Thursday, April 4, 2019

స్త్రీ పర్వంలో గాంధారి


స్త్రీ పర్వంలో గాంధారి
సాహితీమిత్రులారా!

మహాభారతంలో లేనిదేదీ లేదని అంటారు.

“ధర్మేచా ర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యదితిహాస్తి తదన్యత్ర యాన్నేహాస్తి నతత్క్వచిత్.”

తిక్కన గారు, ఈ శ్లోకాన్న్ని తెలుగులో చక్కని తేటగీతంగా చెప్పారు.

“అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి,
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియు,
యొండెడల గల్గు దీనలేకుండ చొప్పు,
దక్కొకంటను లేదు వేదజ్ఞులార,”

అని.

That which occurs here
occurs elsewhere, —
That which does not occur here
occurs nowhere else.

అయితే, మహాభారతంలో కుంతికి, ద్రౌపదికి, ఉన్న ప్రాముఖ్యం గాంధారికి వ్యాఖ్యాతలు ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. అంతకన్నా ముందుగా చెప్పవలసిన విషయం – తెలుగు మహాభారతం నుంచి, కొన్ని కొన్ని భాగాలు తీసి, హైస్కూలు, కాలేజీ విద్యార్థుల పాఠ్యగ్రంథాలలో వేసినప్పుడు, మొదటి ఐదు పర్వాలకీ(ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ)అందులోనూ ముఖ్యంగా విరాట ఉద్యోగ పర్వాలలో కొన్ని ఆశ్వాసాలకి ఇచ్చిన ప్రాముఖ్యత మిగిలిన పర్వాలకి ఇవ్వరు. బహుశా, అందుమూలాన కావచ్చు, గాంధారి గురించి మనకి తెలిసినది చాలా తక్కువ. ప్రత్యేకించి తెలుసుకుందామనే కోరిక ఉంటే తప్ప.

గాంధారి ధృతరాష్త్రుని భార్య అని, భర్త పుట్టంధుడు కాబట్టి, తాను కూడా, కళ్ళకి గంతలు కట్టుకొని కాలక్షేపం చేసిన “పతివ్రత” అని, దుర్యోధనుడితో పాటు నూరుగురి కొడుకులకి, ఒక కూతురికి తల్లి అని మాత్రం కాస్తో కూస్తో కాలేజీ వరకూ తెలుగు చదువుకున్న వాళ్ళకి తెలుసుననే ఊహించవచ్చు. యుద్ధ షట్కం (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు) తరువాత భారతంలోని మిగిలిన ఏడు పర్వాలూ, (శాంతి సప్తకం – శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ) క్లిష్టమైన వేదాంతం. వేదాంత పరిశోధకులు ఈ ఏడు పర్వాలూ చదువుకుంటారేమో తెలియదు. యుద్ధ షట్కంలో ఆఖరి పర్వం స్త్రీ పర్వం. దానిలోని, రెండవ ఆశ్వాసం చదివితేగాని గాంధారి గురించి పూర్తిగా తెలియదు.

గాంధారి ప్రసక్తి మొట్టమొదటిసారిగా, ఆదిపర్వంలో, పంచమాశ్వాసంలో వస్తుంది. గాంధారి సుబలుడనే రాజు గారి పెద్ద కుమార్తె. ఈమె, “అతిశయ రూప లావణ్య శీలాభిజాత్య సమన్వితగా” విని, భీష్ముడు ధృతరాష్త్రునకు గాంధారికీ వివాహము చేస్తే బాగుంటుందని విదురునితో అంటాడు. అంతే కాదు, గాంధారికి నూరుగురు పుత్రులు పుడతారని శివుని వరం కూడా వుంది. కురువంశాన్ని నిలపడం భీష్ముడి కనీస కర్తవ్యం. సుబలుడికి కబురు పంపుతాడు. గాంధారి తలిదండ్రులు ఈ వివాహానికి సమ్మతిస్తారు. గాంధారి తండ్రిమాట జవ దాటని కన్య. అయితే, గాంధారి బంధుజనులకి ఇది నచ్చదు. కారణం, ధృతరాష్త్రుడు పుట్టు గుడ్డి. నన్నయ గారు చెపుతున్నారు:

“అంగములలోన మేలుత్తమాంగ మందు
ఉత్తమంబులు కన్నుల యుర్వి జనుల
కట్టి కన్నులు లేవనుటంతె కాక,
ఉత్తముడుకాడె సద్గుణయుక్తి నతడు,”

అని గాంధారికి వినపడేటట్లు, బంధువులు అంటారు. గాంధారి తండ్రిమాట జవదాటనిదని చెప్పాముగా. ఆమె అప్పటినుండి, జీవితాంతమూ కంటికి గంతలు కట్టుకుంటుంది. ఈ పద్యాన్ని, విశ్వనాథ సత్యనారాయణ గారు, నన్నయ గారి “ప్రసన్న కథాకలితార్థయుక్తి” కి ఉదాహరణముగా చెప్పి, సుబలుడి సుముఖతనీ, గాంధారి ఒప్పుదలనీ పెనవేసి ఒక వ్యాఖ్యానం చేశారు. సత్యనారాయణ గారు చెప్పారనే గౌరవం తప్ప, ఈ వ్యాఖ్యానం ఏమంత సరసం గా నాకు కనిపించలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతమే ననుకోండి.ఆ తరువాత, గాంధారి, కుంతికి ధర్మరాజు పుట్టిన వార్తవింటుంది. తనూ గర్భవతియే అయినా, తనకి ప్రసూతి కాలేదని పొట్టపై కొట్టుకుంటుంది. గర్భపాతమవడం, పరాశరుడి ధర్మమా అని ఆ పిండం నూరుభాగాలుగా నేతికుండలలో పెట్టడం, దుర్యోధనాదులు పుట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా గాంధారి పాత్ర ఏమంత మెచ్చుకోదగ్గదిగా కనిపించదు. మరొకసారి, ఉద్యోగపర్వంలో, కృష్ణ రాయబార సందర్భంలో గాంధారి cameo లా కనుపిస్తుంది కానీ, ఏ విధమైన ప్రత్యేకతా ఆమె పాత్రకి ఉండదు.

గాంధారి పాత్రలో గొప్పదనం,గణనీయత, గాంధారిలో స్త్రీసహజత్వం, స్త్రీ పర్వం, రెండవ ఆశ్వాసంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు. చదివించరు. వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం మినహా ఇంకేవీ ఎక్కడా ఉదహరించరు. ఆ శ్లోకం గురించి తరువాత చెప్పుకుందాం.

భారత యుద్ధం ఆఖరిదశ. కౌరవ సైన్యంలో అతిరథ మహారథులందరూ మరణించారు. “ఉత్తమ జనాలు డెబ్బది ఆరు కోట్ల ఇరువదివేలును, మ్రుక్కడి మూక ఇరువదినాలుగువేల మున్నూట ఇరివండ్రు,” చనిపోయినారు. దుర్యోధనుడు కూడా మరణించాడు. యుద్ధానంతరం, యుద్ధభూమి వర్ణనలతోను, పుత్ర పౌత్ర, బంధుజన పరివార మారణానంతరం శోకాలతోనిండిన పర్వం స్త్రీ పర్వం. ఆడవారి ఏడుపులు, పెడబొబ్బల వర్ణనలు ఎవరికి కావాలి? పాఠ్య భాగాలుగా పెట్టకపోవడానికి అదొక ముఖ్య కారణం కావచ్చు. మరొక విశేషం. ఈ పర్వంలో వర్ణనలకి వాడిన ఛందస్సులు, సాధారణంగా మనబోంట్లకి కొరుకుడు పడేవి కావు. ఉదాహరణకి తిక్కన గారు ఇక్కడ కొంచెం ప్రబలంగా వాడిన ఛందస్సులు చూడండి. మణికరనికరం, లయగ్రాహి, మంగళమహాశ్రీ, మానిని, భుజంగప్రయాతం, మంజుభాషిణి, దోదకం, నర్కుటం, బంధురం, లయవిభాతి, ఉపేంద్ర, ప్రణవ, స్రగ్ధర, ప్రహరణకలితం, అంబురుహం, మొదలైనవి. అందులోను, లయగ్రాహి వంటి వృత్తాలు వరుసగా ఒకదానితరువాత ఒకటి వస్తే, స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈ పద్యాలు choiceలో వదిలేసే పద్యాలుగా ఉంటాయి.

ఈ ఛందస్సులు, అమ్ములు, విండ్లు, కళేబరాలు, తెగిన బాహువులు, కుత్తుకలు, నెత్తురులూ, ప్రేవులు, వగైరా వర్ణనలకు వాడడం అవసరమేమో నాకు తెలియదు. కాగా, ఇక్కడ తిక్కన గారి వచనం కూడా కొంచెం క్లిష్టంగానే కనిపిస్తుంది. అయితే, తేలికగా కళ్ళకు కట్టే వర్ణనలు లేకపోలేదు.

గాంధారి, కళ్ళకు కట్టిన గుడ్డ విప్పకుండా, అంటే తనవ్రతభంగము కాకుండా, సంగరస్థలిని వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో చూసి, తన దుఖాన్ని కృష్ణుడితో చెప్పుకుని విలపించే ఘట్టాలు తప్పకుండా అందరూ చదవ వలసిన ఘట్టాలు.

మచ్చుకి కొన్ని చక్కని “సులువైన” పద్యాలు చూద్దాం.

“ప్రాణంబులు విడిచియును కృ
పాణాదులు విడువకున్న భటులారయ స
ప్రాణులపోలెం బ్రథన
క్షోణికి దొడవగుచు నుంకి చూడుము కృష్ణా.”

ఇదంతా నువ్వు దగ్గిర వుండి చేయించావని దెప్పుతూ,

“అవయవములు రూపరగ గ్రవ్యాదభక్షి
తంబులై యుంకి కొన్ని శవంబు లువిద
లెంత సూచియు నవి కొందరెరుగజాల
రయ్యెదరు సూడు తమ బంధులగుట కృష్ణ,”

అని చెపుతుంది. ఆ తరువాత దుర్యోధనుని కళేబరము చూసి, మూర్ఛిల్లుతుంది, గాంధారి.

సేద తేరుకొని, దుర్యోధనుడు, యుద్ధానికి పోబోయే ముందు తనదగ్గరికి వచ్చి జయసిద్ధికి దీవించమని అడిగితే, “…. ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు,” అన్నది గాంధారి. అంటే, ధర్మము ఎటు వుంటే అటే జయం అని చెప్పింది. గాంధారి మాటకు తిరుగు లేదు. నీకే జయమగు గాక అని వుంటే ఏమయ్యేదో తెలియదు. విపరీతమైన శోక బాధతో, ఆనాడు తను దుర్యోధనునితో చెప్పిన మాటలు తిరిగి కృష్ణుడికి చెప్పింది. కొడుకు చావుకన్న కోడలు పడే శోకబాధ ఎంత తీవ్రమైనదో చెప్పుతున్నది, ఈ క్రింది పద్యంలో.

“కొడుకు చావు కంటె కోడలి యడలున
పెరిగి శోకవహ్ని దరికొనంగ
అంతరంగ మిప్పుడగ్గల మెరియంగ
దొడగె దీనికేది తుది యుపేంద్ర.”

అట్లాగే దుశ్శాసనుడి శవం, అభిమన్యుడి శవం, కర్ణుడి కళేబరం చూసి విలపిస్తుంది.

” కాకులును గ్రద్దలును తిన్న గడుసు ద్రెస్సి
అపరపక్ష చతుర్దశి అమృతకరుని
కరణి నొప్పెడు కర్ణుని మొగంబుమీద
వనిత యందంద మోపెడు తన మొగంబు,”

అని కర్ణుని భార్య విలాపం కృష్ణుడికి చెపుతున్నది.ప్రారంభంలో అన్నాను, స్త్రీపర్వంలో ఒకే శ్లోకాన్ని ఉదహరిస్తారని. ఇప్పుడు ఆ శ్లోకం, అదే భావం తిక్కన గారి తెలుగులోనూ చూద్దాం.

భూరిశ్రవుడనే రాజు చెయ్యి అర్జునుడు నరికివేశాడు. చెయ్యి తెగిపడివున్న వాడి తల విరుగగొట్టాడు సాత్యకి. ఆ భూరిశ్రవుడి భార్య యుద్ధానంతరం శ్మశానంలో, భూరిశ్రవుడి శవందగ్గిర విలపిస్తూ అన్న మాటలు గాంధారి చెపుతున్నది.

ఈ శ్లోకాన్ని, ముమ్మటుడు తన కావ్య ప్రకాశ లోను, ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలోను, ఒక రసం మరొక రసానికి అంగంగా ఎట్లా ఉపకరిస్తుందో చూపించడానికి ఉదాహరణగా చెప్తారు. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన శ్లోకం.

“అయం స రశనోత్కర్షీ పీనస్తన విమర్దనః
నాభ్యూరుజఘనస్పర్శీ నీవీవిస్రంసనః కరః.”

భూరిశ్రవుడి భార్య అతని తెగిన చేతిని పట్టుకొని విలపిస్తూ అన్న మాటలు ఇవి.ఈ చెయ్యి నా వడ్డాణము లాగినది, ఈ చెయ్యి నా చనుగవ, బొడ్డు, మొల, తొడలు మొదలైన దేహభాగాలని ముట్టుకున్నది, అని భావం. స్త్రీ తన భర్తని గుర్తుకుతెచ్చుకొని విలపిస్తున్న సమయం.దీనిలో శృంగార రసం కరుణ రసం ఉన్నాయి.

ఈ శ్లోకాన్ని తిక్కన గారు చాలా వివరంగా అనువదించారు, చూడండి.

“మెలుపారగా బట్టి మొలనూలి మణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీది కల్లన వచ్చి లలిత విమర్దనంబున లజ్జ మరల ద్రోచు
నాభి యూరులు జఘనము మెత్త మెత్తన యొత్తి ముదంబున నుల్ల మూంచు
ననయంబు తిన్నని యనువున గనయంబు ప్రిదులంగ మెలగి చొక్కదవ చేయునిక్కరంబు నెయ్యమెక్కింనేరంగ
దగిలి సంతతంబు తలచునట్టి
భంగిమెరయ కీడువరుపంగ గొనియాడ
వలతి నీరు సేయవలసె దీని.”

ఇటువంటి చరిత్రగల గొప్ప చేతిని బూడిదపాలు చెయ్యవలసివచ్చిందే అని శోకం, విషాదం వెలిబుచ్చుతున్నది.ఈ విషాదం గాంధారికి దుర్భరమయ్యింది. ఆఖరుగా కృష్ణుడితో అంటున్న మాటలు చూడండి.

“ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన నీసున సమరమునకు
దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానుషుల్ కలిగియు మాననీయ
వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష
చేసితి కురు రాజు చెరుపన తిరిగితి నిఖిల రాజుల తదనీకములనునామ మడచి తెల్ల భూములు పాడయ్యె
నంతవట్టు ఫలము ననుభవింపు
మే పడంగ నిన్ను శాపానలజ్వాల
దగ్ధమూర్తి చేయుదాన వినుము.”

నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగల సమర్థుడివి. అయినా నీవు ఆ పని చెయ్యలేదు. అందుగ్గాను నేను నిన్ను శపిస్తున్నాను. కృష్ణుడిని, అతని యాదవ కులాన్నీ, దిక్కులేని చావు చస్తారని శపిస్తుంది, గాంధారి.యుద్ధభూమి, యుద్ధానంతరం ఎలా ఉన్నదో, వివరంగా చేసిన వర్ణనలు, అటు వ్యాసుడు, ఇటు తిక్కన గారు, స్త్రీ నోటినుండి చెప్పించడం గుర్తించాలి. యుద్ధం తెచ్చే భీభత్సం, తదుపరి వచ్చే శోకం, బాధ, స్త్రీ హృదయానికి పట్టినట్లు, పురుషులకు పట్టదు. అంటే పురుషులకు ఆ బాధ తెలియదని కాదు. ఆ భావాలు స్త్రీ వ్యక్త పరిచినట్లుగా పురుషుడు చెప్పలేడు. అర్థమయ్యే కొద్ది భాగాలూ, ఆ భీభత్స వర్ణనలూ, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అచ్చంగా టీ.వీ చూసినట్టే నన్న మాట.

ఈనాడు ప్రతిఒక్కరూ స్త్రీపర్వం క్షుణ్ణంగా చదవడం అవసరమనిపిస్తోంది.

పోతే, నేను ఏరుకున్న ఉదాహరణలు తేలికగా అర్థమయ్యే “తెలుగు” పద్యాలు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అందరి సంగతీ అనవసరం. నా బోటి వాళ్ళకి, సంస్కృతం రానే రాదు. పోనీ నష్టం లేదులే అని అనుకుంటే, చక్కని తేట తెలుగు అర్థం కాదు. చిన్న చిన్న తెలుగు పద్యాలు, తిక్కన గారి తెలుగు పద్యాలు, నిఘంటువు లేకుండా బోధ పడటల్లేదని బాధ. పదమూడవ శతాబ్దపు తెలుగు మాటలు ఇప్పుడు వాడుకలో లేవు. మాటలలో మార్పు, మనం ప్రస్తుతం వాడే భాషలో వచ్చిన మార్పులు, భారతం లాంటి ఇతిహాసాలు చదవడానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.

ప్రాచీన సాహిత్యం అంతటికీ, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు రాసుకోవలసిన అవసరం ఉన్నదని వేరే చెప్పక్కరలేదు. అది ఒక ఎత్తు. నా ఉద్దేశంలో, భారతం వంటి గ్రంధాన్ని, తిరిగి ఈ నాడు వాడుకలో ఉన్న భాషలోకి అనువదించుకోవడం అవసరం. అప్పుడే ఇతిహాసాలకి కావలసిన ప్రజాదరణ వస్తుంది. లేక పోతే, అవి ప్రత్యేకంగా పండితుల పరిశోధనలకే పనికి వస్తాయి. బహుశా, అదికూడా మరుగున పడిపోతున్నదేమో, తెలియదు.

పాశ్చాత్య దేశాలలో, వారి వారి ఇతిహాసాలు, మత గ్రంధాలూ కొత్తగా పలుమారులు, పలు తరాలలో అనువాదాలు చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ గ్రంధాలు అన్ని తరాలలోనూ, సజీవంగా ఉంచాలన్న కోరికే ఈ నూతన అనువాదాలకి ముఖ్య కారణం. ఇది మనకి సరికొత్త విషయంగా కనిపించవచ్చు. ఎవరో ఎప్పుడో అన్నారుట, ” Classics are to be retold from time to time, అని. తథాస్తు.
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: