Tuesday, April 5, 2016

పరిహారికా ప్రహేళిక

పరిహారికా ప్రహేళిక


సాహితీమిత్రులారా!
ప్రహేళికలలో అనేక రకాలున్నాయి వాటిలో "పరిహారికా" అనేది ఒక రకం ప్రహేళిక.
"యౌగిక శబ్దాల పరంపర ఉన్నదే పరీహారికా ప్రహేళిక" అని మహాకవి దండి నిర్వచనం.
పరిహారికా ప్రహేళికకు ఉదాహరణ ఈక్రింది పద్యం

సురవర గురునకు సతి సుతు
వర జనకుని తండ్రి కూతు వరసుతు మామన్
శిరమందుగొన్న మరసుతు
నిరతము సేవింతు నియమ నిష్కలుషమతిన్

సురవరగురు - బృహస్పతి, సతి - భార్య అయిన తార, సుతు- కుమారుడైన బుధుని, వరజనకుని - తండ్రి అయిన చంద్రుని, తండ్రి- సముద్రుని, కూతురు - పుత్రిక అయిన లక్ష్మీదేవి, వరసుతు - మన్మథుని, మామన్ - చంద్రుని, శిరమందు గొన్న వర - తలనుదాల్చు శివుని, సుతు - వినాయకుని, నిరతము సేవింతు నియమ నిశ్కలుమతిన్ - ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

భావం :-
బృహస్పతి భార్య అయిన తార, తార కుమారుడైన బుధుని, బుధుని తండ్రి అయిన చంద్రుని,  చంద్రుని తండ్రి సముద్రుని, సముద్రుని పుత్రిక అయిన లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కుమారుడైన మన్మథుని,మన్మథుని మామ అయిన చంద్రుని, చంద్రుని తలనుదాల్చు శివుని, శివుని కుమారుడైన వినాయకుని ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

దీనిలో చివరగా తేలిన జవాబు శివుని కుమారుడైన వినాయకుని ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

No comments: