Thursday, October 4, 2018

పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము


పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము






సాహితీమిత్రులారా!

వ్యుత్పత్తి
వ్యుత్పత్తి అన్న పదానికి శబ్దరత్నాకరము ‘శాస్త్రాదిజన్య పరిజ్ఞానము’, ‘శబ్దసంభవ ప్రకారము’ అని అర్థాలు చెప్పుతోంది. ఈ అర్థాలు వివరించే ముందు వ్యుత్పత్తి పదం యొక్క వ్యుత్పత్తిని పరిశీలిద్దాం.

వ్యుత్పత్తి అన్న పదాన్ని వి+ఉత్పత్తి అని విభజించవచ్చు. నిజానికి వ్య-కారంతో ప్రారంభమయ్యే పదాలు చాలా వరకూ వి- అన్న ఉపసర్గ (prefix) చేర్చడం వల్ల ఏర్పడ్డవే. ఉదా.: వ్యభిచారి = వి + అభిచారి; వ్యాకరణ = వి + ఆకరణ; వ్యాకుల = వి + ఆకుల; వ్యూహ=వి + ఊహ; వ్యోష = వి + ఓష.

వి- అన్న ఉపసర్గ (prefix) కొన్ని సార్లు అర్థ విశేషణంగా వాడితే కొన్ని సార్లు వ్యతిరేకార్థ సూచకంగా వాడుతారు. విశేషార్థాన్ని సూచించే ఉపసర్గ ముందుగా ద్వి- అన్న ఉపసర్గగా ఉండేదని భాషాశాస్త్రజ్ఞుల ఊహ. విశేషార్థ ప్రయోగాలకు కొన్ని ఉదాహరణలు: భేద-విభేద, భాగ-విభాగ, శేష-విశేష, శిష్య-విశిష్య, శిష్ఠ-విశిష్ఠ, లక్షణ-విలక్షణ, చిత్ర-విచిత్ర, జ్ఞాన-విజ్ఞాన. వ్యతిరేకార్థ ప్రయోగాలు కొన్ని: విగుణ=గుణము లేని; విబల = బలము లేని; విభయ = భయము లేని.

ఉత్పత్తి: ఉత్-/ఉద్- అన్న ఉపసర్గకు –పత్తి అన్న ప్రత్యయం చేరిస్తే ఉత్పత్తి అవుతుంది. ఉత్-/ఉద్-అన్న ఉపసర్గ పైన, పైకి అన్న అర్థాలు రావడానికి చేర్చే ప్రత్యయం. ఉత్తమ, ఉత్తర, ఉత్కర్ష, ఉత్కంఠ (కంఠము పైకి లేచిన-), ఉద్ధార (పైకి తెచ్చు), ఉత్థాన, ఉద్ధృత, ఉత్ప్రేక్ష, వంటి పదాలన్ని ఉత్-/ఉద్- ఉపసర్గ తో నిర్మించబడినవే.

పత్తి అన్న ప్రత్యయం *పత్-అన్న ధాతువు నుండి పుట్టింది. పత్- అన్న ధాతువుకు పడు-, కిందికి దిగు- అన్న ప్రాథమికార్థాలతోపాటు, ఎగురు- అన్న గౌణార్థం (secondary meaning) కూడ ఉంది. ఈ ధాతువు ఆధారంగా పుట్టిన పదాలను జయదేవుడు తన అష్టపదిలో ఎంత ఒద్దికగా కూర్చాడో చూడండి:

“పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానమ్
రచయతి శయనమ్ సచకిత నయనమ్ పశ్యతి తవ పంథానమ్”

“పక్షి రెక్క వాల్చినా, ఆకు కదిలినా, నువ్వొస్తున్నావనుకొని శయ్య సవరించి చకిత నయనాలతో నీవు వచ్చే దారి వైపే చూస్తున్నాడు!”

దాదాపు ఇదే భావంతో రాసిన సుప్రసిద్ధమైన గీతం మల్లీశ్వరి సినిమాలోనిది:

“కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని”

దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాటకు జయదేవుని గీతమే స్ఫూర్తి అని చెప్పక తప్పదు.

-పత్తి ని ప్రత్యయంగా (suffix) చివర వాడిన పదాలకు ఉదాహరణ: నిష్పత్తి, ఉపపత్తి, ప్రతిపత్తి, ప్రపత్తి, వ్యాపత్తి, సంపత్తి, ఆపత్తి మొదలైనవి.

ఇక అర్థపరంగా, ఉత్పత్తి అంటే ‘పుట్టుక’ అన్న అర్థం చెప్పుకుంటే, వ్యుత్పత్తి అంటే ఆ పుట్టుకకు హేతువైన ప్రక్రియను వివరించేది అని చెప్పుకోవచ్చు. మూల ధాతువుల నుండి వాడుక పదాలు గా మారడానికి ఆయా ధాతువులు ఏ ఏ మార్పులు చెందాయో వివరించే శాస్త్రాన్ని వ్యుత్పత్తి శాస్త్రం అంటారు. దాని గురించే మనమిప్పుడు చర్చించుకుంటున్నాం.

అయితే, వ్యుత్పత్తి అన్న పదానికి కావ్యాలంకార శాస్త్ర సాంప్రదాయం ద్వారా ప్రాచుర్యం పొందిన మరో అర్థం: పరిశ్రమ, పాండిత్యం. కావ్యనిర్మాణానికి కావలసింది ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలని అని మన కావ్యాలంకారికుల సిద్ధాంతం. ప్రతిభ అంటే సృజనాత్మక శక్తి. “రసావేశ వైశద్య సౌందర్య కావ్య నిర్మాణ క్షమత్వమే” ప్రతిభ అని అభినవగుప్తుడన్నాడు. ఇది పుట్టుకతోనే కలుగుతుందని చాలా మంది అలంకారికులు భావించారు. శాస్త్రాధ్యయనం, గురువుల వల్ల కలిగిన జ్ఞానం ‘వ్యుత్పత్తి’. “బహుజ్ఞాత వ్యుత్పత్తిః (చాల విషయాలు తెలియడం వ్యుత్పత్తి)” అని కొందరంటే, “ఉచితానుచితవివేకో వ్యుత్పత్తిః” అని రాజశేఖరుడు కావ్యమీమాంసలో నిర్వచించించాడు. అంటే వ్యుత్పత్తి అన్నమాటకు స్థూలంగా పాండిత్యం, వివేచన అన్న రూఢ్యర్థాలు ఏర్పడ్డాయన్నమాట. అలాగే అవ్యుత్పత్తి అంటే పాండిత్యం లేకపోవడం. ఇక అభ్యాసము అంటే సాధన (practice). ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం — ఈ మూడు మూల ద్రవ్యాలూ సమృద్ధిగా ఉంటే కానీ కావ్యనిర్మాణం సాధ్యం కాదని అంటారు.

నిరుక్తం
పదాల వ్యుత్పత్తి తెలిపే శాస్త్రాన్ని మన ప్రాచీనులు ‘నిరుక్తం’ అన్నారని ఇంతకుముందు అనుకున్నాం కదా. యాస్కాచార్యుడు రాసిన నిరుక్తం ఒక్కటే ఈ వేదాంగశాస్త్రంపై మనకు లభ్యమౌతున్న గ్రంథం. ఈ గ్రంథంలో రెండు విభాగాలున్నాయి: మొదటి విభాగంలో పర్యాయపదాలు, ఒకే ధాతువు నుండి ఉత్పన్నమైన సంబంధిత పదాల పట్టికలు ఉంటే, రెండో విభాగంలో ఈ పదాల జాబితాను వివరిస్తూ యాస్కాచార్యుడు రాసిన భాష్యం ఉంటుంది. నిజానికి, చాలామంది పదాల పట్టీ ఉన్న మొదటి విభాగాన్ని నిఘంటువని పిలిచి, రెండో విభాగాన్ని మాత్రమే నిరుక్తమని అంటారు. యాస్కాచార్యుడు పాణిని కంటే ముందువాడని చాలామంది భాషాపండితుల అభిప్రాయం.

ఉక్త అన్న పదానికి, ని- అన్న ఉపసర్గ కలిపితే నిరుక్త- అన్న పదం ఏర్పడింది. ఉక్తం అంటే పలుకు, మాట. ని- ఉపసర్గకు లోపల, కింద వంటి అర్థాలు ఉన్నాయి. నిబిడ, నిక్షేప, నిక్షిప్త, నిరూప, నిదాన మొదలగునవి ని- ఉపసర్గ ప్రయోగానికి కొన్ని ఉదాహరణలు.

నిరుక్త- అంటే ‘లోపలి’ ‘మాట’. మాటలోని అంతరార్థం, లేదా, పదాల అర్థవివరణ, పద వ్యుత్పత్తి వివరణ. నిరుక్త- అన్న పదానికి పలుకు, చెప్పు, వివరించు అన్న సామాన్యార్థం కూడా ఉంది. నిరుక్తి అంటే మాత్రం పద వ్యుత్పత్తి వివరణే. నిఘంటు- అన్న పదానికి కూడా దాదాపు ఇదే వ్యుత్పత్తి: ని- అంటే లోపలి, ఘంట- అంటే మాట (గంట అన్న అర్థం కూడ ఉంది లెండి).

పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా ధాతువుల ద్వారా నిరూపించే శాస్త్రంగా అభివృద్ధి చెందిన నిరుక్తం, తరువాతి రోజుల్లో భాష్యకారుల కృత్తిమ వ్యుత్పత్తులతో వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఒక వినోద సాధనంగా మారిపోయింది. ఉదాహరణకు, గణేశ సహస్రనామంపై వ్యాఖ్యానం రాసిన భాస్కరాచార్యుడు గణనాథ అన్న పదాన్ని గణన + అథ అని విరిచి, ఎవరి పేర్లు లెక్కిస్తే (గణన చేస్తే) శుభం (అథ) కలుగుతుంతో అతడు గణనాథుడు అని వివరించాడు. గణనాథుడు అంటే “గణాలకు నాథుడు” అన్న సాధారణ వివరణ ఇస్తే, నిరుక్తంలో ఆయన నిపుణత మనకెలా తెలుస్తుంది చెప్పండి? భైరవం అన్న పదానికి వ్యుత్పత్తి భీ + రు + వం అని చెప్పడం కూడా ఈ రకమైన పాండిత్య ప్రదర్శనకు మరో ఉదాహరణ.

పలుకు
తెలుగు పదాలకు వ్యుత్పత్తి చెప్పడం సంస్కృత పదాల వ్యుత్పత్తి నిరూపణ అంత సులభం కాదు. సంస్కృతంలో వేద ప్రాతిశాఖ్యల కాలంనుండి కనబడే నిరుక్త సంప్రదాయం ఉంది; అమరకోశాది నిఘంటువుల నిర్మాణం కూడా ప్రాచీన కాలంలోనే జరిగింది; అంతేకాక, ఆధునిక కాలంలో ఇండో-యూరోపియన్ భాషలన్నింటిపై ఏ భాషా కుటుంబంపై జరగనంత విస్తృతమైన పరిశోధన జరిగింది. వీటన్నిటి ఆధారంగా మనం చాలా సంస్కృత పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా వివరించవచ్చు.

తెలుగు పదాలకు వ్యుత్పత్తిని వివరించే సంప్రదాయం లేదు. ఏదైనా ఉంటే తెలుగు పదాలు ఏ సంస్కృత పదాలకు తత్సమ, తత్భవ, వైకృత రూపాలో వివరించి చెప్పడం కనిపిస్తుంది. సంస్కృత పదాల్లాగే, అచ్చ తెలుగు పదాలకు కూడా వ్యుత్పత్తి ఉంటుంది అని చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే, సోదర భాషలైన తమిళం, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషల సజాతి పదాలను పరిశీలించి, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా, ధ్వనిసూత్రాల సహాయంతో ప్రాచీన పదాలను ఊహించుకోవడం ద్వారా తెలుగు పదాలకు వ్యుత్పత్తులు చెప్పడం సాధ్యం అవుతుంది. ఈ విషయంలో ఎమెనో, బరోలు నిర్మించిన ద్రావిడ వ్యుత్పత్తి కోశం (Dravidian Etymological Dictionary – DEDR) ఎంతగానో సహాయపడుతుంది. అయితే, పేరుకు వ్యుత్పత్తి కోశమే అయినా, ద్రావిడ వ్యుత్పత్తి కోశంలో సజాతి పదాల పట్టికే తప్ప, ప్రాచీన పదాల పునర్నిర్మాణం లేదు. అంటే, తెలుగు పదాలకు ఏ వ్యుత్పత్తులు చెప్పినా ఊహాత్మకమనే చెప్పుకోవాలి తప్ప భాషాశాస్త్ర సమ్మతమని కచ్చితంగా చెప్పలేం. అయితే, నాకు తెలిసిన ద్రావిడ భాషశాస్త్ర సిద్ధాంతాలను గౌరవిస్తూ వీలైనంత శాస్త్రబద్ధంగా తెలుగు వ్యుత్పత్తులను వివరించే ప్రయత్నం చేస్తాను.

పలుకు అన్న పదాన్ని ద్రావిడ వ్యుత్పత్తి కోశం ‘పని’, ‘పనచు’ (పనిమీద వెళ్ళమని ఆజ్ఞాపించు) అన్న పదాలతో కలిపి వేసింది (చూ: DEDR 3887). నా దృష్టిలో ఇది పూర్తిగా తప్పు. నిజమే, తెలుగులో ల- కార న-కారాల వినిమయం ప్రాచీన కాలంనుండీ కనిపిస్తోంది. తెలుగు-తెనుగు, ములగ-మునగ, చెలగు-చెనగు, ములుకోల-మునుకోల, జల్మం-జన్మం, లేదు-నేదు, లాగు-నాగు, నాగలి-లాంగలి అందుకు కొన్ని ఉదాహరణలు. అంతమాత్రంచేత, పని- సంబంధమైన ‘పనచు’ ద్వారా పలుకు’ వచ్చింది అంటే ఒప్పుకోవడం కష్టం.

తమిళంలో పణ్-, పణి- అంటే మన పని, ఉద్యోగము, పనిచేయు అన్న అర్థాలున్నాయి. అలాగే, హళె కన్నడలో పణ్ణు అంటే తయారు చేయు, పణ్ణిగె అంటే అలంకరించు అన్న అర్థాలు ఉన్నాయి. అయితే, తమిళంలో పణ్ణు అంటే మాట్లాడు అని, పణువల్ అంటే ఉపన్యాసము అన్న అర్థాలు ఉన్నాయి. కన్నడంలో హణి అంటే చెప్పు అని, కొలామి భాషలో పణ అంటే భాష అన్న అర్థాలు ఉన్నాయి.

నా దృష్టిలో ఈ పదాలన్ని ఒకే ధాతువుకు చెందినవి కావు. పని, పనచు అన్న పదాలు కార్య సంబంధమైనవి. పలుకు శబ్ద సంబంధమైనది. కాబట్టి ఇవి రెండు వేర్వేరు ధాతువుల నుండి పుట్టి ఉండాలి. కొండ భాషలో పణ్డ్- అంటే నిర్మించు, గదబ భాషలో పండు- అంటే చేయగల అన్న అర్థాలున్నాయి అని గమనిస్తే, మనం పనికి సంబంధించిన మూల ధాతువు పణ్డ్- అని కొత్తగా నిర్మించి, శబ్ద సంబంధమైన పలుకు పణ్/పల్ అనే వేరే ధాతువునుండి పుట్టిందని వాదించవచ్చు.

* పణ్డ్-< పణ్ణి, పణ్- (తమిళ), పని, పనచు, పనపు, పంపు (తెలుగు), పణ్డ్ (కొండ), పండు (గదబ) * పల్/పణ్ (=అను, మాట్లాడు) < పణ్ణు, పణువల్, పలుక్కు (తమిళ), పలుకు (తెలుగు), హణి (కన్నడ) సంగీతంపరంగా ఉపయోగించే 'పల్లవి' పదం కూడా పల్- అన్న పై ధాతువుకు సంబంధించిందే కావచ్చు. పలవు, పలవించు (విలపించు), పలవరము అన్న పదాలను కూడా ఒకే ఎంట్రీ (DEDR 3887) కింద జతచేసింది. తమిళంలో పులంపు అంటే పిచ్చిగా మాట్లాడు అని, కన్నడలో హలుబు అంటే విలపించు, హలబరు అంటే కలవరించు అన్న అర్థాలను గమనిస్తే వీటిని మనం పల్లవితో పాటు పలుకుకు సంబంధమైన పదాలుగా గుర్తించవచ్చు. తెలుగులో పలుకు అన్న పదం అకర్మక క్రియగా అను, మాట్లాడు, అన్న అర్థాల్లో ఉపయోగించినా, చెప్పు, నిందించు, అన్న అర్థంలో మహాభారతంలో సకర్మకక్రియగా వాడిన ప్రయోగాలు కనిపిస్తాయి. “కమలబాంధవుఁడు గర్ణుఁ బలికె” అని మహాభారత అరణ్యపర్వంలోని పద్యం ఒక ఉదాహరణ (ఆంధ్ర మహాభారతం 3.7.309). నామవాచక పదంగా పలుకు అన్న పదాన్ని మాట, మాటల ధ్వని, ఉచ్చారణ అన్న అర్థాల్లోనే ఎక్కువగా వాడినా నింద, ఎదురు చెప్పు అన్న అర్థాల్లో వాడిన సందర్భాలు కూడా ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. ప్రాబలుకు, తొలుబల్కు అన్న పదాల వేదాలకు పర్యాయపదాలుగా, పలుకుపడతి, పలుకుచెలి అన్న మాటలు సరస్వతికి అచ్చతెలుగు పర్యాయపదాలుగా మన సాహిత్యంలో కనిపించడం విశేషం. 'పలకరించు' అంటే పూనుకొని మాట్లాడు, అన్న సామాన్య అర్థం ఉన్నా, తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎవరి ఇంట్లోనైనా మరణం కాని, మరే దుర్ఘటనగాని సంభవిస్తే వారిని కలిసి సానుభూతి ప్రకటించడాన్ని 'పలకరించడం' అన్న విశేషార్థంలో వాడుతారు. 'పలుకు' అనగానే నాకు గుర్తుకు వచ్చే ఈ మహాభారతం లోని పద్యం చాలా ప్రసిద్ధమైనది: నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా ఖండల శస్త్రతుల్యము జగన్నుత, విప్రులయందు, నిక్కమీ రెండును రాజునందు విపరీతము, గావున విప్రుడోపు, నో పం డతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మఱింపగన్ ఉదంకుడనే మహర్షి గురుదక్షిణ కొరకు పౌష్యుడన్న మహారాజు వద్దకు వెళ్తాడు. ఏవో కారణాలవల్ల ఉదంకుడు, పౌష్యుడు ఒకరినొకరు శపించుకొంటారు. పౌష్య మహారాజు తానిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేనని యీ పై మాటలు చెబుతాడు. బ్రాహ్మణుని పలుకు వజ్రాయుధమంత కఠినంగా ఉన్నా అతని మనస్సు వెన్నలాగా మృదువైనది. రాజు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఉదంకుడు శాపాన్ని వెనక్కి తీసుకున్నా, తన శాపాన్ని వెనక్కి తీసుకోలేనని అంటాడు పౌష్యుడు.

బడి
‘బడి’ అన్న పదానికి చాలా అర్థాలున్నాయి. మూల ద్రావిడంలో నాదాలకు, శ్వాసాలకు తేడా లేదు కాబట్టి, ఈ పదాలన్నిటి మూలరూపం ‘-పడి’ అయి ఉంటుంది. మనందరికి తెలిసిన పాఠశాల అన్న అర్థం సంస్కృతంలో పఠ- శబ్దం నుండి వచ్చి ఉంటుంది. అయితే, పఠ- అన్న సంస్కృత పదానికి మిగితా ఇండో-యూరోపియన్ భాషలలో సజాతి పదాలు లేవు కాబట్టి ఈ పదం భారతదేశం లోనే సంస్కృత భాషలో ప్రవేశించి ఉంటుంది. మూలద్రావిడ భాషలోని పాట, పాడు అన్న పదాలను వేదపఠనానికి (వేదం పాడడానికి) ఉపయోగించి ఉండవచ్చునని ఒక ఊహ. ఇదే నిజమైతే, ద్రావిడభాషలోని పాట్ట, పాట సంస్కృతంలో పఠనగా, పాఠంగా మారి తిరిగి పాఠానికి పర్యాయంగా పడి-, అని బడి- అని మళ్ళీ ద్రావిడ భాషలలోకి ప్రవేశించి ఉండవచ్చు.

-బడి అన్న పదం పడు, పడి ఉన్న స్థితి అన్న అర్థంలో ప్రత్యయంగా వాడడం సామాన్యంగా కనిపించే ప్రయోగం. క్రియలకు, విశేషణాలకు ఈ ప్రత్యయం జతచేయడం ద్వారా నామవాచకం ఏర్పడుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు: అందుబడి, కట్టుబడి, తరబడి, దారిబడి, తీరుబడి, తగులుబడి, పెట్టుబడి, వచ్చుబడి, ఏలుబడి, రాబడి, రోసుబడి, సేరబడి.

రాబడి = రా+బడి = వచ్చు పడి (స్థితి)
పెట్టుబడి = పెట్టు + బడి = పెట్టు పడి (స్థితి)

ఈ ప్రత్యయానికి సంబంధించిందే –పాటు, -బాటు అన్న మరో ప్రత్యయం. అదికూడా నామ్నీకరణకు ఉపయోగపడుతుంది. ఏర్పాటు, ఉలికిపాటు, అదిరిపాటు, అగపాటు, ఎడఁబాటు, నగుఁబాటు, కట్టుబాటు, పొరబాటు వంటివి ఈ ప్రత్యయానికి ఉదాహరణలు. ఒక్క కట్టుబడి-కట్టుబాటు అన్న పదాలు తప్ప నాకు తెలిసి –బడి ప్రత్యయాన్ని, -బాటు ప్రత్యయాన్ని ఉపయోగించి వేర్వేరు అర్థాలను సాధించే ఉదాహరణలు నాకు తెలియవు.

బడి అంటే దిట్టము, క్రమము అన్న అర్థాలున్నాయని శబ్దరత్నాకరము చెబుతోంది. ‘బడిచేయు’ అంటే దిట్టము చేయు, క్రమపరుచు అన్న అర్థాలున్నాయి. ‘బడికోలు’ అంటే పోలిక, ఉదాహరణ అని చెప్పవచ్చు. బడి బడి అంటే మాటిమాటికి, Repeatedly, one after another అని అర్థం చెప్పిన బ్రౌన్ “ప్రమదంబున బంధుజనులు బడిబడిరాగన్” అన్న ఉదాహరణ ఇచ్చాడు. నా దృష్టిలో ఇక్కడ ‘బడిబడి రాగన్’ అంటే పడి, పడి రాగా అన్న అర్థమే తప్ప మాటిమాటికి అన్న అర్థం స్ఫురించదని అనిపిస్తుంది.

‘పలుకు’ గురించి, ‘బడి’ గురించి విపులంగా చర్చించాం కాబట్టి, ‘పలుకుబడి’ అన్న పదానికి ఎన్ని రకాల అర్థాలు వస్తాయో, ఈ శీర్షికకు ఏ అర్థాన్ని అపాదించవచ్చో పాఠకుల ఊహకే వదిలేస్తున్నాను. ఇది మీ హోమ్‌వర్క్!
----------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

Unknown said...

పలుకుబడి(ఉచ్చారణం, వచోనిబంధన, ఒడంవడిక అని శబ్దరత్నాకరం లో వివరించారు. మీరు చెప్పిన దానికి సరైన అర్థాన్ని ఏం చెప్పుకోవాలో తెలపగలరు.