Monday, June 18, 2018

చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు


చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు





సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వము నందలి ప్రక్రియలలో ప్రహేళిక యనునదొకటి. ఇది తెలుగులో పొడుపుకథ వంటిది. ఇది రసపోషణసమర్థము గాకున్నను ఉక్తివైచిత్రితో వినోదమును కల్గించు నలంకారము. లాక్షణికు లిందులో పలురకములను గుర్తించినను, ప్రస్తుతవ్యాస పరిధిలో చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షరము లనెడు మూడురకములను గుఱించి తెలిసికొనిన చాలును. వీనికి నీక్రింద నిచ్చిన ఉదాహరణములన్నియు భోజసార్వభౌముని సరస్వతీకంఠాభరణమునుండి గ్రహింపబడినవి.

1. చ్యుతాక్షరప్రహేలిక:

చ్యుతాక్షరప్రహేలిక:ఉండవలసిన అక్షరమును వదలిపెట్టి చెప్పిన యెడల అది చ్యుతాక్షరప్రహేలిక యగును. దీనికి ఉదాహరణము:

పయోధరభరాక్రాంతా సంనమంతీ పదేపదే
పదమేకం న కా యాతి యది హారేణ వర్జితా.

పయోధరముల భారముచే నాక్రమింపబడినదియు, అడుగడుగునకు వంగుచున్నదియు నైన ఏది హారరహితమైనచో ఒక్క అడుగు కూడ కదలకుండును? – అని పై ప్రహేళిక కర్థము. ఈ శ్లోకములో విశేషణములు స్త్రీలింగములో నుండుట చేతను; పయోధర, హార, సంనమంతీ, అను శబ్దముల చేతను; స్తనములును, వానిపై నలంకృతమైన హారమును, పయోధరభారముచే వంగుచు నడుగిడుచున్న అంగనయు స్ఫురించుట సహజము. కాని అట్టి స్త్రీ హారవర్జితయైనచో ఒక్క అడుగును ముందుకు సాగకుండుట యేమి? ఇది అర్థవంతముగా లేదు. అందుచేత పయోధర శబ్దమునకు వేఱగు అర్థముండవలెను. దుగ్ధం క్షీరం పయ స్సమమ్ — అని అమరకోశము. అందుచేత పయస్సనగా పాలు, పయోధరము లనగా పాలను ధరించినవి – పాలకుండలు. ఈ పాలకుండలచే నాక్రాంతమైన వస్తువేదో అడుగడుగునకు వంగుచున్నది. అట్టి వస్తువు కావడి యగుట సహజము. కాని కావడి హారము లేక ఒక్క అడుగైనను ముందుకు సాగకుండుట యేమి? కావడికి, హారమునకు గల సంబంధ మేమి? అని యోచించినచో కావడి మోపరి లేకున్నచో కావడి ఒక్క అడుగైనను ముందునకు సాగదనుట స్పష్టము. సంస్కృతములో కాహారః అను పదమునకు కావడిమోపరి యని అర్థము. అందుచేత కాహార అను పదములో చ్యుతమైన (తొలగింపబడిన) కా-అక్షరమును హార-కు చేర్చుకొని, ఈ ప్రహేళికలో సూచితమైన వస్తువు ‘కావడి’ యని గుర్తింపవలెను.

2. దత్తాక్షరప్రహేలిక:

దత్తాక్షరప్రహేలిక: అవసరము లేనిచోట అదనపుటక్షరమును చేర్చినయెడల అది దత్తాక్షరప్రహేలిక యగును. దీని కుదాహరణము:

కాంతాయానుగతః కోఽయం పీనస్కంధో మదోద్ధతః
మృగాణాం పృష్ఠతో యాతి – శంబరో రూఢయౌవనః

బలసిన మూపులు గలవాడును, మదగర్వితుడును, స్త్రీచే అనుగమింపబడినవాడును, మృగములవెంట (అడవి జంతువుల వెంట) జనుచున్నాడు. అతడెవ్వడు? యౌవనవంతుడగు శంబరుడు. – అని పై శ్లోకమున కర్థము. ఈవర్ణనను జూడ నది వేటకాని వర్ణనవలె నున్నది. శ్లోకములో నతడు ‘శంబరు’ డని పేర్కొనబడినాడు. శంబరు డనగా వేటకాడా? మృగ దానవ బౌద్ధేషు శంబరః –- అని నానార్థరత్నమాల. అనగా శంబరశబ్దమునకు ఒకజాతిలేడి, శంబరుడను రాక్షసుడు, బౌద్ధుడు అను అర్థము లున్నవి. వేటకాడను అర్థము లేదు. కాని, కిరాత శంభూ శబరౌ అని శబరశబ్దమునకు కిరాతుడు (వేటకాడు) అనియు శివుడనియు అర్థము లున్నవి. ఇట్లు పరిశీలింపగా వినోదార్థము శ- తర్వాత అనవసరమైన అనుస్వారమును చేర్చి పై ప్రహేళికను నిర్మించినట్లు తేటపడుచున్నది. అందుచే, పై ప్రహేళకలోని శంబర-ను శబర-గా మార్చి అర్థవంతముగా పరిష్కరింపవలెను.

3.చ్యుతదత్తాక్షర ప్రహేళిక:-

చ్యుతదత్తాక్షర ప్రహేళిక: ఉండవలసిన అక్షరమును తొలగించి, దాని స్థానములో వేఱొక అక్షరమును వేసినయెడల నది చ్యుతదత్తాక్షర ప్రహేళిక యగును. దీని కుదాహరణము:

విదగ్ధః సరసో రాగీ నితంబోపరి సంస్థితః
తన్వంగ్యాలింగితః కంఠే కలం కూజతి – కో విటః

పండితుడును, సరసుడును, అనురాగవంతుడును, నితంబ మాధారముగా నిల్చినవాడును, స్త్రీచే కౌగిలింపబడిన కంఠము గలవాడును, మధురముగా కూయుచున్నవాడును ఎవడు? విటుడా? – అని పై శ్లోకమున కర్థము. ఇందులో – విదగ్ధః, సరసః, రాగీ, ఇత్యాదివిశేషణము లన్నియు పుంలింగములో నున్నవి. అందుచే వీనిచేత బోధింపబడు వ్యక్తి విటుడా యని ప్రశ్నించుట కవకాశము కల్గినది. కాని పైవిశేషణము లన్నియు నీటికుండకును సరిపోవుటచే, అట్టి నీటికుండనే సూచించుట ఈ ప్రహేళికా లక్ష్యము. ఘటః అను పదములోని ఘ-కు బదులు వి- అను అక్షరము వేయబడినదని గుర్తించినచో ఈ ప్రహేళికకు పరిష్కార మగును. విదగ్ధః అనగా, పండితుడనియు, బాగుగా కాల్చినదనియు, రాగి యనగా అనురాగవంతుడనియు, ఎఱ్ఱగానున్న దనియు; సరసః అనగా సరసుడనియు, నీటితో కూడినదనియు అర్థములు. నీటికుండను నితంబముపై నానించుకొని, దాని మెడచుట్టును చేతిని జేర్చి స్త్రీలు గొనిపోవుచుండ నందులో నీరు శబ్దించుచుండుట సహజము. ఇట్లు, ఘటః అను పదములోని ఘ-ను చ్యుతము చేసి (తొలగించి), దాని స్థానములో వి-ని దత్తము చేయుట (కూర్చుట)వల్ల ఈ ప్రహేళిక చ్యుతదత్తాక్షరప్రహేళిక యైనది.
----------------------------------------------------------
రచన - తిరుమల కృష్ణదేశికాచార్యులు, 
చిత్రకవిత్వరీతులు అనే వ్యాసం నుండి
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

No comments: