Friday, October 12, 2018

చిత్ర గీతములలో ఛందస్సు


చిత్ర గీతములలో ఛందస్సు
సాహితీమిత్రులారా!

సినీగీతాల్లోని ఛందస్సు గురించిన
ఈ వ్యాసం ఆస్వాదించండి.....

పరిచయము
కవితలను వచనరూపముగా, పాటలుగా, పద్యములుగా వ్రాయవీలగును. ఇందులో వచన కవితా రచనలో తగినంత స్వేచ్ఛ ఉంటుంది. పద్యములు గణబద్ధమైనవి. అనగా, పద్యాల లోని పాదములలో ఒక్కొక్క అక్షరము ఒక లఘువుగానో (I), లేక ఒక గురువుగానో (U) ఉంటుంది. ఈ గురులఘువుల అమరిక ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క విధముగా ఉంటుంది. శార్దూలవిక్రీడితమునకు గురులఘువులు UUUIIUIU IIIU UUIUUIU (మ-స-జ-స-త-త-గ) అయితే ఉత్పల మాలకు UIIUIUIII UIIUIIUIUIU (భ-ర-న-భ-భ-ర-వ). పద్యములను రాగ యుక్తముగా పాడుకోవచ్చును. కాని అన్ని పద్యాలను తాళము నకు తగినట్లుగా పాడుకోడానికి వీలు కాదు. తాళబద్ధములయిన కొన్ని పద్యాలను తాళవృత్తములు అనుట వాడుక. పాటలు లయబద్ధమైనవి. అందుకే ఇవి తాళయుక్తములు. చిత్ర గీతములు కావచ్చు, త్యాగరాజ కీర్తనలు కావచ్చు- అన్ని పాటలలో పూసలలో దారములా ఒక నిర్దిష్ట మయిన ఛందస్సు దాగి ఉంటుంది. చిత్రగీతములలోని ఛందస్సును గురించిన ఒక లఘుచర్చయే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము.

మాత్రాఛందస్సు
పాటలలో వాడబడే గణములు అక్షర గణములు కావు, అవి మాత్రాగణములు. మాత్ర లేక కళ అనేది ఒక లఘువును ఉచ్చరించు కాలపరిమితి. ఒక గురువు రెండు లఘువులకు సమానము, కాబట్టి దానిని ఉచ్చరించు కాలము రెండు మాత్రలు. మాత్రాగణముల సంఖ్యలు మాత్రల సంఖ్యపైన ఆధారపడి ఉంటాయి. మాత్రల, మాత్రాగణముల సంఖ్యలు: 1 – 1, 2 – 2, 3 – 3 (1), 4 – 5 (1), 5 – 8 (2), 6 – 13 (3). ఆఱు మాత్రలకంటె మనము పాటలలో ఎక్కువగా ఉపయోగించము. సామాన్యముగా పాటలు లఘువుతో ఆరంభమయితే, దాని ప్రక్కన మరొక లఘువు ఉంటుంది, గురువు ఉండడము అరుదు. అలా ఉన్నప్పుడు, దానిని ఎదురునడక అంటారు. ఎదురు నడకతో ఉండే మాత్రాగణముల సంఖ్యలు కుండలీ కరణములలో నివ్వబడినవి. ఇక్కడ ఇంకొక విశేషము- ఈ మాత్రాగణముల సంఖ్యలు ఖీఱపశీఅaషషఱ అబఎపవతీంతో సరి పోతాయి. కాని నేడు ఖీఱపశీఅaషషఱ అబఎపవతీం అని పిలువబడే సంఖ్యలను సుమారు ఆఱవ శతాబ్దములో విరహాంకుడు అనే ఒక ప్రాకృత లాక్షణికుడు ఈ మాత్రాగణములను క్రోడీకరించేటప్పుడు కనుగొన్నాడు. ఆఱు నుండి రెండు మాత్రల వరకు ఉండే మాత్రాగణములను ట (6 మాత్రలు), ఠ (5 మాత్రలు), డ (4 మాత్రలు), ఢ (3 మాత్రలు), ణ (2 మాత్రలు) గణములని అంటారు. మాత్రాగణముల వాడుకలో ఉండే సానుకూలత ఏమంటే మాత్రల సంఖ్య ఒకటిగా నున్నంతవరకు ఒక మాత్రా గణమునకు బదులు మరొక మాత్రాగణమును వాడుకొన వచ్చును, ఉదా. మనసున- మనసా, కృష్ణుడు- కృష్ణా, రామమ్మ- రమణమ్మ, ఇత్యాదులు.

తెలుగు భాషలోని పద్యములలో మనకు తారసపడే కొన్ని ముఖ్యాంశములు- (1) పద్యములో గణాలకు సరిగా పదాలు ఎప్పుడూ విరుగవు. చంపకమాలవంటి వృత్తాలలో ఒక పాదములా మరొక పాదము ఉండదు. (2) సంస్కృతములో కొన్ని వృత్తాలకు పాదము మధ్యలో విరామము ఉంటుంది, పాదాంతములో సామాన్యముగా అన్ని వృత్తాలకు ఒక విరామము ఉంటుంది, కాని తెలుగులో పదాలు ఒక పాదమునుండి మరొక పాదములోని చొచ్చుకొని పోవడము సామాన్యము. ఉపజాతులైన సీసము, గీతులలో సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదము స్వతంత్ర ముగా నుంటుంది. (3) రగడలవంటి తాళ వృత్తాలలో కూడ పదములను మాత్రాగణములకు తగ్గట్లు అన్ని చోటులలో విరిచి వ్రాయలేదు మన తెలుగు కవులు. (4) పద్యాలలో వచ్చెన్, పోయెన్ లాటి ద్రుతాంతములు (న-కారపు పొల్లు) సామాన్యము.

కాని పాటలలో హ్రస్వాన్ని దీర్ఘముగా పొడిగించుకొని పాడుకొనవచ్చును, ముఖ్యముగా చివర ఉండే అక్షరాలను. కొన్ని సమయాలలో మూడు లఘువులను త్వరగా ఉచ్చరించి రెండు లఘువులని అనుకొనవచ్చును. పద్యాలలో ఇలాటివి నిషిద్ధము. పాటలలో సామాన్యముగా మాత్రాగణములకు సరిగా పద ములు విరుగుతాయి. శాస్త్రీయ సంగీతములో ఇలాటివి కొన్ని వేళలలో లుప్తమై ఉండవచ్చును, కాని చిత్రగీతాలలో ఇటువంటివి వుండవు. పాటలలో పాదములు లేక పంక్తులు స్వతం త్రముగా నిలబడి ఉంటాయి, రెండు పంక్తులలో ఒకే పదము విరిగి వుండదు. సామాన్యముగా అంత్యప్రాస కూడ చిత్రగీతాలలో వుంటుంది. పాటంతా ఒకే విధమైన మాత్రాగణములతో సాగితే వాటి నడక లేక గతి ఒకే విధముగా ఉంటుంది. పాటంతా ఒకే గతిలో నుండ నవసరము లేదు; పాటలలో పల్లవి ఒక గతిలో సాగవచ్చును, చరణములు వేరొక గతిలో సాగవచ్చును. మూడు మాత్రల గతిని త్య్రస్రగతి అని, నాలుగు మాత్రల గతిని చతురస్రగతి అని, ఐదు మాత్రల గతిని ఖండగతి అని పిలు స్తారు. ఒకే పంక్తిలో రెండు రకములైన మాత్రాగణములు కూడ కొన్ని పాటలలో ఉంటాయి. అట్టి నడకను మిశ్రగతి అంటారు. క్రింద ఇట్టి గతులకు ఉదాహరణములను చిత్రగీతములనుండి మీకు అందజేస్తాను.

త్య్రస్రగతి- త్య్రస్రగతిలోని మాత్రాగణములు UI, III, ఎదురు నడకతో IU. మాయాబజారులోని వివాహభోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహొ నాకె ముందు… అనే పాట త్య్రస్రగతిలోనిదే. శ్రీ సీతారామకళ్యాణము లోని రావణుని శివతాండవస్తోత్రము కూడ త్య్రస్రగతిలోనిదే. ఎదురు నడకతోడి ఎనిమిది లగములతో (IU) ఉండే ఈ వృత్తమును పంచచామరము అంటారు. అందులోనిది ఒకటి క్రింద ఇస్తున్నాను –

ప్రఫుల్ల-నీల-పంకజ-ప్రపంచ-కాలిమ-ప్రభా-
వలంబి-కంఠ-కందలీ-రుచి-ప్రబద్ధ-కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

భార్యాభర్తలులోని జోరుగా హుషారుగా షికారు పోదమా పాట గతి కూడ త్య్రస్రగతియే. ఇందులో ఆఱు సూర్య గణములు, చివర ఒక గురువు ఉన్నది. ఇంకొక సూర్యగణము ఉండి వుంటే అది జాతి పద్యమైన ఉత్సాహతో సరిపోయేది. అమరగాయకుడు పి.బి. శ్రీనివాస్ కన్నడములో పాడిన విజయనగరద వీరపుత్ర (విజయనగరపు వీరపుత్రుడు) అనే చిత్రములోని అపార కీర్తి గళిసి మెరెవ భవ్య నాడిదు అనే పాట కూడ మూడు మాత్రలతో కూడిన పదాలతోడి త్య్రస్రగతిలోనిదే.

చతురస్రగతి- చతురస్రగతిలో ప్రతి మాత్రాగణమునకు నాలుగు మాత్రలు ఉంటాయి. వాటి గురు-లఘువులు – UU, UII, IIU, IIII, ఎదురు నడకతో IUI. కంద పద్యము చతుర్మాత్రలతో శోభిల్లుతుందన్న విషయము అందరికీ తెలిసినదే. ఇలాటి కంద పద్యములను, అర్ధకందములను యక్షగానములలో తరచు మనము వింటాము. మల్లీశ్వరి చిత్రములో ఉషాపరిణయ నాటికలో మగువా అను పదముతో ఆరంభమయ్యే ఒక కంద పద్యము ఉన్నది. చతుర్మాత్రలతో ఎన్నో వృత్తాలు, కందము, మధురగతి రగడ లాటి పద్యములు ఉన్నాయి. చతుర్మాత్రలతో పాటలు లెక్క లేనన్ని ఉన్నాయి. శంకరాభరణములోని రామదాస కీర్తన`

ఏ తీరున నను దయ జూచెదవో యినవంశోత్తమ రామా,
నా తరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామా

అనే పాటలో పాదానికి ఏడు చతుర్మాత్రలు ఉన్నాయి. పల్లవిలో వలెనే చరణాలలో కూడ ఏడు మాత్రల పాదములు ఉన్నాయి. అలాగే పాదమునకు ఏడు చతుర్మాత్రలు ఉండే మరొక పాట తెనాలి రామకృష్ణలోని జయదేవుని అష్టపది-

చందన చర్చిత నీల కలేవర పీతవసన వనమాలీ
కేళి చలన్మణి కుండల మండిత గండయుగస్మితశాలీ

(చందన । చర్చిత । నీల క । లేవర । పీతవ । సన వన। మాలీ)

ఈ పాటలోని మిగిలిన చరణములకు, ధ్రువమునకు (హరిరిహ ముగ్ధ వధూనికరే విలసిని విలసతి కేళిపరే) కూడ చతుర్మాత్రలే.

ఈ ఉదాహరణలు ప్రాచీన వాగ్గేయకారులది, ఇప్పటి వారిది కాదని మీరనుకొన్నారంటే, మిస్సమ్మ చిత్రములోని బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే ఎందుకె రాధా యీసునసూయలు అందము లందరి ఆనందములే పాటను గమనించండి.

మొదటి పాదమును మాత్రాగణములుగా విరిచినప్పుడు అది ఇలాగుంటుంది –

బృందా । వనమది । అందరి। దీ గో। విందుడు । అందరి । వాడే। లే

దీనికి, చందనచర్చితకు ఉన్న తేడా ఇందులో అదనముగా చివర ఒక గురువు ఉండడమే. ఈ బృందావనమది అందరిదీ అనే పాటకు వ్యంగ్యానుకరణమే (పేరడీ) మిథునము చిత్రము లోని ఆవకాయ మన అందరిదీ గోంగూర పచ్చడి మనదేలే అనే పాట. ఇందులో రచయిత కొద్దిగా స్వాతంత్య్రము తీసికొనెను కాబట్టి అక్కడక్కడ గణభంగము కలిగినది.

మల్లీశ్వరి చిత్రములోని మనసున మల్లెల మాలలూగెనే పాటలోని చరణము చతురస్రగతికి ఒక చక్కని ఉదాహరణ. ఆ చరణము-

కొమ్మల గువ్వలు గుసగుస యనినా
రెమ్మల గాలులు ఉసురుసు రనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా

చతుర్మాత్రలతో ఎన్నో వృత్తాలను మనము ఛందశ్శాస్త్రము లో గమనించవచ్చును. ఉదాహరణకు పై చరణములోని మొదటి రెండు పంక్తులు పాదమునకు 13 అక్షరములు ఉండే కనకితా అనే వృత్తమునకు సరిపోతుంది. మూడవ పంక్తి (అలలు…) పాదమునకు 14 అక్షరములుండే ప్రహరణకలితా అనే వృత్తము నకు సరిపోతుంది. నాలుగవ పంక్తి (దవ్వుల…) పాదమునకు 12 అక్షరములుండే సమ్మదవదనా అనే వృత్తమునకు సరిపోతుంది. ఇక్కడ ఒక విషయమును మనము గుర్తులో నుంచుకోవాలి. కవి ఈ వృత్తాలకు తగ్గట్లు పై పంక్తులను వ్రాయలేదు. అతడు పంక్తు లను చతుర్మాత్రాబద్ధముగా వ్రాసినాడు, కాకతాళీయముగా పంక్తులు పైన విశదీకరించబడిన వృత్తములకు సరిపోయినవి. అంతకంటే మనము ఎక్కువగా పరిశీలించరాదు. ఆదిశంకరుల భజగోవిందస్తోత్రములోని గాంభీర్యము, వల్లభాచార్యుల మధురా ష్టకములోని (వాణీ జయరాం, బాలసుబ్రహ్మణ్యం మలయ మారుతము చిత్రములో) మాధుర్యము ఈ చతుర్మాత్రలు ఉఱకలు పెట్టడమువలన రూపొందినదే.

వృత్తములవలె చిత్రగీతములు- ఐనా కూడ కొన్ని వృత్తాల నడకల వలె కొన్ని చిత్ర గీతములు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలను ఇక్కడ ఇస్తున్నాను –
(1) నమో భూతనాథ నమో దేవదేవ
నమో భక్తపాలా నమో దివ్యతేజా
భవా వేదసారా సదా నీర్వికారా
జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె గావా
నమో పార్వతీవల్లభా, నీలకంఠా

సత్యహరిశ్చంద్ర చిత్రములోని పై పాటలో భుజంగ ప్రయాతపు గణములైన నాలుగు య-గణములను (IUU IUU IUU IUU) సులభముగా గమనించవచ్చును.

(2) గీతాంజలి చిత్రములోని ఆమనీ పాడవే తీయగా మూగవైపోకు ఈ వేళ పల్లవి రెండు గణములను తీసివేయగా లభించిన సీసపాదములా ఉన్నది. ఇందులోని చరణములో రెండు వృత్తములు దాగి వున్నాయి-

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
అన్నది పంచచామరమువలె నుండగా, తరువాతి
పదాల నా యెదా స్వరాలసంపదా
తరాల నా కథా క్షణాలదే కదా

లలామలలితాధర వృత్తముతో (IUIUIU IUIUIU) సరిపోతుంది.

(3) హిందీ చిత్రము మమతలో హేమంతకుమార్, లతా మంగేష్కర్ పాడిన ఛుపాలో యూఁ దిల్ మేఁ ప్యార్ మేరా ఒక పారసీక ఛందస్సు పై (దీనిని నేను తెలుగులో వాహిని అనే వృత్తముగా కల్పించినాను) ఆధారపడినది.

(4) మంచి మనిషి చిత్రములోని ఓహో గులాబిబాలా అందాల మేఘమాలా అనే పల్లవి భీమార్జనము అనే ఒక వృత్తము నకు (UUIUIUU) సరిపోతుంది.

ఖండగతి- ఖండగతిలోని మాత్రాగణములు UUI, UIU, IIUI, UIII, IIIU, IIIII, ఎదురు నడకతో IUU, IUII. తెలుగువారికి పంచమాత్రలతోడి ఖండగతి అంటే చాల యిష్టము. శ్రీనాథుని సీసపద్యముల తూగు (ఉదా. దీనార టంకాల తీర్థ మాడిరచితి, దక్షిణాధీశు ముత్యాలశాల) పంచమాత్రల ఇంద్రగణముల ఖండగతివలన కలిగినదే. అదేవిధముగా ద్విపదలలో కూడ మొదటి మూడు ఇంద్రగణములు పంచమాత్రలయితే పాడుకొను టకు సొంపుగా నుంటాయి. ఖండగతిలో ఎన్నో చిత్రగీతములు ఉన్నాయి. రాజమకుటములోని సడి సేయకే గాలి సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే అనే పాట ఖండగతిలో సాగిన కర్ణపేయమైన చిత్రగీతము. పై పాట అమరికను గమనిస్తే మూడు పంచమాత్రలు, చివర రెండు గురువులు ఉన్న వనమయూర వృత్తము (UIII UIII UIII UU) జ్ఞాపకము వస్తుంది. ఇలాటిదే స్వాతిముత్యములోని వటపత్రశాయికీ వరహాల లాలీ అనే పాట కూడ. అమరశిల్పి జక్కన్న చిత్రములో

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి
మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట
నీ రూపు గన నీకె పారవశ్యాల
మా రాజు మనసేలు మరుని తంత్రాల

అనే ఖండగతిలోని పాట యతి లేని ద్విపద అనుకోవచ్చును. ఈమధ్య కాలములో గుణా, ఎటో వెళ్లిపోయింది మనసు, చిత్రములలోని

ఒహో కమ్మనీ ఈ ప్రేమ లేఖ నే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

అనే మధురగీతములోని కర్ణానందము చాలవరకు పంచమాత్రల (అక్కడకడ త్రిమాత్రలున్నా) మనోహరత వలన సిద్దించినదే.

ఆఱు మాత్రల గతి- ఆఱు మాత్రలతో కూడ పాటలు వుంటాయి. ఆఱు మాత్రలు ఎల్లవేళలలో రెండు మూడు మాత్రలు కావు, ఉదా. IIUII, UUII, IIUU, UUU. మిస్సమ్మ చిత్రములోని రావోయి చందమామాలోని చరణమును గమనిస్తే ఆఱు మాత్రలు కనబడుతాయి- సామంతము గల సతికీ ధీమంతుడ నగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమత మాయెను బ్రదుకే. పెళ్లికానుకలోని కన్నులతో పలకరించు వలపులూ పాటలో కూడ పల్లవి షణ్మాత్రలతో నున్నవే. శాస్త్రీయ సంగీతములోని వరవీణా మృదుపాణీ వనరుహలోచను రాణీ సురుచిర సుందరవేణీ సురనుత కల్యాణీ అనే పాటలో కూడ ఆఱు మాత్రలకు పదాలు విరుగుతాయి. జయభేరి చిత్రములోని రావే రాగమయీ పాటలోని

సంజెలలో హాయిగ సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నీవు
నవ పరిమళమే నీవు

చరణములో ఎన్నో ఆఱు మాత్రలు ఉన్నాయి.

మిశ్రజాతి గతి- ఒక పాట మిశ్రజాతి నడకలో ఉన్నదంటే అది రెండు విధములైన నడకలను కలిగి యున్నదని అర్థము. త్య్రస్ర, చతురస్ర గతుల మిశ్రణము సర్వ సామాన్యము. వృత్తము లలో మత్తకోకిల (UIUII UIUII UIUII UIU), రగడలలో వృషభగతి రగడ (3,4, 3,4, 3,4, 3,4 మాత్రలు) ఇట్టి నడకకు నిదర్శ నములు. వీటిలో మూడు మాత్రలు, నాలుగు మాత్రలు పదేపదే వస్తాయి. కందుకూరి రుద్రకవి వ్రాసిన జనార్దనాష్టకములోని పద్యములకు మత్తకోకిల లయ గలదు. చిత్రగీతములలో సంతానము చిత్రములోని నిదుర పోరా తమ్ముడా అనే పాటకు ఈ 3,4 మాత్రల నడక ఉన్నదని గమనించవచ్చును-

నిదుర పోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముసమైనా మఱచిపోరా
కరుణ లేని ఈ జగాన కలత నిదురే మేలురా
కలలు పండే కాలమంతా కనులముందే కరగిపోయే
లేత మనసుల చిగురుటాశా పూతలోనే రాలిపోయే

ఇలాటిదే మరొక పాట డాక్టర్ చక్రవర్తి చిత్రములోని పాడ మని నన్నడగవలెనా. ఆ పాట-

పాడమని నన్నడగవలెనా పరవశించీ పాడనా
నీవు పెంచిన హృదయమే యిది నీవు నేర్పిన గానమే
నీకు గాకా ఎవరికొరకూ నీవు వింటే చాలు నాకూ

ఈ దశాబ్దములో విడుదలైన గోదావరి చిత్రములోని రామ చక్కని సీతకి అనే పాటలో కూడ మిశ్రగతి ఉన్నది. అందులో నుండి ఒక చరణము-

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తె నా రాముడే
ఎత్తగలడా సీత జడనూ తాళీ గట్టే వేళలో

ఇందులోని మత్తకోకిల లయను ఎన్ని మారులు ఆలకించినా ఇంకా వినాలనే ఉంటుంది.

ఇదే మత్తకోకిల లయతో ఉండే మరొక పాట అన్పఢ్ అనే హిందీ చిత్రములోని ఆప్ కీ నజరోఁ నే సంఝా ప్యార్ కా కాబిల్ ముఝే అనే పాట. దీనికి అదే అర్థములో అదే మెట్టులో నేను నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా అని అనువదించియున్నాను. పూర్తి పాటను మత్తకోకిల కథలో చదువ గలరు.

మహాకవి కాళిదాసు, శంకరాభరణము చిత్రాలలో శ్యామలాదండకమును అందరు విని ఉంటారు. అందులో మాణిక్యవీణా ముపలాలయంతీం అనే ఉపజాతిలోని ఒక శ్లోకము ఒకటి ఉన్నది. ఆ పాదము (మాణిక్యవీణా) ఇంద్రవజ్ర వృత్తానికి సరిపోతుంది. దీనిని 5,4, 5,4 మాత్రలుగా విభజించ వీలగును. ఈ లయతో ఎన్నో పాటలు ఉన్నాయి. అందులో రెండు- చెంచులక్ష్మిలోని ఆనందమాయే అలినీలవేణీ, అరు దెంచినావా అందాల రాణీ, బాటసారి చిత్రములోని ఓ బాటసారీ నను మరువకోయీ మజిలీ యెటైనా మనుమా సుఖానా. నాకు నచ్చిన మరొక పాట బయలుదారి అనే కన్నడ చిత్రములో జానకి పాడిన బానల్లు నీనే భువియల్లు నీనే (నింగిలో నీవే భూమిపై నీవే) అనే పాట కూడ ఈ లయకు చెందినదే.

ముగింపు
శ్రోతలకు ఒక పాట కలకాలము ఒక మధురస్మృతిగా నిలవాలంటే, దానికి మంచి సాహిత్యము కావాలి, సుస్వరరాగభరిత మైన మెట్టు కావాలి, గాయకులు చక్కగా పాడాలి, వీటికి తగ్గట్లు చలనచిత్రములో మంచి సన్నివేశము అమరాలి. అప్పుడే ఆ పాట జీవంతమై అమరమవుతుంది. మంచి సాహిత్యమును అందించ డానికి కవులు మంచి ఛందస్సును ఎంపిక చేసికోవాలి. ఇక్కడే తెలుగు చలనచిత్రసీమ అదృష్టము చేసికొన్నది. స్వతహా గొప్ప కవులైన వారు చలనచిత్రాలకు పాటలను వ్రాసినారు. ఇది ఒక గర్వకారణమైన విషయము. చిత్రగీతాలకు ఛందస్సు ఒక ఆయువుపట్టు అన్న విషయము నిరూపించుటకై చిత్రగీతము లందలి ఛందోవైవిధ్యమును గురించిన కొన్ని సమాచారములను అందించినాను. పాఠకులు ఆదరిస్తారని తలుస్తాను.
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: