Saturday, April 16, 2016

వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


సాహితీమిత్రులారా!
వెంకటగిరి సంస్థానంలో మోచర్ల వెంకనకు ఇచ్చిన దుష్కరప్రాస సమస్య. దీన్ని వెంకనగారు క్రమాలంకాంలో ప్రహేళికా పద్ధతిలో పూరించాడు.

ఈక్త్రా ప్రాసము కష్టమౌ ననుచు మీరెంతేసి వాదాడగా
వాక్త్రా సంబది సత్కవీశ్వరుల త్రోవల్ గామి నే చెప్పెదన్
దిక్త్రారాతికి పార్వతీశ్వరులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్

ఈ కవి పూరణ ఎంత చిత్రమో. మొదటి రెండు పాదాలు ప్రాసను గురించి విమర్శించటంతో సరిచేశాడు. మూడవ పాదం పూరణకు క్రమాలంకారంతో ప్రహేళికగా మార్చాడు.
దిక్త్రారాతి = దిక్పాలకులకు శత్రువు = రావణాసురుడు, అతనికి పది నోళ్ళు అందుకో అతనికి దశాస్యుడని పేరు. పార్వతి ఈశ్వరులకు కలిపి కన్నులు  2  + 3 = 5, 
తిగ్మప్రభారాశి అంటే సూర్యుడు ఇతనికి సహస్రకిరణుడు అని పేరు.
అంటే వేయి చేతులు గలవాడు.
మూడవ పాదంలోని వాటికి నాల్గవ పాదంలోని వాటిని కలుపుతూ వెళితే 
ఈ విధంగా ............
రావణాసురునికి(దిక్త్రారాతికి) నోళ్ళు(వక్రంబులు) - 10
పార్వతీ పరమేశ్వరులకు కలిపి కన్నులు - 5
సూర్యునికి (తిగ్మ ప్రభారాశికి) కరములు(చేతులు) - 1000


No comments: