Wednesday, April 24, 2019

వేంకటంలో కొండలరాయడు


వేంకటంలో కొండలరాయడు




సాహితీమిత్రులారా!
(వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్ వ్రాసిన గాడ్ ఆఫ్ ది హిల్: టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి పుస్తకపు మలిపలుకు అనువాదం)

1. తిరుమల కొండలు
తిరుపతి పట్టణపు సారవంతమైన లోయలో నుండి చూస్తే ప్రస్ఫుటంగా కనబడే దృశ్యం మైళ్ళ కొలది విస్తరించుకొని ఉన్న తూర్పు కనుమల పర్వతశ్రేణి. ఉదయసంధ్య వేళలో, ఆ పర్వతశ్రేణి బూడిద రంగుతో కూడిన అరుణిమతో వెలుగుతుంది; మధ్యాహ్నవేళకు, అది ఊదారంగు లోకి మారుతుంది; రాత్రి వేళ, కొండశిఖరం పైన కళ్లు మిరుమిట్లు గొలిపే దేవాలయ కాంతిదీపాలే కాక, పాములా మెలికలు తిరుగుతూ కొండ పైకి సాగే సోపానమార్గంపై మిణుకుమిణుకుమనే దీపాల కాంతులు కూడా మనను పలకరిస్తాయి. ఆ విధంగా తిరుపతి పట్టణంలో ఎక్కడ ఉన్నా మనను ఆ కొండలరాయని ఉనికి శాసిస్తున్నట్టుగా తిరుమల కొండల రూపంలో ప్రత్యక్ష్యమౌతుంది.

ఈ రాయడు ఇక్కడ ఎంతో కాలం నుండే ఉన్నట్టు మనకు తెలుసు. క్రీస్తుశకపు తొలి శతాబ్దానికి చెందినట్టుగా చెప్పుకునే సంగ వాఙ్మయంలోనే వేంకట పర్వతం తమిళ ప్రాంతాలకు ఉత్తర సరిహద్దుగా వర్ణించడం కనిపిస్తుంది. ఆ కాలానికే ఈ కొండలపై ఏదో ఒక రూపంలో ఇక్కడ ఒక దేవతామూర్తి వెలసినట్టుగా మనం ఊహించవచ్చు – బహుశా పురాణాల్లో వర్ణించినట్టుగా ఇక్కడి తొలిరూపం వరాహమూర్తి రూపం కావచ్చు. అయితే, తొలి సహస్రాబ్ధి కాలంలో వెలుబడిన ‘చిలప్పదికారం’ కాలానికే వేంకటం పై ఉన్న దైవం విష్ణురూపాన్ని సంతరించుకున్నదని తెలుస్తుంది.

వీంగు నీర్ అరువి వేంగడం ఎన్నుం
ఓంగు ఉయర్ మలైయత్తు ఉచ్చి మీమిసై
విరి కదిర్ ఞాయిఱుం తింగళుం విళంగి
ఇరు మరుంగు ఓంగియ ఇడైనిలైత్ తానత్తు

మిన్నుకోడి ఉడుత్తు విళంగు విల్ పూండు
నల్ నిఱ మేగం నిండ్రదు పోల

పగై అణంగు ఆళియుం పాల్ వెణ్ సంగముం
తగై పెఱు తామరైక్ కైయిన్ ఏంది
నలం కిళర్ ఆరం మార్బిల్ పూండు
పొలం పూ ఆడైయిన్ పొలిందు తోండ్రియ
సెఙ్ కణ్ నెడియోన్ నిండ్ర వణ్ణముం (చిలప్పదికారం 11:41-51)

(తెలుగు సేత)
దూకే నీటి జలపాతం
విచ్చే సూర్య చంద్ర కిరణరాశి
ఇరుప్రక్కల ఒగి వెలుగగ
మధ్యన తానే నిలిచె
వేంకటం అను ఉత్తుంగ పర్వత శృంగమ్ము!

తటిల్లత మెరుపులు
హరివిల్లు తళుకులు
నడుమ క్రొక్కారు మేఘమ్ము వోలె
ఆ వేంకటపు కొండ

ఆ శృంగమ్ముపై
అరిభంజన చక్రమ్ము, శ్వేత శంఖమ్ము
కరకమలమ్మున చేబూని
సువర్ణపుష్పాలంకార భూషితుడైన
రోహితాక్షుని దివ్య సుందర విగ్రహమ్ము

ఈనాటికీ ఈ దైవం నల్లని రాతివిగ్రహంతో, శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజాలతో, తోమాలసేవతో నిండిన పుష్పాలంకరణతో సువర్ణ కిరీటధారియై మనకు కనిపిస్తాడు. దాదాపు ప్రతి యేటా రెండు కోట్ల భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారని అంచనా. ఫలితంగా, తిరుపతి దేవాలయం భారతదేశం లోకెల్లా అత్యంత సుసంపన్న దేవస్థానంగా, ఈ దేవస్థాన సంస్థ (తితిదే) వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థగా రూపొందింది. ఈ దేవాలయ ఆర్థిక సంపన్నత 15వ శతాబ్దం వరకే అతి ఘనమైనదిగా మనకు శాసనాలు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఒక చిన్న దేవాలయం నుండి అత్యంత సుసంపన్న దేవస్థానంగా ఈ దేవళం పెరగడాన్ని వివరించే సంక్లిష్ట చరిత్రపై మనకింకా స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఒక్క విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు: ఈ దేవాలయానికి, ఇక్కడి స్థానిక తెలుగు, తమిళ రాజుల ప్రాభవానికి ప్రాచీన కాలం నుండి అవినాభావ సంబంధం ఉంది. ఈ దేవాలయాన్ని ఉత్తరాన తొండైమాన్ చక్రవర్తులకు, దక్షిణాన చోళ రాజులకు ప్రధాన పుణ్యక్షేత్రంగా చెప్పుకునే సంప్రదాయం ఉంది. అయితే, శ్రీవైష్ణవ సిద్ధాంతకర్త అయిన రామానుజాచార్యులు ఈ దేవాలయపు సంస్థాగత నిర్మాణంలోనూ, మతతాత్త్విక ధృక్పథంలోను ఎనలేని మార్పులకు దోహదకర్త అయ్యాడని మనకు లభ్యమవుతున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు.

ఈ దేవాలయపు మత తాత్త్వికత మొదట్లో పురుష ప్రాబల్యం గల వైఖానస సాంప్రదాయానికి చెందినదిగా ఉండేది. ఆ తరువాత పాంచరాత్ర ఆగమ విధానాల ప్రభావంతో స్త్రీ రూపమైన అమ్మవారికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. నేడు అమ్మవారు వేంకటేశ్వరుని ముద్దుల సతిగా తిరుపతిలో పద్మావతి గాను, అలమేలుమంగ (తమిళం: అలర్ మేల్ మంగ) గానూ మనకు దర్శనమిస్తుంది. అయితే, ఆమెకు కొండ పైన తిరుమలలో స్థానం లేదు. ఆమె దేవాలయం కొండ దిగువ మంగాపురంలో ఉంది. ప్రతిరోజు రాత్రి వేంకటేశ్వరుడు తిరుమలనుండి మంగాపురం వరకూ ఉన్న పధ్నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తాడని, ఆపై తెల్లవారే లోగా తిరిగి పైకి వెళ్తాడని భక్తుల కథనం. అందుకే ప్రతిరోజు ప్రభాతసేవలో స్వామివారికి రాత్రి నడకతో అరిగిన పాదరక్షలను తొలగించి కొత్త పాదుకలను సమర్పిస్తారు.

తాళ్ళపాక కుటుంబం నివాస స్థానం కూడా మంగాపురమే. పదిహేనవ శతాబ్దం ప్రథమార్థం నుండీ అన్నమయ్యతో ప్రారంభమైన తాళ్ళపాక కుటుంబసభ్యుల ప్రభావం ఈ దేవాలయ చారిత్రక పరిణామంలో మరో మలుపు.

2. కోవెలలో వాగ్గేయకారుడు
నేడు మనం చూస్తున్న తిరుపతి ప్రాభవం దాదాపు ఆనాటికే అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తుంది. అన్నమయ్య పదాల్లో తిరుమల రాయడు ఆత్మీయుడైన దైవంగా, భక్త సులభుడుగా, శరణాగత వత్సలుడుగాను, అప్పటి దేవాలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన సుసంపన్నమైన ధార్మిక సంస్థలా మనకు గోచరిస్తాయి. ముప్ఫైరెండు వేల పద సంకీర్తనల రచనతో అన్నమయ్య పాటల ద్వారా భగవదర్చన చేసే కొత్త భక్తి సంప్రదాయాన్ని తిరుమలలో ప్రవేశపెట్టాడు. మనకు ఇప్పుడు లభ్యమౌతున్న కృతుల ద్వారా తెలుగు సాహిత్యంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రజా సాహిత్య సృష్టికి దాదాపు ఆద్యుడని చెప్పుకోవచ్చు.

అయితే, తెలుగు సాహిత్య ప్రపంచానికి సంబంధించినంతవరకూ అన్నమయ్య ఒక అజ్ఞాత ద్వీపం లాంటివాడు. తెలుగు సాహిత్య సంప్రదాయంలో అన్నమయ్య ప్రస్తావనే ఎక్కడా కనిపించదు. అంతేకాక ఎంతో గొప్ప సంగీత నిధిని వదిలివెళ్ళిన అన్నమయ్య గురించి పూర్వ సంగీతశాస్త్రవేత్తలు, సంగీతకారులు కూడా ఎక్కడ ప్రస్తావించ లేదు. మధ్యయుగపు తెలుగు వైయాకరణులు, కావ్యాలంకారికులు కూడా అన్నమయ్య సాహిత్యాన్ని ఎక్కడా ఉదహరించలేదు. సంప్రదాయ సాహిత్యవేత్తలు చేసిన సాహిత్య శాఖల విభజనలో ఏ శాఖలోనూ పూర్తిగా ఇమడని సాహిత్యం అన్నమయ్యది. అయినా, పదసంకీర్తనా సాహిత్యంతో తెలుగులో కొత్త సాహిత్యమార్గాన్ని ప్రవేశపెట్టి, ఆపై తెలుగు, తమిళ దేశాల్లో కర్ణాటక సంగీత వాగ్గేయకారులకు మార్గదర్శకుడయ్యాడు ఆయన.

ఇంకా అన్నమయ్య గురించి మరింత మాట్లాడే ముందు, అన్నమయ్య విలక్షణమైన బాణిలో తన సొంత గొంతుక వినిపించే ఈ పదాన్ని పరిశీలిద్దాం:

ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ కాలము

ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని
కదిసిన యాసచే గడవలేక
యెదురు చూచి చూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయ కాలము

ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు

ఇంతట దీరెడి దుఃఖ మంతట దీరెడినని
వింత వింత వగల్చే వేగి వేగి
చింతయు వేదనల చిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయకాలము

ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు

యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూర కేగి యేగి
గక్కన శ్రీ తిరువేంకటపతి గానక
పుక్కి పురాణమయి పోయకాలము

ఈ గీతాన్ని ‘పదం’ అని అంటారు. దేవుని స్తుతి గీతాలు కాబట్టి వీటికి సంకీర్తనలు అని మరో పేరు. పదంలో సాధారణంగా ఒక పల్లవి, మూడు లేక నాలుగు చరణాలు ఉంటాయి. ప్రతి చరణం తరువాత పల్లవిని తిరిగి పాడుతారు. పల్లవిలో ఒక భావాన్ని ప్రతిపాదించి, చరణాల్లో దాన్ని విస్తరించడం పరిపాటి. చరణంలో చివరి పదాలు అర్థపరంగా, వాక్య నిర్మాణపరంగా పల్లవి లోని పదాలను కలిసి చేరేటట్టుగా రాయడం కద్దు. చివరి చరణంలో వేంకటాద్రి వేల్పుడైన వేంకటేశుని తలంపు దాదాపు తప్పనిసరిగా కనిపిస్తుంది. మళ్ళీ, మళ్ళీ పాడే పల్లవితో శ్రోతల మనస్సులో సుళ్ళు తిరిగే మరచుట్టు వంటి భావాల నిర్మాణం చేసి, ఆపై శిఖరాయమానంగా భగవంతుని ప్రస్తావనతో ముగించడం ద్వారా వారికి అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవం కల్పించడం ఈ పద నిర్మాణంలోని ప్రత్యేకత.

అన్నమయ్య పదాలు సాధారణంగా సుళువుగా, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. అందరూ పాడుకోవడానికి వీలుగా అన్నమయ్య వాడుక భాషనే ఎంచుకున్నాడని మనం ఊహించవచ్చు. అయితే ఈ పాటలలో భాష వాడుక భాషే అయినా ఇందులోని భావాలను మాత్రం అంత సులభంగా అర్థం చేసుకోలేము. అనూహ్యమైన పదాల మేళవింపు, సున్నితమైన పదాల అర్థభేదంతో సాధించే భావచతురత, విలక్షమైన వాక్సరణి ఈ పదసంకీర్తనల లక్షణం. అన్నమయ్య పదబంధాలు చెవులుకు ఇంపుగా, సంగీతానికి అనువుగా ఉంటాయి. ఆయన పూర్తిగా సంస్కృతంలో రాసిన సంకీర్తనలను మినహాయిస్తే, మిగిలిన గీతాలలో సంయుక్తాక్షరాలు ఉన్న సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా తేలికగా ఉండే దేశ్య పదాలను వాడాడు; సంస్కృత పదాలు అవసరమైన చోట వాటికి మారుగా లలితంగా ఉండే వాటి తద్భవ రూపాల వాడుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన గీతాలను వింటునప్పుడు ఆయన మన పక్కనే ఉండి మృదువైన కంఠంతో మనకు బోధ చేస్తున్నట్టో, మన హృదయంలో కూర్చొని మనలోని భావాలను మనకే అతి మధురంగా వినిపిస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ పాటలలో అంతర్లీనంగా వినిపించే గొంతు ఆ దేవదేవునికి కూడ సన్నిహితమైనదిగా మనకు స్ఫురించజేయడం ఈ గీతాల ప్రత్యేకత.

ఈ పాటలలో కవి తన మనస్సులో చెలరేగే భావాలను మళ్ళీ, మళ్ళీ మనకు వినిపించడం కనిపిస్తుంది. ఈ సంకీర్తనలలో కవి చాలావరకూ తన వేదనను ఉత్తమ పురుషలో(first person) వివరిస్తాడు: కవిలో జరిగే అంతస్సంఘర్షణ, అశాంతి; కవి చేసుకునే ఆత్మవంచన, స్వయం-సమర్థన; నిరర్థకమైన జీవితం పట్ల నిరాసక్తత; కవి మనస్సులోని అపరాధ భావం, ఆత్మనింద మనకు వివరంగా చిత్రీకరిస్తాడు. ఒక్కోసారి తననుండి తాను వెలియై తనలోని జీవికి “యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని … గక్కన శ్రీ తిరువేంకటపతి గానక” అంటూ హితబోధ చేసే సందేశాన్ని అందజేయడం కూడా కనిపిస్తుంది.

మానవునిగా తన జీవనకాల పరిమితి గురించి ఈ కవికి బాగా తెలుసు. ఈ కాల పరిమితిని సద్వినియోగం చేసుకోకుండా తను వృథా జీవనం గడుపుతున్నానని కూడా తెలుసు. నిజానికి ఆ ఎరుకే కవి వేదనకు కారణం. ఈ రకమైన పశ్చాత్తాపంతో కూడిన ఆత్మనిందా ధోరణి వల్ల ఈ సంకీర్తనలో మాట్లాడుతున్న వ్యక్తికి, ఆ వ్యక్తిని సృష్టించిన కవికి భేదం మసకబారుతుంది. అన్నమయ్య మగగొంతుకతో వినిపించే ఈ అంతర్ముఖ పదసంకీర్తనలలో ఈ రెండు పురుష రూపాలను విడదీయలేము. పాటలోని కవి-వ్యక్తికి కలిగిన జ్ఞానోదయమే ఈ గీతాలను మనకు వినిపింపజేస్తుంది. అయితే, ఈ గీతాల్లో చివరి చరణంలో వినిపించే మరో గొంతుక, అన్నీ ఎరిగిన దేవునిది.

ఉత్తమపురుషలో సాగే ఇటువంటి సంకీర్తనలను సాంప్రదాయికంగా ‘ఆధ్యాత్మిక’ సంకీర్తనలు అంటారు. తొలి రాగిరేకుల సంకలనంలోనే ఈ విధమైన విభజన ఉంది. నిజానికి ఇవి పూర్తిగా ఆధ్యాత్మికం కావు. వీటిలో ఆధ్యాత్మిక భావాల కంటే అంతర్ముఖమైన భావాల మోహరింపే ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి సంకీర్తనలు అన్నమయ్య వాఙ్మయంలో దాదాపు నాలుగో వంతు. మిగిలిన మూడు పాళ్ళ సాహిత్యాన్ని ‘శృంగార సంకీర్తనలు’ అంటారు. ఇందులో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన ఉంటుంది. ఈ శృంగార సంఘటనలు పూర్తిగా కవి కల్పితం. ఈ గీతాలలో కవి నాయికగా మనకు కనిపించడం కద్దు. ఆ నాయిక ఒక్కోసారి అలమేలుమంగ అని స్ఫుటంగా తెలుస్తుంది. కొన్ని గీతాలలో ఆ నాయిక అతని ప్రేయసి గానే తప్ప ఆమెవరో మనకు తెలియదు. ఉదాహరణకు:

కోపము దీరిన మీద గూడే గాని
ఈ పొద్దు కెదిరిమెచ్చు కింత చాలురా

సెలవి నీవు నవ్వగా జేరి మేను నవ్వేగాని
అలరి నా మతినైతే నలుకలేరా
నిలిచి నీవు చూడగా నేనూ జూచితిగాని
బలు దొరవైన నీతో బాడి గాదురా

కోపము దీరిన మీద గూడే గాని

మాటలాడగా నీతో మాటలు నే నాడేగాని
మాటి మాటికి నాకు సమ్మతిగాదురా
కూటమి బిలువగా నే గుట్టున నూకొంటిగాని
యీటున గూడినదాకా యెరవెరవేరా

కోపము దీరిన మీద గూడే గాని

కాగిలించగా నిన్ను కాగిలించేగాని నేను
కాగిన నామేనిమీది కాక చూడరా
దాగక శ్రీవేంకటేశ తలపులో చింతవాసె
ఆగిన నీ రతిలోన నలసితిరా

పడకగదిలో సంభాషణ వినిపిస్తున్నాడు మనకు అన్నమయ్య, ఇక్కడ. ఆయనకు తెలుసు, లోపల ఏం జరుగుతున్నదో. పదం స్త్రీ గొంతుక. ఆమెగా మాట్లాడుతున్నాడాయన. ఆమె చాలా కోపంగా ఉంది, బహుశా ప్రియుడు ఇంకెవరితోనో గడిపాడేమో. కానీ, చరణం తర్వాత చరణం గడిచే కొద్దీ ఆమె మెత్తబడుతున్నది. ఆమె కోపం సడలి పోతున్నది. చివరికి ప్రియునితో రతిలో పాల్గొనే దాకా ఆమె బలహీనురాలవుతూ వచ్చింది. ఈ క్రమ పరిణామమే అన్నమయ్య శృంగార కీర్తనలు అన్నింట్లోనూ కనిపిస్తుంది. ఈ పదాలు అన్నీ ఇంచుమించుగా రతిక్రీడతో ముగుస్తాయి. కానీ, మనం దృష్టి పెట్టవలసింది మారుతున్న ప్రేయసి మనస్తత్వం మీద. నిలకడ లేని మనసు ఆడే ఆటలతో మారిపోయే చిత్తం ఎన్ని రకాల భావాలను ఆమెలో రేపుతున్నదో గమనించండి. అలా అని ఈ పదాలన్ని ఒకే మూసలో ఉండవు. దేనికదే విశిష్టమైనది.

అన్నమయ్య పదాలను ఆధ్యాత్మిక – శృంగార కీర్తనలుగా వేరు చేయడం, ఆయన పద సంకీర్తనా సంపుటులు పూర్తిగా రచించిన తరువాతనే అయి ఉండాలని, అన్నమ్మయ్య ఇలా వర్గీకరించడంలో పాలు పంచుకోలేదని, అనిపిస్తుంది. ఏదేమైనా, ఈ రెండు రకాల కీర్తనలు ఒక దానికొకటి ప్రత్యేకంగా ఉంటాయి. పదలక్షణం గురించి అన్నమయ్యకు రెండు తరాల తరువాత, తాళ్ళపాక చిన్న తిరుమలాచార్య తను వ్రాసిన సంకీర్తనా లక్షణము అనే గ్రంథంలో, అన్నమయ్య పదాన్ని ఈ రకంగా నిర్వచిస్తాడు.

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై
యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై
కృతులై వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళ్ళపాక అన్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

వేదవిజ్ఞానం గల శ్రుతులుగా, పురాణకథలుగా, మంత్రార్థాలుగా తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనల ముఖ్య లక్షణాలు కొన్ని వివరిస్తున్న ఈ పద్యానికి సొగసు, ఊపు ‘వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై’ అన్న దీర్ఘ సమాసం వల్ల వచ్చింది. ఈ దీర్ఘసమాసం అన్నమయ్య సాహిత్యంలో శృంగార సంకీర్తనల ప్రాధాన్యతను కూడా వివరిస్తుంది. ప్రాయికముగా, శ్రీవైష్ణవ వాఙ్మయంలో ‘రహస్యం’ అన్న పదం గుహ్యమైన, కొంతమందికే పరిమితమైన తాత్త్విక విజ్ఞానాన్ని చూపడానికి వాడేవారు. అదే అర్థంలో ప్రయోగాలు భగవద్గీతలోనూ, భాగవతంలోను కనిపిస్తాయి. ఈ కింది రెండు ఉదాహరణలు చూడండి:

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం (భగవద్గీత 4.3)

జ్ఞానం పరమ-గుహ్యం మే యద్విజ్ఞాన-సమన్వితం
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా (శ్రీమద్భాగవతం 2.9.31)

కానీ, 15వ శతాబ్ది నాటికి తిరుపతిలో ‘రహస్యం’ అన్న పదానికి అర్థం మారిపోయింది – ఆ రోజుల్లో ఈ పదాన్ని గుప్తమైన లౌకిక వ్యవహారాలను, శృంగార ప్రణయ కలాపాలను సూచించడానికి కూడా వాడేవారు బహుశా.

3. పదసంకీర్తనా సంపుటాలు
అన్నమయ్య రాసిన పాటలుగా దాదాపు పదమూడువేల సంకీర్తనలు 2,289కి పైగా ఉన్న రాగిరేకులలో మనకు లభ్యమౌతున్నాయి. అన్నమయ్య కృతులను రాగిరేకులపై రాయించే పని బహుశా అన్నమయ్య కాలంలోనో, అతని చనిపోయిన కొద్ది కాలానికో చేపట్టి ఉంటారని భావించవచ్చు. ఈ రాగిరేకుల సంపుటాలను తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా ఉన్న ‘సంకీర్తనా భాండారం’ లో భద్రపరిచారు. తాళ్ళపాక వారి అర అని పిలవబడే ఈ సంకీర్తనా భాండారం వద్ద అఖండ దీపారాధనలు, పూజా నివేదనలు ఘనంగా నిర్వహింపబడినట్లు భక్తులకు అతిరసాల ప్రసాదాన్ని వితరణ చేసినట్లు కృష్ణదేవరాయల తమ్ముడైన అచ్యుతదేవరాజు విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో (1530) వేయించిన శాసనాల వల్ల వెల్లడవుతున్నది. ఇలా ప్రతి యేటా ఈ క్రతువులను నిర్వహించడానికి కావలిసిన ధనాన్ని అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుడు సమకూర్చి పెట్టాడని కూడా ఈ ఆధారాలు మనకు చెబుతున్నాయి.

అంతేకాక ఇన్నివేల సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడానికి ఎంతో సమయం, ధనం వెచ్చించాల్సి ఉంటుంది. బహుశా, ఇంత పెద్ద ప్రచురణా కృషి తెలుగు సాహిత్య చరిత్రలో అంతకు ముందెప్పుడూ కనీ వినీ ఎరుగనిది. ఆ రోజుల్లో అన్నమయ్య పేర ఎంత ఆర్థిక సంపత్తి ఉండేదో మనకు దీని ద్వారా తెలుస్తుంది. కొన్ని రాగి రేకులమీద వ్రాయసగాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. అయిదవ రాగిరేకులో ఈ రాగిరేకుల కృషిని పెద తిరుమలాచార్యుడే స్వయంగా బాధ్యత వహించి నిర్వహించాడని రాయబడి ఉన్నది. అన్నమయ్య ఈ కృతుల రచన తన పదహారవ యేట శాలివాహన శకం 1346లో (క్రీ. శ. 1424) ప్రారంభించి 1424 (క్రీ. శ. 1503) వరకూ కొనసాగించాడని ఈ రాగిరేకులలో పలుమార్లు చెప్పబడిన అంశం. అన్నమయ్య మరణకాలాన్ని సూటిగా ఈ రాగిరేకులలో ప్రస్తావించక పోయినప్పటికీ, చివరి కృతి రచనా కాలంగా పేర్కొన్న శా. శ. 1424 (క్రీ. శ. 1503) ఫాల్గుణ మాసపు కృష్ణపక్ష ద్వాదశియే ఆయన పరమపదించిన దినంగా భావిస్తారు.

తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలున్న రాగిరేకులు శ్రీరంగం, అహోబిలం, కదిరి, చిదంబరం, సింహాచలం వంటి ఇతర దేవాలయాలలోనూ కనుగొన్నారు. అంతే కాక కొన్ని రాగిరేకుల సంపుటాలు తంజావూరు లోని సరస్వతి మహల్ గ్రంఠాలయం లోనూ, పుదుకోటై లోనూ, తాళ్ళపాక కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ ఉన్నాయి. తాళ్ళపాక సాహిత్యంపై పనిచేసిన పండితులలో ఒకరైన అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు కొన్ని అన్నమాచార్య పదాలు, స్వరసహితంగా, తిరుమల దేవాలయ ప్రాంగణం లోని రెండు స్తంభాలపై చెక్కి ఉన్నాయని గమనించారు. ఈ సంకీర్తనల ప్రతులు దక్షిణ భారతంలోని ఇతర శ్రీవైష్ణవ దేవాలయాలకు వితరణ చేయడం కూడా దాదాపు పదహారవ శతాబ్దం నుండే జరిగేదని మనం ఊహించవచ్చు. అయిదేసి రాగిరేకులను గుత్తులుగా ఒక కడియానికి కట్టి, అటువంటి కడియాలను ఒక కంబానికి దిగవేసి, వాటిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేవారు. ఈ రాగిరేకులతో పాటు ఈ గీతాలను పాడే గాయకులు కూడా వెంట వెళ్ళేవారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ రాగిరేకులు దక్షిణ భారతదేశంలోని ఎన్నో గ్రామ దేవాలయాలలో దొరుకుతున్నాయి కాబట్టి ఈ సంకీర్తనలు ఆ రోజుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే, అన్నమయ్య తానే స్వయంగా కడప, ఓగునూతల, ముడియము, సంబత్తూరు, పండరీపురం వంటి ఇతర దేవస్థానాలను దర్శించినట్టు ఆయా దేవుళ్ళపై ఆయన రాసిన సంకీర్తనల ద్వారా తెలుస్తోంది. అన్నమాచార్య మనవడైన చిన తిరుమలాచార్యుడు గుంటూరు జిల్లా మంగళగిరి లోని నరసింహస్వామి ఆలయంలో అన్నమయ్య గీతాలు పాడటానికి ఏర్పాట్లు చేసినట్లు అక్కడ ఆయన వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే, అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడంతో పాటు ఈ గీతాలను వివిధ ఆలయాలకు వితరణ చేసే కార్యక్రమం కూడా పెద్ద సంస్థాగతమై ఉండివుండాలి.

అన్నమయ్య తన కృతులలో కనీసం రెండు మార్లు తన పాటలను వ్రాసే కార్యక్రమం గురించి ప్రస్తావించాడు. ‘సత్యము సేయగవచ్చును’ అన్న కృతిలో “తగ ప్రాణములో నుండి పలికింతువు అక్షరముల,” అంటూ దేవుడిని పొగుడుతూ “పరగ నవే వ్రాయింతువు,” అని కూడా అంటాడు. ఈ కింది కీర్తన రాగిరేకులపై చెక్కి భాండారాన ఉంచే కార్యక్రమం అన్నమయ్య ఎరుగునని మనం అనుకోవచ్చు.

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి
పూచి నీకీ రీతి రూపపుష్పము లివి యయ్యా
ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా

ఇక్కడ “భాండారాన దాచి వుంచనీ” అన్నప్పుడు అన్నమయ్య బహుశా రాగిరేకులు దాచివుంచిన సంకీర్తనా భాండారపు గది గురించి మాట్లాడున్నాడని అనుకోవచ్చు. నిజానికి ఈ సంకీర్తనలో అన్నమయ్య తన కృతులను ఇలా రాసి చీకటి గదిలో నిక్షిప్తం చేసే కార్యక్రమం పట్ల కొంత అయిష్టతను కూడా ప్రకటిస్తున్నాడేమో అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. మొదట్లో యధేచ్ఛగా పాడుకున్న కృతులను రాగిరేకులపై చెక్కే కార్యక్రమం జోరుగా సాగుతున్న రోజుల్లో ఈ సంకీర్తన రచించాడేమోనని మనం ఊహించవచ్చు.

అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్లకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది. అయితే, ఈ కథ నిజమని నమ్మడానికి ఏ ఆధారాలు లేవు. దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం. అన్నమయ్య సంకీర్తనలును కూడా నాటకీయ ఫక్కీలో కనుగొన్న కథనం ఈ రకమైన ప్రచారంలో భాగమే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1920లలో శిలాశాసనాధికారిగా పని చేసిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి తానే స్వయంగా ఈ సంకీర్తనల రాగిరేకులను భాండారం నుండి దేవస్థాన కార్యాలయానికి తరలించినట్లు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ రాగిరేకులు దేవాలయం వారి మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

4. అన్నమాచార్య చరిత్రము
నేడు అన్నమయ్య జీవితం గురించి ప్రచారంలో ఉన్న కథలన్నింటికీ మూలాధారం ఆయన మనవడు తాళ్ళపాక చిన్నన్న (చిన తిరువేంగళనాథ) రచించిన ‘అన్నమాచార్య చరిత్రము’ అనబడే కావ్యం. ఈ కావ్యాన్ని అన్నమయ్య సంకీర్తనలను “సంస్థీకరించే” సమయంలో రాసి ఉండవచ్చు. ఈ కాలం నాటికి అన్నమయ్య కుటుంబ సభ్యులు ఆర్థికంగా సుసంపన్నులు. అన్నమయ్య ద్వారా ఈ కుటుంబ సభ్యులకు దేవస్థానపు అర్చక, ఆర్థిక, నిర్వాహక, కళాత్మక కార్యకలాపాలన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషించే అవకాశం కలిగిందని మనకు తెలియవస్తుంది. 1540లో వేయించిన శాసనం ద్వారా అన్నమయ్య మనవడు, ‘సంకీర్తనా లక్షణము’ రచించిన చిన తిరుమలాచార్యుడు, దిగువ తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం కళ్యాణ వేంకటేశ్వర ఆలయాన్ని పూర్తిగా మరమ్మత్తు చేయించాడని, అదే సమయంలో అనేక దేవతా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు అన్నమయ్య విగ్రహాన్ని, ఇతర వైష్ణవ గురువుల విగ్రహాలను చేయించాడని మనకు తెలియవస్తుంది. తమిళ అళ్వారు కవుల నుండి రామానుజాచార్యుల వరకు సాగే వరుసలో అన్నమయ్య విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడంలో అన్నమయ్యను ప్రముఖ వైష్ణవ గురువులలో ఒకడిగా చేర్చే ప్రయత్నం కనిపిస్తుంది. అన్నమయ్యను తమిళంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైష్ణవ భక్తకవి నమ్మాళ్వారు అవతారంగా కూడా అభివర్ణించడం ఈ ప్రయత్నంలో భాగమే. నమ్మాళ్వారు, అన్నమయ్యల జన్మ నక్షత్రం కూడా ఒకటే: విశాఖ. ఈ విధంగా అన్నమయ్యను వైష్ణవ గురువుల పరంపరలో భాగంగా చేసే ప్రయత్నంలో అల్లిన కథల వల్ల అన్నమయ్య కాలం నాటి విలక్షణమైన చారిత్రకాంశాలను, అన్నమయ్య ప్రాచుర్యానికి దోహదం చేసిన పరిస్థితులను మనం సూటిగా ఆ తరం వారి నుండి తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోయాం. ఏది ఏమైనా, తిరుపతి దేవస్థాన నిర్వాహణలో తాళ్ళపాక కుటుంబం ఈ మధ్య కాలం దాక తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారని మనకు తెలియవస్తుంది.

చిన్నన్న తన తాతయ్య గురించి రాసిన కావ్యం లోని అన్నమయ్య చరిత్ర సంగ్రహంగా:

అన్నమయ్య నందవరీక బ్రాహ్మణ వంశంలో పొత్తపినాడు మండలంలోని తాళ్ళపాక గ్రామంలో వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో జన్మించాడు. శ్రీమహావిష్ణువే స్వయంగా పిల్లవాడి తండ్రికి కలలో కనిపించి ‘అన్నం బ్రహ్మేతి వ్యజనాత్’ అన్న ఉపనిషత్ మంత్రం ఆధారంగా పిల్లవానికి అన్నమయ్య అని పేరు పెట్టమని సూచించాడు. శిశువుగానే అన్నమయ్య దేవునిపై దృష్టి సారించేవాడు; ఎన్ని జోలపాటలు పాడినా మానని ఏడుపు విష్ణు నామం వినగానే ఆపేవాడు. చిన్నప్పటి నుండే భక్తి శ్రద్ధలతో దేవుని పూజించేవాడు.

ఒకనాడు ఆవుల కోసం గడ్డి తెమ్మని ఆతని వదిన పురమాయిస్తే అడవికి వెళ్ళాడు. అక్కడ కొడవలితో గడ్డికోస్తూ ఏమరపాటుగా తన వేలిని కోసుకున్నాడు. తనకు తెలియకుండానే ‘హరి, హరి’ అన్నాడు. అంతే. ఆ క్షణంలోనే అతనికి జ్ఞానోదయమై కుటుంబాన్ని, గురువును, ఊరిని వదిలి వేసి వేంకటం వైపుగా వెడుతున్న భక్తబృందంతో కలిసి తిరుపతి వైపు పయనం సాగించాడు. దారిలో శక్తిగుడిలో అమ్మవారైన తాళ్ళపాక గంగమ్మ దర్శనం చేసుకున్నాడు. ఆపై తలయేరు బండకు చేరుకున్నాడు.

ఆ సమయంలో అతనిని ఆకలి దహించివేసింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. తల్లిని విడిచి అంతకు ముందెన్నడూ ఎరుగడాయె. నడిచే ఓపిక నశించి అక్కడే వెదురు పొదల నీడలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు వేంకటేశుని నాయిక అయిన అలమేలుమంగ సాధారణ స్త్రీ రూపం ధరించి అతని దగ్గరికి వచ్చింది. అతడిని చూడగానే ఆమె స్తన్యం ఉబికివచ్చింది. ఆమె తన కృపామృతధార అతనికి అందజేసింది. తిరుపతి కొండ ప్రాంతమంతా పవిత్రమైన సాలగ్రామములతో నిండి ఉందని, అందుచేత చెప్పులు వదలివేసి కొండ ఎక్కమని అతనికి సూచించింది. అతడు చెప్పలు వదిలివేయగానే కొండప్రాంతమంతా సువర్ణవర్ణమై శోభిల్లుతూ కనిపించింది. ఆనందభరితుడైన అన్నమయ్యకు తను విష్ణుమూర్తితోపాటు ఆరగించిన ప్రసాదాన్ని కొంత ఇచ్చింది. ఉన్న పాటుగా అతని నోటివెంట కవిత్వం వచ్చి అలమేలుమంగను స్తుతిస్తూ ఒక శతకం వినిపించాడు.

తరువాత కోనేటి చెరువులో స్నానం చేసి అక్కడి చెన్న కేశవస్వామి దేవునకు కాసు సమర్పించుకున్నాడు. ఆ మరునాడు తిరుమల చేరుకొని ముద్రలు వేయించుకొని వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఆపై వేంకటేశునిపై ఒక శతకం వినిపించాడు. అన్నమయ్య కొన్ని పద్యాలను వినిపించగానే మూసి ఉన్న తిరుమల తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. గర్భగుడిలో నంబి పుజారి సమక్షంలో మరికొన్ని పద్యాలను వినిపించగానే దేవుని బహుమతిగా ఒక ముత్యాల హారం పైనుంచి వచ్చి అన్నమయ్య మెడను అలంకరించింది.

అన్నమయ్య తన వైష్ణవ గురువు ఆజ్ఞ మేరకు తాళ్ళపాకకు తిరిగివచ్చాడు. అక్కడే తిరుమలమ్మ (తిమ్మక్క), అక్కలమ్మ అనే పడతులతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఆ ఆడపిల్లల బంధువులు ముందుగా ఈ సంబంధానికి ఒప్పుకోలేదు: ‘ఇహలోక చింత ఏ మాత్రము లేని వానికి పిల్లనెలా ఇచ్చేది,’ అని అభ్యంతర పెట్టారు. అయితే, ఆ రాత్రే ఆ పిల్లల తల్లిదండ్రుల కలలో విష్ణువు కనిపించి ఈ వివాహాన్ని నిశ్చయం చేశాడు. పెళ్ళిలో అహోబిల స్వామి అయిన నరసింహుడు గురువు రూపంలో కనిపించి పెళ్ళికొడుకుకు చక్రాన్ని ఇచ్చి, మంత్రాన్ని బోధించాడు. హయగ్రీవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు.

ఆపై, వేదాంతదేశికాచార్యుడైన శఠగోపముని వద్ద వేదాంతాన్ని అభ్యసించాడు. అక్కడే వాల్మీకి రామాయణాన్ని క్షుణ్ణంగా పఠించాడు. తనకు తోచిన పాటలు రాచేవాడు. మెల్ల మెల్లగా వాగ్గేయకారునిగా అతని పేరు ప్రఖ్యాతులు ఆ చుట్టుపక్కల గ్రామాలలో వ్యాప్తి చెందాయి. ఆ రోజుల్లో టంగుటూరును పాలిస్తున్న సాలువ నరసింహ అన్నమయ్య తన వద్దకు పిలిపించుకొన్నాడు. రాజుతో బాటు టంగుటూరుకు ఆ పై పెనుగొండకు పయనమై వెళ్ళాడు. రాజు అతని ప్రావీణ్యతను మెచ్చి తలపాగా, కంకణము మొదలైన ఎన్నో ఆభరణాలు బహుకరించాడు. ఒకరోజు తన ఆస్థానానికి పిలిపించి అన్నమయ్యను ఒక సంకీర్తనను వినిపించమన్నాడు. అప్పుడు అన్నమయ్య ఈ గీతం పాడాడు:

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

ఈ పాట వినగానే రాజు పరమానందభరితుడై మళ్ళీ మళ్ళీ వినిపించుకొని, ఇదీ నిజమైన కవిత్వం అంటే! అంటూ ప్రశంసించాడు. అయితే, అధికార మదంతో అన్నమయ్యను ఆ రాజు తన శృంగారలీలను వర్ణించమని ఆజ్ఞాపించాడు. ఇది వినగానే హతాశుడైన అన్నమయ్య ‘హరి, హరి’ అంటూ తన చెవులు మూసుకున్నాడు. విష్ణుని కీర్తించిన నాలుకతో నరులను నుతించలేనని రాజు కోరికను త్రోసిపుచ్చాడు. రాజాజ్ఞను ధిక్కరించినందుకు ప్రతిగా రాజు అతడిని గట్టి సంకెళ్ళతో బంధించి జైలులో ఉంచాడు. అప్పుడు అన్నమయ్య దేవుని స్తుతిస్తూ…

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే
దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

అని పాడిన వెంటనే ఆ సంకెళ్ళు తెగి పడిపోయాయి. రక్షకభటులు ఈ వార్త రాజుకు తెలుపగానే రాజు అతడిని తిరిగి ఇంకా బలమైన సంకెళ్ళతో బంధించమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అన్నమయ్య పాటకు ఆ సంకెళ్ళు కూడా తొలగిపోయాయి. అప్పుడు రాజు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో అన్నమయ్య కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు. అన్నమయ్యకు ఎన్నో బహుమానాలు ఇచ్చి అతడిని పల్లకిలో కూర్చోబెట్టి తానే స్వయంగా ఆ పల్లకిని మోశాడు.

అన్నమయ్య పెనుగొండ వదిలి వేంకటం చేరుకున్నాడు. అక్కడే నివాసమేర్పరచుకొని సంవత్సరాల తరబడి యోగ, శృంగార, వైరాగ్య సంకీర్తనలతో ఆ కొండలరాయుని స్తుతిస్తూ జీవితం గడిపాడు. ద్విపదలో ఒక రామాయణం, సంస్కృతంలో వేంకటాద్రి మాహాత్మ్యం, 23 శతకాలు, ఎన్నో భాషలలో ఎన్నో ప్రబంధాలు కూడా రచించాడు. తన వంశంలో కింది తరాల వారిని కవులుగా తీర్చి దిద్దాడు. అన్నమయ్య నోటిమాట వరంగానూ, శాపంగాను మారవచ్చు — అతని వాక్శుద్ధి అంత గొప్పది. అతని పాదుకలు మోసిన వారి క్లేశాలన్నీ ఇట్టే మాయమై పోయాయి. దేవుడే ప్రత్యక్ష్యమై “కృష్ణమాచార్య ఆధ్యాత్మిక కృతులు పాడితే నేను విరక్తుడనయ్యాను. నీవు శృంగార సంకీర్తనలు పాడితే నేను మళ్ళీ యౌవన ప్రాయంబు వాడినయ్యాను” అని అన్నాడు.

చిన్నన్న రాసిన ‘అన్నమయ్య చరిత్రము’ అన్నమయ్యను ఒక శ్రీవైష్ణవ గురువుగా, మహిమాన్వితుడైన భక్తునిగా చిత్రీకరిస్తుంది. అప్పటికే అమిత ప్రాచుర్యం చెండిన నమ్మాళ్వారుని కథకు, అన్నమయ్య చరిత్రము లోని కథకు ఎన్నో పోలికలు కనిపిస్తాయి: శిశువుగానే అతడు విష్ణు భక్తిని ప్రదర్శిస్తాడు; యువకుడిగా ఇంటిలో వదిన మందలింపులు పట్టించుకోక అతడు విష్ణు నామస్మరణలోనే గడుపుతూ, హటాత్తుగా తిరుపతికి పయనమౌతాడు; అక్కడ స్వయంగా అమ్మవారి స్తన్యం గ్రోలగానే అతనిలో కవిత్వ ధార పెల్లుబుకుతుంది. అయితే, అన్నమయ్య పూర్తిగా సన్యాస జీవితం గడపలేదు. అతడు ఇద్దరు భార్యలతో సంసారిక జీవితం గడిపినవాడు. అయినా, అతని ఆధ్యాత్మిక రచనల్లో ఐహిక సుఖాల పట్ల నిరసన, స్త్రీల పట్ల విముఖత కనిపిస్తుంది. చిన్నన్న ఈ పదాలను వైరాగ్య సంకీర్తనలంటాడు.

సాళువ నరసింహ రాజు తనను కీర్తిస్తూ ఒక రచన చేయమని అడగడంలో ఆ తరువాతి రోజుల్లో రాజుకు దైవానికి సారూప్యత సాధిస్తూ రచనలు చేసిన ఆస్థాన కవుల పరిస్థితిని వివరిస్తుంది. నాయక రాజుల కాలంలో ఈ రకమైన రచనలు కోకొల్లలు. చిన్నన్న కావ్యంలో ఈ రకమైన వర్ణన బహుశా తనకాలపు కవుల పరిస్థితిని అన్నమయ కాలానికే ఆపాదించే ప్రయత్నం కూడా కావచ్చు. శ్రీవైష్ణవ భక్తుడిగా అన్నమయ్య సాళువ నరసింహునితో సహకరించకపోవడమే సబబు. అన్నమయ్య సర్వసామాన్యమైన మనుష్యుల వేదనలను వివరిస్తూ రాసిన ‘ఆకటి వేళల’ అన్న పాటను కథలో ఈ సందర్భానికి సరిపోతుందని చిన్నన్న వాడుకొని ఉంటాడు.

చిన్నన్న చెప్పిన సాళువ నరసింహుని కథలో నిజానిజాల మాట ఎలా ఉన్న అక్కడ ఆస్థానంలో అన్నమయ్య పాడిన పాటగా చెప్పుకున్న శృంగార సంకీర్తన ఒక అద్భుతమైన గీతం. భామిని అయిన అమ్మవారు తన శయ్యామందిరం నుండి వెలుపలికి వస్తుంటే చూసిన చెలులు ఆమె శరీరంపై కనిపించే లక్షణాల ద్వారా పడకగదిలో జరిగిన కథను రమ్యంగా ఊహిస్తున్నారు. ఇక్కడ ప్రతి భావచిత్రం విలక్షణమైనదే. ప్రాణేశ్వరునిపై నాటిన కొనచూపులు బలంగా పెరుకగా నెత్తురు మరకలు ఆమె కన్నులలో కెంపై తోచాయట. చంద్రవంక వంటి నఖక్షతాలు ఆమె వక్షోజాలనుండి వెన్నెలలు కురిపిస్తున్నాయట. ఇక్కడ సాధారణంగా వాడే ‘వక్షోజ చంద్రికలు’ అనే ఉత్ప్రేక్షాలంకారాన్ని చంద్రవంక వంటి నఖక్షతాలు అన్న మరో పోలిక ద్వారా యథార్థానికి దగ్గరగా తీసుకువచ్చాడు. ఈ రకమైన వాస్తవిక మూర్త భావాలు ఈ గీతంలో ప్రబలంగా కనిపిస్తాయి. చివరగా ఆమె మొహంపై ముత్యాల వంటి జల్లులు – తిరువేంకటపతి అద్దిన చెమటలు. అయితే, ఇటువంటి మూర్త భావాలు ఒకవైపు మనను నాయికా నాయకుల పాత్రలకు దగ్గరిగా చేరుస్తుంటే, మరోవైపు వారు సాక్షాత్తు వేంకటేశ్వరుడు, ఆమె అతని పత్ని అన్న భావన మనను హద్దులలో ఉంచుతుంది. ఇక్కడే సాళువ నరసింహుడు పొరబడ్డాడు: ఈ పాటలో తనను నాయకుడిగా, తన ప్రేయసిని నాయికగా ఊహించుకొన్నాడు. చిన్నన్న ఈ పాటను ఎంచుకోవడంలో మనకు అన్నమయ్య భక్తి శృంగారానికి, రాజాస్థానాల్లో వినిపించే శృంగార కావ్యాలకు తేడా చెప్పడమనే భావించాలి.

నిజానికి అన్నమయ్య యొక్క విలక్షణమైన శృంగార సంకీర్తనలు పైన చెప్పిన భక్తి శృంగారానికి, కావ్య శృంగారానికి చెందింది కాక మూడో రకానికి చెందినవని చెప్పుకోవాలి. ఈ కొత్తరకం శృంగార గీతాలలో కనిపించే వైయుక్తిక, విశృంఖల భావాలు పూర్తిగా మానవ సంబంధమైనవి. ఈ గీతాలలో కనిపించే శృంగారం అంతకు ముందు భక్తి-శృంగారంగా చెప్పుకునే సాహిత్యంలో లాగా ప్రణయ భావాలు కేవలం భక్తిని తెలుపుకొనే సాధనాలు కావు. అందుకే జయదేవుని గీతాగోవిందంలో ప్రణయగీతాల అంతిమ లక్షం కృష్ణునిపై భక్తి తెలుపుకోవడమే. అంతేకాక, అన్నమయ్య గీతాల్లో కనిపించే విశృంఖలత అంతకు ముందు సాహిత్యంలో కనిపించదు. అన్నమయ్యతో ప్రారంభమైన ఈ రకపు గీతాలు అన్నమయ్య తరువాతి తరంలో పదిహేడవ శతాబ్దంలో క్షేత్రయ్య, ఆ తరువాత పదాలను సృష్టించిన తెలుగు, తమిళ వాగ్గేయకారులు కొనసాగించారు.

5. తాళ్ళపాక వంశ పూర్వ చరిత్ర
చిన్నన్న రాసిన ‘అన్నమయ్య చరిత్రము’ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అన్నమయ్యను శ్రీవైష్ణవ సంప్రదాయ గురువులలో ఒకడిగా చిత్రీకరించే రోజులలో వెలువడిన కావ్యం. అయితే, తిరుపతి చుట్టుపక్కల దొరికిన ఆధారాలు, అక్కడి స్థానిక ప్రజలు చెప్పుకొనే కథల ఆధారంగా అబ్బూరి గోపాలకృష్ణ, అల్లంరాజు విజయేంద్రనాథరావు వంటి పరిశోధకులు తాళ్ళపాక వారి వంశ చరిత్రను పూర్తిగా వేరే దృక్కోణంలో చిత్రీకరించారు. స్థానిక ప్రజల కథలలో నందవరీక బ్రాహ్మణులైన తాళ్ళపాకవారు తిరుపతికి ఆగ్నేయంగా, బనగనిపల్లె, పన్యం గ్రామాల మధ్యన ఉన్న నందవరం గ్రామానికి చెందిన వారు. ఆ ప్రాంతానికి రాజైన నందునికి ప్రతిరోజూ కాశీ వెళ్ళి, అక్కడి గంగలో స్నానమాచరించాలన్న కోరిక పుట్టింది. దత్తాత్రేయుడు అనే పేరుగల ఒక సిద్ధుడు ఆ రాజు కోరిక తీర్చడానికి అతనికి మహిమగల పాదరక్షలు ఇచ్చి, ఆ పాదుకలతో సొరంగమార్గం గుండా ప్రతిరోజు కాశీకి పోయే మంత్రాన్ని అనుగ్రహించాడట. ఒకనాడు మహరాణి తన భర్త ప్రతిరోజు ఉదయాన్నే మాయమవ్వడం గమనించి నిజం చెప్పమని అడిగింది. నిజం తెలుసుకొని, తానూ కాశీకి వస్తానని మరునాడు రాజుతో పయనమయ్యింది. ఇద్దరు కాశీ చేరి గంగా స్నానం చేసిన తరువాత తిరుగు ప్రయాణానికి రాణిగారికి ఆ మంత్రం పనిచెయ్యలేదట (కొన్ని కథల్లో ఆమె ఆరోజుల్లో రసజ్వల కాబట్టి మంత్రం పనిచెయ్యలేదని చెబుతారు). దాంతో సాయం చెయ్యమని అక్కడి బ్రాహ్మణులను వేడుకున్నారట. అక్కడి బ్రాహ్మణులకు సాయం చెయ్యడానికి ప్రతిగా వారికి అవసరమైనప్పుడు ఆదుకొంటానని ఆ రాజు అక్కడి చాముండేశ్వరి దేవి ఎదురుగా ప్రతిన చేస్తాడు. వారి సాయంతో ఆ రాజదంపతులు తిరిగి తన రాజ్యం చేరుకుంటారు.

కొంతకాలానికి, కాశీప్రాంతంలో కరువు ఏర్పడడంతో ఆ బ్రాహ్మణులు నందవరం వచ్చి తమను ఆదుకొమ్మని ఆ రాజును వేడుకొంటారు. అయితే, ఆ రాజు తాను వారికి సాయపడతానని ఎప్పుడూ మాట ఇవ్వలేదని బుకాయిస్తాడు. వారు కాశీకి తిరిగి వెళ్ళి అతని మాటకు సాక్షం చెప్పమని చాముండేశ్వరీ దేవిని అర్థిస్తారు. ఆమె వారి ప్రార్థనలకు కరిగిపోయి, తాను వారితోపాటు వెంటవస్తానని, అయితే వారెవ్వరు ప్రయాణంలో ఆమె ఉందా, లేదా అని అనుమానపడుతూ వెనకకు తిరిగి చూడవద్దని నియయం పెడుతుంది. వారు ఆ నియమాన్ని పాటించడంతో ఆమె నందవరం వచ్చి సాక్షం చెబుతుంది. ఆపై, ఆ బ్రాహ్మణుల కోరిక మేరకు నందవరంలోనే ఉండిపోతుంది. అందుకే, వారణాసిలో చాముండేశ్వరీ గర్భాలయంలో విగ్రహం లేదని చెబుతారు.

ఈ బ్రాహ్మణులతో పాటు కాశీనుండి ప్రయాణం చేసిన దుగ్గన అప్పయ్య అనబడే ఒక నియోగి బ్రాహ్మణుడు తన కూతురిని వారి కుమారులలో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేయమని అర్థించాడు. వారు వైదికులు కాబట్టి నియోగి సంబంధం ఒప్పుకోలేదు. నిరాశ చెంది ఆ బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని చంపి తనూ ఆత్మహత్య చేసుకొంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులతో పాటు ప్రయాణం చేసిన అమ్మవారు – ఇప్పుడు చౌడేశ్వరి – మరో బ్రాహ్మణుని మరణానికి కారకులైనందుకు, ఆ బ్రాహ్మణులను లౌకికమైన ఉద్యోగాలలో మాంసభక్షకులైన తోగట నేతవారి పురోహితులుగా కాలం గడపమని శపించిందట. ఆ బ్రాహ్మణులే నందవరీకులు – వారి నుండే తాళ్ళపాక వంశం ఉద్భవించిందట.

చౌడేశ్వరి ఇప్పటికీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో పేరుగల గ్రామదేవత. చౌడమ్మ పదాలు అన్న పాటలలో ఆమె మహిమను తెలిపే ఎన్నో కథల్లో ఈ కథ కూడ ఉంది. తాళ్ళపాక సాహిత్యంలో కనిపించే సంక్లిష్టత చౌడమ్మ పదాల్లో కనిపిస్తుంది: వారణాసిలో ఖాళీ గర్భాలయం, గ్రీకు కథల్లోని యూరిడిసీ లాగా వెనక్కి తిరిగి చూడవద్దనే దేవత, నందివారిక బ్రాహ్మణులకు తోగట నేతపనివారికి గల సంబంధం వివరించే ఈ కథల్లో కొంత నిజం దాగి ఉందని మనం ఊహించవచ్చు. అంటే, తాళ్ళపాక వారి కుటుంబం మొదట్లో స్థానిక గ్రామదేవత అయిన చౌడమ్మగుడిలో అర్చకులుగా, తోగట నేత వారికి పురోహితులుగా, బహుశా, తాళ్ళపాకలో ఉండేవారని మనం భావించవచ్చు. నిజానికి, అన్నమయ్య మనుమడైన చిన తిరుమలాచార్యుడు కూడా వైష్ణవానికి ముందు వారు “పచ్చి తామసుల”మని ఈ కింది కీర్తనలో వర్ణించాడు:

పచ్చితామసుల మమ్ము పరమ-సాత్వికులగా
యిచ్చటనే సేసినాడు యెంత చిత్రము
యిచ్చగించి మాకులాననెన్నడు లేని వైష్ణవం
అచ్చముగా గృప సేసెనన్నమాచార్యుడు

‘పచ్చి తామసులము’ అని చేసిన వర్ణన అంతకు మునుపు వారికి గ్రామదేవత అయిన చౌడేశ్వరి/చౌడమ్మతో గల సంబంధాన్ని వివరిస్తుందని అనుకోవాలి. గ్రామదేవతలను ఆరాధించే వారు చాలా శరీరమంతా నిమ్మకాయలు గుచ్చుకోవడం, తలమీద టెంకాయలు కొట్టుకోవడం మొదలైన ఆత్మహింసా పద్ధతులతో, దేవత పూనడం వంటి అనుభవాలతో దేవతతో అతి గాఢమైన అనుబంధాన్ని పెంచుకొంటారు. పూనకం వచ్చినవారు జుట్టు విరగబోసుకొని, వెనుకకు ముందుకూ ఊగుతూ దేవత మాట్లాడినట్టు కొత్త గొంతుకలో కొలువు చెప్పుతుంటారు.

తాళ్ళపాక కుటుంబానికి గ్రామదేవతకు మధ్య ఉన్న సంబంధం వివరించే మరో ముఖ్యమైన ఆధారం చిన్నన్న కావ్యం ఉపోద్ఘాతంలో అన్నమయ్య తాత గురించి చెప్పే కథ: అన్నమయ్య తాత నారాయణ చినప్పుడు చక్కగా బడిలో చదువుకొనే వాడు కాదు. బడిలో ఉపాధ్యాయుల శిక్షలకు భయపడి ఒకసారి పారిపోయి చింతాలమ్మ గుడికి చేరాడు. ఆ గుడి వెనక పుట్టలో విషసర్పాలున్నాయని చెప్పుకొనేవారు. ఆ బాలడు పాము కాటుతో చనిపోదామని ఆ పుట్టలో చేయి పెట్టాడు. ఆ క్షణమే సర్వం తెలిసిన అమ్మవారైన గ్రామదేవత ప్రత్యక్షమై ఎందుకు చావాలనుకుంటున్నావని ప్రశ్నించింది. ఉపాధ్యయుల దెబ్బలు భరించలేకున్నానని ఆ పిల్లవాడు చెబితే, దగ్గరలోనే ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి మొక్కితే అతనికి విద్య అబ్బుతుందని అతనికి సూచిస్తుంది. అంతేకాక, అతని వంశంలో మూడవ తరానికి చెందిన వారిలో మహా విష్ణుభక్తుడొకడు పుడతాడని చెప్పి అంతర్థానమయ్యిందట. అంటే, అన్నమయ్యను శ్రీవైష్ణవ గురువులలో ఒకడిగా చేర్చే ప్రయత్నంలో కూడా గ్రామదేవత ప్రస్తావన పూర్తిగా తొలగిపోలేదు. అంటే, తాళ్ళపాక వారికీ గ్రామదేవతకు వారి పూర్వ చరిత్రలో ఉన్న గట్టి సంబంధాన్ని ఈ ప్రస్తావన సూచిస్తుందని మనం అనుకోవచ్చు.

అన్నమయ్య మనవడి కథనం ప్రకారం, తాళ్ళపాక కుటుంబ సభ్యులు తామసమైన గ్రామదేవతారాధన నుండి సాత్త్వికమైన వైష్ణవులుగా మతాన్ని మార్చుకోవడం అన్నమయ్య జీవిత కాలంలోనే, ఒకే తరంలో, పూర్తిగా జరిగింది. ఇదే కాలంలో చౌడేశ్వరి దేవి అర్చకత్వ బాధ్యతలు నందవరీక వంశం వారినుండి తోగట వారికి అప్పచెప్పారని అల్లంరాజు విజయేంద్రనాథ రావు తెలుగు సాహిత్యంలో చౌడేశ్వరి దేవి చరిత్ర అనే పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ తిరుపతిలో రెండు విభిన్నమైన స్థానిక సంప్రదాయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మనకు కనిపిస్తాయి: ఒకటి వేంకటేశ్వరునికి, అతని సోదరుడు గోవిందరాజుతో గూడిన పురుష దేవతల సంప్రదాయం; మరొకటి చౌడేశ్వరి, గంగమ్మ మొదలైన గ్రామదేవతలు, ఆపై సాత్విక రూపంలో పద్మావతి/అలమేలుమంగ మొదలైన స్త్రీ దేవతల సంప్రదాయం. ఇవి రెండు విభిన్నమైన సంప్రదాయాలుగా కనిపిస్తున్నా, కాలగతిలో ఒకదానిని ఒకటి ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు.

ఇదే కాక, తిరుపతి ప్రాంతాల్లో వినిపించే మరో కథ: వేంకటేశ్వరుని విగ్రహం స్త్రీ విగ్రహమనీ, రామానుజాచార్యుడు ఇక్కడి మతాన్ని శ్రీవైష్ణవ మతానికి మార్చి అదే సమయంలో మూలవిగ్రహాన్ని వేంకటేశ్వరునిగా మార్చాడని చెప్పుకుంటారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతరలో దేవత పలు వేషాల వస్త్రధారణ ధరించడం ఆనవాయితీ. ఈ వేషాల్లో మగదొర వేషం కూడా ఒకటి. అంటే, పైపైన కనిపించే మగవేషం వెనుక అసలైన స్త్రీ ప్రకృతి దాగి ఉందని చెబుతారు. అలాగే, ఈ జాతరలో పాల్గొనే మగవారు ఆడ దుస్తులు ధరించి ఆడవారుగా వ్యవహరించడం విశేషం.

ఈ రకంగా పలు మత ధోరణుల సంకీర్ణ సమ్మేళంగా తిరుపతి తిరుమల దేవస్థాన చరిత్ర క్లిష్టమైనది. ఇదే రకమైన క్లిష్టత తాళ్ళపాకవారి చరిత్రలోనూ కనిపిస్తుంది. స్త్రీదేవత పురుషరూపంలో మారటంలోనూ, దాగివున్న స్త్రీప్రకృతి బయటపడటం అన్నది ఆసక్తిని రేకెత్తించే అంశం. లోలోపల దాగి ఉన్న స్త్రీప్రకృతిని బహిర్గతం చేసే శృంగార పదాలను కూడా అన్నమయ్య స్త్రీగొంతుకలో వినిపించడం విశేషం. ఈ అంశాన్ని విపులంగా శృంగార పదాల విభాగంలో చర్చిద్దాం.

6. వేంకటేశ్వరీకరణ
ఎలాగైతే, అన్నమయ్య చరిత్ర శ్రీవైష్ణవ సంప్రదాయ గురువుల చరిత్రలో భాగంగా రూపాంతరం చెందిందో, అదే విధంగా కొండల రాయడు కూడా వేంకటేశ్వరుడిగా రూపాంతరం చెందాడు. ఆ దేవుడు మధ్యయుగపు తమిళ శ్రీవైష్ణవ సంప్రదాయంలో వర్ణింపబడ్డ భగవంతుని సాత్విక లక్షణాల కనుగుణంగా కరుణామయుడిగా, శాంత స్వభావునిగా, భక్తుల కోర్కెలు ఈడేర్చే వరప్రదాతగా వేంకటేశ్వరీకరించబడ్డాడు.

క్రీస్తు శకం 1491లో తిరుమల ఆలయ ప్రాంగణంలో ‘తిరువేంకటమహాత్మ్యం’ అనే నాటకాన్ని ప్రదర్శించే వారని మనకు దొరికిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనకు లభ్యమౌతున్న గ్రంథాలలో ఈ నాటకం దొరకక పోయినా, 15-16వ శతాబ్దాలలో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎంతో సృజనాత్మక సాహిత్యం సృష్టింపబడేదని చెప్పడానికి ఇది ఒక ఆధారంగా పనికి వస్తుంది. తిరుమల దేవస్థాన సంస్థ నిర్వాహణలోనూ, సాహిత్య సృష్టిలోనూ అన్నమయ్య కుటుంబ సభ్యుల పాత్ర ఉచ్ఛస్థాయిలో ఉన్న రోజులవి. ఆ పాటికి స్త్రీ ప్రాధాన్యత గల పాంచరాత్ర సంప్రదాయం పూర్తిగా శ్రీవైష్ణవ సంప్రదాయంతో కలిసిపోయింది. అంతేకాక వేంకటేశ్వరునికి సంబంధించిన కథ బహుళ ప్రాచుర్యం చెందడంతో అంతకు ముందు దేవతల గురించి చెప్పే కథల ప్రాధాన్యత తగ్గిపోయింది. 15వ శతాబ్దంలో తిరుపతిలో వచ్చిన సామాజిక, ఆర్థిక పరిణామాలను ఈ కథ ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ‘ఎడమచేతి’ కులాల వారి ఆధిపత్యానికి, ద్రవ్యసంబంధమైన ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సూచకంగా కూడా భావించవచ్చు. ఈ కొత్త సామాజిక ఆర్థిక వ్యవస్థ వల్ల, సంబంధిత రాజకీయ, సంస్థాగత మార్పుల వల్లనూ ఈ దేవాలయం గొప్ప ప్రజాదరణను, ఆర్థిక సంపత్తిని చూరగొన్నది. ఈ దేవాలయంలోని దైవం ఒక చక్రవర్తి గాను, ఒక గొప్ప కోశాధికారిగానూ సమాజంపై ప్రభావం చూపిస్తూ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో దేవస్థానానికి ఎనలేని ఆధిపత్యాన్ని కట్టబెట్టాడు.

ఈ పరిణామాన్ని మేం ‘వేంకటేశ్వరీకరణ’ అని పిలిచాం. ఈ కాలంలోనే ఈ దైవానికి ‘కొండల రాయడు,’ ‘వడ్డికాసులవాడు,’ ‘వట్టి పణం పెరుమాళ్’ అని కొత్త, కొత్త విశేషణాలు జత కూడాయి. ఈ విశేషణాలను వివరించే స్థల పురాణాలు తయారయ్యయి. భవిష్యోత్తర పురాణంలో ‘శ్రీవేంకటాచల మహాత్మ్యం’ వివరించే కథ ఇది: విష్ణువుపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి వెళ్ళిపోతే ఖిన్నుడైన విష్ణువు ఆమెను వెతుకుతూ తిరుమల చేరుకున్నాడు. తన పత్ని కోసం ప్రపంచం నలుమూలలా వెతుకుతూ అలసిన విష్ణువుకు వేంకటగిరిపై కొంత ఊరట కలిగినట్టనిపించింది. వరాహస్వామి నుండి కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరుచుకొన్నాడు. ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన రాసి ఇచ్చాడు. వేంకటంలో వేంకటేశ్వరునిగా స్థిరపడ్డ శ్రీమహావిష్ణువు పద్మావతి అనే ఒక స్థానిక యువతిని ప్రేమించాడు. ఆమె అక్కడి రాజైన ‘ఆకాశరాజు’ కూతురు. వేంకటేశ్వరునికి ఆకాశరాజుకు మధ్య ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలు, బేరసారాలు జరిగాక ఆకాశరాజు చివరకు తన కూతురుని అతనికి ఇచ్చి వివాహం జరపడానికి ఒప్పుకున్నాడు. అయితే, ఈ పెళ్ళి ఖర్చులన్నీ వేంకటేశ్వరుడే భరించాలి కాబట్టి, అతడు కుబేరుని వద్దనుండి అప్పు తీసుకొన్నాడు (స్థానిక కథనాలలో ఈ అప్పు ఇచ్చింది వేంకటేశ్వరుని అన్న అయిన గోవిందరాజు). అయితే, ఈ అప్పుకు వడ్డీ చాలా ఎక్కువ. అందుకే తిరుపతి కొండ ఎక్కే భక్తులందరూ ఈ వడ్డీ తీర్చడానికి తమకు తోచిన రీతిలో హుండీలో డబ్బు వేసి సాయం చేస్తుంటారు. స్కందపురాణంలోని ‘వేంకటాచల మహాత్మ్యం’ లో కూడా ఈ కథలో కొంతభాగం మనకు కనిపిస్తుంది.

ఈ కథలో వ్యాపార ఒప్పంద పత్రాలు, అప్పుపత్రాలు, పెట్టుబడులు, సంస్థ యాజమాన్యం మొదలైన ఆధునిక అంశాలు కనిపించడం విశేషం. ఇటువంటి వ్యాపార నియమాలే వేంకటేశుని నిలయంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ నిర్వహణా చరిత్రలోనూ అవసరమై ఉంటాయని మనం ఊహించవచ్చు. అన్నమయ్య సంకీర్తనలలో కూడా ఈ విధమైన వ్యాపారాంశాలు చోటు చేసుకోవడం మనం గమనింపవచ్చు. ఉదాహరణకు, ఈ కింది శృంగార సంకీర్తనలో లాభము, వడ్డీ, కూడబెట్టుకోవడం వంటి అంశాల ప్రస్తావన చూడండి:

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే
చెంతనుండి యాసతోనేఁ జెనకఁగాను

కలువకన్నులచూపు గాటేఁ బోసుకొనేవటే
పొలసి మోమెత్తి యిటు చూడఁ జాలవు
వలనైన చిరునవ్వు వడ్డి రెచ్చుకొనేవటే
వెలయ నీ వెంత నవ్వించినా నగవు

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే

కొండలవంటి కుచాలు గూఁటఁ బెట్టుకొనేవటే
దండిగాఁ బయ్యద మూసి దాఁచు కొనేవు
పండిన జవ్వన మిదె పాఁతర వేసేవటే
వుండబో ముసుఁగు వెట్టు కూరకే వున్నదానవు

ఇంత గుట్టు సేసుకొని యేమి గట్టుకొనేవే

ముచ్చట మాటలాడక మూట గట్టుకొనేవటే
తచ్చన మోసముతోఁ బెదవు లెత్తవు
ఇచ్చటఁ జుట్టమ వైతి వేను శ్రీవేంకటేశుఁడు
మచ్చిక లన్నిటాఁ జల్లి మంతన మాడేవూ.

ఇక్కడ మరో అంశం గమనించాలి: తిరుపతి దేవస్థానపు ధార్మిక విషయాలలో నేతకు సంబంధించిన తోగట, కైకాల, దేవాంగ వంటి కులాల వారి ఆధిపత్యం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు, తోగటవారికి చౌడమ్మ, నందవరీకులకు సంబంధించిన అర్చక వృత్తి అనువంశికంగా వచ్చిందని చెప్పుకుంటారు. కైకాల వారు గంగమ్మ గ్రామదేవతకు, గోవిందరాజు ఆలయపు యాజమాన్య నిర్వాహణకు బాధ్యులు. అన్నమయ్య వేంకటేశుని ఒక సంకీర్తనలో ‘వాడల వాడల వెంట’ తిరిగే ‘నేత బేహారి’గా అభివర్ణించాడు. తిరుపతిలోని నేత వారందరూ అన్నమయ్య మనవడైన చిన్నన్నను తమ గురువుగా ఎన్నుకొని, ఈ స్థానాన్ని తాళ్ళపాక కుటుంబంవారు వంశపారంపర్యంగా స్వీకరించాలని అర్థించారట. ఇందుకు ప్రతిగా చిన్నన్నకు పదివేల వరహాలు సమర్పించుకున్నారట. నేత కులాల వారి ఆధిపత్యం, వ్యాపారాంశాలతో కూడిన ఆచార వ్యవహారాలు మొదలైనవి తిరుపతిలో మనం అంతకు ముందు చర్చించిన ‘ఎడమచేతి’ కులాల వారి ప్రాధాన్యాన్నే సూచిస్తుంది.

సంగ్రహంగా చెప్పాలంటే, మా దృష్టిలో తిరుపతి దేవస్థాన చరిత్ర ఇది: తొలినాళ్ళనుండి ఇప్పటి ‘వేంకటేశ్వరీకరణ’ వరకూ ఈ దేవాలయం ఎన్నో మార్పులు చెందింది. ఎప్పటినుండో స్థానిక దేవతలకు నిలయమైన ఈ ఆలయం క్రీస్తుశకారంభంలో ప్రాచీన వైఖానస మతానుయాయుల ఆధిపత్యం లోకి వచ్చింది. మొదటి స్థానిక దేవతలలో వరాహమూర్తి ఒక దేవుని రూపం కావచ్చు. ఇతర స్త్రీ గ్రామదేవతలకు కూడా ఇక్కడ స్థానం ఉండి ఉండవచ్చు. ఇక్కడి స్థానిక రాజుల ప్రాపకం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, 10వ శతాబ్దపు చోళ రాజుల కాలం నాటికి దైవం శ్రీమహావిష్ణు రూపంలో స్థిరపడి ఉండవచ్చు. 12వ శతాబ్దం నాటికి పాంచరాత్ర సంప్రదాయ ప్రభావంతో స్త్రీ దేవతలకు తిరిగి కొంత ప్రాతినిధ్యం లభించింది. కొండ అడుగున తిరుచ్చానూరులో అలమేలుమంగ-పద్మావతి దేవాలయం ఈ కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. 12వ శతాబ్దం నుండి ఆగమ వైష్ణవ మత ప్రాబల్యంతో ఇది శ్రీవైష్ణవ దేవాలయంగా మారిపోయింది. తాళ్ళపాక అన్నమయ్య ప్రవేశించే నాటికే ఈ దేవాలయం ‘ఎడమచేతి’ కులాల వారి ఆధిపత్యంలో, వారి రాజకీయ, సంస్థాగత వ్యవస్థలతో ఎంతో సుసంపన్నమైతున్నది. ఆ శతాబ్దంలోనే ఈ సంస్థకు, మొదట స్థానిక రాజులతో, వారి ద్వారా విజయనగర రాజులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడే విజయనగర రాజ్యం మహాసామ్రాజ్యంగా విస్తరిస్తున్న రోజులవి. ఈ సామ్రాజ్య రాజుల అనుబంధంతో ఈ దేవాలయపు వేంకటేశ్వరీకరణ ప్రారంభమయ్యిందని చెప్పుకోవచ్చు. భగవంతునితో భక్తునికి సన్నిహిత సంబంధం నెలకొల్పే పలు మార్గాలను అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ప్రబోధించడం కూడా ఇందుకు ఎంతగానో దోహదం చేసి ఉంటాయి. ఈ విషయంలో అన్నమయ్య వంశానికి అంతకు ముందు స్థానిక గ్రామదేవతలతో, నాథ సంప్రదాయంతో ఉన్న గాఢమైన అనుబంధం అన్నమయ్య దృక్పథంపై, తద్వారా తిరుపతి దేవస్థాన వ్యవస్థపై ప్రభావం చూపించింది. అన్నమయ్య పదాలను రాగిరేకులపై చెక్కి, ఆంధ్ర తమిళ దేశాలలోని దేవాలయాలకు వితరణ చేసే కాలానికి అన్నమయ్యతో పాటు, తిరుపతి దేవుడు కూడా పూర్తిగా రూపాంతరం చెందారు. ఒక రకంగా కొండలరాయడుగా మనకు తెలిసిన వేంకటేశ్వరుడు పూర్తిగా అన్నమయ్య రూపకల్పన. అన్నమయ్య వేంకటేశుని ఆస్థాన కవిగా, ఆ దైవాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి తన జీవితం అంకితం చేశాడు. అందుకు ప్రతిగా, వేంకటేశుడు అన్నమయ్యకు వారి కుటుంబానికి ఎనలేని ఆర్థిక సంపత్తిని కూర్చిపెట్టాడు.

7. ఆధ్యాత్మిక పదములు
అన్నమయ్య సాహిత్యాన్ని పరిశీలించే వారికి ఆయన సంకీర్తనలను ఆధ్యాత్మిక సంకీర్తనలుగా (మా దృష్టిలో ఇవి ఆత్మవిమర్శనా సంకీర్తనలు), శృంగార సంకీర్తనలుగా విభజించడంలో గల కారణాలు అంత సులభంగా బోధపడదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ రకమైన విభజన రాగిరేకులలోనే ఉంది. కొన్ని సార్లు ఒక్కో సంకీర్తనను ఆధ్యాత్మిక సంకీర్తనగా గానీ, శృంగారసంకీర్తనగా గానీ నిర్ణయించడం అంత సమంజసం అనిపించకపోవచ్చు. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు: ఈ సంకీర్తనా వాఙ్మయంలో రెండు పూర్తిగా విభిన్నమైన గొతుకలు వినిపిస్తాయి. “ఇంత విభిన్నమైన పార్శ్వాలు నిజంగా ఒకే కవి మనస్సులో ఉండడం సాధ్యమా?” అని ఒక్కో సారి సందేహం కలగక మానదు. అయితే, ఈ రెండు రకాల సంకీర్తనలలో శైలిలోనూ, భాషలోనూ కనిపించే సారూప్యత ఇవి ఒకే కవిచే రాయబడ్డాయి అని నిర్ధారిస్తుంది.

అన్నమయ్యలో కనిపించే ఆధ్యాత్మికత బాహ్యప్రపంచానిది కాదు. అది అంతర్ముఖమైనది. తనలోకి తాను చూసుకుని తనని తాను ప్రశ్నించుకుంటున్నది. ఈ సంకీర్తనలలో వినిపించే గొంతుకలో వేదన, సంఘర్షణ, మరికొంత ఆత్రుత, కొన్నిసార్లు అపరాధ భావనతో కూడిన ఆత్మనింద, కొన్నిసార్లు స్త్రీల పట్ల ద్వేషభావం, కొన్నిసార్లు కేవలం గడిచిన సంఘటల పట్ల విచారం, దుఃఖం – వీటన్నిటితోపాటు గాఢమైన కవితాత్మకత. ఉదాహరణకు ఈ సంకీర్తన చూడండి:

కడలుడిపి నీరాడగా తలచువారలకు
కడలేని మనసుకు కడమ యెక్కడిది

దాహ మణగిన వెనుక తత్వ మెరిగెదనన్న
దాహ మేలణగు తా తత్వ మే మెరుగు
దేహంబుగల యన్ని దినములకు పదార్థ-
మోహ మేలణగు దా ముద మేల కలుగు

ముంద రెరిగిన వెనుక మొదలు మరచెద నన్న
ముంద రేమెరుగు దా మొద లేల మరచు
అందముగా తిరువేంకటాద్రీశు మన్ననల
కందువెరిగిన మేలు కలనైన లేదు

ఎన్నో ఆధ్యాత్మక సంకీర్తనల్లో లాగే ఈ సంకీర్తనలో కనిపించే ఆత్మాశ్రయమైన భావాలు మనందరికీ సుపరిచితమైనవే. కవి అడిగే ప్రశ్నలు మన నిజజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎదురుపడ్డ భావాలే. ఇందులోని కవి తన మనస్సుతో తానే జరిపే సంవాదాన్ని రెండు గొంతుకల సంభాషణగా మనకు వినిపిస్తున్నాడు. ఒక గొంతుక మనుష్యులు సాధారణంగా ఒక పని చెయ్యడానికి తమ అభద్రతాభావంతో విధించే నిబంధనలను, “అది చేజిక్కితే, ఇది వదిలేస్తాను” అంటూ జరిపే బేరసారాలను వినిపిస్తుంటే, మరో గొంతుక ఆ వాదనలోని అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ పరిహాసం చెయ్యడం కనిపిస్తుంది. అంటే మనిషికి ఈ నిబంధనల్లో, బేరసారాల్లో ఉండే డొల్లతనం పూర్తిగా తెలుసు. అయినా తన సహజమైన లౌకిక ధోరణిని వదులుకోలేకపోతున్నాడు. ఫలితంగా, దేవుడిని చేరుకొనే మేలైన మార్గాన్ని చేరుకోలేకపోతున్నాడు. అందుకే, ఈ ధోరణిని మానవుడు కొనసాగించినంతకాలం “కందువెరిగిన మేలు”ను కలలో కూడా సాధించలేకపోతున్నాడు.

తేలికైన పదాలతో, అందరికి అర్థమయ్యే భాషలో అన్నమయ్య ఇంత సున్నితమైన భావాలు వెలిబుచ్చగలగడం ఈ కీర్తన విశేషం – ఇందులో వాడుకున్న హల్లులు కూడా వినసొంపుగా ఉండే సరళాలు, అనునాసికాలు. ఇందులో చాలా చిన్ని, చిన్ని ప్రశ్నలు మననే గుచ్చి ప్రశ్నిస్తున్నట్టు, సమాధానాలు ఎత్తిపొడుస్తున్నట్లు ఉండి మనను అపరాధభావంలో పడేస్తాయి. ఈ సంభాషణకు ఎత్తుగడగా పాట ప్రారంభంలోని ఉపమానమైన సముద్రం: హృదయ ఘోష లాగే సముద్ర ఘోషకు ఎప్పటికీ తెరిపి లేదు; ఈ ఆలోచనల అలలు ఎప్పటికీ కడతేరవు. ఈ సంభాషణ కూడా తెలుగువాక్యంలోని పదాలలాగే ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఎడతెగకుండా కొనసాగడం మనం ఊహించవచ్చు. అసలు సమస్య ఎప్పటికీ తృప్తి పడని మానవుని మనస్సు – ఈ ఆలోచనల ఘోష నరజన్మ ఎత్తిన ప్రతి వాడికి తప్పదు అని మనం తెలుసుకోవాలి.

కొన్నిసార్లు అన్నమయ్య ఈ విషయాన్నే సూటిగా చెబుతాడు:

హీనదశల బొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాడే మేలు

అరుదైన క్రిమికీటకాదు లందు బుట్టి
పరిభవముల నెల్ల బడితి గాని
యిరవైన చింత నా డింతలేదు యీ
నరజన్మము కంటె నాడే మేలు

తొలగక హేయజంతువుల యందు బుట్టి
పలువేదనల నెల్ల బడితి గాని
కలిమియు లేమియు గాన నే డెరిగి
నలగి తిరుగుట కంటె నాడే మేలు

కూపనరకమున గుంగి వెనకకు నే
బాపవిధుల నెల్ల బడితి గాని
యేపున దిరువేంకటేశ నా కిటువలె
నా పాల గలిగిన నాడే మేలు

శ్రీవైష్ణవ మత సిద్ధాంతాల ప్రకారం ఇటువంటి నరుని వేదనలకు పరిష్కారం శరణాగతి. అన్నమయ్య కూడ ఎన్నో కృతుల్లో చిట్టచివరి చరణంలో వేంకటేశుని శరణు పొందటమే ఈ వేదనలన్నింటికీ పరిష్కారమని సూచించడం కనిపిస్తుంది. శరణాగతిలో ఆత్మ తానే తానై ఉండడం ద్వారా పరమాత్మతో ఏకత్వం పొందుతుంది. ఈ ఏకత్వ సిద్ధితో నరజన్మలోని నెరుసులన్నీ తొలగిపోతాయి:

నేనై విడువవద్దు తానై తగులవద్దు
తానే తానై వుంటేఁ దగులెల్ల నూడు

పొద్దు వొద్దు హరిఁ దలఁపునఁ దలపోయఁగ
వొద్దికైనపలుచేఁత లున్న వెల్లా మరచును
నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే
బుద్ధితోఁ గర్మములు గొబ్బున జారిపోవును

పలుమారు గురుసేవఁ బరగఁగా బరగఁగా
చలివాసి యత్మవిజ్ఞానముఁ బొడచూపు
కలగన్నవాఁడు మేలుకనిన కలవలెనే
పలుసంసారములెల్ల భావనలై యుండును.

పక్కన శ్రీవేంకటేశుపై భక్తి వొడమఁగా
అక్కజపు టిహపరా లరచేతివి యౌను
చొక్కపు పరుసమంటి సొంపుగానిలోహము
నిక్కఁ బైఁడైనట్టు నెరుసెల్లఁ దొలఁగును

తానే తానై వుంటేఁ తగులు (చిక్కులు) అన్నీ తొలగిపోతాయట. ప్రతి పొద్దు హరిని తలపున తలపోస్తే ఈ వేదనలన్నీ నిద్దిరించువానిచేతిలో నిమ్మపండు వలె జారిపోతాయట.

అయితే, “తానే తానై” ఉండటం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకచోట అన్నమయ్య సూటిగా చెప్పినట్టు నరుని వేదనలకు పరిష్కారం ఉంది కాని, ఆ పరిష్కారాన్ని చేరుకోవడానికి మార్గమే లేదు. ఇది ఎంత గడ్డు సమస్య అన్నది అధ్యాత్మిక సంకీర్తనల్లో అన్నమయ్య మనకు విపులంగా, హృద్యంగా మనకు వివరిస్తాడు. ఈ సంకీర్తనలు మనకు ఒక రచయిత రోజూవారి ఆలోచనలు రాసుకొనే డైరీ చదివినట్లు అనిపిస్తుంది: ఎన్నో పరస్పర వైరుధ్యమైన భావాలు, ఆత్మవిమర్శనలు, అపనమ్మకాలు, వివిధ మానసిక స్థితులలో రాసుకున్న భావాల పరంపర ఈ సంకీర్తనల్లో మనకు కనిపిస్తాయి. ఈ ఆత్మవిమర్శనా గీతాల్లో దేవుడి ప్రస్తావన ఉంటుంది కానీ, ఆత్మ విమర్శనయే ప్రథానమైన అంశం.

దురదృష్టవశాత్తూ, ఇది మనిషి జన్మ. కోరికలను త్యజించడం సులభమైన పని కాదు. ఈ ఐహిక వాంఛలనుండి ఎలా విముక్తి పొందాలో తెలుస్తున్నప్పటికీ అది ఆచరించడం మానవసాధ్యం కాదు. అధ్యాత్మిక పదాలలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ఈ వేదనే. తనని తాను సందేహించుకుంటూ, తనని తాను ద్వేషించుకుంటూ తనని తాను ప్రశ్నించుకుంటూ చేస్తున్నఈ ప్రయత్నంలో దేవుడు ఎప్పుడూ దూరంగా నిలబడి చూస్తుంటాడు. కానీ, పదాలన్నీఆయననే ఎలుగెత్తి పిలుస్తుంటాయి, ఆయనతోనే నేరుగా మొర పెట్టుకుంటాయి. దేవుణ్ణి కూడా వదలడు కవి. కాసేపు బ్రతిమాలుతాడు, కాసేపు బుజ్జగిస్తాడు, కాసేపు కసురుకుంటాడు, కాసేపు ఎత్తి పొడుస్తాడు. వాళ్ళిద్దరి దగ్గరితనం అలాంటిది. దేవుడి గురించిన సంగతులన్నీ కవికి తెలుసు. ఆయన అవతారాలని అప్పుడప్పుడూ ఆట పట్టిస్తాడు. అప్పుడప్పుడు ధిక్కార స్వరంతో ఎదురుతిరుగుతాడు.

పనిలేక జీవులను భవసాగరంబులో
మునుగ లేవగ జేయు మోహ దోసమున
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను
వెన కెవ్వరో మొదలి వేలుపనక

తన మీద ఆధారపడి ఉన్న ఆ భగవంతుడి అవసరాన్నివాడుకుంటాడు:

నే నొక్కడ లేకుండితే నీ కృపకు బాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

భావించి నావంటి నీచు బట్టి కాచినప్పుడుగా
యే వంక నీ కీర్తి గడు నెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు

కొన్నిసార్లు ఎత్తిపొడుపు మరింత పరుషంగా మారుతుంది.

వెన్నలు దొంగిలు నాటి వెఱ్ఱివా నీవు
విన్న కన్న జాడ గాదు వెఱ్ఱివా నీవు

చేరి నిన్ను నొల్లనట్టి జీవుల నీ వుదరాన
వీరుడవై మోచేవు వెఱ్ఱివా నీవు
నార పేరు నుడిగితే నా పేరంటా దగిలేవు
వీరాన జుట్టమవై వెఱ్ఱివా నీవు

దేవుడు దయామయుడు. కానీ బలమూ, కీర్తీ రెండూ ఉన్న దేవుడికి దయగా ఉండవల్సిన అవసరమేమున్నది? అందుకనే నీకు వెఱ్ఱి అని అంటున్నాడు దేవుడితో. లేకుంటే తనలాంటి వాడు ఎవరు మొర పెట్టుకున్నా, తటాలుమని రక్షించడానికి బయలుదేరి నవ్వుల పాలైతావు ఎందుకయ్యా? అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దేవుడిని ఆట పట్టిస్తున్నట్టుగా ఉన్నఈ ధ్వని పైకి వినిపిస్తున్న మాట అర్థానికి వ్యతిరేకమైనది. పైకి సమవుజ్జీగా మాట్లాడుతున్నా లోలోపల ఆయనకు లొంగిపోయే ఉన్నాడు కవి. ఆ అనుబంధం ఇచ్చిన ధైర్యం వల్లనే దేవుడితో ఇటువంటి పరాచికాలు ఆడగలుగుతున్నాడు.

ఈ రకంగా మనకు అన్నమయ్య పదంలో ప్రశ్నించే గొంతు కనిపిస్తుంది. చంచలమైన చిత్తం తన మనసుతో ఆడిస్తున్న తోలుబొమ్మలాటను గమనించిన గొంతు ఇది. అంతే కాదు, దైవసాన్నిధ్యం దొరికినప్పుడు కూడా మనసులో కలిగే సందేహాలను కూడా ఈ గొంతు గుర్తించింది. అందుకే, ఆట పట్టించే మిషతో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవుడి మీదకు నెడుతున్నాడు. అన్నమయ్య శరణు వేడుకోవడంలో నిగూఢత ఇదే. ఇది మామూలుగా రక్షించమని అడగడం కాదు. ఐహిక వాంఛలకు లొంగిపోయిన శరీరం తనది అని గుర్తింపుతో వచ్చిన కోపాన్ని దేవుడి సమస్యగా చేయడం ఇది. ఈ సమస్యను తీర్చవలసింది ఆ దేవుడే.

వెలయ దన మనసునకు వేంకటేశుడు గర్త
బలిసి యాతని దలచు పనికి దా గర్త
తలకొన్న తలపులివి దైవమానుషముగా
దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా

మానవుడి సంకల్పానికి ఈ సంభాషణలో చోటు లేకపోలేదు. కానీ అది చాలా పరిమితమైన పాత్ర పోషిస్తుంది. అంతిమంగా నిజం తెలుసుకోడంలో తనకు బుద్ధి నిచ్చిన దేవుడు, ఆ బుద్ధిని తన ఇష్టానుసారం వాడుకోగలిగిన మానవుడు — ఇద్దరి బాధ్యత మనకు కనిపిస్తుంది.

ఎచ్చోటి కేగిన యెప్పుడూ దమలోని
మచ్చిక పెను దెవులు మానకపోయె

పాయపు సతుల గుబ్బల పెద పొట్లాల
కాయము వడి నొత్తి కాచగను
రాయిడిచే ఘనమాయె గాని లోని
మాయపు పెను దెవులు మానకపోయె

ఈ పదాలలో మనకు వినిపించేది పురుష ధ్వని. దేవుడితో మాట్లాడుతున్నది మగవాడు. అందుకనే స్త్రీ కలిగించే ఆకర్షణను అప్పుడప్పుడూ అమిత పరుషంగా నిందించడం కూడా కనిపించకపోదు.

చక్కదనముల వారసతులాల
యెక్కువతెక్కువల మీరేమి సేసేరికను

దొంగిలి మా గుట్టులెల్లా దోవ సేసి మరుబారి
భంగపెట్టితిరిగా నో భామలార
చెంగలించి వేంకటేశు సేవకు జొచ్చితిమి
యెంగిలిమోవులును మీ రేడబడే రికను

ఈ పదాలలో స్త్రీ ద్వేషిలా కనిపించే అన్నమయ్య శృంగార కీర్తనలన్నీ స్త్రీ గొంతుకలో వ్రాశాడు. ఆ పదాలలో స్త్రీ సహజమైన కోరికలు వెలిబుచ్చడంలో బిడియము, వారి సిగ్గు, ఇత్యాది లక్షణాలు ఎంతో సున్నితంగా చిత్రీకరిస్తాడు. ఇది ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలంటే ముందు మనం ఈ శృంగార కీర్తనల భావాన్ని లోతుగా పరిశీలించాలి.
8. శృంగార కీర్తనలు
మునుముందుగా ఈ కీర్తన చూడండి:

యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను
కఱకఱిసేసితేను గయ్యాళి యందురు

మలసి తన కెదురు మాట లాడుటకంటే
చెలిచే మనవి చెప్పించేదే మేలు
పలుమారు దన్ను జూచి పచ్చారుకంటేను
తలవంచుక తనముందర నుండుటే మేలు

తడివి మందెమేళాన దనతో నవ్వుటకంటే
వొడికమై సిగ్గుతోడ నుండుటే మేలు
సడిబెట్టి సారె సారె సరస మాడుటకంటే
వుడివోని బత్తితోడ నుమ్మగిలుటే మేలు

ఆనుకొని తన్ను రతి నలయించుటకంటే
పానుపుపై దండ నిట్టే పండుటే మేలు
నే నలమేలుమంగను తాను శ్రీవేంకటేశుడు
మేనంటి తా నన్ను గూడి మెఱయుటే మేలు

ఏలినవాడి సతి, అలమేలుమంగ తన చెలితో మాట్లాడుతున్నది. చాడీలు చెప్తున్నట్లున్నది కానీ, ఆమె అసలు ఉద్దేశం తన చెలి మగని చెవిలో ఈ మాటలు వెయ్యకపోదా అని ఆశ. అలమేలుమంగ భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఉన్నది. తన మనసు నెరిగి మసలడు. బిగ్గరగా నవ్వుతాడు, పెద్దగా మాట్లాడతాడు, కామోద్దీప్తుడై ఉంటాడు. ప్రశాంతత అనేది లేకుండా ఉన్నది. అంతకంటే దుర్భరం, అసలు ఆయనకు స్త్రీ ఏమి కోరుకుంటుందో అవగాహన ఉన్నట్టు లేదు. ఆమెకు ఆయనంటే ప్రేమ లేకపోలేదు. అందుకే గదా ప్రేమతో స్పృశిస్తే చాలు అని కోరుకుంటున్నది.

ఈ పదం చదువుతుంటే ఇది నిజానికి ఒక మగవాడు రాసినది అన్న స్పృహ మనకు రాదు. పదంలో సున్నితంగా వ్యవహరించమని కోరుకోవడం స్త్రీ సహజమైనది. ఈ పదం స్త్రీ గొంతులోనే వినాలి. నిజానికి అన్నమయ్య పదాలు ఎన్నో స్త్రీలు పాడడానికి ఎంతో అనువైనవి. అలా అని, అన్ని పదాలూ సున్నితమైనవి, పతికి దాసోహమనేవి కావు. ఇంతకు ముందు ఒక ఉదాహరణలో చూపించినట్లు, పదం నడిచే కొద్దీ, చరణం నుంచి చరణానికి మనస్థితి మారుతుంటుంది.

పొద్దు వోక నీవు నాతో బొంక వచ్చే వింతే కాక
గద్దించి నీ వెట్టుండిన గాదు గూడ దనేనా

నన్నొడబరచకుర నమ్మికలు సేయకుర
నిన్నే మయిన నంటినా నీవు గొంకేవు
అన్నిట లోకమువారు ఆడుకొందు రింతే కాక
విన్న నీ సుద్దులు వెల్లవిరి సేసేనా

యింత నన్నుబ్బించకుర యిచ్చకాలు సేయకుర
జంతనై నిన్నిక నే సాధించేనా
కాంతుడ నీ చుట్టాలు పక్కాలు నమ్మ రింతే కాక
మంతనాన నీపై నింద మరి వేసేనా

భగవంతుడిని ఆక్షేపించడంలో అధ్యాత్మిక కీర్తనలలో కనిపించే ధైర్యమే శృంగార కీర్తనలలోనూ కనిపిస్తుంది. అయితే అక్కడి గొంతులో వినిపిస్తున్న అనిశ్చితి, తనమీద తనకే ఉన్న సందేహమూ, ఇక్కడి స్త్రీ గొంతులో మచ్చుకి కూడా కనిపించవు. ఈ పదాలలో స్త్రీ తన శరీరం గురించి ఏ సందేహమూ లేనిది. ఆమె తన శరీరాన్ని ప్రేమిస్తుంది, కోరికలుండటాన్ని తప్పు పట్టుకోదు. ప్రియుడితో శృంగారంలో తన పాత్ర సమర్థంగా పోషించగలదు. శారీరకంగా, మానసికంగా ఆమె సంతృప్తిని కోరుకోగలదు, పొందగలదు కూడా. ఇది అపరాధంగా ఆమె అనుకోదు. అన్నిటికంటే ముఖ్యంగా, దేవుడికి ఆమె దగ్గరగా ఉన్నది అన్ని రకాలుగా. ఇది కేవలం మానసికమైన దగ్గరితనం కాదు. అది ఆమెకు బాగా తెలుసును.

ఈ సాన్నిహిత్యం ఎన్నో రూపాలలో, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రకంగా, ఈ ప్రేమబంధంలో ఒక్క క్షణాన్ని శాశ్వతంగా నిలిపి వేస్తూ – ఇన్ని వేల పదాలలో కనిపించి మనల్ని ఊపిరి తిప్పుకోనివ్వదు. ఈ పదాలు అద్భుతమైన ప్రేమ కవితలు. స్త్రీ దృక్పథం నుంచి వ్రాసినవి. కానీ నాయకుడు శ్రీవేంకటేశుడేనన్న విషయం ఏ పదమూ మనల్ని మర్చిపోనివ్వదు. అంతర్గతమైన భక్తి బంధం, ప్రత్యక్ష శృంగారంగా బాహ్య రూపం తీసుకుని ఒక ప్రత్యేకమైన ధ్వనినీ, సందర్భాన్నీ సంతరించుకుంటుంది.

నిను బాసినయట్లు నెలతకు వియోగదశ
లెన్నడును దోప విది యేమోగాని

నిను దలచి లలితాంగి నీరూప మాత్మలో
గని నీవు నని బయలు కౌగిలించినది
తనర నాకాశతత్త్వము నీమహత్త్యమని
వనిత యెవ్వరిచేత వినెనో కాని

నిను బొగడి నీరూపు కనుదోయి కెదురైన
తనివిదీఱక బయలు తగ జూడదొడగి
మునుకొన్న సర్వతోముఖుడ వనగా నిన్ను
వెనుక కేభావమున వినెనో కాని

తలపునను వాకునను దలప దలపగ నీవు
కలసి యీకమలాక్షి గౌగిలించితివి
తెలిసితిమి వేంకటాధిపతి నీ విన్నింట
గలవనెడి మాట నిక్కంబువో కాని

ఈ సంకీర్తనలో మాట్లాడుతున్నది బహుశా చెలి అయుండవచ్చు. ఆమె నాయిక ప్రవర్తన గురించి దేవదేవునికి చెప్తున్నది. ప్రియుడు తన దగ్గర లేకపోయినా ఆమెలో విరహ లక్షణాలు కనిపించడం లేవు. ఆమె ప్రియుడితో కూడి ఉన్నట్టే భ్రమిస్తున్నది. అందువల్లనే అతను ఎదురుగా ఉన్నట్టే ఊహించుకొని, కౌగిలింతకై చేతులు చాచుతోంది. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు రెండు అర్థాలు కనిపిస్తాయి. ఒకటి, ప్రియుడు ఎదురుగా ఉన్నాడన్న భ్రమతో చేతులు చాచి కౌగిలించుకోబోవడం సామాన్యంగా ప్రేమ కవితల్లో కనిపిస్తుంది. కానీ రెండవ చరణంలో, దేవుడికి ఈ ముచ్చట చెబుతున్న చెలి భక్తి బంధాన్ని సూచిస్తున్నది. దేవుడు సర్వవ్యాప్తమై ఉన్నాడు. జగమంతా నిండి ఉన్నాడు. కానీ ప్రియురాలికి ఆ రకమైన దగ్గరితనం చాలటం లేదు. భగవంతుడు ఆమె చుట్టూ ఉన్నాడన్న మాట ఆమెకు స్వాంతన నివ్వదు. ఆమె ఇంకా దగ్గరితనం కోరుకుంటున్నది. సాంప్రదాయకమైన భక్తి మనసు లోతులలో ఉన్న ఉద్విగ్నతను దాచిపెడుతున్నది. ప్రియురాలి లక్షణాలలో ఆ ప్రేమోన్మాదాన్ని సాక్షాత్కరిస్తున్నది.

చూడటానికి ఎంతో సరళంగా, సాధారణంగా కనిపించే ఈ పదం రెండు వేరు వేరు అర్థాలనిచ్చే లోతైన రచన. ప్రియుడు ఆమెతో కూడి లేకపోవడం శాపం కావాలి. కానీ, అతడితో కూడి ఉన్నదనే ఆమె ఊహతో అది వరమయింది. సర్వమూ నిండి ఉన్న భగవంతుడు తన చుట్టూ కూడా ఉన్నాడు. ఆ రకంగా పదం పై పొరలలో భక్తి భావం ప్రకటితమైతున్నది. కానీ, పదం లోపలి అర్థం వేరు. ప్రియురాలిని వదిలి వచ్చినందుకు ఆ చెలి పరోక్షంగా నిందిస్తున్నది. అందువల్ల శారీరకమైన ఎడబాటు ముందు తాత్వికమైన భక్తి భావం చిన్నబోతున్నది. ఈ విధంగా భక్తి భావము, ప్రణయ వాంఛల మధ్య ఏదో ఒక కొత్త స్పృహ ఏర్పడుతోంది. ఆ స్థలంలో, ఆ సమయంలో భక్తి భావం, ఐహికసాన్నిహిత్యం కోరుకుంటున్న ఆ ప్రియురాలిని స్వాంతన పరచలేదు. అయితే ఈ తేడా ఎంతో సేపు ఉండదు. అన్ని శృంగార కీర్తనలలో లాగానే పదం ముగిసే సరికి భగవంతునిలో ఐక్యమయిపోవడమే మళ్ళీ ప్రధానమౌతున్నది. ఆ రకంగా ఈ పదం ఒకే సమయంలో శృంగారాన్ని, ఆధ్యాత్మికతనూ తనలో సమ్మిళినం చేసుకుంది. అన్నమయ్యలో ఉన్న ప్రత్యేకత ఇదే. ఈ రెండు భావాలను నమ్మకం కలిగించేటట్టుగా కలిపి చూపించగలగడం. భాగవతంలో కృష్ణుడు మథురకు ప్రయాణమై పోతూ, బృందావనంలో గోపికలకు బాధ పడవద్దని చెప్తాడు. ఎందుకంటే ఈ వియోగం నిజమైన వియోగం కాదు, సర్వమూ తాను ఐనవాడు కదా, అందువల్ల మీతోనే ఉంటున్నానని తెలుసుకోండి, అని. కానీ, కృష్ణుడి పలుకులు గోపికలకి ఏ రకంగానూ ఉపశమనాన్ని ఇచ్చి ఉండవు, వెళ్ళిపోతున్న రథాన్ని చూస్తూ నిలబడి పోయున్న వారికి విరహం తప్ప వేరేదీ తెలిసి ఉండదు. కానీ, ఈ పదంలో ఆ భక్తి భావాన్ని ఎంతో సహజంగా నిజంగా చూపిస్తాడు అన్నమయ్య. ఎలా అయితే ప్రియురాలిలో ఏదో ఒక రకంగా భగవంతుడు భాగం అవుతాడో, అదే విధంగా ఆ పదాన్ని చదువుతున్న మనలోనూ అదే విధంగా ప్రత్యక్షమవుతాడు.

చూడటానికి అమాయకంగా కనిపించే ఈ పదం ఎంతో లోతైన భావాన్ని, ఒకే మనసులోని రెండు విభిన్నమైన పార్శ్వాల్ని చూపిస్తున్నది అని మనం అనుకోడానికి కారణం ఉంది. ఆధ్యాత్మికత, శృంగారము – రెండూ కూడా ఒకే మనసులో జన్మించినవి. భగవంతుడు పూర్తిగా నిండి ఉన్న ఆ మనసు లోనే ఐహిక ప్రపంచానికి చెందిన జిజ్ఞాస కూడా చోటు చేసుకున్నది. ఆధ్యాత్మిక పదాలలో, ఈ జిజ్ఞాసను వదిలించుకొని ఆ చోటు కూడా భగవంతుడితో నింపుకుందామనే కోరిక కనిపిస్తుంది. కానీ శృంగార కీర్తనలలో భగవంతుడు మనసులో భాగం మాత్రమే కాడు. తన అస్తిత్వంలో మమేకమైపోయి తనతో ఆటలాడుతున్న చమత్కారి. ఈ రెండు దృక్పథాలు ఒకే కవిలో ఉన్నాయి. అవి ఆ కవిని అప్పుడప్పుడు చెరొక వైపు నుంచీ సాధిస్తుంటాయి. ఆ సమయాలలో ఆధ్యాత్మికత నుంచి శృంగారానికి, శృంగారం నుంచి ఆధ్యాత్మికతకీ కవి తడబడుతుంటాడు. ఆ పదాలలో కచ్చితమైన విభేదం కనపడదు. ఆ రెండు మనోస్థితుల మధ్య ఘర్షణ స్పష్టమవుతుంటుంది. అదే సమయంలో అన్నమయ్య దేవుడితో ఎలా సంభాషిస్తున్నాడు? స్త్రీ గానా, పురుషుడి గానా? ఈ ప్రశ్నకు సమాధానం శ్రోతలుగా మనం అన్నమయ్య దేవుడితో చేస్తున్న సంభాషణ ఎలా వింటున్నాము అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికతలో మగవాడిగా కవిలో మనం అశాంతిని, ఘర్షణనీ గమనిస్తాము. శృంగారంలో స్త్రీగా విశృంఖల వాంఛనూ, సుఖలాలసనూ చూస్తాము. శృంగార సంకీర్తన లోని స్త్రీ మరింత నిండుగా, పరిపూర్ణమైనదిగా మనం భావించకుండా ఉండలేము. అందుకనేనేమో, అన్నమయ్య ఆధ్యాత్మిక గీతాలకన్నా నాలుగు రెట్లు శృంగార కీర్తనలు రచించాడు.

మనం కొంచెం విశదంగా పరికిస్తే, ఈ రెండు భావాల మధ్య సంఘర్షణ, ఈ సంభాషణలో మౌనంగా పాలు పంచుకుంటున్న భగవంతుడి మీద నిలిపిన దృఢసంకల్పంగా, ఆ భగవంతుడే ఈ రెండు ప్రవృత్తులనూ ఒక త్రాటిపై నిలబెడుతున్న వాడిగానూ మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా నా సంఘర్షణలను నీవిగా చేసుకోమని ప్రార్థిస్తున్న కవి, శృంగారాత్మకంగా, వాస్తవికంగా, భావాత్మకంగా ఆ భగవంతుడితో కలిసిపోయే ఉన్నాడు. ఈ రెండు మనస్తత్వాల మధ్య కఠినమైన అడ్డుగోడ ఏమీ లేదు. కవి చాలా సునాయాసంగా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తిరుగాడుతూ ఉంటాడు. అన్నమయ్య తన జీవితకాలమంతా ఈ రెండు చిత్తాల మధ్యగా ప్రయాణిస్తూ ఈ రెండు రకాల పదాలనీ రచించి ఉంటాడని మనం నమ్మడానికి ఎంతో ఆస్కారం ఉంది.

ఇక్కడ మరొక్క విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రెండు ధోరణులు ఒక దాని నుంచి మరొకటి ఎంత విశిష్టంగా కనిపించినా, వాటిని పరస్పర ఆధారితాలుగా నియంత్రించడం లోనే అన్నమయ్య గొప్పతనం మనకు తెలుస్తుంది. మేము ఇంతకు ముందే ప్రస్తావించినట్లుగా, అన్నమయ్య పదాల అనౌచిత్యపు విభజన అతని కుటుంబీకులు తరువాత చేసి ఉండాలి. తన జీవితకాలంలోనే అపార్థం చేసుకోబడాలని ప్రతి మహాకవికీ రాసి పెట్టుందేమో. ఎందుకంటే ఈ పదాలు ఏవీ కూడా ఒక సాధారణమైన ముద్రకు లొంగేవి కావు. ఈ పదాలలో కనిపించే అధ్యాత్మికత మనకు సాధారణంగా కనిపించే బాహ్య ప్రపంచపు చింతన కాదు. అది అంతర్ముఖ ప్రస్తావన. కేవలం భక్తి తోనే మానవ జీవితపు చెరసాల నుంచి విముక్తులు కాలేమనే దైన్యతను అర్థంచేసుకున్న మనఃస్థితి అది. శృంగారం, రాచకొలువులో కనిపించే కామవాంఛా ప్రేరితమైన శృంగారం కాదు. అది మరింత సున్నితమైనది, బలమైనది, విశిష్టమైనది, వినూత్నమైనది. ఈ రెండు భావాలను వేంకటేశ్వరుడిపై ప్రక్షేపించడంలో కవి తన మనసులో ఉన్న విరుద్ధతలకు సమాధానం చెప్పుకుంటున్నాడు. ఒక పక్క పురుషుడిగా తన భక్తిని, స్త్రీ సహజమైన ప్రణయభక్తినీ ఆపేక్షతో గమనిస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందువల్లనే భగవంతుడు స్త్రీకి ప్రియుడిగా ఉండనూ గలడు; పురుషుడికి నిష్పక్షపాతి గానూ, రాగరహితుడిగానూ అనిపించగలడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసినది — పదాన్ని చదివేవారి మనసు మూలమూలలనూ అతి సున్నితంగా తెరిచి చూపించగలడు అన్నమయ్య. ఈ సున్నితత్వం, అతని కుటుంబీకులు చేసిన ఈ కృత్రిమ వర్గీకరణలో కొంత దెబ్బ తిన్నదనే మా అభిప్రాయం.

9. పద కవితా లక్షణం
అన్నమయ్యపై ఈ పరిచయం ముగించే ముందు మీతో కలిసి ఒక్క పదం మమ్మల్ని చదవనీయండి. ఈ పదం శృంగార కీర్తన. ఈ పదంలో ఎన్ని లలితమైన భావచ్ఛాయలు ఉన్నాయో పరిశీలిద్దాం.

నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
యే నెపమూ వేయ నీపై నింటికి రావయ్యా

చెక్కున బెట్టిన చేయి సేసవెట్టె నీమీద
ముక్కుపై బెట్టిన వేలు ముందే మెచ్చెను
వక్కణ లడుగనేల వలచితి నాడే నీకు
యిక్కువలు చెప్పేగాని ఇంటికి రావయ్యా

సిగ్గువడ్డ మొగమున సెలవినవ్వులు రేగె
వెగ్గళించిన కన్నులే వేడుక జూచె
కగ్గి నీతో నలుగను కడు ముద్దరాలను
యెగ్గు లేమీ నెంచను యింటికి రావయ్యా

వాడిన కెమ్మోవిని వడి దేనెలూర జొచ్చె
వీడిన నెరులలోన విరులు నిండె
యీడనే శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
యీడుగా గూడితి విక నింటికి రావయ్యా

I’m no stranger to you.
You’re not a borrowed thing.
I won’t blame you anymore.

Come home.

I used to stare, my hand on my cheek.
Now that same hand welcomes you with flowers.
I would put my finger on my nose.
Now I like what you do.
Don’t ask for promises.
I’m already in love.
I’ll give you all my secrets.

Come home.

I was so shy. Now I smile for you.
The same eyes that couldn’t hold you
now admire you.
I won’t be cross with you anymore.
I’m your girl.
I’m not picky.

Come home.

My lips were parched.
Now they flow with honey.
My hair, once unkempt,
is now decked with flowers.
You’re the god on the hill.
I’m Alamelumanga.
You’re right for me.

Come home.

ఈ పదంలో స్త్రీ తన ప్రియుడిని ఇంటికి రమ్మంటున్నది. నేను నీకు కొత్త కాదు, నువ్వు అరువు తెచ్చుకునే వస్తువువి కావు అని చెప్పడంలో, వారిద్దరూ ప్రేమికులనీ, ఏదో ఒక కారణం వల్ల ప్రియుడు ఇల్లు వదిలి పోయాడనీ, మనకు తెలుస్తోంది. బహుశా, ఆమె అతన్ని నిందించి ఉంటుంది. ఇప్పుడు ఆమె కోరుకునేది ఒక్కటే. ప్రియుడు తిరిగి ఇంటికి రావడం. నేను నిన్ను ఏమీ అనను అని వాగ్దానం చేస్తున్నది. ఏ అరమరికలు లేకుండా బేలగా, నేరుగా అడుగుతున్నది: “ఇంటికి రావయ్యా” అని.

ఈ పదంలో ఆమెలో ఎన్ని రకాల మార్పులు సంభవించాయో కాలక్రమంలో మనకు స్పష్టం చేస్తుంది. ఆమె మొదటి మాట అప్పుడెప్పుడో జరిగిన సంగతి కాదు. ప్రియుడి మదిలో ఇంకా నిలిచి ఉన్న నిన్నామొన్నటి మాట. వారిద్దరి మధ్యనా వచ్చిన కలహం ఇప్పటిదే. చెంపకు చేయి ఆనించి ఆమె అలిగి కూర్చుంది. ముక్కు మీద వేలు పెట్టిన సమయం అది (ప్రియుడి శృంగార విచేష్టను మందలిస్తూ.) అలా ముందుగా ఆమె ప్రియుడికి ఈ ప్రణయ సంబంధి సన్నివేశాలు గుర్తు చేస్తున్నది, అవి కొంత బాధను కలిగించేవి కూడా.

అంతటితో ఆ ప్రస్తావనను దాటింది. ఇక చెప్తున్నది. చెంపకు చేర్చిన చేయి ఇప్పుడు పూలు జల్లడానికి సిద్ధంగా ఉంది. ముక్కున పెట్టిన వేలు ఇప్పుడు అతన్ని మెచ్చుకుంటోంది. అతని వియోగం ఆమెను ఎంతగానో బాధిస్తున్నది. అతను చూడబోతేనేమో, ఈమెతో బేరసారాలు ఆడుతున్నట్టున్నాడు – నన్నేమీ అనవు గదా, నాలో మళ్ళీ తప్పులెన్నవు గదా? అని. ఆమె అతనికి మళ్ళి తను ఇచ్చిన వాగ్దానం గుర్తు చేస్తూ, భరోసా ఇస్తున్నది. ప్రేమ నిండిపోయిన ఆమె తన ఇక్కువలన్నీ (రహస్యాలన్నీ) అతని కోసం విప్పుతానంటున్నది. (అంటే అతనికి తన నగ్నత్వాన్ని బహుమతిగా ఇస్తానని చెబుతున్నది.) ఈ ప్రస్తావనతో మొదటి చరణం ముగిసి, ఇంటికి రావయ్యా అనే పల్లవి వస్తుంది. కేవలం ఈ ఒక్క అభ్యర్థనతో ఇంతకు ముందు వచ్చిన పొరపొచ్చాలన్నీ మాయమై పోతాయని అనుకున్నదేమో. అంతే కాదు, వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ప్రేమికులని మనకి గుర్తు చేయడం కూడా ఇది.

ఇప్పుడు ఒక అడుగు వెనకకి వేద్దాం. ఆమె వారిద్దరూ మొదటగా కలిసిన దినాల వివరాలు ప్రస్తావిస్తున్నది. ఆ రోజుల్లో ఆమె చాలా అమాయకురాలు. ప్రియుడిని కన్నెత్తి చూడటానికి కూడా సిగ్గుపడేది. అతన్నీ చూసి తల తిప్పుకునేది, లేదా కళ్ళు దించుకునేది. ఇప్పుడదంతా మారిపోయింది. అతని ఊహ రాగానే ఆమె పెదవుల మీద నవ్వులు పూస్తాయి. ఆమె అతన్ని చూస్తూ ఉండి పోవాలని కోరుకుంటుంది. కానీ ఆ చూడటం నిర్లజ్జగా, బాహాటంగా కాదు. ఆమె ఇప్పటికీ ముద్దరాలు, ఎంతగానో సిగ్గుపడే స్త్రీ. ఈమె మితిమీరిన సిగ్గు ప్రణయసమయంలో ప్రియుడిని చిరాకు పెట్టి ఉంటుంది. చిరు కలహం చెయ్యి దాటిపోవడానికి కారణం అదేనేమో. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్నది నేను అంతగా సిగ్గు పడను ఇక మీదట అని. అలా అని నిర్లజ్జాపూరితంగా కూడా ప్రవర్తించను. నేను నీదాననే, అని కూడా చెప్తున్నది.

ఇక్కడి దాకా వచ్చిన తరువాత, ఆమె ఎంత బాధపడిందో కూడా చెప్పవల్సిన సందర్భం వచ్చింది. ఆమె పెదవులు ఎండిపోయి ఉన్నాయి. ఆమె జుట్టు చిందరవందరగా ఉంది. ఈ రోజు, ప్రియుడు వస్తాడనే అనుకున్నదేమో అతనికి నచ్చే విధంగా సింగారించుకుంది. ఆమె పెదవులు తేనెలో నానినట్లుగా నిండుగా ఉన్నాయి. ఆమె జడ వేసుకొని తలలో పూలు తురుముకున్నది. ప్రియుడు తన మొర ఆలకిస్తాడా? ఇంటికి తిరిగి వస్తాడా? ఆమె అతనికి ‘మనిద్దరం భార్యాభర్తలమయ్యా’ అని గుర్తు చేస్తున్నది. స్వామీ, నీవు వేంకటేశ్వరుడవు, నేను నీ సతిని, అలమేలుమంగని అని తన పేరు సగర్వంగా అతనికి చెప్పుకుంటున్నది. వారిద్దరూ ఒకరికొకరు సరిజోడీ. ఆయన ఆమెకి ‘యీడుగా కూడి’న వాడు. అయితే, ఆ కూడిక (శృంగార కలయిక)లో కూడా వారిద్దరూ ఒకరికొకరు తగిన వారు అని చెప్పే చమత్కార ధ్వని ఉన్నది. ఆమె కూడితివి అన్న మాటను అదే అర్థంలో మనం తీసుకుంటే, ఆయన అప్పటికే ఇంటికి వచ్చేసి ఉండాలి. అంటే ఈ కలయిక కూడా అప్పుడే పూర్తయింది ఈ పదపు ఆఖరి చరణం రాకముందే.

అయినప్పటికీ ఆమె ఇంకా “ఇంటికి రావయ్యా” అని అతన్ని పిలుస్తూనే ఉంది. ఆ ప్రియుడు ఇంకా ఇంటికి రావలసి ఉందన్నట్టుగా, ఆమె ఎప్పటికీ అతని రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా. ఈ నిరీక్షణ ఈ పదం లోని చరణాలన్నింటినీ కలిపే సూత్రంగా పని చేస్తున్నది. పదంలోని భావసంచయాన్ని పూలమాలగా అల్లుతున్నది. ఈ పిలుపు విన్న ప్రతిసారీ దాని అర్థం సున్నితంగా మారుతున్నది. ఆ పిలుపులో భావతీవ్రత పెరుగుతూ వస్తున్నది. అప్పటి దాకా ఆమె అతనికి చెప్పిన ఊసులు, ఆ పిలుపుకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఆ పిలుపుని మన మనన్సు మూలల్లోకి మరింతగా చొచ్చుకుపోయేలా చేస్తున్నాయి. ఆ రకంగా పొరలు పొరలుగా వారిద్దరి బాంధవ్యపు జ్ఞాపకాలన్నీ మన మనసుల్లో కూడా పేరుకుంటున్నాయి.

‘నేనీకు వేరు గాను నీవు నాకు ఎరవు గావు’ అన్న పల్లవి ముందు కేవలం ప్రియుడికి గతకాలపు ప్రణయాన్ని గుర్తు చేయడానికి నొక్కి చెప్పిన మాట. అది పదం చివరికి వచ్చేసరికి కొత్తగా వారి మధ్య మళ్ళీ చిగురించిన ప్రణయం గురించి చెప్తున్నదిగా భావాంతరం చెందింది. కలహం సమసి పోయింది. పదం నిజంగానే ప్రేమికులనిద్దరినీ మళ్ళీ దగ్గరకు చేర్చింది. ప్రతీసారి విన్నప్పుడల్లా ఈ పల్లవి వాళ్ళిద్దరి మధ్యా జరుగుతున్న పరిణామాలను అల్లుతూ మనకు చూపిస్తున్నది. పదం ముగిసే సరికి ఈ అల్లిక కూడా పూర్తయింది. వాళ్ళిద్దరి కలయిక పూర్తయింది. తనదైన చాతుర్యంతో మాటలాడి ఆమె తన ప్రియుడిని తిరిగి సాధించుకున్నది.

ఈ పదంలో పదాల వాడుక చూడండి. మొదటి చరణంలో కొంచెం పరుషంగా వినపడే ‘క్క’ శబ్దం పునరావృతమైతుంది. అది ఆమె దుస్థితిని శబ్దపూర్వకంగా మనకు ఉద్దేశిస్తున్నది. రెండవ చరణం వచ్చేసరికి పరుష శబ్దం సరళమయింది. ‘గ్గ’ గా మారింది. ఈ సరళత వారి ముందు రోజుల ప్రణయాన్ని సరళంగా గుర్తు చేస్తున్నది. అవి దూరపు జ్ఞాపకాలు. అవి వాడిగా స్పష్టంగా ఉండవు. చివరి చరణానికి వచ్చేసరికి అతిసరళమైన డకార శబ్దం మన చెవుల్లో నిండిపోతుంది. మన తెలుగులో ఇది శిథిల డకారం. సరళమైన శబ్దం. ఆమె తన పేరు అలమేలుమంగ అని చెప్పుకునేసరికి, అత్యంత సరళమైన ల కారం ప్రధానమయింది. ఈ రకంగా ఈ పదంలో శబ్ద సంగీతం కూడా ఎలా పరిణమించిందో మనం గమనించవచ్చు. పదం లోని పదాలతో భావం వర్తులాకారమై, ఆద్యంతాలు కలిసిపోయి అర్థం సంపూర్ణమైతున్నది. వెళ్ళిపోయిన ప్రియుడు తిరిగి వచ్చాడు. స్వామి ఇంటికి చేరుకున్నాడు.

ఈ రకమైన కవిత్వం, ఈ పద రూపం, రాగం కట్టబడిన విధానం – ఇవన్నీ అప్పటికి తెలుగు సంస్కృతిలో మొట్టమొదటగా వచ్చినవి. పదాల పొందిక పొదుపైనది. భావాల అల్లిక విస్తారమైనది. వాడిన భాషలోని సరళత, భావంలో లోతు లేదనుకొని పొరపడడానికి ఆస్కారమిస్తుంది. ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వినాలి. ఎన్నో సార్లు వినాలి, ప్రత్యేకించి పాడుతుండగా వినాలి. అప్పటికీ కానీ అవి వాటి రహస్యాలను మనకు చూపించవు.

తన సహజ కవితా సామర్ధ్యం గురించి అన్నమయ్యకు తెలుసును. తన కవిత్వం అనిదంపూర్వంగా, అసమానంగా, అనుకరింప వీలు లేనిదిగా అన్నమయ్య భావించాడు. తనను అనుకరించ బోయిన వారిని తీవ్రంగా నిరసించాడు.

వెఱ్ఱులాల మీకు వేడుక గలిగితేను
అఱ్ఱువంచి తడు కల్లంగరాదా

వుమిసిన తమ్మలో నొక కొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల
అమరగ ఛాయాపహారము సేసుక
తమ మాట గూర్చితే దైవము నగడా

దిబికివేసిన గింజ చేత బట్టగనేల
గబుక కెంగిలి బూరె గడుగగ మరి యేల
తొబుకకవిత్వాల దోషాల బొరలితే
దిబుకార నవ్వడా దేవుడైనాను

అన్నమయ్యను అనుకరించిన వారెవ్వరూ అతని స్థాయిని ఏ రకంగానూ సమీపించలేక పోయారు. అనుకరించి వారు అన్నమయ్య కవితా సౌందర్యపు కాంతిలో నేలబారున పడ్డ నీడల లాంటి వారే. అన్నమయ్య ఇంత తీవ్రంగా నిరసించినప్పటికీ, అతని పుత్రపౌత్రాదులు అతని పేరు మీద పదాలు రాశారు. పదాలు వ్రాసే పరిశ్రమ ఒకటి తిరుపతిలో వెలసింది అనడంలో అనౌచిత్యం లేదు. చిన తిరుమలాచార్యుడి సంకీర్తనా లక్షణ గ్రంథము ఈ అనుసరణ పదాలకి సాధికారత నివ్వడానికి చక్కగా ఉపయోగపడింది. ఒక విస్తారమైన తాళ్ళపాక గ్రంథాలయం తిరుపతిలో అతని కుటుంబీకులు వృద్ధి చేశారు. పద కవిత మాత్రం ఎంతో ప్రాచుర్యం లోకి వచ్చింది. 17వ శతాబ్దంలో క్షేత్రయ్య, 18వ శతాబ్దంలో సారంగపాణి వంటి ప్రముఖ కవులను ప్రభావితం చేసింది. అయితే, ఈ రోజుకీ అన్నమయ్య పద కవితా సాహిత్యం శ్రద్ధగా అధ్యయనం చెయ్యబడలేదు. వాటిని జాగ్రత్తగా చదివి, శాస్త్ర ప్రామాణికతతో విశ్లేషించి, పరిష్కరించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. కాకపోతే, కొన్ని పదాలు, కర్నాటక సంగీతజ్ఞులు పాడినవి, విపరీతంగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. అవి ఇప్పుడు తిరుపతిలో దేవుడి దర్శనానికి వేచి ఉన్న వారందరికీ వినిపిస్తూనే ఉంటాయి.
-------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
మూలం: వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్
ఈమాట సౌజన్యంతో

No comments: