Sunday, June 17, 2018

ఉదాహరణములు – 1


ఉదాహరణములు – 1సాహితీమిత్రులారా!

ఉదాహరణ వాఙ్మయమును గురించిన వ్యాసం
మొదటిది ఆస్వాదించండి-

ముందుమాట
నిడుదవోలు వేంకటరావుగారి ఉదాహరణవాఙ్మయము[1] చదివినపుడు నాకు ఈ ఉదాహరణ కావ్యములందు ఆసక్తి కలిగినది. సుమారు ఒక పుష్కరము ముందు వీటిని గుఱించి యాహూ ఛందస్సు, రచ్చబండ కూటములలో వ్రాసినాను. నాకు కూడ ఒక ఉదాహరణమును వ్రాయాలనే సంకల్పము కలిగినది, దాని ఫలితమే శారదోదాహరణ తారావళి. నేను చదివిన కొన్ని ఉదాహరణ కావ్యములలో లక్షణములను సరిగా వాడలేదని నేను భావించినాను. అందువలన నేటి కాలపు కవులకు, పాఠకులకు ఈ ప్రక్రియ వివరములను తెలుపుటయే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము. దీనిని రెండు భాగములుగా ప్రచురించుతున్నాను. మొదటి భాగములో ఉదాహరణముల లక్షణములను సంగ్రహముగా తెలిపి ప్రతి విభక్తికి నిదర్శనములను చూపుతాను. ప్రతి విభక్తికి నిదర్శనములను 1. కావ్యము, 2. పాట, 3. శాసనము, 4. ఉదాహరణ కావ్యములనుండి చూప దలచుకొన్నాను. ఈ విధముగా ఒక సంపూర్ణమైన అవగాహన మనకు కలుగుతుంది.

పరిచయము
శ్రీనాథుడు వ్రాసిన హరవిలాస కావ్యములో కిరాతార్జునీయ ఘట్టము అందరకూ బాగుగా పరిచయమే. ఆ ఘట్టము పాఠ్య వస్తువుగా కూడా ఉండినది. అందులో అర్జునుడికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుని స్తుతిస్తాడు. మొత్తము ఏడు పద్యాలు. ఆ పద్యాల ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్క పద్యము ఒక్కొక్క విభక్తిలో ఉంటుంది. (ఎందుకో శ్రీనాథుడు పంచమీ విభక్తిలో వ్రాయలేదు). ఇలా విభక్తులలో వ్రాయబడిన పద్యములను ‘ఉదాహరణములు’ అంటారు. ఆ ఏడు పద్యములు ఇవి:

నీవ పరబ్రహ్మంబవు
నీవఖిలాండాండపతివి – నీవు ప్రసన్న-
శ్రీవిభవారోగ్యాయుః
ప్రావీణ్యప్రాభవైక – ఫలదుఁడవు శివా – 7.93
(ప్రథమా విభక్తి)

నిన్నుఁ ద్రిజగన్నివాసునిఁ
బన్నగకంకణుని భక్త-పరతంత్రుని న-
భ్యున్నత కరుణాగుణసం-
పన్నుని గనుఁగొంటి మంటి – బాలేందుధరా – 7.94
(ద్వితీయా విభక్తి)

నీచేతఁ గృపానిధిచే
వాచాగోచర వివేక – వైయాత్మునిచే
నోచంద్రకలాశేఖర
యాచించి మనోరథార్థ – మర్థిం గందున్ – 7.95
(తృతీయా విభక్తి)

నీకై యేను దపంబు చేసితి మహా-నిష్ఠా గరిష్ఠస్థితిన్
నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా – నేర్పొప్పఁగా నెంతయున్
నీకై పూజయొనర్తుఁ గొంత విరులన్ – నిత్యంబు సద్భక్తితో
నీకై సేవ యహర్నిశం బొనరుతున్ – వేదండచర్మాంబరా – 7.96
(చతుర్థీ విభక్తి)

సాటి యెవ్వరు నీకు ని-శాటభూష
కైటభారాతి హాటక-గర్భ వంద్య
ఘనజటాజూటవాటికా – ఘటిత వికట
గగనగంగా స్రవంతిక – కరటి వైరి – 7.97
(షష్ఠీ విభక్తి)

నీయందు జగములుండున్
బాయక యా జగములందుఁ – బాయక నీవున్
దీయనుపు దెలియ నజునకుఁ
దోయజనేత్రునకు నైనఁ – దోఁపదు శర్వా – 7.98
(సప్తమీ విభక్తి)

జయ సర్వేశ్వర సర్వలోక జనకా – చంద్రార్ధచూడామణీ
జయ కామాంతక కామితార్థ ఫలదా – చక్షుశ్శ్రవః కుండలా
జయ సంపూర్ణ కృపాగుణైక వసతీ – శైలేంద్రజా వల్లభా
జయ దక్షాధ్వరమర్దనా జయ గిరీ-శా యీశ రక్షింపవే – 7.99
(సంబోధనా ప్రథమా విభక్తి)

సార్వవిభక్తిక పద్యము – కులశేఖర ఆళ్వారుల ముకుందమాలలోని ఒక సార్వవిభక్తిక పద్యము –

కృష్ణో రక్షతు నో జగత్రయగురుః – కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేన అమరశత్రవో వినిహితాః – కృష్ణాయ తుభ్యం నమః
కృష్ణాత్ ఏవ సముత్థితం జగదిదం – కృష్ణస్య దాసోఽ స్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం- హే కృష్ణ రక్షస్వ మాం

దీనికి అర్థము:

– కృష్ణో రక్షతు నో జగత్రయ-గురుః – జగత్రయ గురుడైన కృష్ణుడు నన్ను రక్షించు గావుత – ప్రథమా విభక్తి (Nominative case).
– అహం కృష్ణం నమస్యామి – కృష్ణుని నేను నమస్కరించుచున్నాను – ద్వితీయా విభక్తి (Accusative case).
– కృష్ణేన అమరశత్రవో వినిహితాః – కృష్ణునిచే అమరుల శత్రువులు నిర్జించబడిరి – తృతీయా విభక్తి (Instrumental case).
– కృష్ణాయ తుభ్యం నమః – అందులకై కృష్ణునికి నా ప్రార్థనలు – చతుర్థీ విభక్తి (Dative case).
– కృష్ణాత్ ఏవ సముత్థితం జగదిదం – కృష్ణుని వలన ఈ విశ్వము సృష్టించబడినది – పంచమీ విభక్తి (Ablative case).
– కృష్ణస్య దాసోఽ స్మ్యహం – నేను కృష్ణుని యొక్క దాసుడిని – షష్ఠీ విభక్తి (Possessive case).
– కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం – కృష్ణునియందు సర్వ లోకములు గలవు – సప్తమీ విభక్తి (Locative case).
– హే కృష్ణ రక్షస్వ మాం – ఓ కృష్ణుడా, నన్ను రక్షించవా – సంబోధనా ప్రథమా విభక్తి (Denominative case).

ఈ విధముగా ఎనిమిది విభక్తులలో వృత్తములను, కళికోత్కళికలను వ్రాసి, చివర ఒక సార్వ విభక్తిక పద్యమును వ్రాయగా లభించిన లఘు కావ్యమును ఉదాహరణ కావ్యము అంటారు. వీటికి కొన్ని ప్రత్యేకమైన విభక్తి ప్రత్యయములు మాత్రమే అంగీకృతములు. అదే విధముగా రగడల రూపములో ఉండే కళికోత్కళికల ఉపయోగములో కూడ నియమములు ఉన్నాయి.

ఉదాహరణ లక్షణములు
తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది. ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట. అంకితాంకముతో మొత్తము ఇరువదియాఱు పద్యములతో వ్రాయబడిన ఇట్టిది ఒక లఘుకావ్యము లేక క్షుద్రకావ్యము. ఇది చతుర్విధ కవితలలో మధుర కవిత వర్గమునకు చెందినది. ఉదాహరణపు లక్షణములను మొట్టమొదట విన్నకోట పెద్దన వ్రాసిన కావ్యాలంకారచూడామణిలో చదువ వీలగును. కాని అందులో లక్ష్యములు లేవు. క్రింద ఉదాహరణకావ్యపు లక్షణములను ఇస్తున్నాను-

ప్రతి విభక్తిలో మూడు పద్యములు ఉండవలయును. ఈ విభక్తి పద్యములో నిస్సందేహముగా కనబడవలయును. ఒకటియో రెండో ఇతర విభక్తులు ఉండుట దోషము కాదు.
మొదటి పద్యము వృత్తముగా నుండవలయును. వృత్తములలో శార్దూల, మత్తేభ విక్రీడితములు, చంపకోత్పల మాలలను మాత్రమే వాడాలి. కాని కవులు ఇతర విధములైన వృత్తములను, కందమును, ద్విపదను కూడ వాడినారు.
రెండవ పద్యము ఒక రగడగా ఉండాలి. నవవిధ రగడలలో ఏదియైనను ప్రయోగనీయమే. హంసగతిరగడ కూడ ఉపయోగించబడినది. ఈ రెండవ పద్యమైన రగడను కళిక అంటారు. ఉదాహరణములలో ఉపయోగించబడే నాలుగు వృత్తములను రాగయుక్తముగా పాడుకొన వచ్చును, కాని అవి తాళరహితములు. కాని రగడలు తాళబద్ధములయిన వైతాళీయములు.
కళికను ఎల్లప్పుడు మఱియు అను పదముతో లేక దాని పర్యాయ పదముతో ప్రారంభించాలి. ఈ నియమము బహుశా ముందు ఉన్న పద్యముతో అన్వయముకోసము అనుకొంటాను.
కళిక పిదప ఉత్కళిక ఉండాలి. ఉత్కళిక కళికలో సగము. కళిక మధురగతి రగడ (నాల్గు చతుర్మాత్రలు) అయితే, ఉత్కళిక అందులో అర్ధ భాగమైన రెండు చతుర్మాత్రలు. ఈ నియమమువలన కళిక, ఉత్కళికలు ఒకే తాళములో ఉంటాయి. ఉత్కళికకు యతి నియమము లేదు. కాని ప్రాస, అంత్యప్రాస ఉండి తీరాలి.
కళికోత్కళికలు అష్టపదులు, అనగా ఎనిమిది పాదములు ఉంటాయి వీటిలో.
కళికలో ప్రతి పాదాంతమున విభక్తి ప్రత్యయము ఉండాలి. ఉత్కళికకు చివరి రెండు పాదములలో మాత్రమే విభక్తి యుండాలి. మిగిలిన పాదములకు అంత్యప్రాస అవసరము. సంబోధనలో పాదాంతములో సంబోధన ఉండాలి.
కళికలో ప్రతి పాదము స్వతంత్రముగా నుండాలి.
ఉత్కళిక ఏకసమాసముగ భాసించవలయును.
చతుర్థీ విభక్తి ఉత్కళిక విభక్త్యాభాసయుక్తము. అనగా చతుర్థీవిభక్తి ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో విభక్తి ప్రత్యయము ధ్వనించవలయును. కాని అది నిజముగా విభక్తి ప్రత్యయము కాకూడదు! వినుటకు విభక్తి, చదువుటకు ఒక విభక్తి ప్రత్యయమును బోలు పదము.
చివరి పద్యములో కవి పేరు, కావ్య వస్తువు రెండును ఉండాలి.
కొందఱు ఈ ఇరువదియాఱు పద్యములతో ఆదిలో లేక అంతములో మఱి కొన్ని పద్యములు చేరుస్తారు. మొత్తము సంఖ్య 27 అయితే అది తారావళి అవుతుంది.
ఉదాహరణముల జననము
ఉదాహరణములను గుఱించి తెలిసికోవాలంటే మనము విభక్తులను గుఱించి, రగడలను గుఱించి తెలిసికోవాలి. వీటిని గుఱించి కూలంకషముగా కాకపోయినా, కావలసినంత వఱకు చర్చిస్తాను. విభక్తులు భాషాచరిత్రలో ఎన్నో మార్పులు చెంది నేటి దశకు చేరినవి. విభక్తి లేకుండ భాషను ఉపయోగించుట అసాధ్యము. ఈ విభక్తుల పరిణామక్రమమును కొందఱు భాషా శాస్త్రజ్ఞులు వివరించారు[1, 2]. మనము ఇప్పుడు వాడే విభక్తులు శాస్త్రీయముగా లేవని మాత్రము చెప్పవచ్చును. వ్యాసాంతములో ఈ స్థితిని మార్చుటకు సాధ్యమా అనే విషయమును చర్చిస్తాను. తెలుగు విభక్తులను మొదటి పట్టికలో పొందుపఱచినాను.


1. తెలుగు విభక్తులు
సంస్కృతములో ఉదాహరణపు ప్రస్తావన మహాకవి కాలిదాసు చేసినాడని వేంకటరావు ప్రస్తావించారు కాని అట్టి వాటికి మనకు ఆధారములు దొఱకలేదు. పాల్కుఱికి సోమనాథకవి ప్రప్రథమముగా బసవోదాహరణమును వ్రాసినప్పుడుగల పరిస్థితులను పరిశీలిస్తే ఉదాహరణములను ఆ రీతిగా ఎందుకు ప్రారంభించినాడని మనము కొద్దిగానైనా అవగాహనము చేసికొనవచ్చును.

(1) కృష్ణో రక్షతు… సార్వ విభక్తిక పద్యమును వ్రాసిన కులశేఖర ఆళ్వారు (8వ శతాబ్దము) సోమనాథునికి పూర్వుడు.

(2) కన్నడము బాగుగా నెఱిగిన సోమనాథునికి కవిరాజమార్గములోని[3] (సుమారు క్రీ.శ. 850) క్రింది సార్వ విభక్తిక పద్యము కూడ పరిచితమై ఉండాలి. ఆ పద్యము –

చం. నరపతి బందనా నృపననళ్తియె కాణ్బుదు తన్నరేంద్రనిం
ధరణి సనాథె భూపతిగె కప్పవనీ యవనీశనత్తణిం
పరిభవమం కళిల్చువుదధీశ్వరనా దయె సాల్గుమా మహీ-
శ్వరనొళిదప్పుదెంబుదిదు కారకయుక్త విభక్త్యనుక్రమం – కవిరాజమార్గం, 1-115

నరపతి బందను – నరపతి వచ్చినాడు
ఆ నృపననళ్తియె కాణ్బుదు – ఆ నృపతిని ప్రీతితో చూడవలెను
తన్నరేంద్రనిం ధరణి సనాథె – ఆ నరేంద్రునిచేత (వలన) భూమి సనాథ
భూపతిగె కప్పవనీ – భూపతికి కప్పమును చెల్లించాలి
యవనీశనత్తణిం పరిభవమం కళిల్చువుదున్ – ఆ అవనీశునినుండి అవమానమును పోగొట్టాలి
అధీశ్వరనా దయె సాల్గు – అధీశ్వరుని దయ చాలు
ఆ మహీశ్వరనొళిదప్పుదెంబుదిదు – ఆ మహీశ్వరునియందు ఇది సాధ్యము

(3) జయదేవకవి సుమారు క్రీ.శ. 1200 కాలానికి గీతగోవిందమును వ్రాసినాడు. గీతగోవిందములో పద్యములు, అష్టపది రూపములో పాటలు రెండు ఉన్నాయి. పాటలు మాత్రాబద్ధములు, పద్యములు సంస్కృత వృత్తములు లేక శ్లోకములు. పాట అయిన అష్టపది ఎప్పుడు ఒక పద్యము తఱువాత వస్తుంది. ఈ విషయమును ఇంతకు ముందే నేనొక వ్యాసములో [ఈమాట – సావిరహే] వివరించి యున్నాను. ఉదాహరణములలో కూడ మొట్టమొదట ఒక వృత్తము, తఱువాత పాడుకొనుటకు అనువైన మాత్రాగణ నిర్మితమైన రగడలు, అర్ధ రగడలు ఉన్నాయి. జయదేవుని గీతగోవిందము ఉదాహరణ కావ్యముల చట్రమునునకు ప్రోత్సాహ మేమో? ఎందుకంటే మొట్టమొదటి వృత్తము తాళరహితము, మాత్రాగణబద్ధమైన అష్టపది తాళబద్ధము. బసవోదాహరణపు కాలము నిస్సంశయముగా గీతగోవింద కావ్యము తఱువాతిదే. ఈ కోణములో ఇంతవఱకు ఎవ్వరు ఆలోచించినట్లు లేదు.

విభక్తులను ఉపయోగించవలెనను భావము పై రెండు పద్యముల ద్వారా సోమనాథునికి కలిగి ఉండవచ్చును. వృత్తమును, రగడలను ఉపయోగించవలెనను తలంపు గీతగోవిందము ద్వారా కలిగి ఉండ వచ్చును. ఈ రెంటిని జత చేసి ఉదాహరణ కావ్యములను వ్రాసి ఉండుటకు ఆస్కారము ఉన్నది.

రగడలు
రగడల సంపూర్ణ లక్షణములను మనము మొట్టమొదట అనంతామాత్యుని (15వ శతాబ్దపు పూర్వార్ధము) ఛందోదర్పణములో [4] చూడవచ్చును. పెద్దన కావ్యాలంకారచూడామణిలో [5] ఉత్సాహ రగడ మాత్రమే తెలుపబడినది. బసవోదాహరణము 13-14వ శతాబ్దిలో వ్రాయబడినది. కావున ఆ కాలము నాటికే రగడలను కవులు వాడేవారు అని మనము భావించవచ్చును. రేచన కవిజనాశ్రయములో రగడల ప్రస్తావన లేదు. కాని నాగవర్మ ఛందోంబుధిలో[6] మూడు విధములైన రగడలు రఘటాబంధముగా క్రింద చెప్పబడినవి. అవి –

ఉత్సాహ రగళె – త్ర్యస్రగతి (24 మాత్రలు)
మందానిల రగళె – చతురస్రగతి (16 మాత్రలు)
లలిత రగళె – ఖండగతి (20 మాత్రలు)

2అ. లక్షణమున్న రగడలు
మిశ్రగతి భామినిషట్పదిలో వస్తుంది. వీటిని ఆధారముగా తీసికొని తెలుగులోని నవవిధ రగడలను కల్పించియుండాలి. ఇలా ఏ లాక్షణికుడు కల్పించినాడో అన్న విషయము మనకు తెలియదు. బహుశా సోమనాథుడే కల్పించినాడేమో? రగడలను గుఱించి వివరములకు నేను వ్రాసిన సందేశములను పొందుపఱచి ఆంధ్రభారతి సైటులో ఉంచినాను.

ఉదాహరణములలో సామాన్యముగా తెలుగులోని నవవిధ రగడలు, అదనముగా హంసగతి రగడ – వీటిని మాత్రమే పూర్వకవులు వాడినారు. లక్షణసమన్వితమైన రగడలు 2అ-పట్టికలో, నేను కల్పించిన రగడలు 2ఆ-పట్టికలో తెలుపబడినవి. రగడలలో ఎప్పుడు కొన్ని నియమములను పాటించాలి?

రగడలు మాత్రాగణ నిర్మితములు, ఈ మాత్రాగణములలో ఎదురు నడక (అనగా లగారంభము IU) నిషిద్ధము.
రగడలలో ఎదురు నడక లేని ఈ మాత్రాగణములను మాత్రమే ఉపయోగించాలి – మూడు మాత్రలు – UI, III; నాలుగు మాత్రలు – UU, IIU, UII, IIII; ఐదు మాత్రలు – UIU, UUI , IIIU, IIUI, UIII, IIIII.
రగడలు ద్విపదలు. అక్షరసామ్య యతి, ప్రాస, అంత్యప్రాస ఉండాలి. ప్రాసయతిని వాడరాదు.
పాదాంత విరామమును (సంస్కృతములోని యతిని) పాటించాలి.
మాత్రాగణముల స్వరూపమును మార్చరాదు. మూడు మాత్రలంటే మూడు మాత్రలే. రెండు సూర్య గణములను ఒక ఆఱు మాత్రల గణముగా వాడరాదు (ఉదా. UIIU). రెండు చతుర్మాత్రలను ఒక అష్ట మాత్రగా వాడరాదు (ఉదా. UIUIU). ఇలా కొన్ని చోటులలో కొందఱు కవులు వాడియుండ వచ్చును. వారి ప్రయోగమును మనము ఆదరించాలి, కాని మనము అలా ఎప్పుడు చేయరాదు.
మాత్రాగణములకు తగ్గట్లు పదములను విఱిచి వ్రాస్తే గానయోగ్యత సిద్ధిస్తుంది. ఉదాహరణముల గుఱి గానానుభవము అన్న విషయమును మఱువరాదు.

2ఆ. కొత్తగా కలిపించిన రగడలు
రగడలను పుష్పాచయము, జలక్రీడ, యుద్ధ వర్ణన, నగర, క్షేత్ర వర్ణనలలో కవులు చాల చాకచక్యముతో వాడారు. పెద్దననుండి పాపరాజు వఱకు రగడలను ప్రాస, అంత్యప్రాసలతో మాత్రమే కాక యమక, అనుప్రాసలతో కూడ వ్రాసినారు. యక్షగానములలో[7] ఇవి ఒక ప్రత్యేక స్థానమును ఆక్రమించుకొనినవి. ఉదాహరణ కావ్యములలో రగడలను కళికలుగా, అర్ధరగడలను ఉత్కళికలుగా కవులు పేర్కొనిరి. అంతే కాక కొన్ని – సుదర్శన రగడ, నయన రగడ, నమశ్శివాయ రగడల వంటివి తెలుగు సాహిత్యములో ఒక ప్రత్యేక స్థానమును సంపాదించుకొన్నాయి.

ప్రథమావిభక్తి
ప్రథమా విభక్తి ప్రత్యయములు డు, ము, వు, లు; ఉదా. రాముఁడు, నగము, విష్ణువు, నక్కలు, సీత మున్నగునవి. ప్రథమా విభక్తితో సాహిత్యములో పద్యాలు ఎన్నో ఉన్నాయి. నన్నయ వ్రాసిన మొదటి తెలుగు పద్యములోని ఎన్నో పదాలు ఈ విభక్తితో నిండినవే, అదే విధముగా పోతన పద్యము కూడ. క్రింద అవి –

రాజకులైక భూషణుఁడు, రాజమనోహరుఁ, డన్య రాజ తే-
జోజయశాలి, శౌర్యుఁడు, విశుద్ధ యశ శ్శరదిందు చంద్రికా
రాజిత సర్వలోకుఁ, డపరాజిత భూరి భుజా కృపాణ ధా-
రా జల శాంత శాత్రవ పరాగుఁడు, రాజమహేంద్రుఁ డున్నతిన్ 
                                                    – ఆం.మ.భా. ఆది పర్వము, 1.3

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె-
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ 
                                                – పోతన భాగవతము, 1.10

నానాటి బ్రదుకు నాటకము, – కానక కన్నది కైవల్యము…
పుట్టుటయు నిజము – పోవుటయు నిజము
నట్ట నడిమి పని – నాటకము
ఎట్ట ఎదుట కల – దీ ప్రపంచము,
కట్ట కడపటిది – కైవల్యము… – అన్నమాచార్యుల కృతి.

దేవాధిదేవు డమిత
స్థావర జంగమమయుండు – సర్వేశుడు గౌ-
రీవరు డనవరతంబును
నీవుత గాటయకు దయ న-భీష్ట ఫలంబుల్ 
                        – కరీం నగర్ లోని ఉప్పరిపల్లి శాసనము (క్రీ.శ. 1157)

ఉదాహరణములలో ప్రథమా విభక్తి
పాల్కుఱికి సోమనాథుడు 13-14 శతాబ్దములో జీవించెను. శివ కవుల యుగమునకు నాందీగీతమును పాడిన మహాకవి. తెలుగులో మొదటి ఉదాహరణకావ్యమును రచించిన ఘనత ఇతనికి చెందినది. ఇతడు తెలుగులో మాత్రమే కాదు, కన్నడములో కూడ అగ్రగణ్యుడే. ఇతని ఉదాహరణమునకు బసవోదాహరణము అని పేరు. సంస్కృత వాఙ్మయములో కూడ ప్రప్రథమముగా ఇతడే ఉదాహరణమును రచించినాడు. ఇతడు రచించిన ఉదాహరణములోని ప్రథమా విభక్తి పద్యములు క్రింద ఇవ్వబడినవి –

శ్రీ గురులింగ తత్పరుఁ, డ-శేష జగన్నిధి, శుద్ధ తత్త్వ సం-
యోగ సుఖ ప్రపూర్తి, వృష-భోత్తమమూర్తి, యుదాత్త కీర్తి, ది-
వ్యాగమ మార్గవర్తి, బస-వయ్య కృపాంబుధి మాకు దివ్య సం-
భోగములం బ్రసాద సుఖ – భోగములం గరుణించు గావుతన్

మొట్ట మొదటి పద్యమును శ్రీకారముతో ప్రారంభించుట పరిపాటి.

కళిక- మధురగతి రగడ- చ/చ – చ/చ (ప్రాస, అంత్యప్రాస)
వెండియుఁ ద్రిభువన – వినుతి సమేతుఁడు
మండిత సద్గుణ – మహిమోపేతుఁడు
సురుచిర శివసమ – సుఖ సంధానుఁడు
పరమ పరాపర – భరితజ్ఞానుఁడు
విదితానందా-న్వీత మనస్కుఁడు
సదమల విపుల వి-శాల యశస్కుఁడు
శ్రీవిలసిత పద – చిరతర భద్రుఁడు
గావున సాక్షాత్ – కలియుగ భద్రుఁడు

కళిక వెండియు (మఱల) అనే పదముతో ఆరంభమైనది. కళికలో మొత్తము ఎనిమిది పాదములు, అనగా నాలుగు ద్విపదలు. మధురగతిరగడలో పాదమునకు నాలుగు చతుర్మాత్రలు. పాదాంతములో విరామము, రెండేసి పాదాలకు ద్వితీయాక్షర ప్రాస, అంత్యప్రాసలు ఉన్నాయి. మూడవ చతుర్మాత్రతో అక్షరసామ్యయతి. కళికలో అన్ని పాదముల చివర ప్రథమా విభక్తి పదములే ఉన్నాయి.

ఉత్కళిక- చ/చ
భువనోపకార
భవమోద వీర
భక్తిసంయోగ
ముక్తి సంభోగ
సౌఖ్యాబ్ధిలోన
ముఖ్యుఁడై తాన
వెలయు శుభకరుఁడు
ఇల విశ్వగురుఁడు

ఉత్కళిక కళికలో సగము కాబట్టి ఇందులో ప్రతి పాదములో రెండు చతుర్మాత్రలు మాత్రమే. యతి లేదు, కాని ప్రాసాంత్యప్రాసలు ఉన్నాయి. ఉత్కళిక అంతా ఒకే సమాసము. ఇందులో చివరి రెండు పాదములలో మాత్రమే ప్రథమా విభక్తి పదములు ఉన్నాయి. చివరి రెండు పాదములు తప్ప మిగిలిన వాటిలో రెండు చతుర్మాత్రలు కాని అష్టమాత్రలు ఉన్నాయి.

ద్వితీయా విభక్తి
ద్వితీయా విభక్తి ప్రత్యయములు ని, ను, ల, కూర్చి, గుఱించి (ఉదా. రాముని, సీతను, వారల, దేనినిగూర్చి, యేసుగుఱించి). ఉదాహరణములలో ని(న్), ను(న్) ప్రత్యయములను మాత్రమే వాడుతారు. క్రింద మారన మార్కండేయ పురాణమునుండి, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదనుండి ద్వితీయావిభక్తికి నిదర్శన పద్యములు –

ఆదిత్యు, సూర్యుని, – నర్యముఁ, బూషు, స్వ-
భాను, దివాకరు, – భాను, సవితృ,
నక్షరుఁ, బరము, సి-తాసితవర్ణుని,
భాస్కరు, దుష్ప్రేక్ష్యుఁ, – బంకజాప్తు,
రవిఁ, బ్రళయాంతకు, – రక్తపీతుని, దీప-
దీధితి, నవితర్క్యు, – దీర్ఘరూపు,
యజ్ఞాగ్నిహోత్రవే-దావస్థితుని, యోగి,
నిత్యు, ననంతుని, – నిగమవేద్యు,

నాద్యు, మిత్రుని, నఖిలలో-కైకరక్షు,
వ్యక్తు, గుణయుక్తుఁ, బరమద-యానురక్తు,
శాంతు, నిన్ను బ్రభాకరు – శరణు వేడి
సంతతము నిను గొల్తు న-నంత భక్తి – మార్కండేయ పురాణము, 7.156

శరదిందు చకచక-స్మయజి త్ప్రసన్నాన్యు,
దొడ్డ కెందమ్మి కం-దోయి వాని,
నతి కమ్ర గల్లభా-గాభోగ ఫాలాఢ్యు,
మకరాంక రత్నక-ర్ణికల వాని,
గాంబవోద్యచ్ఛ్రీవి-డంబి వృత్త శిరోధి,
సిరి పొల్చు మచ్చ పే-రురము వాని
నతనాభియుత వళి-త్రితయ శాతోదరు,
జానులంబి చతుర్భు-జముల వాని,

గరివరకరోరు, రుచిర జం-ఘామనోజ్ఞు,
సమతఁ బొందిన పదపల్ల-వముల వాని,
హైమవసనుఁ, గిరీట హా-రాంగ దాది
కలితు, శంఖ రథాంగాదు-లలరు వాని – ఆముక్తమాల్యద, 3.85

నగుమోము గలవాని, నా మనోహరుని, జగ మేలు శూరుని, జానకీవరుని
దేవాదిదేవుని, దివ్యసుందరుని, శ్రీ వాసుదేవుని, సీతారాఘవుని
సుజ్ఞాననిధిని, సోమసూర్య లోచనుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
నిర్మలాకారుని, నిఖిలాఘ హరుని, ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని
బోధతో పలు మాఱు పూజించి నే నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని – త్యాగరాజ కృతి.

శ్రీరమ్యక్ష్మావధూ – కాంచికి నెనయగు కాం-చీపురీనాథు నుగ్రా-
కారున్ లాలాటనేత్రున్ – గవిజనహితు ము-క్కంటికాడ్వెట్టిన్ బుణ్యా-
చారున్ దద్బుద్ధవర్మే-శ్వరుఁడు గొలిచి మున్-శాసనంబొందఁ గర్ణో-
దారుం డొంగేఱు మార్గ-త్రయము వడసె నా-తారచంద్రార్క లీలన్ – (చేబ్రోలు గ్రామములో నాగేశ్వరస్వామి దేవాలయములో ఒక శిలాస్థంభముపైన శాసనము. సుమారు క్రీ.శ. 1145)

ఉదాహరణములలో ద్వితీయా విభక్తి
క్రీస్తు శకము పదునాలుగవ శతాబ్దపు పూర్వభాగములో నివసించిన త్రిపురాంతకుని (తిప్పన) త్రిపురాంతకోదాహరణనుండి ద్వితీయా విభక్తి పద్యములు-

పామును హారమున్, నెలయుఁ – బాపట సేసయు, నేఱు మల్లికా
దామము, తోలు దువ్వలువు, – దట్టపు భూతియుఁ, జందనంబుమై
సామున జాల నందముగ – సన్నిధి సేసిన చూడగంటివే
నామదిలోఁ గుమారగిరి – నాథుని శైలసుతాసనాథునిన్

కళిక- ద్విరదగతిరగడ- పం/పం – పం/పం (ప్రాస, అంత్యప్రాసలు)

మఱియు వేలుపులేటి – మౌళి నాగిన వాని
నెఱయు గన్నప నోటి – నీటఁ దోగిన వాని
బొలతితో నొక్కొడలఁ – బొత్తు గూడిన వాని
దలకి సేనమరాజు – దాడి కోడిన వాని
శాఖ్యతొండని రాల – జడికి నోర్చిన వాని
సౌఖ్యతర సాయుజ్య – సరణి గూర్చిన వాని
వెన్నెలల బురుణించు – వెలది నవ్వుల వాని
వెన్నునకు నలువకును – వెదుక దవ్వుల వాని

ఉత్కళిక- పం/పం

చిగురుఁ గైదువు వెఱికి
మగల సిగ్గులు నఱికి
సతుల బాటులు పఱిచి
యతుల వ్రతములు చెఱిచి
అలులు చిలుకలు పిండు
లెలయ గొలువగ నుండు
మరు జయించిన వానిఁ
గరుణ మించిన వాని

తృతీయా విభక్తి
తృతీయా విభక్తి ప్రత్యయములు చే, చేత, తో, తోడ, తోడుత, మెయి. ఈ ప్రత్యయముల ప్రయోగములు వాని పేరులే తెలుపుతాయి. అవి చేయి, తోడు, మెయి. చే ప్రత్యయము instrumental case, తో ప్రత్యయము sociative case. ఇందులో చే- ప్రాచీనమైనది. చే- వాడబడుచుండు కాలములో తో- వాడబడుచుండినను, అది బహుశా విభక్తిగా అప్పుడు పరిగణించబడలేదని భాషాశాస్త్రజ్ఞుల ఊహ. మెయి ప్రత్యయము జడములకు మాత్రమే. ఉదాహరణకావ్యములలో చే- మాత్రమే ప్రయోగము చేసినారు. చే-ప్రత్యయమునకు బదులు చాల చోటులలో పంచమీ విభక్తి ప్రత్యయమైన వలన వాడినను అర్థభేదము ఏ మాత్రము రాదు. ఈ ప్రత్యయములకు కొన్ని ఉదాహరణములు –

మాద్రికి మీరు నంచ వెలి – మాపుపయిన్ మురువైన జోదుచే,
భద్రమయాత్ముచే, భువన – పాలన ఖేలనుచే, సరస్వతీ
ముద్రిత వక్త్రుచేత, నలు – మోముల వేలుపుచే, విరూరి వే-
దాద్రి చమూ విభుండు గను – నాయువు శ్రీయు నిరంతరాయమున్
                               – తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, 1.3

తుళసీదళములచే సంతోషముగా బూజింతు
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లికా సుగంధరాజ సుమముల
ధర నివి యొక పర్యాయము ధర్మాత్ముని సాకేత
పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజనుతుని – త్యాగరాజ కృతి.

బంగారు మెరవడి – పల్లవంబులతోడఁ
గెంబట్టు కీలు ప-క్కెరలతోడ
ముఖ సమర్పిత హాట-క ఖలీనములతోడఁ
గాంచన గ్రైవేయ-కములతోడ
సమకట్టి ముడిచిన – చామరంబులతోడఁ
దాప బెట్టిన యడి-దములతోడఁ
గనక ఘంటల యురు – గజ్జె పేరులతోడఁ
గర్ణ కీలిత దీర్ఘ – కళలతోడఁ

జిత్రమున వ్రాయగా రాని – చెలువుతోడ
నొప్పి యుచ్ఛైశ్శ్రవముతోడి – యుద్దు లనగ
వాహకులు దేఱ వచ్చె దు-ర్వార లీల
వసుమతీ నాయకుని పూజ – వారువములు – పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి శృంగారశాకుంతలము, 1.111

కసిగాటు మోవితోఁ గలకంఠి కాలితో
పసుపంటిన దుప్పటి వల్లెవాటుతో
పొసగని నిద్రతో వచ్చి నా తల కిట
నిలిచి యుండగా పొమ్మంటివే… ఓ యమ్మ…
చెక్కిట పచ్చిగోరు చెంప జవ్వాజి
మక్కువ దాని కంఠమాలతో
వెక్కసముగ దాని చిటికెన వ్రేలి యుంగరము
పెట్టికొన్న జూచి పొమ్మంటివే… ఓ యమ్మ… – సిద్ధేంద్రయోగి భామాకలాపము

కౌరవాన్వయజాతులై – గారవమునఁ
బెరిగినట్టి మీరొండొక – నరునిఁగొలిచి
మసలి వర్తిల్లి మానావ-మానములకు
నోర్చి యడఁకువతోడుత – నునికి యరిది – తిక్కన భారతము, విరాట పర్వము, 1.118

ధర్మదేవత నీదు స-త్కర్మమునకు
మెచ్చి యెంతయుఁ బ్రీతిమై – నిచ్చినట్టి
వరము గలుగంగ మనమేమి – వర్తనమున
నెచట నున్నను నొరులకు – నెఱుఁగ నగునె – తిక్కన భారతము, విరాట పర్వము, 1.61

సుమారు క్రీ.శ. 1160 ప్రాంతములో గుంటూరు జిల్లా నరసరావుపేట తాలుకా తిమ్మాపురములోని ఱాతి స్థంభముపైన శిలాశాసనములో చే-ప్రత్యయపు ఉపయోగమును క్రింది పద్యములో గమనించ వచ్చును. ఇందులో మఱొక విశేషము ఏమనగా, పద్యములోని మూడు ఋ-కారములు రి-కారములుగా చెక్కబడినవి. అనగా 12వ శతాబ్దములో కూడ ఋ-కారమును నేటి రు-కారములా కాక రి-కారములా ఉచ్చరించే వాళ్లు అని తెలుస్తుంది.

శ్రీవిలసద్విలాస జిత-జిష్ణునిచే నహిసీమ కృష్ణుచే
దేవసమానుచేత నర-దేవశిఖామణిచేత ధాన్యవా-
టీవరవృత్తిశాసనప-టీయశి నాఁటగి మేలు నాయక
శ్రీవిభుఁ డొప్పెఁ బోతయ వ-శీకృత సజ్జనలోకుఁడై భువిన్

చిరముగ దేవదేవునకు – శ్రీబలిదేవర దేవి శంఖు లా-
భరణము గీతవాద్యములు – బట్టున చీరలు ధూపఘంటయుం
దిరమగు ఘంట వర్యలము – దీపనికాయము ధేను సంఘము
న్నరుదుగ మన్మ మండఁడు వ్రి-యంబొనరన్ రచియించె భక్తితోన్ – క్రీ.శ. 1149 నాదెళ్ల గ్రామములోని మూలేశ్వరాలయము (తో ప్రత్యయము)

ఉదాహరణములలో తృతీయా విభక్తి
క్రింద తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల శ్రీ వేంకటేశ్వరోదాహరణమునుండి తృతీయా విభక్తి పద్యములు –

తీఱు నఘంబు లెల్ల నిలు – దీర్ఘము వచ్చినయంత సంపదల్
మీఱు సుఖంబు గూరు మతి – మిక్కుటమై శ్రుతివీథి దూఱు వే-
నూఱులు సెప్పనెల సుమ-నోవిభుచేఁ దిరువేంకటేశుచే
జూఱలుగా వరంబు లిలఁ – జొప్పడఁ గొందము రండు మానవుల్

కళిక- తురగవల్గన రగడ – త్రి/త్రి/త్రి/త్రి – త్రి/త్రి/త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

మఱియు వఱలు సుజనభజన – మానలేని వానిచేత
వెఱపు మఱపు లేక జోక – విడువ కడరు వానిచేత
శ్రుతుల గతుల నడువ నుడువ – జొక్కి చిక్కు వానిచేత
అతుల మతుల జెలగి మెలగి-నట్టి గుట్టు వానిచేత
సగము మొగము చాయ దాయఁ – జదియ నదుచు వానిచేత
బొగులు మగువ వలువ తొలువఁ – బ్రోచి కాచు వానిచేత
ఱాతి నాతి జేసి వాసి – ఱట్టు బెట్టు వానిచేత
వాతజాతు బనులఁ గొనుచు – వసుధ నెసగు వానిచేత

ఉత్కళిక- త్రి/త్రి/త్రి/త్రి

పురము లెఱియు శర మనంగ
బరగి దురము పురి కొనంగ
బగతులఁ గల మిగులగొట్టి
నగజమగడు పొగడునట్టి
గెలుపు నిలుపు తలపు లెంచి
బలము చలము కలిమి మించి
జనుల మనుపు ఘనునిచేత
వనజతనుజు జనకుచేత

చతుర్థీ విభక్తి
చతుర్థీ విభక్తి ప్రత్యయములు కొఱకు, కై , పొంటె, కోసము (ఉదా. సీతకొఱకు, రామునికై, క్షేమముపొంటె, నీకోసము). నన్నయ కాలములో పొంటె కూడ చతుర్థీవిభక్తి ప్రత్యయమే. ఆ కాలములో కొఱకు వాడుకలో లేదు. కై అనునది కయి అని కూడ వాడబడినది. అయి అనునది అగు యొక్క past participle. కయి, కు మఱియు అయి పదముల సంధి స్వరూపము. అనగా- కు + అయి = కయి. కయిని (కై) కునయి (కునై) అని కూడ కవులు వాడిరి. కు అనునది తఱువాతి కాలములో షష్ఠీ విభక్తి ప్రత్యయము. నన్నయకాలములో కు-ప్రత్యయము షష్ఠియా? పొంటెను కొఱకు అర్థములో నన్నయాదులు వాడిరి. పొంటె వాడుకను నన్నయ వ్రాసిన క్రింది పద్యములో గమనించవచ్చును.

ధరణి జరాచర భూత సంఘంబు – దమ విష వహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి ప-యోరుహగర్భుఁ
డురగ విషాపేత జీవ సంజీవ – నోపదేశంబుఁ
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిల లో-క హితంబు పొంటె – ఆంధ్రమహాభారతము, ఆదిపర్వము, 2.183

నన్నయ యొక్క కై ప్రత్యయపు వాడుక-

అనఘ మా మామ శకుని నా-కై కడంగి
జూద మాడెడి నీతోడఁ – గాదు నాక
యీత డొడ్డిన ధనరాసు – లెవ్వి యైనఁ
బోడిగా నీకు నీగల-వాడ నేను – ఆంధ్ర మహాభారతము, సభాపర్వము, 2.174

ఇందులో నన్నయ (మొదటి పాదములో) అనఘలోని అ-కారమునకు కైలోని ఐ-కారమునకు యతి చెల్లించెను. అనగా అతడు కై-ని కు+ఐ గా వాడెనన్న మాట. పోతన భాగవతములో మొదటి పద్యమును క్రింద చదువవచ్చును. ఇందులో కునై అనుదానిని కున్+ఐ అని అర్థము చేసికోవాలి.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై – చింతించెదన్ లోకర-
క్షైకారంభకు, భక్త పాలన కళా-సంరంభకున్, దానవో-
ద్రేక స్తంభకుఁ, గేళిలోల విలస-ద్దృగ్జాల సంభూత నా-
నా కంజాత భవాండ కుంభకు మహా-నందాంగ డింభకున్ – పోతన భాగవతము, 1.1

కొఱకు ప్రయోగమును అదే పోతన భాగవతములోని క్రింది పద్యములో కనవచ్చును –

దేవత లందఱు నన్నును
సేవింతురు రాజ్యమదము – జెందరు చెఱుపం-
గా వలదు మానభంగము
గావింపంగ వలయు శాంతి – గలిగెడు కొఱకై – భాగవతము, 10.910

తలచిన వన్నియుం – దన కొఱకే వెలిం
దెలియుట దనలోఁ – దెలియుట కొఱకే…
ఉదయ మందుట భయ – ముడుగుట కొఱకే
చదువుట మేలు వి-చారించుట కొఱకే
బ్రదుకుట పురుషార్థ – వరుం డౌట కొఱకే
యెదిరిం గనుట త-న్నెఱుంగుట కొఱకే…
తగులుట విడివడి – దలంచుట కొఱకే
నొగులుట కర్మ మ-నుభవించుట కొఱకే
చిగురౌట కొమ్మయి – చెలంగుట కొఱకే
బెగడుట దురితం – బెడబాయుట కొఱకే…
చ. ఈవలం జేరుట – ఆవలి కొఱకే
ఆవలి నుండుట – యీవలి కొఱకే
ఈవల నావల – నెనయం దిరుగు టెల్ల
శ్రీవేంకటేశ్వరుం – జేరుట కొఱకే… – అన్నమాచార్య కృతి.

కలి నరులకు మహిమలు దెలిపి యేమి
ఫలమన లేదా
అను. ఇలను వెలయు వర వృషభాదులు కటు-
కుల రుచి దెలియు చందము గాని

దారసుతులకై ధనములకి యూరు
పేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేసము గొనువారికి
తారకనామ శ్రీ త్యాగరాజార్చిత – త్యాగరాజ కృతి. (కై ప్రత్యయము)

రాజరాజనరేంద్రుని కోరుమిల్లి శాసనము చతుర్థీ విభక్తిలో ద్విరదగతిరగడలో (పం/పం – పం/పం) చెక్కబడినది. కాని ఇది సంస్కృతములో వ్రాయబడినది, తెలుగులో కాదు. కాని ఇందులో తెలుగులోవలె యతి (కొన్ని చోటులలో తప్పినా), ప్రాస, అంత్యప్రాస ఉన్నాయి. కాలము 11వ శతాబ్ది పూర్వార్ధము.

తస్మై సమస్త జన-తావిశేషగుణాయ
రై సుతర్పిత మహీ-దేవదేవగణాయ
విప్రాన్వయాబ్ధి శశి-భృత ప్రతిచ్ఛందాయ
విద్వజ్జనాధికృత-విశ్రుతానందాయ
జన్మప్రభృతిగీత-వేదాంత తత్త్వాయ
సన్మనోవసతి వా-స్తవ్యాత్మసత్త్వాయ
లంభీగురుత్వపరి-లాలితచరిత్రాయ
సుంభితమతుస్థగిత-జీవ భృగుపుత్రాయ
సిద్ధనిజనాథకృత-సేవితమనీషాయ
శుద్ధమతిదూషిత స-మస్తజనదోషాయ
సంతతారాధిత ని-జస్వామిపాదాయ
చింతిత మనస్థసుఖ-దాభూతపాదాయ
హోమధూమవినిర్గ-తామిత కలంకాయ
ధీమత్ప్రగీతరుచి-రస్వనామాంకాయ
సకలమునిగణ నుతా-పస్తంభసూత్రాయ
తత్రసంగీత భా-రద్వాజగోత్రాయ
సప్తతంతుకృతయూ-పస్తంభశోభాయ
సప్తాశ్వరూప సదృ-శాత్మతను లాభాయ
నిత్యజనతోచిత సు-సత్యగుణయుక్తాయ
సత్యభిలషిత కార్య – సంపత్తి సక్తాయ
పరమపురుషార్థ సం-పాదన పటిష్ఠాయ
పరమేశ్వరస్మరణ – పాలన వరిష్ఠాయ
సకలార్థశాస్త్ర పరి-నిష్ఠిత వినోదాయ
సుకుమార రాధిక స-రోజనిభపాదాయ – రాజరాజనరేంద్రుని కోరుమిల్లి శాసనము, క్రీ. శ. 1022

(ఇందులోని లాలిత పదము కన్నడములోని లలిత రగడ అని సూచించుటకా?)

ఉదాహరణములలో చతుర్థీ విభక్తి
చిత్రకవి పెద్దన హనుమోదాహరణమునందు గల చతుర్థీ విభక్తి పద్యములు-

చాటు మహా ప్రబంధముల – జాడలు లక్షణవేత్త లౌననన్
సూటిగ విన్న వీనులకు – సొంపుగ నే నిటు కావ్యముల్
నాటక ముఖ్య కావ్యము లొ-నర్చినయట్టి మనీషికై మహీ-
జాట కులాబ్జ భాస్కరుని- కై హనుమత్ప్రభుకై యొనర్చెదన్

కళిక- హరిణగతిరగడ- చ/చ/చ/చ – చ/చ/చ/చ (ప్రాస, అంత్యప్రాస)

మఱియును బంగరు జందెము ముంజి క-మండలు దండము గల పుణ్యునకై
మెఱయగ సుగ్రీవాంగదు లౌనన – మెలఁగెడు కపిలోకవరేణ్యునకై
తొలివేలుపు దపసిని నొక పిడికిట – దునియగఁ బొడిచిన బలు మల్లునకై
వెలసిన పెను రాకాసి మెకమ్ముల – వేటాడెడు భీకర భిల్లునకై
రహిగల సద్గుణ మహిమను బొలుపగు – రామాయణ హారోజ్జ్వల మణికై
మహిదుహితృ మనోవల్లభ దాస స-మంచిత ధీవర కైరవ ఘృణికై
బళిరా యన బలుఱాయి కరంగగఁ – బాడిన గాన కళాలోలునకై
సలలిత సుకృత ఫలంబున కేసరి – సతి గాంచిన ముద్దుల బాలునకై

ఉత్కళిక- చ/చ/చ/చ

వేసర కిర్వది చేతుల నల కై-
లాసము నెత్తిన బలు దొరపురి కై-
పనిలసఖుం డాహుతిగా గొని కై-
కొనగా జేసి ప్రతాప మహా కై-
రవ రిపు నెసగించుచు మాయా కై-
తవ బలులగు దనుజుల మతయుత కై-
టభ విభులను దునిమిన శూరునకై
శుభముల నతులకు నిడు ధీరునకై

విభక్త్యాభాసము : ఉదాహరణకావ్యములలో గల నియమములలో నొకటి- చతుర్థీ విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము ఉండాలి. ఆభాసము అనగా ఒకటి మఱొకటిగా కనబడుట. ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో విభక్తి ప్రత్యయము ఉండరాదు. చివరి రెండు పాదములలో మాత్రమే ఉండాలి. కాని చతుర్థీ ఉత్కళికలో మొదటి ఆఱు పాదాంతములలో విభక్తి ప్రత్యయమైన కై ఉండునట్లు తోచాలి, ధ్వనించాలి. కాని అర్థము మాత్రము కై వలె నుండరాదు. పాదము చివర నున్న కై తదుపరి పాదములోని మొదటి అక్షరములతో ఒక క్రొత్త పదముగా నుండవలయును. ఇదే ఈ గారడిలోని ప్రధానాంశము. ప్రథమోదాహరణమును రచించిన పాల్కుఱికి సోమనాథుడుగాని, లాక్షణికుడు అప్పకవి గాని విభక్త్యాభాసమును పాటించలేదు. గడచిన శతాబ్దములో ఇట్టి కావ్యములను వ్రాసిన ఆధునిక కవులు కూడ విభక్త్యాభాసమును పాటించలేదు. తిప్పన త్రిపురాంతకోదాహరణములోని చతుర్థి విభక్తి ఉత్కళిక. ఇదియే బహుశా మొట్టమొదటి విభక్త్యాభాసము కాబోలు.

కడు దీనతతో ముది తాపసికై-
వడి నింటికి జని వెడ కప్పెర గై-
కొని యాలుమగల పెను రచ్చలకై
చనుదెండని నిక్కము సేయుటకై
వెను ద్రిప్పిన గుండము లోపల గై-
కొని చను యెప్పటి రూపము గై-
కొని గుండయ మెచ్చిన వేల్పునకై
వినత పితామహ ఫణితల్పునకై

ఇందులో మొదటి, రెండవ, ఐదవ, ఆఱవ పాదములలో చతుర్థీ విభక్త్యాభాసము గలదు. మిగిలిన పాదములలో కై నిజముగా విభక్తి ప్రత్యయము. కాని పైన ఉదాహరించిన పెద్దన హనుమోదాహరణములోని ఉత్కళికలో మొదటి ఆఱు పాదాంతములలో కై అను అక్షరము తఱువాతి పాదములో గల అక్షరములతో చేరి పదములుగా మారును. కైలాసము, కైపు, కైకొన, కైరవ, కైతవ, కైటభ అను పదములన్నియు కైతో ప్రారంభమగును. ఏడవ, ఎనిమిదవ పాదములలోని కై అక్షరము నిజమైన విభక్తి ప్రత్యయము.

సంస్కృతములో చతుర్థీ విభక్తి
చాల మంది గుడికి వెళ్ళి దేవుని గాని, దేవిని గాని అష్టోత్తరశతనామములతో నర్చిస్తారు. ఈ 108 పేరులు అనుష్టుప్పు ఛందపు శ్లోకములలో ఉంటుంది. కాని చదివేటప్పుడు విడివిడిగా ఒక్కొక్క పేరును చెప్పి పూలతోడనో, పసుపు కుంకుమలతోడనో లేక అక్షతలతోడనో దేవుని పాదములను పూజిస్తాము. శ్రీ కృష్ణుని అర్చించవలెనన్న క్రింది శ్లోకములను పఠిస్తారు:

శ్రీ కృష్ణః కమలనాభో
వాసుదేవః సనాతనః
వసుదేవాత్మజో పుణ్యః
లీలామానుషావిగ్రహా
……
ఇలా చాల శ్లోకములు ఉన్నాయి. దీనిని ఇలా చెప్పుట పరిపాటి-

శ్రీ కృష్ణాయ నమః – శ్రీ కృష్ణునికై(కి) నమస్కారము
కమలనాభాయ నమః – కమలనాభునికై(కి) నమస్కారము
వాసుదేవాయ నమః – వాసుదేవునికై(కి) నమస్కారము
సనాతనాయ నమః – సనాతననునికై(కి) నమస్కారము
వసుదేవాత్మజాయ నమః – వసుదేవాత్మజునికై(కి) నమస్కారము
పుణ్యాయ నమః – పుణ్యునికై(కి) నమస్కారము
లీలామానుషవిగ్రహాయ నమః – లీలామానుషవిగ్రహునికై(కి) నమస్కారము

ఇవన్నియు చతుర్థీవిభక్తి యుక్తములు. అదియును కాక చతుర్థికి, షష్ఠికి వ్యత్యాసము లేదు. ఆంగ్లములో ఇది dative case. అందుకే పురాతన కవులు కైని కు-, ఐ-, గా విడదీసినారు. కావున సంస్కృతములో ఆయ అనునది సామాన్యముగ చతుర్థీ విభక్తిని తెలుపును.

పాల్కుఱికి సోమనాథుడు తెలుగులో మాత్రమే మొదటి ఉదాహరణ కావ్యమును వ్రాయలేదు. అతడు సంస్కృతములో కూడ మొదటి ఉదాహరణ కావ్యమును రచించెను. తిరుమలాచార్యుడు వ్రాసిన చిక్కదేవరాయోదాహరణమునుండి చతుర్థీ విభక్తి పద్యములను ఇచ్చట ఇస్తాను. వృత్తము సంపూర్ణముగా లిఖితమవ లేదు గావున కళికోత్కళికలను మాత్రము ఇస్తున్నాను-

కళికా- తురగవల్గన రగడ- త్రి/త్రి/త్రి/త్రి – త్రి/త్రి/త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

అపిచ నూత్న రత్న ఖచిత – హర్మ్య రచిత తోషణాయ
విపులతర సమస్త దాన – విహిత విబుధ పోషణాయ
భూమిపాల మౌళిమణి వి-భూషితాంఘ్రి సాయకాయ
సామభేద దండనీతి – సాధితారి నాయకాయ
కులధరాధరాభిరామ – కుంజరేంద్ర జాలకాయ
విలసితాననాబ్జ భృంగ – విభ్రమప్రదాయకాయ
పర్వచంద్ర చంద్రికా వి-భాసి కీర్తి మండనాయ
సర్వదేవతా వితాన – సన్నుతారి ఖండనాయ

ఉత్కళికా- త్రి/త్రి/త్రి/త్రి

సమర సమయ విహిత మాయ
విమత కుమత రాడపాయ
కరణ పటుతరోగ్ర సాయ
కరణ కరణ చణ దుపాయ
ఫలిత మహిత జయనికాయ
విలస దతి మనోజ్ఞ కాయ
కలిత వివిధ భూషణాయ
లలిత సరస భాషణాయ

ఇది సంస్కృతములో నున్నను, తెలుగులోవలె యతిప్రాసలు పాటించబడినవి. సంస్కృతములో ఇవి అనవసరము. కళిక తెలుగులో మఱియు వలె అపితో ప్రారంభమైనది. ఉత్కళికలో విభక్త్యాభాసము కూడ పాటించబడినది. మొదటి ఆఱు పాదములలో ఆయతో అంతమైన పదములు చతుర్థీ విభక్తితో అంతమైనవి కావు. అట్లు ధ్వనించును.

చతుర్థీ – షష్ఠీ విభక్తులు
కొఱకు కై చతుర్థ్యంతః – ఇది నన్నయభట్టు ఆంధ్రశబ్ద చింతామణిలో వ్రాసినాడు అని అంటారు. కాని తిక్కన సమకాలికుడైన, శిష్యుడైన కేతన ఆంధ్రభాషాభూషణములో [9] క్రింది పద్యమును పరిశీలిద్దామా?

కరి వచ్చెన్ గరినెక్కెను
గరిచేతం జచ్చెఁ గరికిఁ – గవణము వెట్టెన్
గరివలననుఁ గరికుంభము
కరియందు మదాంబుధార – కడు బెడఁగయ్యెన్ – కేతన ఆంధ్రభాషాభూషణము – 98

ఇందులో వరుసగా ఏడు విభక్తి ప్రత్యయములు ఉన్నాయి. ఇందులో కరికి అనే పదము కరిచేత మఱియు కరివలన మధ్య వస్తుంది. కాబట్టి కి-ప్రత్యయము చతుర్థీవిభక్తి ప్రత్యయము. అలాగైతే నన్నెచోడుని కుమారసంభవములో, కేతన దశకుమారచరితములో, తిక్కన విరాటపర్వములో మనకు కనిపించే షష్ఠ్యంతములు నిజముగా షష్ఠ్యంతములా లేక చతుర్థ్యంతములా? కేతన నన్నయ సూత్రాన్ని చదవలేదా? లేకపోతే ఆ సూత్రాన్ని నన్నయ రచించలేదా? అసలు ఆంధ్రశబ్దచింతామణిని నన్నయ వ్రాసినాడా?

తిక్కన భారతమును సుమారు క్రీ.శ. 1250 ప్రాంతములో వ్రాసినాడు అనుకొంటే, అతనికి తన శిష్యుని వ్యాకరణము పరిచితముగా నుండాలి. అంటే తిక్కన కేతనలు వ్రాసినవి చతుర్థ్యంతములే. ఇది సంస్కృత పద్ధతితో కూడ సరిపోతుంది (శ్రీ కృష్ణాయ నమః, కమలనాభాయ నమః,…). పాల్కుఱికి సోమనాథుని బసవోదాహరణము మొట్టమొదటి ఉదాహరణ కావ్యము. ఇందులో చతుర్థీవిభక్తికి కై-ప్రత్యయము వాడబడినది. సోమనాథుని కాలమును వెంకటరావు తన పుస్తకములో[1] క్రీ.శ. 1190-1260 అని పేర్కొన్నారు. కాని 1250 ప్రాంతము తిక్కన కాలానికి చెందినది, అప్పుడు చతుర్థీ విభక్తి కి-ప్రత్యయము, కై కాదు. గిడుగు సీతాపతి సోమనాథుని కాలమును 1291-1320 అని పేర్కొన్నారు[8]. ఈ కాలము తిక్కనకు 50 సంవత్సరాల పిదప. నా ఉద్దేశములో ఇదియే పాల్కుఱికి సోమనాథుని కాలము. ఈ 50 ఏండ్లలో కి-, కు-, ప్రత్యయములు షష్ఠిగా మారడము, కై-ప్రత్యయము చతుర్థిగా వాడడము అమలులోనికి వచ్చి ఉంటుంది. విన్నకోట పెద్దన వ్రాసిన కావ్యాలంకారచూడామణిలో[5] మొట్టమొదట కై-ప్రత్యయము (కొఱకు-ను విడిచి) వివరించబడినది. అంతే కాదు కు- మాత్రమే షష్ఠిగా పేర్కొనబడినది. ఆ పద్యములు –

పలుకులతుదఁ గై శబ్దం
బలపడ నిలిచినఁ జతుర్థి – యగు విశ్వమహీ-
లలనునకై యలఘునకై
చెలువారం గృతులు కవులు – చెప్పుదు రనఁగన్ – పెద్దన కావ్యాలంకారచూడామణి, 9.76

అమరి కు శబ్దము పాదాం-
తమునం దున్నేని షష్ఠి – తప్పదు విద్యా
సముదయము విశ్వవసుధా
రమణునకుం బొలుచు నిల ని-రంతరమునన్ – 9.78

తఱువాత అనంతుని ఛందోదర్పణములో[4] కొఱకు, కై లు చతుర్థిగా, కి, యొక్క, లో ప్రత్యయములు షష్ఠిగా పేర్కొనబడినవి-

… యీ
తనికొఱ కతనికై – యన చతుర్థి

వానియొక్క కులంబు – వానికిఁ బ్రియమది
జనులలో నితఁడు మే-లనఁగ షష్ఠి …, – అనంతుని ఛందోదర్పణము – 4.105

సోమనాథుడు చతుర్థీ విభక్తికి కునై (కున్+ఐ) ప్రత్యయమును వృత్తములో, కళికలో వాడినాడు, కాని ఉత్కళికలో కై ప్రత్యయమును వాడినాడు. అనగా చతుర్థిలో నన్నయలా కునై, తఱువాతి కాలములోవలె కై రెండింటిని ఉపయోగించినాడు, షష్ఠిలో కు మాత్రమే వాడినాడు. ఇంతకు ఈ dative case చతుర్థి, షష్ఠి రెండింటిలో ఎలా వచ్చిందో, ఇట్టి మార్పులకు కారణము ఏమో అనే విషయమును పరిశీలించాలి.

(ఇంకాఉంది)
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, ఈ మాట అంతర్జాల మాసచత్రిక
సౌజన్యంతో

No comments: