Saturday, April 20, 2019

సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి?


సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి?
సాహితీమిత్రులారా!

సాహిత్య ప్రయోజనం గురించి తెలుగులో జరిగిన చర్చ అతి విస్తారమైనది. చివరకు ‘సాహిత్యం సమాజాభ్యుదయం కోసం’ అన్న సిద్ధాంతం (దృక్పథం) దృఢంగా కాలూనుకొని నిలిచింది. ప్రతిభావంతులైన సాహితీకారులు ఈ సాహిత్య ప్రయోజనాన్ని అక్షరాస్యులకు చేరవేయడానికి విభిన్నాంశాల్ని విభిన్న రీతుల్లో, అనంతమైన వైవిధ్యంతో రచనలు చేస్తున్నారు. ఆ వైవిధ్యంలోని ఒక విభాగం- సృజనాత్మక సాహిత్యం.

సృజనాత్మక సాహిత్యం
ఇది ప్రక్రియాశ్రితమై ఉంటుంది. ఆ ప్రక్రియల్లో ప్రధానమైనవీ, ప్రాచుర్యం వహించినవీ- కథ, కథానిక, నవల, నవలిక, నాటకం, నాటిక, వివిధ కవితారూపాలు. ఒక రచయిత వైయక్తిక ప్రతిభాశక్తి మీద, జీవిత విలువల నిబద్ధత మీద, సంస్కారం మీద, సామాజిక బాధ్యతల పాటింపు మీద ఆధారపడి- వస్తు రూప సమన్వితంగా ఒక రచన ఆవిష్కారం జరుగుతుంది.

ఒక సృజనాత్మక రచన ఉత్తమత్వాన్ని నిర్ణయించటానికి- రచయిత తన రచనలో ‘ఏమి చెప్పాడు? (వస్తువు)’ ‘ఎలా చెప్పాడు? (శిల్పం, భాషా శౖలీ)’- అనే రెండు అంశాల మేలు కలయి­క ప్రధానం అని సాహిత్యంలో ఒక అంగీకార భావన నెలకొన్నది. రచన ఉత్తమత్వానికి ఉద్దిష్ట ప్రయోజనం ప్రాణశక్తి. ఉద్దిష్ట ప్రయోజనాకి ఊపిరి- సమకాలీనత, సామాజికత, సమగ్రత.

విమర్శ
లక్షణ గ్రంథాల్లోని శతకోటి సిద్ధాంతాల్నీ నిర్వచనాల్నీ గుర్తుంచుకొని చూస్తే – విమర్శ అంటే కేవలం ‘తప్పుల్నీ’, ‘ఒప్పుల్నీ’ చూపడం మాత్రమే కాదు. అది నన్నయ అన్నట్టు, రచన- ‘లో నారసి’ సాహిత్య సంస్కృతిని అవిచ్ఛిన్నంగా నిలబెట్టటం. ‘లో’ నారయటం అంటే ప్రయోజనం, వస్తుశిల్పరీతుల్లోని ‘రసజ్ఞత’ని పఠితకి అందించటం, ‘అవాంఛనీయత’ని స్పష్టపరచటం. అందుకనే ‘విమర్శకు వెన్నెము­క వివేచన’ అంటారు డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారు.1 అంటే- విమర్శ చదువరికి పఠనానుభవం కలగటానికి దోహదం చేస్తుంది. గుణదోషాదుల్ని పరిశీలిస్తుంది. మొ­దటిది హృదయాన్నీ, రెండవది బుద్ధినీ స్పర్శిస్తాయి­. ఈ రెండింటి సమన్వయ సాధనే విమర్శ ఉత్తమత్వానికి గీటురాయి.

సృజనాత్మక సాహిత్య విమర్శ – విభిన్నరీతులు
ప్రక్రియాపరమైన ఒక రచనని విమర్శ ద్వారా ప్రస్తావిస్తున్నప్పుడు- పరిచయం, పరామర్శ, విశ్లేషణ, సమీక్ష, పరిశీలన అన్న విభిన్నరీతులు ‘విమర్శ’లో భాగాలు అనే భావనతోనూ లేదా అవన్నీ విమర్శకు పర్యాయపదాలే అన్న భావనతోనూ ఈనాడు వ్యవహరింపబడుతున్నాయి­. కానీ, ఈ రీతుల స్వరూపస్వభావాల్ని తరచి చూసినప్పుడు- అవి దేనికదిగా వేరు వేరు లక్షణాల్నీ, లక్ష్యాల్నీ సంతరించుకుని ఉన్నాయని అర్థమవుతుంది. అంతేగాక ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రమేయంతోనూ, ఎక్కువ వివరణల్లో పరోక్ష ప్రమేయంతోనూ విమర్శలో అంతర్లీనమై ఉన్నాయనీ తెలుస్తుంది.

అయి­తే, కేవలం వీటన్నిటి సమాహార వ్యక్తీకరణం మాత్రమే కాదు- సృజనాత్మక సాహిత్య విమర్శ. మరి-

సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి?
ఎ) విమర్శకునికి ప్రాథమికంగా సృజనాత్మక సాహిత్యాన్ని ఎలా చదవాలి- అనే దానిమీద అవగాహన ఉండాలి. మంచి పాఠకుడు కాలేని వ్యక్తి మంచి విమర్శకుడు కాలేడు. అంటే-
విమర్శకునికి రచన ఉద్దిష్ట ప్రయోజనం పట్ల వాంఛితం, రచయి­త భావజాలంపట్ల పరిశీలనాసక్తి, పఠనానుభూతిని పొందటానికి సంసిద్ధత- ఉండాలి.

బి) విమర్శకునికి తాను విమర్శిస్తున్న ప్రక్రియ ఆవిర్భావ పరిణామ వికాసాల పరిజ్ఞానం, వర్తమానకాలంలో ఆ ప్రక్రియ ప్రస్థానరీతి, విభిన్న ధోరణుల ఆకళింపు ఉండాలి. ఇతర భాషల్లో ఆ ప్రక్రియ స్థితిగతులు కూడా తెలిసి ఉంటే అవసరమైన చోట తులనాత్మక విశ్లేషణకి అవకాశం కలుగుతుంది.

విమర్శకుని గుణావగుణగ్రహణశక్తియొ­క్క ఈ లక్షణాల ప్రతిఫలనాలు అతను చేసే విమర్శలో ద్యోతకమౌతాయి. పాఠకుల చైతన్య పరిధి విస్తృతి కావటానికీ దోహదం చేస్తాయి.

సి) విమర్శలో కేవలం రచనావస్తువు గురించిన అమిత విశ్లేషణ ఉండకూడదు. అంటే రచనలో ఉన్న వస్తువు, ఇతివృత్తాల విశ్లేషణ కాకుండా వాటికి ఆధార భూతమైన వెలుపలి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల దృశ్య చిత్రీకరణ కారాదు. ఉదాహరణకు ఒక కథానికలో రాయలసీమలో నీటి కరువు అనేది కేంద్రబిందువు అనుకుందాం. దాని చుట్టూ వర్తమాన పరిస్థితిని నేపథ్యం చేసుకుని, పాత్రల్ని ఆశ్రయించుకుని, సంఘటన సృష్టితో కథనాన్ని నిర్వహిస్తాడు రచయి­త. నీటి కరువుని అనుభవిస్తున్న వివిధవ్యక్తుల విషాదానుభూతి విభిన్న స్థితిలో ఉంటుంది. ఆ కరువు ప్రభావం, అది కల్పిస్తున్న దుస్థితి, అక్కడి స్థానీయతలోని విలక్షణత, మనుషుల జీవజీవన విధానంలోని ఎత్తుపల్లాలు, ఘటనల పర్యవసానాలు విభిన్నంగా ఉంటాయి­. కథానిక విమర్శ కథలోని నిర్దిష్టమైన ఇతివృత్తాన్ని గురించి కాక, నీటి కరువు అనే అంశం మీది చరిత్రనీ, రాజకీయాన్నీ విశేషంగా వర్ణిస్తూ పోకూడదు. విమర్శకుని ‘కంఠస్వరం’లో, అతని అభిప్రాయాల ప్రకటనలో పాక్షికమైన రాజకీయ ‘ఒరుగుదల’ వాంఛనీయం కాదు.

డి) భాషాశైలీ గురించి ‘సరళం’గా ‘సూటి’గా ఉన్నదనే ఏకవాక్య ‘సర్టిఫికెట్’ల వలన పాఠకునికి విమర్శ అందించే భావన శూన్యం. అలాగే విమర్శ అనేది ‘శిల్పం’ గురించి రచయి­త జ్ఞానం మీదనో, అజ్ఞానం మీదనో కేవల నిర్ణయ ప్రకటనం ఇవ్వరాదు. అది ఫలానావిధంగా ఎందుకు ఉన్నదో, ఎందుకు లేదో విశదీకరించగలగాలి. అసలే ‘శిల్పం’ అనేది బ్రహ్మపదార్థం!

ఇ) ఈ విధానానికి వ్యతిరేకంగా సాగే కేవలం ‘రూప విమర్శ’ కూడా హర్షణీయం కాదు. అంటే, విమర్శ వస్తువుని గాలిలో ఉంచి, ఏ సంప్రదాయ వాదాన్నో లేక ఏ ఇజాన్నో ఆధారం చేసుకొని లాక్షణిక సిద్ధాంతాల్నీ ఆకర గ్రంథాల ఉటంకింపుల్నీ ఉదహరిస్తూ రచనని ‘చీల్చి చెండాడటం’ చేయకూడదు. ఒకవేళ, ఇలాంటి పద్ధతిలో విమర్శకు పూనుకున్నా, ఆయా సిద్ధాంతాల, ఉటంకిపుల ‘అను వర్తన’ని ఈ రచనకు అన్వయించి చెప్పటం, చూపటం జరగాలి.

ఎఫ్) విమర్శ అనేది cripticగా ఉండకూడదు. అంటే ఏదో భావాన్ని నిగూఢంగా మనస్సులో పెట్టుకుని, ఆ భావాన్ని స్పష్టంగా చెప్పకుండా ‘అత్తగారి మనస్తత్వం’తో అప్రకటిత అనంగీకారాన్నో, ప్రకటిత ఉదాసీనతనో విసరటం వాంఛనీయం కాదు.

జి) విమర్శను కేవలం అభినందనలుగా, ప్రశంసలుగా మార్చి ‘గాఢాభిమానం’ లేక ‘మూఢాభిమానం’ వలయంలోకి ప్రవేశింపజేయకూడదు. అప్పుడు విమర్శ అసలు ‘సరుకు’ని కాక అభిమానపు ‘బరువు’ని గంప నింపుకుని నెత్తికెత్తుకున్నట్లవుతుంది!

హెచ్) రచనలో రచయి­త ప్రాపంచిక దృక్పథం ధన్యాత్మకంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సమాజంలోని వ్యవస్థలలో తాను ఏ పక్షం వహిస్తున్నాడో చెప్పకయే చెబుతూ ఉంటాడు. ఏ సమూహాలతో, మనుషులతో మమేకమౌతున్నాడో సూచిస్తూనే ఉంటాడు. ఈ విషయికంగా రచయి­త ఆంతర్యాన్ని విమర్శకుడు పట్టుకోగలగాలి. ఆ పైన, తాను ఏయే విమర్శా పరికరాలతో, ప్రమాణాలతో, సామాన్య సూత్రాలతో, లక్షణ సాధనాలతో, విలువలతో విమర్శకు పూనుకుంటున్నాడో- వీటన్నిటి ‘ఉనికి’ని తన విమర్శలో ప్రతిబింబింపజేయగలగాలి. అప్పుడే- ఫలానా ఫలానా విమర్శా ప్రమాణాలతో, తూకపురాళ్లతో, రూళ్లకర్రతో, ఒక సృజనాత్మక రచనపై విమర్శ నిరపేక్షంగా జరిగిందని అర్థమవుతుంది. అప్పుడే ఆ రచన ‘తప్పు’,‘ఒప్పు’ల అంతరార్థం పఠితకు అందుతుంది. రచయి­త రసప్రసరణాభిలాషా, విమర్శకుని రసజ్ఞతాదృష్టీ- రెండూ చదువరి ఆలోచనకూ పరిశీలనకూ క్రియాశీల నిర్ణయానికీ అందుబాటులోకి వస్తాయి. అంటే, అటు రచయి­త దృక్కోణమూ ఇటు విమర్శకుని దృష్టికోణమూ పాఠకునికి అవగతమౌతాయన్నమాట.

ఐ) విమర్శకునికి తనదైన భావజాలం ఉండవచ్చు. దానికి అనుగుణంగా ఉన్న రచనల్నీ రచయి­తల్నీ సమర్థించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు. అయి­తే, తన నిర్ణయానికి కారణాల్ని సోపపత్తికంగా చూపగలగాలి. రచయి­త నిబద్ధతలమీద, నిర్మాణ స్వాతంత్య్రం మీద, సృజనస్వేచ్చ మీద ‘దాడి’ చేయకూడదు. ఉదాహరణకి ఒక నవలలో ఒక పాత్ర కురూపి అనుకుందాం. ‘ఆ పాత్రని కురూపిగా చేయనఖ్ఖర్లేదు’- అనే పూర్వకృత నిశ్చయంతో విమర్శని మొ­దలెట్టకూడదు, సాగించకూడదు. అది రచయి­త తన సృజనకూ ఇతివృత్తానికీ తాను ఉద్దేశించుకున్న ప్రయోజన సాధనకూ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ కురూపి పాత్ర సృష్టి రచయి­త ఆలోచనల కేన్వాస్‌పై, పరిధిపై జరిగింది. ఆ పరిమిత పరిధిలోనే విమర్శ కూడా సాగాలి. దాని ఆవలి తీరాలకు పోరాదు. అంటే, కురూపిగా ఆ పాత్ర స్వరూపస్వభావాలు, చర్యలు, స్పందన, ప్రతిస్పందనలు, ప్రవర్తన, ఇతివృత్తానికి చోదకమై సంభావ్యతని సంతరించుకున్నాయా లేదా అనే అంశాల్ని పరిశీలించాలి. ఫలితాంశాన్ని సాధించటంలో కథన విధానం గురించీ, పఠిత మనసులో అనుభూతి ము­ద్రని వేయటంలో రచయి­త కృతకృత్యత లేక వైఫల్యం గురించీ బేరీజు వేయగలగాలి.

జె) విమర్శలో ఆత్మాశ్రయ దౌష్ట్యం చొరబడకూడదు. అంటే పేర్లు చెప్పీ చెప్పక కొందరిని ఆకాశానికెత్తి, కొందరిని నిరాదరించటం లేక నిరాకరించటం లేక హీనపరచటం చేయరాదు.

కె) సాహిత్య సృజనలో రచయి­త అంతర్గతంగా తనకు గల సామాజిక బాధ్యతని కూడా గుర్తించే రచన చేస్తాడు. ఒక రచనని స్థూలావరణంలో నిలిపినప్పుడు అది సమాజ శ్రేయస్సును ప్రచోదితం చేసేదిగా ఉండాలి. ఈ బాధ్యతానిర్వహణలో రచయిత సాఫల్యం ఏ మేరకు సాధించాడు అనేదానిని విమర్శ అంచనా వేయాలి. అప్పుడే ఆ విమర్శ అటు సామాజికాభ్యుదయ సాధనకూ ఇటు ఉత్తమ సాహిత్య సృజనకూ ఉపయు­క్తమవుతుంది.

ఎల్) విమర్శకునికి అత్యంత ఆవశ్యకమైన మూడు గుణాలు – సమన్వయ దృష్టి, సంయమనం, సాహిత్య దృక్పథం.

సమన్వయదృష్టి, సమదృష్టి: తాను విభేదించే వాదాల్నీ సిద్ధాంతాల్నీ వివిధ అభిప్రాయాల్నీ కూడా గౌరవించటం. ‘నీ అభిప్రాయంతో నేను విభేదించినా, నీ అభిప్రాయాన్ని నీవు కలిగివుండే హక్కుని గుర్తిస్తాను, గౌరవిస్తాను.’ అనే తెలివిడి ఇది.

సంయమనం: విమర్శలో వ్యక్తిగత దూషణ భూషణ తిరస్కారాల్ని పరిహరించుకోగలగటం. విమర్శని స్తిమితంగా నిర్వహించటం. భాష, శైలీ సంస్కారవంతంగా ఉండేటట్లు జాగ్రత్తపడటం.

సాహిత్య దృక్పథం: ఇది సామాజిక నియమాలనూ, సంఘ సమతుల్యతనూ భంగం చేయని విధంగా ఉండటమే సర్వదా వాంఛనీయం. కడపంక్తి ప్రయోజనంగా ఆలోచించినప్పుడు సాహిత్యం పదిమందికి మేలు కూర్చేదిగా ఉండాల్సిందే కదా! కనుక, సాహిత్య దృక్పథానికి రచయి­త చిత్తశుద్ధి ఎంత ము­ఖ్యమో విమర్శకుని హితాభిలాష కూడా అంతే ప్రాధాన్యం వహించాలి!

ఎమ్) విమర్శలో స్పష్టత అత్యంత ఆవశ్యకం. వ్యాసంలో విషయాలు చర్వితచర్వణంగా, పిష్టపేషణంగా ఉండకూడదు. చెప్పవలసిన అంశం మీద ‘లోపిరికి వెలిపిరికితనం’ ఉండరాదు. శషభిషల ప్రదర్శన పనికిరాదు. అక్కడా ఇక్కడా తీర్థం తీర్థంగా ప్రసాదం ప్రసాదంగా అనవసరమైన ఉల్లేఖనలు ఉండనక్కర్లేదు.

ఎన్) ఒక విమర్శకుడు తాను ఏ ప్రక్రియపై విమర్శ రాస్తున్నాడో, అతను ఆ ప్రక్రియలో రచయిత అయి వుండాలా? అక్కర్లేదా?- అనేది మరో చర్చనీయాంశం. అలా ఒక ప్రక్రియలోని రచయిత ఆ ప్రక్రియ పైనే విమర్శకుడు అయినందువలన రెండు ప్రయోజనాలు సిద్ధింపవచ్చు. ఒకటి, రచయితగా తన అనుభవం, అధ్యయనాలు ప్రాతిపదికగా విమర్శలో గాఢతనీ, సమగ్రతనీ సాధించవచ్చు. రెండవది, వస్తు శిల్పాలపైన సాధికారత కలిగి వుంటే, వివేచనతో రచనని విమర్శించి, రచయితకు కావలసిన సూచనల్ని ఇవ్వవచ్చు. అయితే, ఈ ప్రయోజనాలకి భిన్నంగా- ఒక్కొక్కప్పుడు రచయితగా తన గొప్పతనాన్నీ, భావజాలాన్నీ ఉన్నతీకరించుకుంటూ, అవతలి రచయితనీ, రచననీ చులకన చేసే ప్రమాదమూ సంభవించవచ్చు. విమర్శకుడు ఈ బలహీనత నుండి తనను తాను కాపాడుకోగలిగితే ఉభయతారకం అవుతుంది. పాఠకులకూ ప్రయోజనం కలుగుతుంది.

ముగింపు
“కావ్యార్థంతో తన్మయీభావం పొందగల సహృదయునకు విమర్శకునితో పనిలేదు. ఆ శక్తి లేనివారికి ఆ శక్తిని అలవరచటానికే విమర్శకుని అవసరం. ఉత్తమ కావ్యాన్ని ఆస్వాదించే నైపుణి అలవరిచి సమాజంలో ఉత్తమ సాహిత్యాభిరుచిని పెంపొందించేవాడు ఉత్తమ విమర్శకుడు. సమాజాన్ని సహృదయం చేసేదే ఉత్తమ విమర్శ,” అంటారు ఆచార్య పాటిబండ మాధవశర్మగారు.2 సృజనాత్మక సాహిత్యంలోని ఏ ప్రక్రియలోని ఏ రచన పరమార్థమైనా పైన తెల్పిన ‘కావ్యార్థా’నికి సమానమైనదే.

భూమికీ, గాలికీ, ఆకాశానికీ విసంవాదం లేక మచ్చిక ఉంటుందనేది ఒక వాస్తవం. అలాంటి అమరిక, అర్థసూత్రత, అవినాభావ సంబంధం- రచయితకీ, విమర్శకునికీ, సృజన సాహిత్య ప్రయోజనానికీ ఉండాలి. అప్పుడు సమాజ శ్రేయస్సు, ఉత్తమ సాహిత్య సంస్కృతీ ఫలితాంశాలవుతాయి.

ఉపసంహారంగా…
సృజన సాహిత్య విమర్శ గుణగ్రహణంగా ఉండాలి. గుణ ప్రోత్సాహకరంగానూ ఉండాలి. వాంఛనీయమైన ఆలోచన చేయడానికి అటు రచయితకూ, ఇటు చదువరికీ కూడా ప్రేరణ ఇచ్చేదిగా ఉండాలి. రచనలో పాఠకునికి ఏ మూలపదార్థం అనుభూతిదాయకమౌతుందో చెప్పగలగాలి. రచయితకి రచన ఔన్నత్యాన్ని భంగపరిచే ఏ లక్షణాల్ని పరిహరించుకోవాలో చెప్పేదిగా ఉండాలి. ఈ దృష్టితో చేసిన స్పష్టమైన విమర్శ సద్విమర్శగా గుర్తింపబడుతుంది.

(డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో రెండవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)

ఉపయుక్త విషయసూచిక
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం. సాహిత్యంలో చర్చనీయాంశాలు. 1991, తెలుగు అకాడెమి ప్రచురణ, వ్యాస శీర్షిక పేజీ నెం. 533.
డా. పాటిబండ మాధవశర్మ. తెలుగులో సాహిత్య విమర్శ. 1975, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి ప్రచురణ, పేజీ నెం. 3.
---------------------------------------------------------
రచన: విహారి, 
ఈమాట సౌజన్యంతో

No comments: