Thursday, October 11, 2018

ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా 2


ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా 2
సాహితీమిత్రులారా!

క్రితంసారి చూసిన భాగంలో దత్తపదుల పూరణల్ని కొన్నిట్ని విశ్లేషించి ఆ పద్యాలు ఎలా తయారయ్యాయో చూశాం. క్లుప్తంగా,మనం గమనించిన విషయాలు ఇవి

1.  ఇప్పటి అవధానులు పద్యం మొత్తం ముందుగా తయారుచేసుకోవటం లేదు. ఒక్కో పాదాన్ని కాని, లేదా పాదంలో భాగాల్ని కాని తయారుచేస్తున్నారు.

2. పాదభాగాల్ని తయారుచేసేట్లయితే ప్రాస చుట్టూ ఉన్న భాగం ఒకటి, దత్తపది దగ్గర భాగం మరొకటి,యతి దగ్గర భాగం మరొకటి ఇలా మూడు భాగాలుగా నిర్మించటం తేలిక.

3. దత్త పదాల్ని తేలిగ్గా విరిచి ముందు వెనకల కొద్ది అక్షరాలు కలిపి అర్థవంతమైన తెలుగు లేదా సంస్కృత పదాల్ని తయారుచెయ్యగలిగితే ఆ పాదం చక్కగా వచ్చే అవకాశం ఎక్కువ.

4. దత్తపదం చాలా కష్టమైనదైతే దాన్ని కొద్దిగా మార్చి తేలిక చేసుకోవటం మామూలే.

ఇప్పుడు అవధానాల్లో అన్ని అంశాల కంటె దత్తపది కష్టం ఔతోంది. దీనికి ముఖ్య కారణాలు మూడు ఇచ్చే పదాలు ఇంగ్లీష్‌ లేదా మరేదైనా (తెలుగు, సంస్కృతం కాని) భాషలోవి కావటం, టాపిక్‌ కూడ చాలా సమకాలీనం కావటం, దత్తపదిని ఇచ్చే పృఛ్ఛకుడికి సాహిత్యాన్ని గురించి గాని పద్య నిర్మాణం గురించి గాని ఏమీ తెలియనక్కర లేకపోవటం..

ఇంక ఇప్పుడు సమస్యా పూరణల గురించి చూద్దాం.

సమస్యా పూరణ బహుశ అన్నిట్లోకి అతి పురాతనమైన సాహితీ వినోదం. అందువల్ల విశ్లేషించటానికి చాలా సమస్యలు ఉండటమే కాక వాటిని వర్గీకరించటానికి, ఒక్కో వర్గానికి ఒకో రకమైన సాధన మార్గం నిర్దేశించటానికీ అవకాశం ఉంది. స్థూలంగా సమస్యల్ని రెండు వర్గాలుగా విభజించొచ్చు మొదటివి అర్థవంతమైన సమస్యలు. అంటే ఇచ్చిన సమస్యలో అసంగతమైనది గాని, అశ్లీలమైంది గాని అర్థం ఉండదన్న మాట. ఇక రెండో రకంవి అర్థం మార్చవలసిన సమస్యలు. అంటే ఇచ్చిన సమస్యలో అసలు అర్థం లేకపోవటం గాని, ఉన్నా అసంగతమైన,లేదా అశ్లీలకరమైన అర్థం ఉండటం గాని జరుగుతుందన్న మాట. సామాన్యంగా ఇలాటి సమస్యలే చాలా ఎక్కువ. ఇది కాకుండా మరో వర్గీకరణ ప్రాస బట్టి దుష్కర ప్రాస సమస్యలు, తేలిక ప్రాస సమస్యలు. ఈ రెండు వర్గీకరణలూ కలిపితే నాలుగు వర్గాలొస్తాయ్‌ తేలిక ప్రాస, అర్థవంతమైన సమస్య; తేలిక ప్రాస, అర్థం మార్చాల్సిన సమస్య; దుష్కర ప్రాస, అర్థవంతమైన సమస్య; దుష్కర ప్రాస, అర్థం మార్చాల్సిన సమస్య. వీటిలో మొదటి రకం దాదాపుగా తగలవు (బహుశ 1%); రెండో రకం అన్నిట్లోకి ఎక్కువ కనిపిస్తాయి (బహుశ 60 – 80 %); మూడో రకం ఒక మాదిరి(10 – 20%), నాలుగో రకం మిగిలినవి.

ఈ వర్గీకరణ, ఇచ్చిన సమస్య తత్వాన్ని బట్టి చేసింది. మరో రకమైన వర్గీకరణ అవసరం కూడా ఉంది. అది సమస్యని పూర్తి చేసే పథకం బట్టి పూరణల్ని localized అనీ non-localized అనీ వర్గీకరించొచ్చు. localized పూరణ అంటే మూడో పాదంలో చివరి భాగంలో అవసరమైన కొన్ని అక్షరాల్నో లేక ఒకటి రెండు పదాల్నో చేరిస్తే చాలన్న మాట సమస్యని అర్థవంతం చెయ్యటానికి. పద్యంలో మిగిలిన పాదాలు filler లాటివి. ఉదాహరణకి “సానిం గొల్చిన వాని కబ్బును కదా సౌశీల్య సౌభాగ్యముల్‌” అన్న సమస్య తీసుకుందాం. ఇది అసంగతమైన విషయం అని అనుకుంటాం గనక అర్థం మార్చాలి.సమస్యని ఎలా విరిచినా ఉపయోగం ఉండదు గనక మూడో పాదంలో కొన్ని అక్షరాలు కలిపి మంచి అర్థం వచ్చేట్టు చూడాలి.ఒక పూరణ ఇది

ఆనందంబు ఘటించు; అర్థచయ మాహ్లాదింపగా నందు; ధీ
ధ్యానాసక్తి పదానురక్తి కవితా ధర్మైక దీక్షాతప
శ్శ్రీనవ్యత్వము దివ్య కావ్య విలసచ్ఛ్రీరమ్య రమ్యార్ద్ర హా
సానిం గొల్చిన వాని కబ్బును కదా సౌశీల్య సౌభాగ్యముల్‌

ఇక్కడ “హా” అనే అక్షరం తప్ప మిగిలిన పద్యమంతా కేవలం ఛందస్సు కోసం ఉన్నదే. ఈ పూరణ పూర్తిగా localized అన్నమాట.

మరో ఉదాహరణగా “పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌” అనే సమస్య తీసుకుందాం. దీన్ని అర్థవంతం చెయ్యాలంటే ఆ పొగ పొగాకు పొగ కాకుండా ఏదో పవిత్రమైన పొగ(యాగ ధూపం లాటిది) అనాలి. ఒక పూరణ ఇది

భుగభుగమని పొగలెగయగ
అగణితముగ ఆజ్యధార లాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌

దీన్లో మూడో పాదం అవసరం సమస్యని మార్చటానికి. మొదటి రెండు పాదాలూ అవధాని ఉత్సాహం కొద్ది చెప్పినవి తప్ప అవసరమైనవి కావు (ఐతే అవసరాన్ని మించి చెప్పటం కొందరు సమర్థవంతులైన అవధానుల పద్ధతి; ఆ విధంగా కొన్నిసార్లు చాలా మంచి పద్యాలు వస్తాయి కూడా. కొత్తగా నేర్చుకునే వారు మాత్రం ఎంత అవసరమో అంత చెప్పగలగటం ముందు అభ్యాసం చేస్తే అక్కర్లేని ఫీట్లు తర్వాత చెయ్యొచ్చు.)

non-localized పూరణలో అవధాని ఓ కథనో సందర్భాన్నో ముందుగా విశాలంగా వివరిస్తే తప్ప సమస్యాపూరణం అర్థవంతం కాదు. ఉదాహరణకి “తురకలు సంధ్య వార్తురట తోయములన్‌ కొనితెమ్ము జానకీ” అనే సమస్య తీసుకుందాం. దీన్ని ఎన్ని విధాల ప్రయత్నించినా విరిచి localize చెయ్యటానికి వీలుకాదు. ఒకటే మార్గం ఓ కథ తయారుచెయ్యటం. ఓ అవధాని ఇలా పూరించాడు

పరమ మునీశ్వరుల్‌ గ్రహణపర్వము నేడగుటన్‌ తమంత వ
చ్చిరి; శతవృద్ధులందరు; నిశిన్‌ కడు దవ్వున గంగకేగ జా
లరు; మన యింట నుండి కనులన్‌ గని చందురు, రాహుదంష్ట్రికా
తుర కళు, సంధ్య వార్తురట; తోయములన్‌ కొనితెమ్ము జానకీ!

చూశారా, ఎంత విశాలమైన కథ తయారుచేశాడో! చంద్ర గ్రహణ వేళట, పరమ మునీశ్వరులు సంధ్య వార్చాలట. మరి జానకి నీళ్ళు తేవటం ఎందుకంటే, వాళ్ళు శతవృద్ధులు, గంగ దాకా నడవలేరు, వీళ్ళ ఇంటికి మాత్రం రాగలిగారు.తురకలు రాహుదంష్ట్రికాతుర కళు అయ్యారు. అంటే రాహువు కోరల్లో చిక్కుకున్న కళలు కల చంద్రుడన్న మాట! ఈ పద్యంలో అన్ని భాగాలు కథకి చాలా అవసరం. ఏదీ తీసెయ్యటానికి లేదు. ప్రదర్శన సమయంలో కూడ ఇంత లోతుగా ఆలోచించి పద్యం తయారుచేసిన అవధానిని ఎంతో మెచ్చుకోవాలి!

non-localized పూరణ చేసేటప్పుడు పద్యం మొత్తం ముందుగా తయారు చేసుకోవాల్సి వస్తుంది గాని localized పూరణకైతే కేవలం మూడో పాదం చివరి భాగాన్ని మాత్రం ముందుగా తయారు చేసి ఉంచుకుని మిగిలిన పద్యాన్ని ఒక్కో పాదం నిర్మించొచ్చు. కింద ఇచ్చిన ఉదాహరణల్లో ఏ సమస్యలకి localized పూరణు సరిపోతాయో వేటికి సరిపోవో కూడా చూద్దాం.

ముందుగా కొన్ని తేలిక ప్రాసతో ఉండి, అర్థం మార్చాల్సిన సమస్యల్ని చూద్దాం.

1. వాణీపుత్రుడు మాధవాత్మజుడనన్‌ ద్వైమాతురుండే కదా
ఇది అసంగతమైన అర్థం ఉన్న సమస్య (సరస్వతి కుమారుడు, విష్ణువు కొడుకూ వినాయకుడే కదా! అని ఈ సమస్య అర్థం.). కనక ముందుగా ఇచ్చిన సమస్యని మరో విధంగా విరవాలి. ఇలాగ
వాణీపుత్రు డుమా ధవా త్మజుడనన్‌ ద్వైమాతురుండే కదా
ఇప్పుడిక మూడోపాదం చివర శర్‌ అని తగిలిస్తే అది శర్వాణీపుత్రు డుమాధవాత్మజుడనన్‌ ద్వైమాతురుండే కదా అనే అర్థవంతమైన భాగంగా మారిపోతుంది (అంటే, శర్వాణీ పుత్రుడన్నా, పార్వతి భర్త శివుడి కొడుకన్నా వినాయకుడే కదా! అన్న సమర్థన.) ఇలాటి సమస్యలకి ఇక మిగిలిన పాదాల్లో చెయ్యవలసింది విశేషించి ఏమీ లేదు. గణపతిని పొగట్టమో వర్ణించటమో ఏదో చేస్తే సరిపోతుంది. అంటే ఈ పూరణ localizedపూరణన్న మాట.

2. గరుడుడు గణపతికి తండ్రి కావలె జుమ్మీ
దీన్ని కూడ  గరు డుడుగణపతికి తండ్రి కావలె జుమ్మీ అని విరిచి ముందు సా కలిపితే  సాగరు డుడుగణపతికి తండ్రి కావలె జుమ్మీ అని చక్కగా వస్తుంది (ఉడుగణపతి చంద్రుడు కదా!). ఇది కూడా localized పూరణే గనక మిగతాది filler.

3. మంగలవాడు నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమీ.
ఇక్కడ విరుపులేం అక్కరలేదు (విరుద్దామన్నా అవకాశం కూడా లేదు). దీని ముందు “నో” పెడితే చాలు. localized పూరణైపోతుంది. నోమంగలవాడు అంటే ” వరాలివ్వగలిగే వాడు” అనే అర్థం కనక విష్ణువు ఎలా వరాలివ్వగలడో లేక ఇచ్చాడో వర్ణించి ముందు భాగం పూరించొచ్చు.

4. శునకమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమమ్ము కీర్తింపగన్‌.
ఇదీ పైదాని లాటిదే ముందు “ఈ” కలిపితే చాలు అర్థవంతమై పోతుంది త్రిపురాసుర సంహారంలో విష్ణువు శివుడికి అమ్మయ్యాడు కదా! ఐతే ఇది non-localized పూరణ. ముందు పాదాల్లో త్రిపురాసుర సంహారం కథ చెప్పాలి! (బహుశ ఈ సమస్యకి localized పూరణ ఉండకపోవచ్చు కూడ!)

5. గణచతుర్థి నాడు ఫణి చతుర్థి
ఇది ఊరికే ఒకటి రెండక్షరాలు ముందు తగిలిస్తే విడిపోయే సమస్య కాదు; ఓ కథ తయారు చెయ్యాలి. చేసి, మూడో పాదం చివర “నేడు” చేరిస్తే అప్పుడు గాని పూర్తి కాదు (అప్పుడు “నేడు గణచతుర్థి; నాడు ఫణిచతుర్థి” ఔతుంది.) కథ ఏదైనా కావొచ్చు. కనక ఇది కూడా non-localized పూరణ.

6. దుర్మతి రాజు కాగ పరితోషము గైకొని రెల్ల వారలున్‌
దీన్ని కూడ విరచటానికి వీల్లేదు. ముందు కొన్ని అక్షరాలు చేర్చటమే మార్గం. ఉదాహరణకి,”కోరుకుం”,”వేచియుం”, “వేడుకొం” ఇలా ఏవైనా పెట్టొచ్చు (అప్పుడు “కోరుకొందుర్‌ మతి రాజు కాగ” అని మారిపోతుంది) అప్పుడిక ఎలాటి వాడు రాజు కావాలనుకుంటారో దాన్ని ముందుగా వర్ణించాలి. ఇది కొంతవరకు non-localized పూరణ ఐనా పద్యం మొదట్లో చెప్పాల్సినవి general గుణాలే కాని ఒక నిర్దుష్టమైన కథ కాదు.

7. పసులన్‌ కొల్చెడి వారి కబ్బుటరుదే భద్రంబులెల్లప్పుడున్‌
దీన్ని విరిచి కొంత కష్టపడొచ్చు గాని ఆ అవసరం లేకుండా తేలిక మార్గం ముందు “తా” అనే అక్షరం పెట్టటం. దాంతో పసులు తాపసులుగా మారిపోతాయి! ఇక మిగిలిన పద్యంలో తాపసుల గొప్పతనం వర్ణిస్తే సరిపోతుంది. అలా ఇది కూడా 6 లాటిదే.

8. సతి సతి గవయంగ పుత్రసంతతి కలిగెన్‌
ఇలాటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం ముందు కొన్ని అక్షరాలు కలపటం. ఇక్కడ తేలికైంది “వ” కలపటం వసతి ఔతుంది గనక ఓ చిన్న కథ ముందు చేరిస్తే అర్థ వంతం చెయ్యొచ్చు. అంటే non-localized పూరణన్నమాట. పైగా ఇచ్చింది కంద పద్య పాదం కనక కథని క్లుప్తంగా చెప్పాలి ఉన్న కొద్ది చోటునీ జాగ్రత్తగా వాడుకుంటూ.

9. తల్లీ రమ్మని పిల్చె భర్త నిజకాంతన్‌ మన్మథక్రీడకున్‌
పై సమస్య లాటిదే ఇది కూడా. ముందు ఏదో కలిపి దాన్ని “మత్తల్లీ” చెయ్యాలి. సీమంతినీ జాతి మత్తల్లీ అనో మానినీ జాతి మత్తల్లీ అనో భామినీ జాతి మత్తల్లీ అనో … ఇదీ localized పూరణే ముందంతా కొన్ని విశేషణాలు పడేస్తే సరిపోతుంది కదా!

10. ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్‌
ఒక తేలిక మార్గం “శే” ముందు కలపటం. ఇక మన ఓపిక బట్టి దాన్ని “రాజశే” అనో “శశిశే” అనో “కవిశే” అనో చెయ్యొచ్చు. అప్పుడు అదీ localized పూరణే ఔతుంది.

11. గర్భములో నున్న బిడ్డ గ్రక్కున తుమ్మెన్‌
ఏ అభిమన్యుడి కథనో తీసుకొచ్చి ఇది నిజంగానే జరిగిందనటం ఒక పద్ధతి. మరొకటి మళ్ళీ ఏదైనా పదం ముందు తగిలించటం. ఉదాహరణకి “డోలా గర్భం” చెయ్యొచ్చు. “సౌధోపరిశాలా గర్భం” అనొచ్చు. మన ఓపిక. అప్పుడు కొద్దిగా non-localized పూరణ ఔతుంది ఆ బిడ్డకి ఏదో కాస్త context ఇవ్వాలి కదా!

ఈ ఉదాహరణలన్నిటి బట్టి తేలేది, చాలా వరకు “తేలిక ప్రాస, అర్థం మార్చాల్సిన సమస్య” వర్గం సమస్యల్ని పూరించటానికి మూడు అంచెల పద్ధతి పనికొస్తుంది మొదటిది ఇచ్చిన సమస్యని విరచాలో లేదో, విరిస్తే ఎలా విరవాలో చూడటం; రెండోది localized పూరణ వీలౌతుందో లేదో చూడటం; మూడోది మూడో పాదం చివర ఏం కలిపితే అది అర్థవంతమౌతుందో నిర్ణయించుకోవటం.

ఇప్పటి వరకు చూసిన సమస్యలు మూడో పాదం చివర్లో కొన్ని అక్షరాలు కలిపితే అర్థవంత మయ్యేవి. మరొక రకమైన సమస్యలున్నాయి ఇవి అలా లొంగేవి కావు; వీటిలో అర్థమే ఉండదు సామాన్యంగా. ఉదాహరణకి “అనిరుద్ధుడు నెమలినెక్కి అంబుధి దాటెన్‌” తీసుకోండి. దీనికి ముందు ఏం కలిపినా అర్థవంతం కాదు. ఇలాటి వాటికి ఒకే పద్ధతి క్రమాలంకారం వాడటం.అంటే ముందు మూడు పాదాల్లో ప్రశ్నలుంటాయి; నాలుగో పాదంలో వాటి సమాధానాలుంటాయన్న మాట. అలా పూరించి ఈ సమస్యని ఇలా ఛేదించొచ్చు

మనసిజ నందనుడెవ్వడు?
అని షణ్ముఖుడెద్ది ఎక్కి అరుల జయించెన్‌?
హనుమంతుడేమి చేసెను?
అనిరుద్ధుడు; నెమలినెక్కి; అంబుధి దాటెన్‌

ప్రసిద్ధమైన “కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌”ని కూడా ఇలా పూరించారొకరు.

సంజకడ తోచు నెయ్యది?
పుంజుకొనగ నీయదెద్ది పొలుగగు నిద్రన్‌?
మంజుఫల భక్ష్యమెక్కడ?
కుంజర యూధంబు; దోమ; కుత్తుక జొచ్చెన్‌!

ఇప్పటి వరకు మనం చూసిన మార్గాలు అన్ని రకాల “తేలిక ప్రాస” సమస్యలకి సరిపోతాయి. ఉత్సాహం ఉన్నవారు ఈ కింది సమస్యల్ని ప్రయత్నించి చూడొచ్చు. పూరణకి కొన్ని సూచనలు ఇచ్చాను. ఉపయోగపడొచ్చు!

1. భీమ సేనుడు గాంధారి పెద్ద కొడుకు (సమస్యకి విరుపు; కొంచెం సందర్భం)
2. తన ప్రాణమ్ములు గొన్న బిడ్డకు నిజస్తన్యం బిడెన్‌ తల్లియున్‌ (మూడో పాదంలో కొన్ని అక్షరాలు కలిపి ఓ కథ చెప్పాలి)
3. రావణుడా సీత మగడు రక్షించు మిమున్‌ (మూడో పాదంలో అక్షరాలు)
4. బొమ్మా నీకింత సిగ్గు పోలదు సుమ్మా (మూడో పాదంలో అక్షరాలు; కొంత సందర్భం)
5. భారతి భర్త శంభుడని పల్కుట లోకవిరుద్ధమెట్లగున్‌ ( 4 లో లాగే)
6. పాపపు కర్మలే మనకు పావన సద్గతులందజేసెడిన్‌ (సమస్యకి విరుపు; మూడో పాదం చివర కొన్ని అక్షరాలు)
7. అందవికారమే బ్రతుకునందున శాంతి నొసంగు మిత్రమా (మూడో పాదం చివర కొన్ని అక్షరాలు; కొంత సందర్భం)
8. అన్నా రమ్మని పిల్చె భర్త తన అర్థాంగిన్‌ ప్రమోదమ్మునన్‌ (7 లాగే)
9. సంధ్యా వందన మాచరింప వలదా చౌశీతి బంధమ్ములన్‌ (సమస్యకి విరుపు; కొంత సందర్భం)
10. పంది పటుక్కునన్‌ కొరికె పంకజలోచన మోవి గ్రక్కునన్‌ (మూడో పాదం చివర అక్షరాలు; చిన్న కథ)

ఇంక ఇప్పుడు కొన్ని దుష్కరప్రాస సమస్యల్ని చూద్దాం. సామాన్యంగా చాలా మంది పృఛ్ఛకులు దుష్కరప్రాస ఇస్తుంటే సమస్య అర్థవంతంగా ఉండేట్టు చూస్తారు ప్రాసతోనే అవధాని కుస్తీలు పట్టాలి కదా, ఇంక క్లిష్టమైన సమస్య కూడా ఎందుకులే అని! ఉదాహరణకి

మత్స్యము కన్నుగొట్ట నొక మానిని చిక్కె విచిత్రరీతిగన్‌
దీన్లో అసంగతం ఏమీ లేదు. అర్జునుడు చేసిన పని అదే. కష్టం అంతా ప్రాసతోనే.

ఇలాటిదే మరో సమస్య, “తార్య్క్షుని చూచినంత రఘునాథుని పాములు వీడిపోయెగా”. అలాటిలాటి అవధాన్లు ఇలాటి ప్రాసకి కళ్ళు తేలేయాల్సిందే. ఇంకో మహానుభావుడిచ్చిన సమస్య “తుంక్వ్తా ప్రత్యయముల్‌ రసజ్ఞమతి కెందుం తుష్టి చేకూర్చునే” అనేది. ఇలాటివి తగిల్తే అవధానిని ఆ భగవంతుడే రక్షించాలి! (ఇలాటి సమస్యలు రాకుండా ఉండటానికి ఏం చెయ్యాలో వచ్చే భాగంలో చర్చిద్దాం.)

కొందరు పృఛ్ఛకులు నిజంగా అవధాన్ని పరీక్షిద్దామనో లేక వాళ్ళ పాండిత్యం చూపించుకుందామనో దుష్కరప్రాసల్తో పాటు క్లిష్ట సమస్యల్ని కూడా ఇస్తారు. ఉదాహరణకి

నిస్పృహ జీవితమ్మునకు నిత్య శుభమ్ముల నిచ్చు నెచ్చెలీ
ఇక్కడ కష్టమైన ప్రాసతో కుస్తీపట్లే కాదు నిస్పృహ వల్ల మంచి ఎలా జరుగుతుందో కూడా సమర్థించాలి.

ఇలాటి కష్టమైన సమస్యల్ని పూరించటానికి కొన్ని standard techniques తయారు చేశారు. దీన్లో ఒక పద్ధతి ఏమిటంటే,తొలిపాదంలో “ఇలాటి ప్రాసని ఎందుకిచ్చావు నాయనా!” అని పృఛ్ఛకుణ్ణి అంటూ, రెండో పాదంలో “అమ్మయ్య, ఎలాగోలా రెండు పాదాలు ఐపోయాయి కదా!” అని నిశ్వసిస్తూ ఇక మూడో పాదంలో సమస్యకి ఏదో సమర్థన చెప్పెయ్యటం. ఈ పద్ధతిని ఉపయోగిస్తే,”నిస్పృహ” సమస్యని ఇలా పూరించొచ్చు

నిస్పృహ యంచు కష్టమగు ఈ పదమెక్కడ తెచ్చినావయో!
నిస్పృహ కల్గుచున్నయది; యీదితినెట్టులొ రెండు పాదముల్‌
ఈ స్పృహ విన్ము ఐహిక సుఖేఛ్ఛ సముద్రము; దానిపై నికన్‌
నిస్పృహ జీవితమ్మునకు నిత్య శుభమ్ముల నిచ్చు నెచ్చెలీ!

మరో మార్గం పృఛ్ఛకుణ్ణి పట్టుకుని చెడతిట్టటం నిజంగానే! “గంజాయి తాగి తురకల ..” బాణీలో నన్నమాట!

పృఛ్ఛకుడు ఎలాగైనా అవధాన్ని కష్టపెట్టాలని కంకణం కట్టుకుని రాకపోతే, అతను దుష్కరప్రాసలనుకున్నవి కూడా అంత దుష్కరాలుగా వుండవు సరిగా విడగొడితే. అలాటిదో సమస్య “జగద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుడుండన్‌”. ముందు చూడాల్సింది ఇది నిజంగా కందపాదం అని “జ” నిజానికి మూడో పాదానిది. కనక ప్రాస “ద్వ్య”. వెంటనే గమనించాల్సింది “త్‌, వ్య” గా దీన్ని విడగొట్టొచ్చుననేది. అంటే, మనం పట్టుకోవాల్సిన పదాలు “త్‌” తో ముగిసేవి, “వ్య”తో మొదలయ్యేవీ అన్నమాట.ఒకరి పూరణ

సద్వ్యాఘాతము నిండె, వి
యద్వ్యాపృతి శౌరి చక్రమడ్డుపరుప, నా
పద్వ్యధితు డయ్యె క్రీడి, జ
గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుడుండన్‌

ఈ పద్యంలో అన్ని పాదాల్లోనూ ప్రాసని “త్‌, వ్య” కింద విడగొట్టినట్టు చూడొచ్చు. ఇలాటిదే ఇంకోటి “మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్‌ వేగవే” అనేది. ఇక్కడ అర్థంతో ఏమీ బాధ లేదు ప్రాస తోనే. ఐతే ప్రాస “ర్ఖ” గనక దాన్ని “ర్‌, ఖ” గా విడగొడితే చాలా పదాలు దొరుకుతాయి. అప్పుడిలా పూరించొచ్చు

మీర్ఖద్యోతులు మీర్ప్రతాప ఖనులున్‌ మీర్వైభవోదారులున్‌
మీర్ఖడ్గప్రవిదారితారిజనులున్‌ మీర్గొప్పవారంచు త
న్నే ర్ఖేలానుతి తేల్తు రట్టి జనులందే నమ్మికన్‌ పూను ఆ
మూర్ఖుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్‌ వేగవే

ఇప్పటికి మనం చూసిన వర్గాలు దాదాపుగా అన్ని రకాల సమస్యల్ని చుట్టబెట్టినట్టే. వీటిని ఎలా పూరించాలో అభ్యాసం చేసిన వాళ్ళకి కొత్త రకంవి వచ్చినా కూడా కష్టం కాకూడదు. ఒక్కోసారి కొంటె పృఛ్ఛకులు వింత సమస్యలు ఇవ్వొచ్చు.ఉదాహరణకి “అందరు అందరే మరియు నందరు అందరె అందరందరే!” ఇది “మేక తోకకు మేక..” లాటిది. చూట్టానికి చమత్కారంగా ఉన్నా పూరణ తేలిక. సభలో ఉన్న వాళ్ళని పొగుడుతున్నట్టు గాని, సినిమా వాళ్ళని తెగుడుతున్నట్టు గాని, రాజకీయ నాయకుల్నితిడుతూ గాని, .. ఇలా రకరకాలుగా పూరించొచ్చు.

మొత్తం మీద, ఓ సమస్య ఇచ్చినప్పుడు ఈ కింది వరసలో వెళ్ళటం మంచి పద్ధతి

1. సమస్యలో ప్రాస దుష్కరమైందా?
2. సమస్య అసంగతమైందా? ఐతే దాన్ని విడగొడితే తేలికౌతుందా?
3. అసంగత సమస్య ఐతే దీనికి localized పూరణ కుదుర్తుందా కుదరదా?
4. క్రమాలంకార పద్ధతి అవసరమౌతుందా?
5. కథ గాని సందర్భం గాని చెప్పాల్సుంటే ఏమిటది?
6. localized పూరణ సాధ్యమైతే, ఆ పూరణ వరకే తయారు చేసుకుని, పై పాదాల్ని అవసరమైనప్పుడే తయారుచెయ్యొచ్చు.
7. కాని పక్షంలో పద్యం మొత్తం ముందే తయారు చేసుకోవాలి.

ముగించే ముందుగా సమస్యల గురించి ఇంకో మాట. చాలా మంది పృఛ్ఛకులకి తెలియని విషయం వాళ్ళిచ్చే పాదం ఛందో లక్షణాలన్నిట్నీ అనుసరించాల్సిన పని లేదనేది. ఉదాహరణకి, ఆ పాదంలో యతి మైత్రి ఉండక్కర్లేదు. ఇందుకు ఉదాహరణగా “రాముని రాక్షసాంతకుని దాశరథిన్‌ వినుతించుటొప్పునే” చూడండి ఇందులో యతి తప్పింది. ఇక్కడ “దా”తో యతి కలిసేట్టు మొదటి అక్షరాన్ని “ద్రా” అనో “త్రా” అనో చెయ్యటం అవధాని పని. పృఛ్ఛకుడు గట్టివాడైతే ఇంకా
తమాషాలు చెయ్యొచ్చు. ఉదాహరణకి “పట్టపగలు చుక్కలు పొడిచెన్‌” అనే సమస్య ఇచ్చారనుకోండి, దాన్ని కందం గానో మరో ఛందంగానో చెయ్యటం అవధాని బాధ్యత. “నాటిరోజులిక రావిక రావికరావు మిత్రమా” అన్నారనుకోండి, అవధాని ఓపిక బట్టి దాన్ని చంపకమాల గానో ఉత్పలమాల గానో చెయ్యాలి. ఇలా పృఛ్ఛకుడి ఊహ ఎంత దూరం వెళ్ళగలిగితే అంత తమాషా సమస్యలు తయారు చెయ్యొచ్చు. ఈ విధంగా అవధాని పద్యనిర్మాణ శక్తినే కాకుండా అతని ఛందో పరిజ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని కూడ సమస్యల ద్వారా పరీక్షించొచ్చు. కాబోయే అవధానులు దీన్నుంచి తెలుసుకోవాల్సింది, అప్పుడప్పుడు ఇలా తికమకలున్న సమస్యలు తగలొచ్చని, వాటికోసం గమనిస్తూ ఉండాలనీ.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: