Saturday, April 6, 2019

తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు


తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు




సాహితీమిత్రులారా!

ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో సంస్కృత సాహిత్యంలోను, తెలుగు సాహిత్యంలోను, అలంకారశాస్త్రంలోను, గాఢంగా పనిచేసిన భారతీయ పండితుడు ఎవరైనా ఒకరున్నారనుకోండి. ఆయన ఏదో కొంత ఇంగ్లీషు కూడా చదువుకుని వున్నాడనుకోండి. ఆయన చుట్టూ ఇంగ్లీషు చదువుకున్న కొత్త యువకులు ఇంగ్లీషు సాహిత్యాన్ని తెగ పొగుడుతున్నారనుకోండి. ఈ ఇంగ్లీషువాళ్ల సాహిత్యం యెలా వుంటుందో చూద్దామని ఆ పండితుడు వెళ్లి అప్పటి కాలేజీలలో ఇంగ్లీషు బోధించే ఒక తెల్లదొరని అడిగాడనుకోండి.’ఇదిగో మా సాహిత్యంలో షేక్స్‌పియర్ గొప్పవాడు, ఆ మాటకొస్తే మీ కాళిదాసు కన్నా గొప్పవాడు,’ అని షేక్స్‌పియర్ రాసిన హామ్లెట్ పుస్తకాన్ని ఆ తెల్లదొర ఆయనకిచ్చాడనుకోండి.

ఈ తెలుగు/సంస్కృత పండితుడు స్థూలంగా షేక్స్‌పియర్ రాసిన హామ్లెట్ చదివి కథ అర్థం చేసుకోగలడు. అప్పటికే కాళిదాసు నాటకాల మీద ఇంగ్లీషులో ప్రతిపదార్థాలు చెప్పి, అందులోని వ్యాకరణం ఇంగ్లీషులో బోధపరచి ఆ నాటకం మొత్తాన్ని తమకు వచ్చిన ఇంగ్లీషులో ముక్కస్యముక్క అనువాదం చేసి ప్రచురించిన వాళ్లు వుండేవారు. అందులో కొందరు కాళిదాసు నాటకాన్ని వ్యాఖ్యానిస్తూ షేక్స్‌పియర్‌తో పోలిస్తే కాళిదాసు గొప్ప నాటకకర్తేమీ కాదని చెప్పేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో ఇందాక మేము చెప్పిన పండితుడు షేక్స్‌పియర్ నాటకాన్ని చదివాడనుకోండి.

మీకు ఆ నాటకం ఎలా వుంది అని అడిగితే: ఇదేమి నాటకం? వస్తువు అసభ్యమైన వస్తువు. ఒక రాజు భార్య ఆ రాజు తమ్ముడి వ్యామోహంలో పడి అతనితో రహస్య సంసారం చేస్తూ వుంటుంది. ఆ తరువాత ఆ తమ్ముడు ఆవిడ సహాయంతో రాజుని చంపేస్తాడు. ఆ రాజు చచ్చిపోయిన తరువాత ఈ తమ్ముడు రాజ్యాధికారం తీసుకుని, చచ్చిపోయిన రాజు భార్యని పెళ్లి చేసుకుంటాడు. ఆ చచ్చిపోయిన రాజు కొడుకు ఈ సంగతి తెలుసుకుని అయినా ఏమీ చేయలేక అసమర్ధుడిగా తన్ను తాను చంపుకుంటాడు. ఇదా కథ! దీనికి కావ్యగౌరవం ఎలా వస్తుంది? ఇందులో రసం లేదు. అలంకారం లేదు. ఉపదేశం లేదు. ఏమీ లేదు. ఇదేదో అనాగరిక జాతి అజ్ఞానంలో పైకి తీసుకొచ్చిన పుస్తకంలా వుంది — అని అంటాడు. దానితో పాటు ఆ ఇంగ్లీషు స్పెల్లింగులు అస్తవ్యస్తంగా వుండటం, ఉచ్చారణకి రాతకి మధ్య ఏ రకమైన పోలిక లేకుండా ఒక చోట ఒక అక్షరానికి ఒక ధ్వని వుంటే అదే అక్షరానికి మరొక చోట మరొక ధ్వని వుండటం ఈ పండితునికి మరీ అనాగరికంగా కనిపించి అవన్నీ ఒక సాంప్రదాయకమైన దారిలో పెట్టుకోలేక పోవటం ఈ జాతి అజ్ఞానానికి మరొక లక్షణం అని నిర్ణయించుకుంటాడు.

ఈ కథ మేము పూర్తిగా కల్పించినది కాదు. ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగాయి. కాకపోతే ఇలాంటి అభిప్రాయాలు చెప్పిన గొంతుకలు పైకి రాలేదు. ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణగారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులో అప్పటి పండితులకి ఇంగ్లీషు గురించి వుండే అభిప్రాయాలు కొన్ని వున్నాయి చూడండి.

పాశ్చాత్య విధానాల్లో రచనలు చేసిన భారతీయుల గురించి కూడా భారతీయ సాహిత్య సంప్రదాయాల మీద విశ్వాసం వున్న మన పాత పండితులకి కూడా ఇలాంటి అభిప్రాయాలే వుండేవి. టాగోర్ గీతాంజలిని ఆదిపూడి సోమనాథరావుగారి (1913) అనువాదంలో చదివి దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, “మహాకవిగా చెప్పుకోదగ్గ సారస్యం యిందులో ఏమీ కనిపించదే,” [1]అని అన్నారట.

ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే రెండు సంస్కృతులకు చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య ఒకరి పట్ల ఒకరికి చక్కటి అవగాహన సాధారణంగా కలగదు. యాత్రికులుగా దూరదేశాలు తిరిగి వాళ్ళ అనుభవాలు రాసిన వాళ్ళ మాటలని చరిత్రకారులు తరుచూ తమ నిర్ణయాలకి ఆధారంగా తీసుకుంటారు. కానీ, అందులో ఉండే ఇబ్బందులు ప్రసిద్ధంగా తెలిసినవే. ఇది కాక, రెండు పెద్ద సంస్కృతులు స్నేహంగా ఒకదానినొకటి కౌగిలించుకునేలాగా ఎప్పుడూ కలవవు. ఒకదానిని యుద్ధంలో జయించటం మూలంగానో లేదా వలస రాజ్యంగా స్వాధీన పరచుకోవడం మూలంగానో కలుస్తాయి. అందుచేత గెలిచిన సంస్కృతికి అధికార ప్రాబల్యమూ, అహంకారమూ, ఓడిపోయిన సంస్కృతి పట్ల నిరాదరణ భావమూ, తృణీకార దృష్టీ వుంటాయి. గెలిచిన సంస్కృతికి పూర్తిగా తనకి పాదాక్రాంతమైన సంస్కృతి మీద కొంత ఆదరణ భావమూ ఒక్కొక్కప్పుడు కొంత మెచ్చుకోలూ కూడా వుండొచ్చు. కాని ఇది కేవలం అనుగ్రహ బుద్ధితో చేసే పని. భారతదేశం పాశ్చాత్య రాజ్యాలని జయించి వుంటే వాళ్ల సాహిత్యాన్ని మన పండితులు అలంకారశాస్త్ర దృష్టితో చూసి అందుకు ఆ సాహిత్యం నప్పకపోతే దాన్ని తిరస్కరించి, తరువాత దాన్ని కొంత అనుగ్రహ బుద్ధితో ‘సంస్కరించి’ వాళ్లకి తోచిన రీతిలో నిలబెట్టేవాళ్లు. కాని చరిత్ర దానికి అవకాశం యివ్వలేదు. కాని ఇంగ్లీషువాళ్లకి భారతీయ సాహిత్యాన్ని ఉద్ధరించడానికి చరిత్ర అవకాశం యిచ్చింది.

మనకి వలసవాద సంస్కృతి, ఆధునిక సంస్కృతి కలిసి జమిలిగా వచ్చాయి. ఈ రెండింటిలో ఏది ఏదో మనం విడదీసుకోలేకపోయాం. స్వాతంత్ర్య పోరాట సమయంలో మనం కావాలని కోరుకున్నది రాజకీయ స్వాతంత్ర్యమే. మనం ఇంగ్లీషువాళ్ల వల్లనే ఆధునికుల మయ్యామని, ఇంగ్లీషు లేకపోతే మనం పాతకాలపు మూఢ నమ్మకాలలో కూరుకుపోయి వుండే వాళ్లమని, మన సాంస్కృతిక నాయకులు నమ్మారు. ఈ నమ్మకానికి పొడిగింపే మనలో ఇంకా మిగిలిపోయిన బ్రౌన్ ఆరాధన. మనదైన ఒక సంస్కృతి ఉన్నదని, దాన్ని అనుసరించాలి కాని పాశ్చాత్య భావదాస్యంలో పడిపోకూడదని మాటలైతే మనకి తరచు వినిపించేవే కాని, ఆ మన సంస్కృతి ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించలేదు. పైగా, వలస పాలకులు అనుగ్రహ దృష్టితో మనకి నేర్పిన కొత్త సంస్కరణలలో ఏవి మనకి పనికి వచ్చేవో, ఏవి చాప కింద నీరులా మన ఆలోచనల్ని మార్చేస్తూంటే, అమాయకంగా ఆధునికత పేరుతో అవన్నీ మనకి అవసరమని మనం నమ్మి, వాటినీ, ఆ సంస్కరణలు తెచ్చిన వాళ్లనీ ఆరాధనాబుద్ధితో పూజిస్తున్నామో మనకి ఇప్పటికీ బోధపడడం లేదు. పైగా ఈ ‘మన సంస్కృతి’ అనే భావాన్ని రాజకీయం చేసి భారతదేశం లోని ప్రజలందరికీ హిందూ ధర్మం పేరుతో ఒక పెద్ద బండరాయి నెత్తికెక్కించడానికి పనిచేసే రాజకీయ పక్షాలు కూడా మనకున్నాయి. ఆ రకమైన రాజకీయ భావాలు వలసవాదం కన్న ప్రమాదకరమైనవి. ఇన్ని ఆలోచన సమస్యల మధ్య ఈ వ్యాసం రాయడంలో ఉన్న ఇబ్బందులూ, వాటితోపాటు మాకున్న సమాచార పరిమితులూ గుర్తుంచుకుని ఈ వ్యాసం రాస్తున్నాం.

మన గ్రంథ పరిష్కరణ విధానాలు ఎలా వుండాలో కొంత స్థూలంగానైనా చెప్దామని ఈ వ్యాసం మొదలు పెట్టాం. కాని ఆ పని అంత తేలికగా అయ్యేది కాదనీ, అంతకు ముందు చెయ్యవలసినది చాలా వుందని అనిపించింది. మన సాహిత్యంలో మనం అనుసరించవలసిన గ్రంథ పరిష్కరణ విధానాలు వేరే ఉన్నాయా, లేకపోతే పాశ్చాత్య విధానాలే అందరూ అనుసరించదగిన ఆధునిక విధానాలా? అన్న ప్రశ్న వేసుకోవడానికి ముందు మన గ్రంథ లేఖన పఠన పాఠన సంప్రదాయాలు ఎలా ఉండేవో ఆలోచించాలి.

పాతని పునరుద్ధరించాలని, గత రెండువందల సంవత్సరాలలో ఆధునిక నాగరికత పొందిన ప్రయోజనాలని తిరస్కరించాలని, మా అభిప్రాయం కాదు. పాత సాహిత్యాన్ని పాత పాఠకులు, శ్రోతలు ఉపయోగించుకున్న సందర్భాలని తిరిగి బోధపరచుకుని ఆ సాహిత్యం ఏ రకంగా వుండేదో గమనించి దాని మూలకంగా అప్పటి విధానాలని తెలుసుకోవడమే మా ఉద్దేశం. అట్లా బోధపరచుకున్న పద్ధతులు మళ్లా ఉన్నవి ఉన్నట్లుగా అమలులో పెట్టాలని మా ఉద్దేశం కాదు. ఇంకో మాటల్లో చెప్పాలంటే మాది ఉద్ధారక (revivalist) దృష్టి కాదు, అవగాహక దృష్టి మాత్రమే. మన సాహిత్యం ప్రవర్తిల్లిన పద్ధతులు మనకి అవగాహన అయిన తరవాత అవి మన పుస్తక పరిష్కరణ విధానాలు నిర్మించుకోడానికి అవి పనికొస్తాయని మా ఆలోచన.

ఇంతకు ముందు బ్రౌన్ గురించి మేము రాసిన వ్యాసంలో పుస్తక పరిష్కరణ విషయంలో ఆయన అనుసరింప జేసిన పద్ధతులు, తన దగ్గర పని చేసే పండితుల్ని, లేఖకుల్ని ఆయన వాడుకున్న తీరు, తెలుగు సాహిత్యానికి అపకారం చేసిందని, తెలుగు పండితుల సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బ తీసిందని చెప్పాం. పంధొమ్మిదవ శతాబ్దపు మొదటి కాలం నుంచి ఇరవయ్యవ శతాబ్దపు తొలి కాలం వరకు తెలుగు గ్రంథాల విషయంలో బ్రౌన్, సంస్కృతం లోని ధర్మశాస్త్ర గ్రంథాల విషయంలో కోల్బ్రూక్, పురాణాల విషయంలో హెచ్. హెచ్. విల్సన్, ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో మహాభారత గ్రంథ పరిష్కరణలో సుక్తాంకర్, ఇంకా తరువాత కాలంలో మన తెలుగు పండితులూ దాదాపుగా ఒకే రకమైన మార్గాన్ని అనుసరించారు. స్థూలంగా వీరందరి మార్గం పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలకి అనుకరణమే. ఈ విధానం వస్తుతః తప్పు అని మా ప్రతిపాదన.

పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలు
మూల గ్రంథం అనేది ఒకటి ఉందని, దానికొక కర్త ఉన్నాడని, ఆ కర్త ఆ గ్రంథాన్ని రాసిన చోటు, తేదీ పట్టుకుని ఆ మూల గ్రంథాన్ని పునర్నిర్మించవచ్చని ఒక ఆలోచన పాశ్చాత్య గ్రంథపరిష్కరణ పద్ధతులకన్నిటికీ మూలభూతమైన విషయం. ఈ విధానాలు మూడు రకాలు.

అనేకమైన ప్రతుల ఆధారంగా తయారు చేయబడిన మిశ్రమ ప్రతిని ఎక్లెక్టిక్ (eclectic) ప్రతి అని, ఈ పద్ధతిని ఎక్లెక్టిసిౙమ్ అనీ పిలుస్తారు. ఈ మిశ్రమ ప్రతి, దానికి మూలాధారమైన ఏ ఒక్క ప్రతినీ పోలివుండదు. ఈ విధానంలో ఏ ఒక్క ప్రతికీ మిగతా ప్రతులకన్నా ఎక్కువ ప్రాధాన్యత వుండదు. పరిష్కర్తలు తమకు నచ్చిన ప్రతిని ప్రధానంగా తీసుకుని మిగిలిన ప్రతుల్లో తమకు నచ్చిన పాఠాలని తాము ఎంచుకున్న ప్రతిలో చేరుస్తాడు. ఈ రకంగా ఒక మిశ్రమప్రతి తయారవుతుంది. పరిష్కర్త వ్యక్తిగత అభిప్రాయాలకు ఊతమిచ్చేదిగా మిశ్రమ ప్రతి ఉండడం ఈ పద్ధతిలో ముఖ్యమైన లోపం. ఈ ఎక్లెక్టిక్ విధానమే మనం తెలుగు పుస్తకాల పరిష్కరణ విషయంలో తరచూ వినియోగించినది.

స్టెమాటిక్ పద్ధతిలో మహాభారతం

ఇక, రెండవది వంశవృక్ష పద్ధతి. దీనిని స్టెమాటిక్స్ (stemmatics) లేదా (stemmology) అనీ అంటారు. ప్రతి ప్రతీ కేవలం వేరొక ప్రతి నుండే పుడుతుంది. ఒకవేళ ఏ ప్రతి అయినా రెండు, అంతకన్నా ఎక్కువ ప్రతుల కలయికగా అనిపిస్తే, ఆప్రతిని కలుషితప్రతిగా భావిస్తారు. ఏ రెండు ప్రతులలోనైనా ఒకేరకమైన తప్పులు ఎక్కువగా కనిపిస్తే ఆ రెండు ప్రతులూ ఒకే మూలప్రతినుంచి వచ్చినవిగా గ్రహిస్తారు. అదేవిధంగా, రెండు ప్రతులు విభిన్నంగా ఉన్నప్పుడు పరిష్కర్త తన అభిప్రాయం ప్రకారం ఏ ప్రతి సరైనదో నిర్ధారిస్తాడు. ఈ పక్కనున్న బొమ్మ[2] చూడండి. అందులో మహాభారతాన్ని దొరికిన ప్రతుల ఆధారంగా వేర్వేరు శాఖలుగా విభజించారు. ఈ పద్ధతిలో అట్టడుగునున్న ప్రతుల ఆధారంగా పైకి పైకి వెళ్ళి బహుశా మూల భారతాన్ని పట్టుకోగలమని ఈ పరిష్కర్తల ఆశయం. పూర్తిగా, వ్యాసుడు రాసిన మహాభారతమే వారికి దొరకకపోయినా, దానికి సమీపానికి వెళ్ళగలమని ఈ పరిష్కర్తల విశ్వాసం. ఈ పద్ధతి తెలుగు పుస్తకాల విషయంలో ఎప్పుడూ అనుసరించవలసిన అవసరం లేకపోయింది.

మూడవ పద్ధతి జీవశాస్త్రం నుంచి నేర్చుకున్నది. ఈ క్లాడిస్టిక్స్ (cladistics) పద్ధతిలో అన్ని ప్రతులనూ కంప్యూటర్ల సహాయంతో, వాటి వాటిలో గల సామ్యాల ఆధారంగా గుంపులుగా విడదీస్తారు. ఆ గుంపులను ఒకదానికొకటి సంబంధిగా చూస్తారు కానీ ఏ ప్రతులు మూల ప్రతికి దగ్గరిగా ఉన్నాయో నిర్ణయించరు. ఈ పద్ధతి తెలుగులో ఎవరూ అనుసరించలేదు.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే భారతీయ గ్రంథాల విషయంలో పరిష్కరణ విధానాలు తమ దృక్పథంతో అమలు పరిచిన పాశ్చాత్యులే ఆ విధానాలు సవరించవలసిన అవసరం వుందని గుర్తిస్తున్నారు[3].

పాశ్చాత్య విద్వాంసులు భారతీయ గ్రంథ పాఠపరిష్కరణ విషయంలోను గ్రంథ వ్యాఖ్యాన విషయంలోను ఒక పరిమితికి లోబడి పనిచేశారు. వాళ్లు కేవలం లిఖిత ప్రతులనే పరిశీలించారు. పాఠకులు ఈ లిఖిత ప్రతులలో వున్న గ్రంథాలని ఎలా చదువుతున్నారు, పాడుతున్నారు అన్న ప్రశ్న వాళ్లు వేసుకోలేదు. ముఖ్యంగా సంస్కృత గ్రంథాల మీద, తెలుగు గ్రంథాల మీద, పరిశోధన చేసినవాళ్లు అసలు వేసుకోలేదు. వీళ్లందరి దృష్టిలో లిఖిత గ్రంథమే పరమ ప్రామాణికమైన గ్రంథం.

తెలుగు అనుభవంలో ఈ విధానం తప్పు. తెలుగులో తాటాకుల మీద కానీ కాగితం మీద కానీ రాసిన గ్రంథాన్ని వెంటనే కట్ట విప్పి ఆకులు తెరిచి దబదబా ఎవ్వరూ చదివేవాళ్లు కాదు. పుస్తకం ఎలా చదవాలో ముందు గురువు దగ్గర నేర్చుకుని ఆ తరవాతే పుస్తకాన్ని తీసి చదివేవాళ్లు. అంటే ఇప్పుడు అచ్చులో వుండే కథనో, నవలనో, వచనపద్యాన్నో చదివినట్లుగా పుస్తకం కనిపించగానే తీసి చదవడానికి పూర్వగ్రంథాలేవీ అవకాశం ఇచ్చేవి కావు. గ్రంథ పఠనం ఒక విద్య. ఆ విద్య బాధ్యతగా నేర్చుకోవాలి. కొత్త పుస్తకం చదవడానికి మళ్లా కొత్తగా నేర్చుకోవాలి.

పుస్తకం చదవడం రానివాళ్లు ధైర్యం చేసి పుస్తకాన్ని విప్పి చదువుతూంటే వాళ్లకి పదం ఎక్కడ విరగాలో, పాదం ఎక్కడ ఆపాలో, ఎక్కడ సంధి విడదీయాలో, ఎక్కడ కలపాలో తెలియక పోవడం చేత రకరకాల తికమకలు పడేవాళ్లు. అలాంటి వాళ్లని వేళాకోళం చేసే కథలు తెలుగులో వుండేవి. రామునితోకపివరుండిట్లనియె అనే వాక్యాన్ని వాళ్లు కంగారు పడి రామునితోక అని చదివి, తరవాత ఏమి చేయాలో తెలియక తికమక పడేవాళ్లు అని ఈ కథలు చెప్తాయి. దీని పరమార్థం ఏమిటంటే పుస్తకం ఎలా చదవాలో ముందు తెలియకుండా తొందరపడి పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టవద్దు అని. తాటాకుల పుస్తకంలో ఎక్కడా విరామ చిహ్నాలు కానీ పదాల విరుపులు కానీ పద్యపాదాల విరుపులు కానీ గుర్తింపబడి వుండవు. తాటాకు ఎంత పొడవుంటే అంత పొడవూ పంక్తులు రాసుకుంటూ వెళ్లి తాటాకు ఎక్కడ అయిపోతే అక్కడ రెండవ తాటాకులోకి వెళ్లటం లేఖకుల అలవాటు. దీనితో పాటు లేఖన సంప్రదాయాలు కొన్ని వున్నాయి. అవి పుస్తకం పుస్తకానికి మారుతూ వుండేవి కూడా. ఇవి కాక లేఖక రీతులు కొన్ని ఉండేవి. అంటే ఒక ప్రత్యేక లేఖకుడు తానై స్వయంగా యేర్పరుచుకున్న కొన్ని సంకేతాలు. ఇవి తెలియడానికి పాఠకులకు శిక్షణ కావాలి.

పైగా తెలుగు పద్యంలో సంస్కృతంలో మల్లే చక్కగా ఏ పాదానికి ఆ పాదం చివరిలో విరిగిపోవడం, ప్రతిపాదం విశ్రమ స్థానం దగ్గర ఆగడం వుండదు. సంస్కృత శ్లోకం ఒకటి చదవటం అలవాటైతే రెండోది కూడా అలానే చదవచ్చు. పాదాంతాల దగ్గర విరుపు, విశ్రమస్థానం దగ్గర విరుపు సంస్కృత శ్లోకాలకి తప్పని సరి. (ఈ నియమం చాలా తరవాత కాలంలో అక్కడక్కడ కొద్దిగా అతిక్రమించబడినా మొత్తం మీద సంస్కృత సాహిత్యంలో ఇది పాటించబడింది.) ఈ స్థానాలను లేఖకులు పాదాంతాల దగ్గర ఒక నిలువు గీత తోను శ్లోకాంతాల దగ్గర రెండు నిలువు గీతల తోను సూచించేవారు. అందుచేత సంస్కృత శ్లోకం చదవటం కొంత తేలిక అయ్యేది. ఉదాహరణకి:

మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్|
ప్రాంశులభ్యే ఫలే లోభా దుద్బాహురివ వామనః|| (కాళిదాసు రఘువంశం, 1-3)

(తెలివితక్కువ వాణ్ణి, కవి అనే పేరు కావాలనే కోరిక కలవాణ్ణి, నన్ను చూసి లోకంలో అందరూ నవ్వుతారు. పొడుగైన వాళ్ళకు మాత్రమే అందే పళ్ళు అందుకోవాలని చేతులు పైకెత్తే పొట్టివాడిని చూసి నవ్వినట్టు).

ఈ శ్లోకం చక్కగా ఒంటి నిలువు గీత పెట్టిన చోట కొద్దిగా ఆగుతూ చివరికి శ్లోకాంతాన రెండు నిలువు గీతలు పెట్టిన చోట పుర్తిగా ఆగిపోతుంది. అసలు శ్లోకాలని ఎక్కడా ఆపకుండా చిట్టచివర వరకూ ఒకే గుక్కలో చదవాలని కూడా కొందరు గురువులు అనేవారు. కాని, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిలువుగీతలు ఉన్నచోట్ల పదం విరిగి తీరాలి. దీన్నే విశ్రమ స్థానం అంటారు. సంస్కృతంలొ యతి స్థానం లేదు, విశ్రమ స్థానమే ఉంది. తెలుగులో వున్నది, యతి స్థానం, అది విశ్రమ స్థానం కాదు.

తెలుగులో నన్నయ్య రాసిన మొదటి పద్యం నుంచి ఆధునికుడు విశ్వనాథ సత్యనారాయణ రాసిన పద్యాల వరకూ యతి స్థానం దగ్గర పాదాంతాన విరుపు ఉండి తీరదు. సంస్కృతపు మర్యాద వల్ల కాబోలు తెలుగు పద్యాల్లో యతి స్థానం దగ్గర ఒక మామిడి పిందె గుర్తు వెయ్యడం లేదా ఇంకొక గుర్తు పెట్టడం వావిళ్ల వారి దగ్గరనుంచి ప్రామాణిక గ్రంథ ప్రచురణకర్తలు అందరూ అలవాటుగా పెట్టుకున్నారు. కానీ, ఆ గుర్తుకి పద్యం చదవటం మీద ఏ రకమైన ప్రభావమూ ఉండదు. పైగా పాదాంతాన, యతి స్థానం దగ్గర విరక్కొట్టి పద్యాన్ని చదివితే స్కూలు పిల్లాడు చదివిన పద్యంలా వుంది అని పెద్దవాళ్లు వేళాకోళం చేస్తారు. పద్యం ఎత్తుగడ, విరుపు, స్వరం హెచ్చించడం, తగ్గించడం ఇవన్నీ తెలిసినవాళ్లే పద్యాన్ని బాగా చదవగలరు. అంటే తెలుగు పుస్తకాల పాఠకుడికి ప్రత్యేకమైన తర్ఫీదు గురువు ద్వారా కావాలన్న మాట. (పద్యాన్ని, నాటక ఫక్కీలో రాగయుక్తంగా, ఈలపాట రఘురామయ్య లాగో, ఘంటసాల లాగో పాడడం గురించి మేం మాట్లాడడం లేదు. అది వేరు.)

దీన్ని తన అనుభవంలో గ్రహించిన విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ్య భారతం లోంచి ఒక పద్యం ఉదాహరణగా చూపిస్తూ చెప్పారు. ఆ పద్యం అచ్చులో[4] యిలా కనిపిస్తుంది.

ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీనికిం దొడం
బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై
నిడియెద నంచు దాఁ జరణ మెత్తె సభన్ సహదేవుఁ డట్టిచో
నుడిగి సభాసదుల్ వలుక కుండిరి తద్దయు భీతచిత్తులై. — (సభాపర్వం, ద్వితీయాశ్వాసం, 2.2.30)

దీన్నే సత్యనారాయణగారు (చిన్న పాఠభేదంతో) చదివే పద్ధతి యిలా వుంటుంది.

ఎడపక
యర్ఘ్య
మచ్యుతున
కిచ్చితి
మిచ్చిన
దీనికేమొడం
బడమని
దుర్జనత్వమున
పల్కెడు
వీరుల
మస్తకంబుపై
నిడియెదనంచు
తా
చరణ
మెత్తె
సభన్
సహదేవు
డంతలోనుడిగిసభాసదుల్పలుకకుండిరితద్దయుభీతచిత్తులై

‘ఎడపక’తో మొదలు పెట్టి ప్రతి పదం ఇంకా ఇంకా పైకి వెళ్తూ తొందరగా ఉద్ధృతంగా సహదేవుడి ఉగ్రస్వరంతో ‘తాచరణమెత్తెసభన్ సహదేవుడు’ అనే మాటలు వచ్చేసరికి భీష్ముడు చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే సభ్యుల మీదికి మళ్లా మాట్లాడితే తంతాను అని కాలు పైకెత్తిన సహదేవుడు కనిపిస్తాడు. ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది. నాలుగు పాదాల్లో అచ్చయిన పద్యం చూస్తే ఈ విషయం బోధపడే అవకాశం లేదు.

అంతకు ముందు భీష్ముడు చెప్పిన సలహా నన్నయ్యగారి మాటల్లో మర్యాదగా ఆలోచనాపూర్వకంగా, ఆదిజుఁ డైనబ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు… అని మొదలుపెట్టి చాలా పెద్ద మనిషి తరహాలో నెమ్మదిగా సాపుగా, ఉద్వేగం లేకుండా గంభీరంగా ప్రవహిస్తున్న గంగానదిలా వుంటుంది[5].

దీనిని బట్టి మనం గ్రహించగలిగిన విషయం ఏమిటంటే మన పుస్తకాలు చాలా వాటికి లిఖిత ప్రతి ఒక ఛాయామాత్రమైన భాగం మాత్రమే. పాఠకుల (శ్రోతల) అనుభవం లోకి వచ్చేదే నిజమైన ప్రతి. దీనికి వేరే పేరు లేదు కానీ దానికి ‘పఠిత ప్రతి’ అని మేమొక పేరు పెడుతున్నాం.

పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదవడం మనకి కొంచెం ఇంచుమించుగా అచ్చుయంత్రం వచ్చిన తరువాత, వచన గ్రంథాలు పెరిగిన తరువాత క్రమక్రమంగా అలవాటయ్యింది కానీ పంధొమ్మిదవ శతాబ్దపు పూర్వం వరకు పుస్తకాలు అందరూ పైకే చదివేవారు. ముఖ్యంగా పద్య గ్రంథాలైతే తప్పనిసరిగా పైకే చదివేవారు. మనస్సులోనే భావించుకోవలసిన, భక్తి ప్రదానమైన శతకాలలోని పద్యాలు కూడా ఒక్కరూ తమ చుట్టూ ఒక ఏకాంత ప్రదేశాన్ని నిర్మించుకుని గొంతెత్తి పైకే చదివేవారు. తాళపత్రం మీదో కాగితం మీదో వున్న పద్యాన్నీ, గద్యాన్నీ ఎలా చదవాలో వాళ్లు ముందే నేర్చుకునే వాళ్లు. పఠిత రూపంతో సంబంధం లేకుండా లిఖిత రూపాన్ని మాత్రమే దగ్గర పెట్టుకుని నిశ్శబ్దంగా పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకం చచ్చిపోతుంది. ప్రస్తుతం పాశ్చాత్య విధానాలతో పుస్తక పరిష్కరణ చేసేవాళ్లందరూ లిఖిత గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని, అదే పరమార్థమనుకుని పాఠ పరిష్కరణ చేస్తున్నారు. అంటే తాటాకు మీదో కాగితం మీదో కనిపించే గ్రంథం మొత్తం గ్రంథంలో ఒక భాగం మాత్రమే అని దానికి పరిపూరక భాగం పఠిత ప్రతిలో వుంటుందని మనం మరిచిపోయాం. పాశ్చాత్యులు ఇది ఎప్పుడూ గమనించలేదు.

పుస్తక పఠన పద్ధతులు
మన సంప్రదాయంలో పుస్తకాలు చదివే పద్ధతులు స్థూలంగా ఏడు రకాలు.

మొదటిది పురాణ పద్ధతి. పౌరాణికులు పద్యాన్ని పదిమంది ముందు సభారంజకంగా చదవగలవాళ్లు. వీళ్లు ఒక పద్యం చదివి అక్కడ ఆపి, దాని మీద వ్యాఖ్యానం చేసి సందర్భాన్ని బట్టి కొన్ని కొత్త సంగతులు కలిపి, అవసరమైతే ఇతర పుస్తకాలలో నుంచి తమకు కంఠస్థంగా వచ్చిన భాగాల్ని ఉదహరించి తరువాత తాము చదువుతున్న గ్రంథంలో రెండవ పద్యాన్ని అందుకునేవాళ్లు. వీళ్లు గ్రంథం మొదట మొదలు పెట్టి చివరిదాకా చదవరు. (నిజానికి తెలుగులో భారత, భాగవత, రామాయణాలు మొదటి నుంచీ చివరిదాకా ఎవరూ ఎప్పుడూ చదవలేదనిపిస్తుంది.) పురాణం చెప్పేవాళ్ళు, శ్రోతల ఇష్టాన్ని బట్టి వాళ్లకు కావలసిన యేదో ఒక ఘట్టాన్ని పుస్తకంలో నుంచి తీసి ఆ ఘట్టానికి పూర్వరంగం నాలుగు మాటల్లో చెప్పి ఆ ఘట్టంలో మొదటి పద్యం అందుకుని వాళ్ల ప్రవచనం ఆరంభిస్తారు. ఇందాక చెప్పినట్టుగా మధ్యమధ్య వ్యాఖ్యానాలతో ఇతర పుస్తకాలలో నుంచి ఉదాహరణలతో, లోకోక్తులతో, ఇతర చమత్కారాలతో కొంతసేపు నడిపి తరవాత రెండవ పద్యాన్ని అందుకుంటారు. ఈ క్రమంలో గ్రంథంలో వున్న కొన్ని పద్యాలను వాళ్లు వదిలేయచ్చు, లేదా ఇతర గ్రంథాలలోని కొన్ని పద్యాలను చేర్చచ్చు. చివరికి వాళ్లు తమ ప్రవచనంలో వాడిన గ్రంథం వాళ్లు కొత్తగా తయారుచేసిన గ్రంథం. అంటే లిఖిత గ్రంథం యధాలిఖితంగా ఎప్పుడూ చదవబడడం లేదన్నమాట. తెలుగుదేశంలో భారత, భాగవత, రామాయణాల ప్రవచన పద్ధతులు చూస్తే అనుభవం వున్నవాళ్లకి ఈ సంగతి స్పష్టంగా బోధపడుతుంది.

రెండవ పద్ధతి కావ్య పఠన పద్ధతి. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిగారు, విశ్వనాథ సత్యనారాయణగారు, కాటూరి వెంకటేశ్వరరావుగారు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు — వీళ్ళందరూ వాళ్ల సొంత బాణీలలో పద్యాన్ని అర్థవంతంగా చదివేవారు. మొన్నమొన్నటి వరకూ తెలుగు పాఠం చెప్పే పండితులు, క్లాసులో గొంతెత్తి పద్యం చదివి, ఆ తరవాతే దాన్లో ప్రతిపదానికీ అర్థం చెప్పేవారు. వాళ్లు ఆ పద్యం చదివే తీరులో అందులో ప్రతిపదార్థానికి మించిన భావం వినేవాళ్లకి బొధపడేది.

మూడవ పద్ధతి శాస్త్రదృష్టితో పుస్తకం చదవడం. మనుధర్మశాస్త్రం, నీతిసారం, తెలుగులో కేతన రాసిన విజ్ఞానేశ్వరీయం, జక్కరాజు వెంకటకవి ఆంధ్రకామందకం, భీమన రాసినదని చెప్పబడుతున్న కవిజనాశ్రయం, కేతన రాసిన ఆంధ్రభాషాభూషణం, ఆధర్వణ కారికలు, నన్నయదని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి, బాలసరస్వతీయం, అప్పకవీయం, ఇంకా ఇలాంటి అనేక గ్రంథాలు. ఈ పుస్తకాలు చాలా తక్కువ మంది చదివేవాళ్లు. వాళ్లకి కావ్య పఠనం అంతకు ముందే అలవాటు వుండబట్టి అలవాటుగా పద్యాన్ని గొంతెత్తి చదవొచ్చు కాని, ఈ పుస్తకాలకి అలాటి పఠనం అక్కరలేదు. లిఖిత ప్రతి దగ్గర పెట్టుకుని కంటితో చూస్తూ నిశ్శబ్దంగా మనస్సులో చదువుకోవచ్చు కూడా.

నాలుగవ పద్ధతి స్వీయ పఠనం: ఏ పుస్తకంలో నుంచైనా సరే తమకిష్టమైన పద్యాలు, భాగాలు, చాటు పద్యాలు, తమ సొంత ఉపయోగం కోసం రాసుకొని అవి తమకిష్టమొచ్చినప్పుడు ఏకాంతం లోనో లేక నలుగురు స్నేహితుల మధ్యో చదవడం. ఇందుకోసం పాఠకులు తమతమ ప్రత్యేక శైలులు ఏర్పరుచుకోవొచ్చు.

అయిదవ పద్ధతి చిత్ర కావ్యాలు, గర్భకవిత్వం, ద్వ్యర్థి కావ్యాలు చదవడానికి సంబంధించినది. పాఠకులు పద్యాన్ని కళ్ళతో చూసి, దానికి కావలసిన బొమ్మలు గీసుకుని వాటిలో అక్షరాలు ఇమిడ్చి చూడడం, లేదా ద్వ్యర్ధి కావ్యమైతే పద్యాలు ఎక్కడ ఏ అర్థం కోసం విరవాలో ఆలోచించి గుర్తు పెట్టుకుని ఆ వివరాలు మనస్సుకి పట్టించుకుని అప్పుడు కావ్యం చదవడం — ఇందుకోసం పాఠకులకి పాండిత్య పరిశ్రమ అవసరం.

ఆరవ పద్ధతి సామూహిక పఠనం. ద్విపద కావ్యాలు, ముఖ్యంగా బసవపురాణం ఇలా చదివేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఈ పుస్తకాలు, ఒకరు చదవడం, ఇంకొకరు వినడం వుండదు. అందరూ కలిసి చదువుతారు, అందరూ కలిసి వింటారు. బహుశా ద్విపదలు ఇలా చదివేవారేమో (ఈ సంగతి జెజ్జాల కృష్ణ మోహన రావు గారు ఈమధ్య ఒకసారి సూచించారు). ఈ పఠన పద్ధతి తెలుగులో ఇప్పుడు లేదు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, ఇంకా ఇలాటి ద్విపద గ్రంథాలు సామూహిక పఠనంలో లేకపోవడం, అవి విస్మృతం అయిపోడానికి కారణం.

ఇక, ఏడవ పద్ధతి. ప్రదర్శింపడిన కళారూపాలలో సంభాషణలు, మాటలు, పాటలు, పద్యాలు మాత్రమే రాసిపెట్టిన ప్రతులు కొన్ని వున్నాయి. ఉదాహరణకి తంజావూరులో ప్రదర్శించబడిన యక్షగానాల లిఖితప్రతులు[6]. ఈ యక్షగానాలకి కర్తలున్నారు. వీటిని పరిష్కరించేటప్పుడు తాళపత్రప్రతిలో వున్న మాటలు మాత్రం చాలవు. వీటిని పరిష్కరించడానికి ఇవి ఎలా ప్రదర్శించబడ్డాయో తెలియవలసిన అవసరం వుంది. రాతప్రతిలో వున్న మాటల ఆధారంగా ఇవి ప్రదర్శించబడ్డాయని అనుమానించవచ్చుకానీ ఈ ప్రదర్శన మొత్తం యెలా వుండేదో పునర్నిర్మించలేం. ఇలాంటివే, భామాకలాపం లాంటి ప్రదర్శనల పాఠరూపాలు. ఇందుకోసం నటులు, గాయకులు, నాట్యగురువులు అయినవారి సహాయం కావాలి.

ఇలా ఏడు రకాల పఠన పద్ధతులు ఉన్నాయని గుర్తించడానికి రాతప్రతులు కొంత ఆచూకీ ఇస్తాయి.

లిఖిత ప్రతులు ఇంకా కొన్ని వివరాలు కూడా మనకి చెప్తాయి. ఉదాహరణకి రామాయణంలో సుందరకాండ, భారతంలో విరాటపర్వం, వీటికి ఎక్కువ ప్రతులున్నాయనీ భారతంలో అరణ్య పర్వానికి ఎక్కువ ప్రతులు లేవనీ [7] స్థూలంగా పాఠ పరిష్కరణ చేసిన పండితులు ఇప్పటికే మనకి చెప్పారు. ఏ పుస్తకానికి, లేదా ఏ పుస్తకంలో ఏ భాగానికి ఎక్కువ ప్రతులున్నాయి, వేటికి తక్కువ ప్రతులున్నాయి అనే సమాచారం ఆధారంగా ఈ పుస్తకాల, లేదా ఈ పుస్తకాలలో భాగాల, ప్రచార ప్రాచుర్యం (velocity of circulation) నిర్ణయించవచ్చు.

శాస్త్రగ్రంథాలయితే శాస్త్రపండితుల మధ్య మాత్రమే అమలులో ఉండేవి అని ఊహించవచ్చు. ఈ పుస్తకాలు ఎలా చదివేవారో, ఏ భాగాలు చదివేవారో, ఏవి మానేసేవారో చెప్పడానికి తాళపత్రగ్రంథాల ఆధారంగా జాగ్రత్తగా పరిశోధన చేయాలి. ఇవి తక్కువమంది లోనే పఠనపాఠనాలలో వుండబట్టి అందులో మార్పులు తక్కువగా వుంటాయని ఊహించవచ్చు. కానీ ఉన్న మార్పులకి కారణాలు ఏమై వుంటాయి అనేవి కూడా జాగ్రత్తగా చూడాలి.

శాస్త్రగ్రంథాలు తరచూ పూర్తిగానే దొరుకుతాయి. కానీ వీటిని ఎలా చదివేవారు, ఏ భాగాలు ప్రధానంగా ఉపయోగంలో పెట్టేవారు, ఏ భాగాలు పుస్తకంలోనే వున్నా అపఠితంగా వుండిపోయేవి అన్న విషయం నిర్దిష్టంగా చెప్పటానికి అవకాశాలు తక్కువ ఉన్నా ఆ దృష్టితో పరిశోధన చేస్తే మనకి వీటిని గురించి చాలా విషయాలు తెలియవచ్చు. ఉదాహరణకి ఛందశ్శాస్త్రగ్రంథాలలో అప్పకవీయానికి ఎప్పట్నుంచి ఏ ప్రాంతాలలో ప్రాముఖ్యత మొదలయ్యింది? అప్పకవి ఒట్టి ఛందస్సునే కాకుండా ఆంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యానం రాసే దృష్టిలో వుండబట్టి చాలా ఇతర విషయాలు కూడా చెప్పాడు. ఈ ఇతర విషయాలకి ఏ కాలంలో, ఏ ప్రాంతాలలో, ఏ వర్గాలలో ఎక్కువ ప్రాముఖ్యం వుంది? అన్న ప్రశ్నలు వేసుకోవాలి. ఛందశ్శాస్త్ర విషయంలో సరళంగా చెప్పబడ్డ తాతంభట్టు(?) రాసిన సులక్షణసారం ఎప్పటినుంచి పద్యాలు రాసే కవులకు కంఠస్తం అవడం మొదలయ్యింది? కేవలం ప్రతుల సంఖ్య లెక్క వేస్తే సులక్షణసార ప్రతులు ఎక్కువ దొరుకుతాయా? ఇవి రాసుకున్నవాళ్లు వాళ్ల సొంతానికి రాసుకున్నారా? అనే సంగతులు చూడాలి.

దామాషా మీద ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మందిలో ప్రచారమయ్యే పుస్తకాల లిఖితప్రతుల్లో ఎక్కువ మార్పులుండటానికి, పరిమితంగా పండితుల కవుల శాస్త్రజ్ఞుల లోనే ప్రచారమైన పుస్తకంలో తక్కువ మార్పులుండటానికి వీలుంది. కానీ దీనికి అపవాదాలు ఉన్నాయా, ఉంటే ఏ కారణం చేత ఉండి ఉంటాయి, శాస్త్రగ్రంథాలలో పండితులు తమ వాదానికి అనుకూలంగా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మార్పులు ఉన్నాయా? అన్న సంగతి కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.

ఈ ప్రయత్నం అంతా ఎందుకు? లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.

తాళపత్ర గ్రంథాలయాలలో కానీ పాత ఇళ్లలో దొరికే తాళపత్రాలలో కానీ ఇంకా ఇతర తాళపత్ర గ్రంథ సంచయాలలో కానీ తరుచు ఏ పుస్తకానికా పుస్తకం చక్కగా బైండు చేసిన పుస్తకం లాగా వేరేగా కనిపించదు. తాళపత్రాలన్నింటికి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో రెండు కన్నాలుంటాయి. ఆ రెండు కన్నాల్లోంచి ఒక దారాన్ని పెట్టి తాళపత్రపు ప్రమాణంలోనే తయారు చేసిన రెండు చెక్కలకి వేసిన కన్నాలలోంచి ఆ దారం తీసి మొత్తాన్ని కట్టకట్టి పెట్టేవారు. ఒక రకంగా గ్రంథం అంటే స్థూలమైన అభిప్రాయం ఈ కట్ట అని. అందుకనే గ్రంథం విప్పడం, నీకన్నా అతను రెండాకులు ఎక్కువ చదివాడు అనే వ్యవహారంలో ఆకులు అన్న ప్రయోగం వీటిలోంచే వచ్చాయి. కట్టకట్టిన ప్రతి గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా పరిశీలించాలి. తొందరపడి ఆ కట్టలో ఉన్న వివిధ భాగాల్ని విడదీసేయకూడదు.
లేఖకులు
ఉదాహరణకి ఒక లిఖిత గ్రంథాన్ని రాసుకున్న లేఖకుడు తన సొంతం కోసం రాసుకున్నాడనుకోండి. అప్పుడు అందులో అరసున్నలు, బండి ర-లు, ఇంకా ఇతర ప్రత్యేక విశేషాలు ఉండకపోవచ్చు. ఆ గ్రంథం మనం మన ఉపయోగం కోసం రాసుకున్న ‘నోట్స్’ లాంటిది. మనం నోట్స్ రాసుకునేప్పుడు అన్ని మాటలకు శ్రద్ధగా లక్షణమైన వర్ణక్రమం ఉండకపోయినా పరవాలేదనుకుంటాము. ఎందుకంటే అది కేవలం మన కోసం రాసుకున్న నోట్స్. అది మనం తిరిగి చదివేటప్పుడు దానిలో ఏ మార్పులు చేసుకోవాలో మనకు తెలుసు. తాళపత్ర ప్రతులలో చాలా వాటిలో అరసున్నలు, బండి ర-లు, థ, ధ లాంటి వర్ణాల విషయంలో సాంకర్యం ఇంకా ఇతర ‘లోపాలు’ మనకి కనిపిస్తాయి. వీటన్నిటికి లేఖకుడికి తగినంత వ్యుత్పత్తి లేకపోవడం కారణంగా చెప్పకూడదు.

లిఖిత ప్రతి ఇంకొకాయన పురమాయింపు మీద రాసినది అని మనకి తెలిస్తే ఆ పురమాయించినాయన ఎటువంటి పని కోసం ఈ ప్రతిని కోరుకున్నాడో మనం గమనించాలి. ఆ పురమాయించినాయన లేఖకుడి స్నేహితుడు కావచ్చు. అలాంటి సందర్భాలలో ఆ పురమాయించినాయన పేరుకి ముందు కానీ, తరవాత కానీ పెద్ద పెద్ద గౌరవాలు, బిరుదులేమీ వుండవు. ఈ పురమాయించినాయన ఈ ప్రతిని పండితులకి దానం చేయడానికో తన ఆస్థాన గ్రంథాలయంలో పెట్టుకోవడానికో రాయించినదైతే ఆ ప్రతులు మరికొంత శ్రద్ధగా రాయబడతాయి.

భక్తి కోసం గ్రంథాన్ని పూజించడం కోసం లేదా నిత్యం పారాయణం చేయడం కోసం రాసుకున్న పుస్తకాలు ఇంకొక రకం వుంటాయి. ఈ రాసుకున్న వాళ్లు ఆ ప్రత్యేకమైన దేవుడికో, దేవతకో భక్తులై వుంటారు. వాళ్లకి ఆ రాసుకున్న పుస్తకంలో మాంత్రికమైన నిక్షిప్తమైన గూఢార్థాలేవో వున్నాయి అనే నమ్మకం వుంటుంది. ఉదాహరణకి రామాయణం లోని సుందరకాండలో మంత్రాక్షరాలు ఉన్నాయనే నమ్మకం చాలా మందికుండేది. వాళ్లు వాల్మీకమైన రామాయణంలో సుందరకాండని ప్రత్యక్షరం రాసుకునే వాళ్లు. బహుశః ఆ నమ్మకానికే సంబంధించినది అయ్యుంటుంది ఒక శ్లోకం[8] రామాయణ భక్తులు చెప్పుకుంటూ వుంటారు.

సంస్కృతమ్ రామచరితమ్ పరిత్యజ్య నరాధమః|
పఠన్ భాషాంతరకృతం మృగతృష్ణాజలం పిబేత్||

(సంస్కృతంలో ఉన్న రామచరితను వదిలిపెట్టి అధములు ఇతరభాషల్లో ఉన్న రామాయణాన్ని చదివేవాళ్ళు ఎండమావిలో నీళ్ళు తాగుతున్నారు.)

భక్తి కోసం కాపీలు రాసుకునే గ్రంథాల్లో శతకాలు కూడా చేరతాయి. ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకం, కృష్ణశతకం, నారాయణ శతకం ఇలాటివి. ఈ శతకాల్లో పద్యాలన్నీ ఒకచోట దొరకవు. దొరకవు కదా అని ఆ పేరుతో వున్న ప్రతులన్నీ ఒక చోటికి చేర్చి శతకానికి శుద్ధప్రతి తయారు చేయకూడదు. ఏ లిఖిత ప్రతిలో ఎన్ని పద్యాలుంటే అన్ని పద్యాలే తీసుకుని రాయసగాడి సమాచారంతో పాటు ఆ పద్యాలని పరిశీలించాలి. అలాగే సుమతీశతకం లాంటి శతకాలు కూడా ముక్కలు ముక్కలుగా వేరువేరు జాగాల్లో దొరుకుతాయి. ఇవన్నీ కలగాపులగం చేసి బ్రౌన్ పరిష్కరించినట్లు ఒక సుమతీ శతకపు ప్రతిని తయారు చేయకూడదు[9]. వేమన పేరుతో వున్న పద్యాలన్నీ ఒక చోట చేర్చి పెట్టటం మూలంగా ఆ ప్రతుల ఆధారాలు, ఆచూకీలు పోయి చాలా నష్టం కలిగింది.

దొరికిన ప్రతి లిఖితప్రతిని స్వతంత్రంగా చూడాలని మా ప్రతిపాదన. ముందు దొరికిన ఈ లిఖితప్రతి ఎలా వుంటే అలా అట్టేపెట్టి దాని ‘జీవితచరిత్ర’ రాయాలి. అంటే ఇది రాసిన వాళ్లు యెవరు, అతని కులం గురించి మనకేమైనా తెలుసా, ఇది ఎవరికోసం రాశాడు, తన సొంతం కోసం రాసుకున్నాడా లేదా ఇంకెవరికోసమైనా రాశాడా, ఇంకెవరికోసమో రాసిందైతే ఆ వ్యక్తి యెవరు? ఆ వ్యక్తి తన సొంతం కోసం రాయించుకున్నాడా లేదా రాతప్రతుల్ని దానం చేస్తే అది పుణ్యమనే నమ్మకంతో అందుకోసం రాయించుకున్నాడా? లేదా తనేదో పెద్ద జమిందారు అయ్యి ఒక రాతప్రతుల గ్రంథాలయాన్ని పోషిస్తూ వుంతే అందులో చేర్చడానికోసమై రాయించాడా? ఇవేవీ కాక ఇంకేమైనా ఇతర కారణాలు మనం కనిపెట్టగలవి వున్నాయా? ఇవి కాక, మనకి దొరికిన రాతప్రతి ఒక పుస్తకానికి మొదలి నుంచి తుద దాకా రాసిన రాతప్రతా లేక ఒక భాగానికి మాత్రమే రాసిన రాతప్రతా? మనకి దొరికిన రాతప్రతిలో ఇతర పుస్తకాల ఇతర భాగాలేమైనా వున్నాయా? (తరచూ వుంటాయి!) ఆ ఇతర భాగాలు ఏ పుస్తకానికైనా సంపూర్ణప్రతులా లేక అవి కూడా ఇతర పుస్తకాల్లో ఒక భాగానికి మాత్రమే కాపీనా? ఈ పుస్తకం రాసిన తేదీ కానీ, చోటు గానీ మనకి ఉజ్జాయింపుగా తెలుస్తుందా? ఇది ఆధారంగా ఈ రాతప్రతి ఎంత పాతదో ఏ స్థితిలో వుందో గుర్తించగలమా? ఈ రాతప్రతిలో చివర గానీ, మధ్యలో గానీ ఖాళీ ఆకులు ఉన్నాయా? ఆ ఖాళీ ఆకుల్లో ఈ రాయసకాడు తన సొంత సంగతులు, లిపి ఖర్చులు, పిల్లల జాతకాలు, ఇలాంటివి రాశాడా? చివరగా రాయసకాడు తను ఎంత శ్రద్ధగా ఈ రాతప్రతి రాశాడో, నడుము నొప్పెట్టేలా కష్టపడి యథామూలంగా రాసినట్టు తెలియపరిచే పద్యం కానీ, పద్యాలు కాని వున్నాయా? ఈ రాతప్రతిలో దస్తూరి అంతా ఒకలాగే వుందా, లేక చివరికొచ్చేసరికి దస్తూరి మారిందా? ఇది కాక, రాయసకాని ప్రత్యేక పద్ధతులు — అంటే వ్యక్తిగత అలవాట్లు దస్తూరిలో ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ సమాచారమంతా పోగు చేయగలిగితే, లేదా ఈ ప్రశ్నల్లో కొన్నిటికైనా సమాధానాలు దొరికితే ఈ రాతప్రతిని గురించిన జీవితచరిత్ర మనం పూర్తి చేయగలిగినట్లు. ఈ రకంగా మనకందుబాటులో వున్న అన్ని రాతప్రతుల గురించి సమాచారం సంపాదించాలి[10].

ఇవి కాక రాతప్రతులకి మన దేశంలో దైవస్వభావం వుంది. అంటే వాటిని పూజిస్తారు. పొరపాటున అవి కాలికి తగిలితే పైకి తీసి, కళ్ళకద్దుకుని మళ్లా భద్రంగా ఒకచోట పెడతారు. అప్పుడప్పుడూ ఈ రాతప్రతులు దేవుడిగదిలో కూడా పెట్టి వుంచేవాళ్ళు[11 అలాగే పే.118 ఫుట్.7]. అలా వుంచడం మూలంగా ఒక ఆకు మీద ఇంకొక ఆకు అంటుకుపోయి పనికి రాకుండా పోవడం కూడా మనలో కొందరికి తెలుసు[12].

ఈ కట్టల్లో లేఖకుడు రాసిన ఆఖరి వాక్యాలు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో లేఖకుడి పేరు బట్టి తనను గురించి చెప్పుకున్న ఇతర సమాచారాన్ని పట్టి అతను ఏ కులం వాడో, ఏ ప్రాంతం వాడో, ఆ పుస్తకం ఎవరి ప్రేరణ వల్ల ఎవరి కోసం రాసుకున్నాడో లేదా తన కోసం రాసుకుంటున్నాడో, ఇలా చాలా వివరాలు తెలుస్తాయి. ఇదికాక చాలామంది లేఖకులు చాలా అణకువగా అది ఇతరుల కోసం రాసిన ప్రతి అయితే ఒక మాట చెప్తారు. సంస్కృతంలో ఆ మాట ఇలా వుంటుంది.

భగ్నపృష్ఠకటిగ్రీవమ్ స్తబ్ధదృష్టిరధోముఖమ్|
కష్టేన లిఖితం గ్రంథమ్ యత్నేన ప్రతిపాలయేత్||

(నడుము నొప్పి పెట్టేలాగా, తుంటి విరిగేలాగా చూపు మందగించేదాకా కిందకే చూస్తూ కష్టం మీద ఈ పుస్తకం రాశాను. జాగ్రత్తగా కాపాడండి.)

యదృశం పుస్తకం దృష్ట్వా తదృశం లిఖితం మయా
యది శుద్ధమశుద్దం వా మమ దోషో న విద్యతే||

(పుస్తకంలో ఏది చూశానో అదే నేను రాశాను. అది తప్పో ఒప్పో కానివ్వండి, నా పొరపాటు మాత్రం కాదు).

ప్రతి చూచి వ్రాసినాడను అతి సెబ్రలు వ్రాలు చూడ నన్నియు తప్పుల్
యతియును ప్రాసయు నెరుగను మతిమంతులు తప్పుదిద్ది మన్నింపరయా!

వ్రాలా తప్పులు సెబ్రలు చాలం గలవేను శబ్దసంగతులెరుగన్
గేలిం బెట్టక తిట్టక పోలంగా దిద్దరయ్య బుధజనులారా!

ఈ రకంగా లేఖకులు తమ పాండిత్యాన్ని తక్కువ చేసుకుని తమ కష్టాన్ని మాత్రమే చెప్పుకుంటూ సవినయంగా రాసిన శ్లోకాలు, పద్యాలు మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి. నాకేమీ రాదు, యతి ప్రాసలు ఏమిటో తెలీదు, నాకు శబ్దజ్ఞానం లేదు, చాలా తప్పులున్నాయి, మీరు దిద్దుకొని చదువుకోండి — అని లేఖకులు ఎందుకు చెప్పుకుంటున్నారు? సమాజంలో లేఖకుడికి కవి కన్నా తక్కువ స్థాయి ఉండడాన్ని వీళ్ళు అంతర్గతం చేసుకున్నారా? వీళ్ళకి నిజంగా యతి ప్రాసలు తెలీవా? అక్షరాలా శబ్దజ్ఞానం లేదా? కొంచెం ఆలోచించి చూస్తే, ఇది లోకం కోసం వినయంగా చెప్పుకున్న మాటే కానీ, అక్షరాలా నిజం కాదు. లేఖకులు నిజంగా చదువుకున్న వాళ్ళే. చదువుకోని వాళ్ళు కావ్యాలకీ పురాణాలకీ ప్రతులు రాయడం మొదలు పెట్టరు. దీనికి సమానమైన ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, తెలుగు సాహిత్యంలో భక్తి కవులు, పోతన్నగారితో సహా చాలామంది, నేనేమీ చదువుకోలేదు, నా పాండిత్యం సహజపాండిత్యం, అని చెప్పుకోడం మనకి తెలుసు. నరసింహ శతకకర్త — అమరకాండత్రయంబరసి చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అని చెప్పుకున్నాడు. అంతకు మించి, తప్పైతే తప్పులుంటాయి, అంతమాత్రం చేత నా భక్తి తక్కువైపోతుందా, చెఱకునకు వంకబోయిన చెడునె తీపి? అని తనను తాను సమర్ధించుకున్నాడు కూడా. ఆపాటి ధైర్యం భక్తులు గాని ఈ లేఖకులకి అబ్బకపోయినా, తప్పులు చేస్తున్నామని ఒప్పుకునే వినయం మాత్రం అబ్బింది. అంచేత, ఈ పద్యాలు చూసి నిజంగా వీళ్ళు అజ్ఞానులే అని మనం నిర్ణయించుకోకూడదు.

లేఖకుణ్ణి తక్కువగా అంచనా వేసి తేలికగా ఇది లేఖక ప్రమాదం అని కొట్టేయకూడదు. యక్షగానాలు, చాటు పద్యాలు, ఇలాంటి పుస్తకాలైతే పాట పాడే ధోరణిలో అక్షరాలకి దీర్ఘాలు రాసే పద్ధతి; చాటు పద్యాలైతే పద్యం చివర దీర్ఘం రాసే పద్ధతి, మనకి తరచు కనిపిస్తుంది. మొత్తమ్మీద మేమిక్కడ చెప్పదలచుకున్న విషయమేమంటే రాతప్రతిని తేలికగా తప్పు పట్టవద్దు అని. అయితే మన పుస్తక పరిష్కర్తల దృష్టిలో కవి ఎప్పుడూ తప్పు చేయడు. అందుచేత ఎక్కడ ఏ పాఠం తమకు తప్పులా కనిపించినా అది నిస్సంశయంగా లేఖకుడి తప్పే అయి వుంటుంది. ఈ అభిప్రాయాన్ని మనం వదిలేయాలి.

మనకి అచ్చుయంత్రము, ఆధునిక పద్ధతిలో గ్రంథ పరిష్కరణము, చిన్నయ సూరి ప్రభావము, బ్రౌన్ ప్రభావము దాదాపు ఒక్కసారే వచ్చాయి. పాఠ పరిష్కరణ విధానంలో బ్రౌన్‌ని, వ్యాకరణ ప్రామాణికతలో చిన్నయసూరిని పేర్లు చెప్పకుండా అనుసరిస్తూ మన పూర్వ గ్రంథాలన్నింటినీ వావిళ్ల వారు, అంతకు పూర్వం ఆదిసరస్వతి ముద్రణాలయం వారు, వావిళ్ల వారి కాలంలోనే వేదం వేంకటరాయశాస్త్రిగారు, జమిందారులు పెట్టించిన ముద్రణాలయాలవాళ్లు, ఇంకా అనేకులు ప్రచురించారు. అందుచేత మన పుస్తకాలు పాత పుస్తకాలే అయినా మన ప్రచురణ విధానాలు మాత్రం పాశ్చాత్యమైనవే అయ్యాయి.

ఇవాళ మనం మనదైన పాఠపరిష్కరణ విధానాన్ని నిర్మించుకోవాలంటే మనకి అచ్చుయంత్రం రావడానికి పూర్వానికి వెళ్లాలి. అచ్చుయంత్రం వచ్చిన తరువాత మన పుస్తక నిర్మాణ చరిత్ర ఇంతవరకూ ఎవరూ రాయలేదు. తమిళానికి వెంకటాచలపతి ఈ పని చేసి పెట్టాడు[13]. అయితే అతను కూడా, కేవలం తమిళాభిమానంతోటే తమిళం ఒక్కటి స్వతంత్ర భాష అనే భ్రమ కల్పించే పద్ధతిలో ఆ పుస్తకం రాశాడు. వాస్తవానికి మద్రాసులో అచ్చుయంత్రం స్థిరపడ్డ తరవాత ఒకే ముద్రణాలయం వారు తమిళంలోను, తెలుగులోను కూడా పుస్తకాలు వేసేవారు. పండితులకి, పండితులు కాని వాళ్లకు కూడా తెలుగు, తమిళం సమానంగా వచ్చేవి. ముఖ్యంగా గుజిలీ ప్రతుల్లాగా పుస్తకాలు ప్రచురించిన మద్రాసులోని ఎన్. వి. గోపాల్ అండ్ కంపెనీ, సి.వి. కృష్ణా బుక్ డిపో, హైదరాబాదులో సిద్ధేశ్వర పబ్లికేషన్స్, రాజమండ్రిలో కొండపల్లి వీరవెంకయ్య, కాళహస్తి తమ్మారావు, కర్నూలులో బాలసరస్వతి డిపో, ఏలూరులో నందిరాజు చలపతిరావు, ఇలా కొన్ని డజన్ల మంది వావిళ్ల వారి లాగా పాఠ ప్రామాణికతాదృష్టి పెట్టుకోకుండా పుస్తకాలు ప్రచురించారు. వీళ్ల పుస్తకాల మీద అప్పుడప్పుడు కేవలం మర్యాద కోసం ‘పండితులచే బరిష్కృతము’ అని కవరు పేజీ మీద అచ్చు వేసి వుండేది. వావిళ్ల వారి లాంటి ప్రామాణిక ప్రచురణలకి సమాంతరంగా విరివిగా అచ్చయి కొన్ని వేల వేల కాపీలు జనంలోకి వెళ్లిన ఈ పుస్తకాల లోని భాషని గురించి కానీ ఇవి అచ్చు కాకముందు మౌఖికంగా పాడబడేవా లేక పోతే వాటికి కూడా లిఖిత రూపాలున్నాయా, ఉంటే ఆ లిఖిత రూపాలకి ఈ అచ్చు ప్రతులకి సంబంధం ఎటువంటిది? అనే విషయాలు మనం ఎక్కడా పరిశీలించలేదు. ఒకరకంగా ఈ సమాంతర ప్రచురణలు పంధొమ్మిదవ శతాబ్దపు పండితుల చెయ్యి పడకముందు రాతలో భాష ఎలా వుండేదో ఆచూకీ ఇవ్వడానికి పనికొస్తాయి.

ఇంతకుముందు చెప్పిందే క్లుప్తంగా చెప్పాలంటే: ప్రతి తాళపత్రప్రతికి, కాగితపు ప్రతికి దాని ‘జీవితచరిత్ర’ని తయారు చేయాలి. ఈ జీవితచరిత్రలు ఆధారంగా ఈ ప్రతి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిందో, ఏ పాఠక సమాజం ముందు ప్రచారం పొందిందో, ప్రవచనాన్ని పొందిందో తెలుసు కోవడానికి ప్రయత్నం చేయాలి. (ఇలాంటి ఒక ప్రయత్నం.)దీనిని బట్టి కొన్ని నిర్ణయాలను చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఒక ప్రతిని పోలిన ఇతర ప్రతులు వాటి సమాచారంతో సహా ఒక చోట చేర్చి వాటి ప్రచార ప్రపంచాన్ని మ్యాపులలో గుర్తించొచ్చు. అంటే ఒక రకంగా ఈ పుస్తకం తాలుకా velocity, locations, and communities of circulation – ఈ మూడిటిని గుర్తించొచ్చు.

ఇట్లా ప్రతి తాళపత్రప్రతికి దాని జీవితచరిత్ర రాయడానికి వీలు లేకుండా చాలా తాళపత్రప్రతులు కలగాపులగంగా కలిపేసి వాటి పూర్వ జీవితాన్ని మనకి తెలియకుండా చేశారు ఈ ప్రతులు పోగు చేసినవాళ్లు. ఇది మంచి ఉద్దేశ్యంతో చేసిన పనే ఐనా ఫలితాలు మనకి నష్టాన్ని కలిగించేవే అయ్యాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, భూగర్భంలో వున్న ప్రాచీన కట్టడాల అవశేషాలని పరిశీలించే వాళ్లు తొందర తొందరగా తవ్వడం మూలంగా ఏ పొరలో ఏ విశేషాలు ఉన్నాయో, ఇంకా లోతు పొరలో ఏ ప్రత్యేక విశేషాలున్నాయో తెలుకునే వీల్లేకుండా పోయిందని, భూగర్భంలో ఉండిపోయిన పాత ప్రదేశాల అన్వేషణ పనుల్లో వున్న ఆధునిక ఆర్కియాలాజిస్టులు చెప్తూ వుంటారు. తాళపత్ర ప్రతుల పరిశీలన ఒక విధంగా ఆర్కియాలజీ లాంటిది. గత ఒకటి రెండేళ్లలో తెలుగు దేశంలో తాళపత్ర ప్రతుల్ని సంపాదించే ఉద్యమంలో పనిచేసిన వారు కూడా ఆధునిక విధానాలని అనుసరించారో లేదో తెలియదు. ఏ తాళపత్ర ప్రతి, ఎవరి ఇంట్లో ఎవరి దగ్గర దొరికిందో దాని పూర్వోత్తరాలేమిటో సాధ్యమైనంత సంపాదించి ఆ ప్రతికి ఆ సమాచారం కలిపి ఒక చోట భద్రపరచాలి — అనే ఆలోచనతో ఈ పని జరిగిందో లేదో తెలియదు.

ఇక పోతే, ఒక గ్రంథం పేరు, ఆ గ్రంథం రాసిన రచయిత పేరు ఉంటే చాలు — ఆ పేరుతో వున్న తాళపత్ర ప్రతులన్నీ కలిపేసి దాని పూర్వ రూపాన్ని మనం నిర్ధారించగలం అనే అభిప్రాయం మన మనసులో వుంది. ఆ అభిప్రాయాన్ని మనం వదిలేయాలి. మనం అరిచి గీ పెట్టుకున్నా నన్నయగారు రాసిన భారతాన్ని ఆయన రాసిన రూపం లోనే సంపాదించలేం. అందుచేత ఆ ప్రతిని తిరిగి రాసుకున్న అనేకుల అలవాట్లు, బహుశా వాళ్లు చేసిన మార్పులకి కూడా ఒకరకమైన కర్తృత్వ గౌరవాన్ని ఇచ్చి ప్రతి ప్రతిని వేర్వేరుగా పరిశీలించాలి. దీని ఫలితం ఏం కాబోతున్నది అన్నది ఇప్పుడు మనం చెప్పలేం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు మహాభారతానికి సంశోధిత ముద్రణం చేసిన ఉస్మానియా పండిత మండలి పని కూడా మళ్లా మనం తిరగ దోడాలి.

మన పండితుల మీద బహుకాలంగా అప్పకవి ప్రభావం ఉంది అంటున్నారు గిడుగు రామ్మూర్తిగారు. ఈ ప్రభావానికి పూర్వం వున్న కాలానికి వెళ్లి తాళపత్ర ప్రతుల్ని పరిశీలిస్తే తప్ప మన పుస్తకాలు రాసుకున్న పద్ధతులు మనకి తెలియవు. ఆ రాసుకున్న పద్ధతుల ఆధారంగా అవి అప్పుడు చదవబడిన పద్ధతులు పునర్నిర్మించగలమేమో చూడాలి.

ఇంతకీ పాత పుస్తకాల పరిష్కరణ విధానాలని గురించి మేమేమీ చెప్పలేదు. ఆ విధానాలు నిర్ణయించుకోడానికి పైన మేము సూచించిన పని ముందు జరగాలి. ఆ తరవాత పది మంది కూర్చుని చర్చించవలసిన విషయాలు దాదాపుగా ఇలా వుంటాయి: అసలు మనకి పరిష్కృత ప్రతి అనేది ఎందుకు, ఎవరికోసం? ఇందాక చెప్పినట్లు ప్రతి లిఖిత ప్రతి ఎవరో ఒకరు తమ ప్రయోజనం కోసమో లేదా ఆ పుస్తకం పట్ల అభిమానం వున్న వేరే ఎవరి కోసమో రాశారు అని మనం గమనించాం కదా. ఇప్పుడు మనం తయారు చేస్తున్న పరిష్కృత ప్రతి ఎవరి ఉపయోగం చేస్తున్నామో నిర్ణయించుకుంటే ఆ పరిష్కృత ప్రతి స్వరూపం ఎలా వుండాలో నిర్ణయించవచ్చు. మొత్తం అందరికీ అంగీకార యోగ్యమయే ప్రామాణిక ప్రతి ఏదీ వుండదు. ఈ ప్రామాణిక ప్రతి మిగిలిన అన్ని ప్రతుల్ని నిరాకరించి సర్వశిరోధార్యంగా వుండాలనుకోవడం పొరపాటు. ఈ ఆలొచనలకి ఒక దారి దొరికాక, మనం తెలుగు పుస్తకాలకి పరిష్కరణ విధానాలు ఎలా వుండాలో నిర్ణయించుకోచ్చు. అంతకు లోపల తొందరపడి తాళపత్రాల్ని చిన్నాభిన్నం చేసి పరిష్కృత ప్రతి అన్న పేరుతో ఒక కృతక ప్రతిని తయారు చేయకూడదు.

ఇప్పడప్పుడే నిర్ణయాలు చెయ్యడం సాధ్యం కాదు కాని, ఒక్క ప్రతి మాత్రమే ఉందంటున్న, నన్నెచోడుని కుమారసంభవం, వల్లభరాయని క్రీడాభిరామం ఇలాంటి గ్రంథాలని ఎలా పరిష్కరించాలి? ఒక్కటే ప్రతి, అదీ రాగిరేకులమీద వున్న అన్నమయ్య పాటలని ఎలా పరిష్కరించాలి? అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. కంప్యూటర్ యుగంలో, అనేక ప్రతులనీ, వాటిలో పాఠభేదాల్ని, ఒకే చోట ప్రదర్శించే అవకాశాలున్నాయి. ఈ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలి.

ఇది నేల విడిచిన సాము కాదు. ఇది నేలని అందుకోవడానికి చేసే సాము. ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఈ విధానాలు అంగీకారమైతే చాలామంది చాలా చోట్ల చెయ్యవలసిన పని. దీని ఫలితంగా తెలుగులో వివిధ కాలాల్లో పుస్తకాలు రాసుకున్న పద్ధతులు, ఆ పుస్తకాలు ప్రచారమైన మార్గాలు, అవి చదివిన/విన్న పాఠక/శ్రోత్రు సమాజాలు మనకి అవగాహనకి వచ్చే అవకాశం వుంది. పోయిన సమాచారం పోగా ఉన్న దానితోటే మనం చాలా పని చేయవచ్చు. తెలుగు పుస్తక పరిష్కరణ ప్రపంచ భవిష్య స్వరూపం దిఙ్మాత్రంగా సూచించడానికి రాసిన వ్యాసం ఇది. మనం చెయ్యవలసిన పనికి ఇది పూర్వరంగం మాత్రమే.

(అంకితం: అనేక శ్రమలకి ఓర్చి, తాళపత్ర ప్రతుల్నీ, ఇతర రాత ప్రతుల్నీ సంపాదించి పెట్టిన మహానుభావులు అందరికీ.)

ఉపయుక్త విషయసూచిక
అబ్బూరి రామకృష్ణారావు, పరిచయం, వాల్తేరు, 18.04.1961 published in గీతాంజలి; అనువాదం: బొమ్మకంటి వేంకట సింగరాచార్య; కల్యాణీ ప్రచురణలు, వాల్తేరు, 1961.
Sukthankar, Vishnu S.; “Prolegomena to the critical edition of the Mahabharata” in: Adiparvan, Volume 1 of The Mahabharata; edited by Vishnu S. Sukthankar; Poona; Bhandarkar Oriental Research Institute; 1933.
Wendy Phillips-Rodriguez; “A discussion about textual eugenics: Still searching for the perfect Mahabharata?” (esp. page 172) in Textual Scholarship and the Material Book; van Mierlo, Wim (ed); Amsterdam/New York, NY, 2007; pp. 163-175
వావిళ్లప్రతిలో, ఓ.యూ. ప్రతిలో పాఠాంతరములుగా చూపించినవి:
ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీనికిం దొడం[కే మొడం]
బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై
నిడియెద నంచు దాఁ జరణ మెత్తె సభన్ [వెసన్‌] సహదేవుఁ డట్టిచో
నుడిగి సభాసదుల్ వలుక కుండిరి తద్దయు భీతచిత్తులై.

ఆదిజుఁ డైనబ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు వే
దాదిసమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁ డైనవాఁడు లో
కాది త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా
మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని యుక్తమ కా కిది యేమి దోసమే. [సభాపర్వం, ద్వితీయాశ్వాసం, 2.2.18]
గంటి జోగి సోమయాజి (సం); యక్షగానములు (తంజావూరు); సంపుటములు 1-6; Andhra University Series; వాల్తేరు; 1955-1960.
ఆంధ్ర మహాభారతము, సంశోధిత ముద్రణము, ప్రథమ సంపుటము, ఆది-సభాపర్వములు; ఉస్మానియా విశ్వవిద్యాలయము; హైదరాబాదు; 1968; పేజి 153.
రావూరి దొరసామిశర్మ; తెలుగు సాహిత్యం – రామకథ; త్రివేణి పబ్లికేషర్స్; మచిలీపట్నం; 1972.
V. Narayana Rao; Multiple lives of a text: The Sumati Satakamu in colonial Andhra in “Ritual, Caste, and Religion in Colonial South India”; M. Bergunder, H. Frese, and U. Schröder (Eds); Halle: 2010.
చిలుకూరి నారాయణరావుగారు కొంతవరకు గరుడోపాఖ్యానం పరిష్కరణలో ఇలా సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. చూ. పే. 122, ఫుట్ నోట్ 7. అలాగే నేషనల్ మాన్యుస్క్రిప్ట్‌ మిషన్ వారు రాతప్రతులు దొరికినప్పుడు వాటి వివరాలను ఎలా నమోదు చేయాలో కొన్ని సూచనలు చేశారు. Rana, Dilip Kumar; Cataloging of manuscripts. కానీ ఒక రాతప్రతి యొక్క “జీవిత చరిత్ర” తెలుసుకోవాలంటే మరిన్ని వివరాలు నమోదు చేయడం అవసరం.
S.R. Sarma; ‘From my Grandfather’s Chest of Palm Leaf Books’ in: Saraju Rath (ed); Aspects of Manuscript Culture in South India; Brill; Leiden, 2012; pp. 207-233.
ఆర్వీయస్ సుందరం; గ్రంథ పరిష్కరణ శాస్త్రం; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం; హైదరాబాదు; 2011.
A.R. Venkatachalapati; The Province of the Book – Scholars, Scribes, and Scribblers in Colonial Tamilnadu; Permanent Black; 2012.
-------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
పరుచూరి శ్రీనివాస్, 
ఈమాట సౌజన్యంతో

No comments: