Sunday, December 13, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం - 3

 కపిలవాయి వారి శబ్దచిత్రం - 3





సాహితీమిత్రులారా!






కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకం నుండి

ఈ పద్యం గమనించండి -


ఆశా దీర్ఘము హ్రస్వము

భాసిల్లును దృష్టియెట్లు బరగెడునుసుమీ

దోషములు లేక నుండగ 

వేషంబుల లోకమిద్ది వినుమా యార్యా!


సంస్కృతంలో ఆశ(కోరిక) దీర్ఘాంతము

దీర్ఘం - గొప్పది, పొడవైనది

దృష్టి - చూపు ఇది హ్రస్వం పదం

హ్రస్వం - పొట్టిది, చిన్నది.


సంస్కృతంలో ఆశాశబ్దం దీర్ఘాంతం, దృష్టిశబ్దం హ్రస్వాంతం.

ఈ శబ్దాలకు తగినట్లు బ్రహ్మదేవుడు మనిషికి ఆశను దీర్ఘంగాను

దృష్టిని చాల చిన్నగాను చేశాడు. ఇదొక విచిత్రమైత పరిస్థితి కాబట్టి

ఈ స్థితిలో లోకంలో ఆశాపరుడు దోషరహితుడుగా ఉండటం కష్టం.

 అందుచేత మనిషి ఆశకుపోక ఒకకొడికి నిలిచి త్యాగబుద్ధి కలిగి ఉండాలి

- అని భావం

Friday, December 11, 2020

పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు వేల్పు

 పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు వేల్పు





సాహితీమిత్రులారా!

గూఢచిత్ర పద్యం గమనించండి-

పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు

వేల్పుటిల్లాలు సైదోమగ విడిదిఁగన్న

మీన్నపావడ గలకన్నె మిన్నఁగన్న

కన్న దొరసామి సిరిమిమ్ముఁ గాచుగాత!


పాము, వెన్నెల, బూది, ఆపగ(నది) లను

ధరించు దేవుడు ఈశ్వరుడు, ఆయన భార్య పార్వతి,

ఆమె తమ్ముడు మైనాకుడు, అతడు విడిదిగా తీసుకున్నది

సముద్రం, ఆసముద్రం పావడాగా ఉన్న కన్నె భూదేవి,

భూదేవి కన్న కుమార్తె సీతాదేవి, ఆమె భర్త శ్రీరామచంద్రుడు.

ఆయన మీకు ఐశ్వర్యములను ఇచ్చి రక్షించుగాక!

Wednesday, December 9, 2020

కాకానన భూభూ మమకాకార రమా మా

 కాకానన భూభూ మమకాకార రమా మా




సాహితీమిత్రులారా!

సజాతీయమైన ఒక వర్ణమునకు ఆ వృత్తి

కలిగిన యమకములో ఒక రకమని దానికి

సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు

లక్ష్మీసహస్రములోని ఈ ఉదాహరణ గమనించండి-


మదనార్తావృత్తము-

కాకానన భూభూ మమకాకార రమా మా

కా కావవ రా రామమఘాఘాతతపాపా

కాకానననానాకక కా కాక కమా మా

కా కాగగ వే వేరఱ గాఁ గానన జేజే


అర్థం -

కాకాసురుని బ్రతికించినదానా

భూమినుండి పుట్టినదానా(సీతా రూపమున)

నా దుఃఖములను పూర్తిగా ఖండించుదానా

లక్ష్మీ తల్లీ

విష్ణుపత్నీ రక్షింపవా

రాముని గూర్చిచేయుయజ్ఞములందు పాపములను

విరివిగా(యజ్ఞవిధ్వంసకులను) రక్షింపనిదానా

చెడ్డవైన అడవులందు అనేకములైన దుఃఖములు కలదానా

సీతారూపమున దుర్గమారణ్యముల కష్టములను అనుభవించినదానా

మా ప్రయత్నములకు ఆటంకములు రానీయకుము


మా యొక్క తాపము అడ్డగింపడునట్లుగా

శీఘ్రముగా భేదభావము నశించునట్లుగా

రమ్ము నమస్కారము


ఇందులో ప్రతి అక్షరము పునరుక్తమైనది కావున దీన్ని

సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు


Monday, December 7, 2020

తలదీయ క్షుద్రదేవత జనించు

 తలదీయ క్షుద్రదేవత జనించు




సాహితీమిత్రులారా!



చ్యుతచిత్రం చూడండి-


పక్షివర్యుండు పరగుఁబంచాక్షరముల

వాని తలదీల క్షుద్రదేవతజనించు

దాని తలదీయఁ దక్యెడ జానుమీఱు

దాని తలదీసి చూడఁగా దనరు నృపతి


ఈ పద్యంలో ఐదు అక్షరాలుగల పక్షిపేరు కనుక్కోవాలి

ఆ పక్షి పేరులోని మొదటి అక్షరం తీసివేయగా క్షుద్రదేవత అవుతుంది.

దాని మొదటి అక్షరం తీసివేయగా తక్కెడ వస్తుంది

దాని మొదటి అక్షరం తీసివేయగా నృపతి వస్తుంది

మరి ఆ పక్షిపేరేమో చెప్పండి -


సమాధానం - కపోతరాజు


                  కపోతరాజు(పావురం)

                   క  పోతరాజు

                    పోతరాజు(క్షుద్రదేవత)

                     పో  తరాజు

                       త రాజు(తక్కెడ)

                        రాజు

                          రాజు(నృపతి)





Saturday, December 5, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం -2

 కపిలవాయి వారి శబ్దచిత్రం -2




సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకంలోని శబ్దచిత్రం చూడండి-


జవరాలి యందునుంగల

వివరాలు వరాలురాలు విరసంబైనన్

తవులుసుమి రాలు చెలువుడు

మివుల రసికుడైన గాక వినుమా యార్యా!


దీనిలో జవరాలు అనే పదంనుండి జ తీసివేస్తే వరాలు,

వరాలు పదంనుండి వ తీసివేస్తే రాలు అవుతాయి.

అంటే జవరాలు లో వరాలు, రాలు రెండూ ఉన్నాయి.

ఆమె చెలువుడు అనుకూలుడైతే అతనికి వరాలు లభిస్తాయి.

అలా కాకుండా దుష్టుడాయెనా రాలు మాత్రం తగులక తప్పవు.


జవరాలు, వరాలు, రాలు -  మొదటి అక్షరం తీసివేస్తే 

ఒకదానినుండి మరొకటి వస్తున్నాయికదా అందువల్ల 

ఇది శబ్దచిత్రంలో ఒకభాగం అయిన చ్యుత చిత్రమౌతుంది.

Thursday, December 3, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం

 కపిలవాయి వారి శబ్దచిత్రం





సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకంలోని శబ్దచిత్రం చూడండి-


నిజముగ వాకొనగా న

క్కజముగ గలవాడె కలవాడు కాని యన్యుడున్

అజుడును నభవుండును కా

యజుడైనను లేని వాడే యనుమా యార్యా!

కలవాడు - ఉన్నవాడు, స్థతిమంతుడు.

వాకొనగా - చెప్పగా, వకారం తీసికొనగా.


కలవాడు అనే పదంలో -కారాన్ని తీసివేస్తే కలడు.

కలడు అనే సామాన్యార్థం మిగులుతుంది.

కాని వ్యతిరేకార్థంగాని మరొకటిగాని మిగలదు.

ఇది ఇందులోని చమత్కారం


ఇక లక్ష్మిలేనివారిలో అజుడు అభవుడు,

కాయజుడు అనే వారిని పరిశీలించిన

అజుడన్నా, అభవుడన్నా  పుట్టనివాడు

అనే అర్థం. పుట్టినాడు ప్రపంచంలో

ఎలాగూ ఉండనే ఉండరు.


శ్రీ శబ్దానికి లక్ష్మి అనేకాక సరస్వతి,

పార్వతి అనే అర్థాలు కూడా ఉన్నాయి.

కాబట్టి వారులేనపుడు అవాక్కై - బ్రహ్మ,

అర్థశరీరుడై శివుడు

ఉన్నా లేనివారే అవుతారు.


ఇక మన్మథుడో ఎపుడో సశరీరంగా ఉన్నా

శివుని కంటి మంటకు భస్మమై యిపుడెలాగూ

అనంగుడైనాడు.

కాబట్టి లక్ష్మీకటాక్షం లేనపుడు

ఇక్కడ ఉదాహరణగా చెప్పబడిన

బ్రహ్మవంటి సృష్టకర్త, శివునివంటి సర్వజ్ఞుడు,

మన్మథునివంటి రూపవంతుడు

కూడ లేనివారికిందికే లెక్క - అని పద్య తాత్పర్యం

Tuesday, December 1, 2020

పద్యమంతా గురువులే

పద్యమంతా గురువులే




సాహితీమిత్రులారా!

కవిత్వం వ్రాయడమే కష్టం అందులోనూ

సర్వ లఘువులుగాని

సర్వగురువులుగాని

వ్రాయడం కొంత కష్టంతో కూడినది.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని

సర్వగురు వచనాన్ని చూడండి-

ఇందులో అన్నీ గురువులే లఘువులులేవు అని

గ్రహించగలరు. చూడండి-


ఆవేశం దాశ్చర్యారూఢాత్మాం 

భోజాతోద్యత్కందర్పాటోపస్ఫాయన్నా

రాచస్తోమ శ్రేష్ఠోద్బోధాదీనాం 

చ ద్చోధానైపుణ్య ప్రౌఢి 

శ్రీ నారీరత్నం బిట్లూహించెన్   (447)

చూచారుకదా ఇందులో ఏవైనా

లఘువులున్నాయేమో గమనించండి.