Thursday, October 27, 2016

కస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్


కస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్



సాహితీమిత్రులారా!



వెంకటగిరి సంస్థానంలో మోచర్ల వెంకనకవి 
అనేక సమస్యలను పూరించాడు.
వాటిలోని ఒక సమస్య ఇది.

ఇంకంగస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

పూరణ -
పంకేజానన నేటిరేయి వినుమీ పంతంబుతో రాహువే
శంకాతంకము లేక షోడశకళా సంపూర్ణు నేణాంకునిన్
బొంకం బార్చెదనంచు పల్కెను తగన్ బొంచుండి నే వింటిన్ నీ
వింకంగస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

ఓ సుందరీ! రాహువు పంతంతో ఈ రాత్రి చంద్రుని మీద దాడి చేస్తాడట.
నేను పొంచి విన్నాను. చంద్రునిలో మచ్చ ఉంది. నీ ముఖం చంద్రబింబం వంటిదైనా
మచ్చలేదు. నల్ల కస్తురి బొట్టు పెట్టుకుంటే వాడు నిన్ను చంద్రుడనుకోవచ్చు కాబట్టి
నీవు ఈ రోజు కస్తూరి బొట్టు పెట్టుకోవద్దు - అని చమత్కారంగా పూరించారు.

దీన్నే 1923లో సరస్వతి అనే పత్రికలో వేటూరి ప్రభాకరశాస్త్రివారు 
కస్తూరి బదులు కుంకుమ అని మార్చి సమస్యను ఇవ్వగా 
చాలా పూరణలు వచ్చాయట. 
వాటిలో మారేపల్లి  రామచంద్రశాస్త్రి వారి పూరణ ఉత్తమంగా ఉందని 
వేటూరివారు మెచ్చుకున్నారట ఆ పూరణ-

బింకంబుల్ పలుమారు పల్కె సభల పేరందు బల్ కోర్కెన్ ని
శ్శంకన్ తానటు చేయజాల కిటు దేశద్రోహియై ఖైదునన్
జంక నీ పతి పేరు మాపుకొనియెన్ చావన్న వే రున్నదే
ఇంకం గుంకుమ బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

ఓ తన్వీ! నీ భర్త పేరు పొందే కోరికతో బింకంగా సభల్లో మాట్లాడాడు.
సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళవలసి వచ్చినపుడు భయపడి 
ముందుకు రాలేదు. పేరు మాసిపోయింది. చావంటే వేరే 
ఇంకేమిటీ నీ భర్త చచ్చినవాడి కింద లెక్క కావున 
నీవు నొసట కుంకుమ పెట్టుకోవద్దు - అనే భావంతో పూరించాడు.

ఆనాటికి అది సరైన పూరణ.
ఆసక్తిగలవారు నేడు దీనికి నవ్యమైన పూరణ చేసి పంపగలరు.

No comments: