Tuesday, October 2, 2018

దానవోద్రేక స్తంభకుడు


దానవోద్రేక స్తంభకుడు




సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలోని పద్యాలను ఉపయోగించి కూర్చిన
ఈ కథను ఆస్వాదించండి..........

లంకలో రావణ రహస్య సమాలోచన మందిరం:

అందరూ రావణుడి కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం ఉల్లాసంగా ఉంది. రావణుడు ఎప్పుడొచ్చేదీ ఖఛ్చితంగా తెలియడం వల్ల, అంతకు ముందే చేరుకున్నారు అందరూ. సమయపాలన లేకపోతే పడే శిక్ష అందరూ ఎరిగిందే. అప్పటిదాకా జయించిన దేశాలూ, ఎవరెంత గొప్పవాళ్ళో జబ్బలు చరుచుకుంటూ చెప్పుకుంటున్నారు. విభీషణుడు అన్నీ వింటూ చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు. ఇంద్రజిత్తూ, కుంభకర్ణుల నవ్వులు వినిపిస్తున్నాయి. ఖర, దూషణాదూలూ, దేవాంతక, నరాంతకులూ అతికాయ, అక్షయ కుమారులు వినోదంగా చూస్తున్నారు. కొన్ని రోజుల క్రిందటనే జరిగిన యుద్ధంలో ఎవరు ఎవర్ని గెల్చారు, శత్రువు ఎలా నీరుకారిపోయేడూ చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో యుద్ధం లేకుండా విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నట్టే వున్నారు.

అప్పుడే తెరిచిన ద్వారంలోంచి ఠీవిగా రావణుడు నడుచుకుంటూ వచ్చేడు. జయ జయ ధ్వానాలు మిన్ను ముడుతుండగా, సింహాసనం అధిరోహించి చుట్టూ పరికించి చూశాడు. అందరూ వచ్చినట్టేనా? మారీచుడు లేడు. సరే చూద్దాం మామ సంగతి తర్వాత అనుకొని, నోరు విప్పేడు. “మనం యముడినీ, ఇంద్రాదులనీ జయించేం, కుబేరుడిని తరిమికొట్టి లంకని వశం చేసుకున్నాం, పుష్పకంలో ఎక్కడికైనా వెళ్ళగలం. మనలి చూస్తే ప్రపంచం వణుకుతోంది. కానీ మనం అన్నీ జయించలేదు ఇంకా అని మీకు తెలుసు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాక మనం దండెత్త వలసిన ప్రదేశాలు చెప్పండి నాకు. ఇప్పుడే మనం నిర్ణయించుకుంటే, కొన్ని రోజులాగి బయల్దేరుదాం.”

సేనానాయకుడు ప్రహస్థుడు లేచి చెప్పేడు వెంటనే, “రాక్షసేశ్వరా, మన బలగాలు కొంచెం అలసి ఉన్నాయి కానీ అదేం పెద్ద సమస్య కాదు. స్వర్గం, ఇంద్రలోకం, యమలోకం మనం జయించాం కాబట్టి ఇప్పుడు కిందిలోకాల వైపు దృష్టి మరలిస్తే బాగుంటుంది. ఆ పై నీ ఇష్ఠ్టం మరి.”

రావణుడు తలపంకించేడు. మేఘనాథుడు అన్నాడు, “అయితే సుతలంలో బలి చక్రవర్తి ఉన్నాడని విన్నాము, అక్కడ మొదలు పెడితే బాగుంటుందేమో?”

విభీషణుడు అందుకున్నాడు వెంఠనే. “అన్నా సుతలం వైపు వెళ్ళవద్దు అక్కడ బలి మహారాజు ఉండడం నిజమే కానీ ద్వారంలో చతుర్భుజ రూపుడైన మహా విష్ణువు సర్వవేళలా ఆయన్ని కాపాడుతూ ఉంటాడు.”

“ఏమిటీ? బలి చక్రవర్తిని జయించడం చేతకాక ఆయనకున్న సమస్తాన్నీ దేబిరించి పుచ్చుకున్న పిరికిపందేనా? అలాంటివాడు చతుర్భుజుడైనా, అష్ఠభుజుడైనా ఈ దశకంఠుడి ముందు నిలవగలడా?” ఖరుడు అడిగేడు. రావణుడి ఛాతీ ఉప్పొంగింది, ఖరుడి మాటలకి.

విభీషణుడు అన్నాడు, “నాయనా, ఒక విషయం మర్చిపోతున్నారు మీరు. మనం అందరం రాక్షసులమై పుట్టడం, మన కర్మల వల్లనే కానీ ఎవరి తప్పూ కాదు. మనల్ని మనం జయించడం నేర్చుకుంటే, మనకీ జరా మరణాల బాధ తప్పుతుంది. అప్పుడు మనం కూడ బలి అంతటి వాళ్ళం అవ్వగలం. ఇందులో విష్ణువు ప్రసక్తి లేదు. ఆయనకి మనమీద పగ ఎప్పుడూ లేదు, కానీ మనమే ఆయన్ని, ఆయన భక్తులైన మహర్షుల్నీ రెచ్చగొడుతున్నాం. ఆయన లోక రక్షైకా రంభకుడు. అది గుర్తుంచుకుంటే మంచిది.”

ఇంద్రజిత్తు వెంటనే కోపంగా చెప్పేడు, “తండ్రీ ఈ విభీషణుడు దేవతల పక్షపాతి. ఈయన్ని నమ్మకండి. ఇంద్రుణ్ణి గెల్చిన నేనూ, యముణ్ణి గెల్చిన మీరూ ఉండగా మనకి ఎవరెదురు చెప్పగలరు? లౌక్యంతో బలి మహరాజుని వంచన చేసి ఆయన ద్వార పాలకుడైన విష్ణుడేపాటి? మనం ముందు సుతలం మీదకే దండెత్తి పోదాం.”

రావణుడు సాలోచనగా అన్నాడు, “విభీషణా, విష్ణువే కనక బలి ద్వారం దగ్గిర ఉన్నాడంటే మనకి రెండు విధాలా మంచిది. ఎందుకంటే మొదట విష్ణువుని జయించవచ్చు, రెండవది, నా దగ్గిర పరమశివుడిచ్చిన ఖడ్గం చంద్రహాసం ఉంది. దానితో ఇద్దరి పనీ ఒకేసారి అయిపోతుంది కదా? మనం మేఘనాధుడు చెప్పినట్టే చేద్దాం.”

“అన్నా నేను చెప్పవల్సింది చెప్పేను, తర్వాత మీ ఇష్ఠం. ఇంక శెలవు, వెళ్దామా?”

జయ జయ ధ్వానాల మధ్య సభ చాలించి ఇళ్ళకు వెళ్ళేరు అందరూ.

సరిగ్గా నిర్ణయించిన రోజున రాక్షస సేనతో రావణుడు సుతలం మీదకి దండెత్తడానికి బయల్దేరేడు. విభీషణుడూ, కుంభకర్ణుడూ లంకలో ఉండి రక్షించే భారం తీసుకున్నారు. పుష్పకం సుతలంలో ఆగగానే, ప్రహస్తుణ్ణి పిల్చి చెప్పేడు రావణుడు, “ప్రహస్థా, నా మాటగా చెప్పు బలితో — బలి మహరాజా, నేను దశకంఠుడైన రావణుణ్ణి. లంక మా రాజ్యం. ఇంద్రుణ్ణీ, యముణ్ణీ జయించి నేను ఇప్పుడు మిగతా లోకాలని జయించడానికి పూనుకున్నాను. మీరు నాతో యుద్ధం చేసినా సరే లొంగిపోయినా సరే.”

ఈ మాట పట్టుకుని ప్రహస్థుడు ద్వారం వద్దకి నడిచేడు. ద్వారం ముందు ఎవరో కాపలా ఉన్నట్టు ఉంది. సరిగ్గా దగ్గిరకొచ్చేసరికి, ద్వారపాలకుడు ప్రహస్థుడిని చూసి చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వు ఎలా ఉంది అంటే, అమృతం దొరికాక కాక్షసులు జగన్మోహిని చూసి మతి పోగొట్టుకున్నట్టూ, ప్రహస్థుడికి ఒళ్ళు తెలీకుండా పోయింది. అదో మైకం కప్పేసరికి తూలుకుంటూ వెనక్కి రావణుడి దగ్గిరకి వచ్చేడు. రావణుడి ఏమి జరిగిందో అర్ధం కాలేదు. ప్రహస్థుణ్ణి గుచ్చి గుచ్చి అడిగేక ఇలా చెప్పేడు,

“రావణా, బలి సంగతి నాకు తెలియదు కానీ, ద్వారపాలకుడు నవ్వే ముగ్ధ మనోహరమైన నవ్వు చూసిరా. వెళ్ళు వెంటనే. ఆ నవ్వు చూడ్డానికి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు.” అలా అంటూ ఒంట్లో బలం అంతా పోయినట్టూ పుష్పకంలో కూలబడ్డాడు.

అలా మత్తులో పడిపోయిన ప్రహస్థుడిని వదిలేసి రావణుడు సుతలం ద్వారం దగ్గిరకి నడిచేడు. ద్వారం దగ్గిర ప్రహస్థుడు చెప్పిన పాలకుడూ లేడు, వాడి నవ్వూ లేదు. కోపంగా నడుచుకుంటూ ఖడ్గం మీద చేయి ఉంచి లోపలకి నడిచేడు. లోపల బలి మహారాజ పీఠం మీద ఆశీనుడై ఉన్నాడు.

“ఎవరు నాయనా నువ్వు ఇలా వచ్చేవు?” అడిగేడు బలి చక్రవర్తి.

“నేను దశకంఠుడైన రావణుణ్ణి. కుబేరుణ్ణీ, అష్ట దిక్పాలకుల్నీ, ఇంద్రలోకం, స్వర్గం, యమలోకం జయించాక మర్త్య లోకాలు జయించడానికి బయల్దేరేను. మొదట సుతలం మీదకి వచ్చేను. మీరు నాతో యుద్ధం చేసినా సరే, ఓటమి ఒప్పుకున్నా సరే,” దర్పం మాటల్లో వలికిస్తూ చెప్పేడు రావణుడు.

“బయట ద్వార పాలకుణ్ణి దాటి ఎలా వచ్చేవు లోపలకి?” చిరునవ్వు నవ్వుతూ అడిగేడు బలి.

“అక్కడ ఎవరూ లేరే? ద్వారం కాపలాకి కూడా ఎవరూ లేనీ మీరో రాజూ, మీకో రాజ్యమూనా?” తిరస్కారంగా నవ్వేడు రావణుడు.

బలి సాలోచనగా తల పంకించేడు, “సరే, రావణా. నేను యుద్ధాలు మానేసి చాలాకాలం అయింది. త్రిలోకాలూ నేను వామనుడికి దానమిచ్చాను కొంతకాలం క్రితం. ఆయనే నన్ను ఇక్కడ సుతలంలో కూర్చోబెట్టేడు. అందువల్ల ఆయన్ని అడిగి యుద్ధం మాట చూడాలి.”

“ఏమిటీ? మిమ్మల్ని దేబిరించిన వాడికి త్రిలోకాలూ ఇచ్చి మీరు ఆయనికి ఊడిగం చేయడం కూడానా? ఎంత సిగ్గు చేటు!” పైకే అనేశాడు రావణుడు. మళ్ళీ బలి చిరునవ్వే సమాధానం అయింది.

“అసలు దానం అలా అడగడానికి ఆయనికి సిగ్గు లేకపోతే, ఇవ్వడానికి మీకు ఉండద్దా?”

“రావణా, నేను ఎవరికి దానం ఇచ్చానో, నేనెవర్నో నీకు తెలుసా?” బలి మొహం ఎర్రబడింది.

“ఆ ఎవడో మాయల మారి చిన్న కుర్రవాడి వేషంలొ వస్తే మిమ్మల్ని నమ్ముకున్న రాక్షసులందర్నీ నట్టేట ముంచేరు మీరు. ఎవరికి తెలియదీ రహస్యం?”

“అడగడానికి వచ్చినవాడు ఎవరనుకుంటున్నావ్?” ఈ సారి బలి మొహంలో కొంచెం కోపం కనిపించింది.

“….”

“సాక్షాత్తూ మహా విష్ణువు చేయి సాచి అడితే లేదనగలనా? అదీగాక ఆయన అడిగింది మూడడుగులు మాత్రం.”

“అయినా తప్పు ఇచ్చిన మీది కాదు, ఇస్తున్నప్పుడు వద్దని చెప్పడానికి ఎవరూ లేకపోబట్టే కదా?”

“అదేం మాట రావణా, శుక్రాచార్యులు చెప్పనే చెప్పారు ముందు ఇవ్వొద్దనీ, అబద్ధం ఆడినా తప్పులేదనీ –

వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణవిత్త మానభంగమందు
జకిల గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము నొంద డధిప”

“మరి?”

“నేను బలి చక్రవర్తిని రావణా, ఏది ఎమైనా సరే, తప్పక ఇచ్చి తీరుతాను అని చెప్పాను.

నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలంబైన దు
ర్మరణంబైన, గులాంతంబైన రానిమ్ము; కానిమ్ముపో
హరుడైనన్ హరియైనన్ నీరజభవుడభ్యాగతుండైన నౌ
దిరుగన్నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య వేయేటికిన్?

“మూడడుగుల నేల కాక ఇంకేమైనా ఇవ్వలేకపోయేరా?”

“కేవలం మూడడుగులే అడిగినందుకు నేను చాలా నిరుత్సాహ పడ్డాను ముందు. నేనొక పక్క ఒక ఖంఢం దానమిద్దామని ఉవ్విళ్ళూరుతుండగా మూడడుగుల నేల ఏమిటని నవ్వొచ్చింది కూడా, అందుచేత మళ్ళీ కోరుకో –

వరచేలంబులో, మాడలో, ఫలములో వన్యంబులో, గోవులో
హరులో, రత్నములో, రధంబులో, విమృష్టాన్నంబులో కన్యలో
కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంబులో, భూములో
ధరణీ ఖంఢమో కాక యేమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా

అన్నప్పుడు కూడా, మూడడుగుల నేల చాలు అన్నాడు.”

“కులగురువు వారిస్తున్నా ఎందుకిచ్చారు దానం?”

ఈ సారి మళ్ళీ చిరునవ్వు నవ్వేడు బలి చక్రవర్తి, “రావణా, నేను ఎవర్నో నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. నేను నూరు అశ్వమేధా యాగాలు చేసిన బలి చక్రవర్తిని. నువ్వు ఒక్కసారి మాత్రం స్వర్గం మీదికి దండెత్తావు కాబోలు. నేను లెక్కలేనన్ని సార్లు ఓడించాను ఇంద్రాదుల్ని. అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇస్తానని వాగ్దానం చేసేను. నూరు అశ్వమేధాలు చేసిన నన్ను, భూప్రపంచాన్ని అప్రతిహతంగా ఏలిన నన్ను, ఇస్తానని చెప్పి ఇవ్వలేను అని అబద్ధం ఆడమని కులగురువు చెప్తే వినమంటావా? అర్ధం లేని మాట. కుల గురువు గొప్పవాడై ఉండొచ్చు గాక, నా చేత యజ్ఞాలన్నీ చేయించి ఉండొచ్చు గాక. ఆయన చెప్తే మాత్రం వినడానికి నేనెవర్ననుకుంటున్నావు? నూరు అశ్వమేధాల్ని చేసి కలలో కూడా మాట తప్పని బలి చక్రవర్తిని. ఇప్పుడు అర్ధం అయిందా?”

బలి గళంలో ఈ సారి సింహ గర్జన వినిపించింది రావణుడికి. బలి మొహంలో కనబడిన దర్పం, బ్రహ్మ వర్చస్సూ రావణుడికి భయం కలిగించేయి. అంతటి నీతిమంతుడైన బలి కూడా తన రాక్షస వంశంలోనే పుట్టినందుకూ మాట తప్పనందుకూ రావణుడి లోపల కొంత గర్వించేడు.

“ఇచ్చేటప్పుడు మీ బద్ధ శత్రువు కాళ్ళు కడగలేదు కదా?”

“అభ్యాగతి ఎవరైనా ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగి నీరు నెత్తిమీద జల్లుకోవల్సిందే. అయినా నేను కడిగిన పాదం ఎటువంటిది?

బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళన వ్యాప్తికిన్
జలజాతాక్షుఁడు చాఁచె యోగి సుమన స్సంప్రార్థిత శ్రీదముం
గలితానమ్ర రమా లలాటపదవీ కస్తూరికా శాదమున్
నళినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్”

“ఏదో చిన్న కుర్రాడు అడిగితే ఇచ్చేయడమే? వెనకా మూందూ చూసుకోవద్దూ?”

“నీ కన్నా ముందు ప్రహస్థుడు సుతలం లోపలకి రావడానికి ప్రయత్నిస్తే ఏమైయింది?”

“ఎవరో గుమ్మం దగ్గిర చాలా మనోహరంగా నవ్వుతున్నాడు అని చెప్పి మూర్ఛపోయేడు, పిరికిపంద.”

“వామన రూపం కూడా అలానే ఉంది. ఆయన యజ్ఞ వాటికలో అడుగుపెట్టేసరికి మాలో ఎవరికీ మతుల్లేవు.

శంభుఁడో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁడీ మనోఙ్ఞ తనుఁడంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.

ఆ బ్రహ్మ వర్చస్సు చూసి, అగ్నియో సూర్యుడో వచ్చారనుకున్నాము. ఆ మొహం చూస్తే ఏది అడిగినా ఇవ్వొచ్చు. లేదనీ, ఇవ్వననీ చెప్పడం, అసంభవం. అదీ గాక ఇవ్వననడం నాకు చేత కాదు. ఆ తర్వాత తెల్సింది ఏమిటంటే, నా గురించి విష్ణువు ఆ అవతారంలో రావాల్సి వచ్చింది అని.”

“ఇచ్చాక ఏమి చేశాడు? న్యాయంగా చిన్న పిల్లాడి మూడడుగుల నేల కొలవాలని మీరు చెప్పలేదా?”

“రాక్షస మాయల్తో మనం ఎన్ని రకాల రూపాలు ధరించి యుద్ధాలు చేస్తాం? మనం అలాగ చేసినప్పుడు ఆయన కూడా మాయా రూపం విడిచి త్రిలోకాలూ ఆక్రమిస్తే మనం ఏమి చేయకూడదు కద? అప్పుడు ఆయన విజృంభణ ఎలా ఉందనుకున్నావు?” బలి వెనకటి రూపం గుర్తు తెచ్చుకుంటూ అడిగేడు ఒళ్ళు గగుర్పాటు చెందుతూండగా.

“మీరే చెప్పండి. చూశారుగా?” వెక్కిరింపుగా అన్నాడు రావణుడు.

“అయితే సావధానంగా విను రావణా –

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబులును, సముద్రంబులునుఁ, జలదచల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్రములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబులును, జానువులఁ బతత్రిసముదయంబులును, నూరువుల నింద్రసేనమరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబుననుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును,హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురందరాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటంబునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామంబును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణంబుల యఙ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికావిరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ, విజృంభించాడు.

నేను చెప్పినది సరిగ్గా విన్నావా రావణా? ధర్మం, అధర్మం కూడా ఆయనే. జీవితమూ ఆయనే మృత్యువూ ఆయనే. శాంతమూ ఆయనే కోపమూ ఆయనే. ఆయనే సర్వేశ్వరుడు. ఆయన ముందు నేనేపాటి వాడిని? ఒక్క పరమాణువులో సహస్రాంశం కూడా కాదు.”

“ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చాక కానీ ఎప్పుడైనా ‘అయ్యో ఇచ్చేసి నేను రాక్షస వంశానికి చేటు తెచ్చానే’ అని ఎప్పుడైనా అనుకున్నారా?” అడిగేడు రావణుడు.

ఫక్కున నవ్వేడు బలి మహారాజు, “నేను ఇచ్చినది మహా విష్ణువుకి, అదైనా ఎప్పుడిచ్చాను? నాతో యుద్ధానికి సరితూగలేడని ఆయనే తెల్సుకొని నన్ను, ముల్లోకాలనీ రక్షించే హస్తం సాచి దేహీ అని అడిగినప్పుడు. నా ముందు చాచిన ఆ హస్తం ఎటువంటిది?

అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తము
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకుచోపాస్తమున్
విమలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్

ఇచ్చినప్పుడు గానీ తర్వాత గానీ ఎన్నడు కలలో కూడా చింతించలేదు. మా వంశంలో ఒక్కడు కూడా నన్ను ఎందుకిచ్చావు అని అడగలేదు. ఇప్పుడు నువ్వు అడిగావు కనక చెప్పవల్సి వచ్చింది. ఇచ్చేముందు నేను ఇలాగ అనుకున్నాను,

మేరువు దలక్రిందైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.

నేను సత్య పదవీ ప్రమాణ తత్పరుండుని, వితరణ కుతూహల సత్త్వరుండుని, విమల యశస్కుండుని, దృఢ మనస్కుండుని, నియతసత్యసంధుండుని, నర్థిజన కమలబంధుండుని అయ్యీ ఇచ్చాను మనస్సులోకి కల్మషం రానీయకుండా. ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఇచ్చానో ఇప్పుడు దానికి లక్ష రెట్లు సంతోషంగా ఉన్నాను కానీ ఎప్పుడు చింతించలేదు. ఇప్పుడు కూడా అంతే. మళ్ళీ విష్ణువు కాదు, హరుడైనా సరే నువ్వైనా సరే ఏది అడిగినా ఇచ్చి తీరుతాను. ఈ సుతలం కావాలంటే తీసుకో. మరొక్క మాట. నేను దానం ఇచ్చి రాక్షస వంశానికి చేటు తెచ్చానని నువ్వు అనుకుంటే పొరపాటే. నేను దానం ఇచ్చి రాక్షస వంశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేనని బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ, అష్టదిక్పాలకులూ ఆ నాడే అన్న మాట.

“నేను అడుక్కోడానికి రాలేదు బలీ, ఓపిక ఉంటే యుద్ధం చేయండి.”

“యుద్ధం సంగతి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు ఇక్కడో విశేషం చూపిస్తాను రా.” బలి చక్రవర్తి బయటకి దారి తీసేడు.

“అక్కడున్న సువర్ణాభరణం కనబడుతోంది కదా?” బలి అడిగేడు, “కాస్త దాన్ని తెచ్చిపెట్టు ఇలా ఇవతలకి.”

రావణుడు దర్పంగా వెళ్ళి ఎడమచేత్తో దాన్ని ఎత్తబోయేడు. కదల్లేదు. భృకుటి ముడి పడింది. చంద్రహాసం పక్కన పెట్టి రెండుచేతుల్తోనూ ప్రయత్నించేడు. ఒక్క అంగుళం కూడా కలదల్లేదు. రాక్షస మాయలు, రావణుడి బలం సుతలంలో పనికిరాలేదు.

బలి రావణుడి కేసి సూటిగా చెప్పేడు, “నువ్వు కదల్చలేకపోయిన ఆ ఆభరణం, మా ముత్తాత హిరణ్యకశిపుడి చెవి పోగు. ఆయన బలం ఎటువంటిదో నీకు తెల్సిఉండాలి ఈ పాటికి, ఇంతకు ముందు తెలియక పోయినా. అటువంటి బలం ఉన్న మా తాతని మహా విష్ణువు నరసింహావతారంలో నాగుపాము ఎలకని పట్టినట్టూ పట్టి ఈడ్చుకుంటూ గుమ్మం మీదకి లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుని, ఏ ఆయుధాలు వాడకుండా వఠ్ఠి చేతుల్తో, భీకరంగా పేగులు చీల్చి చెండాడేడు. నువ్వు, మా ముత్తాత చెవిపోగు ఎత్తలేని నువ్వు, మహా విష్ణువునీ, ఆయనకి ముల్లోకాలూ దానంచేసిన నన్నూ యుద్ధంలో గెలవగలను అనుకుంటూంటే నవ్వు వస్తోంది రావణా!”

“ఆ మాత్రం మాయలు నేనూ చేయగలను. ఈ ప్రగల్భాలు ఎందుక్కానీ బలి మహారాజా, యుద్ధం చేయండి నా బాహుబలం చూపిస్తాను, సాక్షాత్తూ మహేశ్వరుడిచ్చిన ఈ చంద్రహాసం తో.”

“ఇక్కడకి యుద్ధానికి వచ్చే ముందు నీ మంత్రుల్ని అడిగావా? ఎవరూ వెళ్ళొద్దు అనలేదా?”

“విభీషణుడు చెప్పేడు ద్వారం దగ్గిర విష్ణువు ఉంటాడనీ, వెళ్ళవద్దనీ. అయితే ఇంకేం మీ ఇద్దర్నీ ఒకేసారి జయించ వచ్చని బయల్దేరి వచ్చాను.”

“సరే అయితే ద్వార పాలకుడి దగ్గిరకి వెళ్ళు ముందు.” రావణుడు వెళ్తోంటే బలి వెనకనుంచి చెప్పేడు మళ్ళీ, “లంకకు వెళ్ళాక విభీషణుడితో మాట్లాడటం మర్చిపోకు రావణా!”

రావణుడు భీకరంగా అరుస్తూ ఖడ్గం మీద చేయి వేసి ద్వారం వైపు కదిలేడు. లిప్త కాలంలో ఒక మనోహరమైన మొహం కనిపించింది. వెంటనే తన వీపు మీద ఎవరో బలంగా తన్నడం తెల్సింది. ఉత్తర క్షణంలో బలం అంతా కూలబడి, లంకలో తన కోటలో ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి ఒళ్ళంతా నొప్పి తెలుస్తోంది, మండోదరీ పరిచారికలూ ఆత్రంగా చూస్తున్నారు. మెల్లిగా అన్నీ గుర్తుకొచ్చాయి. కళ్ళు మూసుకున్నాడు.

సుతలంలో బలి చక్రవర్తి ద్వారపాలకుడైన శ్రీమహావిష్ణువు మొహంలో అనేక మాయా విశేషాలకీ కారణమైన మనోహరమైన చిరునవ్వు చెక్కుచెదరకుండా అలానే ఉంది.

కొన్నిరోజులు గడిచాక బలి మహారాజు విభీషణుడితో మాట్లాడమని చెప్పడం గుర్తొచ్చి, విభీషణుడి మందిరానికి బయల్దేరేడు రావణుడు.

జరిగినదంతా విని విభీషణుడు అన్నాడు, “అన్నా నువ్వు నాకు పితృ సమానుడివి. నీ క్షేమం కోరి ముందే వెళ్ళవద్దని నేను చెప్పాను. ఇప్పుడు నీకు కోపం రాదని అంటే గానీ నేనేమీ చెప్పను.”

“చెప్పు విభీషణా, ఇంత అవమానం జరిగాక కోపం దేనికీ? నేను సుతలం జయించడం అసంభవం అని తెలిసిపోయింది కదా? అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద తప్పు. అయితే బలి మహారాజంతటి వాణ్ణి చూసినందుకు ఆనందమే అనుకో”

విభీషణుడు చెప్పడం మొదలుపెట్టేడు, “ఈ విశ్వం అంతా సత్వ రజస్తమో గుణాలతో కూడి ఉంది. ఏయే గుణాలు మనకి సంప్రాప్తమౌతాయో అనేది మనం చేసుకున్నటువంటి కర్మలని బట్టి ఉంటుంది. అందుచేత ఎప్పుడూ మంచి కర్మలే చేస్తూ ఉండాలని విజ్ఞులు చెబుతూ ఉంటారు. అయితే ఈ మూడు గుణాలూ కూడా బంధాలు కలిగించేవే. సర్వేశ్వరుడు ఈ గుణాలకి అతీతుడు. మనం ఈ రాక్షస వంశంలో జన్మించడానికి కారణం మనం చేసుకున్న పూర్వ కర్మలే కానీ మరొక్కటి కాదు. హరుడైనా, హరియైనా మనమీద దాడికి దిగారూ అంటే దానర్ధం మనం ఈ గుణాల్లో ఏదో ఒకదానిలో పడి వాళ్ళని ధిక్కరిస్తున్నాం. అప్పుడు వాళ్ళు భక్త జన రక్షకులు కనక మనల్ని అణిచివేయడం జరుగుతూ ఉంటుంది. బలి చక్రవర్తినే తీసుకో. నూరు అశ్వమేధాలు చేశాడాయన. అప్పటికి ఆయనకున్న త్రిగుణాలన్నీ చేసిన మంచి కర్మలవల్ల భస్మీ పటలం అయిపోయి ఉండాలి. అటువంటప్పుడు విష్ణువొచ్చినా, నువ్వు అడిగినా సంతోషంగా ముల్లోకాలూ ధారపోసి ఉండేవాడు. అదే చేశాడు కూడాను. అయితే ఇక్కడో విషయం గమనించాలి. నూరు అశ్వమేధాలు చేసిన పుణ్యం మనలాంటి వాళ్ళ దగ్గిర ధారపోయకుండా, ఆయన దానవోద్రేకానికి అడ్డుకట్ట వేస్తూ అదే సమయంలో ఆయన చేసుకున్న పుణ్య ఫలం ఎక్కడకీ పోకుండా చూడడానికి, అంటే భక్త పాలన కళారంభానికి, ఎన్ని కష్టాలు పడైనా సరే మానవ జన్మ ఎత్తి – యుద్ధం చేసి ఎలాగా గెలవలేడు కనక – చేయి సాచి దేహీ అని అడిగాడు. అప్పుడు కూడా ఆయన బలి మనసులోకి చూసి ‘ఈ బలి సరిగ్గా ఇస్తున్నాడా లేదా’ అనుకున్నాడు తప్పితే ముల్లోకాలూ నేను తీసుకుని ఏమి చేసుకుందాం అని ఆలోచించలేదు. రాబోయే మన్వంతరంలో ఇంద్రుడు కావాల్సిన బలి ఇప్పుడే ఇంద్రుడు అవుతానంటే ఎలా కుదురుతుంది? కర్మ పరిపక్వం కావాలి కదా? అందుచేత అప్పటిదాకా సుతలంలో ఉండమని చెప్పేడు. ఇప్పుడర్ధం అయిందా భక్తుల కోసం ఆయనెన్ని కష్టాలు పడతాడో?”

“మరి ఆయన గుమ్మం దగ్గిర కాపలా కాయడం దేనికీ?” రావణుడడిగేడు.

“బలి చేయి తిరిగిన దాత. విష్ణువుకే కాదు నీకైనా సరే ఏది కావాలిస్తే అది ముందూ వెనకా చూసుకోకుండా సంతోషంగా ఇచ్చేయగలడు. ఆయన్ని ముందు మన్వంతరంలో ఇంద్రుణ్ణి చేయాలి. దానికి తగిన పుణ్యం బలి మహారాజు ఎప్పుడో సంపాదించుకున్నాడు. అడగ్గానే సర్వం ఇచ్చేసి కట్టుగుడ్డల్తో మిగిలిన మహారాజుని ఎవరు వదిలిపెడతారు? అందులోనూ, ఆలు బిడ్డల్నీ, సంపదల్నీ అన్నీ విడిచి సర్వేశ్వరుణ్ణి శరణువేడితే ఆయన ఎప్పుడూ వదలడు. అందుకే సర్వవేళలా ఆయన్ని కాపాడుతూ ఉండడం కోసం అక్కడే ద్వారపాలకుడుగా బలిని రక్షిస్తూ ఉంటాడు ఆయన. శ్రీ కైవల్య పదంలో ఉండే హరి లోకరక్షైకా రంభకుడూ, భక్త పాలన కళాసంరంభకుడూ, దానవోద్రేక స్తంభకుడూను. ఆయన హిరణ్యకశిపుడ్ని చంపినా, బలిని పాతాళంలోకి నొక్కేసినా అది వారి వారి కర్మల వల్లే జరిగింది కానీ, దానికి విష్ణువు కారకుడు కాదు.”

“ఏమిటీ? హరి లోకరక్షైకా రంభకుడా? హిరణ్యకశిపుడ్ని చంపడానికి అంత వికృతంగా, భయంకరంగా అవతరించాడని చెబుతారే మరి?”

“ఒక్కసారి ఆలోచించు అన్నా. హిరణ్యకశిపుడు బ్రహ్మని ఏమి కోరేడు వరం?”

“ఇంట్లోగాని, బయటగాని, పగలు గానీ రాత్రిగానీ, జీవం ఉన్నచేతగానీ, లేనిచేతగానీ, ఆకాశంలోగానీ భూమ్మీదగానీ, మనిషిచేతగానీ, మృగంచేతగానీ.. అని ఇలాంటివన్నీ కలిపి చావురాకుండా కోరుకున్నాడు కదా?”

“అవును, అయితే పుట్టిన ప్రతీ ప్రాణి గిట్టక తప్పదు అని ఒప్పుకుంటావా? అటువంటప్పుడు ఇలాంటి వరం కోరుకోవడం అంటే తన చావు ఎలా కావాలో తనే కోరుకున్నట్లే కదా? అలాగే శ్రీహరి హిరణ్యకశిపుడు కోరుకున్నట్టుగానే చంపేడు. అంటే, బ్రహ్మ ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడు ఏ చావు అయితే వద్దనుకున్నాడో అదే చావుకి, ఏ విధంగా చావాలో తనే ముహుర్తం పెట్టుకున్నాడు కాడూ?”

వింటున్న రావణబ్రహ్మ శరీరం కొద్దిగా కంపించింది. “అంటే, నా వరం కూడా అంతేనా?” విభీషణుడు మాట్లాడలేదు.

“చెప్పు విభీషణా,” రెట్టించేడు రావణుడు.

విభీషణుడు అవునన్నట్టుగా తల పంకించి చెప్పేడు, “అవును అన్నా. నువ్వు ఏ మాత్రం లెక్క పెట్టకుండా వదిలేసిన మానవులనుంచే నీకు ఉపద్రవం రాబోతోంది. అది కూడా నువ్వు కోరుకున్న వరప్రభావమే కానీ ఇంకేదీ కాదు. అంతకన్నా నన్ను ఇంకేమీ అడగవద్దు.”

“సరే విభీషణా, భక్త పాలన కళాసంరంభకుడూ, దానవోద్రేక స్తంభకుడు అన్నావు కదా? మొదటే దానవోద్రేకం అణచవచ్చు కదా, భక్తుల్ని రక్షించే ముందు?”

“అన్నా, ఆ సర్వేశ్వరుడు ఎప్పుడు భక్తులని రక్షిద్దామా అని ఉవ్విళ్ళురుతూ ఉంటాడు. అంతే కానీ ఎప్పుడు ఎంతమందిని చంపుదామా అనికాదు. ముందు తన భక్తుల్ని రక్షించాక, ఇంకా మనలోని దానవత్వం మిగిలి ఉంటే దాన్ని అంతమొదించడానికి దానవుల్ని చంపుతాడు కానీ, ముందే అందర్నీ చంపేయడం కాదు ఆయన చేసేది. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని తేలిగ్గా చంపిన విష్ణువు బలిని చంపలేడా? బలి మహారాజు ముల్లోకాలు ఆ జగత్ప్రభువుకే దానమిచ్చి చేసుకున్న పుణ్యానికి విష్ణువు ఆయన్ని చంపుతాడా? అందుచేత ఆయన ముందే భక్త పాలన కళారంభకుడూ ఆ తర్వాతే దానవోద్రేక స్థంభకుడూనూ.”

“ఒక్క చివరి సందేహం. బలి చక్రవర్తి విష్ణువుకి దానం ఇచ్చేముందు విష్ణువు చేతిలో చావుకి భయపడలేదా?”

“ఎందుకూ భయం? వామనుడు యజ్ఞశాల లోకి వస్తూనే స్వస్తి వాచనం చెప్పాడుగా?

కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యి ట్లనియె.

స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపద వ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.

అది బలి మహారాజంతటివాడికి గుర్తుండదా?” విభీషణుడు చెప్పేడు.
-----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: