Saturday, April 13, 2019

గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.


సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: 
గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసము – 2.సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.................

వేంకటకవి ఆత్మోత్కర్షను, వైభవోత్కలికను గురించిన ఈ విమర్శ విషయాన్ని నేనింత విపులంగా ఉదాహరించటానికి గల నేపథ్యాన్ని వివరించాలి.

గ్రంథచౌర్య విమర్శ
వీరేశలింగం గారు ఇప్పుడు మనకు దుర్లభంగా ఉన్న ఆ తమ వ్యాసంలో వేంకటకవి పద్యాన్ని పోలిన పద్యం ఒకటి మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఉండటాన్ని గుర్తించి విమర్శించినట్లున్నది. పూండ్ల రామకృష్ణయ్యగారు తమ పీఠికలో దానిని కొంత సమన్వయించే ప్రయత్నం చేశారు. వీరేశలింగంగారికి అది నచ్చినట్లు లేదు. అసలే స్వోత్కర్షాపరుడని వేంకటకవిమీద బారెడు కోపంతో ఉన్నందువల్ల మరింతగా మండిపడి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో మూర్తికవి కావ్యాలంకార సంగ్రహం నుంచి అభిమానగౌరవాల వల్ల కొంత భాగాన్ని అనుకరించటం జరగలేదని, వేంకటకవి చేసింది ‘గ్రంథచౌర్యము’ అనే నిశ్చయానికి వచ్చారు. అందువల్ల కవుల చరిత్రములో:

వేంకటకవి గ్రంథచౌర్యము చేయువాఁడగుట తెలియుటకయి నరసభూపాలీయము నుండియు, వేంకటేశ్వర విలాసము నుండియు నొక్కొక్క చిన్న పద్యము నుదాహరించుచున్నాము –

ఔరా యోబ నృపాల కు, మారా మను మదనసమ రమాధుర్యుఁడవై
ధీరా నృసింహ కూడితి, మా రామను మదనసమరమాధుర్యుఁడవై.

అని యీ పద్యము కావ్యాలంకార సంగ్రహములో పాదయమకమునకు లక్ష్యముగా నీయఁబడియుండఁగా, వేంకటకవి,

ఔరా మాధవయజ్వ కు, మారా మను మదనసమ రమాధుర్యుఁడవై
ధీరా విటార్య యేలితి, మా రామను మదనసమరమాధుర్యుఁడవై.

అని పై పద్యమునే పేరులు మాత్రము మార్చి పంచదశవర్ణయుక్తపాదయమకమని తన పుస్తకములో వేసికొనియున్నాఁడు.

అని వ్రాశారు. వీరేశలింగం గారు వ్రాసినట్లుగానే, కావ్యాలంకారసంగ్రహంలోని పద్యం ‘పాదయమకము’ అన్న శీర్షికతో చతుర్థాశ్వాసంలో (4-80) ఉన్నది. వేంకటకవి పద్యం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో పంచదశవర్ణయుక్తపాదయమకము అన్న శీర్షికతోడి 746వ పద్యం. 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు వేదము వేంకటరాయశాస్త్రి గారి సంపాదకత్వంలో ప్రకటించిన ప్రతిలో ఇది 730వ పద్యంగా కనబడుతుంది. ఓబ నృపాల కుమారా = గొబ్బూరి ఓబ నరేంద్రునియొక్క తనయుడవైన నరస రాజా, మదనసమ = మన్మథునితో సమానమైన, రమాధుర్యుఁడవై = సౌందర్య యౌవన లక్ష్మీసంపన్నుడవై, మనుము = జీవింపుము అని అన్వయం. ఔరా! ఓబ నృపాల కుమారా! అన్నదానిని కావ్యాలంకారసంగ్రహంలో నుంచి తన కథానుసారం నాగదత్తోపాఖ్యానంలో, ఔరా! మాధవయజ్వ కుమారా! అని అనువర్తించికొన్నాడు. ధీరా! నృసింహ! కూడితి – అన్న దళాన్ని కావ్యాలంకారసంగ్రహంలో నుంచి సందర్భానుగతంగా ధీరా! విటార్య! యేలితి – అని మార్చుకొన్నాడు. మను మదనసమ రమాధుర్యుఁడవై అన్న యమకం ఉభయపద్యాలలోనూ సమానంగా ఉన్నది. పాదయమకానికి సాటిగా తానొక పాదయమకాన్ని వ్రాయక కావ్యాలంకారసంగ్రహంలో నుంచి యాథాతథ్యభావంతో ఎటువంటి మార్పూ లేకుండా ఉన్నదున్నట్లుగా స్వీకరించటం వల్ల వీరేశలింగంగారికి కోపం వచ్చింది.

పూండ్ల రామకృష్ణయ్యగారి ముద్రణ ఈ తరం పాఠకులకు సులభంగా దొరకదు. అందువల్ల ఈ వ్యాసంలో పాఠకుల సౌకర్యార్థం పద్యసంఖ్యలను నేనిక అకాడమి వారి ముద్రణ నుంచే ఇస్తున్నాను. వీరేశలింగంగారు చూపలేదు కాని, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో కావ్యాలంకార సంగ్రహానికి అనుకరణలు ఇంకా అనేకం కనబడతాయి. కొన్నింటి శీర్షికలు కూడా రెండింటిలోనూ ఒక విధంగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూపుతాను:

అస్ఫుటము

శ్రీనాయక! తావక భుజ
మానితఖడ్గంబు సకలమహిమండలిలో
నానా రిపుభూనాథ వి
తానార్జిత కీర్తిదుగ్ధధారలు గ్రోలున్. కావ్యా. (2-154)

ఓ రాజా! నీ చేతిని అలంకరించిన ఖడ్గం శత్రురాజులు ఆర్జించిన కీర్తి అనే దుగ్ధాన్ని గ్రోలుతున్నది అని భావం. ఇందులో గొబ్బూరి నరసరాజు చేతిలోని ఖడ్గం పామువలె ఉన్నదని, ఆ ఖడ్గభుజంగి రిపుభూనాథవితానం ఆర్జించిన కీర్తిదుగ్ధధారలను గ్రోలుతున్నదని అన్నప్పుడు ఖడ్గానికి పాముతో గల ఔపమ్యం స్ఫుటంగా లేదు. అరికీర్తిదుగ్ధ మానును, ధరణీశ్వరు ఖడ్గ మనుడు దర్వీకరశే, ఖరము గతి బొల్చు ననియెడి, సరసోపమ కృతులయందు జను నస్ఫుటమై – అని మూర్తికవే దీని ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు. ఈ వివరణ మాటెలా ఉన్నా, ఇది అస్ఫుటవ్యంగ్యానికి లక్ష్యమన్నమాట ఇక్కడ ప్రసక్తం. దీనికి వేంకటకవి అనుకరణ ఇది:

అస్ఫుటకందము

శ్రీనాయక! తావక భుజ
మానితఖడ్గంబు సకలమహిమండలిలో
నానా శూరసేనా సం
తాన యశఃస్నిగ్ధదుగ్ధధారలు గ్రోలున్. ప్రబంధ. (140)

వేంకటకవి కావ్యాలంకారసంగ్రహాన్ని యథాతథంగా గ్రహించిన సంగతి స్పష్టంగానే కనబడుతున్నది. మూర్తికవి అస్ఫుటవ్యంగ్యానికి ఇచ్చిన ఉదాహృతిని తానుకూడా అస్ఫుట కందము అని ఆ విధంగానే పేర్కొన్నాడు. శ్రీనాయక! అని మూర్తికవి ప్రభువు పరంగా చెప్పిన సంబోధనను శ్రీ వేంకటేశ్వరునికి అన్వయించాడు. తావక భుజ,మానితఖడ్గంబు సకలమహిమండలిలో, నానా రిపుభూనాథ వి, తానార్జిత కీర్తిదుగ్ధధారలు గ్రోలున్ – అన్నదానిని ఆ విధంగానే కొద్దిపాటి మార్పుతో తావక భుజ,మానితఖడ్గంబు సకలమహిమండలిలో, నానా శూరసేనా సం,తాన యశఃస్నిగ్ధదుగ్ధధారలు గ్రోలున్ – అని గ్రహించాడు. రిపుభూనాథ – శూరసేనా; సంతానము – వితానము; కీర్తి – యశస్సు అన్నవి మాత్రమే పర్యాయరచనలు. ఇంకొక ఉదాహరణను పరిశీలిద్దాము:

అశ్లిష్టమాలాపరంపరిత రూపకము

వనితానేత్రచకోరచంద్రిక యశోవల్లీవసంతోదయం
బనిదంపూర్వకథాసుధాబ్ధి భుజగర్వాదిత్యపూర్వాచలం
బనఘోద్యద్గుణరత్నరోహణము నీ యాకార మెవ్వారికిన్
వినుతింపన్ వశమే? నృసింహ! కరుణావిన్యాస! ధన్యాత్మకా! కావ్యా. (5-49)

ఆర్తరక్షాపరాయణత్వం మూలాన ధన్యుడవై, శరణాగతుల యందు కరుణను కురిపించే ఓ నరస రాజా! నీ శుభాకారం మరులుగొన్న కాంతల కన్నులు అనే చకోరాలకు వెన్నెల. కీర్తి అనే పందిరి తీగకు వసంత కాలోదయం. అపూర్వమైన పుణ్యకథామృతానికి పాలకడలి. భుజదర్పము అనే సూర్యునికి తూర్పుకొండ. పావనములైన గుణరత్నములకు వెండికొండ. ఎంతటివారికైనా నీ రూపశోభను వర్ణించటం సాధ్యమేనా? అని మాలాపరంపరితంగా రూపకాలను కూర్చటం జరిగింది. వీటిలో శ్లేషాధారితం ఏదీ లేదు. అందువల్ల అశ్లిష్టమాలాపరంపరితరూపకాలంకారం అన్నమాట. వేంకటకవి పద్యాన్ని పరిశీలిద్దాము:

అశ్లిష్టమాలాపరంపరిత రూపకము

వనితాదృక్కుముదేందుబింబము యశోవల్లీవసంతాగమం
బనిదంపూర్వకథాసుధాంబుధి భుజౌజోర్కోదయక్ష్మాధరం
బన రాజద్గుణరత్నరోహణము నీ యాకార మెవ్వారికిన్
జనునే సన్నుతి సేయ? శ్రీహరి! దయాసంత్రాతమాద్యత్కరీ. ప్రబంధ. (140)

తులనాత్మకంగా చూసినప్పుడు రెండు పద్యాలూ బింబప్రతింబాలని తెలుస్తూనే ఉన్నది. ప్రభుసన్నుతిని జగత్ప్రభుసన్నుతిగా పరివర్తించటం మాత్రమే ఇక్కడ జరిగింది. తక్కినదంతా పర్యాయపదాలతో యాథాయథ్యంతో చేసిన అనుకరణ మాత్రమే అని అంగీకరింపక తప్పదు.

అయితే, గ్రంథచౌర్యము చేయువాఁడు పదబంధాలకు పదబంధాలను, పాదాలకు పాదాలను, పద్యాలకు పద్యాలను అపహరించటమే గాక, ఆ పద్యాల శీర్షికలను కూడా అపహరిస్తాడా? అని వీరేశలింగం గారు ఆలోచింపలేదు. అసలే కోపంమీదున్నారు. దానితో గ్రంథచౌర్యము చేయువాడు అని తీవ్రమైన నిందమోపటానికి జంకలేదు.

పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ ఆరోపణకు తగిన సమాధానం చెప్పాలని ఎంతో ఆలోచించారు. వారికేమీ తోచలేదు. మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చి, తమ పీఠికలో ఈ విధంగా వ్రాశారు:

బట్టుమూర్తిగారి విరచితమగు నరసభూపాలీయమను కావ్యాలంకారసంగ్రహమును నిక్కవి పూర్ణముగఁ జదివి యందలి లక్ష్యములగు పద్యములం బోలిన పద్యము లిం దనేకములు వ్రాసియున్నాఁడు. ఇంతయేల. కొన్నికొన్ని పద్యములం బోల్చి యంకితాంకములు విడిచి చదివినచో నించుక యైనను భేదము లేకయున్నవి. ఇది చూచునప్పు డి క్కవికి సామర్థ్యము లేక వానిని స్వీకరించినాఁడని యనవలసి వచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. గుణగ్రహణపారీణులకుఁ దెలియుటకుగా నాయాయి పద్యముల సంఖ్యను నిందుఁ బోల్చి చూపుచున్నాము గాన నయ్యయి పద్యములను బోల్చి చదువుకొనుఁడు.

అని వ్రాసి, రామకృష్ణయ్యగారు రెండు కావ్యాలలోని పద్యాలకూ ఒక పట్టికను వేసి, పోలికలున్న 32 పద్యాల సంఖ్యలను ఇచ్చారు. వారు చూపిన ఆ పద్యాల సంఖ్యలలో కొన్ని పొరపాట్లున్నాయి. అవన్నీ నిజంగా పోలిక కలిగినవి కావు. కొన్నింటి శీర్షిక మాత్రమే రెండు కావ్యాల పద్యాలకూ ఒకటే అయినా, ఆ పద్యాలలో నిజంగా ఎటువంటి పోలికా లేదు. అటువంటి పదహారింటిని నేను వారిచ్చిన పట్టికలో నుంచి తీసివేసి, మిగిలిన పదహారింటిని మాత్రం ఈ క్రింద చూపుతున్నాను:

నరసభూపాలీయము ప్రబంధరాజము నరసభూపాలీయము ప్రబంధరాజము
4-75 139 5-83 351
2-155 140 2-131 353
5-51
141 5-160 360
2-92 146 5-59 362
5-76 147 5-49 363
5-22 149 5-98 368
3-31 206 2-129 388
3-24 215 2-82 423
ఈ పట్టికను చూపుతూ రామకృష్ణయ్యగారు ఇంకొక మాటన్నారు:

నరసభూపాలీయములోని పద్యముల వలె యతిస్థానములు విడువకయే యిందును వ్రాయఁబడియున్నవి. ఎట్లనగాఁ జూడుఁడు. నరసభూపాలీయము చతుర్థాశ్వాసము నందలి 89వ వృత్త, కంద, గర్భ సీసము:

మహిత విద్వజ్జనమండలీ వినుత సా
        హిత్యప్రియంభావు కాత్యుదార
వితత భీమాహవ విక్రమక్రమ సము
        ద్యద్వైరినిర్భేదనాభిరామ
వినుతవిశ్రాణనవిభ్రమాపహసితా
        నూనామరక్ష్మారుహా నృపేంద్ర
వినతభూపాలకవిస్ఫురన్మకుటర
        త్నద్యోతితాంచత్పదా మహాత్మ

నిరుపమదయాపయోధి నిరత భరిత
చారుచరిత నిర్మలతర సత్యరుచిర
తరణికులమణీ నరసింహ ధరణిరమణ
ఘనతరగుణనిధీ మను జనులు బొగడ.

ఇఁక నీ ప్రబంధరాజములోని పై పద్యమును బోలిన పద్యమును జూడుఁడు:

మహిత నానామునిమండలీ విరచితా
        హీనాతివేల్లత్స్తవానుషంగ
వితతజన్యాంగణ విక్రమక్రమలస
        త్క్రవ్యాదసమ్హారకానుభావ
వినతబర్హిర్ముఖవిస్ఫురన్మకుట ర
        త్నశ్రేణిరాజత్పదాభిరామ
విగత విశ్రాణన విస్మయస్మయదివౌ
        కశ్శాఖి జైవాతృకాదిదాన

నిరుపమకృపాపయోంబుధి నిరతశుభద
ధీరచరిత నిర్మలతరదేహరుచి జి
త సజల జలదాయురాగేంద్ర ధరణిధరవ
ర యురుసుగుణనిధీ పక్షిరాజవాహ.

పై పద్యములోని మహిత, వితత, వినత అను మూడు పదములు నరసరాజీయమునందు సీసపద్యములో 1, 2, 4 సీస పాదాదులయందుఁ గూర్పఁబడియున్నవి. నరసభూపాలీయము నందలి సీసపద్యములోని విద్వజ్జనమండలీ అను సమాసమును నానామునిమండలీ అను సమాసముగాను, భీమావహ విక్రమక్రమ సమాసమును జన్యాంగణ విక్రమక్రమ అను సమాసముగాను భూపాలకవిస్ఫురన్మకుటరత్న అను సమాసమును బర్హిర్ముఖవిస్ఫురన్మకుటరత్న అను సమాసముగాను నిందు మార్పఁబడియున్నవి. ఇంతియ కాదు. నరసరాజీయములో సీస తేటగీతి యందలి నిరుపమదయాపయోనిధి నిరత భరిత అను వాక్యమును నిరుపమ కృపాపయోంబుధి నిరతశుభద అను వాక్యముగాను, ఘనతరగుణనిధీ అను పదమును ఉరుసుగుణనిధీ అను పదముగాను మార్పఁబడియున్నవి.

… అరయఁగా నరసభూపాలీయమును ముందిడుకొని యీ గ్రంథమునందు కొన్ని పద్యములు వ్రాసినట్లెంచవలసియున్నది. …

… ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అ ట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. …

అని ఇంత విపులంగా, అక్షరాక్షరం వివరించారు. అంతటి సమర్థుడైన మహాకవి చేసినది గ్రంథచౌర్యం అనటానికి సందేహించారు.
మూర్తికవి కావ్యాలంకార సంగ్రహముతోడి పోలికలు
నిజానికి, పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం నుంచి పట్టికను వేసి చూపిన పద్యాలే కాక – ఇంకా అనేకపద్యాలు వేంకటకవి కావ్యాలంకారసంగ్రహం నుంచి తీసికొన్నవి ఉన్నాయి. రామకృష్ణయ్య గారు ప్రదర్శించిన పట్టికలోని కొన్నింటిని అనుకరణలు అనటానికి వీలులేదని చెప్పాను. వారు కావ్యాలంకార సంగ్రహంలోని (2-89) సంఖ్య గల పద్యం ప్రబంధరాజంలోని 152వ పద్యానికి అనుకరణమని అభిప్రాయపడ్డారు. ఆ రెండింటికీ శయ్య అనే శీర్షిక ఉండటం మాత్రమే పోలిక. అవి రెండూ శైలి నిరూపణకు విషయాలే కాని, ఒకదానికొకటి అనుకరణలు కావు. పద్యశిల్పంలో మాత్రమే కొంత సామ్యం ఉన్నది కాని, తుల్యసంవాదం లేదు. ఒకానొక ఎత్తుగడ ఆదర్శమైనంత మాత్రాన పద్యాలలో బింబప్రతిబింబత్వం ఉన్నదనటం సరికాదు. అట్లాగే, ప్రబంధరాజంలోని 212-వ పద్యానికి సారాలంకారానుప్రాణితైకావళ్యలంకారము అని శీర్షిక. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహములో నుంచి రామకృష్ణయ్య గారు చూపిన సారాలంకారానికి, ఏకావళికి ఉన్న లక్షణలక్ష్యాలతో దానికి ఎటువంటి పోలికా లేదు. ప్రబంధరాజంలోని 192-వ పద్యానికి, కావ్యాలంకార సంగ్రహంలోని (2-63) వ పద్యానికి అజహల్లక్షణము అన్న శీర్షికే తప్ప రామకృష్ణయ్య గారు భావించినట్లు ఎటువంటి పోలికా లేదు. కావ్యాలంకార సంగ్రహంలోని (5-102) వ పద్యానికి, ప్రబంధరాజంలోని 356-వ పద్యానికి ఒకపాటి ఛాయానుసరణమే తప్ప శబ్దానువాదం లేదు. పోలిక ఏ మాత్రం లేని అటువంటి పదహారు పద్యాల సంఖ్యలను నేను రామకృష్ణయ్య గారిచ్చిన పై పట్టికలో నుంచి తొలగించి, ఎంతో కొంత పోలిక ఉన్నవాటిని మాత్రం ఉంచాను.

ఇక, రామకృష్ణయ్యగారు పేర్కొననివీ; కావ్యాలంకార సంగ్రహంలోనూ, ప్రబంధరాజంలోనూ వేర్వేరు శీర్షికలతో ఉన్నందువల్ల పైపైని చూచేవారికి రెండూ పోలిక కలిగినవని స్ఫురింపనివీ అయిన పద్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్నింటి సంఖ్యలను ఈ క్రింద పేర్కొంటున్నాను:

నరసభూపాలీయము ప్రబంధరాజము నరసభూపాలీ. ప్రబంధరాజ. నరసభూపాలీ. ప్రబంధరాజ.
5-70 142 2-75 482 5-113 710
5-101 145 5-181 488 3-76 711
5-133 150 3-61 537 2-161 728
4-63 151 3-55 542 5-106 729
3-102 259 3-63 543 4-81 730
5-102 355 అవతారిక – 61 562 5-169 744
2-117 429 3-41 558 4-89 730
3-39 445 3-380 559 2-20 820
3-101 452 5-13 689 2-20 151
3-36 453 4-67 692 3-37 823
3-41 454 3-148 709
కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామముతోడి పోలికలు
వీరేశలింగంగారు వేంకటకవిని గురించి ఇంకొక విమర్శను కూడా చేశారు. పూండ్ల రామకృష్ణయ్యగారు ఎంతో ఆలోచించి, దానికి కూడా తగిన సమాధానం చెప్పలేకపోయారు. వీరేశలింగంగారి మాటలివి:

ఈ గణపవరపు వేంకటకవి తనకుఁ బూర్వులయిన కవుల కావ్యములలో నుండి గ్రంథచౌర్యమును విశేషముగాఁ జేసినవాఁడయినందున, — తిమ్మకవి గ్రంథముల నుండియు చౌర్యము చేసినాఁడని చూపుటకుఁ దగిన నిదర్శనము లేకపోలేదు. ఇరువుర గ్రంథములలోని యీ పద్యములను జూడుఁడు –

రసికజనమనోభిరామము (4-173) ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (ప. 541)
బింబోష్ఠి యని నీవు పెనఁగ రాదు శుకంబ
        సాంకవగంధి యీ పంకజాక్షి
పంకజాక్షి యటంచుఁ బదరకు తేఁటి చం
        పకజాలనాస యీ పల్లవాంఘ్రి
పల్లవాంఘ్రి యటంచు బాధింపకు పికంబ
        రామాంగి యీ బిసప్రచయబాహ
బిసబాహ యని రాకు వెస నంచ జలద శి
        రోరుహ యీ మహి రోమరాజి
యహిపరోమాళి యంచు డాయకయు నెమ్మి
కార్ముకభ్రూలతిక యీ చొకారపుఁ జెలి
యనుచు శుక భృంగ పరభృత హంస నీల
కంఠ నికురుంబములఁ దద్ద కనలి పలికె.

చక్రస్తని యటంచు జగడించకు శశాంక
        గురుతమోవేణి యీ కుందరదన
మధురాధర యటంచు మట్టుమీఱకు తేఁటి
        చంపకనాస యీ జలజవదన
బిసబాహ యని మాఱు మసలకు రాయంచ
        జలధరచికుర యీ కలువకంటి
పల్లవకర యని త్రుళ్లకు కోయిల
        శ్రీరామమూర్తి యీ కీరవాణి
వదన కుంతల యాన సుస్వర సఖిత్వ
మొనసి యుండుట కతన మీ కిత వొనర్పు
ననుచు నళి చంద్ర పరభృత హంసములకు
భయము నయమునఁ దెలియఁగఁ బలికె మఱియు.

ఈ యుభయులలో నెవ్వఁడు పూర్వుఁడో యాతని పద్యమును జూచి రెండవవాఁడు తన పద్యమునైనను వ్రాసికొనియుండవలెను, లేదా యిరువురును గూడఁ బూర్వమున్న యిటువంటి పద్యమును మఱియొకదానిని జూచియైనను వ్రాసికొనియుండవలెను …

వీరేశలింగంగారు అన్నట్లు వేంకటకవి పద్యానికీ, కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామంలోని పద్యానికీ పోలికలున్నమాట నిజమే. ఇరువురును గూడఁ బూర్వమున్న యిటువంటి పద్యమును మఱియొకదానిని జూచియైనను వ్రాసికొని యుండవలెను అని వీరేశలింగం గారు ఊహించినట్లు – ఇద్దరూ మంచన కేయూరబాహుచరిత్ర (4-160) లోని పద్యాన్ని అనుకరించిన మాటా నిజమే.

రామకృష్ణయ్యగారు ఈ విమర్శను అంగీకరించారే కాని, తగిన సమాధానం చెప్పలేకపోయారు. వారికేమీ తోచలేదు. ‘ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు,’ అని ఇందాక వ్రాసిన వాక్యాన్నే ఇక్కడా పునరుక్తం చేశారు.

వీరేశలింగంగారు, రామకృష్ణయ్యగారు జాగ్రత్తగా చూసినట్లు లేదు కాని, కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజనమనోభిరామంలో నుంచి గణపవరపు వేంకటకవి ఇంకా అనేకపద్యాలను ప్రబంధరాజంలోకి తీసుకొన్నాడు. అవన్నీ స్పష్టమైన అనుకరణలే. ఆ పద్య సంఖ్యలివి:

రసికజనమనోభిరామము ప్రబంధరాజము రసికజనమనోభిరామము ప్రబంధరాజము
2-35 29 2-3 46
4-106 72 1-109 110, 202
1-67 234 6-59 297
3-62 311 1-55, 56 360
2-78 394 3-66 416
3-70 459 2-68 480
2-77, 3-155 503 4-39 518, 520
6-62 542 1-72 564
6-128 608 2-79 669
ఇటువంటివి ఇంకా ఉన్నాయి. వ్యాసవిస్తరభీతి వల్ల ఆ పద్యాలన్నింటిని పేర్కొనటం లేదు.
అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతితోడి పోలికలు
రామకృష్ణయ్యగారు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. వేంకటకవి ప్రబంధరాజంలోని 880వ సంఖ్య గల నమస్కార శబ్దలక్షిత కందద్వయగర్భిత వచనములోని చాలా భాగం అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి కావ్యంలోని (4-213) సంఖ్య గల సీసమాలికను పోలి ఉన్నది. ఆ అనుకరణ ఎలా ఉన్నదంటే, ఒకదానిని చూసి ఒకదానిలోని పాఠాలను సవరించుకోవటానికి వీలుగా ఉన్నది. ఈ రెండు కావ్యాలలోని ఈ పద్యభాగాలూ సాయప వేంకటాద్రి కవి వ్రాసిన సకలజీవసంజీవనములోని (5-22, 5-43) లలో ఉన్న భాగాలను సరిపోలి ఉన్నాయి. కాలానుక్రమణికను బట్టి వేంకటాద్రిని చూసి నారాయణామాత్యుడు, నారాయణామాత్యుని చూసి వేంకటకవి తమతమ రచనలను చేసి వుంటారని ఊహింపవచ్చును. వేంకటకవి అనుకరణ విషయం మాత్రం స్పష్టం. కాదనటానికి వీలులేదు.

రామకృష్ణయ్యగారు ప్రబంధరాజంలో హంసవింశతి కావ్యంలోని ఒక అనుకరణ విషయాన్ని చూశారే కాని, పరీక్షగా చూస్తే ఇంకా అటువంటివి యాభైకి పైగా అనుకరణలున్నట్లు తెలుస్తుంది. రామకృష్ణయ్యగారు జాగ్రత్తగా పోల్చి చూడలేదు. ఒక పోలిక కనబడగానే ఎట్లా సరిపెట్టుకోవాలో తోచక కంగారుపడ్డారనుకొంటాను.

గ్రంథచౌర్యము అనటానికి మనసు ఒప్పుకోదు. ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. అంటూ, ఒకే మాటను ఎన్నిసార్లని వ్రాస్తారు?

హంసవింశతి కావ్యంలో నుంచి వేంకటకవి తీసుకొన్న పద్యాల సంఖ్యలివి:

హంసవింశతి   ప్రబంధరాజం హంసవింశతి ప్రబంధరాజం హంసవింశతి ప్రబంధరాజం
1-9 అవ.13     1-10 ప.14 1-230 ప.8
2-22, (4-98, 5-370) ప.18 2-22 19 2-225 35
5-222 46 2-159 57 3-29 77
5-263 7 3-29 93 5-123 95
5-124 96 5-125, (5-126) 97, 98 5-128 112
1-140 112 4-186 194 1-42 225
3-31 234 4-70 254 5-355 272
1-58, (1-60) 299 2-4 304 4-195 307
2-19 402 5-103 407 2-101 408
2-81 410 2-235 437 5-169 475
1-62 476 4-196 479 3-70 484
5-19 494 4-72 498 5-21 510
3-128 561 5-84 586 4-140 602
3-147 613 2-142 639 5-152, (5-130, -131) 640
1-245 665 1-242 671, 672 2-104 750
1-155 758 4-14 765
ఇవి కొన్ని మాత్రమే. వీటిలో కొన్ని స్పష్టమైన అనుకరణలు. కొన్ని ఒకపాటి అనుకరణలు. మరికొన్ని కేవలం ఆధారప్రాయమైనవి. ఒకటి రెండు ఉదాహరణలను చూపుతాను:

కుందరమా చెలి పొక్కిలి, కందరమావిలసనములు కచముల్ రదముల్
కుంద రమా సమములు నా, కుం దరమా పొగడ నల కుకుందర సుకటిన్. హంస. (2-19)

కుందరమావిలసమున, కుం దరమా చెలి నఖాళి గుఱి నెన్నఁగ నా
కుం దరమా యని యపు డళు,కుం దరమా కొమ గళమునకుం గనుచోటన్. ప్రబంధ. (402)

హంసవింశతి (2-142) ప్రబంధరాజం (ప. 639)
నెఱినొప్పు మేఘసందేశంబు కనుదోయి
        యందమౌ కువలయానంద మరయఁ
బొంకంపు మోము ప్రబోధచంద్రోదయం
        బధరంబు మణిసార మౌర! చూడ
చెలువంపుఁ జిఱునవ్వు సిద్ధాంతకౌముది
        స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబుల కాంతి కావ్యప్రకాశిక
        ఘననితంబము రసాయనము తలఁపఁ
దను వలంకార; మతనుశాస్త్రములు చూపు
లహహ! మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీ వెలఁదిఁ గనిన
విద్యలు పఠింపఁగా నేల విబుధులకును.

తెఱవ నీ తీయవాతెఱ మణిసారంబు
        రమణి నీ నెన్నొసల్ రసతిలకము
పొలఁతి నీ మోము ప్రబోధచంద్రోదయ
        మతివ నీ నవ్వు కావ్యప్రకాశ
మబల నీ చూపుటొయ్యారంబు కౌముది
        కలికి నీ మే నలంకార సరణి
కొమ నీ కనుంగవ కువలయానందంబు
        మగువ నీ చందోయి మంజరి గతి
నెలఁత నీ కొప్పు మేఘసందేశ మయ్యె
గలికి నినుఁజూచినంతనె కలుగు నతను
విద్య రసికుల కెల్ల నుర్వీస్థలమును
గాఁగ నినువంటి జాణ కీ ఖలుఁడు దగునె.

పైని పద్యాలలోని పోలికలు స్పష్టమే కనుక ఇంతకంటె విస్తరించి వివరింపవలసిన ఆవశ్యకత ఉండదు.
కట్టా వరదరాజు శ్రీరంగమాహాత్మ్యము తోడి పోలికలు
కట్టా వరదరాజు రచించిన ద్విపద రామాయణము పీఠికలో నిడుదవోలు వేంకటరావుగారు వరదరాజు రచించిన మరొక కావ్యం శ్రీరంగమాహాత్మ్యములో నుంచి గణపవరపు వేంకటకవి ఒక పద్యాన్ని అనుకరించాడని చెబుతూ, దానిని ఉదాహరించారు:

ఎకతాళంబున వీరమద్దెళరవం బేకంబుగా నట్టువాల్
ధికతో తొత్తక ఝంకు ఝంకుకిణతాంధిత్తాంగినాలోధికం
ధికతత్తెయ్యది ధిక్కుధిక్కుధికతా ధిత్తాది తాళంబులున్
కకుబంతంబులు మారుఁబల్కుకొన గోల్గశ్యందము న్నాడఁగన్. శ్రీరంగ. (4-161)

ఎకతాళంబున వీరమద్దెళరవం బేకంబుగా నట్టువుల్
ధికతోం తత్తక ఝంకు ఝంకుకిణతాంధిత్తాం కియల్లో ధికు
ద్ధికు తెత్తెయ్య ధిమిక్కుతక్కుధిగుతాం ధిత్తాత్త తాళంబులన్
గకుబంతంబులు మారుఁబల్కుకొను గో … ల్పట్ట నప్పట్టునన్. ప్రబంధ.

వరదరాజు పద్యాన్ని వేంకటకవి పూర్తిగా అనుకరించిన మాట స్పష్టమే. అయితే, వేంకటరావుగారు చూడని విషయం ఏమంటే, ప్రబంధరాజంలో వేంకటకవి వరదరాజు కృతులనుంచి గ్రహించిన పద్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. కనీసం పది – పన్నెండు పద్యాలున్నాయి. ప్రబంధరాజంలోనే గాక ఒక పద్యం వేంకటకవి సర్వలక్షణశిరోమణి లోనూ ఉన్నది. దానిని చూడండి:

శ్రీభరిత కుండల కిరీ
టాభా ధగధగిత మందహాస కపోల
శ్రీభరణ రమాకుచకల
శాభోగ విలాస వేంకటాచలవాసా. (శ్రీరంగమాహాత్మ్యము)

శ్రీభామా నర్మోక్తి క
థాభవ నిజమందహాస ధాగధగశ్రీ
శోభిత శుభ తత్కుచకుం
భాభోగకిలాస వేంకటాచలవాసా. (సర్వలక్షణశిరోమణి)

వీటిని బట్టి, గ్రంథచౌర్యము చేయువాఁడు అని నిశ్చయించటం సులభం. ప్రబంధాలను చదివి, దేనిలో నుంచి దేనిని తీసుకొన్నాడో గుర్తుపట్టగలిగితే చాలు. ప్రబంధయుగమున కంతటికిని చెడ్డపేరు తెచ్చినవాఁడు అని ముద్రవెయ్యటానికి పెద్ద ఆలోచన అక్కరలేదు. ఆవేశంలో వీరేశలింగంగారు ఆ పనే చేశారు. పైగా, కవి మితిమీరిన గొప్పలకు పోవటం ఆయనకు నచ్చలేదు. దానితో తీవ్రనిందలకు పాల్పడ్డారు.

ఒక సమర్థుడైన కవి ఇట్లా ఎందుకు చేశాడు? అని స్తిమితంగా ఆలోచించటానికి ఎంతో సహృదయత కావాలి. నిందవేయటం సుళువు. రామకృష్ణయ్యగారు సహృదయంతో ఆలోచించారు కాని, వారికి సముచితమైన సమాధానం తోచలేదు. ఒక నిర్ణయానికి రాలేకపోయారు. కారణ మెయ్యెదియో విచారింపుఁడు అని సవినయంగా సూచించి, అంతటితో వదిలివేశారు. ఆ తర్వాతి విమర్శకులు ఆ మాత్రమూ ఆలోచింపలేదు. గణపవరపు వేంకటకవి కృతులపై పరిశోధన చేసినవారూ పరిశీలింపలేదు.

లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా?
ఇది ఇంకొక చిక్కు సమస్య. గణపవరపు వేంకటకవి రచన లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా? బహుజనపల్లి సీతారామాచార్యుల వారు లక్షణ గ్రంథము అన్న సంగతిని ఇందాక ఉదాహరించాను. 1892 ఆగస్టు 1వ తేదీనాడు అముద్రితగ్రంథచింతామణికి అనుబంధంగా ప్రకటించిన ఒక విడి పీఠికలో పూండ్ల రామకృష్ణయ్యగారు మరొక విధంగా ఆలోచించారు:

… ఇక్కవి తానొక లక్షణగ్రంథమును వ్రాయఁ దలపెట్టి ము న్నిదివఱకే యిద్దరు లాక్షణికులు లక్ష్యలక్షణముల వ్రాసియున్నను లక్ష్యములగు పద్దియములు నరస్తుతులని యెంచి వానిని నోరగ్రుచ్చ మనము రాక తాను మరలఁ గ్రొత్త లక్ష్యములగు పద్యములను మాత్రము వ్రాసి, దానిని శ్రీ వేంకటేశ్వరస్వామికి నంకితం బిచ్చి యీ గ్రంథమును వ్రాసియున్నాఁడు. ఇది కవి యభిప్రాయము గానినాఁడు తాఁ దిరుగ లక్షణమును గ్రంథమునందు వ్రాసియే యుండును. కాఁబట్టి యీ గ్రంథమందుండు పద్యముల కన్నిటికి లక్షణమిది యని కవియే వ్రాసియున్నాడు గాని, యా లక్షణమును వివరించియుండలేదు. కాన మఱియొక గ్రంథమునుంచి లక్షణమును దెలసికొని యిందలి లక్ష్యమును గ్రహించవలయును.

వారికి గణపవరపు వేంకటకవి సర్వలక్షణశిరోమణి విషయం తెలియదు. ఆ రచన అప్పటికింకా బయటపడలేదు. సర్వలక్షణశిరోమణిలో నిర్దిష్టమైన లక్షణానికే ప్రబంధరాజంలో లక్ష్యకల్పన జరిగి ఉండవచ్చునన్న ఊహ వారికి రాలేదు. లక్షణగ్రంథం కాదని, లక్ష్యగ్రంథం మాత్రమేనని మాత్రం ఊహించారు.

1953లో అచ్చయిన, మధుర తంజావూరు రాజుల నాటి దాక్షిణాత్యాంధ్ర సాహిత్యములో నేలటూరి వేంకటరమణయ్యగారు వేంకటకవిని గురించి వ్రాస్తూ, లభించిన గ్రంథములలో నితని ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము గొప్పది. అదియు నమూల్యమైన లక్షణగ్రంథమే కాని, తన్మూలమున నతని కవితాశక్తిని కొంతవఱకు గనుగొనవచ్చును – అని, మరొక్కసారి ఇది లక్షణగ్రంథమన్న భావాన్ని పునరుద్ధరించారు. నిజానికి ప్రబంధరాజంలో లక్షణ నిర్వచనాలు లేవు. వేంకటరమణయ్యగారు పొరబడ్డారనే చెప్పాలి. అందులో నానావిధములైన లక్షణాలకు లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి. కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూల వస్తుకృత వస్తుధ్వని, ప్రాసభేదము, సంస్కృత విభక్త్యంతప్రయోగము అని శీర్షికలు ఉన్నంతమాత్రాన అది లక్షణనిర్వచనం ఎందుకవుతుంది? లక్ష్యరచనమనే చెప్పాలి. అందుకే చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవితరంగిణి పన్నెండవ సంపుటంలో దీనికి సమాధానం వ్రాయవలసివచ్చింది: ‘…ప్రతిపద్యము నొక యలంకారమునకో చిత్ర, బంధ కవిత్వము లక్షణముతోఁ గూడిన యొక వృత్తమునకో లక్ష్యముగా రచించుచు వచ్చినాఁడు. అందుచే నిదియొక లక్ష్యగ్రంథమని నుడువవచ్చును.’

ఏకాశ్వాసం ఎందుకున్నది?
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో ఒక్క ఆశ్వాసం మాత్రమే ఉన్నది. పద్యసంఖ్య తక్కువేమీ కాదు. దీని విషయమై ఆలోచించి, పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ విధంగా వ్రాశారు:

ఆంధ్ర ప్రబంధములలో నాశ్వాసము లనియు నుచ్ఛ్వాసము లనియు నుల్లాసము లనియుఁ దరంగములనియు నంశములనియు ననేకవిధములుగాఁ బ్రతికృతియు విభజింపఁబడియున్నది గాని యీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము వలె గ్రంథమునంతయు నేకాశ్వాసముగా విరచింపఁబడినది యిదివరకు దృష్టిగోచరము గాలేదు. అనేక వ్రాఁతప్రతులఁ జూచితిమి గాని యెన్ని ప్రతులఁ జూచినను నేకాశ్వాసమనియే వ్రాసియున్నది. ఈ గ్రంథమునందు 882 పద్యము లున్నయవి. ఇన్ని పద్దియములను నొక యాశ్వాసమని చెప్పుటకంటే వీని విభజించి వ్రాసి యొండినఁ జదువువారలకుఁ గొంత గ్రుక్కఁద్రిప్పుటకు వసతి గలిఁగియుండును. ఇట్టి వసతి నిసుమంతైన నిక్కవి గల్పించినవాఁడు కాఁడు. కారణమెయ్యెదియో విచారించుకొనుఁడు.

ద్వితీయ ముద్రణ పీఠికలో వేదము వేంకటరాయశాస్త్రి గారన్నారు:

ఈయన కావ్యములో యక్షగాన రచనా ప్రక్రియలు చాలా గలవు. వట్టి కావ్యము గాక, చిత్రకావ్యమును గాక, సంగీతకావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది. కాఁగా, వానివలెనే, కవి దీనిని ఏకాశ్వాసముగా వ్రాసెనేమో. ఇది నృత్యనాటికగా కూడ కొద్దిమార్పులతో ఆడదగినదిగా కనబడుచున్నది. హరికథాకాలక్షేపమునకు చాల తగియున్నది. సంగీతవిషయముల నెన్నిటినో కవి యిందు చేర్చియున్నాడు.

ఇవన్నీ తెరనాటకమన్న ఊహతో వ్రాసిన మాటలు. అంతగా పట్టించుకోదగినవి కావు.

ఇన్ని అనుకరణలు ఎందుకు?
ప్రబంధరాజంలో ఇన్నిన్ని పూర్వాంధ్రకృతుల అనుకరణలు ఎందుకున్నాయి? అందువల్ల గ్రంథచోరుడన్న విమర్శ సరైనదేనా? ఆఖరికి తనను గురించి తాను చెప్పుకోవలసి వచ్చినప్పుడు, నవగ్రహ నవరత్న నవనిధి నవరస ప్రతిపాదక ప్రతాప సత్కీర్తి సీసము అన్న తన కీర్తిని ప్రతిపాదిస్తున్న అవతారికలోని 31వ సంఖ్య గల పద్యాన్ని సైతం దామెరల వేంగళనాయకుని బహుళాశ్వ చరిత్రము లోనుంచి తీసికొన్నాడు. ఆ పద్యాలను కూడా చూడండి:

పద్మాప్త విద్రుమప్రభఁ గరుణఁ గని హి
        మకరత శృంగారమహిమ వెలసి
ఘన నీల గురుమణి ఖగ రౌద్రతను గేరి
        శంఖజ కవుల హాస్యంబుఁ జేసి
క్ష్మాజ విదూరజౌఘ ముకుంద భయమిడి
        కృత వజ్రవర తమఃస్థితి శమమయి
బుధ పుష్యరాగ సాద్భుత కచ్ఛఁ బరఁగించి
        భా నీల కుంద బీభత్సమందఁ
దగి మహాపద్మ గోమేధిక గరిమ హర
వీరకేతు ద్యుతి జయించి వేఱు వేఱ
నీ ప్రతాపంబు సత్కీర్తి నెగడె నౌర
యప్పయామాత్య కవి వేంకటార్య వర్య. ప్ర. 31

పద్మరాగార్క ప్రభా భయానక మయి
        హిమకర తారాద్భుతము ఘటించి
నీలాప్త గురుచక్ర నిభ రౌద్రగతి మించి
        శంఖ వజ్రోత్త మోజ్జ్వలత నవ్వి
విద్రుమాళి ముకుంద వీరకేతువు మీఱి
        కుంద తారామంద కోప మూని
రక్తాంగ వర పుష్యరాగ బీభత్సమై
        కవి విదూరజ సూత్ర కచ్ఛపాసి
వక్త్రరుచులను గరుణించి వసుధ వెలయు
తన ప్రతాప యశంబులఁ దనరు విబుధ
నుత మహాపద్మ గోమేధిక తరళ స్ర
గంగ శృంగారుఁ డగు వేంకటాద్రివిభుఁడు. బహు. (1-44)


ఈ విధంగా అనుకరణను కవి ఎందుకు చేశాడు? ఇది లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా? ఈ ప్రశ్న లన్నిటికీ సమాధానం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో 63వ సంఖ్య గల అవతారికలోని వక్ష్యమాణ లక్ష్య విశేషోద్దేశ వచనము అన్న వచనంలో వేంకటకవి స్పష్టంగానే చెప్పాడు. విమర్శకులు ఆ దృష్టితో చూడకపోవటం వల్ల సాహిత్యచరిత్రలోని ఒక అపురూపమైన విశేషం మరుగునపడిపోయింది. ఇంతకీ, ఆ వచనం ఇది:

వ. అంకితంబుగాఁ బంకజాసనవిలాసినీకరాంచలమణివిపంచికా ఘుమఘుమార్భటీ నిర్భరసుధాప్రాదుర్భవాస్పద నవరససందర్భంబు గుబాళింప విభవంబులకుఁ బ్రభవంబును, విద్యాధికులకు హృద్యంబును, విన్నాణంబులకుఁ జెన్నును, వింతలకుఁ బొంతనంబును, విటవిటీజనంబులకుఁ బుటపుటయును, విరహులకు మెఱమెఱయును, వీటికి నీటును, శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనుల కునికియును, నుక్తాత్యుక్తాదిగాఁ గల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, గావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును, సకలాలంకారమ్ముల కలంకారమ్మును, లక్షణసారసంగ్రహ సరస్వతీవిలాస సాహిత్యచింతామణి సత్కవిజనసంజీవని భీ మానంత చ్ఛందోముఖాద్యష్టాదశ లక్షణంబులకు లక్ష్యంబును, రేఫ ఱకార నిర్ణయమ్మును, అమ రామరశేష విశ్వ శాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతికా కార నానార్థరత్నమాలికా కార హలాయుధ భాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంగ జయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతి వివిధ నిఘంటుపదమ్ములకుఁ బదమ్మును, షష్టివిధ యతిచమత్కారమ్ముల కాధారమును, చతుర్వింశతి ప్రాసమ్ముల కావాసమ్మును, ప్రౌఢికిఁ బ్రౌఢియును, దేఁటకుఁ దేఁటయును, జిరంతనాంధ్రప్రబంధజాలంబుల కాలవాలంబును, సనాతనవిద్వత్కవి రచనావిధంబునకు ఘంటాపథంబును, నిదానీంతనసత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబును, మూఢజాతులకు బోధహేతువును, బ్రౌఢతతికి సమ్మతియును, సర్వజననికరంబున కాశ్చర్యకరంబును, బహువిధాచుంబిత కవితాచమత్కృతికి వసతియును, నగ రార్ణవ శై లర్తు చంద్ర సూ ర్యోద్యాన మంత్ర దూత్య ప్రయాణ రణ నాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాధారంబును, నన్యానధీన సుధీ నవనవస్తవ్య సర్వపథీన పాండితీమండితచమత్కారంబుగా నా రచియింపం బూనిన రసికజనహృదయోల్లాసం బైన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో విమర్శకులు గుర్తింపని రహస్యం ఇదే: ఇది చిరంతనాంధ్ర ప్రబంధజాలంబుల కాలవాలంబు!

చిరంతనాంధ్ర ప్రబంధజాలంబుల కాలవాలంబు అంటే, సంకలన గ్రంథం అని అర్థం. ఆదికాలం నుంచి తెలుగులో వెలసిన ప్రబంధాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట.
ఇది ఇదానీంతన సత్కవినికాయంబునకు సహాయంబు. అంటే నేటి అభ్యాసకులకు సహాయకగ్రంథం (Guide Book) వంటిదన్నమాట. దీని సాయంతో కవులు తెలుగు కవితారీతులను అభ్యసింపవచ్చునన్నమాట.
అంతే కాదు. ఇది భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబు. రాబోయే తరాలవారికి పాఠ్యగ్రంథం (Text Book) వంటిది. దీనిని చూసి విద్యార్థులు కవిత్వకళను నేర్చుకోవలసి ఉంటుంది.
ఇది నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబు. అందువల్లనే తెలుగువారు నేర్చుకోవలసిన సంస్కృతశ్లోకాలు, శ్లోకానువాదాలు దీనిలో ఉన్నాయి. అష్టభాషాసీసంలో షడ్విధప్రాకృతా లున్నాయి. వీటిని నేర్చుకోవటం వల్ల ఆ భాషలలోని విశేషాల పరిచయం తప్పక కలుగుతుంది.
ఈ గ్రంథాన్ని అధ్యయనించే విద్యార్థులు కావ్యాలంకారచూడామణి, కావ్యాలంకారసంగ్రహం, కువలయానందం, చంద్రాలోకం వంటి గ్రంథాలలోని లక్షణప్రకరణాలను, లక్షణసారసంగ్రహం మొదలుగా ఉన్న అష్రాదశచ్ఛందోగ్రంథాల లక్షణాలను గుర్తుంచుకొని, వాటికి లక్ష్యాలను ఈ గ్రంథంలో అన్వేషించాలి. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి నుంచి, మూర్తికవి కావ్యాలంకారసంగ్రహం నుంచి గ్రంథచౌర్యం చేయాలనే ఉద్దేశం ఉన్నవాడు తన గ్రంథం కావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును అని చెబుతాడా? లక్షణ సమన్వయాన్ని నేర్చుకోవటం కోసమే దీనిని చదవాలన్నమాట.

ఇది శబ్దశాస్త్రరీతికి విఖ్యాతి; ధ్వనులకు ఉనికిపట్టు. అచుంబితమైన కవితాచమత్కృతికి వసతిగృహం. రసికజనులకు హృదయోల్లాసకరం.

ఇంకొక చమత్కారం: ఉక్తాత్యుక్తాదిగాఁ గల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, అమ రామరశేష విశ్వ శాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతికా కార నానార్థరత్నమాలికా కార హలాయుధ భాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంగ జయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతి వివిధ నిఘంటుపదమ్ములకుఁ బదమ్మును అన్న వాక్యశకలాలను వేంకటకవి అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి (3-128) లోని పండితపరిశ్రమ వచనంలో నుంచి తీసికొన్నాడు. నారాయణామాత్యునికి, వేంకటకవికి ఈ చతుర్వింశతి నిఘంటువులు ఎక్కడ దొరికాయో తెలియదు. సంప్రదాయజ్ఞులు అధ్యయనీయ నిఘంటువులు ఇరవై ఆరు (షడ్వింశతి) అని చెబుతారు. యతిప్రాసల ప్రస్తావనను కూడా వేంకటకవి హంసవింశతిలోని ఆ వచనంలో నుంచే గ్రహించి, సర్వలక్షణశిరోమణిలో చెప్పిన తన మతానుసారం షష్టివిధ యతిచమత్కారమ్ముల కాధారమును, చతుర్వింశతి ప్రాసమ్ముల కావాసమ్మును అని పెంచి చెప్పాడు. నగ రార్ణవ శై లర్తు చంద్ర సూ ర్యోద్యాన మంత్ర దూత్య ప్రయాణ రణ నాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాధారంబును అని పేర్కొన్న వర్ణనల వివరాలను దండి కావ్యాదర్శం (1-16, 17) లో నగరార్ణవ శైలర్తు చన్ద్రోదయ వర్ణనైః, ఉద్యాన సలిలక్రీడా మధుపాన రతోత్సవైః, విప్రలమ్భై ర్వివాహైశ్చ కుమారోదయవర్ణనైః, మన్త్ర దూత్య ప్రయా ణాజి నాయకాభ్యుదయై రపి అని ఉన్న చోటినుంచి స్వీకరించాడు.

వేంకటకవి ప్రణాళిక: ముఖ్యసూత్రాలు
వేంకటకవి కృతి సంకలన గ్రంథం అన్నంత మాత్రాన అది ప్రబంధరత్నాకర శార్ఙ్గధర సంహితాదుల వంటి సంకలనగ్రంథం అని పొరబడకూడదు. ఇదానీంతనసత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబును, మూఢజాతులకు బోధహేతువును, బ్రౌఢతతికి సమ్మతియును, సర్వజననికరంబున కాశ్చర్యకరంబును అని ఆయన చెప్పిన ఈ అపూర్వమైన ప్రయత్నంలో ఆయన ప్రణాళిక ఎటువంటిదో తెలుసుకొంటే గాని, అందులోని కీలకం పాఠకులకు స్ఫురింపదు. ఆ ప్రణాళిక నాలుగు విధాలుగా ఉంటుంది:

మొదటిది: ఇతివృత్తస్వీకారం

ఇందులో ఇతివృత్తం నామమాత్రం. తాను లక్ష్యాలుగా నిరూపింపదలచిన లక్షణాలు ఇమడగల ఒక సూక్ష్మవిషయాన్ని ఆలంబనగా గ్రహించి, కావ్యాన్ని సకలవర్ణనాపూర్ణంగా రూపొందించటమే కవి ఆశయం. ప్రధానేతివృత్తంలో చేర్చేందుకు వీలులేని వర్ణనలను లక్షణవిరోధం వాటిల్లకుండా ఆనుషంగికమైన నాగదత్తోపాఖ్యానంలో చొప్పించే ప్రయత్నం చేశాడు.

రెండవది: బింబకల్పన పద్ధతి

ఇతివృత్తాన్ని నిర్ణయించికొన్న తర్వాత, కవి తన గ్రంథంలో చేరతగిన శ్లోకాలను, పద్యాలను – అన్నిటినీ మొదట ఒక క్రమంలో కూర్చుకొన్నాడు. ఆ పద్యాలను యథాతథంగా ఒకచోట, పర్యాయపదాలతో ఒకచోట, రెండు మూడు పద్యాలను కలిపి ఒకచోట, ఛందస్సులను రూపాంతరితం చేసి కొన్నిచోట్ల, అనువాదాలు చేసి కొన్నిచోట్ల, అనువాదకల్పంగా మరొక చోట పరిపరివిధాల మార్చి వ్రాశాడు. ఇందులో ఎన్నో ప్రతీకలను కల్పించాడు.

మూడవది: రచయితృ నామత్యాగం

ఈ వ్యాసంగానికి మూలమైన పద్యాన్ని వ్రాసిన కవి పేరు గాని, ఆ కావ్యం పేరు గాని ఇందులో చెప్పబడవు. ఆ కృషిని పాఠకులే పూనుకొని చేయాలి. అనువాదం ఉన్నప్పుడు పద్యాన్ని మూలంతో సరిపోల్చి, బాగోగులను తెలుసుకోవాలి. శీర్షిక మాత్రమే ఇవ్వబడినప్పుడు ఆ పద్యానికి మూలాన్ని గుర్తించటమే గాక, ఆ శీర్షికలోని లక్షణంతో లక్ష్యాన్ని సమన్వయించటం నేర్చుకోవాలి.

ఈ విధమైన కృషివల్ల అధ్యేతలకు లక్షణ లక్ష్య పరిజ్ఞానం అలవడుతుంది. దీనిని కంఠస్థం చేసినకొద్దీ వందలకొద్దీ కావ్యాలలో నుంచి ఎన్నికైన మంచి మంచి పద్యాలు, పద్యభాగాలు పట్టుబడతాయి. అలంకారాలు, వివిధ పద్యశైలులు అలవడతాయి. ప్రౌఢికి ప్రౌఢి, తేటకు తేట. ఒక్కొక్క పద్యభావాన్ని గ్రహించి, అది ఏ పద్యానికి పర్యాయంగా నిలపబడిందో గుర్తించటం వల్ల బుద్ధికి సూక్ష్మగ్రాహిత కలిగి, నైశిత్యాన్ని పొందుతుంది. ధారణ వృద్ధి చెందుతుంది. ఏది ఏ కవి పద్యమో, ఏ పద్యం ఏ కావ్యం లోనిదో కనుగొనటం మూలాన మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. కొన్ని మారుమూల కావ్యాలను ఎక్కడెక్కడి నుంచో సంపాదించి, చదివి అర్థం చేసికొని, అందులోని ప్రతీకలను గుర్తించటం విద్యార్థులకే కాక విద్యాధికులకు కూడా కష్టమైన పనే. అందుచేతనే అటువంటి కృషి విద్యాధికులకు హృద్యంబు అని కవి అన్నాడు. అది మూఢతతికి బోధహేతువు కూడానట.

నాలుగవది: ఆశ్చర్యజనకత్వం

ఈ ప్రకారం ఒక్కొక్క పద్యాన్ని గుర్తుపట్టడం ఒక ఎత్తయితే, దానిని లక్షణంతో సమన్వయింపగలగటం సులభకార్యం కాదు. ఒక్కొక్కప్పుడు మనము చదివిన పద్యమే పర్యాయాలతో కల్పితమైనందువల్ల కనుచూపు జారిపోతుంది. ఎంతో ప్రసిద్ధమైన పద్యాలు కూడా ఛందస్సును మార్చేసరికి వింతరూపును సంతరించుకొంటాయి. ఎంత ఆలోచించినా స్ఫురణకు రావటం కష్టం. వాటిని మనము ప్రయత్నించి గుర్తుపట్టినప్పుడు, ఇంత స్వల్పవిషయాన్ని కనుక్కోలేకపోయానే, కవి యెంత మోసం చేశాడో కదా అని ఆశ్చర్యం కలుగుతుంది. అందుచేతనే వేంకటకవి దానిని సర్వజననికరమ్మునకు ఆశ్చర్యకరంబు అన్నాడు.

ఈ విధంగా శిక్షాప్రణీతమైన అపూర్వ చిత్రకావ్యంలోని కొన్ని పద్యాలను, వాటి మౌలికరూపాలను – ఈనాటి దాకా అభిజ్ఞేయాలుగా ఉన్న వాటిలో కొన్నింటిని పరిశీలించటం మిగిలి ఉన్నది. ఆ పని రెండవ ప్రకరణంలో చేద్దాము.
---------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: