్తూ ఉండండి, నేను అక్కడక్కడ నిషేధం చేస్తాను” అంటాడు. ఇప్పుడు కూడ అవధాని ఒక్కో అక్షరమే చెప్తుంటాడు గాని తనకి అనుకూలంగా అనిపించినప్పుడు పృఛ్ఛకుడు నిషేధిస్తాడు. ఐతే ఇక్కడ పృఛ్ఛకులు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. ఈ పరిస్థితిలో అవధానులు పృఛ్ఛకుడికి నిషేధించే అవకాశం కలక్కుండా గబగబా అక్షరాలు చెప్పెయ్యటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని తనక్కావల్సిన చోట ఏమాత్రం మొహమోటపడకుండా ఆపి నిషేధించగలిగే గట్టిదనం ఉండాలి పృఛ్ఛకుడిలో.
………………………………………………………………………………………………………………..

ఇదీ స్థూలంగా అష్టావధాన ప్రక్రియలో పద్యాలు చెప్పే అంశాల్ని సాధించే విధానం. అందరు అవధానులూ వాడే అన్ని టెక్నిక్‌లనీ చూపించకపోయి ఉండొచ్చుగాని ముఖ్యమైనవి అన్నీ మీముందుంచాననే అనుకుంటున్నాను.

అవధానంలో పద్యాలు చెప్పటం ఒక వంతైతే వాటిని గుర్తు పెట్టుకుని చివర్లో అప్పగించటం మరో వంతు. దీన్ని అవధానులు “ధారణ” అంటారు. ఇది కూడ ఏమీ బ్రహ్మ విద్య కాదు. దీనికీ చాలా టెక్నిక్స్‌ ఉన్నాయి. కాబోయే అవధానులు గ్రహించాల్సిందేమిటంటే అవధానంలో ధారణ చెయ్యాల్సిన పద్యాల్ని తయారుచేసేది అవధానే గనక వాటిని ధారణకి అనుకూలంగా తయారుచేసుకోవచ్చునని (ఒక్క నిషేధాక్షరి పద్యం విషయంలో మాత్రం ఇది వర్తించదు). సామాన్యంగా, తేలిగ్గా గుర్తుండే పద్యాల్లో ఈ గుణాలు కనిపిస్తాయి

పొడవైన, చక్కటి అల్లిక ఉన్న సమాసాలు,
మంచి శబ్దాలంకారాలు,
పాదాల చివర పదాలు విరగటం, అది కుదరనప్పుడు పాదం చివరి పదం ఓ పొడవైన సమాసం మధ్యలో ఉండటం,
తేలిగ్గా “కనిపించే” ప్రాస ఉండటం,
పద్యానికి చక్కటి నడక ఉండటం (ఒడుదుడుకులు లేని నడక),
పక్క పక్క పదాలు మిత్రత్వంతో కలిసిపోవటం.

వీటిలో వీలైనన్ని గుణాల్తో పద్యాల్ని తయారుచేస్తే వాటిని గుర్తు పెట్టుకోవటం తేలికే కాదు, అవి వినటానికి కూడ సొంపుగా ఉంటాయి.

సమాసాల వల్ల ఉపయోగం ఏమిటంటే, పద్యం నడక తెలిసిన వ్యక్తికి సమాసం మొదలు దొరికితే అది అందిపుచ్చుకుని మొత్తం గుర్తుచేసుకోవటం తేలిక (ఇందువల్లనే మనకి పద్యాలు గుర్తున్నట్టు వచన కవితలు గుర్తుండవు; శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు గుర్తున్నట్టు తిలక్‌ కవితలు గుర్తుండవు!). ఉదాహరణకి పెద్దన గారి పద్యం “అటజని కాంచె భూమిసురుడు” అన్నంత వరకు గుర్తుంటే ఇక అక్కణ్ణుంచి “అంబర చుంబి సురస్సరఝ్ఝరీపటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్‌” అనే వరకు చకచకా అల్లుకుని వచ్చేస్తుంది. అలాగే పోతన గారిది “అల వైకుంఠ పురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల” వరకు వెళ్ళ గలిగితే, “మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్నప్రసన్నుండు” దాకా వచ్చేస్తుంది. కనక అవధానులు వాడే ఒక టెక్నిక్‌ వాళ్ళు చెప్పే పద్యాల్ని ఇలాటి సమాసాల మాలికలుగా తయారుచేసుకోవటం.

మిగిలిన గుణాలకి ఉదాహరణగా ఈ పద్యం చూడండి

వెన్నెల వాకలై మిసిమి వెల్గుల జిల్గుల రేపు రేపులై
కన్నె గులాబి రేకులయి కమ్మన జుమ్మని మీటు తేటులై
మిన్నుల ఏరు నీరులయి మెత్తని క్రొత్తలిరాకు సోకులై
క్రన్నన పొంగుచున్నయవి కమ్ర శుభోదయ మానసమ్ములన్‌

దీన్లో సంస్కృత సమాసం పద్యం చివర్లో ఒక్కటి మాత్రం ఉన్నది. ఐతే ప్రతి పాదం లోను యతితో కొత్తపదం మొదలయ్యింది. అంతే కాదు ప్రతి పాదం కూడ ఓ కొత్త పదంతో మొదలయ్యింది. దీన్లో ఎన్నో శబ్దాలంకారాలు కూడ ఉన్నాయి. చక్కటి నడక ఉంది. ఇవన్ని కలిసి ఈ పద్యం తేలిగ్గా గుర్తుండేదౌతుంది. (ఐతే అవధానంలో పద్యాలు పూర్తిగా స్వేఛ్ఛగా తయారయేవి కావు గనక ప్రతి పాదాన్ని కొత్త పదంతో మొదలు పెట్టటం సామాన్యంగా సాధ్యం కాదు. అప్పుడప్పుడు యతి దగ్గర కూడ కొత్త పదం మొదలుపెట్టటం కష్టమౌతుంది.)

పద్యం నడక, యతిప్రాసలు, సమాసాలు, ఇచ్చిన ప్రశ్న ఇవన్ని కలిసి అవధానంలో పద్యాల్నిగుర్తుంచు కోవటానికి సహాయపడతాయి. అభ్యాసంతో ఎవరికి వారే కొన్ని టెక్నిక్స్‌ తయారుచేసుకోవచ్చు కూడ.

ధారణ కష్టం చెయ్యటానికి పృఛ్ఛకుడు చెయ్యాల్సింది పైన చెప్పిన గుణాలు పద్యంలోకి రాకుండా అడ్డుపడటం. ఉదాహరణకి పద్యాన్ని అచ్చతెలుగులో చెప్పమన్నారనుకోండి సమాసాల సమస్య తీరిపోతుంది (అవధాని దీనికి ఒప్పుకోవాలని లేదు). దత్తపదులూ, న్యస్తాక్షరాలు, సమస్య వీటిని సరిగా ఎన్నుకోవటం ద్వారా యతిప్రాసల advantage ని కొంత తగ్గించొచ్చు. ఇక నిషేధాక్షరి పృఛ్ఛకుడి ప్రభావం గురించి వేరే చెప్పక్కర్లేదు. గట్టివాడైతే అవధాని ప్రతి అక్షరాన్ని విడివిడిగా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి కలిగించొచ్చు.

ఐతే, అంతర్లీనంగా ధారణకి, పద్యం శ్రావ్యతకి చాలా దగ్గరి సంబంధం ఉంది శ్రావ్యమైన పద్యాల్ని గుర్తు పెట్టుకోవటం తేలిక. ఐతే పృఛ్ఛకులు అవధానికి కష్టంగా ఉండేట్టు చెయ్యాలంటే పద్యాలు శ్రావ్యంగా లేకుండా చూడాలి. అలాగే, అవధాని కూడ చక్కగా, భావుకతతో శ్రావ్యంగా ఉండే పద్యాలు చెయ్యాలంటే ఆలోచన అవసరం; మరీ ఆలోచిస్తే జనం తన సమర్థతని శంకించొచ్చు. అందువల్ల వీలైనంత త్వరగా పద్య పాదాలు చెప్పటానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల మంచి పద్యం రాదు. అందువల్ల గుర్తుపెట్టుకోవటం కష్టమౌతుంది. త్వరగా చెప్తూనే శ్రావ్యత కూడ తీసుకురాగలిగిన అవధాని అన్ని విధాల అదృష్టవంతుడు!

………………………………………………………………………………………………………………..

సభారంజనం, సభావశీకరణం అవధానికి కావాల్సిన ముఖ్యమైన గుణాలు. అవధానం magic కి దగ్గరగా ఉండే ప్రక్రియ. ఓ magician  ఎలా ప్రేక్షకుల కళ్ళు గప్పి తన పని తను చేసుకుపోతాడో అవధాని కూడా అలాగే ప్రేక్షకుల్ని ఒక trance లో ఉంచి తన పని పూర్తిచేసుకోవాలి. ఇందుకు ముందుగా అవధానికి కావలసింది అమితమైన ఆత్మవిశ్వాసం. ఎలాటి పరిస్థితుల్లోనూ నన్నెవరూ ఏమీ చెయ్యలేరులే అన్న ధీమా. దీనికి తోడు ఎవరైనా తనని విమర్శించటానికి లేదా పృఛ్ఛకులు కష్టమైన ప్రశ్నలడగటానికి వీల్లేకుండా చెయ్యాలంటే అవధాని తనకు మానవాతీత శక్తులున్నాయని నమ్మించటం చాలా అవసరం. తిరుపతివెంకట కవులు పరదేవతా ఉపాసకులని జనం అనుకునే వారు. అసలు అవధాని కావాలంటే ఉఛ్ఛిష్ట గణపతిని ఉపాసించాలని ఒక నమ్మకం ఉంది (ఇది ఇప్పటిది కాదు, కనీసం వందేళ్ళ నాటిది). అలాగే, మంత్ర, జ్యోతిష, వాస్తు, హస్త సాముద్రిక, ముఖ సాముద్రిక శాస్త్రాల్లో ప్రవీణులమని అవధానులు వాళ్ళంతట వాళ్ళో లేకపోతే వాళ్ళ భక్తులో ప్రచారం చెయ్యటం మామూలే. వీటన్నిటి లక్ష్యం ఒకటే పృఛ్ఛకులకీ ప్రేక్షకులకీ అవధాని అంటే భక్తి, గౌరవం, భయం కలిగించటం. ఇందుకు తగ్గ వేషధారణ కూడ అవధానికి అవసరం. “అవధాని గారికి కోపం వస్తే శాపం పెట్టేస్తారేమో!” అనే అనుమానం ఇతరుల మనస్సుల్లో కలిగించగలిగిన అవధానికి ఇంక ఎలాటి ఢోకా లేదు.

అవధాని బాధ్యతల్లో అడిగిన ప్రశ్నలకి సమాధానంగా పద్యాలు చెప్పటం ఒక వంతైతే ఆ అడిగే ప్రశ్నలు కష్టమైనవిగా ఉండకుండా చూసుకోవటం మరో వంతు. దీన్ని సాధించటానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తారు అవధానులు. మొదటిది పృఛ్ఛకుల్ని మంచి చేసుకోవటం. అవధానం మొదలుకావటానికి ముందుగా వాళ్ళని పలకరించి ఎవరు తనని పరీక్షించటానికి వచ్చారో ఎవరు తన మిత్రులో తెలుసుకుని మొదటి వర్గంలోని వాళ్ళని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. సాధారణంగా ఒక సభాధ్యక్షుడు కూడ ఉంటాడు కనక అతన్ని తప్పకుండా తన వాణ్ణి చేసుకోవటం చాలా ముఖ్యం అవధానికి. దీని వల్ల ఒక గొప్ప ఉపయోగం ఏమిటంటే, ఎవరైనా కష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు అధ్యక్షుడు అడ్డుపడి వాళ్ళని వారిస్తాడు. అలా అవధాని తన చేతికి మట్టి అంటకుండా తన పని సాధించుకోవచ్చు. ఇవేవీ కుదరకపోతే పృఛ్ఛకుడు ఇచ్చిన ప్రశ్నని తనకు అనుకూలంగా మార్చుకుని తరవాత పృఛ్ఛకుడు దాన్ని గురించి అడిగితే  ఉల్లాసంగా ఏదో చమత్కారంతో తప్పించుకునే ఒడుపు కావాలి. చివరగా కాబోయే అవధాన్లు గుర్తుంచుకోవాల్సింది చెప్పే పద్యానికీ ఇచ్చిన ప్రశ్నకు ఏమైనా సంబంధం ఉన్నదా అని ఆలోచించేది పృఛ్ఛకులు మాత్రమే నని, సామాన్య ప్రేక్షకులు కారని. కనుక ప్రేక్షకుల్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగిన అవధాని ఏం చెప్పినా చెల్లిపోతుంది.

ఆ మధ్య గరికపాటి నరసింహారావు గారు ఓ వ్యాసంలో అన్నట్టు ఇప్పుడు అవధానితో పాటు ఓ మంచి అప్రస్తుతప్రసంగిని కూడ ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అప్రస్తుతప్రసంగి నాటకంలో విదూషకుడి లాటి వాడైతే, ఇప్పుడు అతను సినిమాలో కమీడియన్‌ పాత్ర పోషిస్తున్నాడు. అవధాని, అప్రస్తుతప్రసంగుల మధ్య సంభాషణల్లో సాహిత్యం తప్ప మిగిలిన అన్ని విషయాలు పుష్కలంగా ఉంటున్నాయి. అవధానం వినోదంగా పరిణతి సాధించిందనటానికి ఇదో నిదర్శనం. కనక అవధాని చతురోక్తుల్తో, జోకుల్తో, అప్రస్తుతప్రసంగి మాటలకు స్పందిస్తూనే అతన్ని మందలిస్తూ ప్రేక్షకుల్ని ఆనందపరవశుల్ని చేస్తుండాలి. అవధాన పద్యాల కంటె ముఖ్యమైన అంశం ఈ అప్రస్తుతప్రసంగం. దీన్లోని కిటుకులు తెలియాలంటే సరసభరితంగా అవధానాలు నడిపే వారిని దగ్గరగా పరిశీలించి నేర్చుకోవటమే మార్గం. సున్నితంగా, సుకుమారంగా చమత్కరించగలిగే అవధాని విజయవంతమైన అవధానాలు చెయ్యగలడు పద్యాలు ఎలావున్నా!

అవధానికి సంగీతజ్ఞానం కూడ చాలా అవసరం. శ్రోతల,ప్రేక్షకుల సాహిత్యపరిచయం స్థాయి తగ్గే కొద్ది చమత్కారాలు, శ్రావ్యంగా పాడగలగటం, ఇతర సభావశీకరణ మార్గాలు, చాలా ముఖ్యపాత్ర వహిస్తాయి. కనక చెవికింపుగా పాడగలిగే అవధాని ప్రేక్షకుల అభివాదాల్ని అందుకుంటాడు.

……………………………………………………………………………………………………………

చివరగా కొన్ని విషయాలు ప్రస్తావించి ముగిస్తాను.

మొదటి విషయం గత వందేళ్ళలో కవయిత్రులెవరూ అవధానం చెయ్యటానికి పూనుకున్నట్టు కనిపించదు. ఇన్నాళ్ళూ ఎలా ఉన్నా ఇప్పుడు వాళ్ళ అవసరం చాలా ఉంది. త్వరలోనే మనం అవధాన కవయిత్రుల్ని చూస్తామని ఆశిస్తాను.

రెండోది అవధానాల పాత్ర ఏమిటనే విషయం. తిరుపతివెంకట కవులు అవధానాలు చేసిన కాలంలో వాళ్ళ ఆ వ్యాసంగం తెలుగు భాష మీద విద్యాధికులకి గౌరవం, దాన్ని నేర్చుకుందామన్న కోరిక కలగటానికి ఎంతో ఉపయోగపడింది. ఏకలవ్య శిష్యులతో కలిపి ఎన్నో వేలమంది వాళ్ళ అడుగుజాడల్లో నడవటానికి కారణమయ్యింది. తెలుగు భాషకి ఒక పునర్వికాసం కలిగించింది. ఇటీవలి కాలంలో జరుగుతున్న అవధాన కార్యక్రమాల వల్ల భాషకు ఏమీ ఉపయోగం కలక్కపోగా ఒకరకమైన కీడు కూడ జరుగుతున్నదేమో అనిపిస్తున్నది. అవధానాలు ఎంతో మంది శ్రోతల్ని ఆకర్షిస్తున్నా అది కేవలం ఈ ప్రక్రియ కలిగించే తాత్కాలిక ఆశ్చర్యం, విభ్రాంతి వల్లనేమో అని అనుమానం కలుగుతుంటుంది (అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను). ఏమైనా అవధాన ప్రక్రియ వల్ల భాషాసాహిత్యాల మీద ఉండే ప్రభావం గురించి ఎవరైనా సాధికారికంగా పరిశోధిస్తే బాగుంటుంది.

ఈ వ్యాసాలు రాయటంలో ఉన్నది ఒకటే లక్ష్యం అవధాన ప్రక్రియ ఒక శాస్త్రం ( Science ) అనీ అభిరుచీ కృషీ దాన్ని సాధ్యం చేస్తాయనీ చూపించటం. ఈ టెక్నిక్స్‌ తెలుసుకోవటం వల్ల పృఛ్ఛకులు మరింత రుచికరమైన ప్రశ్నలడగటం, అవధానులు ఇంకా రసవత్తరమైన పద్యాలు చెప్పగలగటం, ప్రేక్షకులు ఈ ఇద్దరి interation ని చూసి ఇంకా పరవశించటం సాధ్యమౌతుందని నా నమ్మకం.

ఈ పరిశోధనలో ఉపయోగించిన కొన్ని గ్రంథాలు.

1. “అవధాన విద్య”, సి. వి. సుబ్బన్న. అన్నింటిలోకి ఎక్కువ ఉపయోగించిన గ్రంథం ఇది. అవధానాల మీద ఆసిక్తి ఉన్న అందరూ చదవవలసింది.
2. “కవితా మహేంద్రజాలం”, ప్రసాదరాయ కులపతి. ఆశు, అవధాన పద్యాల నిధానం.
3. “నానారాజ సందర్శనము”, తిరుపతివెంకటకవులు.
4. “ఆశుకవితలు, అవధానములు, చాటువులు”, కేతవరపు రామకోటి శాస్త్రి.
5. “తిరుపతి వెంకటకవులు”, దివాకర్ల వేంకటావధాని.
6. “తిరుపతివెంకటకవుల కవితావైభవం”, జి. వి. సుబ్రహ్మణ్యం.
7. “అవధాన మంజూష”,  జి. వి. హరనాథ్‌ (సంకలనం).
8. “శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి కృతులు సమీక్ష”, జంధ్యాల శంకరయ్య.
9. “గుంటూరు కాలేజి శతావధానము”, సాహితీ మేఖల.
10. “వేలూరి శివరామశాస్త్రి అవధాన భారతి”, జంధ్యాల మహతీశంకర్‌.
11. “శతావధాన ప్రబంధము”, సి. వి. సుబ్బన్న.
12. “చాటుపద్య మణిమంజరి”, వేటూరి ప్రభాకరశాస్త్రి.
13. “చాటుపద్య రత్నాకరము”, దీపాల పిచ్చయ్యశాస్త్రి.
14. “శతావధాన సారము”, తిరుపతివెంకటకవులు.

అవధానులు కాదలుచున్న వాళ్ళు చదివితీర వలసిన పుస్తకాలు.

1. సులక్షణసారం
2. అమరకోశం
3. నానార్థనిఘంటువు
4. ఆంధ్రనామసంగ్రహం
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: