Saturday, June 30, 2018

పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం


పోతనామాత్యుని కల్పనానల్పశిల్పంసాహితీమిత్రులారా!
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

జాతీయమహాకవి బమ్మెర పోతనామాత్యుల వారి శ్రీమహాభాగవతంలో అద్భుతావహమైన ఊహశాలితకు, కల్పనానల్పశిల్పానికి ప్రథమోదాహరణీయమని పేరుపొందిన పద్యం ఇది. బలిచక్రవర్తి వద్దకు వటుకరూపంలో వచ్చి మూడడుగుల దానాన్ని పొంది త్రివిక్రముడైన వామనావతీర్ణవిష్ణువు – ఒక్క అడుగుతో అధోలోకాలను క్రమించి, మరొక అడుగుతో ఊర్ధ్వలోకాలను ఆక్రమించి, బ్రహ్మాండాంతం వరకు వర్ధిల్లుతున్న తరుణంలో ఆ మహద్రూపాన్ని వ్యంజింపజేస్తున్న మహనీయదృశ్యం ఇది.

అమోఘమైన ఈ పద్యానికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఉదాహృతమై ఉన్నది. పోతనగారి బహుగ్రంథశీలితకు, విశాలమైన వైదుష్యానికి, విపులపాండిత్యానికి నిదర్శకమైన మహాద్భుతఘట్టం ఇది.

‘ఉత్తరోత్తర ముత్కర్షః సారః’ అని సూత్రం. పూర్వపూర్వాని కంటె ఉత్తరోత్తరానికి ఉత్కర్ష విధింపబడినట్లయితే అది సారము అనే పేరుగల అలంకారం. కొందరు దీనిని వర్ధమానము అనే పేరుగల అలంకారమని కూడా అంటారు. జయరథుడు వర్ధమానం సారాలంకారంలోనే ఇమిడిపోతుందని అన్నాడు. అలంకార రత్నాకరంలో శోభాకరమిశ్రుడు ఒకే వస్తువు లేదా అనేక వస్తువుల ఉపచయం వల్ల కలిగే చమత్కారం వర్ధమానానికి లక్షణమని నిర్వచించాడు. జయరథుడు దానిని సారానికే అన్వయించి చూపాడు. అందుకు ఈ శ్లోకాన్ని ఉదాహరించాడు:

కిం ఛత్త్రం కిం ను రత్నం తిలక మథ తథా కుణ్డలం కౌస్తుభో వా
చక్రం వా వారిజం వే త్యమరయువతిభి ర్యద్బలిద్వేషిదేహే
ఊర్ధ్వే మౌలౌ లలాటే శ్రవసి హృది కరే నాభిదేశే చ దృష్టం
పాయా త్త ద్వోఽర్కబిమ్బం స చ దనుజరిపు ర్వర్ధమానః క్రమేణ.

బలిద్వేషి అయిన వామనావతార విష్ణువు శరీరం పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న అప్సరసలు – అదిగో, సూర్యబింబం ఆయనకు పట్టిన గొడుగై ఉన్నది కదూ! అదిగో అంతలో అది ఆయన శిరసుమీది రత్నమై ఉంది కదూ! నుదుటిమీది తిలకమై ఉంది కదూ! చెవియందలి కుండలమై ఉంది కదూ! వక్షఃస్థలాన్ని అలంకరించిన కౌస్తుభరత్నమై ఉంది కదూ! పాణితలమందలి సుదర్శన చక్రమైంది కదూ! నాభిదేశాన ఉన్న పద్మమై కనబడింది కదూ! అనుకొంటున్నప్పటి ఆ సూర్యబింబమూ, ఆ రాక్షసశత్రువైన శ్రీమహావిష్ణువూ మిమ్మల్ని రక్షిస్తారు గాక! – అని ఆశీస్సు.

త్రివిక్రముడైన విష్ణువు యొక్క ఉత్తరోత్తరవృద్ధిని చెప్పటానికి సూర్యబింబం ఆ మహద్రూపం ముందు ఎంతెంత చిన్నబోతూ వచ్చిందో ప్రతిపాదింపబడింది. ‘అత్ర ఏకస్యైవ హరేః తత్తదవస్థావిశిష్టతయా స్వరూపేణ ఉత్తరోత్తరం ఉత్కర్షః’ అని జయరథుని వ్యాఖ్య.

శ్లోకంలో ఉన్నది విశ్వరూపుడైన త్రివిక్రముని వర్ణనమే. అద్భుతావహమైన ఆ అభివర్ణన తనకెంతో నచ్చినందువల్ల పోతనగారు దానినే తెలుగు చేశారు. అమరయువతులు అనుకొంటున్నట్లుగా చిత్రింపబడిన దృశ్యం ఆంధ్రీకరణలో పురాణవక్త శుకమహర్షి చెప్పినట్లుగానే అయినా, కవిప్రౌఢోక్తిసిద్ధం అయింది.

సూర్యబింబం అమరయువతులకు విష్ణువు నాభిదేశాన్ని అలంకరించిన పద్మం వలె కనుపించటం వరకే శ్లోకంలో ఉన్నది. పోతనగారు చిత్రిస్తున్నది అమరయువతుల అభ్యూహను కాదు. బలిచక్రవర్తి కళ్ళయెదుట జరుగుతున్న సంఘటనను. అందువల్ల త్రివిక్రముడు నభోవీథిని దాటి సత్యపదోన్నతుడైనప్పుడు భూలోకవాసులకు సూర్యబింబం ఆయన కాలి అందెయై కానరావటం, పాదపీఠమై కనబడటం సహజమే. మూలంలోని కల్పన నుంచి 1. లలాటము నందలి తిలకమై ఉండటం, 2. పాణియందలి చక్రమై ఉండటం, 3. నాభియందలి పద్మమై ఉండటం అన్న మూడు అధ్యారోపాలను పోతనగారు విడిచివేశారు.

తెలుగు పద్యంలో, సూర్యబింబం గొడుగై ప్రకాశించింది – అన్నప్పటి అలంకృతిని పరిశీలింపవలసి ఉంటుంది. సూర్యబింబం గొడుగు వలె ప్రకాశించింది – అన్నట్లయితే సూర్యబింబానికీ, ఛత్రానికీ ప్రకాశ వర్తులత్వాది సమానధర్మాలు ఉన్నందువల్ల, వలె అన్న సాదృశ్యవాచకం ఉన్నందువల్ల సౌందర్యాపాదకమైన ఉపమాలంకారం సిద్ధిస్తుంది. ‘గొడుగు వలె’ అనకుండా ‘గొడుగుగా’ అన్న తాద్రూప్యాన్ని; ‘శిరోమణి వలె’ అనకుండా ‘శిరోమణిగా’ అన్న తాద్రూప్యాన్ని; ఆ తర్వాత మకరకుండలంగా, కంఠాభరణంగా, బంగారు భుజకీర్తిగా, కాంతులీనే కంకణంగా, మొలలోని గంటగా, మేలైన కాలి అందెగా, పాదపీఠంగా అని ప్రకృతవస్తువైన సూర్యబింబమునందు అప్రకృతవస్తువులైన ఛత్ర శిరోమణ్యాదులతో తాద్రూప్యాన్ని కల్పించటం వలన ఇక్కడ ఉపమాలంకారం పరిహరింపబడుతున్నది.

‘తాద్రూప్యం’ అన్నంత మాత్రాన ఇక్కడ కల్పనలో సూర్యబింబమునందు గొడుగుయొక్క ధర్మారోపమేమీ జరుగలేదు. గొడుగులో సూర్యబింబము యొక్క ధర్మారోపమూ జరుగలేదు. అందువల్ల ఎటుచూసినా ఇది రూపకాలంకారమూ కాదు. అవయవ నిరూపణను చేయక అవయవిని మాత్రమే రూపించినట్లయితే అది కేవలనిరవయవ రూపకమని లక్షణకారులన్నారు. అది మాలారూపంలో ఉంటే మాలానిరవయవ రూపకం అవుతుంది. అయితే ఇక్కడ సూర్యబింబమునందు కాని, గొడుగులో కాని అవయవనిరూపణం జరుగలేదు. అందువల్ల కూడా రూపకాలంకారసిద్ధి లేదు.

ఆ విధంగా కాక, ‘సూర్యబింబం గొడుగుగా ప్రకాశించింది’ అన్నప్పుడు ఉపమేయమైన సూర్యబింబానికి ఉపమానమైన గొడుగు ఆరోప్యమాణమైనందున దర్శించేవారి దృష్టిలో సూర్యబింబం గొడుగుగా పరిణామాన్ని చెందినదని అనవచ్చును. ఉపమేయమునందు ఆరోపింపబడిన ఉపమానం ప్రకృతరూపంలో – అంటే, ఉపమేయరూపం గానే పరిణమించినట్లయితే అది పరిణామాలంకారం అవుతుంది. ఒక విధంగా ఇది పైని చెప్పిన రూపకంలో అంతర్భవించేదే. ఉపమానం ఎక్కడ ఉపమేయరూపం గానే ప్రకృతానికి ఉపయోగిస్తుందో, అది పరిణామం అనికూడా అనవచ్చును. సూర్యబింబం గొడుగుగా పరిణమించి ప్రకృతోపయోగాన్ని చెందిందని కదా అంటున్నాము? కాని, ఇక్కడ కవి స్వయంగానే రవిబింబానికి ఛత్రరూపపరిణామాన్ని తిరస్కరించి, రవిబింబం ఛత్రమై ‘ఉపమించటానికి యోగ్యంగా ఉన్నది’ అంటున్నాడు. పోతనగారి ఉద్దేశంలోనే ఇది రూపకమూ కాదు; పరిణామమూ కాదన్నమాట. రవిబింబం ఛత్రము వలె ఉన్నది అనక, ‘రవిబింబం ఛత్రమై ఉపమించటానికి యోగ్యంగా ఉన్నది’ అనటం వల్ల ఇది ఉపమాలంకారమూ కాదు. మూలంలో వలెనే సూర్యబింబము చిన్నది చిన్నది కావటాన్ని చెబుతూ శ్రీమహావిష్ణువుకు ఉత్తరోత్తర వృద్ధిని చెప్పటం జరిగింది. అందువల్ల ఇదీ సారాలంకారమే.

ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాము. వటుఁడు = బ్రహ్మచర్యాశ్రమంలోకి అడుగుపెట్టి, ఒంటిజందెంతో ఉన్న ఆ పొట్టివడుగు; బ్రహ్మాండమున్ = పధ్నాలుగు లోకాలు, తొమ్మిది వర్షాలు, వాటికి ఆవల శుద్ధజలార్ణవం, ఆ సమస్తాన్ని చుట్టుకొని ఉన్న లోకాలోకపర్వతం దాకా అండాకృతిలో ఉన్న మహాప్రదేశాన్ని; తాన్ = విశదమైన ఆకారశోభతో తానై స్వయంగా; నిండుచోన్ = సర్వాంగ సంపూర్ణంగా వ్యాపిస్తున్నప్పుడు –

రవిబింబంబు = సూర్యమండలం; ఛత్రంబు + ఐ = గొడుగై; శిరోరత్నము + ఐ = తలమానికమై; శ్రవణ + అలంకృతి + ఐ = చెవియందు దాల్చిన మకరకుండలమై; గళాభరణము + ఐ = మెడలో అలంకరించికొన్న కౌస్తుభ రత్నమై; సౌవర్ణకేయూరమై – సౌవర్ణ = బంగారుతో చేసిన, కేయూరము + ఐ = బాహుపురి అయి; ఛవిమత్కంకణమై – ఛవిమత్ = నిండైన వెలుగుతో కూడిన, కంకణము + ఐ = చేతికి తొడిగికొన్న అందె అయి; కటిస్థలిన్ + ఉదంచత్ + ఘంట + ఐ = నడుముకు చుట్టికొన్న మొలత్రాటికి వ్రేలుతున్న గంటయై; నూపురప్రవరంబు + ఐ = శ్రేష్ఠమైన అందెయై; పదపీఠము + ఐ = కాలిపీట అయి; ఉపమింపన్ = పోలిక తెచ్చేందుకు; పాత్రము + అగున్ = యోగ్యము అవుతుంది – అని.

అంతే కాదు. సంస్కృతంలో లాగా ‘నుదుటనున్న తిలకము’ అని వ్రాస్తే అది బొట్టు వలె ఉన్నదన్న స్వరూపబోధ కలగటం కష్టం. తిలకము అంటే నిలువుబొట్టు అనే ప్రసిద్ధి. సూర్యబింబం పాణితలమందలి చక్రము వలె కనబడటం సమంజసమే కాని, పైకెత్తి పట్టిన చేతియందు రాణించినట్లు ఆ కల్పన ఆజానులంబిదీర్ఘబాహువైన శ్రీహరి చేతిని కటివరదహస్తుడై క్రిందికి చాచినప్పుడు పొందుపడదు. ఊర్ధ్వబాహుడై ఉన్నట్లయితే శిరస్సు నుంచి పాదాల వరకు చూపుతున్న వస్తువుల క్రమం తప్పుతుంది. సూర్యబింబం నాభియందలి పద్మము వలె కానరావటం కూడా అంత సిద్ధకల్పన కాదు. పైగా, నాభియందలి పద్మము యథావస్థితంగా నాభియందు గాక – నాభినుంచి వెలువడిన తూడుకు అగ్రభాగాన – నాభికి ఏ కొంత దూరంలోనో ఉంటుంది.

అందువల్ల పోతనగారు ఈ మూడు కల్పనలను విడిచివేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా 1. కటిస్థలిని ఉదంచద్ఘంటయై, 2. నూపురప్రవరంబై, 3. పదపీఠమై అన్న సరికొత్త కల్పనలను సందర్భానికి తగినట్లు ప్రవేశపెట్టి ఔచిత్యాన్ని పాటించారు. సూర్యబింబం విశ్వరూపుని శిరోదేశం నుంచి పాదసీమకు వచ్చి తన భక్తిని వెల్లడించినట్లయింది. పోతనగారు శ్రీమహాభాగవతంలో మూలాతిరిక్తంగా కనీసం ముప్ఫై – నలభై గ్రంథాల నుంచి డెబ్భై దాకా అనువాదాలను చేశారు. వాటన్నిటిని సేకరించటం సాహిత్యారాధకులకు ఎంతో ఆనందఫలదాయకమైన కృషి.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: