Monday, October 22, 2018

మన భాషలో అంకెలు, సంఖ్యలు


మన భాషలో అంకెలు, సంఖ్యలుసాహితీమిత్రులారా!

“అంకెలు నా సంగడికాళ్ళు” అన్నాడు, గణితంలో నభూతో నభవిష్యతి అనిపించుకున్నమహా మేధావి శ్రీనివాస రామానుజన్‌.

సంగడికాడు అంటే స్నేహితుడు కనుక అంకెలు రామానుజన్‌స్నేహితులుట! అప్పడాలలాంటి ఎక్కాలు కంఠస్తం చెయ్యలేని మనలాంటి అర్భకులకి ఇనపగుగ్గిళ్ళలాంటి రామానుజన్‌స్నేహితులు కొరుకుడుబడతారా? అందుకని పాలల్లో నానబెట్టినపేలాల లాంటి అంకెలతో సరిపెట్టుకుందాం ప్రస్తుతానికి.

తెలుగులో అంకెలు, సంఖ్యలు అన్న రెండు మాటలు ఉండడం ఉన్నాయి కానీ వీటివాడకంలో నిర్దిష్టత అంతగా లేదు. సున్న నుండి తొమ్మిది వరకూ ఉన్న వాటిని”అంకెలు” అనాలనీ, ఆ పైన ఉన్న వాటిని “సంఖ్యలు” అనాలనీ ఒక నియమం ఉందికానీ ఈ నియమాన్ని అప్పుడప్పుడు ఉల్లంఘించక తప్పదు.

భాష పుట్టుకకి ముందే అంకెలు పుట్టుంటాయనే అనుమానం కొందరిలో లేక పోలేదు.ఇది నిజమైనా కాకపోయినా “అంకెల మాటలు” మాత్రం మనం మాట్లాడే భాషలలోకొల్లలుగా కనిపిస్తాయి. మన దేశంలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు అనే మూడుభాషలనీ తప్పించుకుని బ్రతకలేము కనుక ఇక్కడ భాష అంటే ఈ మూడు భాషలూఅని గ్రహించునది.

తెలుగు, సంస్కృత భాషలలో ద్విగు సమాసం అని ఒకటుంది. సమాసం అంటేమాటల కలయిక. ఈ మాటల్లో మొదటి మాట సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. ముల్లోకములు,నలుదిశలుమొదలైన ద్విగు సమాసాలు మన భాషలో ఎన్నో ఉన్నాయి.

అంకెల మాటలే కాదు. ప్రతి భాషలోనూ అంకెల పాటలు కూడ ఉంటాయి. . ఉదాహరణకితెలుగులో “ఒకటి ఓ చెలియ .. రెండూ రోకళ్ళు .. మూడూ ముచ్చిలక .. నాలుగూనందన్న” అన్న అంకెల పాట చాలా మందికి తెలిసే ఉంటుంది.

ముందు “ఒకటి” తో మొదలు పెడదాం.

1

“ఒక”నే కొందరు “వక” అనీ, మరికొందరు “వొక” అనీ రాస్తారు కానీ “ఒక”ఒప్పు, మిగిలిన రెండు ప్రయోగాలూ తప్పు అని నాదొక అభిప్రాయం. మరియొక అభిప్రాయానికి మరొకరిని సంప్రదించిచూడండి.

“ఒక”కి సంక్షిప్త రూపం “ఓ”. “ఒకటీ ఓ చెలియ” అనే పాటలో “ఒకటీ” అన్నదిఅంకెని సూచిస్తుంది. “ఓ” అన్నది “ఒక” అనే అర్థాన్ని ఇస్తుంది.

“ఒక” అన్నా “ఒంటి” అన్నా ఒకటే అర్థం. అందుకనే “ఒకటికి” అన్నా “ఒంటేలుకి” అన్నా ఒకటే.

“ఒంటరి” అంటే ఎవరి తోటీ సాంగత్యం లేకుండా ఉన్న వాడనో, కాక పెళ్ళి కానివాడనో, నాతిగల బ్రహ్మచారి అనో అర్థం స్ఫురిస్తుంది. ఒంటరులు ఒక కులం. సైన్యంలో పదాతులని కూడ ఒంటరులుఅనే అంటారు. సైనికదళంలో ఉన్న వాళ్ళు ఒంటరి వాళ్ళు ఎలాగవుతారు? పూర్వం ఒంటరుల కులం వాళ్ళు సైన్యంలోచేరేవారో ఏమో!

“ఒకేఒక” అని నొక్కి వక్కాణించవలసి వస్తే “ఒక్క” అని “క” ని నొక్కి పలికితేసరిపోతుంది. లేక “ఒక్కగానొక్క” అని అనొచ్చు.

“ఒకానొక” అంటే “ఏదో ఒక” అనే అర్థం స్ఫురిస్తుంది. ఒకప్పుడు అంటే ఒక వేళ,ఒక నాడు, మొదలైన అర్థాలు చెప్పుకోవచ్చు కదా. కాని “ఒక వేళ” అన్నప్పుడు “అయితే గియితే” అనే అర్థంకూడ వస్తుంది.

“ఒండు” అంటే కన్నడంలోనే కాదు తెలుగులో కూడా “ఒకటే”. నా మాట మీద నమ్మకంలేకపోతే “ఒండొరులు” అనే ప్రయోగం చూడండి.

రాముడికి ఒక భార్య, ఒక మాట, ఒక బాణం. రాముడిలా జీవితాంతం ఒకేఒకభార్య ఉంటే, వాళ్ళు ఏక పత్నీ వ్రతులు.ఒకొక్క రోజుకి ఒకొక్క భార్య చొప్పున మారుతూ వుంటే, వాళ్ళు ఏక పత్నీ వ్రతులుకారు. వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు.

ఒకే కడుపున పుట్టిన వారు ఏకోదరులు. ఒకే ఒక అంకం ఉన్న నాటకాలని ఏకాంకికఅంటారు. ఒకే రకం పంటని సాగు చేస్తే దానిని ఏకసాయం అంటారు. రక రకాల పంటలని సాగు చేస్తేఅది వ్యవసాయం అవుతుందేమో!

“ఏక” సంస్కృతం అయినప్పటికీ తెలుగు వాడుకలో “ఒక” మాటల కంటే “ఏక”మాటలే ఎక్కువ.

“ఏక” కానిది “అనేక” కనుక చాలా రోజులు “అనేక దంతం భక్తానాం” అంటేఎక్కువ దంతాలు (పళ్ళు) ఉన్న మనలాంటి భక్తులు అనుకునే వాడిని. కాదుట!

ఇలా “ఏక” తోక దగ్గర వచ్చే పదాలకి “ప్రత్యేక”, “తదేక” అనేవి మరొకరెండు ఉదాహరణలు.

“ఒంటరితనం” అంటే అభీష్టానికి వ్యతిరేకంగా ఏకాంతంగా ఉండడం. “ఏకాంతం”అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం.

ఒంటరిగా ఉన్న వ్యక్తిని “ఏకాకి” అని లోకులు అంటారు కాని “కావు కావు” అనిఅరిచే కాకులు నిజంగా ఏకాకులు కావు.

ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఒంటెద్దు బుద్ధులు ఉన్న వాళ్ళని “ఒంటి పిల్లి రాకాసి”అంటారు. “ఒంటరి ఒంటె” అని కూడ అంటారు.

మంత్రాలకి చింతకాయలు రాలతాయని భ్రమ పడే వాళ్ళంతా ఒంటి బ్రాహ్మణుడుమంచి శకునం కాదంటారు.

అరగంట కాని వేళలో గడియారం గంట కొడితే ఒంటిగంట అయినట్లు లెక్క.

గణితంలో “ఏకాంతర కోణం” అన్నప్పుడు “ఏకాంతర” అంటే ఒకటి విడిచి మరొకటిఅని అర్థం.

గణితంలో “ఒకటి” ముఖ్య సంఖ్య (“కార్డినల్‌నంబర్‌”), “ఒకటవ” అన్నదిక్రమ సంఖ్య (“ఆర్డినల్‌నంబర్‌”). గణితం దృష్టిలో ఒకటి బేసి సంఖ్య, నిజ (“రియల్‌”) సంఖ్య, ధన సంఖ్య,సహజ (“నేచురల్‌”) సంఖ్య, పూర్ణాంకం, నిష్ప (“రేషనల్‌”) సంఖ్య. గణితంలో “ఒకటి” ప్రథానసంఖ్య (“ప్రైమ్‌నంబర్‌”) కూడా. ఈ ప్రథాన సంఖ్యలే శ్రీనివాస రామానుజన్‌ సంగడికాళ్ళందరిలో ప్రథానులు.

ఒకసారి వింటే కంఠతా వచ్చే వారిని ఏకసంథాగ్రాహి అంటారు.

ఏకాగ్రత అంటే ఒకే ఒక అంశం మీద దృష్టి నిలపడం అని ఏకగ్రీవంగా తీర్మానంచెయ్యవచ్చు. ఏకాగ్రత లేనివారు ఏకసంథాగ్రాహులు కాజాలరు.

ఏకాహం అంటే ఒకే దినం చేసే కర్మకాండ అనేవారితో నేను ఏకీభవిస్తాను.

ఎకాఎకీ అంటే ఒకే దారి తీసుకుని వచ్చెయ్యడం. “ఏకాండీగా ఉన్న తాను” అన్నప్పుడు ఏక ఖండమైన బట్ట అని వివరణ.

తెలుగులో పదినీ ఒకటినీ కలిపితే “పదునొకటి” వస్తుంది. తెలుగు పదికి”ఒండు” కలపగా వచ్చినది “పదకొండు”. కాని సంస్కృతంలో దశనీ ఏకనీ కలిపితే “దశేక” కాదు, “ఏకాదశ” అవుతుంది.ఇది తెలుగుకీ సంస్కృతానికీ ఉన్న తేడాలలో ఒకటి.

వ్యాకరణంలో సంధి కార్యం జరిగినప్పుడు రెండు అక్షరాల స్థానంలో ఒకేఒక అక్షరం ఆదేశంగా వస్తే దానిని ఏకాదేశ సంధి అంటారు.

రాజనీతిలో ఏకాధిపత్యం వేరు, నిరంకుశత్వం వేరు.

“ప్రథమ” అంటే “ఒకటవ” అని అర్థం కనుక ప్రథానం అంటే ముఖ్యమైనది.వివాహాది కార్యక్రమాలలో తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమాన్ని ప్రథానం అంటారు.

ఈ రోజులలో గ్రీకు, లేటిను, ఇంగ్లీషు భాషల ప్రభావాన్ని తప్పించుకు తిరిగేవాడుధన్యుడు కాడు కనుక …

గ్రీకు భాషలో “మొనో” అంటే ఏక. అందుకనే ఏకాంతంగా బతికేవాడిని “మొనాకోస్‌” అంటారు. ఇందులోంచే “మంక్‌” అన్నమాట వచ్చింది. ఇటువంటి వారిని మనం “ఏకాకి” అనవచ్చు.

లేటిన్‌నుంచి వచ్చిన “యూని”, గ్రీకు నుంచి వచ్చిన “మొనో” అన్న ప్రత్యయాలతోఇంగ్లీషులో ఎన్నో మాటలు ఉన్నాయి.”యూనిట్‌, యునీక్‌, యునైట్‌, యూనిటీ, యూనివర్స్‌, మొనోపలీ” మొదలైనవి.”మోనోలిథిక్‌” అంటే ఏకశిల.

మోనో అంటే “ఒక”. టోన్‌అంటే “స్వరం”. కనుక మోనోటోన్‌అంటే ఎగుడుదిగుళ్ళులేకుండా ఉండే ఒకే ఒక స్వరం. ఇలా ఉదాత్త అనుదాత్తాలు లేకుండా అంటే మొనోటనస్‌గా ఉండే కార్యక్రమాలు బోరుకొడతాయి. ఈ “ఒక” సోది “మొనోటనస్‌”గా తయారయే లోగా ఇక్కడ ఆపుదాం.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: