Monday, April 25, 2016

పద్యానుకరణ


పద్యానుకరణ


సాహితీమిత్రులారా!
ఒక పద్యాన్ని విన్నపుడు అలాంటిది అంతకుమునుపు రాసిన  లేదా
విన్న పద్యం గుర్తుకు రావడం సహజం అలా గుర్తుకు వచ్చేట్లు రాస్తే దాన్నే
అనుకరణ అనవచ్చు. అలాంటిది ఒకదాన్ని ఇక్కడ చూద్దాం -.

తల్లిదండ్రులఁబ్రోచు తనయుండు తనయుండు
        తగు రాజుచే పడ్డ ధరణి ధరణి
అభిమానవతియైన యంగన యంగన
        యక్కఱ కొదవిన యర్థ మర్థ
మొరుకాంతఁగోరని పురుషుండు పురుషుండు
        వేఁడని యాతని విద్య విద్య
సంగరాంగణమునఁజచ్చుట చచ్చు టు
       పవసించి సల్పెడు వ్రతము వ్రతము
ఎదురు తన్నెఱిఁగిన యట్టి యెఱుక యెఱుక
ప్రజలు మెచ్చఁగఁజెప్పెడి పాటి పాటి
పగయె లేకుండ బ్రతికిన బ్రతుకు బ్రతుకు
మనుజ మందార సింగన మంత్రి మాచ

ఈ పద్యం వింటూనే చటుక్కున గుర్తుకు వచ్చే పద్యం
పోతన భాగవతంలోని ఈ పద్యం చూడండి.

కమలాక్షు నర్చించు కరములు కరములు
       శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు
        శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
         మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు పలగొను పదములు పదములు
        పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి

ఈ పద్యాలలో లాటానుప్రాస గమనింపగలరు
ఆవృత్తమైన రెండుపదాలు అర్థభేదంలేకుండా
తాత్పర్యభేదం వుంటే దాన్నిలాటానుప్రాసం అంటారు.

       

No comments: