Saturday, April 23, 2016

నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


సాహితీమిత్రులారా!
ఈ పద్యంలోని గూఢార్థం ఏమిటో గమనించండి.

నక్షత్రము పేరిటి సతి
నక్షత్ర సుఖంబుఁగోరి నక్షత్రేశున్
నక్శత్రమునకు రమ్మని
నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


దీనికి 1947 అక్టోబరు నెల భారతిలో శ్రీ గొబ్బూరు వేంకటానందరావుగారు చేసిన వ్యాఖ్య ఇది.
నక్షత్రము పేరుగల సతి - ఉత్తర
నక్షత్రము చేతబట్టి - కుంకుమబరిణిని(భరణి నక్షత్రం) చేతపట్టి,
నక్షత్రమపైన వేసినది అనగా చేతిని(హస్త నక్షత్రం) తన ప్రాణనాథుడైన అభిమన్యునిపై వేసి,
నక్షత్రమును రమ్మని - మూల(నక్షత్రం)కు రమ్మని, పిలిచినది.

అంటే యుద్ధసన్నద్ధుడవుతూ ఉన్న అభిమన్యుని ఉత్తర మూలకు రమ్మని పిలిచినదని భావం 

దీన్నే 1948 మార్చినెల భారతి సంచికలో తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

దీనిలో కవి తారాశశాంకుల తొలినాటి ప్రణయలీలను హృద్యాతి హృద్యంగా అభివర్ణించారు.
నక్షత్రము - తార
నక్షత్రసుఖము - ఆశ్లేషము (కౌగిలింత) సుఖం,కోరి
నక్షత్రేశున్ - చంద్రుని,
నక్షత్రమునకు రమ్మని - మూలకు రమ్మని,
నక్షత్రముఁబట్టి యీడ్చినది - (హస్త నక్షత్రం) చేయి పట్టి లాగినది.

ఈ విధంగా సాగింది ఈ వ్యాఖ్య. చూశారా గూఢఅర్థం ఎంత గూఢంగా ఉందో.


కవి కప్పి చెబితే విమర్శకుడు విప్పి చెబుతాడట.

No comments: